విక్రమ్ బేతాళ్!

309064_10150308481728559_717348232_n

painting: Rafi Haq

 

మనకేం హక్కుంటుంది, ఒకరి మీద ఫిర్యాదు చేయడానికి?

సమాధానం కాలేనివారికి ప్రశ్నగా మారే సందర్భమెలా

చిక్కుతుంది?

 

అడుగులన్నీ జాడల్ని మిగిల్చేవి కావు. ప్రయాణాలన్నీ

జ్ఞాపకాల్ని రాల్చేవి అయ్యుండాల్సిన అవసరం లేదు. తీవ్రమైన

కొన్నిక్షణాల్లో తీరినదాహానికే జీవితం దాసోహం అనదు.

 

మలుపు తిరగనిది దారే కాదు. మరపుకు రానిది

మాటే అవదు. క్షణక్షణానికీ రంగులు మారే కాలలోకంలో

అమాయకత్వానికి తావు లేదు.

 

సిద్ధమైన రంగం మీద స్థిరబిందువుగా వుండడం

అనౌచిత్యం. రంగరించుకున్న అనుభవాల్లోంచి కొత్తగా

ఎగరేసుకోవాల్సిన అనివార్యతలకు మనమెవ్వరం

అతీతులం కాము.

 

మనం కప్పుకున్న దుప్పటినే తెల్లారేవరకూ అధీనంలో

వుంచుకోలేనివాళ్ళం. మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కిందని

ఆకాశాన్నెలా నిందించగలం?!

                                                                                        -మోహన్ రుషి

Mohan Rushi

మీ మాటలు

 1. Vilasagaram Ravinder says:

  మనం కప్పుకున్న దుప్పటినే తెల్లారేవరకూ అధీనంలో

  వుంచుకోలేనివాళ్ళం. మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కిందని

  ఆకాశాన్నెలా నిందించగలం?!

  కవిత బాగుంది

 2. తీవ్రమైన

  కొన్నిక్షణాల్లో తీరినదాహానికే జీవితం దాసోహం అనదు.

మీ మాటలు

*