తెలంగాణలో ఇప్పుడు మౌనం కాదు, నిర్మాణాత్మక విమర్శ అవసరం!

10433633_689328201180016_1300384855878113980_n

(ఈ 23 న తెలంగాణా ఎన్నారై అసోసియేషన్ తొలిసారిగా ఇస్తున్న తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన అవార్డుల సందర్భంగా)

గత  అరవై యేండ్లకు పైగా తెలంగాణ ప్రజల తండ్లాట తీరిపొయ్యి,  పోరాటం  సఫలమై,  కన్న కలలు  సాకారమై  ప్రత్యేక రాష్ట్రం యేర్పడ్డది. ఆంధ్ర వలస పాలకుల పాలన నుండి విముక్తి కలిగింది. పరాయి పాలన ను తరిమికొట్టిన తెలంగాణ ప్రజలు,  రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ రాజకీయ పార్టీని యెన్నికల్లో గెలిపించిండ్రు. అధికారం కట్టబెట్టిండ్రు. ఉద్యమానికీ, రాజకీయ పార్టీ కి నాయకత్వం వహించిన వారే యిప్పుడు తెలంగాణ ప్రభుతానికీ నాయకత్వం వహిస్తున్నరు. ఇది తెలంగాణ చరిత్రలో మొత్తంగా భారతదేశ చరిత్రలో అపురూపమైన సన్నివేశం.

ఉద్యమంలో ప్రదాన భాగస్వామ్యం వహించినందుకూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతా, ఆకాంక్ష వెనుకనున్న ఆరాటమూ పోరాటంగా మునుముందుకు రావడానికి కీలక పాత్ర వహించినందుకూ రాష్ట్ర యేర్పాటు తర్వాత  ప్రభుత్వ పగ్గాలు చేపట్ట్డడం వల్ల,  సహజంగానే నాయకత్యం పైన ప్రజలకు ఆశలూ చాల ఎక్కువగా ఉంటాయి. అట్లే తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాలా ప్రజానీకం పట్లా నాయకత్వానికి బాధ్యతా కూడా చాలా  యెక్కువగానే ఉంటుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ సమాజం లోని అన్ని  వర్గాల, సబ్బండ వర్ణాల ప్రజలు క్రియాశీలకంగా పాల్గొని తమవైన అనేకానేక నిర్దిష్ట  ఆశలనూ ఆకాంక్షలనూ యెజెండా మీదికి తెచ్చారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక అవన్నీ నెరవేరుతాయనీ, నెరవేరాలనీ ఆశించారు, కోరుకున్నారు. విభిన్న సమూహాలకు చెందిన ప్రజలు,  తమ తమ ఉమ్మడి సామాజిక కోర్కెలను, తరతరాలుగా అణచివేతకు గురైన  తమ అస్తిత్వ ప్రయోజనాలనూ  రంగం మీదికి తీసుకొచ్చి,  ప్రత్యేక రాష్ట్రం యేర్పాటైతే అవన్నీ సాధ్యమౌతాయని బలంగా నమ్మారు. తెలంగాణ లో బలంగా ఉన్న సామాజిక ఉద్యమాల నేపథ్యం లో ముందుకొచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అటువంటి నమ్మకాలకు ఆలంబన నిచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసం మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల అనేకానేక సమస్యల పరిష్కారం కోసం సాగిన విస్తృత ఉద్యమమైంది. అయితే ఉద్యమం సాగుతున్న క్రమంలో యెక్కడా నాయకత్వం ఉద్యమ పరిధుల్నీ , పరిమితుల్నీ స్పష్టం చేయడం జరుగలేదు, అది అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు కూడా!

యిప్పుడు రాష్ట్రం సాకారమయ్యాక ఒక విచిత్రమైన వాతావరణం నెలకొని ఉన్నది. ప్రజలు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం తన పద్దతి లో తాను పరిపాలన కొనసాగిస్తున్నది.  ప్రభుత్వ నాయకత్వం , తెలంగాణ ప్రజా సమస్యల పట్ల తనదైన దృక్పథంతో పని చేస్తూ, తాను సరైనవనుకున్న నిర్ణయాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నది. రాష్ట్రం యేర్పడి ఆరు నెలలే ఐంది కాబట్టి, ప్రభుత్వానికి దొరికింది ఆరు నెలలే కాబట్టి,  అప్పుడే అది విఫలమైందా సఫలమైందా అని తీర్పు చెప్పడం సరైంది కాదు. చేసిన ప్రకటనలూ, అమలు చేస్తున్న కార్యక్రమాలనూ  బట్టి ప్రభుత్వం పనితీరుని బేరీజు వేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ పనితీరు పట్ల అభిప్రాయాలూ, వైఖరీ, విమర్శా యెట్లా ఉండాలి అనే అంశాల మీద భిన్న ధోరణులు మనకు కనబడుతూ ఉన్నాయి.

తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. తెలంగాణ ప్రజలు అత్యంత సమరశీలులూ, ఆలోచనల్లో అత్యంత పరిణతి చెందినవాళ్ళూ అనడం లో యెంత మాత్రమూ సందేహం లేదు. అందుకే  ప్రత్యేక రాష్ట్రం  యేర్పడగానే మనం యేమి జరుగుతుందని ఊహించవచ్చో,  యేమి ఆశించవచ్చో , తెలంగాణ ప్రబుత్వం యేమి చేయగలుగుతుందో, యేమి చేయలేదో, యేవి  దాని పరిధి కి లోపల  ఉన్నాయో యేవి బయట ఉన్నాయో, ప్రభుత్వ పరిమితులేమిటో అనే విషయాలపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతునాయి. ఈ అభిప్రాయాలు సమాజం లోని భిన్న దృక్పథాల ప్రజానీకం నుండి వెలువడుతున్నయి కాబట్టి సహజంగానే వాటి మధ్య అనేక వైరుధ్యాలు ఉంటాయి.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ పార్టీ తో నున్న వారు రాష్ట్ర యేర్పాటు తర్వాత సహజంగానే ప్రభుత్వం తో, ప్రభుత్వం  నడిపే పార్టీ తో ప్రదాన స్రవంతి రాజకీయాలతో యేకీభవి స్తూ, ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి  తమకు సరైందని తోచిన పద్దతుల్లో తోడ్పడుతున్నారు. ఈ క్రమంలో అవినీతీ, స్వలాభాపేక్ష తదితర అంశాలని కొంచెం సేపు పక్కకు పెడితే,  వీరికి ప్రభుత్వం పట్లా , ప్రభుత్వ కార్యక్రమాల పట్లా పద్దతుల పట్లా విమర్శనాత్మక దృక్పథం సహజంగానే ఉండదు. ప్రభుత్వం , ప్రభుత్వాన్ని నడిపిస్తున్న  నాయకత్వమూ, పార్టీ అంతా సవ్యంగానే చేస్తుందని, అందులో  విమర్శించడానికేమీ లేదనీ , విమర్శిస్తే మనం చేజేతులా మనం  నిర్మిస్తున్న భవంతిని మనమే కూలగొట్టుకున్న వాళ్లమౌతామని బలంగా నమ్ముతారు. తెలంగాణ వాదమే ఊపిరిగా ఉన్న రాజకీయ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా యేదీ చేయదనీ,   దాన్ని విమర్శించడం అంటే తెలంగాణ వాదాన్ని విమర్శించడమే అని గట్టిగా వాదిస్తారు.

‘అయితే మీరు మా వైపు లేదా తెలంగాణ వ్యతిరేకుల వైపు’ అని నిర్దంద్వంగా వర్గీకరిస్తారు.  మరో పక్క, తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు,  ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కావచ్చు లేదా మరేదైనా ప్రదాన స్రవంతి రాజకీయ అభిప్రాయాలను సమర్థించే వారైనా కావచ్చు – అదే పనిగా ప్రభుత్వం మీదా, నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ మీదా దుమ్మెత్తి పోస్తుంటారు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ, నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ , అమలు చేయాలను కున్న ప్రతి పథకాన్నీ భూతద్దం లో చూపి  , పూర్తిగా నిరాకరిస్తూ  తీవ్రంగా విమర్శిస్తారు. విమర్శలో యేమాత్రం నిర్మాణాత్మకత ఉండదు. తెలంగాణ సమాజం తాత్కాలిక లేదా దీర్ఘకాలిక లక్ష్యాలకు గానీ ఉపయోగపడేది ఈషణ్మాత్రమైనా ఉండదు. యిటువంటి విమర్శ వినాశాత్మక విమర్శ. అది కేవలం తమ స్వప్రయోజనాలనాశించి, అవి యెట్లయినా సరే నిలుపుకోవాలనే పట్టుదలతో, హ్రస్వదృష్టి తో  చేసే  స్వార్థ పూరిత విమర్శ. యిటువంటి విమర్శ తెలంగాణ సమాజానికి చేటు  కలిగిస్తుంది.

అయితే, ప్రదాన స్రవంతి రాజకీయాలకు, అధికార రాజకీయాలకు వెలుపల వాటికి భిన్నమైన అభిప్రాయాలు కలిగి, ప్రగతిశీల ఆలోచనా విధానం కలిగి ఉన్న ప్రజా సమూహాలు తెలంగాణ లో యెన్నో ఉన్నాయి. వీరంతా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యెంతో ఉద్యమ స్ఫూర్తితో అత్యంత క్రియా శీలకంగా పాల్గొన్నారు. ప్రాణాలకు లెక్క చెయ్యకుండా ఉద్యమాల్లో దూకి లెక్క లేనన్ని పోలీసు కేసులు, నిర్బంధాలనూ తట్టుకున్నారు. తమదైన ఆశలతో, ఆకాంక్షలతో నిర్దిష్ట వ్యూహంతో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర యేర్పాటు లో వీరి కృషి సామాన్యమైనది కాదు.

telanga

అయితే ఆశ్చర్యంగా,  రాష్ట్రం యేర్పడ్దాక వీళ్లలో చాలా మంది ఒక రకమైన వింత మౌనాన్ని పాటిస్తున్నారు.  నిర్లిప్తతను ప్రకటిస్తున్నారు. వీళ్లలో చాలా మందికి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాలా వద్దా,  విమర్శిస్తే తమని తెలంగాణ వ్యతిరేకులంటారా అనే సందేహాలు బలంగా ఉన్నాయి. కొంతమందికైతే, ‘ ప్రత్యేక రాష్ట్రమొస్తే యేదో జరుగుతుందని తాము కేవలం  భ్రమ పడ్డామా ?   యిప్పుడీ ప్రభుత్వ పని తీరు చూస్తుంటే ఆ భ్రమలన్నీ పటాపంచలయ్యాయా? ’  అనే అభిప్రాయాలు కూడా బలంగానే కలుగుతున్నాయి. అయితే దీనికి కారణం ప్రత్యేక రాష్ట్ర యేర్పాటు వల్ల తెలంగాణ లో సాధ్యమయ్యే వాటి కున్న పరిధులూ పరిమితుల పట్ల సంపూర్ణ అవగాహన లేకపోవడమన్నా కావాలి, లేదా తాము కలగన్నట్టు, తాము అనుకున్నట్టు, ఆశించినట్టు ప్రభుత్వమూ , నాయకత్వమూ ప్రవర్తించాలి అన్న అత్యాశా ఐనా కావాలి.

ముందుగా కొన్ని విషయాలని స్పష్టం చేసుకోవాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర యేర్పాటు కొన్ని పరిధుల్లో పరిమితుల్లో  జరిగింది అని మర్చి పోరాదు. భారత దేశ పార్లమెంటరీ విధానం లో భాగంగా  రాజకీయర్థిక  వ్యవస్థలో భాగంగా, భారత రాజ్యాంగానికి  అనుగుణంగా, భారత చట్ట, న్యాయ వ్యవస్థలకనుగుణంగా మిగతా అన్ని రాష్ట్రాల లాగానే ఆ పరిధి లోనే ఆ పరిమితుల్లోనే జరిగింది. దీనికి భిన్నంగా ఇక్కడేదో భిన్నమైన వ్యవస్థ ఉందనీ, భిన్నమైన చట్టం , న్యాయం , రాజకీయార్థిక వ్యవస్థ అమలు చేయవచ్చనీ అనుకోవడం సరైంది కాదు. అమాయకత్వమౌతుంది. తెలంగాణ ను విముక్తి చేసి   సమసమాజాన్ని యేర్పాటు చేయవచ్చని అనుకోవడం సరైంది కాదు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో పీడిత ప్రజలు రాజ్యంస్థాపించుకోగలరు అని ఆశ పడడమూ సరైంది  కాదు. భారత రాజ్యాంగం పరిధిలో యేది సాధ్యమౌతుందో అది మాత్రమే తెలంగాణలో వీలౌతుంది. నిజానికి అత్యంత ప్రగతి శీలమైన భారత రాజ్యాంగంలో ప్రజలకు మేలు చేసే వాటన్నిటినీ అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తేవచ్చు.

ఆ దిశగా సరికొత్త పునర్నిర్మాణ ఉద్యమం నిర్మించవచ్చు. అందుకు భిన్నంగా వ్యవహరించి ప్రజలని అణచి వేసే వైఖరికి పాల్పడితే ప్రభుత్వం విధానాలను విమర్శించవచ్చు  – ఉద్యమించవచ్చు. అట్లా భారత రాజ్యాంగానికనుగుణంగా, రాజ్యాంగ పరిధిలో  తెలంగాణ లో ప్రజల విముక్తి, అభివృద్ధి, వికాసం కోసం తెలంగాణ ప్రభుత్వం (యే యితర రాష్ట్రాల ప్రభుత్వాలు యిప్పటిదాకా చేయక పోయినా, చేయ నిరాకరించినా ) సృజనాత్మకంగా యేమి చేయవచ్చో  యెజెండా మీదికి తీసుకురావాల్సిన అవసరమూ బాధ్యతా మనందరి పైనా ఉన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రస్తుత పథకాలనూ , కార్యక్రమాలనూ నిర్ణయాలనూ , పనితీరునూ , ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యెజెండా మీదికి తెచ్చిన  నినాదాలకు  (“ మన నీళ్ళూ, మన నిధులూ, మన నియామకాలూ మన కోసమే , పరాయి వలస పాలన నుండి విముక్తి, ఆత్మగౌరవ పాలనా లక్ష్యం” )  అనుగుణంగా ఉన్నయా లేదా అనే గీటు రాయి మీద పరీక్షించాల్సి ఉంటుంది. యెక్కడైనా ప్రభుత్వం దాన్ని నడిపిస్తున్న నాయకత్వమూ దీనికి భిన్నంగా ఉందనిపించినా,  మళ్ళీ ఆంధ్రా వలస పాలకులకు, దోపిడీ పెత్తందార్ల కు  అడుగులకు మడుగులొత్తినట్టనిపించినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆశలకు నష్టం కలిగించేలా వ్యతిరేకంగా ఉందనిపించినా విమర్శించాల్సిన బాధ్యత  మనపైనున్నది.

అట్లే కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు మాత్రమే కాకుండా ప్రజా బాహుళ్య  సంక్షేమం, అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి , విముక్తి, వారి కనీస జీవిత అవసరాలని తీర్చడం, అందరికీ విద్య ఆరోగ్యం, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పనా , సామాజికాభివృద్ధీ, కనీస ప్రజా స్వామిక హక్కులు  లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని తన కనీస బాధ్యతలని గుర్తుచేస్తూ నిర్మాణాత్మక విమర్శ చేయడం ఇప్పటి పరిస్థితుల్లో మనందరి బాధ్యత! ముఖ్యంగా ప్రధాన స్రవంతి రాజకీయాలకు బయట ఉండి, యెటువంటి స్వలాభాపేక్షా, స్వార్థ ప్రయోజనాలూ లేకుండా కేవలం సమాజం మేలు కాంక్షిస్తూ ఉద్యమ స్ఫూర్తి గల  వారి పై ఈ బాధ్య త మరింత యెక్కువగా ఉన్నది. అట్లే మొత్తం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఖండాంతరాలలో ఉన్నా , తమ హృదయాలను తెలంగాణ లోనే పదిలంగా ఉంచి  ఉద్యమానికీ , రాష్ట్ర యేర్పాటు తర్వాత పునర్నిర్మాణానికీ యెంతో తోడ్పడు తున్న ఎన్ ఆర్ ఐ ల పైనా ఈ బాధ్యత యెంతో ఉన్నది.

అట్లా కాకుండా మౌనాన్నీ నిర్లిప్తతనూ పాటిస్తే తీవ్రమైన నష్టాలనెదుర్కోవాల్సి వస్తుంది. మాట్లాడాల్సిన వాళ్ళు, నిర్మాణాత్మక విమర్శ చేయా ల్సిన వాళ్ళూ తమకెందుకులే అనే నిర్లిప్తత ను పాటించినా , విమర్శిస్తే యేమౌతుందో అనే సందిగ్ధం లో పడి పోయినా,  ‘యింక అంతా యింతేలే ‘ అనే నైరాశ్యంలో పడిపోయినా తెలంగాణ సమాజం చాలా కోల్పోతుంది. అప్పుడు కేవలం ప్రభుత అనుకూల వ్యతిరేక అనే స్వలాభాపేక్షకలిగిన స్వార్థ పూరిత విమర్శలే తప్ప నిజాయితీ తో కూడిన నిర్మాణాత్మక విమర్శ ఉండదు. అందువల్ల  తాను తెలంగాణ సమాజావసరాలను తీర్చడంలో యెక్కడ నిర్ధిష్టంగా విఫలమైందో , యెందుకు విఫలమైందో తెలుసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికుండదు. అటువంటి పరిస్థితుల్లో పాలకులు  తాము చేసేదే యెల్లప్పుడూ సరైంది,  విమర్శించే వారంతా తెలంగాణ ద్రోహులు అనే ద్వంద్వాత్మక వర్గీకరణ (binary categorization) చేసి నియంతృత్వ పోకడలకు పోయే ప్రమాదమున్నది.

భిన్న అభిప్రాయాలకు, వాటి ఘర్షణలకు తావు లేని సమాజం ప్రగతి దిశగా  ముందుకు నడవడం అసాధ్యం. అట్లాంటి పరిస్థితి తెలంగాణా సమాజానికి రాకుండా ఉండాలంటే ఆలోచనా పరులు, బుద్ధి జీవులూ, ఉద్యమ శక్తులూ స్వార్థ ప్రయోజనాలకతీతంగా తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై నిర్మాణాత్మక విమర్శ చేయాల్సి ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను,  అవి సరిగా లేవనుకున్నప్పుడు,  విమర్శిస్తూ , సమస్యల కు నిర్దిష్టమైన ప్రత్యామ్నాయాలను సూచించాల్సి ఉన్నది.  భిన్న అభిప్రాయాలకు చోటునిస్తూ ప్రజాస్వామికంగా చర్చ చేయాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సమాజం పునర్నిర్మాణం జరిగి సర్వతోముఖా భివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది.

-నారాయణస్వామి వెంకటయోగి

swamy1

మీ మాటలు

 1. kurmanath says:

  ఖుల్లం ఖుల్లం మాట్లాడాల్సిందే.
  తప్పు తప్పు చేసినపుడు, ప్రజావ్యతిరేక విధానాలు తీసుకున్నపుడు తప్పనిసరిగా మాట్లాడిల్సిందే.
  బాగుంది, స్వామీ.

 2. P.Jayaprakasa Raju. says:

  “ దీనికి కారణం ప్రత్యేక రాష్ట్ర యేర్పాటు వల్ల తెలంగాణ లో సాధ్యమయ్యే వాటి కున్న పరిధులూ పరిమితుల పట్ల సంపూర్ణ అవగాహన లేకపోవడమన్నా కావాలి, లేదా తాము కలగన్నట్టు, తాము అనుకున్నట్టు, ఆశించినట్టు ప్రభుత్వమూ , నాయకత్వమూ ప్రవర్తించాలి అన్న అత్యాశా ఐనా కావాలి.” — అవును కదా !

 3. buchireddy gangula says:

  ఏ దేశం లో నయినా — ఏ రాష్ట్రం లో నయినా —వన్ ఇయర్ — తర్వాత
  పరిపాలన గూర్చి కామెంట్ చేయడం — మాట్లడటం జరుగుతుంది —
  35 ఏళ్ళు దొరల పాలన—ప్లస్ తెలుగు దేశం పాలన లో —so..called…కవులు
  రచయితల కామెంట్స్ — అంటూ చూడ లేదు — యిపుడు అందరు
  తెలంగాణా పాలనా యిలా ఉండాలి — యిలా లే దు —తప్పులను వెతుకుతూ —
  తమ వల్లే తెలంగాణా వచ్చినట్లు — రాతలు –పూతలు ?? దేనికో —ఎందుకో —

  యిదే సారంగ లో — NK… గారి గురించి కామెంట్ రాశాను — అందులో వారు
  రాసిన వాక్యల్లనే కోట్ చేశాను —
  కుల మత పట్టింపుల తో నే —విరసం — సన్నగిల్లి పోయిందని — కాశిబట్ల వేణుగోపాల్
  గారు వారి నవల లో — పెర్కుంటే — ఒక సారి నా కామెంట్ లో పెరుకోన్నాను —-
  దానికి —నాకు విరసం మిధ అభిమానం — గౌరవం లేదంటూ —నా మిత్రుడు
  వర వర రావు గారికి — చెప్పినట్లు తెలిసింది —

  దళిత శకం raavaali– దొరల పాలన పోవాలి — విప్లవం రావాలి అంటూ నేను రాశాను —
  just..i.am. a. student….సాహిత్యం లో ఒనుమాలు నేర్చుకుంటున్నాను —

  వి క్ష నo… పత్రిక చదివి — మిత్రుల మాటలు విని —–ysr… పాలన లో
  అని కూడా రాయడం జరిగింది —–

  అమెరికా లో బతుకుతున్న —- I hate…American. foreign….policy….and….పోలీస్
  పెత్తనం —— ఇజ్రాయెల్ ను వెనుక వేసుకోవడం —అన్నింట్లో జోక్యం నచ్చ ను —-

  మనిషి ని గౌరవిస్తాను — కాని పూజించ ను
  పొగడను — చెంచాగిరి చేయను

  సూటిగా చెప్పడం — నా అలవాటు

  కల్పన గారు — అఫ్సర్ గారు — దయతో —-delete….చేయకండి

  please—వి వి గారికి తెలియాలి

  anyhow…. he..knows.me……………………
  ———————————————buchi.reddy.gangula

మీ మాటలు

*