ఈనాటి అవసరం ‘రాగమయి’

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

స్వాతిశయచిత్తుడైన మగాడు పచ్చటి సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకో సంకల్పించగా, ఆ సంసారాన్ని చక్కదిద్దడానికి ఒక  స్త్రీమూర్తి పడే ఆరాటమే ఈ ‘రాగమయి’ కథ.

పెళ్ళయిన నెలకే పుట్టింటికి చేరిన జానకిచేత – ఎవరూ, ఏవిధంగానూ జరిగినదేమిటో చెప్పించలేక పోయారు. ఆడపిల్ల కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నాలు ఆ ఇంటి మగవారెవరూ చేసిన దాఖలాలు కనపడవు.

ఉమ – తన బహిఃప్రాణాలుగా భావించే పినతల్లి కొడుకు రాజశేఖరానికి, ఆడబడుచు జానకికి వివాహం జరిపించడానికి మధ్యవర్తిత్వం నెరిపి, సంబంధం కుదిర్చిన కారణంగా – జానకి నూరేళ్ళబ్రతుకూ బూడిదపాలు కావడానికి ఆమెనే బాధ్యురాలిని చేశాడు మరిది శేషగిరి. పరస్పర నిందారోపణల క్రమంలో భర్తతో, అత్తగారితో ఘర్షణపడి తాను కూడా తన పుట్టింటికి చేరుకున్న ఉమ, నెలరోజుల తరువాత జానకి నుంచి వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరం అందుకుని, వ్యవహారాన్ని ఒక కొలిక్కి తేకుండా తిరుగుముఖం పట్టరాదని నిశ్చయించుకుని పిన్నిగారింటికి వెళుతుంది.

ఇంగ్లీషు చదువులు చదవలేదని రాజశేఖరంపట్ల శేషగిరికి ఉన్న చిన్నచూపును హేళన చేస్తూ, కోడలి తరఫున వకాల్తా పుచ్చుకుని ఆదినారాయణమూర్తిగారు “తెలుగులో అతను చదవని కావ్యం లేదు….. సంస్కృతంలో పంచకావ్యాలు క్షుణ్ణంగా చదువుకున్నాడు” అంటూ అల్లుడి గొప్పతనాన్ని పొగిడితే –

“నీవేదో గొప్ప పండితుడవనుకుంటున్నావ్….. నిజానికి నీవంటి మూర్ఖుడు ఇంకొకడు లేడు….. నువ్వు చదువుకున్నావనే అనుకున్నానుకానీ నీ ఛాందసపు చదువు నిన్నిలా ఛాందసుణ్ణి చేసి విడుస్తుందనుకోలేదు” అంటూ అన్నమీద మండిపడుతుంది ఉమ. ఇదొక శిల్ప విన్యాసం.

ఉమ నోటిద్వారా పలికించిన సంభాషణలు, ఆమె వ్యక్తిత్వ వర్ణనలు ఆ పాత్రని సమున్నత శిఖరం మీద నిలబెడితే, ఆడబడుచును కూతురుగా ఎంచి, న్యాయం, ధర్మం పక్షాన నిలబడి పోరాటం సాగించిన ఉమ చివరికి “తను తన జీవితంలో ఎదురుపడినవారిలో ఎవ్వరితోనైనా ఎప్పుడో ఒకప్పుడు పోట్లాడకుండా విడిచిపెట్టిందా? తను ప్రతివారితోనూ ఇలా పోట్లాడటానికి ఏం హక్కు వుంది? వాళ్ళు సంబంధాలు తెంచుకోలేక పడి వుంటున్నారు కాని వాళ్ళు నిజంగా తనకు బుద్ధి వచ్చేటట్టు చేస్తే తను చేసేదేముంది? చివరకు గయ్యాళిగంపనే బిరుదు ఏనాడో ఒకనాడు తనమీద పడి ఊరుకుంటుంది. తను చేతులారా బంధువులూ, అత్తమామలూ, చివరికి భర్త మనసుకూడా విరుచుకుంటోంది” అనుకుని రోదించడం కథలోని అతి పెద్ద విషాదం.

ఉమ సేవలు లేందే ఆ ఇంట్లో గడవదన్న సంగతి, ఉమ పుట్టింటికి ప్రయాణమయ్యే సందర్భంలో మామగారు చెప్పనే చెప్పారు – “…..మీ అత్త ముసలిది….. ఇంక మీ ఆయన పరమ సోమరి….. వీళ్ళిద్దరూ క్షణం వేగలేరు. అందుచేత వీలైనంత వేగిరం బయలుదేరిరా” అని.

నిజానికి గృహవాతావరణంలో శారీరకంగా, మానసికంగా ఎవరెంత నొప్పించినా, మమకారాల్ని చంపుకోలేక పడి ఉండేది ఆడదే. కానీ, తానేదో అఘాయిత్యం చేస్తుంటే, చుట్టూ ఉన్నవారంతా పడి ఉంటున్నట్లు భావించుకుని, తనను తాను నిందించుకునే మానసికదౌర్బల్యంలోకి ఆడదాన్నినెడుతున్నాడు ప్రతి అవసరానికీ ఆమెపైనే ఆధారపడే మగాడు.

శేషగిరి – ఇద్దరు పిల్లల తల్లైన వదినను ‘ఆడపెత్తనం’ అని ఈసడించడంగానీ, శేఖరం – ‘స్త్రే బుద్ధిః ప్రళయాంతకః’ అంటూ తన భార్యను తృణీకరించిన తమ్ముణ్ణి దండించవలసింది పోయి భార్యపైనే చెయ్యి చేసుకోబోవడంగానీ, రాజశేఖరం – చేసిన తప్పేంటో చెప్పకుండా భార్యను పుట్టింటికి పంపేసి, అత్తవారు పండక్కి పిలిచినా వెళ్ళక, భార్యను మానసిక హింసకు గురిచెయ్యడంగానీ, పురుషాహంకారానికి నిదర్శనాలే.

భర్త పట్ల చెల్లెలి మనసు విరిచేసి ఆమె సంసారాన్ని అగ్నిగుండంగా మారుస్తున్న శేషగిరిని చిన్నక్క వెనకేసుకు రావడమైనా, కొడుకు దొంగవేషాలను దాచిపెట్టి, తానుగా కొడుకు విషయంలో అబద్ధాలాడి గిరిజమ్మగారు చేజేతులా శేషగిరిని చెడగొట్టడమైనా, కుటుంబవ్యవస్థలో పురుషాధిక్యతను స్థిరీకరించే, పెంచి పోషించే చేష్టితాలే.

జానకి రాజశేఖరంల దాంపత్యజీవనం గాడిన పడటంతో కథ సుఖాంతమైనా, ఉమ పాత్ర మనల్ని కలవరపెడుతూనే ఉంటుంది, గుండెను బరువెక్కిస్తూనే ఉంటుంది.

జానకి పుట్టింటికి రావడానికి కారణమేమిటి? అన్న ప్రశ్న పాఠకులను కథ మొదట్నించి చివరిదాకా వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని గొప్ప శైలీనైపుణ్యంతో కథలో హంసబకోపాఖ్యానాన్ని చొప్పించడంద్వారా సూచిస్తారు మాస్టారు. ఈ సందర్భంలో ఉమ, రాజశేఖరంలమధ్య రసవత్తరమైన, అర్థవంతమైన వాదోపవాదాల్ని నడిపించారు. ఒక రోజు కొంత సంభాషణ జరిగాక, మర్నాడు ఉమ ఆ వాదాన్ని కొనసాగించినప్పుడు “అయితే ఈ యుక్తులన్నీ ఆలోచించటానికి ఒక రాత్రీ, ఒక పగలూ పట్టిందా?” అని రాజశేఖరం వ్యంగ్యంగా అడిగితే, “లేదు, లేదు.. నెల్లాళ్ళూ … ఏకాంతంగా మడతకుర్చీలోపడి ఆలోచిస్తేనేగాని స్ఫురించలేదు” అని ఉమ చెప్పిన సమాధానం ద్వారా మగాడికి ఎగతాళిగా కనిపించే విషయాలు స్త్రీలను రోజులతరబడి మనోవేదనకు గురిచేస్తాయన్న కఠోర వాస్తవాన్ని తెలియజేస్తుంది.

ఇటువంటి మార్మిక సంభాషణలు కథంతా పరుచుకుని పాఠకుల ఊహాశక్తికి పదును పెడతాయి. మళ్ళీమళ్ళీ చదివేకొద్దీ కొత్తకొత్త అర్థాలు గోచరిస్తాయి.

తల్లిదండ్రులను, తోడబుట్టినవారిని వదిలి మూడుముళ్ళ బంధంతో అత్తవారింట అడుగుపెట్టిన స్త్రీ ఆ ఇంటివారినుంచి ఎటువంటి ప్రేమాభిమానాలను కోరుకుంటుందో, కోడలితో అత్తింటివారికి ఏవిధమైన అనుబంధం ఉండాలో తెలియజేసే గొప్ప కథ రాగమయి.

కారామాస్టారు ఈ కథ రాసే కాలానికి స్త్రీవాదం అన్న పేరు పుట్టి ఉండకపోవచ్చును గానీ, గృహచ్ఛిద్రాలలో స్త్రీలపై జరిగే మానసిక దాడిని విపులంగా చర్చించిన స్త్రీవాద కథే ఇది. కథ రాసిన కాలంనుండి ‘నేనెందుకు రాసేను?’ రాసేదాకా కూడా తెలుగు సాహిత్యంలో స్త్రేవాద భావజాలం ప్రవేశించకపోవడంవల్ల కారామాస్టారు ఈ కథని ఏ ప్రయోజనం సాధించలేని కథగా పేర్కొని ఉండవచ్చు. అంతమాత్రాన ఎప్పటికీ ఇది ప్రయోజన రహితమైన కథగానే నిలిచిపోతుందనలేం. నాటినుంచి నేటిదాకా కుటుంబ వాతావరణంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు అట్లాగే ఉన్నాయి. పరిష్కారమార్గాలు చర్చనీయాంశాలే అవుతున్నాయి. అందువల్లే ‘ఈనాటి అవసరం రాగమయి.’

-పాలపర్తి జ్యోతిష్మతి

Palaparthi Jyothishmathiపాలపర్తి జ్యోతిష్మతి 17 సంవత్సరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి 2001లో వి.ఆర్.ఎస్. తీసుకొన్నారు. కధలంటే ఇష్టంతో చిన్నప్పటినుండి వార, మాస పత్రికల్లో వచ్చే కధలు చదవటం అలవాటు చేసుకొన్నారు. ఇప్పటి వరకు 2006లో ‘కాకి గోల’ కవితా సంకలనం, 2014లో ‘సుబ్బలక్ష్మి కధలు’ కధా సంకలనం వచ్చాయి. ఈ రెండు పుస్తకాలు kingie.com లో దొరుకుతాయి. తన మనోభావాలను పదిమందితో పంచుకోవడానికి రచనా వ్యాసాంగాన్ని మాధ్యమంగా భావిస్తున్నానని అంటున్నారు. జ్యోతిష్మతికి బీనాదేవి అభిమాన రచయిత్రి.

వచ్చేవారం ‘ఇల్లు’ కధ గురించి నల్లూరి రుక్ష్మిణి పరిచయం

“రాగమయి” కథ ఇక్కడ:

మీ మాటలు

*