విదూషక బలి

 

"నీకు ఉజ్జోగమిస్తాను కానీ, నీ.. నీ.. టై రంగు నాకు నచ్చలేదు’’

“నీకు ఉజ్జోగమిస్తాను కానీ, నీ.. నీ.. టై రంగు నాకు నచ్చలేదు’’

కత్తికంటే కుంచె శక్తిమంతమని మరోసారి తేలింది. ఆ వెర్రిబాగుల కార్టూనిస్టుల కుంచెలను మూయించడానికి నీకు ఏకంగా కలాష్నికోవ్ రైఫిళ్లు, షాట్ గన్లు, రాకెట్ లాంచర్లు కావాల్సి వచ్చింది. విదూషకులు కదా, పాపం తమ వెక్కిరింతలకు ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుందని తెలుసుకోలేకపోయారు !

వాళ్లేం చేశారు? ‘నా మతాన్ని, నా ప్రవక్తను కించపరిచారు’ అంటావు, అంతేకదా. కానీ వాళ్లు నువ్వు నరనరానా ద్వేషించే అమెరికా వాడిని, వాడి యూరప్ తొత్తులనూ పరమ అసహ్యంగా గేలి చేశారు కదా. నీ మతదేశాల్లోనే కాకుండా లోకంలోని కష్టజీవులందరి శ్రమఫలాలను దోచుకుంటున్న కేపిటలిస్టుల ముఖానా కాండ్రించి ఉమ్మేశారు కదా. నువ్వు మండిపడే క్రైస్తవ మతపెద్దల బట్టలనూ విప్పేశారు కదా. ఒక్క క్రైస్తవాన్నేనా.. యూదుమతాన్నీ, జాతిపిచ్చి మతాన్నీ, జనాన్నిఆరళ్లుపెట్టే సామ్రాజ్యవాద మతాన్నీ, అవినీతిరాజకీయ మతాన్నీ, మెట్రోసెక్సుమత్తు మతాన్నీ, బాసిజపు మతాన్నీ, నాటోదాడుల మతాన్నీ వాంతికొచ్చేలానూ ఎండగట్టారు కదా. ఇవన్నీ నీకు తెలియదనుకోను. నిజం చెప్పు, నువ్వు కూడా ఆ విదూషకుల బొమ్మలను నీ తుపాకీ మడమపై ఉంచుకుని చూసే వేళ ముసిముసిగా నవ్వుకోలేదా?

ఫ్రాన్స్ లో నీ మతం వాళ్లపై వేధింపులు పెరుగుతున్న మాట నిజమే. రైట్ వింగూలూ, నయా జాత్యున్మాద నేషనల్ ఫ్రంట్లూ జడలు విప్పుతున్నదీ, నీవాళ్లను గెంటేయాలని, కొత్తవాళ్లను రానివ్వకూడదని వెర్రిగా అరుస్తున్నదీ నిజమే. చమురు కోసం నీ మతదేశాలపై, అక్కడి నీ అమాయక ప్రజలపై ఫ్రాన్స్ సహా చప్పన్నారు పడమటి దేశాలు దాడులు చేస్తున్నదీ నిజమే. నువ్వు చిదిమేసిన ఆ  కార్టూనిస్టులు తెలిసో తెలియకో తమ పిచ్చి బొమ్మలతో  ఆ దేశాలకు వకాల్తా పుచ్చుకున్నట్లు అనిపించిందీ నిజమే…

అందుకు పగతీర్చుకోడానికి ఆ పిచ్చుకలపై తుపాకీ ఎక్కుపెడతావా? పోనీ ఆవేశంలో పొట్టనబెట్టుకున్నావులే అని సరిపెట్టుకుందామనుకున్నాను, కానీ వీలుకాలేదు. మొన్నటికిమొన్న పెషావర్ ఆర్మీ స్కూల్లో నువ్వు ముక్కుపచ్చలారని 130 మంది పిల్లల నెత్తురు కళ్లజూసినప్పుడు నీకు గట్టిగానే చెప్పాను కదా, చెవికెక్కలేదా? ఆ నెత్తురింకా ఆరకముందే మరింత అమాయకపు నెత్తురును ఒలికించేశావు కదయ్యా!

Karnika Kahen

సహనం నశిస్తోంది మిత్రమా. నీది పెడదారి అని గోబెల్స్ లు చేస్తున్న ప్రచారం నిజమేనేమోనని నమ్మాల్సి వస్తుందని భయంగా ఉంది. నీతో కొన్నిపేచీలు ఉన్నా దుర్మార్గపు మహాకాయపు రాక్షస గోలియత్ ను వడిసెలతో ఎదుర్కొంటున్న నీ సాహసాన్ని చూసి ముచ్చటపడ్డాను. నీకు రాళ్లందిస్తూ సాయంగా ఉందామనుకున్నాను. కానీ ఇక సాధ్యం కాదేమో. నీ కసిలో ఉన్మాదం పాళ్లు పెరిగింది. నీ ప్రతిఘటన పక్కదారి పట్టింది. నీ గురి పూర్తిగా తప్పింది.

ఆ నెత్తురొలికిన కుంచెల సాక్షిగా ఓ మాట చెబుతున్నాను, బాగా విను. కళ్లు మరింత బాగా తెరువు. గురి చెదరనీకు. శత్రువెవడో, మిత్రుడెవడో, తటస్థుడెవడో మరింత బాగా తెలుసుకో. ప్రాణాలు కాపాడుకోవడానికే తుపాకీ పట్టినవాడివి కనక ప్రాణం విలువ నీకు బాగా తెలుసు. అందుకే నీది ధర్మాగ్రహమంటున్నాను. వ్యర్థ బలులను అల్లా కూడా ఒప్పుకోడు. విదూషకుల బలులను అసలెంతమాత్రం ఒప్పుకోడు.. ! ! !

(ప్యారిస్ లో ఈ నెల 7న వ్యంగ్యపత్రిక ‘షార్లీ హెబ్దో’ కార్యాలయంపై దాడిలో బలైన ప్రధాన సంపాదకుడు, కార్టూనిస్టు షార్బ్(47), కార్టూనిస్టులు కాబూ(76), హనోర్, వోలిన్ స్కీ(80), కాలమిస్టులు, పత్రికా సిబ్బంది, ఇతరులకు నివాళిగా..)

                                                              –  పి.మోహన్

మీ మాటలు

 1. “నీది పెడదారి అని గోబెల్స్ లు చేస్తున్న ప్రచారం నిజమేనేమోనని నమ్మాల్సి వస్తుందని భయంగా ఉంది. ”
  నాయనో.. అంటే మీరింకా నమ్మట్లేదన్నమాట..
  అయినా ఇది దారి తప్పిన ఎదిగిన కొడుకును మందనించినట్లుగా కూడా లేదు. ఓ పసిబాలుణ్ణి అన్నం తినకుంటే బూచోడు వస్తాడని బెదిరిస్తున్నట్లు కూడా లేదు.
  ఇది మీ మిత్రులకు మందలింపులా కూడా లేదు, నొసటితో వెక్కిరిస్తూ నోటితో నవ్వుతున్నట్లుగా వుంది.కొంచొకచో సమర్థిస్తున్నట్లుందని చెప్పడానికి సాహసిస్తున్నాను.
  ఇంతటి దుర్మార్గపు హేయమైన చర్యని కటినమైన పదజాలంతో ఖండించలేని సారంగని చూస్తున్నందుకు ఇవాళ నాకు సిగ్గేస్తున్నది.

 2. కెక్యూబ్ వర్మ says:

  ఈ ప్రపంచంలో అమెరికా దాని మిత్ర కూటమి కంటే పెద్ద టెర్రరిస్ట్ దేశాలేమున్నాయి ప్రసాద్ గారు. పెషావర్ లో స్కూలు పిల్లలపై జరిగిన దాడి ఖండించాల్సిన ఉన్మాదపు చర్యే. కాని ఇరాక్ లో లక్షల మంది పిల్లలపై పడ్డ బాంబు దాడిని అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా చమురు దేశాలన్నింటిపైనా ముస్లిం రాజ్యాలన్న ఒకే ఒక్క కారణంగా ఉగ్రవాద ముద్రతో వీళ్ళ దాడులలో ప్రాణాలు కోల్పోయిన వారూ చివరాఖరికి ఆసుపత్రులపైనా పాలస్తీనాలో ఇజ్రాయిల్ దాడులు ఖండిస్తూ ఎన్నడైనా మాటాడే ఒక దేశమేదైనా ఉందా? ఎందుకంటే వాడి మోచేతి నీళ్ళు తాగి బతికే వారే కనుక. లేదంటే టెర్రరిస్ట్ ముద్రపడి అధికారం ప్రాణాలు రెండూ కోల్పోతారన్న భయం. ఇక్కడ మోహన్ సున్నితంగా ఎం చెప్పలేదు. ఇంత తక్కువ సమయంలోనే సారంగ ఈ దాడిని ఖండిస్తూ ప్రచురించడం హర్షణీయమే. మీరూ ఇంకా రాయొచ్చు.

 3. ఇదంతా ఒక తీవ్రవాదుల్ని బుజ్జగిస్తున్నట్లు, వాళ్ళను నిష్టూరమాడుతున్నట్లు ఉందేగానీ, వాళ్ళ ధోరణులను దునుమాడుతున్నట్లుగా ఎంతమాత్రం లేదు. ముస్లిములమీద సానుభూతి మీకు ఉంటే, దాన్ని ఇలా తీవ్రవాదులమీదకూడా ప్రదర్శించాల్సిన అవసరంలేదు.

  ఫ్రాన్స్‌లోని ముస్లిముల్లో చాలామంది అక్కడికి కాందిశీకులుగా వెళ్ళినవారు. వారు తలదాచుకోవడానికి ఒకప్పటి ఫ్రెంచి ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశం ఇప్పుడు వారికిలాంటి తలనొప్పులు తెస్తోంది. రాజ్యము-మతము సంబంధాల విషయంలో యూరప్ మిగతా ప్రపంచంకన్నా అభ్యుదయభావాలతో విలసిల్లుతోంది. ఈ ముష్కరులు దాన్ని క్రిందకు, మధ్యప్రాచ్యం స్థాయికి తేవాలని ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ చేష్టలవల్ల, దాని బోధనలవల్లా నాకు ఇస్లామ్మీద సదభిప్రాయం ఎప్పుడో పోయింది.

  మీరు మీ గత వ్యాసంలో వ్రాసినట్లుగా బహుశా ప్రపంచంలో అత్యంత సున్నితమైన హృదయాలు, మనోభావాలు ఈ ఇస్లామిక్ తీవ్రవాదులకే ఉంటాయి. వీళ్ళు అడ్డమైన పనులన్నీ చెయ్యొచ్చు, ఒక్క కార్టూన్ వేస్తేమాత్రం వీళ్ళ హృదయాలు గాయపడతాయి, దానివల్ల దేశాలే రక్తమోడుతాయి.

 4. Phanindra says:

  ఒక తల్లి తన అల్లరి కొడుకుతో – “చూడు కన్నా! నువ్వంటే నాకిష్టం. నువ్వు మొన్న నాకు ఒళ్ళుమండే ఆ పక్కింటి ఆంటీ వాళ్ళింటి అద్దం బద్దలుకొట్టినప్పుడు మురిసిపోయాను. కానీ ఆ ఎదురింటి బాబుని కొట్టడం తప్పు కదా నాన్నా! వాడు నిన్ను గేలి చెయ్యడం తప్పే అనుకో, కానీ కొట్టకూడదు కన్నా! నువ్విలాంటి పనులు ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు. అందరూ అంటున్నట్టు నువ్వు నిజంగా చెడ్డవాడివే అనీ, నేను కూడా మున్ముందు నిన్ను సమర్థించలేనేమోనని భయంగా ఉంది! నీ పద్ధతి మార్చుకో, ప్లీజ్! మన టార్గెట్ పక్కింటి ఆంటీ అని గుర్తుంచుకో!”

  ఎదురింటి బాబు = ప్యారిస్ పత్రిక
  అల్లరి కొడుకు = ఇస్లామిక్ తీవ్రవాదులు
  పక్కింటి ఆంటీ = అమెరికా
  తల్లి = ఈ వ్యాస రచయిత

  ప్యారిస్ షూటింగులపై చాలా వ్యాసాలూ, విశ్లేషణలూ చదివాను. కొన్నిటితో ఏకీభవించకపోయినా రాసిన విధానాన్ని మెచ్చుకున్నాను. కానీ ఈ వ్యాసం చదివి మాత్రం నివ్వెరబోయాను!

 5. చరసాల ప్రసాద్, మినర్వా, ఫణీంద్ర గార్లకు,
  మీ ఆక్రోశం అర్థమైంది. ఈ వ్యాసంలో నా మద్దతు, సానుభూతి ఎవరికో స్పష్టంగానే ఉంది. మీరు మళ్ళీ పనిగట్టుకుని గుర్తు చేయక్కర్లేదు. నేను పత్రికపై దాడిని సమర్థించినట్లు ఎక్కడా లేదు. దాడి చేసిన వాళ్ళను ‘సుతిమెత్తగా’ కాకుండా, రాక్షసులని, నరహన్తకులని.. ఇంకా మీకిష్టమైన తిట్లు తిట్టలేదనే (సంఘ్ వాళ్ళైతే వాళ్ళకిష్టమైన) కదా మీ బాధ! ‘నీ కసిలో ఉన్మాదం పాళ్లు పెరిగిందని, నీ గురి పూర్తిగా తప్పిందని, ముక్కుపచ్చలారని 130 మంది పిల్లల నెత్తురు కళ్లజూశావని, అమాయకులను పొట్టనబెట్టుకున్నావని…’ ఇవి మీకు తిట్లుగా కాకుండా దీవెనలుగా అనిపించి వుంటే నేనేమీ చెయ్యలేను.!
  నా వ్యాసం తక్షణ స్పందన. ఎమోషనల్ స్టేటస్లో రాశాను. ఎవరో విమర్శిస్తారని, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని రాయాలని రాసింది కాదు. దీనిపై అభ్యంతరాలుంటే మీరు కూడా వాళ్ళను(‘నా అల్లరి కొడుకులను’) మీ ధోరణిలో మరింత ఘాటుగా హేయంగా కటిన పదజాలంతో తిట్టండి.
  మినర్వా గారు ఆవేశంలో పొరబడ్డారు. ‘..మీరు మీ గత వ్యాసంలో వ్రాసినట్లుగా బహుశా ప్రపంచంలో అత్యంత సున్నితమైన హృదయాలు, మనోభావాలు ఈ ఇస్లామిక్ తీవ్రవాదులకే ఉంటాయి…” అని అన్నారు.
  నేను నా గత వ్యాసంలో ఎవరి హృదయాల గురించీ రాయలేదు. నన్ను జీఎస్ రామ్మోహన్ అనుకున్నారు. అందుకూ నేనేమీ చెయ్యలేను.!!
  ఇక ఫణీంద్ర గారికి,
  మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్లో సెన్స్ లేదు. పక్కింటి ఆంటీ తన ఇంటికే పరిమితమై, అందరు ఆంటీల మాదిరి ఉంటే ఆమె అద్దం భద్రంగా ఉంటుంది. అలా కాకుండా అందరిళ్ళలోకి చొరబడి, దాడి చేసి, దోచేసి, చంపేసి నాకడ్డులేదని విర్రవీగితే అద్దమే కాదు మొత్తం ఇల్లే బద్దలవుతుంది. గేలి చేసిన పక్కింటి ఆంటీ కొడుకును కొట్టడం తప్పు కనకనే పద్దతి మార్చుకోవాలని, టార్గెట్ పక్కింటి గయ్యాళి ఆంటీ అని గుర్తుంచుకోవాలని హితబోధ…

 6. సవరణ..
  ‘గేలి చేసిన పక్కింటి ఆంటీ కొడుకును” గా కాకుండా ఎదురింటి బాబుగా చదువుకోండి.

  • మోహన్ గారు,

   మీరు చెప్పాలనుకున్నది నాకర్థమైంది, చెప్పిన విధానం మాత్రం అపార్థాలకు తావిచ్చేదిగా ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదులు చేస్తున్న అమానుషాలన్నిటికీ అగ్రరాజ్యాల అరాచక అణిచివేతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం అన్న సమర్థన ఎందుకు? ఇద్దరినీ సమానంగా ఖండించకుండా ఒకరి తరపున వకాల్తా ఎందుకు? మీకొకరి పైనున్న ద్వేషాన్ని ఇంకొకరిపై సానుభూతిగా తర్జామా చేసుకుంటున్నట్టు నాకు తోస్తోంది.

   మీ వ్యాసాన్ని విమర్శించిన వాళ్ళందరూ సంఘ్ పరివార్ తొత్తులు అన్నట్టు, దుర్భాషలాడేవారన్నట్టు అర్థం వచ్చేటట్టు మీరు వ్యాఖ్యానించడం అనవసరం, శోచనీయం.

 7. మోహన్ గారూ,
  ఇందులోకి సంఘాన్ని లాగడమెందుకు. నా గురించి తెలిసిన వాళ్ళకు నేను సంఘానికెంత దూరమో తెలుసు. సంఘమూ, ముస్లిం మత ఛాందసులు ఒకేతాను ముక్కలే. కాసింత రంగులో తేడా వుండొచ్చు. చివరికి అమాయకులను చంపే ఈ రాక్షస మూకని ఇది తప్పు అని చెప్పాలంటే ఆరెస్సెస్ వాడు అయ్యుండాలి, కాకుండా వీళ్ళని రాక్షసులని ఎలా అంటాడు అన్నట్లుంది మీ వరస. అండుకే వాళ్ళూ ఓ పడికట్టు పదం నేర్చారు..”కుహనా లౌకికవాదులు” అని.
  140 పైగా స్కూలు పిల్లలని నిర్దాక్ష్యణ్యంగా చంపటానికి, ఇప్పుడూ 12 మందిని పొట్టనబెట్టుకోవడానికి తేడా ఏముంది? అప్పుడైనా, ఇప్పుడైనా, ఎక్కడైనా ఎప్పుడైనా, ఎవరితోనైనా అసహాయులను చంపటం, నిరాయుధులను చంపటం నేరం కాదూ? దానికి వత్తాసుగా కాపిటలిసం, మార్క్సిసం, ఇస్లామిసం, హిందూయిజం ఏదన్నా కానీ. అలాంటి అకారణ వధ జరిగినప్పుడు మనసున్న గుండె ఆక్రోశించాలి, రోదించాలి. అది జరగని రోజున మానవ పతనం మొదలవలేదూ??
  సారంగ అన్నా, దాని వెనుకాల వున్న పెద్దలన్నా గౌరవం వుంది గనుక అందులో వచ్చే వ్యాసాలూ దానికి తగినట్టుగా వుండాలని ఆశించడంలో తప్పేముంది? నరహంతకులన్న పెద్ద మాట మీ నోట రావటం రాకపోవడం మీ యిష్టం. కానీ ఆశించటం నా యిష్టం.
  పెత్తందారీ దేశాలు పెత్తనం చేస్తూనే వుండవచ్చు. డ్రోన్ దాడుల్లో క్రూరులతో పాటు, పిల్లలూ అమాయకులూ చనిపోతూ వుండవచ్చు. అయితే దీన్ని దానికి తిరుగుబాటు అంటారా? తిరుగుబాటు ఇలానే చేస్తారా? వందల మందిని బోకోహారం నైజీరియాలో పొట్టనబెట్టుకుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఏ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు? ఇస్లామిక్ స్తేట్ చేస్తున్న దారుణాలు ఏ డ్రోన్ దాడుల్ని నిలువరించడానికి? ఏ పసిపిల్లల మరణాల్ని ఆపడానికి?
  అసలు ఈ వ్యాసం టైటిలే మీ అంతరార్థాన్ని చెబుతోంది. “విదూషక బలి” — బలి వేరు హత్య వేరు. ఆ హత్యలో మీరు మనిషిని గుర్తించకుండా “విదూషకుణ్ణి” గుర్తించారు. మొదటి రెండు పేరాలతోనే మీ తక్షణ స్పందన కానిపిస్తోంది. మూడో పేరానుండే ఆ అసలు బాధ ఆవిష్కృతమైంది.
  ఫ్రాన్సులో ఇస్లాం మీద వేధింపులు మొదయ్యాక ఈ హత్యలు మొదలయ్యాయా? ఇస్లాం వెర్రి తలలు చూశాక ఈ వేధింపులు మొదలయ్యాయా? మొదటనుండీ ఇస్లాం మీద వేధింపులు వుంటే ఈరోజు ఫ్రాన్సులో ఇంతమంది ముస్లిములు వుండెవారా? చాలా మంది యువకులు తమ తమ అథిధేయ/మాతృ దేశాల అభిమతాన్ని కాదని ఇస్లామిక్ స్తేట్ లో చేరుతున్నారని వింటున్నాం. మొన్నటికొకడు దానినపోయేవాళ్ళ మీద బస్సును నడిపాడు. మొన్న ఆస్ట్రేలియాలో బందీలుగా పట్టుకున్నాడొకడు. ఇప్పుడు మళ్ళీ ఈ హత్యలు. ఇవన్నీ చూస్తూ సామాన్యపౌరుడు చుసిచూసి ఈ గంపను నెత్తికెందుకు ఎత్తుకోవడం అనుకోడా. అయినా వేధింపులు చేస్తున్న వారికంటే ఆదరించేవారి శాతమే ఎక్కువని నా అనుకోలు. అయితే ఆ శాతం తిరగబడి అతివాదులదే పైచెయ్యి అయేరోజు ఎంతోదూరంలో లేదు. ఆ దూరాన్ని తగ్గిస్తున్నది ఇలాంటి వికృత చర్యలే!
  ఇక “దుర్మార్గపు రాక్షస గోలియత్” అని మీకు పడని వాన్ని ఆ సందర్భం కాకున్నా అన్న మీరు “రాక్షసులని, నరహన్తకులని.. ఇంకా మీకిష్టమైన తిట్లు తిట్టలేదనే (సంఘ్ వాళ్ళైతే వాళ్ళకిష్టమైన) కదా మీ బాధ!” అని మమ్మల్ని ఈసడిస్తున్నారు.
  తప్పుచేసిన వాడు మనవాడే కదాని నష్టం మనక్కాదుగా అని కళ్ళు మూసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ బాధే అందరూ పడాల్సి వుంటుంది.
  నువ్వనేది నాకు నచ్చకపోతే చంపేస్తాను అనేది అత్యంత ప్రమాదకరం. ఈ రాక్షస, రక్తపు క్రీడని ఆక్షేపించడానికి, ఖండించడానికి కారణాలు వెతకక్కర లేదు.
  కెక్యూబ్ వర్మ గారు పిల్ల పెషావర్ పిల్లలపై దాడి ఉన్మాద చర్యే కానీ….అంటున్నారు. ఈ “కానీ”లు ఓ ఉన్మాదచర్యకు కారణాలు చూపిస్తాయి. అమెరికా, దాని మిత్ర దేశాలు ఏమి చేసినా పిల్లలపై దాడి హేయమైంది, రాక్షసులు కూడా చేయలేనిది. ఇది అమెరికా మీద ప్రతీకారమెలా అయ్యింది?

 8. sasi kala says:

  R.I.P మనిషి తాను పోవాల్సిన దారి మర్చిపోయి జంతువులు వెళ్ళే దారిలో అది ఉందేమో అని వెతుకుతున్నాడు :(

 9. K. Narendra Mohan says:

  నా శత్రువుకి శత్రువు నా మిత్రులు అనే యాంత్రిక భావం కనబడుతుంది. రాజకీయ ఇస్లాం, రాజకీయ Hinduism వంటిది. అది ప్రగతికి మిత్రుడు కాదు. విప్లవ సిద్ధాంతం మరీ కాదు. పాకిస్తాన్లో విప్లవ కారులు, అభ్యుదయవాదులు అమెరికా సామ్రాజ్యవాదాన్న్ని , రాజకీయ ఇస్లంని రెంటిని సేత్రువులుగానే పరిగానిస్తున్నాయీ.

మీ మాటలు

*