జాయపసేనాని

OLYMPUS DIGITAL CAMERA

 

దృశ్యం  : 3

 

(క్రీ.శ. 1225 జాయప వయస్సు 36 సంవత్సరములు. గుర్రపు డెక్కల, సైన్యసందోహధ్వని..వేయిస్థంబాల దేవాలయంలోకి గణపతిదేవుడు, జాయపనేనాని, గుండనామాత్యులు, రాజనర్తకి మాళవికాదేవి..ప్రవేశం…గర్భగుడిలోని రుద్రేశ్వరాలయంలో శివస్తుతితో కూడిన  మంత్రోచ్ఛారణ…మంగళకర ధ్వని…)

వందిమాగధులు :    జయహో…విజయహో..రాజాధిరాజా…రాజమార్తాండ…సకల దేశ ప్రతిష్ఠాపనాచార్య…కాకతి రాజ్యభార దౌరేయ శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి…జయహో…విజయహో…

ఆలయ ప్రధాన అర్చకులు : స్వాగతము… మహాచక్రవర్తులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులుం గారికి స్వాగతం..సుస్వాగతం.

గ.ప.దే : రుద్రాలయ ప్రధాన అర్చకులుగారికి అభివాదములు..ఖడ్గాన్ని ధరించిన హస్తంతోనే నాట్యాభినయం చేసి కత్తినీ, కలాన్నీ ఒకే చేత్తో సమర్థవంతంగా ప్రయోగించి ఖ్యాతివంతుడు కావడం మన సేనానీ, గజసైన్య సాహిణి, నాట్యకోవిదుడు, వీరాగ్రేసరుడు, అరివీర భయంకరుడైన జాయపసేనానికే సాధ్యమైనది. వారు గత నాల్గు వత్సరములుగా సృజించిన కావ్యశాస్త్రము…’గీత రత్నావళి’ మహాగ్రంథము ఈనాటికి సంపూర్ణమైనది. దీనిని శివసాన్నిధ్యంలో పరమేశ్వరునికి అంకితమొనర్చుటకై మా రాక..తగువిధముగా ఆ గ్రంథసమర్చనకు ఏర్పాటు చేయండి. జాయనా..పట్టు వస్త్రములో ఒదిగిన ఆ ‘గీత రత్నావళి’ గ్రంథమును దైవసన్నిధిలో సమర్పించి ప్రజాపరం చేయండి..

జాయన : ఆజ్ఞ మహాప్రభూ…గణపతి దేవులుంగారి శుభాశీస్సులతో రూపుదిద్దుకున్న ఈ ‘గీత రత్నావళి’ గ్రంథ సృజనకు కారకులు, పోషకులు, ప్రేరకులు అన్నియును మహాప్రభువులే. వారికి కృతజ్ఞతాభివందన చందనములు అర్పించుకుంటూ..,

ప్ర.అ.: (గ్రంథమును పట్టుబట్టతో సహా అందుకుంటూ…) మహాప్రసాదం…ఈ అక్షరామృత నిధిని శివ కృపార్థం సమర్పించే మహాభాగ్యం మాకు లభించడం మా సుకృతం..ఓం రుద్రాయ…(రుద్రస్తుతి ప్రారంభం..ఆలయం గంటలు…అభిషేకం..సంరంభం… శంఖధ్వని..)

గ.దే : జాయనా…మాపెద్ద తండ్రిగారైన రుద్రదేవుడు 1162 ప్రాంతంలో కాకతీయ స్వతంత్ర సామ్రాజ్యమును ప్రకటించిన సందర్భంలో కట్టించిన త్రికూటాలయమే ఈ సహస్ర స్తంభాలయం. ఇక్కడ రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యదేవుడు కొలువై ఉన్నారు. విష్ణు ఆలయమునకు అద్భుతంగా అదిగో అక్కడే ఉత్తరాభిముఖముగా ఆసీనుడై ఉన్న నంది ”విష్ణునంది”. సర్వాంగ స్వర్ణాభరణ శోభితమై బలిష్టుడైన బసవేశ్వరుడు పొంగివచ్చిన రక్తనాళాలతో సహా సజీవ మహాసౌందర్యంతో మనను ఎప్పడూ పిలుస్తూంటాడు. నంది వెనుక ఉన్నది రంగ మండపము. నందీశ్వరుని అవతారమైన వీరభద్రునికి ప్రతీకగా, రుద్రుడు మన ఇలవేల్పుగా సిద్ధపరుస్తూ ఈ సహస్ర స్తంభాలయములో చెక్కిన ప్రతి శిల్పం మన సమకాలికులైన చాళుక్యుల, హొయసళుల శిల్పరీతులకు భిన్నమై ఉత్తమోత్తమమై , ఉన్నత  ప్రమా ణములతో విరాజిల్లుతున్నది.

గుండనా : సృజనకారులెవరైనా ఎప్పుడూ తన కృతిచేత, విలక్షణ శైలిచేత ప్రత్యేకంగా పరిగణించబడాలి. కాకతీయుల శిల్పం, నృత్యం, గీతం, వాద్యం…అన్నీ విశిష్టమైనవే. కాకతీయ శిల్పంలోని ప్రధాన లక్షణం గతి శీలత. ఇందులోని ప్రతి మూర్తీ ప్రాణ లయతో ప్రకంపిస్తున్నట్టు గోచరిస్తుంది. (అప్పుడే..రుద్రాభిషేకంతో పాటు…ఉచ్చైస్వరంలో పంచమహావాద్యాలు హోరెత్తాయి). మన ప్రత్యేకత..పంచ మహాశబ్దాలు…అవి అనంత విజయం, పౌండ్రము, దేవ దత్తం, సుఘోష, మణి పుష్పకం…మరియు పంచమహావాద్యాలు అవి శృంగము, శంఖము, మృదంగము, భేరి మరియు ఘనము. ఇవిగాక నిస్సహణము, కాంస్య తాళములు, కాహళము, మహామద్దెల…యివన్నీ శబ్ద గంభీరతను తురీయ స్థాయికి చేర్చి రుద్ర  తాండవ రౌద్రతను హెచ్చింపచేస్తాయి. కాకతీయ జీవనం ప్రధానంగా వీర రసభరిత, శౌర్య సమ్మిళితం.

మాళవిక : కాకతీయ నృత్యము కూడా అత్యంతోత్తమమైనది. రంగ మంటప నాట్యస్థలిపై ప్రవేశించి..త్రిభంగిమలో నిల్చి, అంగ సంచలనం చేస్తూ భ్రూ లతలను నర్తింపచేస్తూ, శిరః కంపనము అంగుళీ స్ఫోటనము చేస్తూ వంజళము, ఢాళము, వళి, దిరువు, బాగు, వాహిణి, సాళి, బయగతి, సుగతి, బహుగతి అనే వివిధ గతులను, భంగిమలను అభినయించడం మన కాకతీయుల విలక్షణ దేశీ నృత్యరీతి. యిది సకల జనరంజకమైనది, పరవశ ప్రధానమైనది.

ప్రధాన అర్చకుడు : శివానుగ్రహమునకు ప్రాత్రమైన ఈ ‘గీతరత్నావళి’ గ్రంథం ఆచంద్రార్థం బుధజనరంజకంగా వర్థిల్లుగాక.. స్వీకరించండి.

(జాయన పట్టు దస్త్రమును స్వీకరించి గణపతిదేవుని చేతుల్లో ఉంచి ముందు తలవంచాడు)

గ.దే : మహేశ్వరాశీర్వాద ప్రాప్తిరస్తు..ఈరోజు ఎంతో సుదినము. తెలుగుజాతికి ‘గీతరత్నావళి’ అనే సంగీత, సాహిత్య సమ్మేళనాల ఆత్మరహస్యాలను విప్పిచెప్పగల ఒక ప్రామాణిక గ్రంథము లభించినది. ఈ ఘట్టము చరిత్రలో శాశ్వతమై నిలిచిపోతుంది.

మాళవిక : మహాప్రభువులకొక విన్నపము.

గ.దే.: తెలియజేయుము మాళవికా…మా రాజనర్తికి ఊరికే కల్పించుకోదు

మాళవిక : సూర్యుడొక్కడే ఐనా చీకట్లను చీల్చగల వెలుగులనూ, ప్రాణకోటిని మేల్కొలిపి సృష్టిని జీవన్వంతం చేయగల ఉష్ణకిరణ సందోహాలనూ, ప్రచలిత మార్మిక జీవశక్తినీ ప్రదానం చేసినట్టు.. యిన్నాళ్ళూ నృత్యశాస్త్ర అధ్యయనంలో జాయపసేనానితో సహకరిస్తూ సంగతిస్తున్న నేను అతని యందు నిబిడీకృతమై ఉన్న యితర సృజన రంగాల కళా విశారదకతనూ గమనిస్తున్నాను. ఆయన నృత్య, వాయిద్య రంగాలతోనే కాకుండా కరి గణాధ్యక్షుడుగా ఉంటూనే యుద్ధ తంత్రజ్ఞతతో అనేక విజయాలనుకూడా కాకతీయ సామ్రాట్టులకు సంపాదించినారు కదా…అందుకని..

గ.దే : భళా..మాకర్థమైనది…సరిగ్గా మా మనసులో ఎప్పటినుండో నిప్పుకణికవలె మెరుస్తున్న మహదాలోచననే మాళవిక గ్రహించి వ్యక్తీకరించినది..భళా…జాయనా..,

జాయన : మహాప్రభూ..

గ.దే : ఎప్పుడైనా ప్రతిభాశీలి యొక్క  ప్రజ్ఞ స్వయంగా అతనికి పూర్తిగా తెలియదు. నీలోని బహుముఖ సమర్థత నీకంటే మాకే ఎక్కువ తెలియును. గత పదేళ్లుగా నాట్యాచార్య గుండనామాత్యుల వద్ద నీవు పొందుతున్న నృత్య శిక్షణ, మేము అప్పగించిన అనేక దండయాత్రల బాధ్యులను అద్భుతముగా నిర్వర్తించి మాకు సంప్రాప్తింపచేసిన విజయపరంపర..నీ వాద్య నిర్వహణ పద్ధతి…వీటన్నింటినీ మేము ప్రత్యేకముగా, సునిశితముగా ఎప్పటినుండో పరిశీలిస్తూనే ఉన్నాము…యిప్పుడిక ఒక స్ఫుట నిర్ణయానికొచ్చి నిన్ను ఆదేశిస్తున్నాము. భవిష్యత్తులో నీవు నీ సకల సృజనాత్మకశక్తులన్నింటినీ ప్రోదిచేసుకుని సరస్వతీ కటాక్షముతో మూడు ప్రధాన గ్రంథములను సృజియించవలె. అవి…’నృత్య రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ మరియు సకల యుద్దతంత్ర రహస్యాలను, వ్యూహాలనూ, సంపుటీకరించే ‘యుద్ధ రత్నావళి’…ఊఁ.. ఏమందువు జాయనా…

గుండ : యిది చక్రవర్తుల సముచితాదేశము…భళా.

మాళవిక : మహాచక్రవర్తుల ఈ ఆదేశముతో తెలుగునేల చతుర్వేదాల వంటి నాలుగు గ్రంథ రత్నాలతో కాంతివంతమై సంపన్నమవుతుంది మహాప్రభూ..

గ.ప : విన్నావు కదా జాయనా…బుధజన గుప్తాభిప్రాయము…మా అందరి ఆశీస్సులు నిరంతరం నీకుంటాయి. ఈ అపూర్వ గ్రంథాల రచనకు మా సంపూర్ణ సహకారం ఎల్లవేళలా నీకుంటుంది అంగీకరించి అడుగు ముందుకువేయి.

జాయన : మహాప్రసాదం మహాప్రభూ..నా జన్మ తరించినది. మీ అభిమానమునకు పాత్రుడనై, కాకతీయ సామ్రాజ్య బుధజన ఆశీస్సులను పొందగలిగి చరితార్థుడనైన నేను అవశ్యము మీ ఆదేశమును శిరసావహిస్తాను. నాకు కూడా ఈ విభిన్న రంగములందు సమగ్రాధ్యయనము నిర్వహించి నూతన ప్రమాణాల పరికల్పనలతో గ్రంథరచన చేయవలెననే ఉన్నది..తమరి ఆజ్ఞ.

గ.దే.: ప్రధాన అర్చకులుంగారూ.. ఏదీ.. ఆ రుద్రలింగంపై ఉన్న ఆ పూలమాలను మాకందించండి. (ప్ర.అ. లావుపాటి పూమాలను గ.దే. న కందిస్తాడు. గ.ప దేవుడు తన వేలికున్న వజ్రపుటుంగరాన్ని తీసి.)

గ.దే.: జాయనా… యిటురా.. (అని.. దగ్గరకువచ్చిన తర్వాత)..యిదిగో ఈ మా ఆదేశపాలన శుభసందర్భాన్ని పురస్కరించుకుని మా ‘వజ్రపు అంగుళీయ ప్రదానం’.. శివాశీస్సులకు చిహ్నంగా ఈ గులాబీపూమాల. విజయోస్తు.. శీఘ్రమే కలాన్ని కత్తివలె ఝళిపించి  అక్షరాలను కురిపించు.

(చుట్టూ  చప్పట్లు.. శంఖ ధ్వని.. మంగళారావములు.. ఎట్సెట్రా)

జాయన : ధన్యోస్మి ప్రభూ.. ధన్మోస్మి…

దృశ్యం : 4

 

(1240 సం||. జాయప వయస్సు 50 సం.. తామ్రపురి ఆస్థానం (యిప్పటి చేబ్రోలు).గణపతిదేవుడు తన యిద్దరు సతులతో సందర్శన..జాయపసేనాని రాజ్యము..)

వందిమాగధులు : మహారాజాధిరాజ.. మహామండలేశ్వర..పరమమహేశ్వర.. శ్రీ స్వయంభూనాథదేవ దివ్యపాద పద్మారాధక.. ప్రత్యక్ష ప్రమథగణావతార.. లాడచోటకటక చూరకార.. శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి.. జయహో..విజయహో…

(గణపతి దేవుడు పేరాంబ, నారాంబలతో సహా అంతఃపుర ప్రవేశం.. జాయపసేనాని సకుటుంబంగా.. ఎదురొచ్చి బావగారిని ఆలింగనము చేసుకుని.. ప్రసన్న వదనంతో..)

జాయన : మహాచక్రవర్తలకు మా హృదయపూర్వక స్వాగతము.. బావగారూ, కాకతీయ మహాసామ్రాజ్యంలో ఎల్లరూ సుఖులే కదా.. రాజపరివార, మహామంత్రిగణ, సకలసైన్య వీరసమూహాలూ, ప్రజాశ్రేణులన్నీ సౌఖ్యంగా వర్థిల్లుతున్నాయిగదా..,

గ.దే.: ఎల్లరూ సుఖులే జాయపసేనానీ.. వైరి గోధూమ ఘరట్టా.. మా మహామాత్యులూ, దండనాధులూ, సకలసేనాధిపతిలూ, శ్రీమన్మహాసామంత నామిరెడ్డీ.. నీ స్థానంలో నియమితులైన గజసాహిణి బొల్లమరాజూ..మీదుమిక్కిలి మా సువిశాల కాకతీ సామ్రాజ్యవాసులైన లక్షలమంది ప్రజాశ్రేణులన్నీ సౌభాగ్యముతో అలరారుతున్నాయి.

జాయన : ఈ రత్నఖచిత ఆసనాన్నధిష్టించండి మహాప్రభూ. సోదరీ పేరాంబా, నారాంబా.. అంతా క్షేమమేకదా.., సుఖాసీనులుకండి.

గ.దే.: దాదాపు ఇరవది ఐదు సంవత్సరముల క్రితం రాజ్యవిస్తరణలో భాగంగా అనేక యుద్ధములను గెలుచు బాధ్యతను మీకప్పగించగా.. జాయపసేనానీ, యుద్ధతంత్ర విశారదుడవూ, సకలకళాప్రవీణుడవూ, తంత్ర విద్యా నిపుణుడవూ.. ప్రత్యేకించి గజసైన్య నిర్వహణా ధురీణుడవూ ఐన నీవు సాధించిన విజయముల పరంపర తర్వాత మేము నిన్ను ఈ తామ్రపురికి సామంతులను చేసి పట్టముగట్టితిమి. మీరుకూడా ప్రజా సుభిక్షముగా పరిపాలను నొనరిస్తూ ఉత్తర రాజ్య నాయకుడగు ఇందులూరి సోమమంత్రినీ, రాచెర్ల రుద్రసేనాపతినీ తోడుగా చేసుకుని గజసైన్యమధికముగా గల కళింగ రాజులనోడించి కాకతీయ మహాసామ్రాజ్య పరిధిని అటు కళింగమునుండి యిటు నెల్లూరు వరకు విస్తరించి మాకు మహానందమును కల్గించితివి. ఈ మహాముదమును నీతో పంచుకొనుటకే యిప్పుడు నీవద్దకు మీ సోదరీమణులతో సహా మా రాక. కొద్దిరోజులు నీ అతిథిగా మేము విశ్రమించెదము.

జాయన : మహాభాగ్యము.. గణపతిదేవులకు ఆతిథ్యమొసగుటకంటే, మా  తోబుట్టువులైన పట్టపురాణుల సమక్షములో గడుపుటకంటే మాకు కృతార్థమేమున్నది.

గణ.దే.: జాయపా.. ఈ డెబ్బదిఏండ్ల సుదీర్ఘ జీవితకాలమంతయూ యుద్ధతంత్రములందూ, రాజ్యవిస్తరణయందూ, ప్రజాహితపాలనా ప్రణాళికా రచనయందూ, రక్షణ తంత్రములందూ అహర్నిశలూ శ్రమించి శ్రమించి అలిసితిమి. యిక మా మనము కించిత్తు విశ్రాంతిని కాంక్షిస్తున్నది.. వినోద, సంగీత, సాహిత్య, కళాత్మకరంగాలలో ఏదో చేయవలయునను కోరికా బలీయమౌతున్నది.

జాయప భార్య : అగ్రజులు.. గణపతిదేవులుంగారు మా వదినలను తోడ్కొని మా నేలను పావనం చేయడమే మా అదృష్టము.. రసహృదయులైన మీ బావమరిది జాయపసేనాని యిప్పటికే ఎంతో మగ్నతతో గ్రంథరచన చేస్తూనే ఉన్నారు. మీరు సాలోచనగా ఆ పుటలను అవలోకించవచ్చును.

 

గ.దే : అహాఁ.. ఎంత సంతోషము.. సోదరీ.. ఏమేమి సృజన చేసియున్నాడు జాయన.. చూడు.. ఎంత నిశ్శబ్దముగా గోప్యము నటిస్తున్నాడో.

జాయన : ప్రభువుల వద్ద గోప్యమేమున్నది.. మీరు అప్పగించిన పనినే చేయుచు ప్రత్యేకముగా మీముందు విశేషముగా నుడువుటకేమున్నది..,

గ.దే : అత్యంత విశేషమైనది కానిది మా జాయన అక్షరసృజన చేయడుకదా. ఆ విషయం మాకు తెలుసు.. వివరాలు తెలియజేయుము జాయపా.,

జాయన : మీరు ఆదేశించిన విధముగానే భరతముని ‘నాట్యశాస్త్రము’ లోని సకలశాస్త్ర సమ్మతములైన ‘మార్గ’ నృత్య పద్ధతులను సమగ్రపర్చి నాలుగాధ్యాయములు ‘నృత్తరత్నావళి’ పేర రచించడము పూర్తయినది మహారాజా.. యిక మన..అంటే ప్రధానముగా కాకతీయ సామ్రాజ్య పర్యంత ప్రజాజీవనములో జీవభరితమై ఒప్పుతున్న జానపద, ఆదిమ, గిరిజన, సామాన్య పల్లెప్రజల దేశీ నాట్యరీతులను సంపూర్ణముగా అధ్యయనము చేసి మరో నాలుగు అధ్యాయముల సృజన కొనసాగుతున్నది.

గ.దే.: మాకు కూడా.. ప్రజారంజకమైన ప్రజానాట్యరీతులను ప్రామాణికపర్చవలెనను అభిలాషయున్నది ..కొనసాగింపుము.. ఐతే, మొత్తము ఎనిమిది ప్రకరణములతో ‘నృత్త రత్నావళి’ సంపూర్ణమగునా.?

జాయన : ఔను మహాప్రభూ.. ఇరువది మూడు దేశిస్థానములతో శివారాధకులైన మన ప్రాంత ప్రజల ఉద్దీప్తమూ, ఉత్తేజకరమూ, వీర రౌద్ర రస ప్రధానముగా ఐన ‘ప్రేరణి’ అనే ఒక అతినూతన నృత్త రీతినీ, శివతాండవ తురీయస్థితినీ చాటిచెప్పగల ‘శృంగ నర్తనము’ నొకదానిని సృష్టిస్తున్నాను.

గ.దే : (సంతోషముతో చప్పట్లు చరుచును..) భళా జాయనా భళా.. మేమీ సమాచారము విని కేవలం ఆనందించడమేకాక ముదముతో పొంగిపోవుచున్నాము. శివానుగ్రహ ప్రాప్తిరస్తు.. ఔనూ.. రేచర్ల రుద్రదేవుడు గత రెండు దశాబ్దాలుగా పాలంపేట అను ప్రాంతంలో మహోత్తమ స్థపతి, శిల్పాచార్యులు రామప్పతో ఒక రుద్రాలయమును నిర్మిస్తున్న విషయం తెలుసుకదా. మనమే దానికి సకల నిధులనూ, సదుపాయములనూ, పోషణనూ కల్పిస్తున్నాము.. ఒకసారి నీవు పాలంపేట సందర్శించి నృత్యశాస్త్రము కొరకు సంభావిస్తున్న దేశీ నృత్య భంగిమలను ఎందుకు దేవాలయాలంకారములుగా స్థాపించకూడదు. మన రాజనర్తకి మాళవికా, రేచర్లరుద్రుని స్థానిక నర్తకి కేశికీ నీకు సహకరిస్తారు కదా..

జాయన : మహాప్రసాదం.. తప్పనిసరిగా ఆ విధముగనే చేసెదను.. నేనూహించిన దేశీ నృత్య భంగిమలతో రూపుదిద్దుకునే శిలాకృతులు అవశ్యము ఆ రుద్రాలయశోభను యినుమడింపజేస్తాయి.

గ.దే.: శుభం.. తామ్రపురిని చేరు త్రోవలో ఓరుగల్లు నుండి.. తలగడదీవి, తామ్రపురి వరకు మీ తండ్రిగారి జ్ఞాపకార్థం నిర్మించిన ‘చోడేశ్వరాలయం’..దాని అనుబంధ తటాకము ‘చోడసముద్రము’.. అదేవిధముగా భీమేశ్వరాలయం, గణపేశ్వరాలయం.. ద్రాక్షారామాలయం…వాటి ప్రక్కనున్న చెరువులు.. ఆవిధముగా నూటా ఒక్కటి.. మీ నిర్మాణాలలో నివి చాలావరకు సందర్శించి సంతసించితిమి .. “ఆలయమూ, ప్రక్కనే ప్రజోపయోగకరమగు తటాకము” అన్న కాకతీయ సంస్కృతిని పాటిస్తున్నందుకు అభినందనలు జాయనా.. దేవుడు నిన్ను కరుణించుగాక..

జాయన : మా వేగులవారిద్వారా మీరు మాచే నిర్మితములైన ఆలయములనూ, సరస్సులనూ సందర్శించిన సమాచారము మాకున్నది. మీ ప్రశంసతో, అభినందనలతో నేను ఉత్తేజితుడనైనాను.. మహాచక్రవర్తీ.. మరి మనం..మధ్యాహ్న భోజన ఆరగింపునకు..,

గ.దే.: అవశ్యము.. అంతా ఆనందకరముగా నున్నది..

WEEK-5

 

దృశ్యం : 5

(1241 :పాలంపేట..రామప్ప దేవాలయ నిర్మాణథ.. ప్రాంగణం.. మహాశిల్పి రామప్ప, రేచర్ల రుద్రదేవుడు, జాయపసేనాని, రాజనర్తకి మాళవిక..రుద్రదేవుని ఆలయ నర్తకి కేశికి.. ఉన్నారు.. సందర్భం.. పీఠంవరకు.. అధిష్ఠానం.. చుట్టూ స్తంభాలు, అరుగులు.. వరకు నిర్మాణమై.. అలంకరణ, పై కప్పు విశేషాలపై చర్చ.. ప్రతిపాదనలు..)

(అప్పుడే ఏనుగు అంబారితో కూడిన అలంకృతపీఠంపై నుండి దిగుతున్న జాయపసేనానిని ఉద్ధేశించి..)

రే.రు.: తామ్రపురి రాజులు..మహా గజసాహిణి, వైరి గోధూమ ఘరట్ట, శ్రీశ్రీశ్రీ జాయపసేనానికి రేచర్ల రుద్రమదేవుని ప్రణామములు.. స్వాగతం.. సుస్వాగతం.,

జా.సే.: (దిగి..రుద్రదేవుని స్నేహపూర్వకముగా కౌగలించుకుని..) విజయోస్తు రుద్రదేవా..మీ రాజ్యమును సందర్శించడముతో మా జన్మ పావనమైనది. గణపతిదేవుల ఆజ్ఞమేరకు.. మీరు ఒక జీవితకాల లక్ష్యంతో, శివాజ్ఞకు బద్ధులై నిర్వహిస్తున్న ఈ బృహత్‌ రుద్రేశ్వరాలయ నిర్మాణమునకు అదనపు సొబగులను అద్దడానికి, నాట్యశాస్త్ర సంబంధ వన్నెలు కూర్చడానికి మేమిక్కడికి..,

రే.రు.: మాకు సమాచారమున్నది సేనానీ.., రండి.. భావితరాలను మంత్రముగ్ధుల్ని చేయగల ఈ మహాశివాలయ నిర్మాణాన్ని మరింత జీవవంతం చేయడానికి విచ్చేసిన మీకు స్వాగతం.. యిదిగో వీరి పరిచము.. వీరు ఈ ఆలయ ప్రధానకర్త.. మహాశిల్పి రామప్ప.. అపరబ్రహ్మ.. రాతిని మైనపు ముద్దవలె రూపింపజేసి, శిల్పించగల ప్రజ్ఞాశీలి.. మీ రాకకు ముందే యిక్కడికి చేరుకున్న ఈమె కాకతీయ సామ్రాజ్య రాజనర్తకి మాళవికాదేవి.. మా సంస్థానికి చెందిన మా స్థానిక రాజనర్తకి కేశికి… వీరు ఆలయ అర్చకులు.. సోమశివాచార్యులు ..(చుట్టూ చూపిస్తూ..) వీళ్ళందరూ ముప్పదిరెండుమంది సుశిక్షితులైన యువ శిల్పులు.

జా.సే.: మాళవికాదేవి మాకు ఇదివరకే తెలిసిన అతిసన్నిహిత విదుషీమణి. అందరికీ ప్రణామములు.. మీవంటి మహానుభావుల కలయికతో నేను కృతార్థుడైనాను.. రుద్రదేవా.. ఈ ఆలయనిర్మాణ ప్రధానాంశములు వివరించండి.

రు.దే.: మీరు తొలుత ఈ శిలాసనముపై ఆసీనులుకండి.. కేశికీ, వివరాలు తెలియజేయి.

కేశికి : ఇది తూర్పుముఖ శివాలయం. నల్లరాతి కురివెంద కఠినశిలలతో నిర్మితమౌతున్న ఈ శివాలయమునకు దగ్గర్లోనే మూడు ప్రకృతి సిద్ధమైన కొండలను ఆలంబనగా చేసుకుని ఎనిమిది చదరపుమైళ్ళ విస్తీర్ణములో ఒక ప్రజోపయోగ జలవనరుగా తటాక నిర్మాణం జరుగుతున్నది. ఇసుక ఆధారపీఠంగాగల ఎనిమిది అడుగుల పునాదిపై ఆరు అడుగుల ఎత్తున గర్భగుడిలో శిలాపీఠం ఏర్పాటు చేయబడి లోపల అధిష్టానంపై రెండున్నర అడుగుల పొడవు, అంతే వెడల్పుగల రుద్రేశ్వర లింగం ప్రతిష్టితమౌతున్నది. గర్భగుడికి ఎదురుగా..పశ్చిమాన మహాశిల్పి ప్రత్యేకంగా రూపొందించిన ఈ శివనంది ప్రత్యేకతేమిటంటే.. ఒక్కటి, ఎవరు ఈ నందిని ఎటునుండి వీక్షించినా అది ఆ వీక్షకుణ్ణే చూస్తున్న అనుభూతిని కల్గించడం.. రెండు..ముఖంపై తేలిన రక్తనాళాలు, ఒంటిపై ఆభరణాలు వీక్షకున్ని స్పర్శించకుండా ఉండలేనివిధంగా ముగ్ధుణ్ణి చేయడం..గర్భగుడి ముఖద్వారంవద్ద..లతాలంకృత స్తంభం.. లోహధ్వనులతో సరిగమలను పలికించడం…

జాయన : మహాశిల్పి రామప్పా.. వింటూంటే మేము పులకించిపోతున్నాము.

రామప్ప : ధన్యుణ్ణి మహాసేనానీ.. మీ కూర్పుతో ఈ ఆలయం యింకా శోభిస్తుందని మా ఆకాంక్ష.

జాయన : అవశ్యం.., యింకా,

రామప్ప : ఈ ఆలయ శిల్పం ప్రధానంగా మూడు రకాల శిల్పరీతుల సంగమం.. హోయసళుల, చాళుక్య, చోళ శిల్పవిధానాలను అనుకరిస్తూనే స్థానిక దేశీ జీవనరీతులనూ, మన సంస్కృతినీ మేళవించి ఒక అద్వితీయ సృష్టిని కొనసాగిస్తున్నాము.

జాయన : బాగున్నది.. నేను ప్రధానంగా గజసైన్యాధ్యకక్షుణ్ణి.. అందువల్ల పలు గజవిన్యాసాలనూ, గజశ్రేణులనూ చిత్రించి తెచ్చినాను.. అదీకాక నేను ప్రామాణికంగా రచిస్తున్న ‘నృత్త రత్నావళి’ గ్రంథంలో దేశీ నృత్యరీతులననుసరించి తయారుచేసిన దాదాపు ఇరవై చిత్తరువులను, చిత్రాలను నా పరివారంతో తెప్పించిన పేటికలలో కూర్చి తెచ్చినాను.. వీటిని శిల్పాలుగా చెక్కి ఈ ఆలయ గోపుర పరివేష్ఠితములుగా అమర్చినచో మహాలంకారముగా భాసించునని మా ఊహ..ప్రతీహారీ.. ఆ పేటికలను తెరవండి.,

 

(ఒక సైనికుడు.. ఒక పెద్ద పేటికను తెరుస్తాడు.)

రే.రు.: సైనికా.. యిటివ్వు.. తొందరగా చూడవలెననే ఉత్కంఠ..రామప్పా.. రండి..చూడండి .. ఈ చిత్రాలు.ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాయో. ఒక్కో చిత్రం ..కళ్ళముందు..ఆయా సుందరాంగనలు నిలబడ్డట్టుగానే తోచుచున్నది)

(రే-రుద్రుడు, రామప్ప, కేశికి..అలంకృతమై ఉన్న మాళవికాదేవీ.. చూస్తారు)

జా.సే.: ఉహు..ఆ విధముగా కాదు.. శిల్పిముందు ఈ ఒక్కో భంగిమను ప్రదర్శింపజేస్తాను..అప్పుడుగాని ఆ నృత్త ఆంగికము రూపుకట్టదు.. మాళవికాదేవీ, ఏదీ..సిద్ధపడు..

(జాయన..ఏడెనిమిది చిత్రాలున్న పటాలను చేతిలోకి తీసుకున్నాడు.. ఆహార్యం ధరించిన మాళవికాదేవి పైనున్న సన్నని తెరను తొలగించి..శిలా రంగస్థలిపై చేరి నిలబడింది సిద్ధంగా..)

జా.సే.: చతుర విన్యాసము.,

(మాళవిక..క్షణకాలంలో..మెరుపువలె కదిలి ఒక విశిష్ట భంగిమలో స్థాణువై నిలబడింది.

కర్తరీ నర్తనము (మాళవిక భంగిమ మారింది)    (ఇక్కడ భంగిమల మధ్య శ్రావ్యమైన మ్యూజిక్‌)

భ్రమరీ నర్తనము (మరో భంగిమ)

సువ్యాపక నర్తనము (ఇంకో భంగిమ)

దక్షిణ భ్రమణ నర్తనము (మరో భంగిమ.)

దండలాస్యము (ఇంకో భంగిమ)

నాగిని, (భంగిమ)

రామప్ప : జాయపసేనానీ.. అద్భుతము.. ఈ ఒక్కో రీతి, భంగిమ మా హృదయమును జయించింది. మీరన్నట్లు ఈ ఒక్కో శిల్పమును ఆలయ శిఖర చూరుకు ఒడ్డాణమువలె అమర్చినచో రంజకంగా ఉంటుంది. ఈ దేశీ నృత్తభంగిమలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

జా.సే.: మా అభిలాష కూడా అదే మహాశిల్పీ..యివిగాక యింకా ‘ప్రేరిణి’ అనే శివతాండవ శృంగనర్తనంలో భాగమైన వీరరసప్రధాన భంగిమలు కొన్ని ఈ పటాలలో ఉన్నాయి. వీక్షించండి..

(రామప్ప అందుకుంటాడు చిత్రాలను)

రామప్ప : ‘ ‘ప్రేరిణి’ నృత్యం గురించి చెప్పండి

జా.సే.: మహాశిల్పీ.. సుకుమారమై కేవలం స్త్రీలచేతన నర్తితమయ్యేది లాస్యము.. ఉద్ధతమైన అంగహారములతో వీర, రౌద్ర భావనలు ప్రధానముగా గలిగి పురుషుల చేతమాత్రమే నర్తించబడేది ‘తాండవము, శివతాండవము ప్రధానముగా ఏడు విధములు.. అవి శుద్ధ, దేశి, ప్రేరణ, ప్రేంఖణ, దండిక, కుండలి మరియు కలశ..ఈ భంగిమలన్నీ మన రుద్రేశ్వరాలయ కీలకస్థానాల్లో స్థాపించబడాలి.

రామప్ప : అవశ్యము ఆచార్యా.. అది అర్థవంతముకూడా.. రుద్రునిచుట్టూ శుద్ధ, పూర్ణ పురుష వీర భావనలు పరిఢవిల్లడం సృష్టి ప్రతిఫలనయేకదా..తప్పక ఆ ఆకృతులను తీర్చిదిద్దుదాం.,

రే.రు : జాయపా.. మీరు సంకల్పించిన ఈ ప్రతిపాదనలన్నీ శ్లాఘనీయమైనవి.. వీటిని యథాతథముగా ప్రతిష్టిద్దాం.

జా.సే.:  స్తంభములపై..ప్రాకారములపై..పై కప్పులపై..స్తంభ తలములపై.. వక్రములపై..రామాయణ, భాగవత.. మహాభారతాది ఇతిహాస ఘట్టాలను కూడా శోభింపజేద్దాం రుద్రదేవా..

రే.రు.: అవశ్యము..తప్పక.. మీరు మా ఆతిధ్యమును స్వీకరించుటకు వేళయ్యింది. భోజనానంతరము తటాక నిర్మాణ ప్రాంతమును సందర్శిద్దాం.. జాయపసేనానీ ఈ పక్షము రోజులు యిక్కడే మాతో, రామప్ప మహాశిల్పితో గడిపి మాకు మార్గదర్శనం కావించండి…

జా.సే : మీ ఆతిథ్యం మాకూ అంగీకారమే. యిక్కడ కొద్దిరోజులుండి గణపతి దేవులను కూడా సందర్శించుకుని మా తామ్రపురికేగుతాం.,

దృశ్యం  : 6

(1254వ సం||. జాయప వయస్సు 60 సం||లు.. రామప్ప దేవాలయ ప్రాంగణం.. దేవాలయ ప్రదేశమంతా, సహస్ర దీపాలంకరణతో తేజోవంతమై కాంతిమయంగా, దేదీప్యమానమై ఉంది. రుద్రేశ్వర గర్భగుడి ఎదుట.. రాతి సింహాసనంపై గణపతి దేవుడు..ప్రక్కన  రాణులు.. మరో ఆసనంపై జాయపసేనాని, రేచర్ల రుద్రదేవుడు.. అటువేపు రామప్ప అతని యిద్దరు శిష్యులు.. వెనుక.. రాజనర్తకి మాళవికాదేవి.. కేశిక.. యితర పురప్రముఖులు దండనాయకుల..కోలాహలం..

సందర్భం.. ‘నృత్త రత్నావళి’ గ్రంథావిష్కరణ.. దేవాలయమునకు ‘రామప్ప’ నామప్రతిష్ట..

(రుద్రాభిషేక స్తుతి.. జమకం.. మంగళకర ధ్వని.. మంత్రఘోష..ఘంటలు క్రమంగా..తగ్గుతూండగా..)

ప్రధానార్చకులు సోమాచార్యులు : (శివలింగ సన్నిధి నుండి నృత్తరత్నావళి గ్రంథం ఉన్న పట్టువస్త్రపు మూటను తీసుకొని వచ్చి.. గణపతిదేవుని చేతుల్లో ఉంచి.. నమస్కరించి..) ఈశ్వర  ప్రసాదంగా ఈ మహత్తర కృతి.. భవిష్యత్‌ తరాలూ.. దాక్షిణాత్యులూ గర్వించదగ్గ నాట్యశాస్త్ర ప్రామాణిక గ్రంథం, జాయపసేనాని కృత ‘నృత్తరత్నావళి’ని తమ అమృతహస్తాలతో స్వీకరించండి మహారాజా.

గ.దే.: మహాప్రసాదము.. ఈ గ్రంథమును స్పర్శించిన మా యొల్లము పులకించుచున్నది.. ఎపుడో దాదాపు ముప్పది సంవత్సరముల నాడు ప్రజ్ఞాశాలియైన జాయనను మేము ‘నృత్యము’తో సహా వాద్య, యుద్ధ విద్యలపై ప్రామాణిక గ్రంథములను రచించి ఈ లోకమునకందించమని ఆదేశించియుంటిమి. యిన్నాళ్ళకు మా స్వప్నము సాకారమైనది. జాయపసేనానికి మేము మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ..ఈరోజు నిర్వహించ తలపెట్టిన రెండు ప్రధాన కార్యాక్రమములు వివరములను రేచర్ల రుద్రదేవులను ప్రకటించవలసినదిగా అభ్యర్థిస్తున్నాము.

రే.రు.: చిత్తము మహాప్రభూ.. మనందరము ఆసీనులమై ఉన్న ఈ రుద్రేశ్వరాలయమును ఆమూలాగ్రం ఊహించి, రూపొందించి, శిల్పించి.. వన్నెలద్ది..భావితరాలకు అందించినవాడు మహాశిల్పి రామప్ప.. కాబట్టి యింతవరకు ఎక్కడా ఒక శిల్పినామముపై లేనివిధముగా ఈ దేవాలయమునకు ‘రామప్ప దేవాలయము’గా నామకరణం చేయవలసిందిగా మహాచక్రవర్తి శ్రీశ్రీశ్రీ గణపతి దేవులను ప్రార్థిస్తున్నాను.

గ.దే.: తథాస్తు.. భవిష్యత్తులో ఈ శివాలయం సురుచిరమై ‘రామప్ప దేవాలయం’ గా ప్రసిద్ధి పొందుగాక.. మహాశిల్పీ రామప్పా.. నీ జీవితం చరితార్థమైనది.. మీకు మా అభినందనలు.

రామప్ప : ధన్యోస్మి ప్రభూ.. ధన్యోస్మి.

రే.రు.: యిక.. భరతముని రచించిన ‘నాట్యశాస్త్ర’ సకల మార్గపద్ధతులను ఆంధ్రీకరించి, కాకతీయ సామ్రాజ్య స్థానీయ ప్రజానాట్య రీతులను కూడా థాబ్దాలుగా అధ్యయనము చేసి ‘దేశీ’ నృత్యపద్ధతులుగా గ్రంధస్థం చేసిన సకల కళాకోవిదులు శ్రీశ్రీశ్రీ జాయపసేనాని. ఈ దేశీ రీతులలో ప్రపంచ నాట్యచరిత్రలో ఎక్కడాలేని.. మగవారిలోని మగటిమినీ, పురుషుల్లోని పురుషత్వాన్నీ, వీరునిలోని వీరత్వాన్నీ సమ్మిళితం చేసి రుద్ర  ప్రేరణగా రూపొందించి అందిస్తున్న శృంగనర్తనం, శివతాండవం ‘ప్రేరణి’. ప్రేరణి నృత్యాన్ని ఒక బృందముగా పది, ఇరవై..నలభై మంది నర్తకులతో సామూహిక వీరనర్తనముగా ప్రదర్శించడం సముచితం. నిజానికి యిది బృంద నర్తనము. ఈ ప్రేరణి నృత్యాన్ని మన ఆస్థాన నర్తకుడు మల్లయనాథుడు గ్రంథకర్త జాయపసేనాని ప్రవేశిక తర్వాత ప్రదర్శిస్తారు..

(చప్పట్లు..మంగళ ధ్వనులు..)

జాయప : మహాచక్రవర్తులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులకు, సభాసదులైన బుధజనులందరికీ ప్రణామములు. ఏదేని ఒక విషయముపై సాధికారమైన అధ్యయనం జరుపనిది సృజనచేయడం భావ్యముకాదని తలంచి భారతీయ నాట్యశాస్త్రాలన్నింటినీ సంపూర్ణముగా పరిశోధించి ముప్పయ్యేళ్ళ కాలము సాగించిన సుదీర్ఘ కృషి ఫలితమే ఈ ‘నృత్తరత్నావళి’ గ్రంథము. యిక ‘ప్రేరణి’ అనే నామముతో ‘నృత్తరత్నావళి’ గ్రంథంలో ప్రస్తుతించబడినది పూర్తిగా నా స్వీయ సృష్టి. యిది గేయ ప్రాధాన్యంగల నర్తనం కాదు. వాద్య ప్రాధాన్యతగల నర్తనం. యుద్ధసన్నద్ధత కోసం వీరరస ప్రధాన ప్రేరక ఉత్సవాలలోనూ, ఆత్మశక్తిని తెలుసుకోవడం కోసం స్వయంచాలన లక్ష్యంగా రూపొందించబడ్డ పురుష నర్తనం ‘ప్రేరణి’. మార్ధంగికులు మహామద్దెలపై తన్నారకం, తత్కారం, తహనాలు, యతులు, గతులు, జతులు ‘భాం’కార ధ్వనితో పలికిస్తూంటే..నందిమద్దెల, ఉడుక్కు, కంచుతాళ మేళనతో నాదం గాంభీర్యమౌతూండగా రుద్రస్వరూపుడైన నర్తకుడు అంగ, ప్రత్యంగ, ఉపాంగాల సంచలనాల ద్వారా పరమశివుని తాండవకేళిని మన అనుభవంలోకి తీసుకురాగల మహారౌద్రానుభూతి యిది.. వినండి.. వీక్షించండి..,

 

(శబ్దం.. భాంకార ధ్వని.. పేరిణి..సిడి ఒకటుంది .. దాంట్లో పది ట్రాక్స్‌ ఉన్నై.. మొత్తం 3.5 ని||లు బిట్స్‌ బిట్స్ గా వేయాలి)

 

….ముగింపులో

గ.దే.: జాయపసేనాపతీ..మేము ఈ పంచముఖ శబ్ద ప్రపంచంలో ఓలలాడి మైమరిచి, లీనమై రుద్రున్ని మా మనోమయ లోకంలో దర్శించుకున్నాము. దీనిని సృజించి నీ జన్మను చరితార్థం చేసుకున్నావు.. ఏదీ..ఒక్కసారి మా బాహువుల్లో ఒదిగి మమ్మల్ని సంభావించు.

జా.సే: ధన్యుణ్ణి ప్రభూ.. ధన్యుణ్ణి.. మీరన్నట్లు నేను శివకృపతో, మీ అనురాగ స్పర్శతో తరించిపోయినాను.. ఆచంద్రార్కం ఈ నృత్తరత్నాళి కృతి శాశ్వతమై నిలుస్తుంది.. ధన్యోస్మి…

(ప్రేరణి నృత్యము కొనసాగుతూంటుంది.. ఆలయ ఘంటలు.. మంగళధ్వని.. సంతోష సంకేత కోలాహలం)

 -రామాచంద్ర మౌళి

Ramachandramouli 

మీ మాటలు

  1. written in a unique style–very different from the regular–it’s an experience going through the script of what i heard! this is reflective of the versatility at its best of shree raamaa chandramouli whom i have known more as a poet…wish there would be more such attempts… regards, indira

  2. DrPBDVPrasad says:

    చారిత్రక నేపథ్యంతో నవల నాటకం రాయడం అసిధారావ్రతం.సంగీత సాహిత్య నృత్య శిల్ప కళాంశాల సంబంధితమైన వస్తువుని గ్రహించి ,ఊహాపటిమను జోడించి అద్భతంగా రాశారు. వరంగల్ వాసులుగా కాకతీయ పతాకాన్ని రెపరెప లాడించారు. విజయబాపినీడు గారి విజయ పత్రికలో కూడ మీరిటువంటి రచన చేసినట్లు ఙ్ఞాపకం(20-25 సంవత్సరాల క్రితం)రుద్రమ దేవి సినిమా వస్తున్న పూర్వ రంగంలో ఈ రచన ఇంక కొంత సమగ్రంగా ఉంటే బాగుండేదేమో!!!?( గతంలో రాగమయి , రామప్ప కావ్యాలు సప్తపర్ణి నవల ఇంకా ఒకట్రోండు రచనలు కాకతీయ నేపథ్యమే. మీ కివే అభినందన వందనాలు
    మీ కాం.నెం. ఇవ్వగలరు
    నమస్సులతో
    డా।।ప్రసాద్

మీ మాటలు

*