హింసకీ అపకారానికీ మధ్య నడిచే కథ- వధ

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

“మంచి కథ” అంటే ఏమిటనే విషయం మీద పుంఖాను పుంఖాల చర్చలు విన్నాం, చదివాం. కానీ ఏదో ఒక నిర్ధారణకి రావడం కష్టమే. వ్యక్తిగతంగా నాకు చాలా చర్చలు అర్థం కూడా కావు. దేన్ని మంచి కథ అని అనడానికి వీలవుతుందో అన్న విషయం మీద ఏకాభిప్రాయానికి రావడం కూడా కష్టమే. అయితే ఒకటి మాత్రం అందరమూ ఒప్పుకోక తప్పదు.

కథ చదివి పక్కన పెట్టిన తరవాత కూడా పాఠకుడు దాన్ని గురించి ఆలోచించగలిగితే, ఆ కథలో చర్చకు పెట్టిన విషయాలని నిజ జీవితంలో జరిగే అనేకానేక సంఘటనలకీ, చుట్టూ నడుస్తున్న చరిత్రకీ అన్వయించుకోగలిగితే, అది నిస్సందేహంగా గొప్ప కథ. చెప్పిన విషయం abstract గా వుంటూనే, మన బ్రతుకుల్లోని నిజాలని టార్చి లైటు వేసి మన ముందు నిలబెట్టగలిగితే, ఆ అనుభూతి ఎన్నటికీ మనలని వదిలి పోదు. ఎన్ని సార్లు ఆ కథ చదివినా మనం లోతుగా, లోలోతుగా ఆలోచనలని ఆస్వాదిస్తూనే వుంటాము. మరందుకే కదా సాహిత్యం ఆలోచనామృతమయింది.

1956-67 మధ్య కారా మాస్టారు అయిదు కథలు రాసారు. (తీర్పు, ఇల్లు, వధ, యఙ్ఞం, మహదాశీర్వచనం) సంఖ్యాపరంగా చూస్తే పదకొండేళ్ళల్లో అయిదేనా అనిపించినా, కథలన్నీ వేటికవే ప్రపంచ సాహిత్యంలోని ఆణి ముత్యాల్లో నిలబడ్డ కథలు. ఆ అయిదిటిలో యఙ్ఞం కథ (1964) అన్నిటికంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆ తరవాత సంవత్సరం ఆయన “వధ” రాసారు. అయిదింటిల్లోనూ మనుషుల మధ్య వుండే సంబంధాల్లో లీలగా గోచరమయ్యే ‘ హింస ‘ ఏక సూత్రంగా కనబడుతుంది. మన జీవితాల్లో ఇంత హింస నిండి వుందన్న సంగతి మనకి తెలిసీ వుండకపోవచ్చు, తెలిసినా ఒక రకమైన నిర్లిప్తతతో దాన్ని భరిస్తూ వుండి వుండవచ్చు. ఈ హింసనే బట్టలిప్పి మనముందు నగ్నంగా నిలబెట్టి దాని గురించి ఆలోచించమని మనని సవాలు చేస్తాయి ఈ కథలు.

‘హింస ‘ శారీరకమైనదైనా, మానసికమైనదైనా, ఒకటే! మనిషిని బ్రతుకు కష్టపెట్టినప్పుడు సంఘర్షణ అవుతుంది, పక్క మనిషే కష్టపెట్టినప్పుడు అది హింస అవుతుంది. హింస గురించీ, హింసకి మన ప్రతిచర్యల గురించీ ఆలోచించక తప్పని దశలో వున్నాం మనం!

అసలు పన్నెండు పేజీల “వధ” లోని కథ మనకి తెలియనిదేమీ కాదు. కథంతా ఒక్కటే సంఘటన! తండ్రి ఆనతి తలదాల్చు తనయుడూ, ధర్మ స్వరూపుడూ అయిన రాముడు ఋష్యమూక పర్వతం వద్ద వాలి సుగ్రీవుల యుధ్ధం చూస్తూ ఆలోచిస్తున్నాడు. చెట్టు చాటునుంచి వాలిని చంపడాన్ని ఆయన అంతరాత్మ ఎంత మాత్రమూ సమర్ధించలేకపోతూ వున్నది. అప్పుడాయన ‘ తాను ఏం చేయడమా ‘ అన్న ధర్మ సంకటాన్ని పక్కన పెట్టి ‘వాలి ఏం చేస్తున్నాడూ ‘ అన్న విషయం గురించి ఆలోచించి, వాలి వధకు పూనుకున్నాడు.

రామాయణం లోని కథలకి ఎన్నో వ్యాఖ్యానాలూ, ఉపాఖ్యానాలూ వున్నాయి. స్థూలంగా వింటే ఇదేదో ‘రాముణ్ణి సమర్ధించే కథ కాబోలు ‘ అని అనిపించొచ్చు.

కానీ, లోతుగా చూస్తే, సున్నిత మనస్కుడైన మనిషికీ తప్పొప్పుల విచక్షణ చేయగలిగే మనిషికీ, అందులోనూ బలవంతుడైన వీరుడికీ, అడుగడుగునా ఎదురయ్యే ధర్మ సంకటాలు కనిపిస్తాయి. ఆలోచించనా శక్తీ, భుజబలమూ వున్న మనిషి చేయక తప్పని బాలన్స్ వాక్ అది.

పైకి చూస్తే వాలి సుగ్గ్రీవులది అన్న దమ్ముల కొట్లాట. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదు. కానీ, నిజంగా అంతేనా? తెలిసో తెలియకో తమ్ముడు సుగ్రీవుడు అన్న పట్ల అపచారం చేసాడు. అప్పుడు వాలి ముందు మూడు దారులున్నాయి. తమ్ముణ్ణి మన్నించి అక్కున జేర్చుకోవడం. లేదా తమ్ముణ్ణి ఆ చుట్టు పక్కల లేకుండా వెళ్ళ గొట్టడం, లేదా అతన్ని హత మార్చడం. కానీ, వాలీ ఈ మూడు దారుల్లో వేటినీ ఎన్నుకోలేదు. తమ్ముడి భార్య రుమను చెరపట్టి, సుగ్రీవుడు ఆ చుట్టు పక్కల నుండి పారిపోకుండా చేసాడు. భార్య పరాయి చెరలో వుందన్న రోషంతో సుగ్రీవుడు తనతో తలపడకా మానడు, ఒళ్ళు హూనం చేసుకోకా మానడు. ఈ మానసిక శారీరక హింసలో సుగ్రీవుడు అలిసిపోతూంటే ఆనందిస్తున్నాడు వాలి.

జంతువు ఆకలేసినప్పుడో భయపడ్డప్పుడో తోటి జంతువుని చంపుతుంది. అది అపకారం. ఆలోచనాశక్తి వున్న మానవుడు మాత్రమే తోటి ప్రాణిని చావుకీ బ్రతుక్కీ మధ్య వేలాడదీసి ఆనందించగలడు. అది హింస. బలహీనుణ్ణి బలవంతుడు హింసిస్తూంటే మిగతావారికి ఆ బలహీనుడి పక్షం వహించక తప్పదు. అప్పుడు ధర్మాధర్మ విచక్షణ కూడా పక్కన పెట్టకా తప్పదు. అలా ధర్మా ధర్మ విచకషణ పక్కన పెట్టి దుష్టుణ్ణి శిక్షించకపోవడమే ధర్మాత్రిక్రమణమవుతుందని రాముడు మరణించబోయే వాలితో అంటాడు.

సాంఘిక పరిణామంలో మనం మనిషి మనిషికి అపకారం చేయకుండా కట్టుదిట్టాలు చేసుకున్నాం, కానీ హింసించకుండా పెద్ద ఏర్పాట్లు చేసుకున్నట్టు అనిపించదు. ఇది ఆలోచించాల్సిన విషయం.

వస్తువు తో పాటు సమానమైన గాంభీర్యాన్నీ, గాఢతనీ కథనం సంతరించుకుందీ కథలో. సాధారణంగా కథల్లో వర్ణనలకెక్కువ చోటూ వుండదు. కథలో వర్ణనలు చేయదల్చుకుంటే దానికి తగినంత కారణం వుండాలి. ఈ కథలో మొదటి రెండు పేజీలూ అరణ్యాన్ని వర్ణించడానికే కేటాయించారు మాస్టారు. అయితే, ఆ వర్ణన ప్రపంచంలో వున్న జంతు న్యాయానికి ప్రతీకగా నిలిచి  పైన పచ్చగా అందంగా వున్నా, లోపల భయంకరమైన హింసాకాండ జరుగుతుందన్న విషయాన్ని సూచిస్తుంది.

అరణ్యంలో మూలనో ఒక్క మూలన ఎప్పుడూ కార్చిచ్చు రగులుతూనే వుంటుంది. అయినా తక్కిన అరణ్యమంతా తనకు పట్టనట్టు పచ్చగా కళకళ లాడుతూ చూపరులకు సృష్టి కర్త వైచిత్రి చాటుతూ వుంటుంది. అదే దానిలోని సొబగు…”

అన్న వాక్యాలు కాలానికతీతంగా మానవ సంఘానికి దర్పణం పడుతున్నాయంటే కాదనగలమా? వాలి సుగ్రీవుల వైషమ్యమూ, యుధ్ధరీతీ, రాముని మీమాంసా, నిర్ణయమూ ప్రతిదీ అలా అలా స్పృషిస్తున్నట్టే వున్నాయి, కానీ చాలా స్పష్టంగా వున్నాయి. అది కథనం లో ఆయనకున్న నైపుణ్యమూ, ఆయన గొప్ప హృదయ సౌందర్యమూ తప్ప ఇంకేమీ కాదు.

తన అంతరాత్మ చేస్తున్న మందలింపులనీ, చికాకునీ పక్కన పెట్టిన రాముడు చూసింది, వాలిలో మూర్తీభవించిన క్రౌర్యం, దౌష్ట్యం, మదాంధత గర్వం“, విన్నది “సుగ్రీవుని కంఠంలో అణచి వేయబడుతున్న ఆర్తనాదం“. అంతరాత్మనీ  ధర్మ పన్నాలనీ పక్కన పెట్టి బాణం వేసి వాలిని నేల కూల్చమని రాముడికి మనమే సలహా ఇవ్వమా?

లోకంలో దుష్టులందరూ యిలానే తాము చేయబోయే దౌష్ట్యానికి నేపథ్యం సృష్టిస్తారా,” అని కలవరపడ్డ రాముడినీ, తన తమ్ముడు లక్ష్మణుని ఆపాద మస్తకమూ చూసి, తన తమ్ములెప్పుడూ సుగ్రీవులు కారు. తానెన్నటికీ వాలి కానేరడు ‘ అని తలపోసిన ధర్మమూర్తి రాముడినీ నిలబెట్టి, నేటి సమాజానికి ఎటువంటి ఆదర్శమూర్తుల ఆవశ్యకత వుందో తెలియజేసిన కథ- ‘వధ ‘.

 -శారద

శారద

శారద

 

శారద ఆస్ట్రేలియాలో ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నారు. అడిలైడ్ నగరంలో నివాసం. శారదగారు రాసిన యాభై కధలతో ‘నీలాంబరి’ కధ సంపుటికి గత సంవత్సరం ఆవిష్కారం జరిగింది. శారదకు కుటుంబరావు, తిలక్ ఆంగ్లంలో చెహోవ్, సోమర్ సెట్ మాం ఇష్టం. ఇంకా ఈ మధ్య రాస్తున్న వారిలో చాలా మంది బాగా రాస్తున్నారని అన్నారు. కథా రచనలో మెలకువలని నేర్చుకోవడానికీ, ఆలోచనలని స్పష్టం చేసుకోవడానికీ, జీవితాన్నీ, సాహిత్యాన్నీ మధించడం తప్ప వేరే మార్గం లేదని శారద  అభిప్రాయం. శారద బ్లాగ్ www.sbmurali2007.wordpress.com.

వచ్చే వారం: పాలపర్తి జ్యోతిష్మతి ‘రాగమయి’ కధ గురించిన పరిచయం 

‘వధ’ కథ ఇక్కడ:

మీ మాటలు

*