గుర్తుందా?

పెరట్లో నందివర్ధనం చెట్టు ప్రక్కన
నా ఎదురుగా నిలబడిన నువ్వు
నీ మొహాన కొంటెదనం కలగలిసిన
పెదాలు విచ్చని ఓ చిరు నవ్వు
నా కళ్ళలోనికి మాత్రమే చూస్తూ 
నీ పయోధరాల కోమలత్వానికి హత్తుకుంటూ 
నా చేయిని నొక్కి పట్టిన నీ చెయ్యి
నాకు మాత్రమే వినబడేంత మంద్రంగా
నీకే వినిపించనంత లలితంగా …
మెల్లగా ముందుకు వంగి
నా చెవిలో నీ పెదాలతో
యేమని వేణుగానం ఊదావు?
 
నువ్వో సగం నేనో సగం 
అన్లేదూ?
 
గాలి తన అలికిడిని, అల్లరిని ప్రక్కకు పెట్టి 
కళ్ళు, పెదవుల ఉనికిని లెక్క చేయకుండా
తమకంతో చేసుకుంటున్న మూగ బాసల సాక్ష్యాన్ని
ఎలాగైనా సరే నమోదు చెయ్యాల్సిందే అని నిశ్చలంగా
ఎదురు చూపులు చూస్తున్న వేళ …
 
జరిగింది నాకు తెలిసే లోపే
తటాలున నా చెయ్యి వదిలి
రెండు చేతుల్తోనూ నన్ను పెనవేస్తూ
నాతో పాటు చుట్టూరా వున్నా చెట్టూ చేమల్నీ,
కలం విదుల్చుకుంటూ దొంగ చూపులు 
చూస్తున్న వాయు దేవుడ్ని,
నిశ్చేష్టుల్ని చేస్తూ   
ఘాడంగా
అమృత మధనాన్ని అర క్షణం లో 
జ్ఞప్తికి తెస్తూ
చేసిన మోహినీ చుంబనం …
 
ఆలంబన లేక తొట్రుపడిన నా తనువుకు
నీ లేత తనువు ఆలంబనను 
అప్పటికప్పుడే అరువిస్తూ …
 
గుర్తుందా ???
 
ఎన్నేళ్ళు గడిచింది కాలం ???
ఒంటరితనం ప్రతిధ్వనిస్తూనే వుంది నీ వెచ్చని తలపు …
 
 
లీలగా, కల చెదురుతూ వినబడింది ‘తాతయ్యా’ అంటూ 
మళ్ళీ మనవరాలిగా తిరిగి వచ్చి, 
నువ్వు చెవిలో ఊదిన పిలుపు …
కంటి మసకను భుజాలకు అద్దుకుంటూ
చేతుల్లోకి తీసుకున్నాను …
నిన్ను … నా మనవరాల్ని …
అచ్చం నువ్వు నన్ను పొదువుకున్నట్లుగానే …

-ఎన్ ఎం రావ్ బండి
bsr

మీ మాటలు

  1. ఎందుకో ఈ కవిత చదువుతూ ఉంటె, గత వర్తమానాలను తట్టి పిలుస్తున్న భవిష్యతు కనిపించింది. ప్రతివాళ్ళు తమలోకి తాము చూసుకునే లాగ ఉంది. గుర్తుందా అంటూ గుర్తు చేస్తున్నట్టు, మనసు పొరల్లోకి తడుతున్నట్టు అనిపించింది.
    ఒక మంచి ప్రయత్నం చేసిన రచయితకి అభినందనలు.

మీ మాటలు

*