ఎప్పుడు చూసినా నిత్యనూతన నయాగరా!

     ఈమధ్య ఇండియా నించీ మాకు చుట్టాలొచ్చారు. మా తమ్ముళ్ళిద్దరు, మేనకోడలు, వాళ్ళ కుటుంబాలు. అట్లాంటాలోని మా మేనల్లుడితో సహా, మొత్తం పన్నెండు మందిమి, ఒక వాన్ తీసుకుని మా యాత్రా స్పెషల్ మొదలుపెట్టాం. అట్లాంటా నించీ ఎన్నో, ఎన్నెన్నో ప్రదేశాలు చూసుకుంటూ, నయాగరా దాకా వెళ్లి వచ్చాం. మేము చూసిన ఆ ఎన్నో, ఎన్నెన్నో ప్రదేశాల గురించి ఇక్కడ వ్రాస్తే, నేను వ్రాస్తున్నప్పుడూ, మీరు చదువుతున్నప్పుడూ, ఈ కథనం ఇవాళ మొదలుపెడితే, మర్నాడు ప్రొద్దున్న భళ్లుమని తెల్లవారే దాకా, అలా నయాగరా జలపాతంలా పోతూనే వుంటుంది. అందుకని ఈసారికి ఒక్క నయాగరా గురించే వ్రాస్తాను.

ప్రపంచంలో జలపాతాలు గురించి చదివితే, కొన్ని బాగా ఎత్తయినవి, కొన్ని బాగా వెడల్పయినవి, కొన్ని నీటి పారుదల దృష్ట్యా చాల పెద్దవి, కొన్ని ఎంతో అందమైనవి… ఇలా ఎన్నో రకాలున్నాయి. అందుకని, మా గుంటూర్లో పిచ్చి కిష్టయ్యలా, ఇవన్నీ కలిపేసి చూస్తే, నయాగరా జలపాతాలు ప్రపంచంలో తొమ్మిదో రాంకులో వున్నాయి. మొదటి మూడూ ఏమిటంటే, మొదటిది – లావోస్ దేశంలో వున్న ఖోన్ ఫాల్స్. 35,376 అడుగుల వెడల్పు జలపాతం. దీని ఎత్తు మాత్రం 69 అడుగులే! ఇక రెండవది – వెనిజువేలా దేశంలో వున్న, సాల్టోపారా జలపాతం. దీని వెడల్పు 18,400 అడుగులు. మూడవది – మధ్య ఆఫ్రికాలోని గాబన్ అనే దేశంలోని కొంగో ఫాల్స్. ఇవి 10,500 అడుగుల వెడల్పు. ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ల ఘనపుటడుగుల నీళ్ళు పారుతుంటాయి.

ఇహ.. నయాగరా ఫాల్స్ సంగతి చూద్దాం. ఇవి అమెరికా దేశానికి ఉత్తరాన, కెనడా దేశానికి దక్షిణాన వున్నాయి. అంటే అమెరికాలో ఈశాన్య దిక్కున, ఈ రెండు దేశాల మధ్యా సరిహద్దుల్లా వున్నాయన్నమాట.

నయాగరా జలపాతం, మూడు జలపాతాల సంగమం. ఒకటి ‘హార్స్ షూ ఫాల్స్’, రెండవది ‘అమెరికన్ ఫాల్స్’, మూడవది ‘బ్రైడల్ వెయిల్ ఫాల్స్’. ఈ మూడూ ఎరీ నదిలోని నీటిని, ఆంటారియో లేక్ లోకి ప్రవహింప చేస్తాయి. దీని ఎత్తు 167 అడుగులే అయినా (కొన్ని చోట్ల 188 అడుగులు కూడా వుంది), నిమిషానికి ఆరు మిలియన్ల ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుంది. నయాగరా జలపాతం వెడల్పు 2,600 అడుగులు మాత్రమే!

నయాగరా అంటే, మొహాక్ ఇండియన్స్ వారు మాట్లాడే భాషలో ‘మెడ’ అని అర్ధం. 1604 ప్రాంతంలోనే దీనిని, కెనడాకి వచ్చిన ఫ్రెంచ్ వారు, అమెరికాకి వచ్చిన పూర్వీకులు కనుగొన్నారు. 18వ శతాబ్దంలోనే నయాగరా జలపాతాన్ని చూడటానికి ఎంతోమంది యాత్రీకులు వచ్చేవారుట. 1897లోనే ఈ రెండు దేశాల్నీ కలుపుతూ, ఒక బ్రిడ్జిని కట్టారు. దాని పేరు, Whirlpool Rapids Bridge. ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద రైళ్ళూ, కారులూ అన్నీ నడిచేవి. కార్ల కోసం కొత్త బ్రిడ్జ్ కట్టినా (దాని పేరు రైన్బో బ్రిడ్జ్), పాత బ్రిడ్జి మీద ఇంకా రైళ్ళు నడుస్తూనే వున్నాయి.

మొదటి ప్రపంచ యుధ్ధం అయిపోయాక, నయాగరా జలపాతం చూడటానికి వచ్చే జనాభా ఎక్కువైనారుట.

నయాగరా జలపాతం అందాలు అమెరికా వేపున చాల బాగుంటాయి. అవి చూడాలంటే, సరిహద్దులు దాటి, కెనడా వేపు వెళ్ళి చూస్తే బాగుంటుంది.

మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు, రెండు పక్కల నించీ చూశాం కానీ, ఈసారి ఒక్క అమెరికా వేపు నించే చూశాం.

satyam1

 

అంతేకాదు, ఈ జలపాతంలోని నీటి శక్తిని ఉపయోగించుకుని, ఇక్కడ రెండున్నర మిలియన్ల కిలోవాట్స్ ఎలక్ట్రిసిటీని ఉద్పాదిస్తున్నారు. ఇది పడమటి ప్రపంచంలో కల్లా ఎంతో పెద్దదయిన హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్టు.

ఇదీ క్లుప్తంగా నయగరా చరిత్ర, సాంకేతిక వివరాలు. ఇక మా యాత్రా విశేషాలు చూద్దాం.

అక్కడికి చేరగానే, హోటల్ గదుల్లో సామానంతా పడేసి, ఇక రంగంలోకి దిగాం. మా హోటల్ కూడా జలపాతానికి నడక దూరంలో, నయాగరా స్టేట్ పార్క్ పక్కనే వుంది.

ఇక్కడ చూడవలసినవి చాల వున్నాయి.

ముందే అనుకున్నట్టుగా, సరాసరి ‘మైడ్ ఆఫ్ ది మిస్ట్’ దగ్గరికి వెళ్ళాం. టిక్కెట్లు అన్నీ హోటల్లోనే కొన్నాం కనుక, అక్కడికి వెళ్ళగానే – లిఫ్ట్ ఎక్కి, అంత ఎత్తు నించీ క్రిందకి దిగి, అక్కడ ఒక బోటు ఎక్కాం. బోటు ఎక్కే ముందు, అందరికీ పాంచోలు (రైన్ కోటు లాంటివి) వాళ్ళే ఇస్తారు. అవి వేసుకుని, తల అంతా పాంచోలో వున్న టోపీతో కప్పుకుని, బోటులో అందరం రైలింగ్ పట్టుకుని నుంచున్నాం. ఈ బోటుకి రెండు అంతస్థులు. ఇది నెమ్మదిగా, ఈ మూడు జలపాతాలు పక్క నించీ వెడుతుంటే, ఆ శబ్దం, గాలి, తల మీద పడే నీటి తుంపరలే కాక, అక్కడక్కడా కుండపోత వర్షంలా పడే నీరూ… అదొక అందమైన అనుభవం. ఆ హడావిడిలోనే, కెమెరాలు, సెల్ఫోనులూ బయటికి తీసి, అందరం ఫొటోలు తీస్తూనేవున్నాం. కొన్నిచోట్ల, మా బోటు గాలికి వూగుతుంటే, జనం

అరుపులు పెడుతుంటే… (భయంతో కాదు, సంతోషంతో), మేమేదో సాహసయాత్ర చేస్తున్నామన్నంత సరదా!

satyam2

 

అక్కడనించీ రాగానే, “కేవ్ ఆఫ్ ది విండ్స్” దగ్గరికి వెళ్ళాం. అక్కడికి కొంచెం దూరమే అయినా, ఆ చల్లటి వాతావరణంలలో నడుస్తుంటే హాయిగా వుంది.

“కేవ్ ఆఫ్ ది విండ్స్” దగ్గర కూడా, మళ్ళీ పాంచోలు వేసుకుని, క్రిందికి దిగి వెళ్ళాం. చిన్న చిన్న చెక్కలతో కట్టిన ప్లాట్ఫారాల మీద నడుచుకుంటూ, ఒక జలపాతం క్రింద దాకా వెడతామన్నమాట. ఇక్కడ గాలి విపరీతంగా వుంటుంది. జలపాతం హోరు చెవుల్ని చిల్లులు పడేట్టు చేస్తుంది. మన మీద పడే నీళ్ళు కూడా, మన మీద మద్దెల దరువు వేస్తుంటాయి. ఎంత పెద్దవాళ్ళయినా, పిల్లల్లాగా ఆడుకోవటానికి అనువైన ప్రదేశం.

satyam3

ఇంకా ఇక్కడ చూడవలసిన వాటిల్లో, డిస్కవరీ సెంటర్. అక్కడ ఎంత సమాచారం కావాలంటే అంత దొరుకుతుంది. అక్కడి నించీ, నడిచి క్రింద దాకా వెళ్ళాలనుకునే వాళ్ళకి, మంచి వాకింగ్ ట్రైల్స్ కూడా వున్నాయి.

హాయిగా సినిమా హాల్లో కూర్చుని నయాగరా అందాలు చూద్దామనుకునే వాళ్ళకి, ఒక అడ్వెంచర్ థియేటర్ కూడా వుంది.

ఆఁ! చెప్పటం మరచిపోయాను. నయాగరా ‘సీనిక్ ట్రాలీ బస్’ కూడా వుంది. ఒకచోటు నించీ, ఇంకా చోటుకి వెళ్ళటానికి బాగుంటుంది. దారిలో ఎన్నో పార్కులు, పూల మొక్కలూ, మధ్యే మధ్యే ఆ జలపాతపు నీటి మీద, రంగురంగుల ఇంద్రధనస్సులు. ఎంతో అందమైన ప్రదేశం.

రాత్రి పూట, అమెరికా వైపునా, కెనడా వైపునా రంగురంగుల లైట్లు వేసి, సౌండ్ అండ్ లైట్ షో వేస్తారు. ఆ నీటి మీద, గాలిలోని తేమ మీద, ఆ దీపాలు పడి, ఎంతో అందంగా వుంటుంది. తప్పక చూడవలసిన వాటిల్లో ఇది ఎంతో ముఖ్యమైనదని నా ఉద్దేశ్యం.

ఈ షో అయిన, కాసేపటికి టపాకాయలు కాల్చి, ఇటు క్రింద నీటిలోనే కాక, ఆకాశంలో కూడా రంగులు పులిమేసి, ఆ రేయిని కాసేపు పగలుగా మార్చేస్తారు. అదంతా అయిపోయినా, అక్కడనించీ కదల బుధ్ధి అవదు.

ఏనాడో నేను ఈ నయాగరా జలపాతం మీద విన్న ఒక జోకు చెప్పి, ఈ వ్యాసం ముగిస్తాను.

నయాగరా జలపాతం చూడటానికి, అందరూ ఆడవాళ్ళే వున్న టూరిస్ట్ బస్ ఒకటి వచ్చిందిట.

ఆ బస్సులో వున్న గైడ్, పెద్దగా కబుర్లు చెప్పుకుంటున్న ఆడవారితో అంటాడు, ‘మీరంతా కాసేపు నిశ్శబ్దంగా వుంటే, ఈ నయాగరా జలపాతం చేస్తున్న హోరు వినవచ్చు’ అని!

ఏది ఏమైనా, అవకాశం దొరికితే తప్పక చూడవలసిన ప్రదేశాల్లో నయాగరా జలపాతం ఒకటి!

-సత్యం మందపాటి

satyam mandapati

 

మీ మాటలు

*