ఎప్పుడన్నా నేను

రాత్రిలా అలంకరించుకోవాలనుకుంటాను నేను
అక్కడక్కడ చుక్కలతో – ఎక్కడో నెలవంకతో
వెలుగుతో చెరచబడి
ఉదయం నెత్తుటితో మొదలయ్యే జీవితం అవుతుంది నాది

గాలిలా స్నేహించాలనుకుంటాను నేను
అక్కడక్కడ స్పర్శలతో – ఇంకో చోట సుడిగుండం బిగి కౌగిలిలో
ఋతువుతో అవమానింపబడి
దిక్కు తోచని దిక్కు లేని తనమే తోడౌతుంది నాకు

కనీసం

చేపలా ఏకాకి తనాన్ని అనుభవించాలనుకుంటాను నేను
ఎప్పుడన్నా కొన్ని నీటి ముద్దులతో – అప్పుడప్పుడు
నీటి బుడగల్లాంటి మనుష్యుల మధ్య ప్రయాణం తో
పారే నీటిలో ప్రతి క్షణం
మొప్పల్లో నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది

జీవించడం రెండు భూగోళాల మధ్య
రూపమే లేని పాల పుంతలా ఉంది
సరే !
ఆశల విలువ బతుకు కంటే అమూల్యమైనది కదా ! !

-ఆంధ్రుడు

My photo-1

మీ మాటలు

 1. “జీవించడం రెండు భూగోళాల మధ్య
  రూపమే లేని పాల పుంతలా ఉంది”… శూన్యం అన్న మాటని బగా ఆవిష్కరించారు అద్భుతంగ ఉంది కవిత

 2. నిశీధి says:

  మంచి కవిత

 3. అద్భుతమైన ఆలోచన …. చాలా బాగుంది.

 4. kuppilipadma says:

  బాగుంది.

 5. Mamata Vegunta says:

  బ్యూటిఫుల్!

 6. వ్యక్తీకరణ చాలా బాగుంది. ఎంచుకున్న ప్రతికల్లో కొన్ని అసంబద్ధాలున్నాయి. కొంచెం విమర్శనా దృశ్టితో సరిచూసుకుని ఉంటే పద్యం ఇంకా బాగుండేది.

 7. విజయ్ గారు,కవిత్వంలోకి ప్రవేశించారు బాగుంది. ప్రజా సాహితి చూస్థున్నారా

Leave a Reply to S. Narayanaswamy Cancel reply

*