‘పాత్రో’చితంగా…

images

నిన్న ఆహుతి ప్రసాద్
ఇవ్వాళ గణేష్ పాత్రో…మొన్నటి బాలచందర్ విషాదం నించి కోలుకోకముందే…!
మృత్యువు ఎంత గడుసుదీ!
అది మనతోనే పుట్టింది. మనతోటే పెరుగుతుంది. వుండీ వుండీ మనకీ తెలియకుండా ‘మన’ని ‘తన’లోకి లాగేసుకుంటుంది.
పొద్దున్నే ఒకరు ఫోన్ చేసి, “సార్, గణేష్ పాత్రో గారూ…” అని నానిస్తే, “ఏమైందీ” అని అడిగాను.
“అహ! వారి ఫోన్ నంబరు తెలిసేమోననీ…” అన్నారు. వెంటనే ఫోన్ పెట్టేశారు.
గంట తరవాత హైదరాబాద్ నించి ఓ ఫోను. “GP…మరి లేరు!” అని.
మరో గంటకి వరసగా ఫోన్లు.
“సారీ…బాడీ హాస్పిటల్లో ఉందా? ఇంటికి తెచ్చారా?” అని.
ఎంత విచిత్రం!

శ్వాస ఉన్ననాళ్ళూ యీ శరీరం ‘శివం’
శ్వాస ఆగిన మరుక్షణం ‘శవం’
అప్పటిదాకా మనిషికి అన్ని పేర్లూ, బిరుదులూ, లాంచనాలూ అన్నీ పోయి కేవలం “బాడీ” అనే పదం మాత్రం మిగుల్తుంది. అప్పుడెప్పుడో శోభన్ బాబు గారు పోయినప్పుడూ అంతే!
“సార్…బాడీ హాస్పిటల్లో ఉందా? ఇంటికి తెచ్చారా?” అని ఇది సర్వ సహజం. ఈ ఒక్కదాన్నీ మించిన వేదాంతం ఎక్కడుంది? ‘బాడీ’ కేవలం body…! పేరెత్తరు! తెచ్చుకున్న పేరూ, పెట్టుకున్న పేరూ, పెట్టిన పేరూ అన్నీ శ్వాస ఆగగానే క్షణంలో మాయమవుతాయి.
సరే…

ఎక్కడో పార్వతీపురం దగ్గిర పుట్టారు. నాటకాలు రాశారు. నటించారు, స్పురద్రూపి కనుక! మధ్యతరగతీ, దిగువ మధ్య తరగతి జీవితాల్ని ఆపోశన పట్టారు. చెన్నపట్నం గమ్యం అయింది. ‘రాజీ పడడం’ అనే మాట గణేష్ పాత్రోకి తెలీదు.
మాట మనిషిని చంపుతుంది.
మాట మనసుని చంపుతుంది.
మాటే- మనిషినీ మనసునీ కూడా బతికిస్తుంది.
మాట నిన్ను గెలిపిస్తుంది. నిన్ను చిత్తుగా ఓడిస్తుంది. మాటే నిన్ను హిమాలయ శిఖరం మీద కూడా నిలబెదుతుంది. ఆ ‘మాట’ ని ఎలా వాడాలో, ఎంత వాడాలో, ఎప్పుడు వాడాలో తెలిసిన రచయిత – మాటల రచయితా, కథా రచయితా గణేష్ పాత్రో గారు.

ఈ చలనచిత్ర పరిశ్రమలో సముద్రాల వంటి సీనియర్ల ‘యుగాన్ని’ అలాగే ఉంచితే (వారిని జడ్జ్ చేయడం సముద్రాన్ని చెంచాతో కొలవడం లాంటిది గనక) ఆ తరవాత మనకి కొందరు మాటల మాంత్రికులు కనపడతారు- పింగళి నాగేంద్ర రావు, ఆచార్య ఆత్రేయ, ముళ్ళపూడి రమణ- ఇలాంటి మహానుభావులు.
వారికంటూ వారొక ‘పంధా’ ను సృష్టించి మనకి ‘సంభాషణా రచన’ ఎలా చేయాలో పాఠాలుగా బోధించారు. గణేష్ పాత్రో కూడా నిస్సందేహంగా ఆ కోవకి చెందినవాడే.
ఓ అక్షరం ఎక్కువుండదు.
ఓ అక్షరం తక్కువుండదు.
తూచినట్టు వుంటాయి మాటలు.
తూటాల్లా వుంటాయి మాటలు.
ఏ పాత్రకి ఏ భాష వాడాలో, స్పష్టంగా తెలిసిన రచయిత గణేష్ పాత్రో. అందుకే, ఆయన మాటలు ‘పాత్రో’చితంగా – ఒక ఎక్స్పర్ట్ టైలర్ కొలతలు తీసి కుట్టిన వస్త్రాల్లా వుంటాయి.
నటుడి హావభావాల్ని బాగా అబ్సర్వ్ చేస్తారు.

ఏ పదాలు ఆ నటుడి ముఖతా వస్తే పండుతాయో పరకాయ ప్రవేశం చేసి మరీ రాస్తారు.
అందుకే- ఆయన సంభాషణలకి అలవాటు పడ్డ నటులందరూ అనేది ఒకే మాట- “ఆయన డైలాగులే ఎలా నటించాలో మాకు నేర్పుతాయని”
ఇంతకంటే గొప్ప మెప్పుదల ఏముంటుందీ?
ఆ మెప్పుని వందల సార్లు పొందారు పాత్రో.

ఆయన కెరీర్లో ఒక్క పాటే రాశారు – “హలో గురూ ప్రేమ కోసమే” అని- నేననే వాడ్ని “పాత్రో గారు ఇంకొన్ని పాటలు రాయచ్చుగా” అని- ఆయన నవ్వి, “మీరూ ఇంకొన్ని సినిమాలకి సంభాషణలు రాయొచ్చుగా? మరెందుకు రాయలేదూ? మీరు డైలాగ్స్ రాస్తే, నేను పాటలు రాస్తా!” అనే వారు. (‘అలజడి’ అనే ఏకైక సినిమాకి నేను మాటలు రాసా. దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ)

గ్రాఫ్ చూస్తే-
రుద్రవీణ, సీతరామయ్య గారి మనవరాలు, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ముద్దుల కిట్టయ్య, ముద్దుల మావయ్య (భార్గవ్ ఆర్ట్స్ అన్ని సినిమాలకి ఆయనే మాటలు రాసారు)- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – ఇలా ఎన్నెన్ని హిట్స్! మధ్యతరగతి, కింది తరగతి వాళ్ళ ప్రతి కదలికనీ గమనించారు. ప్రతి ఉద్వేగాన్నీ అక్షరాలుగా మలిచారు. మనని మనకి కొత్తగా చూపించారు. వాడిన డైలాగ్ వాడలేదు. సన్నివేశాలు ఒక్కోసారి ఒకేలా వున్నా “డైలాగ్స్”లో వైవిధ్యాన్ని చూపించి “శభాష్” అనిపించుకున్నారు.

వ్యక్తిగా ఆయనది ప్రత్యేకమైన వ్యక్తిత్వం.
ఆయన “సంభాషణ”లకి కూడా తనదైన “వ్యక్తిత్వం’ వుంది. ఇది స్పష్టంగా మనం చూడొచ్చు. ఇదో విచిత్రమైన లక్షణం. మరొకరి దగ్గిర కనబడదు. ఎవరినీ అడగరు, ఎవరినీ పొగడరు. ‘పని’ కోసం- వస్తే, ప్రాణం పెట్టి రాయడం, లేకపొతే హాయిగా చదువుకోవడం. ఆయనతో అనేక సాహిత్య చర్చల్లో పాలు పంచుకునే భాగ్యం కలిగింది. మంచి వక్త.
ఏమని చెప్పనూ? నాలుగేళ్ళుగా మెల్లమెల్లగా నీరసపరుస్తున్న కేన్సర్ తో పోరాడి- ఇక దాని ‘బాధ’ నన్నేం చేయలేదంటూ, శరీరాన్ని ఇక్కడే వదిలేసి మరో నూతన ‘వస్త్రం’ ధరించడానికి ఎక్కడి నించి వచ్చారో ఆ పుట్టింటికి వెళ్లిపోయారు.

“జో జాయేగే ఉస్ పార్ కభీ లౌట్ కే …న ఆయే…” (ఆ వొడ్డుకి వెళ్ళిన వారెవరూ ఈ వొడ్డుకి తిరిగి రాలేరు)
“ఓ జానే వాలో …హో సకే తో లౌట్ కే ఆనా” (వీలుంటే మా కోసం మరో సారి తిరిగి వస్తారా?”)
బస్…

‘రాం తేరి గంగా మైలీ’ చిత్రంలో ఓ అద్భుత దృశ్యం వుంది.
ఓ పెద్ద మంచు గడ్డ పాక మీంచి కింద పడుతుంది. ఆ క్షణమే ‘కెవ్వు’ మన్న బిడ్డ ఏడుపు – అప్పుడే పుట్టింది- వినిపిస్తుంది. రాజ్ కపూర్ ఎంత గొప్ప సింబాలిజం చూపించాడూ..
మన జీవితం అనేది పెద్ద మంచు ముద్ద.
అది క్షణక్షణం కరిగిపోతూనే వుంటుంది. (జీవితంలాగే చివరంటా)
గాలి గాలిలో, మట్టి మట్టిలో, నిప్పు నిప్పులో నీరు నీటిలో ఆత్మ ఆకాశంలో-
గణేష్ పాత్రోజీ, మీ పాత్రని ఈ భూమ్మీద అద్భుతంగా పోషించారు. మాకివాల్సింది అక్షరాల రూపంలో అద్భుతంగా ఇచ్చేసారు.

అందుకే, అల్విదా.

మీ ఆత్మ పరమాత్మలో లీనమగు గాక
అనంత శాంతి మీకు లభించు గాక.

– భువన చంద్ర

bhuvanachandra (5)

మీ మాటలు

  1. “శ్వాస ఉన్ననాళ్ళూ యీ శరీరం ‘శివం’
    శ్వాస ఆగిన మరుక్షణం ‘శవం’”

    సందర్భోచితమైన చక్కని వ్యాసం..
    గనేష్ పాత్రో గారికి మీరు అర్పించిన నివాళి చాలా హృద్యంగా ఉందండీ!

  2. కె కె రామయ్య says:

    “ ‘మాట’ ని ఎలా వాడాలో, ఎంత వాడాలో, ఎప్పుడు వాడాలో తెలిసిన రచయిత – మాటల రచయితా, కథా రచయితా గణేష్ పాత్రో గారు.ప్రతి ఉద్వేగాన్నీ అక్షరాలుగా మలిచారు. ఎవరినీ అడగరు, ఎవరినీ పొగడరు. ‘పని’ కోసం- వస్తే, ప్రాణం పెట్టి రాయడం, లేకపొతే హాయిగా చదువుకోవడం.ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వం” చాలా గొప్పగా చెప్పారండి.

    కొడుకు పుట్టాలా, పావలా, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు వారి ఇతర రచనలు పాఠకులకు అందుబాటులోకి తీసుకొస్తే గణేష్ పాత్రో గారికి సముచితమైన నివాళి సమర్పించి నట్లవుతుంది కదాండి.

    • BHUVANACHANDRA says:

      ధన్యవాదాలు కె.కె. రామయ్య గారూ …..మీ సూచన నూటికి నూరు పాళ్ళూ శిరోధార్యం. ఆ ప్రయత్నం నిజంగా జరగాలి . అప్పుడే నిజమైన నివాళి అర్పించి నట్టు .

  3. వ్యక్తి వివరణ, వ్యక్తిత్వ వివరణ
    వ్యక్తుల పట్ల సహ ఆదరణ
    మధ్యలో అనుభవాల సోదాహరణ
    మీ, మీ కలం గురించి ఇంకెలా ఉదాహరణ !?

    regards…

    • BHUVANACHANDRA says:

      nmraobandi గారూ నమస్తే ….. ….చదివి మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు మీకు నా ధన్యవాదాలండీ…నూతన సంవత్సర సుభా కాంక్షలతో …….భువనచంద్ర

  4. Mythili Abbaraju says:

    మన జీవితం అనేది పెద్ద మంచు ముద్ద.
    అది క్షణక్షణం కరిగిపోతూనే వుంటుంది. (జీవితంలాగే చివరంటా)…మంచుకత్తితో కోసినట్లు పదునుగా స్ఫుటం గా చెప్పారు సర్.

    • BHUVANACHANDRA says:

      ధన్యవాదాలు మైధిలి గారూ ….ఏమిటో ,ఒక్కక్కరూ వెళ్లిపోతున్నారు……అన్నీ ఇక్కడే ఒదిలేసి ——–…..కులం,మతం,భాషా,బంధం అన్నీ ఇక్కడే ఒదిలి పోతున్నారు …..బాల్యం యవ్వనం కదిలి వెళ్లి పోయిన తల్లిదండ్రులూ ,స్నేహితులూ ,,,, సర్వం ఓ కలలో వున్నట్టు అనిపిస్తోంది ……ఎంత త బాగుందీ ఈ జీవితమనే సినిమా ..!!!.”””’నటులమూ మనమే ..,,..ప్రేక్షకులమూ మనమే!! ”””” మరోసారి థాంక్స్ మైధిలి గారూ ……..నమస్తే

  5. buchireddy gangula says:

    మీ రే రాయగలరు అంత గొప్పగా — అ తిరుగా
    చాల భాగా రాశారు — భువనచంద్ర గారు
    ———————————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  6. BHUVANACHANDRA says:

    ధన్యవాదాలు రెడ్డి గారూ మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ….నమస్సులతో ……………..భువనచంద్ర

Leave a Reply to Mythili Abbaraju Cancel reply

*