పిల్లలది కాదీ లోకం!

myspace

ఓ వందేళ్ల క్రితం హెమింగ్వే రాసేడు ఓ ఆరు పదాల కావ్యం. ఎప్పుడు గుర్తొచ్చినా కలవరపెట్టే రచన — For sale: baby shoes, never worn.  అమ్మకానికి పెట్టిన ఏదో చిన్నారి కోసం కొన్న బూట్లు, ఎన్నడూ వాడనివి. ఎంతో ప్రేమతో పుట్టబోయే బిడ్డకి తల్లిదండ్రులో, ఇంకెవరైనా ఆప్తులో కొన్న బూట్లు. అవి వాడకుండానే, ఆ బిడ్డ వెళ్లిపోయింది. లేదా, ఆ తల్లికి ఏదో అయివుంటుంది, బిడ్డ గర్భంలో వున్నపుడే. లేదా, ఏ హింసకో బలయ్యి వుండి వుంటుంది. బిడ్డ పోయినతర్వాత అమ్మకానికి పెట్టారంటే బహుశా కనిపించని పేదరికపు రక్కసి మింగేసి వుంటుంది.

గుజరాత్ లో అల్లరిమూకల కత్తులకు బలైన గర్భస్థ శిశువల గురించి విన్నపుడు, ముళ్ళపొదల మధ్య, చెత్త కుప్పలమీదకి విసిరివేయబడ్డ పిల్లలగురించి చదివినపుడు, బస్సు టైర్ల కింద, ట్రైన్ల కింద చనిపోతున్న పిల్లల గురించి విన్నపుడు, గాజా పిల్లల రోదన చూసినపుడు ఈ కధ గుర్తొస్తుంది. మొన్న పెషావర్లో ముష్కరుల బులెట్ల వర్షానికి బలైన పిల్లల్ని చూసి మళ్ళీ గుర్తొచ్చింది.    ఇంత శక్తివంతమైన కథారచన హెమింగ్వేలాటి వాళ్ళకు తప్ప ఇంకెవ్వరికి సాధ్యమవుతుంది! మహిళలపై అత్యాచారం చెయ్యడం యుధ్ధాల్లో బలమైన పక్షం చేసే పని. బోస్నియాలోనో, ఇరాక్ లోనో కాశ్మీర్ లోనో, శ్రీలంకలోనో – పోరాడే ప్రజల్ని భయపెట్టడానికి, వాళ్ళ స్థైర్యం దెబ్బతీయడానికి, వాళ్ళ అసహాయతని చూసి వెక్కిరంచడానికి ప్రపంచం నలుమూలలా సైన్యాలు చేసే పని అది.

యువకుల్ని ఎత్తుకుపోయి తల్లులకు క్షోభ మిగిల్చడం కూడా మరో ప్రధానమైన ఆయుధం.   తల్లుల మీద దాడి, పసిపిల్లల మీద దాడే. ఇక నేరుగా పిల్లలమీదే నేరుగా యుధ్ధాలు మొదలయ్యాయి. గాజాలో పిల్లలని కూడా చూడకుండా ఇజ్రాయిల్ ఎలా మిసైళ్లను ప్రయోగించిందో, బాంబులు వేసిందో చూశాం. స్కూళ్ళు, ఇళ్లు – వేటినీ వదలలేదు. మొన్నటికి మొన్న శ్రీలంకలో కూడా ఇలాటి దాడులు చూసేం. బులెట్లతో చిల్లులు పడ్డ ప్రభాకరన్ కొడుకు శవాన్ని చూసేం. ఇవి నేరుగా ప్రభుత్వాలు పిల్లలమీద జరిపే హింస.    ఇక పిల్లల మీద ఎక్కుపెట్టిన వ్యస్థీకృతమైన దాడులు, హింసా రూపాలు వర్ణనాతీతం. రక్తమాంసాలు, హృదయ స్పందనలుండే వాళ్ళుగా మనం వాళ్ళని అసలు చూడనే చూడం. వాళ్ళని మనుషులుగా చూసేవాళ్ళు అస్సలే లేరని కాదు. వాళ్ళు మైనారిటీ. మనకి తెలీకుండానే వాళ్ళ మీద చూపే క్రౌర్యం అంతా ఇంతా కాదు. హేళన, కసురుకోవడం, కొట్టడం, విసుక్కోవడం, సాంస్కృతిక దాడితో మనసుల్నీ మెదళ్ళనీ కలుషితం చెయ్యడం – ఎన్ని రకాల హింసలకి గురిచేస్తున్నాం వాళ్ళని.

విద్య పేరుతో, వైద్యం పేరుతో జరుగుతున్న హింసా రూపాలు ఇంకా ఘోరమైనవి. ఇవి ప్రాణాలైతే తియ్యవు కానీ, పీల్చి పిప్పి చేసెయ్యగలవు.

ఈమధ్య మా పాప ఆడుకుంటూ గోడ మూల తాకింది. నుదుటి మీద ఇంచిన్నర దెబ్బ తగిలింది. డాక్టరు చదువు చదివిన సతీశ్ చందర్ గారమ్మాయి first aid చేసి, హాస్పటల్లో చూపించమంది. నేనింటికి వెళ్ళేసరికి లేటయింది. అప్పుడు తీసుకెళ్ళాం హాస్పటల్ కి.

 

హాస్పటల్ నంబర్ 1

నర్స్ కట్టు విప్పుతుంటే  చూస్తున్న డాక్టర్, “రేప్పొద్దున్నే 5-6 గంటలకి వచ్చెయ్యండి, పదిహేను వేలు పట్టుకు. ప్లాస్టిక్ సర్జన్ కుట్లు వేస్తారు. లేకపోతే మచ్చ మిగిలిపోతుందని,” అన్నాడు.

మచ్చ మిగులుతుందా, మిగలదా అన్న మీమాంస నాకూ, నా సహచరికీ లేవు. రీ ఇంబర్స్ మెంట్ వుంటుంది కాబట్టి డబ్బులు సమస్యా కాదు. కానీ, ఆరేళ్ళ పాపకి అనవసరమైన ట్రౌమా అవసరమా?

ఆ ప్లాస్టిక్ సర్జన్ కి (హాస్పటల్ లోనే వున్నారు) చూపించకుండా, అభిప్రాయం కలుసుకోకుండా  ఈయన సర్జరీ అని డిసైడ్ చెయ్యడం మాకు ఇంకా ఆశర్యం కలిగించింది.

మా డాక్టరుకి చూపించి (సెకెండ్ ఒపీనియన్) వస్తాం పొద్దున్న అని బయటపడ్డాం.

 

హాస్పటల్ నంబర్ 2

పొద్దున్న, డాక్టర్:  “మీరు ఆరుగంటల లోపలే రావాలండీ. అయినా సాయంత్రం రండి మా సర్జన్ సర్జరీ చేస్తారు. ”

“మరి ఆరుగంటల లోపలే రాలేదని అన్నారు కదండీ,” నా సహచరి.

“చేస్తే ఆరుగంటల లోపల చెయ్యాలి. లేకపోతే ఎప్పుడు చేసినా ఒకటే,” డాక్టరు (మేజిక్ రియలిజం కాదు. నిజంగానే అన్నాడు.)

అంటూ, మా అనుమతి తీసుకోకుండానే సర్జన్ నంబర్ డయల్ చేసారు. (అదృష్టవశాత్తు ఆ నంబర్ కలవలేదు.) “ఇదిగో ఈ నంబర్ తీసుకుని ప్రయత్నించండి.”

(ఇద్దరు డాక్టర్లూ పేషెంట్ తో ఒక్క మాటా మాట్లాడలేదు)

 

హాస్పటల్ 3 (ఓ మిత్రుడి సలహాతో)

after making her comfortable by asking a few questions, కట్టు కొంచెం పైకెత్తి చూసి

“ఇది చాలా superficial దెబ్బ. చర్మం కిందికి పోలేదు. స్టిక్కర్లు వేస్తే సరిపోతుంది. మూడు రోజులకోసారి స్టిక్కర్ వేయించుకోండి,” అన్నారు ఆ సర్జన్.

నేను రిసెప్షన్ దగ్గరికెళ్ళి ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చేలోపలే స్టిక్కర్ వేసేసి మళ్ళీ థియేటర్ లోకి వెళ్ళిపోయాడాయన.

ఓ మూడు స్టిక్కర్లు వేసేరు. అంతే. ఇంకో స్టిక్కర్ వేస్తారా (దెబ్బ ఇంకా కొంచెం పచ్చిగా వుండడం చూసి) అని మేం అడిగినా కూడా వెయ్యనిరకరించారు.

రెండు వారాలపాటు దాని సంగతే మరిచిపోయాం. ఎందుకో గుర్తొచ్చి ఈరోజు చూసేను. ఎనబై శాతం దెబ్బ చర్మంలో కలిసిపోయింది. ఇంకాస్త కూడా కలిసిపోయేట్టే వుంది రెండు, మూడు వారాల్లో!

వైద్యం చేసి డబ్బు సంపాదించవచ్చు కానీ, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కోసమే వైద్యం అనుకోవడం ఎంత అమానుషం! దెబ్బ దానంతట అదే చర్మంలో కలిసిపోతుందని తెలిసికూడా కాస్మోటిక్ సర్జరీలు చెయ్యడం ఎంత హింస.

పిల్లలనీ, వృద్దులనీ, డబ్బులు సమకూర్చుకోడం కష్టం కావచ్చని తెలిసి  కూడా చూడకుండా అనవసరంగా సూదులు గుచ్చేసి, కోసేసి సంపాదించకపోతే ఏం?

 

PS: స్టిక్కర్ వేయించుకుని బయటకి వస్తుంటే, ఓ ఫోన్ వచ్చింది: “I’ve got your reference from xyz. Are you trying to reach me?,” అని.

కాల్ ఎవరిదగ్గర నుంచీ అంటే, రెండో హాస్పటల్ లో సర్జరీ చెయ్యాల్సిన డాక్టర్!

ఏదో సినిమాలో డైలాగ్ ప్రేరణతో, “హల్లో, హల్లో, హెలో, హెలో,” అని అన్నాను.

-కూర్మనాధ్

మీ మాటలు

  1. ప్రియమయిన కుర్మనాథ్ గారూ , రాసేక ఒక్క సారి చదవండి ప్లీజ్ .

    పిల్లలనీ, వృద్దులనీ, డబ్బులు సమకూర్చుకోడం కష్టం కావచ్చని తెలిసి కూడా చూడకుండా అనవసరంగా సూదులు గుచ్చేసి, కోసేసి సంపాదించకపోతే ఏం?
    మనం ఉన్న ఉత్పత్తి విధానం గురించి మీకు తెలీదంటే అస్సలు అస్సలు నమ్మను .
    ఆరోగ్యం ప్రజల అవసరం. ప్రజల అవసరం వస్తువు అవ్వదా?

  2. పిల్లలనీ, వృద్దులనీ, డబ్బులు సమకూర్చుకోడం కష్టం కావచ్చని తెలిసి కూడా చూడకుండా అనవసరంగా సూదులు గుచ్చేసి, కోసేసి సంపాదించకపోతే ఏం?

    సార్ రాసిన తర్వాత ఒక సారి చదవండి ప్లీజ్. మనం ఏ ఉత్పత్తి విధానంలో ఉన్నామో మీకు తెలియదు అంటే అస్సలు అస్సలు నమ్మనే నమ్మను
    ఆరోగ్యం అనే ప్రజల అవసరం వస్తువు గా మార్చక పొతే , పెట్టుబడి ఎలా బతకాలి

Leave a Reply to CHITRA Cancel reply

*