హింస – ప్రతిహింసలను సరి తూకం వేసి చూపిన కధ

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

‘హింస’ మొదటిసారి మనిషికి అనుభవమయ్యే స్థలాలు, కాలాలు అందరికి ఒక్క లాగే ఉండవు. కొంత మంది అదృష్టవంతులు జీవితమంతా హింసను ‘చూడకుండానే’ గడిపి వేయగలుగుతారు. చాలా మంది మధ్యతరగతి వారికి హింస మొదట కుటుంబంలోనే పరిచయం అవుతుంది. అలాటి వారికి సమాజంలో ఉండే హింసను గ్రహించటానికి కొంత వయసు, జ్ఞానం కావాల్సి వుంటుంది. కానీ ‘సంగి’ లాంటి సమాజానికి వల్నరబుల్ గా ఉండే చిన్న పిల్లలు హింసాయుత ప్రపంచంలో నిత్యం రాపిడికి గురౌతూ ఉంటారు. ఆ హింస ఎక్కడ నుండి ఉద్భవిస్తుందో, దానికి మూలకాలు ఏమిటో గ్రహింపు లేకపోయినా … వెంపర్లు ఘాటుగా, చేదుగా, దుఃఖంగా అనుభవమవుతూ ప్రతిచర్యకు వారిని పురికొల్పుతూ ఉంటాయి. శత్రువు ఎవరో తెలియని అయోమయ స్థితిలో కూడా హింసానుభవానికి సంబంధించిన పగ, ప్రతి హింసకు వారిని ప్రేరేపిస్తుంది. చూసే వాళ్ళకు ఆ హింస అసంబద్ధంగా అనిపించుకాక! అధికారానికి అది తలనొప్పిగా, సంఘ వ్యతిరేక శక్తిగా, ‘దువ్వేసి’ తొలగించాల్సిన ఉగ్రభావంగా అగుపించుకాక! సామాజిక నియమాలుగా చెప్పబడుతున్నవి ఎంత నిర్దేశించినా..  తలవొగ్గి ఉండమని శాస్త్రాలు ఎంత బుజ్జగించినా .. చట్టం, పోలీసు లాంటి రాజ్య నిర్మాణాలు ఎంత శాసించినా మానవ ఉద్వేగాలు సహజంగా బయలు దారిలోనే ప్రవహిస్తాయి.

విద్యార్ధులు ప్రభుత్వ హాస్టల్లో అధ్వాన్న వసతులకు వ్యతిరేకంగా రోడ్డు మీద పడుతుంటారు. కాశ్మీర్ లో మిలటరీ మీద ఆగ్రహంతో ప్రజలు రాళ్ళు రువ్వుతుంటారు. మణిపూర్ లో పారా మిలటరీ దళాలు చేసిన అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలు నగ్న ప్రదర్శన చేస్తారు. మర్యాదస్తులకు అహేతుకంగా కనిపించే ఈ చర్యల వెనక అదృశ్యంగా వ్యవస్థ మీద కనబడని ఆగ్రహావేశాలు బుసలు కొడుతుంటాయి. దాదాపు నలభై ఏళ్ళ క్రితం పుట్టిన చిన్న ‘సంగి’కి ముందు ముందు ఇలా జరగబోతుందని తెలియదు. అయినా అదేమిటో సంగి కూడా అంతే ప్రవర్తించింది .. అచ్చు శ్రీకాకుళం పోరాటంలో గోసి పెట్టుకొన్న గిరిజనులు భూస్వాముల మీద తిరగబడ్డట్టు. కానీ ఇక్కడ సంగికి శత్రు స్పృహ తెలుస్తుంటుంది కాని శత్రువు ఎవరో తెలియదు.

‘హింస’ కధలో కాళీపట్నం రామారావు గారు ఒక పసిదాని సామాజిక, ఆర్ధిక జీవితం చుట్టూ అల్లుకొన్న హింసను కళ్ళకు కట్టించి దాని ప్రతి చర్యను శక్తివంతంగా సమర్ధించారు. 1968 ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ఈ కధను ప్రచురించారు. సాహిత్య ప్రయోజనాల్లో సమాజంలోని సంక్లిష్టతను అర్ధం చేయించటం ఒకటి అయితే ఆ పనిని కా.రా గారు గొప్పగా చేయగలిగారు ఈ కధలో. బారెడంత గోచి గుడ్డతో కధంతా తిరిగే సంగి ఈ కధా నాయకురాలు. కధ ప్రారంభం, ముగింపు రెండూ ఈ కధకు ప్రత్యేకంగా ఉంటాయి. తన చుట్టూ జీవిస్తున్న సమూహంలో వివిధ వ్యక్తుల నుండి ఒక్క రోజులో సంగి అనుభవాలు ఆ గొల్లపిల్లను ఉలికిపాటుకి, అంతర్మధనానికీ గురిచేసి కసికి ప్రేరేపిస్తాయి.

రామారావు గారి కధల్లో చిన్న ఆడపిల్లల ప్రస్తావన ప్రత్యేకంగా ఉంటుంది. చావు కధలో సిమ్మాద్రి, దాలి .. మహదాశీర్వచనంలో కామేశ్వరి.. హింస కధలో సంగి, నీలి – ఇలాంటి పిల్లలు తమ నేలబారు జీవితాలని ఎదురీదటానికి తల్లో తండ్రో లేక ఇద్దరో పడుతున్న కష్టాలలో మమేకం అవుతుంటారు. ఒక్క పూట కూలికి వెళ్ళకపోతే కలిగే పర్యవసానాలు అర్ధం చేసుకోగలిగిన పరిణితి వారి పేదరికం వాళ్ళకు నేర్పుతుంది. ఈ పిల్లలు ఎక్కడా బడి మొహం చూసిన దాఖాలాలు ఉండవు. ఈ కధలో సంగి, నీలి తమ లేత రెక్కలను పెట్టుబడిగా పెట్టి నిరంతర ఆకలి పోరాటంలో తలమునకలవుతుంటారు. కధ మొదలులోనే సంగి రూపం వర్ణిస్తూ “… ఆ వెల్తుర్లో సంగి మెడలో పగడాలూ, పూసలూ మకిలి మకిలిగా మెరుస్తున్నాయి. దాన్ని వేలాడే కొత్త పిన్నీసులు జిగజిగ లాడుతున్నాయి … కొట్టు దాటగానే వెనకానున్న నీడ సర్రన ముందుకొచ్చింది. బారెడు గోచిగుడ్డ మొలకు చుట్టుకొన్న బ్రహ్మరాక్షసిలాటి నీడన్చూసి, ‘శా, పయ్యాట గుడ్డ మర్సిపోనాను!’ అనుకుంది సంగి.” ఇక సంగి స్నేహితురాలు నీలి పరిచయంలోనే “ఒక చేతిలో – జానెడు నూనె సీసా, చిన్నబెల్లమ్ముక్కా; రెండో చేతిలో పట్టేడు చింతపండు వుండా …” తో కనిపిస్తుంది. అప్ప వచ్చిన రోజు తను ఎందుకు సంగిని కలవలేక పోయింది సంజాయిషీ ఇస్తూ నీలి “అడివవతల బుడువూరు సోవయ్య శేరికి తానూ తల్లి పప్పేత కెళ్ళేరు. రాను పోనూ ఆరు మైళ్ళు. ఏకువనగా నెగిసి పాసిపనంతా సేసుకుని యింటికిపడ్డ నీళ్ళన్ని మోసి ఆడుతూ బడుతూ యెల్తే యియ్యేళకు తేలేరు.” ఇంక సంగి పరిస్థితి – “తెల్లారేక యిలా నీళ్ళైనా పుక్కిలించలేదు. సిన్నాయిన కూతురు పారొచ్చింది. కాపోళ్ళ గుడ్డల మీద గడ్డలు పగలేయ్యాలిట! వొస్తదేమో కనుక్కోమంది సిన్నమ్మ. ‘యేల్రాదూ? మారాజులా గొస్తాది. తీసుకెల్లం’ది తల్లి. అంబళ్ళేలకు పనిపోదా అనుకుంది సంగి. కానీ గుడ్డెలమీదే పొద్దు పోయింది, తిరిగివొచ్చింది లగాయతు, దినవెచ్చాలు, తల్లికి వంట సాయం, ఇప్పుడు టీ.” కధ గడిచిన నలభై ఆరేళ్ళకు కూడా తలకు గుడ్డలు గట్టుకొని చేతిలో కొడవలో, దోకురుబారో పట్టుకొని తల్లి వెంట పనులకు పోతున్న సంగులు, నీలులు ఎంతమందో!

ఆకతాయి దాసు పట్నం నుండి వస్తూ ఆయన చూసిన దృశ్యాన్ని సుబ్బయ్య హోటల్లో జనానికి వివరిస్తుంటే, టీ కోసం చెంబు పట్టుకొని ‘సంగి’ ఆ పాక హోటల్ ప్రవేశంతో కధ మొదలువుతుంది. ఒక దానితో ఒకటి సంబంధం లేని సంగతులుగా అనిపించే ఈ రెండు విషయాలనీ రచయిత నేర్పుగా కలుపుతాడు. దాసు చెబుతున్నసంఘటనలోని స్త్రీ పైడమ్మ సంగి అప్పే (అక్క) అవటమే ఆ లంకె. ఆ పాకలో బైఠాయించిన ఆ సమాజం తన అక్కను ఎద్దేవా చేస్తున్నదన్న విషయం గ్రహించటానికి సంగికి కొంత సమయం పడుతుంది. చిన్న వయసులోనే కూలికి వెళ్ళి తల్లికి సాయం చేయటం తప్ప లోకం ఎరగని సంగిని ఆ హేళన ఆ రోజు ఆమె ఎదుర్కొన్న మొదటి హింస.

ఆ దృశ్యం కొనసాగింపులోనే, అప్ప ఇంటికి వచ్చిందని తెలిసీ ఇంటికి రావటానికి సందేహించిన స్నేహితురాలు నీలి వైఖరి కలిగించిన నిరాశ యింకో హింస. చాలా ఏళ్ళ తరువాత ఇంటికి వచ్చిన అప్పతో ఒక్క గడియ మాట్లాడటానికి కాలం చాలని బతుకులో ఉన్న సంగికి, అప్ప అందరి చర్చలకు కేంద్ర బిందువు ఎలా అయ్యిందో అర్ధం కాని అయోమయం ఆమె ఎదుర్కొన్న కొత్త రకం హింస. చుట్టాలు అందరూ కలిసి అప్ప బతుకుకి తీర్పు ఇవ్వటం, అది అంగీకరించాల్సిన నిస్సహాయ పరిస్థితిలో తల్లి దుఃఖం ఆమెకు అర్ధం కాని హింస. అప్పకు ఏమయ్యింది? అప్ప స్నానం చేస్తుంటే చూసి, ఏమి మార్పు వచ్చిందని అందరూ అప్పను నిప్పును చూసినట్లు చూస్తున్నారో అనుకొంటుంది. తల్లి దుఃఖం వెంటాడుతుండగా అప్పటి వరకు ఒంటరిగా వెళ్ళటానికి భయపడే ‘శలక’కు నిర్భయంగా, నిర్వికారంగా బయలుదేరుతుంది. గతంలో అక్కడ ఆమెను భయపెట్టిన ‘గుండెలు పగలవేసే నిశ్శబ్దం’ ఇప్పుడు ఆమెను ప్రశాంతంగా ఉంచుతుంది.

ఇక్కడ వరకు చదివిన పాఠకుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకోక తప్పదు. సంగిలాంటి పసిపిల్ల కఠిన దరిద్రంతో బతుకు పోరాటం కోసం చిన్నతనం నుండే కూలికి వెళ్ళటం ఈ దేశంలో వింత కాదు. కాని అంత పిందె వయసులో భయాన్ని జయించ గలగటం సంతోషానికి బదులు విషాదాన్ని కలగ చేస్తుంది. ఆ భయరహిత స్థితికి నేపధ్యం చాలా కఠినమైనది. గుండె లేనిది. ఆ నేపధ్యం ఆమెను తను బతుకుతున్న సమూహపు హృదయరాహిత్యాన్ని అనుభవింప చేసింది. ఒక జెండర్ వ్యభిచారం చేయటం అంగీకారంగాను, ఇంకొక జెండర్ చేయటం ఘోరమైన తప్పిదంగాను నిర్దేశించిన సమాజపు ద్వంద్వ విలువలను గ్రహింప చేసింది. గతి లేని పరిస్థితుల్లో అలాంటి ఘోరమైన తప్పు చేసిన ఆడపిల్లకు కుటుంబం నుండి కూడా తిరస్కారం తప్పని సరైన చేదు నీతిని అవగతం చేసింది. ఒక్కరోజులో వచ్చి పడిన ఈ ఎరుక, ఆమెను మౌనిగా మార్చేసిన ఆ కాఠిన్య సందర్భం కొస కంట తడిని రగిలిస్తుంది. అయితే సంగిలోని ఈ మౌనం ఆమె అంతర్గత దహనానికి వ్యక్తీకరణ. ఆ దహనం కసిగా మారి, తన కుటుంబాన్ని క్షోభింపచేసిన కనబడని శత్రువును ఎగిరి తన్నాలన్న క్రోధంగా వ్యక్తమౌతుంది.

రామారావుగారి కధల్లో ఎక్కువ కధల ముగింపులు పరిష్కారాన్ని ప్రత్యక్షంగా సూచించవు. కానీ ప్రతీకాత్మకంగా ముగింపు ఇచ్చిన కధ ‘హింస’. మేకపిల్లను చంపిన నక్కలను చేతి రాళ్ళతో వెంటాడి “యియ్యేళ మిమ్మల్ని, ఒకళ్ళనో ఇద్దర్నో సంపిందాకా నానింటికిపోను” అని ఆవేశించిన సంగి ఆక్రోశం అర్ధం కావాలంటే ఆమె బతుకుతున్న ‘చుట్టూ యిలారం’ పాకలోకి వెళ్ళాలి. కూలాడక గంజి తాగి ఆర్చుకు పోయిన ఆమె పేగులు గమనించుకోవాలి. అంత పేదరికంలో కూడా “అప్ప రక్తం నాళ నాళానా వేడిమి నింపుతూ ఆమెను పొదువుకొన్న” ప్రేమ బంధం గుర్తించగలగాలి. వ్యభిచారంలో దిగబడిపోయిన అప్పను ఇక పైకి లాగలేమని తీర్పునిచ్చిన బంధుగణం అసహాయతను అసహ్యించుకోవటమో, అర్ధం చేసుకోవటమో చేయాలి. కూతుర్ని ఇక కాపాడుకోలేనని గ్రహించి గొంతు వెలుగు రాసేదాకా ఏడ్చిన తల్లి శోకాన్నం సంగిలో కలిగించిన మొయ్యలేని బాధతో సహానుభూతి చెందాలి. ఇవన్నీ చేయగలిగారు కాబట్టే కారాగారు ఈ కధను ఇంత సహజాతి సహజంగా, అద్భుతంగా రాయగలిగారు.

 -బత్తుల రమాసుందరి

089బత్తుల రమాసుందరి ప్రకాశం జిల్లాలో ఈతముక్కల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో సీనియర్ లెక్చెరర్ గా పని చేస్తున్నారు. ఈమె రాసిన కొన్ని కధలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. ఇప్పటి వరకూ చదివిన తెలుగు సాహిత్యంలో రంగనాయకమ్మ, కారా, రావి శాస్త్రి, పతంజలి, పి. సత్యవతి, అల్లం రాజయ్య, రఘోత్తమరెడ్డి, ఆర్. వసుంధరాదేవి, బజరా, నామినీ, మధురాంతకం నరేంద్ర, స.వెం. రమేశు, బండి నారాయణస్వామి, వి. చంద్రశేఖరరావు, గోపిని కరుణాకర్, దాసరి అమరేంద్ర, … ఇంకా చాలామంది స్త్రీ, దళిత, మైనారిటీ, ప్రాంతీయ, భాషా అస్తిత్వవాద రచయితల అనేక రచనలు ఇష్టం. రమాసుందరి రచనలు ‘మోదుగపూలు’ (kadhalu.wordpress.com) లో చదవవచ్చు.

 

 “హింస” కథ:

మీ మాటలు

 1. సంగి ఆక్రోశం అర్ధం కావాలంటే ఆమె బతుకుతున్న ‘చుట్టూ యిలారం’ పాకలోకి వెళ్ళాలి. కూలాడక గంజి తాగి ఆర్చుకు పోయిన ఆమె పేగులు గమనించుకోవాలి. అంత పేదరికంలో కూడా “అప్ప రక్తం నాళ నాళానా వేడిమి నింపుతూ ఆమెను పొదువుకొన్న” ప్రేమ బంధం గుర్తించగలగాలి. వ్యభిచారంలో దిగబడిపోయిన అప్పను ఇక పైకి లాగలేమని తీర్పునిచ్చిన బంధుగణం అసహాయతను అసహ్యించుకోవటమో, అర్ధం చేసుకోవటమో చేయాలి. కూతుర్ని ఇక కాపాడుకోలేనని గ్రహించి గొంతు వెలుగు రాసేదాకా ఏడ్చిన తల్లి శోకాన్నం సంగిలో కలిగించిన మొయ్యలేని బాధతో సహానుభూతి చెందాలి.
  – ఒకవేళ ఇవన్నీ కుదరకపోతే కనీసం రమాసుందరి గారి ఈ వ్యాసంఅన్నా ముందు చదవాలి…

 2. కాళీపట్నం రామారావు గారి రచనల్లో బాగా గుర్తుండిపోయే కథ ఇది. చివర్లో సంగిలో కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్నీ, ఆక్రోశాన్నీ కా.రా. సహజంగానూ, శక్తిమంతంగానూ చిత్రించారు.

  ‘ … కాని అంత పిందె వయసులో భయాన్ని జయించ గలగటం సంతోషానికి బదులు విషాదాన్ని కలగ చేస్తుంది’- నిజమే కదా! ప్రతీకాత్మకంగా చెప్పిన ఈ కథ అసలు అర్థాన్నిస్పష్టంగా బోధపరుచుకోవడానికి తోడ్పడేలా ఉంది మీ పరిచయం.

 3. Thirupalu says:

  / సంగిలాంటి పసిపిల్ల కఠిన దరిద్రంతో బతుకు పోరాటం కోసం చిన్నతనం నుండే కూలికి వెళ్ళటం ఈ దేశంలో వింత కాదు./
  నిజం! బంగారు బతుకులు బతుకుతున్న వారికి ఇందులోని హింస అర్ధం కాదు. అలా బతకడం, సహజాతి సహజం. ఇందులో వింత ఏమొందో ననుకుంటారు. హింస నీడలా వెంటాడి నపుడు ఆ చిన్న పిల్ల పడే బాధ, ఆ బాధనుండి పుట్టే తిరుగు బాటు దైర్యాన్ని అద్బుతంగా బొమ్మ కట్టారు కా.రా గారు. ఈ కధను రమా సుందరి గారు వ్యాఖ్యానించిన తీఋ చాలా బాగుంది. ఈ వ్యాఖ్యానం వెలుగు కధను మరింత అర్ధం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.

 4. ‘హింస’ కథ link ఓపెన్ అవడం లేదు…

మీ మాటలు

*