కవుల కవి – ఇస్మాయిల్

ismayil painting rainbow

 
ఇస్మాయిల్ కవిత్వంలో నినాదాలు, సిద్దాంతాలు, వాదనలు కనిపించవు. ఇంకా చెప్పాలంటే ప్రకృతి కనిపించినంతగా జీవితం కనిపించదు కూడా. అయినప్పటికీ ఆయన కవిత్వాన్ని అభిమానించే వారిలో కవులు ముందుంటారు వారి వారి కవిత్వ కమిట్మెంట్లు వేరైనప్పటికీ. ఆ విధంగా ఇస్మాయిల్ కవుల కవి.

ఇస్మాయిల్ కవిత్వంలో సౌందర్యం, కరుణ, జీవనోత్సాహాలు నిశ్శబ్దంగా శబ్దిస్తూంటాయి. జీవితంలో తారసిల్లే అనేక సందర్భాలకు, దృశ్యాలకు, వస్తువులకు ఈయన కవిత్వగౌరవం కల్పించాడు. మనుషుల రసదృష్టి పై అచంచలమైన విశ్వాసంతో కవిత్వాన్ని పలికించాడు. కవితలో దండుగ పదాల్ని శుభ్రంగా తుడిచేసి సుందర స్వరూపాన్ని మాత్రమే మిగిలేట్లు చేయటం ఇస్మాయిల్ కవిత్వశైలి.

ధనియాల తిప్ప

అంతా ఒక తెల్ల కాగితం.

అందులో ఒక మూలగా

ఒక అడ్డుగీతా

ఒక నిలువు గీతా –

తెరచాప ఎత్తిన పడవ.

కిందిది నదీ

పైది ఆకాశమూ

కావొచ్చు.

సుమారు ముప్పై ఏళ్ళ క్రితం వ్రాసిన పై కవిత లో ఒక దృశ్యం ఇప్పటికీ సజీవంగానే కనిపిస్తుంది. నదీ ఆకాశం కలుసుకొన్న చోట ఒక పడవ. తెరచాప నిలువుగీత, పడవ అడ్డుగీత. అంతే అంతకు మించేమీ లేదు. ఇదే దృశ్యాన్ని నాబోటి వాడు “నది ఆకాశాన్ని ముద్దిడే సుదూర మైదానపు దారులలో ఒంటరి పడవ ప్రయాణం” అంటో వెలిసిపోయిన అలంకారాలతో, పదాల డమడమలతో కవిత్వీకరించవచ్చు. కానీ ఇస్మాయిల్ కవితలో ఒక దృశ్యం మాత్రమే పదాల ద్వారా వ్యక్తీకరించబడింది. అది చాలా నిశ్శబ్దంగా చదువరి హృదయంలో పడవలా సాగుతుంది. అందుకే శ్రీ వెల్చేరు నారాయణరావు ఒకచోట “…… మాట తనను తాను నిశ్శబ్దం చేసుకుంటే ఒక అపూర్వ శక్తిని సంపాదించుకోగలదని – ఆ పనిని మాటచేత చేయించగలిగిన వాడు ఇస్మాయిల్ ఒక్కరే” అని అంటారు.

చట్రాలు, తిరగళ్ళు కవిత్వానికి కట్టి ఊరేగిస్తున్న కాలంలో ఆ పద్దతికి ఎదురొడ్డి ఇస్మాయిల్ కవిత్వం నిలబడటం ఒక చారిత్రిక సత్యం. అలా తెలుగు సాహిత్యంలో ఒక విస్మరింపజాలని అధ్యాయంలా ఇస్మాయిల్ నిలిచిపోయారు. కవికి అనుభవంతప్ప వేరే ఆస్తి, అస్త్రం ఉండకూడదని ఇస్మాయిల్ భావించాడు. ఆయన కవితల్లో అనుభవసారం ఒక పదచిత్రంగా, ఒక ప్రతీకగా రూపుదిద్దుకొని పఠిత హృదయంలో దీపమై వెలుగుతుంది.

ప్రాపంచిక సంగతులను పారలౌకిక విషయాలతో గొప్ప నేర్పుతో అనుసంధానించటం ద్వారా గొప్ప కవిత్వానుభవాన్ని కలిగించటం ఇస్మాయిల్ కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తుంది.

పాట

సెలయేరా, సెలయేరా!

గలగలమంటో నిత్యం

ఎలా పాడగలుగుతున్నావు?

చూడు, నా బతుకునిండా రాళ్ళు.

పాడకుంటే ఏలా?

లోపల చిరుగుల బనీనుతో కృష్ణదేవరాయుల రాజసాన్ని పలికించే రంగస్థల నటుడో లేక గొంతుమూగబోయినా హృదయంతో అద్భుతగీతాలను గానంచేసిన కృష్ణశాస్త్రో, కళాకారుడెవరైనప్పటికీ నిత్యం గలగలమంటో పాడటంలోని అనివార్యతలాంటి జీరనేదో ఈ కవిత పట్టిచూపుతుంది. సౌందర్యభాషలో తాత్వికతను చెప్పినట్లుంటుంది.

కవిత్వం కరుణను ప్రతిబింబించాలని నమ్మిన వ్యక్తి ఇస్మాయిల్. జీవితాన్ని ప్రేమించి జీవనోత్సాహాన్ని గానం చేసిన సౌందర్య పిపాసి. కవిత్వంపై సామాజిక స్పృహ అనే బరువును వేసి బలవంతంగా మోయించిన రోజులవి. మోయలేము అనే కవుల్ని అకవులు అని నిందించే కాలంలో, ఇస్మాయిల్ గారు ఒక్కరే నిరసించి – మనం రోజూ చూసే విషయాలని, చిన్నచిన్న అనుభవాలనే కవిత్వంగా మార్చి ఇదీ అసలైన కవిత్వమని ప్రకటించారు. బాగా దాహం వేసినప్పుడు చల్లని మంచినీళ్ళు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. ఇది మనం అనేకసార్లు అనుభవించిన ఒక అత్యంత సాధారణమైన అనుభవం. కానీ ఈ అనుభవమే ఇస్మాయిల్ గారి చేతిలో పడి చక్కని కవితగా రూపుదిద్దుకొంది….. ఇలా…..

దాహం

వేసవి గాడ్పులకి

దాహపు ఖర్జూరచెట్టు

యెడారి గొంతులో

అమ్ములపొదిలా

విచ్చుకుని

గరగరలాడుతోంది.

చల్లటి నీళ్ళు

గొంతు దిగుతోంటే

ఎంత హాయి//

యెడారిగొంతు, ముళ్లతో ఖర్జూరచెట్టు విచ్చుకోవటం, గొంతులో గరగర వంటి పదచిత్రాలన్నీ ఒక అనుభవాన్ని ఎంతో అందంగా, హాయిగా (గరగరగా) మన అనుభూతికి తెస్తాయి.

ఇస్మాయిల్ కవిత్వంలో డబుల్ మెటాఫెర్స్ అద్భుతంగా ఒదిగిపోయి కవితకు అందాన్ని, లోతైన అర్ధాన్ని ఇస్తాయి. ఆయన పదచిత్రాల సౌందర్య రహస్యం అదే కావొచ్చు.

వాన వచ్చిన మధ్యాహ్నం

బరువెక్కిన సూర్యుడు

బతకనీడు భూమిని

ఉదయమ్మొదలు

ఊపిరాడనీడు

సర్వాన్ని అదిమిపట్టి

వీర్యాన్ని విరజిమ్మాడు.

ఆకల్లాడదు.

ఏ కాకీ ఎగరని

ఏకాకి ఆకాశం.

ఇంతలో హటాత్తుగా

ఇలకు కలిగింది మబ్బుకడుపు.

వేవిళ్ళ గాలులు

వృక్షాగ్రాల్ని వూపాయి.

ధాత్రీచూచుకాలు నల్లపడ్డాయి.

తటాకాల చెంపలు తెల్లపడ్డాయి.///

పై కవితలో వీర్యం, కడుపు, వేవిళ్ళు, నల్లబడ్డ చూచుకాలు ఇవన్నీ ఒక స్త్రీ గర్భవతి అవ్వటాన్ని సూచిస్తాయి. అదే విధంగా విపరీతమైన ఎండకాసిన తరువాత వానపడటం అనే విషయాన్ని సూర్యుడు, భూమి, ఆకు అల్లాడకపోవటం, మబ్బులు, గాలులు, ధాత్రి నల్లపడటం, తటాకాలు తెల్లబడటం వంటి వర్ణనలు తెలియచేస్తుంటాయి. రెంటి మధ్య సమన్వయాన్ని బరువెక్కిన సూర్యుడు, మబ్బుకడుపు, ధాత్రీచూచుకాలు, తటాకాల చెంపలు అనే పదబంధాల ద్వారా సాధించి కవితకు అద్భుతమైన లోతును వచ్చేలా చేసారు. చివరలో “వర్షాగర్భంలో వర్ధిల్లే శిశుపిండాన్ని” అంటూ కవి తనను తాను ప్రకటించుకోవటం, ఆ అనుభవాన్ని హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది. ఇదే రకమైన శైలిలో వ్రాసిన సంజె నారింజ అనే కవితలో….

దినపు రేకలపైన వాలెను

ఇనుని సీతాకోకచిలుక//

గులక రాళ్ళ పిట్టలతో

కులుకు తరుశాఖ ఏరు//

వొంగిన సాయింత్రపు రంగుల ధనసు

విసిరే గాలి బాణం

పై కవితలో దినాన్ని పుష్పంగా, సూర్యుడ్ని సీతాకోక చిలుకలా, ఏరుని వృక్షంగా, గులకరాళ్ళని పిట్టలుగా, ఇంధ్రధనస్సుని గాలి బాణంగా పోలుస్తూ ఒక దృశ్యాన్ని పదచిత్రాలుగా పేనిన కౌశలం అబ్బురపరుస్తుంది.

వానని అనేక మంది కవులు అనేక విధాలుగా వర్ణించారు. కానీ ఈ విధంగా వర్ణించటం ఇస్మాయిల్ కే సాధ్యం.

శ్రావణ మంగళవారం

సాయంత్రం

ఒకానొక మబ్బు డస్టరు

అకస్మాత్తుగా ప్రవేశించి

భూమ్మీది వెర్రి రంగుల్నీ పిచ్చిగీతల్నీ

పూర్తిగా తుడిచేసి,

మెరిసే వానసుద్దముక్క పట్టుకొచ్చి

వీధుల్లో కళ్ళనీ

రోడ్లపై పడెల్నీ

లోకంలో కాంతినీ

వెయ్యిపెట్టి గుణించేసి

చెయ్యూపి వెళ్ళిపోయింది///

ఈ కవితలో కూడా మబ్బుడస్టరు, వానసుద్దముక్క వంటి పదబంధాల ద్వారా అద్భుతమైన పదచిత్రాల్ని నిర్మించి ఒక సుందరదృశ్యాన్ని కళ్లముందు నిలుపుతారు.

స్వారీ అనే కవితలో ఒక మనోహర సందర్భాన్ని ఇస్మాయిల్ వర్ణించిన తీరు గమనిస్తే ఏ చదువరి మనసు కవిత్వ ఆర్గాజం పొందదు!

స్వారీ

కళ్ళెం లేని గుర్రమెక్కి

పళ్ళు గిట్ట కరచి

ఏ శత్రు సంహారం కోసమో

వైచిత్ర సమరంలోకి

స్వారి చేసే యోధురాలామె.

మళ్ళీ, యుద్ధాంతాన

కళ్ళు తేలేసి

నిర్వికల్ప సమాధిలో

సర్వాంగాలూ స్తంభించే

యోగిని కూడాను.

ఇస్మాయిల్ కవిత్వంలో కనిపించేమరో గుణం సున్నితత్వం. అనేక కవితల్లో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తూంటుంది.

చిగిర్చే చెట్లు

నడచివచ్చి నిశ్శబ్దంగా

నా కిటికీ దగ్గిరాగి

హటాత్తుగా

పటేలుమని

వంద వాయిద్యాలతో

వికసించిన బ్యాండుమేళంలా

ఒక రోజు

అకస్మాత్తుగా

చివురించిన చెట్టు

గవాక్షం వద్ద నన్ను ఆపేసింది.///

పై కవితలో చెట్టు చివురించటాన్ని “వందవాయిద్యాల బ్యాండుమేళం” అంటున్నాడంటే, అది కవి దృష్టిలో ఎంత పెద్దదో, ఈ కవెంత సున్నితమనస్కుడో అర్ధం చేసుకోవచ్చును. అందుకనే ఈయన కవిత్వంలో సూర్యకిరణాలు, చందమామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, కొత్తచినుకులు, సొట్టబుగ్గల బావులు, చెట్టుపై వాలినచిలకలు, పసిపాపలు, గులకరాళ్లు వంటి అనేక కవితావస్తువులు కనిపిస్తూంటాయి. వీటన్నింటిని మనం నిత్యం చూసేవే అయినా ఆధునిక జీవనపు రణగొణల్లో పడి ఆ అందాలకు అంధులం అవుతాం దాదాపుగా. అలాంటి సున్నితమైన విషయాలతోనే ఇస్మాయిల్ కవిత రచన చేసారు. చిన్న చిన్న అనుభవాలని అందమైన పదచిత్రాలలో బంధించి మనకందించారు.

పడిలేచిన అనేక కవిత్వరీతుల వెల్లువల్లో కొట్టుకుపోకుండా మూడున్నర దశాబ్దాలపాటు తనదైన శైలిలోనే ఇస్మాయిల్ కవిత్వాన్ని వెలువరించారు. రాజకీయ కవిత్వాలు తమ ప్రాసంగితను కోల్పోయాక సేదతీర్చేది ఇస్మాయిల్ మార్కు కవిత్వమే అనటంలో సందేహంలేదు. ఆయన తను సాగిన బాటలో ఎందరో అభిమానులను పోగేసుకొన్నారు. ఆయన శిష్యులుగా ఎంతో మంది అదేబాటలో పయనించి తర్వాతికాలంలో మంచి కవులుగా పేరుతెచ్చుకొన్నారు. గోదావరి శర్మ, విన్నకోట రవిశంకర్, ఆకెళ్ళ రవిప్రకాష్, తమ్మినేని యదుకుల భూషణ్, మూలా సుబ్రహ్మణ్యం, కొండముది సాయికిరణ్, బి.వి.వి. ప్రసాద్, హెచ్చార్కె, నామాడి శ్రీథర్, శిఖామణి, అఫ్సర్ వంటి కవులకు ఇస్మాయిల్ అభిమాన కవి. అలా ఇస్మాయిల్ కవుల కవిగా కీర్తిశేషులయ్యారు.

-బొల్లోజు బాబా

మీ మాటలు

  1. బాబా గారూ,

    ఇస్మాయిల్ ని చాలా చక్కగా ఆవిష్కరించేరు.

    హృదయపూర్వక అభినందనలు.

  2. భవాని says:

    తొలకరి వాన లాంటి ఇస్మాయిల్ గారి కవితల్ని మట్టి వాసనంత కమ్మగా మా హృదయాల్లోకి రేపారు . ధన్యవాదాలు

మీ మాటలు

*