ఎర్రటి ఎన్నియల్లో ఎన్‌కే

10410372_10152573024851700_6156636491804091071_n‘ఎన్‌కే మరణించారు..’ అని ఒక స్నేహితురాలు ఎస్ఎంఎస్ పెడితే ఆఫీసునుంచి వణికించే చలిలో తిరిగి వస్తున్న నా శరీరంలో వెచ్చని నెత్తురు ఎందుకు ప్రవహించింది? దేహాన్ని కోస్తున్న చలిగాలుల మధ్య ఒక వేడిగాలి ఎందుకు నన్ను చుట్టుముట్టింది? గుండెలో ఏదో కలుక్కుమన్న భావన ఎందుకు కలిగింది? అసలు నేనెవరు? ఆయనెవరు?

రోజూ చాలా మంది మరణిస్తుంటారు. పత్రిక పేజీలు తిప్పితే ఎక్కడో ఒక మూల మనకు పరిచయమైన వారి మరణాలు కనిపిస్తుంటూనే ఉంటాయి. శీతాకాలంలో పచ్చటి చెట్లపై మంచు పేరుకుపోయినట్లు, శిశిరంలో ఆకులు రాలినట్లు మనుషులు మరణిస్తుంటారు. కాలం సాగుతూనే ఉంటుంది.

‘ఎన్‌కే’ అనే నెల్లుట్ల కోదండ రామారావు మరణం సహజ మరణమే కావచ్చు. ఏడుపదుల వయస్సు దాటి, అనారోగ్య సమస్యలకు గురై, మంచం పట్టి అనేకమంది లాగా ఒకరోజు శ్వాసవదిలి పొందిన మరణంకావచ్చు. ‘మరణం చిరస్మరణీయమైనదే.. కాని బూడిదను పులుముకోవడం నాకిష్టం లేదు.’. అని మరణం గురించి ఒక కవితలో రాశాను. ఎన్‌కే మరణం చిరస్మరణీయమైనదే. కాని ఆయన చితాభస్మంలో కూడా రగులుతున్న నిప్పుకణాల్లో రేపటి జ్వాలలు కనిపిస్తాయి. ఎగరేసిన ఎర్రజెండ రెపరెపల ధ్వనులు వినిపిస్తాయి. 

కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒకరోజు వరవరరావు నివాసంలో సాహితీ మిత్రుల సమావేశంలో ఎన్‌కేను చూశాను. ఆ గాంభీర్యం చూస్తే భయమేసింది. ఆ కరచాలనం గగుర్పాటు కలిగించింది. ఆయనది పూర్తిగా వికసించిన నవ్వు కాదు. అరవిరిసిన ఆ నవ్వులో కూడా ఒక సీరియస్‌నెస్ కనిపించింది. ఇక ఆయన గొంతెత్తి కవిత చదివినా, పాటపాడినా తనను తాను జ్వలింపచేసుకుంటున్నట్లే కనపడేవాడు. ఆయన అభిమానంగానే పలకరించేవాడు. కాని ఆ ఆభిమానంలో కూడా హత్తుకోలేనంత దూరం ఉండేది. 

ఆ రోజుల్లో చాలా మంది విప్లవాభిమానులు, విప్లవ రచయితలు అలాగే ఉండేవారు. వారితో మాట్లాడితే మనలో ఉడుకు నెత్తురు తనంతట తాను ప్రవహించేది. కరచాలనం చేస్తే విద్యుత్ తగిలి నరాలు ప్రకంపించేవి. వారి ఉపన్యాసాలు, కవితలు, పాటలు మైదానాల్ని, జనారణ్యాల్ని రగిలించేవి. రేపే విప్లవం వస్తుందని, మరి కొద్ది రోజుల్లో సమసమాజం ఏర్పడుతుందన్న వీరోత్సాహం కలిగేది. 

ఈ నేపథ్యంలోనే నాటి కవుల కవిత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ వాటిని చదివితే నినాద ప్రాయంగా అనిపించవచ్చు. కాని వారు ఒక కవిత రాసిన వెంటనే అందులో వాక్యాలు గోడలపై నినాదాలుగా మారి, ప్రజల గొంతుల్లో ప్రతిధ్వనించేవని మనం ఈనాడు అర్థం చేసుకోగలమా? నగ్నంగా మండే ఆచ్చాదన లేని అగ్నిజ్నాలలు నాటి కవితలు. అది ఆనాటి సామాజిక అవసరం కావచ్చు. 

జననాట్యమండలి ఉనికిలో లేని రోజుల్లో ఎన్‌కె విప్లవగీతాలు రాసే వారు. తానే పాడేవారు. శివసాగర్ రాసిన అనేక పాటలను స్వరపరిచింది ఆయనే. ఆయన చెల్లీ చెంద్రమ్మ పాడితే విన్న ప్రతివాడికీ నెత్తురు మండేది. ‘కత్తి ఎత్తి ఒత్తి. పొత్తి కడుపులో గుచ్చి.’. అని ఆయన కసిగా అంటే మనమే ఆ భ్వూసామి గుండెలో కత్తి దించినట్లు భావించే వారం. మనమే ‘తోటరాములమై’ మన తొడకు తూటా తగిలిందని బాధపడేవారం. 

విద్యార్థులనుప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రచయితలను దిగంబర, విప్లవ కవిత్వాలు ప్రభావితం చేయకుండా ఉండలేని రోజుల్లో ఎన్‌కే సంచలించారు. వరంగల్‌లో వరవరరావు కరచాలనం చేసి ప్రకంపనలు పొంద కుండా ఉండలేని వారిలో ఒకరయ్యారు. విరసం సభ్యుడయ్యారు. సృజన సాహితీ మిత్రుడయ్యారు. అంతే. ఒక సాధారణ ప్రభుత్వోద్యోగిని విప్లవం ఆవహించింది. అయితే తిరుపతి వేంకటకవులను ఢీకొన్న తండ్రి నెల్లుట్ల రామకృష్ణ కవి, నిజాం వ్యతిరేక పోరాటంలో అక్షరాన్ని సాయుధం చేసిన దేవులపల్లి రామానుజరావు సోదరి అయిన తల్లి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల నాయకుడైన సోదరుడు జగన్మోహన్ రావు రక్తం ప్రవహించనిదే ఎన్‌కే కలం ఎలా చేపట్టగలరు?


‘తెగిపారిన నెత్తురులో ఎగరేసిన ఎర్రజెండ’ అని ఆయన మేడే పై రాసిన కవిత 1970లలోనే సృజన సంచిక కవర్ పేజీ కవితగా మారింది. అది మేడే నాడు గోడలపై ఎర్రగా మెరిసేది. ‘ఈ వ్యవస్థే ఒకజైలు.. నిర్బంధంలో ఉన్న నీకూ నాకూ తేడా లేదు.. కటకటాలను విరగదన్నుకురా.’.ఈ వ్యవస్థశిరస్సుపై ప్రజాశక్తి పాదాలతో బలంగా అడుగేయి. అని 71లో ఆయన రాసిన కవితా వాక్యాలు నాడు జనంలో శక్తిని నింపేవి. ‘నెత్తుటిలో తడిసిన చెయ్యి పైకెత్తు’ (1973) అని చెప్పినా అదొక ఉత్తేజం కలిగించేది. అలా అని ఎన్‌కే లాంటి కవులకు కవిత్వ ఒడుపు తెలియదని కాదు. కాని జనంలో ప్రవేశించడం కోసం వారు ఒడుపులకోసం పట్టువిడుపుల్ని ప్రదర్శించారు. 

‘అతడు మూసిన పిడి కిలి
శ్రామిక జన నియంతృత్వ స్థాపనకు ముఖద్వారం, 
అతని కదలిక, కదలికలో పొర్లుతున్న అలల కడలి, 
కదులుతున్న శ్వాస, 
పోరాటం బాటలమీదకు ఆహ్వానం రాస్తున్నవాడు, 
నీరు నింగి నేల గాలి తన ఊపిరి పోస్తున్నవాడు.
నాల్గు చెరగులా అంటుకున్న నిప్పు,
నాల్గు దిక్కులా వీస్తున్న తూర్పుగాలి’

అని ఉస్మానియాలో విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి మరణంపై 1974లో ఎన్‌కే రాసిన కవిత ప్రతి విప్లవకారుడికీ ఎనలేని ఉత్సాహాన్ని కలిగించేది. 

ఇవాళ ఒక్కో మరణం మనలో విషాదాన్ని, నిరుత్సాహాన్ని, నిర్వేదనను కలిగించవచ్చు. కాని ఆనాడు ప్రతి మరణంతో విప్లవకవి రగిలిపోయేవాడు. నెత్తుటి రుణాన్ని తీర్చుకుంటానని ప్రతిన చేసేవాడు. వరంగల్‌లో గణేశ్ అనే యువ ఉద్యమకారుడు మరణించినప్పుడు ఎన్‌కే ఈ కవిత రాశారు. 

‘కామ్రేడ్, ఏదో ఒక కొరత, 
ఏదో వెలితి, ఏదోకోత,
అయినా ఈ కళ్లమీద దుఃఖపు తెర దించుకోను, 
ఈ కోతను కత్తిలా వాడుకుంటాను,
ఈ కోతను కవచంలా తొడుక్కుంటాను, 
గుండె మీద కన్నీటి అంచు పెడుతున్న కసి పదును.’.

మరణిస్తామని అందరికీ తెలుసు. కాని పోరాడి మరణించడం అనేది ఒక ఆశయం, ఆకాంక్ష గా మారిన రోజులవి. ప్రతిపాటలోనూ, కవితలోనూ, పోరాడి మరణిద్దాం. మరణించినా అంతిమ విజయం మనదే.. అన్న ఆత్మ విశ్వాసం కనిపించేది. 

‘పోదాం కలిసి పోరాటానికి, వస్తావా నా వెంట
ప్రజలకోసమై ప్రాణం ఇద్దాం
ఉంటావా నా జంట.. 
కళ్లు కళ్లు కలుసుకుని చేసే బాసలు ఏముంటయి, 
మనసు మనసు పరుచుకుని చెప్పే ఊసులు ఏముంటయి
ఉంటే ప్రాణం, పోతే ప్రాణం
కమ్యూనిస్టులకు ప్రజలే ప్రాణం'( పోదాం కలిసి 75 ఫిబ్రవరి)

అని ఎన్‌కే రాశారు. ఇదే పాటలో చరణాలు 
‘అడుగడుగూ రక్తం మడుగు, కమ్యూనిస్టులదే ముందడుగు.’. 
‘అలసిన కన్నుల అలజడి గుండెల జలగా పుట్టిన దే మంట.. 
కలసిన చేతుల కసిగా ముడిచిన పిడికిలి బిగింపులేమంట’

అన్న వాక్యాలు గోడలపై ధ్వనించి రాడికల్ విద్యార్థులకు ప్రేరణ కలిగించేవి. 


‘నీ దారిలో నడుస్తున్నందుకు గర్వంగా ఉంది. 
నీదారి రహదారి కాదు 
రహదారి కోసం దారి కాస్తున్న వాడివి నీవు'(రహదారి 78)

అని రాసిన ఎన్‌కే 

‘ఎర్రజెండా ఎత్తి,కూలిదండు గట్టి కదలి రారో.. ఎర్రాటెన్నెలదేరో'(79),
‘ఎర్రజెండేరోరన్నా, ఎర్రజెండేరో మన బతుకు బాటకు వెలుగుదారి ఎర్రజెండేరో'(74)
అన్న శక్తివంతమైన పాటలు రచించారు  వెన్నెల కూడా ఎర్రగా ఉండాలని కవి భావించిన రోజులవి. 

‘వెచ్చని జనం గుండెల్లోనే అచ్చమైన భద్రత ఉన్నది’. అని ఆయన 1980లో ‘భద్రత’ అనే కవితలో రాశారు. ‘బిగిసిన పిడికిట్లో తుపాకి ప్రతిహింసాధ్వానాల ప్రతిజ్ఞలు తీసుకుంటుంది.’. అని ఈ కవితలో రచించారంటే  నాటి మూడ్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. 

ఇంద్రవెల్లిలో గిరిజనుల ఊచకోత తర్వాత ఎన్‌కే 1981లో రగల్‌జెండా పేరిట మరో కవిత రాశారు. 

‘తడిసి తడిసి నెత్తురైన జెండా ఒకటి 
నీ సేద దీర్చి నీకు నీడపడుతుంది, 
ఆ జెండాదే అయిన సుదీర్ఘ పోరాట చరిత్ర 
ప్రేమతో నీ శిరస్సునెప్పుడూ ముద్దాడుతుంది’


కసి, కోపం, దుః«ఖం, ఆనందం, ప్రతిఘటన సహజలక్షణాలు. వాటిని కవిగా కాళోజీ కాపాడుకున్నారు. కాని ఆయనలో వర్గపోరాట చైతన్యం లేదు అని ఎన్‌కే నాడు విమర్శించారు. కాళోజీనే కాదు, సోమసుందరం, ఆరుద్ర, గంగినేని, దాశరథి లాంటి తెలంగాణ పోరాట కవుల్నీ తన సాహితీ విమర్శలో దుయ్యబట్టారు. నాడు కవిత్వమే కాదు, సాహితీ విమర్శ కూడా ఇదే ధోరణిలో సాగింది. 

ఎన్‌కే రాసిన అత్యంత శక్తివంతమైన, రాజకీయ సైద్దాంతిక ప్రేరణ కలిగిన కవిత ‘లాల్‌బనో గులామీ ఛోడో.’. 1982లో ఆయన రాసిన ఈ కవితకొక చారిత్రక సందర్భం కూడా ఉన్నది. 1980లో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. జనతా పార్టీ నుంచి విడివడి తనకంటూ ఒక రాజకీయ సైద్దాంతిక ఉనికికోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నించింది. ఎమర్జెన్సీ తర్వాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకత ప్రారంభమైన రోజులవి. ప్రత్యామ్నాయ పార్టీగా జనతా వైఫల్యం చెందడంతో బిజెపి ఒక రాజకీయ వేదికగా ముందుకు వచ్చింది. అప్పటికే ఆర్ఎస్ఎస్ శాఖలు విస్తరించడం ప్రారంభించాయి. నక్సల్స్ విజృంభణతో అట్టుడికిపోయిన కొన్ని ప్రాబల్యం గల వర్గాలు రాడికల్ విద్యార్థి సంఘానికి ప్రత్యామ్నాయంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను రంగంలోకి దించాయి. ఒక సైద్దాంతిక పోరు దేశవ్యాప్తంగా కళాశాలలు. యూనివర్సిటీల్లో ప్రారంభమైంది. జ్ఞానం శీలం ఏకత, పరిషత్‌కీ విశేషత.. అని గోడలపై నినాదాలు కనపడేవి. యూనివర్సిటీల్లో విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులూ చీలిపోయి కనపడేవారు. నాడు ఆ భావజాలాన్ని ఎన్‌కె ప్రతిభావంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. ఎబివిపి వారు ఉచ్చరించే పదాలనే వాడుకుని వారిని సైద్దాంతికంగా ఢీకొనేందుకు ప్రయత్నించారు. ఆరోజు ఎన్‌కే వేసిన ప్రశ్నలు ఈనాడూ విలువైనవే. నిజానికి ఆ రోజు సంస్కరణలు ప్రారంభం కాలేదు. సంస్కరణల తర్వాత కార్పొరైటీకరణ మరింత విస్తృతం అయింది. అందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు బలగాలు దోహదం చేశాయి. 

‘నేను నా మాతృభూమి గురించి మాట్లాడుతున్నాను 
నా దేశం రత్నగర్భ.. రత్నాలకోసం గర్భాన్ని చీల్చిందెవ్వరు?
అడవులు ఎవరి ఆస్తి, నదులు ఎవరి ఆస్తి.. 
అదిమ సమాజంపై అడవి రంకె ప్రకటించిందెవ్వడు?
ప్రశ్నించిందెవ్వడు?’


అని ఆయన ప్రశ్నించారు. 

‘వందేమాతరం మృతప్రాయమైన నినాదం కాదు, 
మత వాదంకాదు. జపించే భజన మంత్రం కాదు, 
అమ్మ ఒళ్లోనూ, అమెరికాను కలవరించే 
సామ్రాజ్యవాద దాసులు మీరు.’.

అని ఎన్‌కే రాసిన కవితా వాక్యాలు కాంగ్రెస్, బిజెపితో సహా ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న పలు పార్టీలకు వర్తిస్తాయి. 

‘నాకు స్వాతంత్య్రం రాలేదు.
నా దేశశృంఖలాలు ఈనాటికీ తెగిపోలేదు’.. 

అని ఎన్‌కే రాసిన వాక్యాలు ఇవాళ ప్రతి సామాన్యుడూ వేసుకునే పరిస్థితి ఏర్పడింది. నయా సామ్రాజ్యవాదాన్ని అధికారంలో ఉన్న వారే ప్రోత్సహిస్తున్నారని వేరే చెప్పనక్కర్లేదు. 

మరి వీటికి జవాబేమిటి? మైదానాల్లో పోరాటాలు రక్తసిక్తమైనప్పుడు అడవి బిడ్డలే ప్రేరణ కలిగించారు. అందుకే ఎన్‌కే 

తేనె బతుకులో ఉప్పును, 
ఇప్పపూవులో నిప్పును చూడు
ఇవాళ ఆవులించి ఒళ్లు విరిచిన
ఆకాశంలో ఇంద్రవెల్లి పాలవెల్లి
అదిలాబాద్ నా కన్నతల్లి’

అని రాశారు. కాని ఇవాళ అడవుల్లో కూడా పోరాటం ఉధృతమైంది. జనం పిట్టల్లా కాలిపోతున్నారు. మైదానాలు మాత్రం ఆధునీకరణ వెలుగులతో జిగేల్ మంటున్నాయి. స్మార్ట్ సిటీలకోసం పరవశమవుతున్నాయి. ఎన్‌కే పిల్లలతో సహా మధ్యతరగతి జీవులంతా విదేశాలకోసం పరుగులు పెడుతున్నారు. సంస్కరణల విశ్వరూపం పారిన నెత్తురుపై ఆందమైన తివాచీని కప్పింది. 

ఎన్‌కే కవితలు, పాటలు ఒకానొక చారిత్రక సందర్భంలో రాసి ఉండవచ్చు. కాని అవి వృధా అయ్యాయా? చరిత్రలో మార్పు అనేది సుడులు, సుడులుగా తిరుగుతున్న వర్తులాకార చట్రం(స్పైరల్). వెనక్కు వెళ్లేది ఏదీ విస్తరించనిది కాదు. సామాజిక మార్పూ అలాంటిదే. ఈ మార్పుకు ఎన్‌కే లాంటి వాళ్లు ఎప్పుడూ దోహదం చేస్తూ ఉంటారు.  ఎన్ కే    రాసిన ‘రిహార్సల్’ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. 

-కృష్ణుడు   

మీ మాటలు

  1. మీరు రాసిన స్మతి వ్యాసం ఒక విప్లవ వీరున్ని కళ్ళ ముందు మళ్ళీ ఒక మారు మెదడు రగిలేటట్లు నిలిపింది.ఎప్పుడన్నా తిరుపతిలో విరసం సభల్లో ఎన్.కె గారు నాగరాజు రాసిన పాట విన్నప్పుడు ఒళ్ళంతా భగభగా మండిపోయేది.ఆయన రచనల్ని తిరిగి ముద్రించాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది

  2. balaqsudhakarmouli says:

    చాలా స్ఫూర్తివంతమైన వ్యాసం. స్ఫూర్తినిచ్చింది. నిజంగా ఉద్యమాలకు అంకితమైనవాళ్లకు వందనం. అలాంటి దిశా నిర్దేశం చేసే వాళ్ల అవసరం యిప్పుడు వుంది. అయితే కరువయ్యారు. ప్రతిరంగంలోనూ అవసరం. కావాలి. ఈ తరం నేర్చుకోవ

  3. నారాయణస్వామి says:

    చాలా బాగా రాసావు కృష్ణుడూ! యెన్ కే కు మంచి నివాళి! నేను నా వ్యక్తిగత పరిచయాన్ని స్మరించుకుంటే నువ్వు తన కవిత్వాన్ని జీవితాన్ని గురించి రాసి సమగ్రంగా రాసావు. నెనర్లు!

  4. కెక్యూబ్ వర్మ says:

    తేనె బతుకులో ఉప్పును,
    ఇప్పపూవులో నిప్పును చూడు
    ఇవాళ ఆవులించి ఒళ్లు విరిచిన
    ఆకాశంలో ఇంద్రవెల్లి పాలవెల్లి
    అదిలాబాద్ నా కన్నతల్లి’

    విప్లవ కవిత్వం నినాదప్రాయం అని విమర్శించే వాళ్ళకి గట్టి సమాధానం మీ ఈ నిప్పుల కొలిమిలో చూపారు సర్. కా. ఎన్. కె. అమర్ రహే.. మీకు వుద్యమాభివందనలతో..

  5. పాట తీర్గ అందరి నోళ్ళల్లో నాట్యం చేసిన కవిత లాల్బనో గులామీ చోడో బోలో వందే మాతరం . ఒక తరాన్ని ఉత్తేజపర్చిందది. అట్లనే ఎక్కడ విరసం సభ జరిగినా ఎన్కే జననాట్యమండలి కామ్రేడ్స్ తో సమానంగా పాటలు పాడే వాడు . కొన్ని పాటలైతే ఎన్.కె పాడితేనే ….. అన్నట్టుండేది. ఒక చేత్తో కన్నీరు తుడుచుకొని , వేరొక చేత్తో ఎర్రజెండఎత్తుకొని ……

  6. Aruna nellutla says:

    Krisharao nk pina rasina vyasam chaala bagundi

  7. Krishnudu,
    nk paatalanta udvignanga, kavithalantha aardrathaga undi mee vyasam kooda…,
    EE bhaavaavesham Warangal goppathanam…
    ninnantha KP lo thiruguthu aa patha madhuraallo thadisipoyi ఉనం
    ippudu mee vyasamtho malli…
    aa patha jnapakaalane kaadu, aa rojulanu EE kaalaniki theesukoche vaaradhulu kaavalippudu….
    aashatho…

  8. ఎన్ కే పై రాసిన వ్యాసానికి స్పందించిన రాజారాం, మౌళి, వర్మ, నారాయణ స్వామి, అరుణక్క, రమణ, సహజ లకు కృతజ్ఞతలు. సహజ అన్నది నిజమే. ఎన్ కే భావావేశానికైనా, నా భావావేశానికైనా వరంగల్ గొప్పతనమే కారణం. ఆ గాలి, ఆ నీరు, ఆ సాహచర్యం తెంచుకోలేనివి. ఈ స్పందన చూసిన తర్వాత వారధి నిర్మించడం పెద్ద పని కాదని అనిపించింది.

  9. ””తిరుపతి వేంకటకవులను ఢీకొన్న తండ్రి నెల్లుట్ల రామకృష్ణ కవి, నిజాం వ్యతిరేక పోరాటంలో అక్షరాన్ని సాయుధం చేసిన దేవులపల్లి రామానుజరావు సోదరి అయిన తల్లి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల నాయకుడైన సోదరుడు జగన్మోహన్ రావు రక్తం ప్రవహించనిదే ఎన్‌కే కలం ఎలా చేపట్టగలరు?””’

    ?????????????????????????

  10. నిశీధి says:

    తేనె బతుకులో ఉప్పును,
    ఇప్పపూవులో నిప్పును చూడు
    ఇవాళ ఆవులించి ఒళ్లు విరిచిన
    ఆకాశంలో ఇంద్రవెల్లి పాలవెల్లి అడవి గురించి ఇంత బాగా ఇంకెవరు రాయగలరు . థాంక్స్ అలాట్ సర్ ఈ వ్యాసం చాలా నేర్పించింది

  11. ఎ.కె.ప్రభాకర్ says:

    విప్లవ కవిత్వం నినాదమై అకవిత్వ స్థాయికి జారిందని విమర్శించే వాళ్లకి శివసాగర్ మొదటి జవాబు. ఎన్ కె మరొక జవాబు. ఇవ్వాళ మరో సారి అకవిత్వం కావాలి. నినాదమై గోడమీద మెరిసేఅకవిత్వం. కేవలం అకవిత్వం. గోడలన్నీ ఖాళీగా వున్నాయ్ కృష్ణుడూ! రాస్తావా?

  12. raamaa chandramouli says:

    కొన్నాళ్ళు ఎన్ కె తో కలిసి సహచరించే భాగ్యం నాలాంటివాళ్ళకు కలిగింది. అదృష్టవంతులం మేము.

    కృష్ణుడు గారు ఒక మంచి వ్యాసాన్ని రాసి హృదయాన్ని భారపరిచి చాలా విషాదానందాన్ని మిగిల్చారు.ధన్యవాదాలు.

    రామా చంద్రమౌళి,వరంగల్లు.

  13. D.Subrahmanyam says:

    చాలా మంచి విశ్లేషణ సర్. వారి కవితలని చదివే అవకాసం కలిగించారు. వారి కవితలన్నీ చదివే ఉద్వేగం కలిగించారు.

  14. krishnudu says:

    రామచంద్ర మౌళి, నిశీధి, సుబ్రహ్మణ్యం గార్లకు కృతఙ్ఞతలు. ఈ ఆవకాశం నాకు ఎన్కే, అఫ్సర్ కలిగించారు

Leave a Reply to raamaa chandramouli Cancel reply

*