గుప్పెట్లోని సీతాకోకలు

1376331_10154732143770363_4527960677229738295_n

 

 

 

 

 

 

 

1.
నువ్వూ నేను
ఒకరిలో ఒకరం మాట్లాడుకుంటాం
ఎన్నో చెప్పాలని ఎదురొస్తానా
అవే మాటల్ని కుదురు దండలా పట్టుక్కూచుని నువ్వు.
 
గుప్పెట్లోని సీతాకోకలన్నీ
చప్పున ఎగరడం మానేసి
చెవులన్నీ నీ గుండెకానిస్తాయి
 
2.
విలవిలలాడుతూ తీసుకున్న నిన్నటి వీడ్కోలును
వెక్కిరించే యత్నంలో
ఎలానో నాముందుకొస్తావు
కొన్ని సార్లుగా
పగలు మొత్తంగా
 
నీ సాయంత్రపు దిగులుగూడుకి
నను తాకెళ్ళిన వెలుగురేఖ ఆనవాలు వొకటి
వెంటేసుకుని వెళ్తున్నట్టు చెబుతావు
 
శీతాకాలానికి భయపడి దాక్కున్న
పచ్చదనాన్ని మాత్రం
పొద్దున్నే తోడ్కొని వస్తావు
 
ఎన్నిమార్లు నిద్దురలో నా జ్ఞాపకాన్ని కొలిచావో
రేపెప్పుడైనా చెప్పడం మరువకేం!
 
3.
ఆగీ ఆగీ
వెనక్కి తిరిగి చూస్తావలా
 
కష్టం కదూ
వేళ్ళమధ్యలో నీ స్పర్శని
మరోసారి వరకు శోధిస్తూ కూర్చోవడం
 
రోజుకి రెండు పగళ్ళు,
ఒక్క దిగులు మాత్రమే ఉంటే బాగోదూ!
 
4.
నా అరచేతిరేఖ మీద పయనిస్తూ
కొన్ని కారణాలు అల్లుకున్న కధలేవోచెబుతూ
సముద్రాల్ని, సరస్సు అంచుల్ని
పూల గుబురుల్ని, వచ్చిపోయే వసంతాలని,
ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మబ్బుల్ని తాకుతూ
ఆ చెయ్యే నీ గమ్యమంటావు ఆత్మీయంగా.
 
రేయంతా మేలుకుని వెన్నెలపోగులు విడదీస్తూ
చుక్కల నమూనా ఏదో తేల్చుకున్నట్టుంటుంది.
 
5.
చెప్పేస్తున్నా
నా చిట్టచివరి వెతుకులాటవి నువ్వేనని.
                               -మోహనతులసి

మీ మాటలు

 1. భవాని says:

  చక్కని భావుకత నిండిన కవిత

 2. Very elaborated.. Not crisp

  Could have been a better piece with better editing, better control on thought flow

 3. Mythili Abbaraju says:

  ” రోజుకి రెండు పగళ్ళు,
  ఒక్క దిగులు మాత్రమే ఉంటే బాగోదూ! ”….బ్యూటిఫుల్ !

 4. అబ్బా. ఎన్నాళ్ళకి మళ్ళీ మీ కవిత చదివాను తులసీ. బ్యూటిఫుల్.

 5. నిశీధి says:

  రోజుకి రెండు పగళ్ళు,
  ఒక్క దిగులు మాత్రమే ఉంటే బాగోదూ < నిజం కదూ అసలు ఆ మాటతో మొత్తం కవితకి ప్రాణం వచ్చేసింది . అందమయిన కవిత . Loved it .

 6. గొప్ప భావుకతనిండిన కవిత
  కొన్ని పదచిత్రాలు అద్భుతంగా ఉన్నాయి.

  భౌతిక వర్ణనలతో కవితలు రాయటం ఈజీనే. కానీ మానసిక స్థితిని ఆవిష్కరించగలిగే కవితలు వ్రాయటం చాలా కష్టం.

  ఈ కవిత నిండా పరోక్ష ప్రస్తావనలు, అంతర్ముఖత్వము, అర్ధాంతరత, మార్మికత, లుప్తోపమ ( కొంచెమే చెప్పే ఉపమలు) వంటి అంశాలన్నీ పెనవేసుకొని ఉన్నాయి కనుక ఈ కవితను ఒక అబ్ స్ట్రాక్ట్ కవితగా అనుకోవచ్చు.

  చాలా ఆబ్ స్ట్రాక్ట్ కవితలకు మల్లెనే ఇది కూడా అస్పష్టతా పొలిమేరలవద్ద తచ్చాడుతున్నది. చదువరులు కష్టపడితే కానీ రససిద్ది పొందలేరు. ఓపిక లేనివారు కవితబాలేదని ఓ రాయేసి వెళిపోతారు. రాసినవారి పట్ల గౌరవం ఉన్న పాఠకులు కవితలో అర్ధమైన వాక్యాలను ఏరుకొని తృప్తిచెందుతారు.

  ఏదిఏమైనా ఈ కవితలో ఒక సంశయాత్మక, ప్రేమపూరిత, విరహోత్కంఠిత హృదయ నివేదన, స్పష్టాస్పష్టా తెరల గుండా తెలుస్తోంది. ( కవితాత్మలో నాకు అమ్మాయే కనిపించింది :-))
  తులసి గారికి అభినందనలు

 7. చాలా బాగా రాసారు..

 8. kollurusivanageswararao says:

  చాల బాగా వ్రాసారు

 9. Abdul hafeez says:

  1, 2….. అప్పటికప్పుడు చప్పున కురిసిన పూల వానలా, గుండెల మీద వాలిన సీతకోకల్లా హాయి నింపాయి. ……మొత్తానికి ఒక్క ‘ గో ‘ లో వచ్చిన భావ ధారలా తోచడం లేదు. ఏమైనా … అరుదైన భావుకత, అందమైన ఆలోచన.

 10. narayana sarma says:

  చాలా సార్లు మానసికావస్థలో కవిత్వం రాస్తున్నప్పుడు,వాక్యాలు ఆమార్గంలోనే కనిపిస్తాయి మీ వచనంలో వాక్యాల్లో సంభాషణాగతమైన భౌతిక కాంతి ఒకటి ఉంది.ఇది మిమ్మల్ని కొత్తగా నిలబెడుతుంది..1. “ఎన్నిమార్లు నిద్దురలో నా జ్ఞాపకాన్ని కొలిచావో
  రేపెప్పుడైనా చెప్పడం మరువకేం!”-2.”రోజుకి రెండు పగళ్ళు,
  ఒక్క దిగులు మాత్రమే ఉంటే బాగోదూ!”-అనుభవాన్ని,అనుభూతిని కవిత్వం చేయడం మమేక మవడం బావుంది.

  కలయిక,వీద్కోలు,అనుభవం,అల్లోచన..మళ్ళీ ఆత్మికమైన భౌతిక స్పందన-అంశాత్మకంగా ఒకసంఘటనను చిత్రించిన కవిత..మిమ్మల్ని ఇలా చదవడం బాగుంది.

  • కలయిక,వీడ్కోలు,అనుభవం,అల్లోచన..మళ్ళీ ఆత్మికమైన భౌతిక స్పందన-అంశాత్మకంగా ఒకసంఘటనను చిత్రించిన కవిత – :-) బాగుందండి మీ మాట.

 11. She is one of the best poets in Telugu literature. Not sure how she cud not gather to get on to the helm of it. I wish she perennially writes several poems like this .

 12. అభిప్రాయాలు తెలిపి ప్రోత్సహించిన మీ అందరికీ ధన్యవాదాలు.
  రేఖా గారు, తప్పకుండా, నెక్స్ట్ టైం మరింత శ్రద్ధతో :-)

  బొల్లోజు బాబా గారు, మీ కామెంట్ తో మరిన్ని విషయాలు జత చేసి చెప్పారు…బాగుంది. థాంక్సండి.

 13. చాలా బావుంది మోహన తులసీ… మనసులోని ప్రేమని మాటల్లో పెట్టడం మీకే చాతనవును. ప్రతి వాక్యమూ ఓ ప్రేమలేఖలా ఉంది… అభినందనలు

 14. Jayashree Naidu says:

  బొల్లోజు బాబా గారు అన్నట్టు…
  ఒక సంశయాత్మక, ప్రేమపూరిత, విరహోత్కంఠిత హృదయ నివేదన అనిపించింది…
  చాలా బాగుంది తులసీ.. చాలా చాలా…

 15. bhanu varanasi says:

  మీ గుప్పెట్లో ఏవో కవితా శక్తులు ఉన్నాయి .కంగ్రాట్స్ .

 16. చాలా ఆలశ్యంగా చూస్తున్నా… :(

  బ్రిలియంట్!!!
  ఆ మూడో సీతాకోకచిలుక మాత్రం వదలకుండా చుట్టూరా తిరుగుతూనే ఉంది!!

  బాబాగారి వ్యాఖ్య మాత్రం ఈ కవితని ఇంకో లెవల్ కి తీసుకెళ్ళిందనిపిస్తోంది…..

 17. నాకనిపిస్తూంటుంది …
  ఇలా ఎలా వ్రాయగలుగుతారా …
  అని …
  అద్భుతంగా … అందంగా …
  కొలచ సాధ్యం కాని పరిణతితో …

  అభినందనలు.

 18. అందమైన కవిత.

మీ మాటలు

*