డియర్ రెడ్!

untitled

ఏ ఇందిరా పార్క్ దగ్గరో కొందరు బక్కపలచని స్త్రీలు
ఎర్ర జెండాలని భుజాలపై పెట్టుకుని
గొంతు తుపాకుల్లోంచి నినాదాల
తూటాలు పేలుస్తూ సాగిపోతుంటారు

డియర్ రెడ్ !
నీవు ఎప్పుడు ఇట్లా రెపరెపలాడుతూ కనిపించినా
కొన్ని పురా జ్ఞాపకాలు వెంటాడుతాయి
చిన్నతనంలో ఉదయం లేచి చూస్తే
తెల్లటి ఇళ్ళ గోడల పైన ఎరుపెరుపు అక్షరాలు వుండేవి
‘కామ్రేడ్ జన్ను చిన్నాలు అమర్ హై ‘
‘కామ్రేడ్ జార్జిరెడ్డి అమర్ హై’
‘విప్లవం వర్ధిల్లాలి ‘

‘డాక్టర్ రామనాథం ని చంపేశారు
స్కూలుకి సెలవని’ తెలిసిన రోజున
నా జ్వరానికి తీయటి మందులిచ్చిన డాక్టర్ని
ఎందుకు చంపారో తెలియక
ఏడ్చిన రోజు ఆ రోజు గుర్తుకొస్తుంది

ఎవరీ జన్ను చిన్నాలు ?… ఎవరీ జార్జిరెడ్డి?
ఎందుకు విప్లవం ? డాక్టర్ రామనాథం చేసిన నేరమేమి ?
డియర్ రెడ్ ! నీ కోసం మొదలైన ఒక అన్వేషణ ఏదో
కొంత ముందుకు సాగేక,
ఆకర్షణలో, బంధాలో, బాధ్యతలో, మరేవో ….
ఊపిరి సలపని ఏవో వలయాలలో చిక్కుబడి పోయాను
* * * *

కాసేపటి తరువాత, ఆ ఇందిరా పార్క్ దగ్గరి స్త్రీలు
కొన్ని లాటీలు, భాష్పవాయు గోలాల దాడులతో
బహుశా, చెల్లాచెదురు కావొచ్చు

డియర్ రెడ్ !
అన్ని విజ్ఞాపనలు, వేడుకోళ్ళు అయిన పిదప
చివరగా నిన్నే నమ్ముకుని వాళ్ళు రోడ్డెక్కి వుంటారు
రోజూ ఎవరో ఒకరు, నిన్నే నమ్ముకుని
ఈ నగర రహదారుల పైకి దూసుకొస్తుంటారు

కానీ డియర్ రెడ్ !
అసలీ నగరాలు, నగర అమానవులు
మనుషులుగానే పరిగణించని కొందరు మానవులు
పూర్తిగా నిన్నే నమ్ముకుని, అక్కడెక్కడో
ఒక ప్రపంచాన్ని నిర్మిస్తున్నారట
దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది
నీవు మాత్రమేనని వాళ్లకు మాత్రమే అర్థమయిందా ?

(డిసెంబర్ 2014)

కోడూరి విజయకుమార్

vijay

మీ మాటలు

 1. డియర్ సర్ ఈ కవిత చదువుతుంటే గుండె చెమ్మగిల్లి కళ్ళు చెమర్చాయి.. నిజమే ఎప్పటికైనా విముక్తి మార్గం అదే అదే… రెడ్ సాల్యూట్ సర్..

 2. Red salute to the raised fists . Kudos sir .

 3. Shivarathri Sudhakar says:

  సర్.. ఈ కవిత చదువుతుంటే గుండెల్లోని రక్తమంతా ఎర్రజెండా రెపరెపలతో నిండిపాయింది. విముక్తికి అదే అసలైన మార్గం…. లాల్ సలాం సర్..

 4. డియర్ రెడ్ ! నీ కోసం మొదలైన ఒక అన్వేషణ ఏదో
  కొంత ముందుకు సాగేక,
  ఆకర్షణలో, బంధాలో, బాధ్యతలో, మరేవో ….
  ఊపిరి సలపని ఏవో వలయాలలో చిక్కుబడి పోయాను…

  అంతిమంగా అర్ధం అయేది .. .ప్రయాణం మాత్రమే , గమ్యం కాదు .. వెచ్చటి నెత్తురు కాఫీలా తాగే మార్కెట్ కి .. ఆ ప్రచారహోరు లో బ్రతికే మనకి అంతిమంగా అర్ధం అయేది ..కొందరు మనుషుల దగా ..!!
  మంచి కవిత విజయ్ గారూ

 5. రెడ్ సాల్యూట్ టూ యువర్ పోయెం కామ్రేడ్. రేపుదయం ఎర్రపొద్దే

 6. దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది
  నీవు మాత్రమేనని వాళ్లకు మాత్రమే అర్థమయిందా ?

  భుజం తట్టారు!

 7. “నీ కోసం మొదలైన ఒక అన్వేషణ ఏదో కొంత ముందుకు సాగేక , ఆకర్షణలో , బంధాలో , బాధ్యతలో , మరేవో —- ఊపిరి సలపని ఏవో వలయాలలో చిక్కుబడి పోయాను.”
  “ దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది నీవు మాత్రమేనని వాళ్ళకు మాత్రమే అర్ధమయిందా ? ”

  — బుధ్ధిజీవులంతా పలు అస్థిత్వ వాదాలలో చిక్కుకొని , సమిష్టి పోరాటానికి దూరమై , రాజ్య హింసకూ , అణచివేతకూ మార్గం సుగమం చేశారు. కవిత చదువుతుంటే గతం గుర్తుకు వచ్చింది. మంచి కవిత సర్ !

 8. ఆకర్షణలో, బంధాలో, బాధ్యతలో, మరేవో ….
  ఊపిరి సలపని ఏవో వలయాలలో చిక్కుబడి పోయాను

  మనుషులుగానే పరిగణించని కొందరు మానవులు
  పూర్తిగా నిన్నే నమ్ముకుని, అక్కడెక్కడో
  ఒక ప్రపంచాన్ని నిర్మిస్తున్నారట

  మరో ప్రపంచం,
  మరో ప్రపంచం,
  మరో ప్రపంచం పిలిచింది!
  పదండి ముందుకు!
  పదండి తోసుకు!

  వెళ్దాం, మరో జన్మ ఉంటే…అక్కడ నగర అమానవులు ఉంటే…

 9. kalidindinvmvarma says:

  లాల్ సలాం

 10. E sambukudu says:

  “దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది
  నీవు మాత్రమేనని వాళ్లకు మాత్రమే అర్థమయిందా ?”
  మిగతా ప్రపంచానికి ఎందుకు అర్ధంకాలేదు!?
  .డియర్ రెడ్
  అర్ధం చేయించటమ్ లో నువ్ ఫెయిల్ అయ్యావ్.

 11. ఆలస్యంగా చదివాను అపురూపమైన కవితను.

 12. డియర్ రెడ్! అర్ధమై తీరుతుంది ఒక నాటికి మానవులందరికీ..

 13. srinivasarao says:

  ప్రజలే తమ్ముతాము విముక్తి చేసుకుంటారు. ఎవరో కొద్ది మంది వీరశిఖామణులు ప్రజల్ని విముక్తిచేస్తారని పగటి కలలు కనడం కేవలం అవివేకంతోకూడిన భ్రమ మాత్రమే”
  -లెనిన్

  • డియర్ రెడ్ ! వ్యక్తులకు చిన్ హం కాదు , ప్రజలకే! సైద్దాంతిక తో కూడిన ప్రజలు.

   • srinivasarao says:

    సార్ thirupalu గారు ప్రజలు ఎవరినో నమ్ముకొని రోడ్డేక్కరు వారి అవసరాలు, ఓ భరించలేని స్థితి వారిని పిడికిళ్ళు భిగించి ముందుకు సాగేటట్టు చేస్తుంది వారికి దిశా నిర్దేశాన్ని సిద్దాంతం సూచిస్తుంది. అంతేగాని ఎవరినో నమ్ముకొని ప్రజలు రోడ్డెక్కరని నా అవగాహన.

 14. E sambukudu says:

  సైద్దాంతిక తో కూడిన ప్రజలు ఎక్కడున్నారు !? అక్కడెక్కడో ఒక ప్రపంచాన్ని నిర్మిస్తున్నారట(బహుసా అడవిలో ననుకుంటా)
  వాళ్లకు మాత్రమే అర్థమయిందా అని కవి సందేహాన్ని వ్యక్తము చేస్తే వీలైతే దానిని గురించి చర్చించాలి. దాని మంచి చెడ్డలు చర్చించకుండా కవిత బాగుందని కవిత గురించి మాట్లాడటం చూస్తే కవిత్వం కవిత్వమ్కోసమె
  అన్నట్టులేదా

 15. buchireddy gangula says:

  సో సో –చదవటానికి ఓకే —
  అయిన బాగుంది అన్నాడు కాబట్టి నేను భాగుంది అనా లే — అ తిరుగా
  రాయడం దేనికి ???

  డియర్ రెడ్ — దేశం లో చేసిన మార్పులు ఏమిటో ???
  డియర్ రెడ్ లో కుల మత పట్టింపులు లేవా — కవి గారు —
  సమానత్వం — గుర్తింపులు — విలువలు —డియర్ రెడ్ లో ఒకే తిరుగా ఉన్నాయా — విజయ గారు ????

  బాబులు — బాబాలు ఏలుతున్న దేశం మనది —
  Desha – రాష్ట్ర రాజకీయాలు అలానే ఉన్నాయి — సాహితి ప్రపంచం లో —
  అవే రాజకీయాలు
  the..buck…starts…from..you..///from.. me—అపుడే మార్పు
  ——————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 16. ఆది శేషయ్య says:

  సార్,
  ఎరుపుపైన మీకున్న అచంచలమైన విశ్వాసానికి అభినందించాల్సిందే. అయితే ఇటువంటివి మరికొన్ని కవితలు రాస్తే నేను మరో పిడికెడు సంతోషాన్ని పొందుతాను. మరొకటి ఏమిటంటే, మీరు రామనాథంను గుర్తు చేస్తే మాకు ఆ వరుసలో పురుషోత్తం, అజం ఆలి, బాల గోపాల్ ఇలా మదిలో బారులు కడతారు. అందుకని మీరు కవిత్వం ద్వారా మా జ్ఞాపకాలను మోసుకొస్తే మీరు పెద్దవాళ్ళు అయినా సరే నేను అభినందిస్తాను.

 17. శ్రీనివాసుగద్దపాటి says:

  స్కూలుకి సెలవని’ తెలిసిన రోజున
  నా జ్వరానికి తీయటి మందులిచ్చిన డాక్టర్ని
  ఎందుకు చంపారో తెలియక
  ఏడ్చిన రోజు ఆ రోజు గుర్తుకొస్తుంది..
  అద్భుతమైన కవిత అమరవీరులకు సరైన నివాళి

 18. కోడూరి విజయకుమార్ says:

  స్పందించిన మిత్రులకు కృతజ్ఞతలు

మీ మాటలు

*