కవిత్వాన్ని జీవిస్తే, జీవితం తిరిగి కవిత్వమిస్తుంది:ఇస్మాయిల్

ismayil painting rainbow

ఈ వారం ప్రత్యేకం: ఇస్మాయిల్ గారి చివరి అముద్రిత ఇంటర్వ్యూ

కవి ఇస్మాయిల్ గారిలో ఒక గొప్ప సాహితీ విమర్శకుడు, నిరంతర అధ్యయన శీలి, దార్శనికుడు, తత్వవేత్త, మారుతున్న ప్రపంచాన్ని మౌనంగా గమనిస్తున్న అలుపెరుగని యాత్రికుడే కాక నిరాడంబర జీవనం గడిపే గొప్ప ప్రేమికుడూ ఉన్నారు. పదిహేనేళ్ళుగా ఆయనను విభిన్న సందర్భాలలో దగ్గరగా గమనించిన నాకు ఏ అంశాన్నయినా ఆయన తన జీవితంలో సాధ్యం చేసుకున్నాకనే కవిత్వంలో అలవోకగా పలికిస్తోన్నట్టు తెలుస్తూ వచ్చింది.  అందుకనే ఆ కవిత్వం అంత శుద్దంగా, గాఢంగా, అడవి పూల గాలి లాగ వ్యాపించి అందరినీ కదిపి ఆలోచింపచేస్తూ ఉంటుంది.

ఇస్మాయిల్ గారు ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారు.  ఎన్నో అంశాలమీద సూక్ష్మమయిన నిశితమయిన విమర్శ చేసి ఉన్నారు.  కవిత్వ సృష్టికి, కవితాస్వాదనకి ప్రాణ భూతమయిన ఎన్నో అంశాలను ఎప్పటికప్పుడూ చెప్తూ వచ్చారు.

నిరంతరమూ స్పష్టమయిన అవగాహనతో ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ, ధ్యాన స్థితిలో కవితా సృష్టి  చేస్తున్న, గాఢమయిన అనుభూతి నెరిగిన వ్యక్తిగా, ఇప్పటికీ రాస్తున్నకవి గా, ఆయన కవిత్వం మీదా, కొన్ని సమకాలీన అంశాలమీదా  ఆయన అభిప్రాయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో చేసిన సంభాషణ ఇది.

1945 తర్వాత 15 సంవత్సరాలపాటు జీవితాన్ని గురించి తెలుకోవడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ గడిపానని అన్నారు మీరు.  ఆ తర్వాత 1960లో మీ నుంచి కొత్త కవిత్వం వచ్చిందని, దీనికి విమర్శకులు ‘అనుభూతి కవిత్వమని’ పేరు పెట్టేరని అన్నారు.  కవి కావలసిన ప్రతి వ్యక్తి కి  ఇంత సుదీర్ఘమయిన ప్రపంచ పరిశీలనా, ఆత్మానుశీలనా అవసరమా ? ఈ వేళ కొత్త తరం కవులకు ఇంత ఓపిక ఉందా ?

– నేను సహజంగా మొద్దు నవటం వల్ల కవిత్వం రాయటానికి  వచ్చేటప్పటికి అంత కాలం పట్టిందనుకుంటున్నాను.  కవి కాదలచుకున్న వాడికి ఏకకాలంలో ప్రపంచ పరిశీలనా, ఆత్మానుశీలనా చాలా అవసరమనేది నిస్సందేహం.

బహి:ప్రపంచమూ, అంతశ్చేతనా కలుసుకునే చోటు నుంచికవిత్వాన్ని ప్రత్యక్షం చేసుకోవలసిన అవసరం కవికి ఉందా ?అది  లేకుండా మంచి కవిత్వం కేవల ప్రతిభతో రాయలేడా ?

-బహి:ప్రపంచమూ, అంతశ్చేతనా తారసిల్లినప్పుడే కవిత్వపు రవ్వ పుడుతుంది.  ధన రుణ ధృవాల కలయిక వల్ల  విద్యుచ్చక్తి పుట్టినట్లు. ప్రతిభ అంటే అదే.  మిగతావన్నీ వ్యుత్పత్తికి సంబంధించినవి.

మిమ్మల్ని ప్రభావితం చేసిన కృష్ణ శాస్త్రి గారి నుంచి మీరు విడివడి స్వయం కవితా వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి మీ లోపలి సంఘర్షణా, అన్వేషణల  గురించి ఒకచోట చెప్పారు.  అలా చెయ్యడం వల్ల సాహిత్యం మీద మీరు వేసిన ప్రతేక ముద్ర ఏమిటి ?

– నాకు కృష్ణ శాస్త్రి గారంటే ఆరాధన.  ఐతే, కోతిలా కృష్ణ శాస్త్రి గారిని అనుకరిస్తే, ఇక నేనెందుకు ? నా కవిత్వమెందుకు ?  ఆయన్ని అనుకరించటం మా ఇద్దరికీ అన్యాయమే.  అందుకని, నా సొంత మార్గం వెతుక్కున్నాను.  ముందు నేనెవర్నో తెలుసుకోవటానికి ప్రయత్నించాను.  మరి ముద్ర సంగతా, అసలు ముద్ర పడిందో లేదో కాలం నిర్ణయించాలి.

1960 నుంచి ఈ నాటిదాకా శుద్దమయిన కవితాధార మీ నుంచి ఊటలూరుతూనే ఉంది. అమృతం లాంటి శుద్ధ కవిత్వ జలాల మూలాలు ఏమిటి ?

– కవిత్వానికి మూల మేమిటి ? జీవితమూ, అది జీవించిన తీరూ. కవిత్వాన్ని జీవిస్తే, జీవితం తిరిగి కవిత్వమిస్తుంది.

ismail

 కవిత్వంలో క్లుప్తత, సాంద్రత అన్న లక్షణాలు మీరెలా సాధించ గలిగారు ? అంత సంయమనం ఎలా ఒనగూడింది ?

-కవిత్వం తపస్సులాంటిది. తపస్వికి వాచాలత రాణిస్తుందా ? కనుక కవిత్వానికీ మౌనానికీ ఒక అంగుళం మేర తేడా మాత్రమే ఉండాలి.

చెట్టు ఆదర్శంగా మొదలయినా మీ కవిత్వం ధ్యాన (జెన్ మార్గపు హైకూ) స్థితికి చేరుకోగలగడంలోని క్రమ పరిణామపు అంతస్సూత్రం ఏమిటి ? (చెట్టు ఆదర్శంగా భావించడం నుంచి తానే చెట్టుగా తాదాత్మ్యం చెందడం దాకా)

– ఈ తాదాత్మ్యమన్నది జెన్ బౌద్దుల నించి కొత్తగా నేర్చుకున్నది కాదు.  కవిత్వమెప్పుడూ తాదాత్మ్యం నించే ఉద్బవిస్తుంది.  ప్రపంచంలోని వస్తువులతో తాదాత్మ్యం చెండలేనివాడు కవిత్వం రాయలేడు.  ‘చెట్టు నా ఆదర్శ’మనే కవితకు మూలం చెట్టుతో తాదాత్మ్యమే

ఈ వేళ సాహిత్యంలోకి కొత్తగా ప్రవేశ పెట్టబడిన పర్యావరణ స్పృహ వల్ల పర్యావరణానికి గాని, కవికిగాని వచ్చే ప్రయోజనం ఏదయినా ఉందా?

– పర్యావరణ కాలుష్యం వల్ల  జీవజాలం నశించిపోయే ప్రమాదం ఏర్పడిందివాళ. పర్యావరణ స్పృహ కవులకే కాదు, ప్రతి ఒక్కరికీ ఉండవలసిందే.

ఏడు దశాబ్దాలు దాటిన మీరు జీవితాన్ని కవిగా ఎలా అర్ధం చేసుకున్నారు ? మనిషిగా ఎలా అర్ధం చేసుకున్నారు ? రెండూ ఒకదానికి ఒకటి సహాయపడ్డాయా ?

– కవీ, మనిషీ వేరు వేరు కాదు.  రెండూ ఒకటే. కనుక, కవిగా ఒకలాగా, మనిషిగా మరోలాగా అర్ధం చేసుకోవటం ఉండదు.  కవీ, మనిషీ ద్వంద్వాలు కాదు.  ఇద్దరికీ ఒకటే వేరు – మానవత్వం.

 మానవ జీవితంలో చలం గారు చెప్పినట్టు మోహానుభవాలు, ప్రేమానుభవాల కంటే గొప్పవి ఏవీ లేవా ? లేకపోతే ప్రపంచం మరింతగా రోజు రోజుకీ భౌతిక విలువల పరుగుతో సర్వం ఎలా మరిచిపోగలుగుతుంది ? కవులు కుడా దీనికి మినహాయింపు కావట్లేదెందుకు ?

– మానవ జీవితంలో ప్రేమానుభవం కన్నా గొప్పదేదీ లేదు అన్నారు చలం గారు.  నేను దీన్ని కాస్త విశాలం చేసి ‘మానవ సంబంధాల కన్నా గోప్పవేవీ లేవు’ అంటాను.  సాటి మనుషులతో, స్నేహితులతో, భార్యతో, ప్రియులతో, పిల్లలతో, ప్రకృతితో మానవ ప్రేమానుబంధాల కన్నా నిజంగా జీవితంలో గొప్ప విషయాలేమున్నాయి ? వీటిని వదిలిపెట్టి భౌతిక, వ్యాపార విలువల కోసం పరుగు పెట్టేవారెవరూ సుఖపడగా నేను చూడలేదు.  అన్నీ ఉండి, మానవబంధం లేకపోతే ఎందుకా జీవితం ?

ప్రేమా, కరుణా – ఇటువంటి అనుభూతుల్లోంచి కవిత్వం పుడుతుంది.  ద్వేషంలోంచి కవిత్వం రావటం ఇంతవరకు నేనెక్కడా చూడలేదు.  ప్రపంచ కవిత్వ చరిత్రనంతా గాలించినా ద్వేష కావ్యం వంటిది మీకెక్కడా తగలదు.

ఐతే, ప్రస్తుతం మన కవులు రాస్తున్న రాతలు చాలా వరకు వర్గ ద్వేషాల మీద, కుల ద్వేషాల మీదా, లింగ ద్వేషాల మీద, ప్రాంతీయ ద్వేషాల మీద ఆధారపడ్డవే.  అందుకే, వాటిల్లో కవిత్వాంశ బాగా లోపిస్తుంది. ఇటువంటి సాహిత్య ఉద్యమాల వల్ల తట్టలకొద్దీ అకవిత్వం పుట్టుకొచ్చింది.

కవికీ, రచయితకీ అధ్యయన శీలత అవసరమా ? లేకపోవడం వల్ల  సాహిత్యానికి వచ్చే ప్రమాదం ఏదయినా ఉందా ?

-అధ్యయన శీలత ఒక్కటే కాదు. ఐదు అవసరమన్నారు మనవాళ్ళు.  అందులో వారంగనా సాహచర్యం ఒకటి ! ఆశ్చర్యం కాదూ!

దేశాటనం, పండిత మిత్రతా చ,

వారంగానా, రాజసభా ప్రవేశ:,

అనేక శాస్త్రాన్యవలోడనంచ

చాతుర్యమూలాని భవంతి పంచ.

తెలుగు సాహిత్యానికి మంచి విమర్శ లేదనే పాతబడిన విమర్శ ఒకటి ఉంది. ఉత్తరాధునిక విమర్శనా విధానం ద్వారా కొందరు చేస్తున్న సాహిత్య విమర్శ పట్ల మీ స్పందన ఏమిటి ?

-వెంకటేశానికి సెలవుల్లో చదవాల్సిన పుస్తకాలు లిస్టు చెబుతూ గిరీశం, చివర్న ‘కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫ్ఫికల్ట్’ కుడా రాసుకోమంటాడు.  ఇప్పుడింతమంది కుప్పుస్వామయ్యర్లు పుట్టుకురావటం ఆశ్చర్యంగా ఉంది.

ఉత్తరాధునికత తెలుగు కవిత్వంలోకి ప్రవేశించిందా ? ఆ అవసరమూ, వీలూ తెలుగు కవిత్వానికి ఉన్నాయా ?

– కవిత్వం నిష్క్రమించింది కనుక, ఉత్తరాధునికత ప్రవేశించిందనే అనుకోవాలి.

వాడుకలో భాష పాతబడి భావ స్ఫురణను కోల్పోతున్నప్పుడు కవి తిరిగి భాషను శుభ్రపరుస్తాడు ? మీరు తెలుగు పదాలను ఎలా శుభ్రపరచి మెరిపించగలుగుతున్నారు ? స్పటిక స్వచ్చంగా ఎలా చెయ్యగలుగుతున్నారు ?

– సామాన్యమైన అచ్చ తెలుగు మాటలు చలంగారి రాతల్లో ప్రాణం పోసుకుని కళ్ళు తెరవటం చూసాను. కృష్ణ శాస్త్రి గారి మాటల అందం వేరు. చలం వాడిన వాడుక భాషలో గొప్ప శక్తి ఉంది. అది నన్ను ఆకర్షించింది.  జీవంలేని కావ్య భాష మీద వెగటు కలిగించింది. ముక్కవాసన కొట్టేవీ, అరిగిపోయినవీ, పాత మాటల్ని సాగనంపి, జనం నాలికలమీద జీవ నృత్యం చేసే మామూలు మాటల్ని ఆహ్వానించాను.

 పద్య కవులు పద్యాన్ని బతికించాలని ఈ మధ్య అయిదారేళ్ళుగా చాలా  శ్రమపడుతున్నారు.  వీరి కృషి ఫలితాల మీద మీ అభిప్రాయం ? ఈ కాలానికి ఛందోబద్ద  పద్యాలు పనికొస్తాయా ?

-పద్య కవులు ఈ మధ్య మంచి పద్యాలే రాస్తున్నారు.  కాని, మంచి కవిత్వం సృష్టించలేక పోతున్నారు.  వాళ్ళ హేండీ కేప్స్ రెండు: గ్రాంధిక భాషా, ఛంద: కాఠిన్యమూ. ఇప్పటి ప్రపంచం చాలా మారింది.  ఈనాటి కొత్త ఆలోచనలూ, అనుభూతులూ, గ్రాంధిక భాషలో ఇమడవు. పద్యం ఎంత చక్కగా రాసినా, ఈ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

పోనీ భాష మార్చి వ్యవహరీకరిద్దామంటే, ఛందస్సు బిగబడుతుంది. ఈ ద్వైత సమస్యని (dilemma) పరిష్కరించుకునేవరకు వాళ్ళ కవితాభివ్యక్తి  సార్థకం కాదు.

భువన విజయాలు, అవధానాల వంటి పండిత (పామర) రంజన ప్రక్రియలు తిరిగి ఆంద్రదేశంలో రాజాదరణ (అధికారాదరణ) లోకి, ప్రాపకంలోకి పోతున్నాయి.  ఇవి సాహిత్యానికి మంచి రోజులా ? చెడ్డ రోజులా ?

– సర్కసులలో రెండు రకాలున్నాయి: శారీరక సర్కసూ, మేధా సర్కసూ. భువన విజయాలూ , అవధానాలూ రెండో జాతికి చెందినవి. సర్కసులంటే ఇష్టపడే జనం సమృద్దిగా ఉన్నారు.  వాళ్ళని మనం ఆపలేం. రెండిట్లో ఏదైతేనేం ? మనో రంజనం కోసమే కదా !

 ఈ వేళ వర్గం స్థానంలోకి కులం, లింగ విభజన, ప్రాంతీయత, మతం అన్నవి వచ్చి చేరి సాహిత్యాన్ని ఆక్రమించుకున్నాయి. దీని వల్ల సాహిత్యం నష్ట పోతుందా?

– చాలా నష్ట పోయింది. ఇంతకు మునుపు చెప్పానుగా, కవిత్వం ప్రేమ నించి పుడుతుంది గాని ద్వేషం నించి కాదనీ, ద్వేషం ప్రాతిపదికమీద ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా మంచి కవిత్వం పుట్టలేదనీ.  ఇటీవల తెలుగు వస్తున్న బండ్ల కొద్దీ ఆకవిత్వానికి కారణమిదే.

స్త్రీలు స్వంత వ్యక్తిత్వాల కోసం స్వంత గొంతులు విప్పడం జరిగింది కదా! వ్యక్తిత్వ సాధనలో ప్రేమించగల స్వభావం కోల్పోయే ప్రమాదం ఉందా ? లేదా, మరింత ఎక్కువ ప్రేమించ గలరా ?

-వ్యక్తిత్వ సాధనంటే తన శక్తుల్నీ, చైతన్యాన్నీ పరిపూర్ణంగా వికసింపజేసుకోవటం.  అంటే మానవత్వాన్ని పెంపొందించుకోవటం.  ఆత్మ జ్ఞానాన్ని సాధించటం.  అటువంటి వాళ్ళల్లో ప్రేమించ గల స్వభావం పెరుగుతుంది కాని తరగదు.

కుటుంబం స్త్రీలపై హింసకు కేంద్రమని స్త్రీవాదులు, కుటుంబం లేకపోతే స్త్రీలకు మనుగడే లేదని ఇతరులూ అభిప్రాయ పడుతున్నారు కదా! విస్తృతమైన మీ జీవితానుభవం నుంచి, చలం అభిమానిగా మీ ఉద్దేశ్యం, అవగాహన ఏమిటి ?

-వివాహబంధం స్త్రీకీ, పురుషుడికీ ఇద్దరికీ ఉరితాడు వంటిదని చలంగారు భావించారు. కుటుంబ వ్యవస్త పనికిరాదని ఆయన చెప్పలేదు. పెళ్లి తతంగం వద్దనుకున్నా ప్రేయసీ ప్రియులు కలిసి సంసారం చేసి పిల్లల్ని సాకాలి గదా. కనుక. కుటుంబ వ్యవస్థ తప్పదనుకుంటాను.

ప్రేమ సూత్రం గురించి పదే  పదే కవిత్వం ద్వారా చెప్పే మీరు, మూకల వల్ల కాక వ్యక్తుల వల్ల ప్రపంచం మారుతుందని  చెప్పే మీరు, మీ అనుభవంలో ఈ అంశాన్ని దర్శించారా ?

– గాంధీ గారినీ, చలంగారినీ, ఇంకా ఎంతో మంది మైనరు మహాత్ములని చూస్తున్నారు కదా!

విషాద కషాయంతో జీవిత జ్వరాన్ని నయంచేసుకోడానికి కవిత్వం సహాయపడుతుందా ?

-కవి కూడా మామూలు మనిషే, ఎటొచ్చీ తనకు ప్రత్యేకమైన చైతన్య దృష్టితో సగటు మనిషికన్నా కాస్త లోతుగా విశాలంగా చూడగలడు. కనుక, జీవితపు ప్రతిరోధాల్ని, నిర్భందాలనీ అధిగమించి, ప్రపంచంతో సమన్వయము సాధించ గలడు. బతుకులోని లోటుపాట్లని పూడ్చుకుని కొంత పరిపూర్ణత సాధించగలడు. కవి తాలూకు ఈ అనుభవం జీవితంతో అసంతృప్తి చెందిన సామాన్య పాఠకుడికి ఒక కొత్త వెలుతురునీ, ఒదార్పునీ, సంతృప్తినీ ప్రసాదించగలదు.  ఈ విధంగా కవిత్వ కషాయం జీవిత జ్వరాన్ని నయంచెయ్యటానికి పనికొస్తుంది.

 ఉగ్రవాదం పేరుతో, మతం పేరుతో కళ్ళ ముందు జరుగుతున్న మారణకాండపట్ల కవుల బాద్యత ఏమిటి ?

కవులుగా కవుల ప్రధాన బాద్యత ఏమిటంటే అకవిత్వం రాయకుండా జాగ్రత్త పడటం! ఉగ్రవాదం పేరా, మతం పేరా జరిగే దారుణకాండల్ని ఖండించవలసిందే.  దానికి అనేక మార్గాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది రాజకీయచర్య.  వాటికి కవిత్వాభివ్యక్తి ఇవ్వదలచుకున్నప్పుడు ఆ అనుభవాలు తన రక్తంలో జీర్ణమై, అనుభూతి లోనూ అస్తిత్వంలోనూ భాగమైనప్పుడే ఆ పనికి పూనుకోవాలి.

తన యెడల, తన పాఠకుల యెడల ఈ బాధ్యతని కవి మరిచిపోకూడదు.

న్యూయార్కు మీద బాంబులు పడగానే అమెరికానీ, బుష్ నీ తిడుతూ తట్టెడు కవితలు వచ్చాయి కాని, బిన్ లాడెన్ నీ, తాలిబాన్ లనీ, వాళ్ళ అమానుష పరిపాలననీ, మత మౌళిక వాదుల్నీ వాళ్ళ మౌడ్యాన్ని, స్త్రీల అణచివేతనూ ఖండిస్తూ ఒక్కటంటే ఒక్క పద్యం ఈ కవులెవరేనా రాశారా? వీళ్ళు మన కవులు!

గుజరాత్ లో అంత దారుణమైన మారణకాండ, మానవహోమం జరిగింది కదా. గ్లోబల్ ఖడ్గాలూ, అమెరికన్ పిల్లలూ అంటూ గెంతే ఈ కవులెంత మంది గుజరాత్ అమానుషత్వానికి స్పందించారు ? చాలా మంది కవుల హ్రుదయాల్నించి మానవత్వం కారిపోయి, ఆ చోటుని కమ్యునిస్టు, కుల, ప్రాంతీయ రాజకీయ విషాలు ఆక్రమించాయి.

ప్రపంచీకరణ, ప్రవేటీకరణ, మార్కెట్ ఎకానమీల పట్ల స్పందిస్తూ కవులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో విమర్శకులు ఆ కవిత్వాల బలహీనతలను ప్రశ్నించడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి ?

-కవిత్వం బలహీనమైనపుడు ఆ విషయం నిష్పక్ష పాతంగా వెల్లడి చెయ్యటం విమర్శకుల బాధ్యత. విమర్శకులు తాక కూడనివని నిషేధించటానికి ప్రపంచీకరణ, ప్రవేటీకరణ, అమెరికా ద్వేషం వంటి వస్తువుల్లో పావనత్వమేమీ లేదు.  కవితలో కవిత్వాంశ ఎంత ఉందో బేరీజు వెయ్యటం విమర్శకుల పని.  ఉన్న మాట చెబితే ఉలుకెందుకు వీళ్ళకి!

ఈ వేళ సాహిత్య వాతావరణంలో ఒక స్తబ్దత ఏర్పడిందని పలువురు అంటున్నారు.  ఒక దశాబ్దాన్ని పాలించిన స్త్రీవాద, దళిత వాదాలు కొంత ఉపశమించి, ప్రపంచీకరణ అన్న పెను ముప్పువైపు ఏకోన్ముఖంగా దృష్తి సారించిన ఈ తరుణంలో స్తబ్దత నిజంగా ఉందా?

– రాజకీయ వాదాల వల్ల ఉద్యమాల వల్ల కవిత్వం పుట్టదు. కవిత్వాన్ని కవులు సృష్టిస్తారు. అది వైయక్తిక క్రియ. వ్యక్తి  తాలూకు హృదయ స్పందనకు సంబంధించింది.  వాదాలూ, సిద్దాంతాలూ ఉన్నా ఊడినా, ఉద్యమాలు లేచినా పడుకున్నా ఆర్ద్ర హ్రుదయుడైన కవి రచిస్తూనే ఉంటాడు.  స్తబ్దత అనేది వాదాలకూ ఉద్యమాలకే గాని కవులకు కాదు.

రాజకీయ లేదా ఉద్యమ కవులమని చెప్పుకునే వాళ్ళు ఉద్యమం మందగించగానే వాళ్ళు నీరసపడి పోతారు.  నిజానికి వాళ్ళు కవులూ కారు. వాళ్ళది కవిత్వమూ కాదు.

సాహిత్య వాతావరణంలో స్తబ్దత ఏర్పడిందనే సమస్యని ఐదేళ్ళకోమారు లేవనెత్తి, సాహిత్య పేజీలు  నింపుకోవటం పత్రికల వాళ్లకి అలవాటైనట్లు కనిపిస్తుంది.

 కవిత్వం, కథ ప్రాంతీయతల ఉబిలో చిక్కుకున్నాయా ?

-1972 లో నా ‘చెట్టు నా ఆదర్శం’ ప్రచురితమయాక మరుపూరి కోదండ రామారెడ్డి గారు ‘భారతి’ లో సమీక్ష రాశారు.  ‘ఈ కవి గోదావరి మండల మాండలికాన్ని చక్కగా వాడినారు’ అని.  మనమంతా వాడేది మండలికాల్నే. ఐతే చదువుకున్న వాళ్ళ భాషలో వారే ప్రాంతం వారైనా ఎక్కువ సామ్యం ఉంటుంది. ఒకర్నొకరు సులువుగా అర్థం చేసుకోగలరు. చదువు స్కేల్ లో కిందికి వెళ్ళే కొద్దీ ఒకరి మాండలికం మరొకరికి అర్ధమవటం కష్టమౌతుంది.

మాండలికాన్ని వెలుగులోకి తీసుకురావటం మంచిదే.  కొందరు మాండలిక రచయితల్ని చదువుతుంటే, మన భాషలో ఇంత శక్తీ సౌందర్యమూ ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది.  ఐతే ఏక కాలంలో, అన్ని మాండలికాలని సమన్వయించే ఏకీకరణ క్రియ కుడా భాషలో జరుగుతూనే ఉంది.  ఇలా ఏకకాలంలో విభజనా ఏకీకరణ భాషా క్షేత్రంలో జరుగుతుంటాయనుకుంటాను.

మైనారిటీ రచయితల కథల, కవిత్వాల మీద చెలరేగుతున్న వివాదాలు సాహిత్యానికి అవసరమా ?

మైనారిటీ రచయితలే కాదు, ఏ రచయితల గురించి కూడా మంచి సాహిత్య విమర్శా, విశ్లేషణా జరగటం లేదు.  జరుగుతున్నవి చాలావరకు మత కుల ప్రాంతీయ ప్రాతిపదికల మీద రాజకీయ వివాదాలు.

మీ 75 ఏళ్ల జీవితంలో భావ కవిత నుంచి హైకూ దాకా మీరు చేసిన (1942-2002) మీ అరవై ఏళ్ళ కవిత్వ ప్రయాణంలో జీవితం కవిగా మీకు ఏమిచ్చింది ?

– అనిర్వచనీయమైన ఆనందం.  ఆనందో బ్రహ్మ.

హైకూ పద్ధతి మన భాషకు తగదని కొందరు విమర్శకులు అంటున్నారు.  దీనికి హైకూ మార్గదర్శిగా మీ జవాబు ఏమిటి ?

-హైకూ అంటే స్వేచ్చా కవిత్వం.  ఆనందవర్ధన, అభినవగుప్తుల ధ్వని మార్గమే హైకూ మార్గం. ఇది మన భాషకు పనికిరాదన్న పెద్ద మునుషులెవరో కాస్త చెబుతారా ?

 ఇస్మాయిల్ గారి ఇల్లు ఆంద్ర దేశంలో చారిత్రిక స్థలం. అటువంటి స్థలాన్ని మరే దేశంలోనయినా అయితే ప్రభుత్వం మాన్యుమెంట్ గా కాపాడి ఉండేది – అని మీ అభిమానులకు కొండంత చింత.  అరవై ఏళ్ళుగా ఉన్న ఆ ఇల్లు విడిచిపెట్టి రావలసివచ్చినపుడు మీరు చాలా రోజులు ఎంతో సిక్ నెస్ అనుభవించారు.  ఇటువంటి సెన్సిబిలిటీ మనిషికి అవసరమా? కవికి అవసరమా? అది ఆ మనిషికి ఏం ఉపయోగం ?

-మనిషికి సెన్సిబిలిటీయే మానవత్వాన్ని ఇచ్చేది.  ఇది కవిలో మరీ నిశితంగా, సున్నితంగా ఉండాలి.  అంటే కవిలో మానవతా గుణం ఎక్కువ పాలులో ఉండాలన్న మాట. ఈ సుకుమార చేతనే కవిత్వానికి మూలం.

అప్పుడు శ్రీనాధుడు పాకనాటి వాడితే ఇప్పుడు నేను వలసపాక నాటి వాడను!

మీరు మీ పుస్తకాలను ఎందరో సాహిత్యేతర వ్యక్తులకు అంకితమిచ్చారు.  మీ స్నేహాలు కుడా ఎక్కువ అటువంటి వారితోనే (పదవులు, ధనం లేనివారే ఎక్కువ అందులో) దానికి కారణం ఏమిటి ? లోకానికి ఇంత వ్యతిరిక్తంగా ఎలా ఉండగలుగుతున్నారు ?

-నా అసలు జిహాద్ (ధర్మ యుద్ధం) కమ్యునిస్టులతో . ఇది నలభై ఏళ్ళుగా సాగుతోంది. వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సాహిత్యాన్ని హైజాక్ చెయ్యటానికి ప్రయత్నించి ఇంచుమించు కృతకృత్యులయారు. కవుల్నీ, రచయితల్నీ, కళాకారుల్నీ పార్టీ రాజకీయ ప్రచారం కోసం పార్టీకి అంగంగా ఉపయోగించుకోమని లెనిన్ తన భటులకు ఆదేశమిచ్చాడు.  అప్పటినించీ ప్రతి దేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికి మాలినదని యువ రచయితలకు నూరి పోసి, వాళ్ళ చేత నినాద ప్రాయమైన శుష్క రచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకుంటున్నారు. సాహిత్యంలో ఈ రాజకీయ కాలుష్యాన్ని నేను మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను.  ఈ కమ్యునిస్టు ప్రభావం వల్ల ఎంతో మంది యువ రచయితలు జబ్బుపడి, సాహిత్య పరంగా శవ ప్రాయులయారు.  అకవిత్వ కల్మషం దేశమంతా అలుముకుంది.  ఈ వెల్లువ ఇంకా తగ్గినట్టు లేదు. దీనికి వ్యతిరిక్తంగా, అంటే సాహిత్యంలో స్వేచ్చ కోసమూ, రచయితల వ్యక్తిత్వ ప్రాధాన్యాన్ని ఉగ్గడిస్తూనూ, నలభై ఏళ్లబట్టి పోరు సాగిస్తున్నాను.  కమ్యునిస్టుల చేత చాలా రొస్టు  పడ్డాను.

తెలుగు కవిత్వానికి, ప్రోజ్ కి ఎక్కువగా అనువాదాలు ఎందువల్ల లేవు ? మీరు తెలుగులోకి చేసారు గాని, తెలుగు నించి ఎందువల్ల చెయ్యలేదు  ?

-ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, తెలుగు నించి ఇంగ్లీషుకు గాని, ఇతర భాషలకు గాని అనువాదం చెయ్య గలిగిన సమర్థులు తెలుగు దేశంలో చాలా అరుదు.  ఇతర భారతీయ భాషలనించి ఇంగ్లీషులోనికి అనువాదాలు వస్తున్నాయి.  కాని తెలుగు నించి బహు సక్రుత్తు . తెలుగు సాహిత్యం గురించి ఇతర దేశాల వాళ్లకు చాలా తక్కువ తెలుసు.

అనువాద గ్రందాల విస్తృత అద్యయనం వల్ల నేను గ్రహించిందేమిటంటే, అనువాదకుడి మాతృభాషలోకి అనువదింపబడే గ్రంధం మాత్రమే రాణిస్తుంది.  గ్రందానువాదం అనువాదకుడి మాతృభాష లోకి కాకపోతే, ఆ అనువాదం సమగ్రంగా ఉండదు. ఏదో లోటు కనిపించి తీరుతుంది.

అందుకని, నేను చేసిన అనువాదాలన్నీ తెలుగులోకే.

కవిగా ఎదగడంలోనూ, కేరీరిస్టుగా ఎదగడంలోనూ ఉన్న తేడాను పెద్ద సాహితీ వేత్తలు కూడా ఎందుకు గుర్తించడం లేదు ?

-కేరీరిస్టులుగా ఎదిగి, కవులుగా అణగారి పోయే వాళ్ళని చూస్తే జాలేస్తుంది.

ప్రపంచానికి దూరంగా (కాకినాడకు కాస్త దూరంగా) వలసపాకలలోకి వలస వెళ్ళిన మీరు హైకూతో ఎంత దూరం ప్రయాణించాలనుకుంటున్నారు ? మీ ప్రయాణం నుంచి ప్రపంచానికి మీరు చెప్పే కవితా సందేశం ఇంకా ఎన్ని కొత్త దారులలో ప్రకాశించబోతోంది ?

– రామగిర్యాశ్రమంలో ఉంటూ కాళిదాసకవి మేఘంతో ప్రేయసి జ్ఞాపకాల్లోకి ప్రయాణించినట్లు వలసపాకలలో ఉంటూ హైకూతో కవితా ప్రేయసి సంపూర్ణ సాక్షాత్కారం కలిగే వరకు ప్రయాణిద్దామనుకుంటున్నాను.

ఇస్మాయిల్ గారి 75వ పుట్టినరోజునాడు  జరిగిన సన్మాన సందర్భం ( 2002) లో

వాడ్రేవు వీరలక్ష్మీదేవి చేసిన సంభాషణం

veeralakshmi (2) 

మీ మాటలు

  1. v.v.Bharadwaja says:

    It is very informative and motivative for the upcoming, ameture sahithi premikulaku.Ismailgaru goppa kavi more than that mahavyakthi.

  2. bhagavantham says:

    విలువైన ఇంటర్వ్యూ…..

  3. Great one! Thank you so much for sharing it with us.

మీ మాటలు

*