వాళ్ళు ముగ్గురేనా ?

Kadha-Saranga-2-300x268

‘‘ పులిమీదికెక్కి సవారిజేసుడు రాకుంటె, దాని ముంగటి కెందుకు పోవాల్నంట నేను. నిన్ను జూసి అది అయ్యో పాపం అని దయదల్చి తినకుంట ఊకుంటద’’ మసాజ్‌ టేబుల్‌ పై పడుకుని కళ్ళుమూసుకున్న చిత్రకళ ఈ మాటకి కళ్ళు తెరిచి చూసింది. యాదమ్మ చేతి వేళ్ళు చిత్రకళ వంటిపై, తమాషాగా నాట్యం చేస్తుండగా, నోటినిండా పాన్‌ నములుతూ, కొంచం గమ్మత్తుగా అందీ మాటలు యాదమ్మ. ఈ మాటలే కాదు వాటికన్నా ముందు ఆమె అప్పుడప్పుడూ చెబుతూ వుండే సరస జీవితం కూడా ఆమెనీ మధ్య నిలవనీయడం లేదు.  ఆ మసాజ్‌ టేబుల్‌ పై గంటో గంటన్నరో అట్లా వళ్ళంతా క్రీముపూసిన శరీరాన్ని ఆమెకి అప్పగించాక, ఆమె చేతి వేళ్ళ భాషనే కాదు, ఆమె మాటల హోరును కూడా విని మెల్లిగా అర్ధం చేసుకోవడం మెదలు పెట్టింది చిత్రకళ.
‘‘ యాదమ్మా! ఇట్లానే అందరితో మాట్లాడుతుంటావా?’’ అడిగిందోసారి.
‘‘ అందరు నీ లెక్కనే వుంటర? నేను జెప్తున్న. నువ్వింటున్నవ్‌. నా మాటలు నీకు సమజవుతున్నయి గాబట్టే నాకుబీ చెప్పబుద్దయితది.’’ అంది యాదమ్మ.
వట్టిమాటలే కదా అనుకుంటాం కానీ, మనకేం సంబంధం లేని మాటలు కూడా మన అంతరాంతరాళ లోకెళ్ళి, మనల్ని కల్లోల పరుస్తాయి.
దాదాపు నాలుగేళ్ళుగా ఆ జిమ్‌కి క్రమం తప్పకుండా వస్తుంది చిత్ర. దాన్లోనే వుండే స్పాలో తన అందానికి మెరుగులు దిద్దుకోవటంతో పాటూ , మసాజ్‌
చేయించుకుంటుంది. అందుకేనేమో ముఫ్పఏడేళ్ళ వయసులోనూ, ఇంకా యవ్వనపు మెరుపు ఆమెలో తగ్గలేదు.
యాదమ్మలోనూ ఏదో తెలీని ఆకర్షణ వుందనుకుంటుంది చిత్రకళ. రెండు చేతులకీ నిండుగా మట్టిగాజులు, చెవులకి పెద్ద దిద్దులు, ముక్కుపుడక, కాళ్ళకి
గంటీలు, గోళ్ళకి రంగు, అరచేతుల్లో అప్పుడప్పుడు ఎరట్రి గోరింటాకు, మధ్యమధ్య మెరిసే తెల్ల వెంట్రుకలతో ముడేసిన వత్తయిన జుట్టు, చామనచాయ
రంగు, వయసుతో పాటూ పెరిగిన శరీరపు బరువు, కళకళలాడే నవ్వు మొఖంతో పలకరించే యాదమ్మ,  సూటిగా, జంకుగొంకూ లేకుండా మాట్లాడటం చిత్రకళకి ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది. ఆమెలా తను మాట్లాడగలనా, ఆమెలా నాజీవితం నా ఇష్టం మీకెందుకని అనగలనా? పైకి ఖాతరు లేనట్లుగా కనపడే, తనలోపల నిత్యం సుళ్లుతిరుగ్నుతూ వుండే ఆత్మనిందని ఆపగలనా? అనిపిస్తుంది యాదమ్మని చూసినప్పుడల్లా.

యాదమ్మ మొన్నామధ్యే కొడుక్కి పెళ్ళి చేసింది. వెంటనే కొడుకునీ, కోడల్నీ వేరుకాపురానికి పంపింది.
‘‘ అదేం, నీకొక్క కొడుకే కదా! ’’ అంది చిత్ర కొంచం ఆశ్చర్యంగా.
‘‘ గా రెండు అర్రల ఇంట్ల, తల్లి ముంగట పెండ్లాంతో సరసమేం జేస్తడు. అత్త ఆరడి బెడ్తదన్న నింద నాకెందుకు. కిందబడ్డ, మీదబడ్డ ఎవరి సంసారం వాల్లు
ఎల్లదీసుకొనుడు ఒక్కసిత్తం’’  అంది యాదమ్మ. ఆ మాటొక్కటే అంటే  చిత్రకళకి ఏమనిపించేది కాదు.

‘‘ నా కోసం నా ఇంటికొచ్చెటోడు నాకున్నడు. కోడలి పోరి ముందు నేనెందుకు నెత్తిదించుకొనుడు’’ అని కొంటెగా కన్నుగీటి నవ్వింది.

యాదమ్మది మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట దగ్గరి పల్లెటూరు. పురిటిలోనే ఐదారుగురు పిల్లలు చనిపోయాక, లేక లేక పుట్టిన పిల్లేమో, చిన్నప్పుడు
గారాబంగానే పెరిగింది. కూలిచేసుకు బతికే కుటుంబం కాబట్టి కాయకష్టం ఆమెకి కొత్తకాదు. యాదమ్మ పెళ్ళి నాటికే తల్లిదండ్రులిద్దరూ ముసలివాళ్ళయి
పోయారు. మరో కూలివాడితో ఆమె పెళ్ళయింది. అందరిలానే ఆమెకూడా భర్తతో పాటూ,  ఊరువిడిచి పెట్టి, కూలి పనులకోసం హైదరాబాద్‌ నగరానికొచ్చింది. అక్కడే ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళు పనిచేసే భవంతులవద్దే, రేకులు, ప్లాస్టిక్‌ పట్టాలతో కట్టిన షెడ్లలో ఆమె కాపురం సాగింది. తొమ్మిదో అంతస్తు వద్ద, మోకులు కట్టిన ఉయ్యాలపై కూర్చొని పనిచేస్తున్న యాదమ్మ భర్త ఎట్లా  పడ్డాడో, కిందపడి అక్కడిక్కడే చనిపోయాడు ఓరోజు. ఏడాది కొడుకును వొళ్ళోవేసుకుని, గుండెలు అవిసేలా తలుచుకొని, తలచుకొని  ఆమె ఏడ్చింది. యాభయి వేలు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నాడు కాంట్రాక్టరు.
యాదమ్మ మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి  చేరింది. ఇప్పుడు కొడుకుతో పాటూ ముసలివాళ్ళిద్దరినీ పోషించే భారం ఆమె మీదే పడిరది. కూతురు బతుకు
బండలైపోయిందన్నదిగులు తో  యాదమ్మ తండ్రి ఏడాది తిరక్కుండానే చనిపోయాడు. ఉన్న ఊర్లో బతుకులేక, ఊర్లోవాళ్ళతో పాటూ ఆమె మళ్ళీ వలసకూలీ అయింది. తట్టలు మోసింది. రోడ్లు ఊడ్చింది. ఇండ్లలో పాచిపనులుచేసింది. రోజుకూలీగా రాజకీయపార్టీల మీటింగుల కెళ్ళింది. అట్లా అనేక పనులు చేసి, చివరికి ఎవరి కాళ్ళో పట్టుకుని, ప్రకృతి వైద్యశాలలో ఊడ్చే పని సంపాదించుకుంది. కొన్నాళ్ళకి  మసాజ్‌ చేయడం నేర్చుకుని, చివరికి నెల జీతం సంపాదించుకునే ఉద్యోగాస్తురాలైమ్ది. . తలలో తెల్లవెంట్రుకలు మెరిసే గడసరిగా, ఎప్పుడూ చలాకీగా, నవ్వుతూ వుండే యాదమ్మగా మారే క్రమంలో ఏ ఆనంద విషాదాలు ఆమెలో ఏ పెనుతుపానులను సృష్టించి వుంటాయి? తనలా కాకుండా, వాటిగురించి ఆమె సంకోచం లేకుండా మాట్లాడగలదేమో నని అనుకునేది చిత్రకళ.

‘‘ మంచి బందోబస్తు గుంటది పోరి. కష్టంజేస్తది. మొగోడు తోడు లేనిదే అది వుండుడు కష్టమని పిస్తది.’’ అంది సరస గురించి ఒకసారి యాదమ్మ. సరస
తమిళ పిల్ల. కానీ తమిళ యాసతో తెలుగు బాగానే మాట్లాడుతుంది. మద్రాసు నుండి తిరుపతికి వాళ్ళ కుటుంబం వలస వచ్చింది. తండ్రి తోపుడు బండి
పెట్టుకొని, ఇడ్లీలు, దోసెలు అమ్ముకుని సంసారం వెళ్ళదీసే వాడు. తెగిన గాలిపటంలా ఎక్కడెక్కడ ఎగిరి, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో కానీ ఎనిమిదేళ్ళ
క్రితం ఆమె యాదమ్మ వాళ్ల బస్తీ కొచ్చింది. పాతికేళ్ళ యవ్వనంతో తళతళలాడుతూ హుషారుగా వుండే సరస, యదమ్మ ఇంటి పక్క గది అద్దెకు తీసుకుంది. ఒకటి, రెండు గదులతో ఏడు పోర్షన్లు వుండే ఆ కాంపౌండులో సరస అందరి ఆకర్షణకీ కేంద్రమైంది. ఎత్తుచెప్పులు, చేతికి హ్యాండ్‌బ్యాగు, గోళ్ళరంగు, చెవులకి కొత్త కొత్త జుంకాలూ తగిలించుకుని ఏదో ఫ్యాక్టరీలో డ్యూటీ చేసేందుకెళ్లేది. అద్దె వసూళ్లకి వచ్చే ఇంటి ఓనరుకి ఠంచనుగా అద్దె ఇచ్చేది. అందరితో కలుపుగోలుగా వున్నా తనగురించి ఎవరైనా  అడిగితే మాట దాటేసేది. చేబదుళ్ళనో, యాభయ్యో, వందో అప్పనో ఎవరైనా అడిగింతే, అడిగిందే తడవు, కాదనకుండా ఇచ్చేది. గదిముందు రెండు గులాబీ పూల కుండీలు, గది తలుపుకు నీలం, తెలుపు పూల కర్టెను వేలాడే ఆ ఇంటి లోపల కూడా ఎంతో పొందికగా వుండేది. పనిపాటలు చేసుకు బతికే ఆ కుటుంబాల మధ్య ఆమె కాస్త భిన్నంగా వుండేది. అందుకేనేమో చుట్టు పక్కల వాళ్ళు ఆమె పట్ల కాస్త, ఆదరంగానే వుండే వాళ్ళు. అందర్లోకీ యాదమ్మ దగ్గరే  సరసకి ఎక్కువ దగ్గరితనం, చనువు ఏర్పడ్డాయి. తల్లి చనిపోతే, తండ్రి వేరే పెళ్ళి చేసుకున్నాడనీ, ఆ వచ్చినామె చాలా గయ్యాళిదనీ, నానా హింసలూ పెట్టేదనీ, కొన్నేళ్ళు పిన్ని దగ్గరున్నాననీ, బాబాయి ప్రవర్తన మంచిది కాదనీ, అక్కడ వుండలేక, ఒక స్నేహితురాలి సహకారంతో, హైదరాబాద్‌ వచ్చానని యాదమ్మకి చెప్పుకుంది.

ఓ ఏడాది తరువాత, ఆమె వయసే వుండే ఒక అబ్బాయి ఆమె ఇంటికి రావడం ప్రారంభించాడు. వాళ్ళిద్దరూ సినిమాలకీ షికార్లకీ తిరుగుతూ వుంటే
యాదమ్మే ఓరోజు పెద్ద మనిషిలా ‘‘ పోరడు చక్కగున్నడు. ఇద్దరికి ఈడూ జోడు కుదిరింది. పెళ్ళి చేసుకోరాదు’’ అంటూ సరసకి సలహా ఇచ్చింది. యాదమ్మ మాటలకి నవ్వి ఊరుకుంది సరస. కానీ, మరోమూడు నెలలకి ఆ పిల్లవాడు సరస గదికే తన సామాన్లు పట్టుకొచ్చుకున్నాడు. సరస మెడలో కొత్తగా పసుపుతాడు వచ్చి చేరింది. యాదమ్మే వాళ్ళిద్దరినీ తనింటికి భోజనానికి పిలిచి, సరసకి చీర పెట్టింది. నిజం చెప్పాలంటే సరసకన్నా ఆ పిల్లవాడు అందగాడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతను అమలాపురం నుండీ సినీ అవకాశాలను వెతుక్కుంటూ వచ్చాడని సరస చెప్పింది. ఆరు నెలల తరువాత అతని స్టూడియోలకి దూరమవుతుందని అంటూ, సరసా వాళ్లు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయినప్పటికీ వీలు చేసుకొని అప్పుడప్పుడూ యాదమ్మ దగ్న్గరకి రావడమో, ఫోన్‌ చేయడమో చేసేది సరస. ఆ తరువాత మెల్లిగా ఆమెతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు ఏడాది తరువాత, మూడు
నెలల పసిబిడ్డని ఎత్తుకుని, యాదమ్మ ఇంటికొచ్చింది సరస. పిల్లవాడికిపాలిస్తూ, ఏడుస్తుంటే, ఆమె కన్నీళ్ళు వాడి నుదిటి మీదా, బుగ్గలపైనా
పడ్డాయి. ఆమె ఎక్కువ వివరాలు చెప్పకుండానే  అర్ధమైంది యాదమ్మకి. వాడు ఆమెని వదిలి పెట్టి వెళ్ళిపోయాడని. ఎక్కడుంటాడో తెలియని వాడ్ని వెతకలేక, కనీసం ఆమె తండ్రి వివరాలన్నా చెప్పమని అందరూ కలిసి సరసని వత్తిడిచేసారు.
చివరికా తండ్రి, తనకా పిల్లతో ఎలాంటి సంబంధం లేదని, తన కూతురు ఎన్నడో చచ్చిందనుకున్నానని, తేల్చి చెప్పేసాడు. ‘‘ నాకెవ్వరూ లేరు’’ అంటూ,
గుండెలు పగిలేలా ఏడుస్తున్న సరసని ఓదార్చటం ఎవరితరం కాలేదు.  పాత సామాన్లు పెట్టుకునే తడికెల పాకని శుభ్రంచేసి, సరస వుండేందుకు చోటు
కల్పించాడు ఇంటి ఓనరు. చుట్టు పక్కల వాళ్ళంతా తలా కాస్త చందాలేసుకుని, అద్దె కట్టి, రెండు, రెండు,మూడు నెలలకి సరిపడేలా బియ్యం, పప్పులు
కొనిచ్చారు. సరస తన మెడలో పసుపు తాడుకు వేలాడుతున్న బంగారపు మంగళసూత్రపు బిళ్ళ  ఇస్తే, పక్కింటి వాళ్ళు అమ్మిపెట్టి, ఆమె చేతిలో
డబ్బులు పెట్టారు. ఇప్పుడా కాంపౌండులో సరసకి ఇంతకు ముందులా ప్రత్యేకమైన గుర్తింపేమీ లేదు. పగిలి నెర్రలుబారిన పాదాల గురించి, మట్టిచేరినవేలి గోళ్ళగురించి పట్టించుకునేంత తీరిక ఆమెకి లేదు. ఇప్పుడా ఇంటి వాకిలికి నీలం పూల కర్టెన్‌ వేలాడటంలేదు. పూల కుండీల ఊససలే లేదు.
పక్కింట్లో వుండే ఓ ముసలమ్మకి నెలకి ఆరొందలిచ్చి , ఆమె దగ్గర  కొడుకును వదిలి పెట్టి, పనికెడుతుంది సరస. యాదమ్మ తనకు తెలిసిన మేస్త్రీతో మాట్లాడి, తట్టలు మోసే పని ఇప్పిచ్చింది. కానీ ఆ పని ఎక్కువ కాలం చేయలేక, ఇళ్ళలో పాచి పనులు, వెతుక్కుంది. కొడుకు మూడేళ్ళ వాడయ్యాడు. సరస జీవితం కాస్త తెరిపిన బడ్డట్లయింది.

‘‘ ఉప్పుకారం తిన్న శరీరమాయె. ఊకోమంటే అది ఊకుంటద? శివసత్తులు సిగమూగినట్లు, వయసు మనల దుంకులాడిస్తది.’’ అంది యాదమ్మ. అట్లా ఆమె, సరస కూడా దుంకులాడిన వైనాన్ని, చిత్రకళకి తమాషాగా చెప్పిందొక సారి యాదమ్మ.

ఆవిరి పొగలు కక్కుతున్న అద్దాల గదిలో కూర్చుని స్టీమ్‌బాత్‌ చేస్తున్న చిత్ర, తన అర్ధనగ్న్న శరీరం వైపోసారి చూసుకుంది. దేహం అంటే ఏమిటి? దాని చుట్టూ ఇంత మంది పోగవుతారెందుకు? మనసెందుకు ఎప్పుడూ, గాలిలో పెట్టిన దీపంలా రెపరెప లాడుతుందెందుకు? దేహమూ, బుద్థీ, మనసు మనిషి జీవించినం కాలం ఎన్నడూ కలవని సమాంతర  రైలుపట్టాల్లా  సాగ్తాయని పిస్తుంది చిత్రకి. ఈ అందమైన వంపులు తిరిగిన శరీరాన్నీ, మనసును, చురుకైన బుద్దినీ తన స్వాధీనం లోకి తెచ్చుకునేందుకు తను ఎలా ప్రయాసపడేదో గుర్తుకొచ్చింది చిత్రకి. శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా వుంచుకోవడం, పెదవులపైన చిరునవ్వును ఎన్నడూ చెదరనీయక పోవడం, కించిత్‌ విసుగు, దిగులు, విషాదాలు, ఏవీ కూడా మెఖం పైన కనబడనీయక పోవటం, చలాకీగా, ఆకర్షణీయంగా మాట్లాడటం ఇవన్నీ, అనేక ఏళ్ళుగా కృషి చేసి సాధించిన విద్యలు. తన ఆలోచనలు ఇప్పుడెందుకో నియంత్రించలేని నయాగారా జలపాతంలా లోలోపల ఎగిసి పడటాన్ని గమనిస్తోంది చిత్ర.

ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరులో పదోతరగతి వరకూ చదువుకుంది చిత్ర. తండ్రి, ఓ స్కూల్లో డ్రాయింగ్‌ టీచరుగా పనిచేస్తూ, ఆ జీతం చాలక మరో
స్నేహితుడితో కలిసి, పెళ్ళిళ్ళలో వీడియోలు తీస్తూవుండే వాడు. ఎంసెట్‌ కోచింగ్‌ కోసం, విజయవాడలో ఓ పేరున్న కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించాడు
తండ్రి. ఇంజనీరింగులో సీటు సంపాదించి, ఏ అమెరికాకో వెళ్ళి బాగా సంపాదించాలనీ, అలా తమ ఆర్ధిక స్థితి మెరుగు పడాలనీ, తల్లి ఆశ పడేది.
నిరాడంబరత్వం, ఆదర్శాలు మాట్లాడే నెమ్మదైన తండ్రిని తల్లి ఎప్పుడూ ఈసడిస్తూ మాట్లాడుతుండటం చిత్ర మీద కూడా ప్రభావాన్ని చూపించింది. అతని
చాత కాని తనం వల్లే, పెదనాన్నలు తాతగారి ఆస్తి తమకి దక్కనివ్వలేదని, తల్లిలా ఆమె కూడా అనుకునేది.

విజయవాడలో తనతో పాటూ చదువుకుంటున్న డబ్బున్న అమ్మాయిల్ని చూస్తే, చిత్రకళకి లోలోపల ఈర్ష్యగా అనిపించేది. అప్పటిదాకా గుర్తించలేదు కానీ, వాళ్ళకు లేనిది, తనకున్నది అందం అని మొదటి సారి తెలుసుకుందామె. డబ్బుంటే ఆ అందానికి మరిన్ని మెరుగ్నులు దిద్దుకోవచ్చని, అందాన్ని కూడా పదిమందీ గుర్తిస్తారని, తల్లిదండ్రుల అదుపాఙ్నలు లేకపోతే, చాలా స్వేచ్చగా వుంటుందని తెలుసుకున్న ఆ రెండేళ్ళ విజయవాడ హాస్టల్‌ జీవితమంటే ఆమెకి ఇప్పటికీ ఇష్టమే. ఇరుకు ఇరుకుగా, పొదుపుగా, భయం భయంగా, అన్నిటికీ కటకటలాడుతూ బతికే తన ఇంటి పరిస్థితి చిత్రకి ఎప్పుడూ నచ్చేది కాదు. ఆమె ఆలోచనల్లో కొంచం వికాసం వచ్చిందేమో కానీ,  ఎంసెట్‌ పరీక్షల్లో ఆమె చివరాఖరికి చేరుకుంది.

ఎట్టి పరిస్ధితుల్లో సీటు రాదని అర్థమయ్యాక, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించావన్న తల్లి సాధింపుల్ని భరించ లేక, ఇక చచ్చినా మరోసారి ఎంట్రన్స్‌ పరీక్ష రాయనని మొండికేసి, ఒంగోలులో  బికాంలో చేరింది. చదువు పూర్తి      కాగానే, ఆరువేలకి ఎకౌంటెంటుగా హైదరాబాదులో ఉద్యోగం సంపాదించుకొని, ఇంట్లో వెళ్ళద్దని అన్నా వినకుండా వచ్చేసింది. అమీర్‌పేటలో ఓ లేడీస్‌ హాస్టల్లో, చేరింది. దగ్గర్లోనే వున్న ఒక కంఫ్యూటర్‌ సెంటర్‌ లో తన రూంమ్మెంట్‌తో పాటూ చేరింది. ఇరుకు గదుల్ని, సామాన్లని, చిరుతిళ్ళనీ, అప్పుడప్పుడూ దుస్తుల్నీ హాస్టల్‌ మిత్రులతో పంచుకుంటూ, కొత్తకొత్త కలల్ని వెతుక్కుంటూ , కొత్త జీవితాన్ని ప్రారంభించింది చిత్ర. రకరకాల అమ్మాయిలు. చిత్రకళలానే కొంచం అమాయకంగా, మరెంతో ఆశగా జీవితంలో పైకెదగాలన్న ఆశతో బయలుదేరిన వాళ్ళు. వలలను, నిచ్చెనలను తయారుచేసుకోవడం నేర్చుకున్న వాళ్ళు వాళ్ళలో కొందరే.

తనలానే వుండే కొందరమ్మాయిలు కొంత కాలం గడిచాక ఖరీదైన దుస్తులు,సెల్‌ ఫోన్‌లతో, విలాసవంతగా వుండటం, వాళ్ళ కోసం     వీధి మలుపుల వద్ద మగపిల్లలు నిలబడటం, వాళ్ల వెనుక వాళ్ళ గురించి మిగిలిన అమ్మాయిలు చెవులు కొరుక్కోవడం చిత్రకళ గమనించింది. అలా తనకి బాగాదగ్గరైన  తన రూంమ్మెంట్‌ సునీత గురించి కూడా, గుసగుసలుండేవి. తనతో పాటూ మొదటిసారి కొన్ని పార్టీలకి వెళ్ళినప్పుడు, అక్కడికొచ్చిన వాళ్లలో ఎక్కువ మంది ఇంగ్లీష్‌లో మాట్లాడుకోవడం, మంచినీళ్ళు తాగినంత సహజంగా అందరూ మద్యం తాగటం, కొందరమ్మాయిలు సిగిరెట్లు కూడా కాల్చటం, మొదటి సారి చూసింది చిత్రకళ. అలాంటి చోట కూడా తన అందం తనకో గుర్తింపు నిస్తోందని ఆమెగుర్తుపట్టగలిగింది . అందంతో పాటూ చొరవ, చుట్టూ జరుగుతునున్న విషయాలు, కొంచం పుస్తకాలు, సినిమాల వంటివాటి గురించి తెలియడం, ముఖ్యంగా ఇంగ్లీషు బాగా రావడం అవసరమని అనుకుందామె. జీవితంలో ఆర్ధికంగా ఎదగటానికి మనకున్న అందం, శరీరం సాధనమైతే అందుకు చింతించాల్సిన  అవసర మేమీలేదని ఆమెని ఒప్పించగలిగింది సునీత.

‘‘ ఒకటి పొందాలంటే, మరొకటి కోల్పోక తప్పదన్న’’ కొత్త సత్యాన్ని కనుగొన్న విభ్రాంతితో, లెక్కలేని తనంతో గడిపే కొందరు అమ్మాయిల జాబితాలో ఇప్పుడు చిత్రకళ కూడా చోటు సంపాదించుకుంది. ‘‘ శరీరానిదేం వుంది. కొద్ది నిమిషాలు నీవి కావనుకుంటే సరి’’ అందామె స్నేహితురాలు ఓ సారి. అట్లా అనుకోవడానికి చిత్రకి నాలుగేళ్ళ కాలం పట్టింది.

స్నానం ముగించి, అక్కడే తయారయి బయటకొస్తుంటే, చల్లటిగాలి తగిలి శరీరం ఎంతో తేలిగ్గా అనిపించింది. మాదాపూర్‌ దాటుతుండగా హరాత్తుగా పెద్దపెద్ద
చినుకులతో వాన మొదలైంది. కారు కిటికీ అద్దాల మీద జారుతున్న వర్షపు చినుకుల్ని చూస్తుంటే గుర్తొచ్చింది. నోవాటెల్‌ లో రాత్రి వెళ్లవలిసిన
డిన్నర్‌. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వచ్చే అలాంటి పార్టీలను ఆమె ఎప్పుడూ మిస్‌ కాదు. కానీ ఈ రోజెందుకో ఎక్కడికీ వెళ్లాలని
లేదామెకి. దిగులు దిగులుగా, దు:ఖం బయటకు రాకుండా లోన లుంగలు చుట్టుకుంటూ, ‘‘ పులిని తను నిజంగా స్వారీ చేయగలిగిందా? కనీసం అది తనని పూర్తిగా తినేయకుండా చూసుకో గలిగిందేమో? లేకపోతే తన జీవితం కూడా సరస జీవితంలానే అయ్యేదేమో?’’ ఈ తలపుకు ఒక్కసారిగా ఉలిక్కిపడిరది చిత్రకళ.

మనిషి లోపలి కోర్కె బహుశా, బహుపురాతనమైంది కావచ్చు. అదుపు లేని శరీరానికి ఎన్నెన్ని అడ్డు కట్టలో. అయినా అది గట్లు తెంచుకు పారే నదిలా
ప్రవహిస్తుంది. యాదమ్మ అన్నట్లు అది శివాలెత్తుతుంది.
‘‘సరస కూలికి బోయినప్పుడు, గాడమెకొక మేస్త్రీగానితో సోపతైనది. ఆడు అప్పుడప్పుడు పైసలిచ్చెటోడు. ఆనితో తిరుగుడు బెట్టిందీ పోరి. వానికి
పెండ్లాం బిడ్డలున్నరు. ఎన్నటికన్న నిన్ను ఇడిసిపెడతడే దేడ్‌దిమాక్‌దాన. ఇంక చిన్నదానివే. ఇంకెవలన్న జూసుకుని, పెండ్లి జేసుకోవే అని ఎంత చెప్పిన
ఇన్నదా అది’’ అంది యాదమ్మ.

సరసకీ, తనలాంటి వాళ్ళకీ ‘‘ నీ తాలూకు గతంతో నాకు పనిలేదు. ఇప్పటి నువ్వు మాత్రమే నాకు కావాలి. నిన్ను ప్రేమించాను. మనం పెళ్లి చేసుకుందాం’’ అనే వాడు ఎక్కడ దొరుకుతాడు. శరీరపు కోర్కె తీర్చుకునే ఆటకీ, పెళ్ళనే ఆటకీ, బహుశా వేరు వేరు సూత్రాలు, నిబంధనలూ వుంటాయి కామోలు అనుకుంది  చిత్రకళ.

సరసకి ఒక కాలేజీలో ఊడ్చే పని దొరికింది. పొద్దుట ఇళ్ళలో పని చేసుకుని, కాలేజీ పనికెడుతుంది. సరసకి కొత్తగా జర్దా అలవాటైంది. రోజూ
వండుకునేందుకు బద్దకిస్తుంది. చేతిలో డబ్బులుంటే బిరియానీ పొట్లం తెచ్చుకుంటుంది.
‘‘గట్ల డబ్బులు ఆగం చేయకు. పోరడున్నడు. పానం బాగలేన్నాడు కర్సుల కన్నా అస్తయని అంటే, రేపటి సంగతి రేపు. రేపటికి బతికుంటమో సస్తమో? ఎవలకి ఎర్క అనేది ’’ అంది యాదమ్మ.

సరసకి అంతకు ముందున్న శుభ్రత, పొందిక ఎక్కడ పోయాయో తెలీదుగట్టిగా మాట్లాడుతూ, నీళ్ళ దగ్గరో, ఉమ్మడి స్నానాల గదుల వద్దో, ఇరుగు
పొరుగు వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటూ చివరికి ‘‘ అమ్మో, దాని జోలికి పోవద్దమ్మ’’ అన్నట్లు తయారైంది. ఒక్క యాదమ్మంటేనే, కాస్త భయమూ, భక్తీ
రెండూ వున్నాయా పిల్లకి.

‘‘ ఎట్ల దాచి పెట్టిందో దాచిపెట్టిందో పెట్టిందమ్మ. ఐదోనెల కడుపు, జర ఎత్తుగ కనపడబట్టె. ఏందే సరస, గట్లున్నవ్‌. అంటె సప్పుడు జేయలే. అదేం సిత్రమో గాని కక్కుడన్న మాట లేకుండె దానికి. ఒకపారి, నేనే దాన్ని బెదిరించిన. అప్పుడొప్పుకున్నది. ఎన్నో నెలనే అంటె తెల్వదంటది. దావఖానకు బోలె. పరీక్ష సేయించుకోలే. నేను తోల్క పోత, పోదం రాయే అంటే, నేను రానుపొమ్మని జిద్దుజేసింది. మా వాడకట్టు పెద్దమనుష్యు లంత పోగయ్యిన్రు.
కడుపు జేసినోని పేరు జెపితే, వాన్నిగుంజుకొస్తం అన్నరు. ఈ పోరి నోరిప్పలే. ఒకని తానికే బోతె ఎర్కయితి. ఇది ఎందరితానికి బోయిందో అన్నరు
గాపెద్ద మనుష్యులు.. మా అందరికి తిట్టి తిట్టి యాష్టకచ్చిన గాని, అది నోరిప్పలే. కాన్పు ఎప్పుడైతదన్నది కూడ దానికి ఎర్కలేదు’’

సరస రోజూ పనికి వెడుతూనే వుంది. ఆమెను పట్టించుకునేంత తీరిక, బాధ్యత అక్కడ ఎవరికీ లేదు.

‘‘ ఏనిమిది గంటల రాత్రి, దాని ఇంటిగలమకాడ కూసోని ఓ అక్కో నొప్పులొస్తున్నయి. నాకు వశపడ్తలేదు అంట, ఏడ్సుడు, వొర్లుడు షురుజేసింది.
అందరు జేరిసూస్తున్నరు. మా వాడల పెద్దమనిషి ‘ కట్టుదప్పిన బాడుఖావ్‌. దానితానికి ఎవలు పోకుండ్రి’ అన్నడు. ఎవరిండ్లల్లోకి ఆల్లు బోయిన్రు
అందరు. పన్నెండు గంటల రాతిరి, దాని కొడుకు ఏడ్చుకుంట మా తలుపు కొట్టబట్టిండు. ఆడజన్మమంత అన్నాలం లేదమ్మ. నేను ఉర్కిన. నేనుబోయెతల్కి, నేల మీద పడుండుకోని లాష్‌గా వొర్లుతున్నదిగసబెడుతున్నది. దాన్ని చూసెతలికి, నాకు సల్లసెమటలు బట్టినయి. ఏమైతెగదైతది తీయని, మా వాడకట్టు నుండేటి, మంత్రసానిని తోల్కొచ్చిన. పక్కింట్ల కెల్లి ఇంకొక దయగల అమ్మగ్గూడ సాయానికొచ్చింది. దావఖానకు తీస్కపోనీకి టయం లేకుండె. బిడ్డ బయట కచ్చిండు గాని, మాయ బయటపడలె. ఇదేందిర దేవుడ. లేనిపోనిది నెత్తిన బెట్టుకున్న. పెద్దపానానికే ముప్పు అస్తదేమో, దేవ అని గజ్జగజ్జ అనికిన. ఆ బగమంతుని దయ తల్లీ! మెత్తం మీదగండం గడిసింది. పిండం బయటవడ్డది తల్లి.’’

యాదమ్మ ఇంటికొచ్చి వేడినీళ్ళతో స్నానం చేసేసరికి తెల్లవారుజామున నాలుగైంది. మంత్రసాని చేతిలో మూడొందలు పెట్టి, తన పాత చీరెలు రెండిచ్చి
సాగనంసింది. నెత్తుటి మరకతో, నీచుకంపు కొడుతున్న ఆ ఇంట్లోకి మళ్ళీ ఉదయం యాదమ్మ తప్పా, మరెవరూ తొంగి చూడలేదు. హోటల్‌ నుండి ఇడ్లీలు తెప్పించి, ఇంట్లో టీ చేసుకొని సరస గుడిసెలోకి వెళ్లేసరికి నెత్తుటి మరకలంటినగచ్చుపైన నీళ్ళుపోసుకుని కడుక్కుంటున్నారు సరస, ఆమెకొడుకు. పాత నూలు చీరెలో చుట్టిన పసిబిడ్డ, ఆ గదిలోనే ఓ మూల ఆదమరిచి నిద్రపోతున్నాడు. స్నానానికి నీళ్ళుపెట్టుకున్నట్లుంది. స్టవ్‌ మీద అవి సలసలా
మరుగుతున్నాయి.

‘‘ నీది పచ్చి వళ్ళే. రెండురోజులు నేనే వండిపెడత నన్న యినలేదది. ఇంటి కిరాయి రెండు నెలల సంది కట్టలేదని కొట్లాడేందు కొచ్చిన ఇల్లుగలాయన దాని
గతి జూసి ఏమనలేక గమ్మునున్నడు. చుట్టుముట్టోల్లందరం, తలా ఇన్ని పైసలేసుకుని, దానికిచ్చినం. ఏడ్చుకుంటనే తీసుకున్నది.’’ అంది యాదమ్మ.

చిత్రకళ తన పొట్టకేసి చూసుకుంది. చదునుగా, చిరుబొజ్జ కూడా లేదు. వంపు తిరిగిన నడుం కింద చీరమడతల వెనక దాగిన పొట్టపైకి  ఆమెచేతి వేళ్ళు పాకాయి.
కొన్నేళ్ళు గడిస్తే పిల్లల్ని కనగలిగిన శక్తికూడా తనకి లేకుండా పోతుందేమో? తనకి పిల్లలుంటే బావుంటుందా? ఏమో? అప్పుడప్పుడూ వాళ్ళతో
కబుర్లు చెప్పటం, ఆడుకోవడం బాగానే వుంటుంది. పిల్లల్ని కనగల శక్తి ఆడవాళ్ళ శరీరాలకి వున్నా, కనాలంటే మాత్రం తప్పకుండా పెళ్ళిచేసుకో
వల్సిందేనేమో? మల్లెపూల జడేసుకొని, పూలతో అలంకరించిన మంచం పక్కన, చేతిలో పాల గ్లాసుతో, సిగ్గుతో తలవంచుకుని, కాలిబొటన వేలితో నేలమీద చిత్రాలు గీస్తూ, గర్భదానం కోసం ఎదురుచూస్తూ, అట్లాంటి దృశ్యం లో  తనని ఊహించుకోగానే చిత్రకళకి ఫక్కున నవ్వొచ్చింది. నాకెందుకో చిన్నప్పటి నుండీ
పాలంటే అసలు ఇష్టంలేదనుకుంది చిత్ర.

తనజీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం మొదలు పెట్టాక, ఇంట్లో వాళ్ళ నుండి చాలానే ఘర్షణల్ని ఎదుర్కోవలసి వచ్చింది చిత్ర. కొంతకాలానికి వాళ్ళు
ఆమెను, ఆమె వాళ్లని వదిలేసుకునేదాకా  వచ్చాక, తమకి ఇక కూతురు లేదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ చిత్ర పూర్తిగా అలా అనుకోలేక
అప్పుడప్పుడూ అందరూ గుర్తొచ్చి బాధపడుతూ వుంటుంది.‘‘ ఆట ఆడాలనుకున్నప్పుడు ఆ ఆటకి సంబంధించిన సూత్రాలు మొదట నీకు
తెలిసుండాలి. దెబ్బ కొట్టడం, దెబ్బ కాచుకోవడమే కాదు దెబ్బ తగిలితేతట్టుకోవడంకూడా నేర్చుకొవాలి. ఎవర్నీ నమ్మకు. నమ్మినట్లు కనిపించు చాలు.
దేనిలోనైనా సరే నీకు నష్టం జరుగుతుందని అన్పించినప్పుడు, తక్కువ నష్టంతో జాగ్రత్తగా వెనక్కి రావడం ఎలాగో తెలుసుకో’’ అంది ఒకసారి వినీతా
రాధోడ్‌.  మధ్యతరగతి  సంకోచాల్ని వదులుకుంటే తప్ప , హైక్లాస్‌ సొసైటీలో రాణించటం కష్టమని, ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్‌డేట్‌ చేసుకోవాలని, ఆమె చెప్పిన మాటల్ని  చిత్రకళ ఎప్పుడూ మర్చిపోదు. మన చిరునవ్వును, అందాన్నీ చూపితే మోజు పడతారే తప్పా, మన మనసు గాయల్ని చూపితే బాధపడి, బాధ్యత తీసుకునే వాళ్లెవరూ వుండరన్న సత్యాన్ని, ఆటాడే క్రమంలో, పడి లేస్తూ తన స్వంత అనుభవంతో నేర్చుకుంది చిత్ర. ఆర్ధిక స్థితి, మంచి ఉద్యోగం వల్ల మనకి సమాజంలో గౌరవం, హోదా ఆపాదించ బడతాయని తెలుసు కాబట్టే, చిత్రకళ ఏదోక ఉద్యోగం చేయటం ఎప్పుడూ మానేయలేదు. ఒక్కప్పటిలా కాదిప్పుడు. ఏంచేయాలో వద్దో ఎంచుకోగల స్థిమితం అన్ని రకాలుగా తనకి వచ్చిట్లనిపిస్తుంది చిత్రకి.

‘‘ కడుపు జేసినోడు కాన్పు కర్సులకన్నా ఇచ్చినోడు గాదు. కంసేకం దావఖాన కర్సులన్నా ఎల్లేటివి గాదా అన్నరు. సుట్టుముట్లోల్లు. సంపి సావు కర్సులకి
ఇస్త గానీ, ఊకోమన్నట్లున్నది యవ్వారం.’’ అంది యాదమ్మ. ఆడదాని మీద అత్యాచారం చేసి, దానికి వెలగట్టి,గర్భవతిని చేసి, ఆ
గర్భానికి వెలకట్టి, ఎన్నెన్ని బేరసారాలమధ్య ఆడవాళ్లున్నారు? ఊర్లో పొలాని కెడుతున్నప్పుడు, జులాయిగా తిరిగే ఆ ఊరి పెద్దమనిషి కొడుకు, తన
మేనమామ కూతురిపై అత్యాచారం చేశాడు. పంచాయితీ పెట్టి,ఊరి పెద్దమనుష్యులు,కుటుంబం అందరూ కలిసి నిర్ణయిస్తే, కన్నీళ్ళతో తలవంచుకుని పీటలపై
కూర్చుంటే, ఆ రేపిస్టే భర్తయి మెడలో తాళి కట్టాడు. ఆమె బెదురుకళ్ళ దిగులు మొఖం చిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు.

యాదమ్మకున్న తెలివితేటలు, ధైర్యం సరసకి లేవనుకుంటాను అనుకుంది చిత్ర.

రెండోసారి నగరానికొచ్చిన యాదమ్మ వెంట ఇప్పుడు ఆమె తల్లి, నాలుగేళ్ళ కొడుకు వున్నారు. వాళ్ళను పోషించే భారం ఆమెదే. ఆడపని, మగపని అని
లేకుండా ఏ పనైనా ధైర్యంగా చేయటం అలవాటైంది. ఒకసారి కూరల మండీలో పనికి పోతే, ఊర్లనుండి కూరగాయలు ట్రాక్టర్లో వేసుకొచ్చే, ఒక డ్రైవరుతో స్నేహం కుదిరింది. శరీరం మరింత దగ్గరితనాన్ని కోరుకుంది. ఆమె అక్కడ పని మానేసినా వాళ్ళు కలుసుకుంటూ వుండేవాళ్ళు. అతనేమీ ఆమెకి పెళ్ళి
చేసుకుంటాన్నా హామీ లివ్వలేదు. తనుగర్భవతినయ్యానా లేదా, అని ఆమె సందేహ పడుతున్న కాలంలోనే, తట్టమోస్తూ, మెట్లెక్కబోయి కళ్ళుతిరిగి, జారిపడిరది. గర్భస్రావమయి వారంపాటు ఆసుపత్రిలో వుండాల్సి వచ్చింది. తల్లి ముందు, బంధువుల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది.
‘‘ పోరగాన్ని ఎవలకన్న సాదుకునేందు కిచ్చి, మల్ల పెండ్లి జేసుకోయే అంటె ఇనలేదానాడు. నాకొడుకుని నేనే సాదుకుంట నని పట్టుబడితివి. ఇప్పుడు
లేనిపోని కతలు జేయవడ్తివి. అంత ఒపలేకుంటే ఎవన్నోకన్ని మేమే జూస్తుండె’’ అని తిట్టారంది యాదమ్మ. ఆమెతో ప్రేమగా మాట్లాడి, ఆమె శరీరాన్ని కోరుకున్న వాడు ఆమె అట్లా నలుగురి ఎదుటా అవమాన పడుతుంటే ఆమె పక్కన లేడు. అప్పుడే కాదు, మరెప్పుడూ అతడామెకి కనపడలేదు. నా జీవితంలో ఏ కష్టవచ్చినా ఎవరినీ చేయిచాచి సాయమడగనని అప్పుడే యాదమ్మ నిర్ణయించుకుంది. కొడుకును బడిలో చేర్చింది. మరో మూడేళ్ళకి తల్లి చని పోయింది. మరి కొన్నేళ్ళ వరకూ ఆమె జీవితంలోకి ఏ మగవాడూ ప్రవేశించలేదు. పేదవాళ్ళకి ఇండ్ల పట్టాలిస్తున్నరంటే, బస్తీవాళ్లతో కలిసి, ఓ గల్లీ లీడర్‌ నర్సింహని కలవటానికెళ్ళింది యాదమ్మ. రేషన్‌ కార్డు, ఫోటోలు, దరఖాస్తులు అంటూ అతని చుట్టూ, మండలాఫీసుల చుట్టూ, నెలల తరబడి తిరగాల్సి వచ్చింది. కలెక్టరాఫీసు ముందు అందరితో పాటూ ధర్నాకి కూర్చుని తన్నులు కూడా తింది. ఉండేందుకు తనకంటూ ఒక చోటుంటే ఎలాగోలా బతకచ్చన్న ఆశ ఆమెది. చివరికి ఆమెకి ఇళ్ళపట్టా శాంక్షనయింది. దానితో పాటూ నర్సింహతో పరిచయం కూడా పెరిగిందామెకి.

ఎన్నికలు, ప్రచారాలు, బహిరంగ  సభలంటూ బయటి ఊర్లకి రమ్మని ఆమెని పిలిచే వాడు. అట్లా ఒకటి రెండుసార్లు యాదమ్మ, ఢల్లీిలో జరిగిన మీటింగులకు కూడా వెళ్లింది. ఈ తిరగటాలు, కొత్త పరిచయాలు, చుట్టు పక్కల వాళ్ళలో ఆమెకొకగుర్తింపును తెచ్చాయి. ఆపనీ, ఈపనీ చేసి పెట్టమనీ, సలహాలనీ ఎవరోకరు ఆమె దగ్గరికి వచ్చే వాళ్ళు. నర్సింహతో ఆమె సంబంధం బహిరంగమే. పదేళ్ళ కొడుకుని పెంచి పెద్దచేసి, ప్రయోజకుడ్ని చేయడం తన పననుకుంది యాదమ్మ. ఆమె అతడ్ని పెళ్ళి చేసుకోమని ఎన్నడూ ప్రాధేయపడలేదు. అతనే ఓ సారి ఆ ప్రస్ధావన తెస్తే, ‘‘ ఇయ్యాల బాగ్ననే వున్నవు. రేపు నీకో పోరన్నో, పోరినో కంట. అటెన్క, నీ బుద్ధి తిరిగి, నాకు పెండ్లాం, బిడ్డలున్నరు, ఇగ నీతో కాపురం చేయలేనే యాదమ్మ అన్న వనుకో, నా గతి ఏం గావాలె. ఉన్నొక్క కొడుకును సాదలేకనే, నా బతుకిట్లయ్యె. ఇంకొక బిడ్డ నా మెడలెందుకయ్య. నీ పెండ్లికి, నీకో దండమయ్య సామి’’ అంది యాదమ్మ.
అతనొక సారి, నీ ఖర్చులకు డబ్బులు నేనిస్త. పని మానేయమన్నప్పుడు యాదమ్మ కస్సుమంది.

‘‘ నా తిండి నేను సంపాదించుకుంట. నా పోరన్ని నా రెక్కల కష్టం మీద సాదుకుంట. నా యింట్ల నేను బాజాప్త పంట. పని బందు పెట్టి, రేపటికెల్లి,
కుక్క తీర్గ, నువ్వెన్నడు బొచ్చల కూడేస్తవో అన్నట్లు ఎదురుసూడాల్నా? నువ్వు జూజూ అని బుదగరిస్తే, తోకూపుకుంట దగ్న్గరికి రావలె. నీకు
కోపమెచ్చి ,నీ యెడ్మ కాలితో లాష్‌గ ఒక్క లాత్‌ తన్నితే ఏడ్చుకుంట బోవాల్నా? ఎవరి మీద ఆధారపడి బత్కదీ యాదమ్మ. నెలల పోరన్ని, నడుముకు
గట్టుకుని ఒక్కదాన్ని ఎద్దోలె కాయకష్టం జేసిన. ఏమనుకున్నావో. చూసినవా ఈ సేతులు, నా సేతులు ఎట్లున్నయో?’’ అంటూ నిటారుగా నిలబడి, రెండు అరచేతుల్నీ అతని ముందుకు చాచింది. అతను మరింకేం మాట్లాడలేదు.

చిత్రకళ ఇంటికి చేరుకునే సరికి ఏడుకావస్తోంది. వర్షం వెలిసింది. తడిసిన మొక్కలు మరింత పచ్చగా అగపడుతున్నాయి. కాఫీ కలుపుకొని మెల్లిగా తాగ్తూ బాల్కనీలో నిలబడి , తడిసిన ఆకుల నుండి చినుకుల్ని రాలుస్తున్న పారిజాతపు చెట్టును చూస్తుంటే, ఆమెకి ఎందుకో హఠాత్తుగా నాన్నా గుర్తుకొచ్చాడు.
ఇంట్లోవాళ్ళు, ముఖ్యంగా అమ్మా, మావయ్యలూ తన విషయమై  గొడవ చేసారు కానీ , నాన్న ఎక్కువగా మౌనంగానే వున్నాడని ఎందుకో అనిపించింది చిత్రకి. బహుశా, తన జీవితం తనది అని ఆయన ఒప్పుకున్నాడేమో తెలీదు. తెల్లటి దేహంతో నేలను ముద్దు పెట్టుకుంటూ నారింజ రంగ్ను చేతుల్ని ఆకాశంకేసి చాచి ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లున్నాయి రాలిన పారిజాతపు పూలు. ఆయన ఎంతో ఇష్టంగా తనకి చిత్రకళ అని పేరు పెట్టాడు. చిన్నప్పుడు నాన్న తనకి బొమ్మలేయటం నేర్పటం గుర్తొచ్చింది. రకరకాల రంగులు తెల్లటి కాగితంపై పరుచుకొని, అందమైన బొమ్మలుగా మారటం ఎంతో అద్భుతంగా వుండే దామెకి. తను బొమ్మలేస్తుంటే, చేతుల్లోంచి కాగితాలు లాగేసి ‘‘ ఎందుకీ బొమ్మలు, కూటికొచ్చేనా గుడ్డకొచ్చేనా’’  అంటూ  అమ్మ తననీ, నాన్ననీ తిట్టడం కూడా గుర్తుంది చిత్రకి.

‘‘ ఇంతకీ నేను పులిని స్వారీ చేయడం నేర్చుకున్నానా’’ అని తనని తాను ప్రశ్నించుకుంది చిత్ర.
సరసకి అలాంటి విద్యొకటి ఉందన్న విషయం కూడా తెలిసుండదు. కనిపించిన వాడినల్లా గుడ్డిగా నమ్మటం తప్ప ఏమీ తెలీదు.
‘‘ గీ పోరగాల్లను పుట్టించే పని దేముడు మన ఆడోల్లకే ఎందుకు బెట్టిండో తెల్వదు. అదే లేకుంటే మన బత్కు ఇంత అన్నాలం లేకుండు. మన తాన పైసలేక పాయె, పవరు లేక పాయ ఇగ ఆగ్నమాగ్నం గాక ఏమైతమమ్మ’’ అని నవ్వింది యాదమ్మ. పులి ఆమెను మింగేందుకు వాడే సాధనాలన్నిటినీ ఆమె ఒక్క తాపు తన్నినట్లనిపించింది చిత్రకళకి.

దూరంగా హాల్‌లో నుండి సెల్‌ఫోన్‌ మోగుతోంది. ఎత్తి మాట్లాడాలనిపించక దానికేసి అలాగే చూస్తోంది. రెండు మూడు సార్లు మోగాక, చిన్న చప్పుడుతో
మెసేజ్‌ వచ్చింది. అప్పుడు మెల్లిగా ఆ మెసేజ్‌ని తీసి చూసింది చిత్ర. సునీతా రాధోడ్‌ నుండి . ‘‘రాత్రి నోవాటెల్‌ కి వస్తున్నావ్‌ కదా! లెటజ్‌
హావ్‌ గ్రేట్‌ ఫన్‌’’ అనుంది.ఆమె కెందుకో పులిస్వారీ ఆటలో అది తనని తినేయకుండా కాచుకొని, కాచుకొని అలసి పోయినట్లనిపించింది. ఎంతో నిస్సత్తువగా కూడా వుంది. పర్సు తీసుకొని, ఇంటికి తాళం వేసి కిందికి దిగి వెడుతుంటే, కారు తలుపు తీసి పట్టుకొని, డ్రైవరు పిలిచాడు. అతడ్ని ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పి, వీధి లోకొచ్చింది చిత్ర. ఆగి ఆగి కురుస్తున్న ఆ సన్నటి వాన చినుకుల మధ్య నడుస్తూ , వీధి చివరనున్న స్టేషనరీ షాపుకెళ్ళింది. డ్రాయింగ్‌ షీట్లు,
రంగులు, బ్రష్‌లు కొనుక్కొని, ఇంటికి తిరిగి వస్తుంటే చిత్రకళ కెందుకో శాంతంగా అనిపించింది.

vimala1విమల
19.03.2014

మీ మాటలు

  1. మంచి కధను చదివిన ఫీలింగ్. హాయిగా ఉంది. ముగింపు ఎందుకో అసంతృప్తిగా ఉంది. ముగ్గురు స్త్రీలను లంకె వేయటంలో కొద్దిగా వైఫల్యం కనిపిస్తుంది.

  2. మంజరి లక్ష్మి says:

    హై క్లాస్ చిత్రకి, లో క్లాస్ యాదమ్మకి పులి మీద స్వారీ చెయ్యటం వచ్చినట్లు సరసకు చేత రాలేదు అని ఈ కథ చెపుతున్నాట్లా!. అయినా చిత్ర ఇంక పులి మీద స్వారీని మానేసిందని ముగింపు చెపుతున్నట్లుంది. యాదమ్మ స్వారీ, చిత్ర స్వారీ కూడా ఒక రకంవి కానట్లున్నాయి.

  3. తిప్పర్తి యాదయ్య says:

    స్త్రీ సమస్యలను బాగా చెప్పారు మేడమ్ యాదమ్మను ఇంకా ఆదర్శంగా చెప్పాల్సింది

  4. వనజ తాతినేని says:

    యాదమ్మ లో ఉన్న ఆత్మవిశ్వాసం, వాస్తవిక దృక్పధం మిగతా ఇరువురిలో కనబడలేదు. యాదమ్మ పాత్ర బావుంది విమల గారు . ముఖ్యంగా పులి స్వారీ … వండర్ఫుల్ థాట్. మీ నుంచి ఇంకా చాలా కథలు రావాలి .

మీ మాటలు

*