కళ్ళ మీది కటకటాల్ని చెరిపేసే కవిత!

ismayil painting rainbow

” పెయింటింగ్ ఈజ్ ఎ సైలెంట్ పొయెట్రీ, అండ్ పొయెట్రీ ఈజ్ ఎ పెయింటింగ్ దట్ స్పీక్స్ ” అన్నారు. వర్ణ చిత్రం రేఖలు, రంగుల కలబోతతో నిశ్శబ్దంగా పాడే కవిత్వమైతే , కవిత్వమేమో పదాలు , వాటి మధ్య అందంగా పేర్చిన నిశ్శబ్దంతో గుస గుస లాడే వర్ణచిత్రం.

అసలు కవి అనేవాడు ఏం చేస్తాడు? అందులోనూ ఇస్మాయిల్ గారి లాంటి ప్రకృతి సౌందర్యోపాసకుడైన కవి…

ప్రకృతిలోకి తను వేసే ప్రతి అడుగునీ జాగ్రత్తగా అచ్చు వేసి ఎదుటి తరాల వారికి అందిస్తాడు. తను పీల్చే ప్రతి పరిమళాన్నీ పదాల్లోకి తర్జమా చేసి ఎప్పటికీ వాడిపోనీయక దాచి పెడతాడు. అటువంటి కవి , ఏ స్వప్నాల్లోంచి రాలిపడే వర్ణాలతోనో తన ఊహా జగత్తుని అలంకరించుకుని యధాతదంగా ఆ చిత్రాన్ని మన కళ్ళముందు ఆవిష్కరించే చిత్రకారుడి మీద కవిత రాస్తే అదెలా ఉంటుంది? ఇదిగో ఈ క్రింది విధంగా ఉంటుంది.

488096_10151271931041466_1029829309_n

పికాసో ( చెట్టు నా ఆదర్శం సంకలనం నుంచి )

———

పికాసో చిత్రమైన

అచిత్ర కారుడు

 

అతడు గీసింది కన్నా

చెరిపింది ఎక్కువ

 

మన కళ్ళ మీది కటకటాల్ని

కుంచెతో చెరిపేశాడు

 

అప్పట్నించీ మన కళ్ళు

ఎగరడం నేర్చుకున్నాయి.

 

 

ఒక గొప్ప సత్యాన్ని ఎంత సహజమైన వాడుక భాషలో ఎంత సున్నితమైన , తేలికైన పదాలతో ఎంత గాఢమైన చిత్రాన్ని మన మనసుల్లో చిత్రించిందీ కవిత! ఒక్కసారి ఆ చిత్రం చెప్పే గుస గుసలు వింటే ఎన్ని అర్థాలు అందులోంచి సీతాకోకచిలుకలై ప్రాణం పొంది పైకెగురుతాయ్ !

మనల్ని మనమే కాదు, మన కళ్ళని కూడా ఎప్పుడూ కటకటాల్లోనే ఉంచుతున్నాం అన్నది కాదనలేని సత్యం. ఒక పరిధిని దాటి చూడలేకపోతున్నాం. చూపుల్ని ఎక్కడా లోతుగా నాటలేకపోతున్నాం. అంటే మనవన్నీ పై పై చూపులే. అంతర్నేత్రాన్ని కూడా తెరిస్తేనే మనం చూసే వస్తువు నిజంగా మనకు కనపడేది. ఆ సత్యాన్నే ఈ కవిత చెబుతోంది.

కళ్ళ మీది కటకటాల్ని ఆయన కుంచె చెరిపెయ్యగానే కళ్ళు ఎగరడం నేర్చుకోవడం అన్న భావన ఎంత అద్భుతమైన నిజాన్ని మనకి ఆవిష్కరించి పెడుతోందో చూడండి.

సుమారు ఎనిమిదేళ్ళ క్రితం మొదటిసారి నేనీ కవిత చదివినప్పుడు ఒకానొక గాఢమైన నిశ్శబ్దంలోకి నెట్టబడ్డాను. అతి తేలికగా చెప్పబడ్డ ఒక లోతైన భావనని వెతికి పట్టుకునే ప్రయత్నంలో మళ్ళీ మళ్ళీ ఈ కవితని చదివాను. జీవితపు నడకకి అన్వయించుకోవాలని ప్రయత్నించాను. కళ్ళతో చూసే ప్రతి దాన్నీ వెంటనే అలాగే మనసులో ముద్రించుకోకుండా అంతర్నేత్రాన్ని కూడా తెరుచుకుని చూడటం మెల్ల మెల్లగా అలవాటు చేసుకున్నాను.

చిత్రకళాభిమానిగా ఆ తరువాత నేను వర్ణ చిత్రాల్ని ఆశ్వాదించే తీరు కూడా పూర్తిగా మారిపోయింది. వడ్డాది పాపయ్య చిత్రాల్ని చూసినా, రాజా రవి వర్మ తైల వర్ణ చిత్రాల్ని చూసినా, ఇప్పుడు కొత్తగా ఆర్ట్ గేలరీల్లో ప్రముఖ చిత్రకారులు జీవన్ గోశిక, ప్రభాకర్ అహోబిలం మొదలైన వారి వర్ణ చిత్రాల్ని చూసినా మనసు ఇస్మాయిల్ గారి కవితని గుర్తు చేసుకుంటుంది. ఎవరో రహస్యంగా ఆ చిత్రాల్లోని అంతరార్ధాన్ని బోధిస్తున్నట్టుగా కళ్ళు పూర్తిగా ఆ చిత్రాల్ని రెప్పల్లో దాచుకుంటున్నాయ్.

ఒక కవిత కేవలం కొన్ని పదాల అల్లికలా మిగిలిపోకుండా, పాఠకుడి ఆలోచనా పరిధిని పెంచి, ఒక వస్తువుని గమనించే తీరుని మార్చి జీవితాంతం గుర్తుండిపోవడం, నిశ్శబ్ద నదిలా మనసులో పారుతూ అతన్ని/ఆమెని ప్రభావితం చేయడం ఎంత గొప్ప విషయం!

 -ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

 

 

 

మీ మాటలు

  1. సాయి కిరణ్ says:

    నిజం. అనంతమైన భావాన్ని నింపుకున్న ఓ గొప్ప కవితని చాలా బాగా విశ్లేషించారు

  2. ఒక మంచి కవితపై చక్కని విశ్లేషణ!

    “ఒక కవిత కేవలం కొన్ని పదాల అల్లికలా మిగిలిపోకుండా, పాఠకుడి ఆలోచనా పరిధిని పెంచి, ఒక వస్తువుని గమనించే తీరుని మార్చి జీవితాంతం గుర్తుండిపోవడం, నిశ్శబ్ద నదిలా మనసులో పారుతూ అతన్ని/ఆమెని ప్రభావితం చేయడం….”

    ఇదే అసలు సిసలు ఇస్మాలియిజం!!! బాగా పట్టుకున్నావు, ప్రసూనా!
    అలతి పదాలతోనే గాఢాలోచనల అలలు మొదలుపెట్టించేస్తాయి ఆయన కవితలు…

మీ మాటలు

*