పెద్రో పారమొ-12

pedro1-1చీకటి పడగానే వాళ్ళు వచ్చారు. వాళ్ల వద్ద చిన్న తుపాకులు ఉన్నాయి. ఛాతీల మీద అటూ ఇటూ ఏటవాలుగా గుళ్ళ పట్టీలు ఉన్నాయి. ఇరవై మంది దాకా ఉన్నారు. పేద్రో పారమొ వాళ్లను భోజననానికి ఆహ్వానించాడు. వాళ్ళు నెత్తిమీద టోపీలు తీయకుండానే భోజనాల బల్ల మీద ఏమీ మాట్లాడకుండా కూచున్నారు. చాకొలేట్ తాగుతున్న చప్పుళ్ళూ, మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని టోర్టియాలూ (రొట్టెల్లాంటివి), ఉడకబెట్టిన బీన్సూ తింటున్న చప్పుళ్ళూ మాత్రమే వినవస్తున్నాయి.
పేద్రో పారమొ వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. ఇవి తనకు తెలిసిన మొహాలు కావు. టిల్కేట్ అక్కడే అతని వెనక నీడలో నిలుచుని ఉన్నాడు.
“అయ్యలారా!” పేద్రో పారమొ అన్నాడు వాళ్ళు తినడం పూర్తయినట్టు గమనించగానే. “ఇంకా ఏం చేయమంటారు మీకోసం?”
“ఇదంతా నీదేనా?” చేయి సాచి తిప్పుతూ చూపిస్తూ అడిగాడు వాళ్ళలో ఒకడు.
కానీ ఇంకొకతను అడ్డుపడ్డాడు.
“ఇక్కడ మాట్లాడేది నేను.”
“సరే, మీకేం కావాలో చెప్పండి.” పేద్రో పారమొ మళ్లీ అన్నాడు.
“చూస్తున్నావుగా, మేం ఆయుధాలు చేపట్టాం.”
“అయితే?”
“అయితే ఏముంది? అంతే. అది చాలదా?”
“ఎందుకు చేస్తున్నారు ఇదంతా?”
“ఎందుకంటే అందరూ అదే పని చేస్తున్నారు కాబట్టి. నీకు తెలియదా? కాసేపు ఆగు, మాకింకా పైనుంచి ఆదేశాలు రావాలి. అప్పుడు చెప్తాము ఎందుకో. ఇప్పటికయితే, మేం ఇక్కడున్నాం. అంతే.”
“ఎందుకో నాకు తెలుసు,” ఇంకొకతను అన్నాడు. “నీకు కావాలంటే చెప్తాను. మేం ప్రభుత్వం మీదా, నీలాంటి వాళ్ల మీదా తిరుగుబాటు చేస్తున్నాం. మిమ్మల్ని భరించడం ఇక మా వల్ల కాదు. ప్రభుత్వంలో ప్రతి ఒకడూ ఒక దొంగవెధవ. నువ్వూ, నీలాంటి వారూ బందిపోటు దొంగలు. ఇక గవర్నర్ గురించి ఏమీ చెప్పను. ఆ చెప్పేదేదో బుల్లెట్ల తోటే చెప్తాం.”
“మీ తిరుగుబాటుకి ఎంత కావాలి?” పేద్రో పారమొ అడిగాడు. “నేను మీకు సాయం చేయగలనేమో!”
“అయ్య చెప్పేది బాగానే ఉంది పెర్సెవెరాన్సియో. నువు ఊరికే నోరు పారేసుకోకు. మనకు కావలసిన సరంజామా సమకూర్చడానికి డబ్బున్న వాడొకడు ఎటూ కావాలి. ఈ అయ్యని మించిన వాళ్ళెవరు దొరుకుతారు? కాసిల్డో, మనకి ఎంత కావాలి?”
“ఇంతని ఏముంది? అయ్య ఎంత ఇవ్వగలిగితే అంత.”
“ఏమిటీ? ఈ మనిషి పస్తులున్నవాడికి కూడా మెతుకు విదల్చడు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కనక అవకాశం వదులుకోకూడదు. వాడి రోత నోట్లో ఉన్న ఆఖరి మెతుకుతో పాటు ఉన్నదంతా ఊడబీక్కోవాలి.”
“నువ్వాగు పెర్సెవెరాన్సియో! అల్లంతో కంటే బెల్లంతోటే ఎక్కువ ఈగలు పట్టుకోవచ్చు. మనం బేరం కుదుర్చుకోవచ్చు. ఎంతో చెప్పు కాసిల్డో!”
“ఉరామరిగా చూస్తే ఇప్పుడు ముందో ఇరవై వేల పేసోలయితే బాగానే ఉంటుంది. మిగతా వాళ్లంతా ఏమంటారు? మనకెటూ సాయం చేయాలనుకుంటున్నాడు కనక మన అయ్య ఇంకాస్త ఎక్కువే ఇస్తాడేమో, మనకేం తెలుసు? కాబట్టి ఒక యాభై వేలు అనుకుందాం. మీకేమనిపిస్తుంది?”
“నేను లక్ష ఇస్తాను మీకు.” పేద్రో పారమొ అన్నాడు. “ఎంతమంది మీరు?”
“మూడొందల మంది దాకా ఉంటాం.”
“సరే. నేను ఇంకో మూడొందలమందిని మీతో పంపుతాను మీ దళం బలపడేందుకు. ఒక వారంలో మీకోసం డబ్బూ, మనుషులూ ఏర్పాటు చేస్తాను. డబ్బులు ఇస్తాను కానీ, మనుషులు మాత్రం అరువుకే. వాళ్ళతో పని అయిపోగానే తిరిగి ఇక్కడికి పంపేయండి. ఒప్పందానికి సమ్మతమేనా?”
“ఇంకా సందేహమా?”
“సరే, ఇంకో వారంలో మళ్ళీ కలుద్దాం అయ్యలారా! మిమ్మల్ని ఇట్లా కలవడం ఆనందంగా ఉంది.”
“సరే,” చివరిగా వెళుతున్నతను అన్నాడు “కానీ గుర్తు పెట్టుకో. మాటతప్పావా, నీ సంగతి తేలుస్తాడు పెర్సెవెరాన్సియో. అంటే, నేనే!”
పేద్రో పారమొ అతనితో కరచాలనం చేసాడు అతను వెళ్లబోతుండగా.

“వాళ్ల నాయకుడెవరనుకుంటున్నావు?” వాళ్ళు వెళ్ళిపోయాక టిల్కేట్ ని అడిగాడు.
“ఆ మధ్యలో ఉన్నతను అనుకుంటాను. అదే, ఆ పెద్ద పొట్టేసుకుని తల కూడా పైకెత్తకుండా ఉన్నాడే, అతనే అనుకుంటున్నాను. నేనంత తొందరగా పొరబడను, డాన్ పేద్రో.”
“ఈసారి పొరబడ్డావు డమసియో. నాయకుడివి నువ్వు. కొంపదీసి ఈ తిరుగుబాటులో భాగం పంచుకోవాలనిలేదా?”
“ఆ విషయం నాకు వెంటనే తట్టలేదు. అందులోనూ కాస్త చిల్లర దొరుకుతుందంటే నాకెంతో ఇష్టం కూడాను.”
“ఈపాటికే నీకు అర్థమయి ఉండాలి కనక నీకు నా సలహా పెద్దగా అవసరం లేదు. నీకు నమ్మకమయిన వాళ్లను మూడొందలమందిని సిద్ధం చేసి వీళ్లతో జతకలువు. వాళ్ళకోసం నేను పంపిస్తానన్న మనుషుల్ని తీసుకొచ్చినట్టు చెప్పు. మిగతాది ఎట్లా చేయాలో నీకు తెలుసు.”
“మరి డబ్బు గురించి ఏం చెప్పను? అది కూడా వాళ్లకు ఇవ్వనా?”
“నీకు మనిషికి పది పేసోల లెక్కన ఇస్తాను. వాళ్ల తక్షణ అవసరాలు తీరడానికి సరిపోయేంత. మిగతాది వాళ్ళకోసం ఇక్కడ దాచానని చెప్పు. ఈ రోజుల్లో అంత సొమ్ము వెంట వేసుకుని తిరగడం మంచిది కాదు. అన్నట్టు ఆ రాతిగేటు దగ్గర కొట్టం ఎట్లా ఉంటుంది నీకు? సరే. అది నీదే, ఈ నిమిషం నుంచీ. కోమలలో మన లాయరు ఉంటాడు, అదే ఆ ముసలి గెరార్డొ ట్రూహీయో. ఈ కాగితం అతని దగ్గరికి తీసుకు వెళ్ళు. అక్కడికక్కడే ఆ స్థలం నీ పేరు మీదకి మార్పిస్తాడు. ఏమంటావు డమసియో?”
“అనేదేముంది డాన్! కొట్టం సంగతి వదిలేసినా ఈ పని ఆనందంగానే చేస్తాను. దీని సంగతి చూట్టానికయినా. నేను నీకు తెలుసు. ఏమయినా నీకు కృతజ్ఞుడిని. నేనిట్లా తిరుగుతూ ఉంటే మా ముసలిదానికి కాస్త పని కలిపించినట్టుంటుంది.”
“కాసిని పశువుల్ని కూడా తీసుకుపో. ఆ కొట్టానికి కాస్త ఆ సందడి కూడా ఉండాలిగా!”
“ఆ పుంజుల్ని కూడా తీసుకుంటే ఫర్వాలేదా?”
“నీకేం కావాలంటే అవి తీసుకుపో. మీ ఆవిడ వాటిని చూసుకుంటుంది. ఇక మన విషయానికి వద్దాం. నా పొలానికి మరీ దూరం ఆ వెళ్లనివ్వకు. ఇంకెవరన్నా వస్తే ఇక్కడ ఇప్పటికే వీళ్ళున్నారని తెలిసేట్టుండాలి. నీకు వీలయినప్పుడో, ఏదన్నా వార్త ఉన్నప్పుడో రా.”
“వస్తాను అయ్యా!”

“ఆమె ఏమంటూ ఉంది హువాన్ ప్రెసియాడో?”
“తన పాదాలను అతని కాళ్ళ మధ్య పెట్టుకునేదాన్నని చెపుతూంది. చల్లటి రాళ్ళలాగా ఉన్న పాదాల్ని బట్టీలో రొట్టె కాల్చినట్టు వెచ్చగా చేసేవాడు. అవి బంగారు రొట్టెలంటూ వాటిని మునిపళ్లతో కొరికేవాడనీ చెప్పింది. ఆమె అతని దగ్గరగా ముడుచుకుని పడుకునేది అతని చర్మం కింద, శూన్యంలో తప్పిపోతూ. తన కండరాలు నాగటి చాళ్లలా విడివడుతూ, మంటతో మొదలై వెచ్చగా, మెల్లగా ఆమె మెత్తటి కండరాలను తోసుకుంటూ లోపలికి, లోలోపలికి ఆమె కేక పెట్టిందాకా. కానీ అతని చావు ఆమెని చాలా చాలా బాధించింది. అదీ ఆమె చెప్పింది.”
“ఎవరి చావని ఆమె ఉద్దేశం?”
“ఆమెకంటే ముందుచనిపోయినవాళ్ళెవరో!”
“కానీ ఎవరయి ఉంటారు?”
“నాకు తెలియదు. ఆమె అనడం అతను ఆలస్యంగా వచ్చిన రాత్రి ఆమెకి గట్టిగా అనిపించిందట అతడు ఆలస్యంగా వేకువజాముకయినా వస్తాడని. ఎందుకంటే ఆమె చల్లటి పాదాలు దేంతోటో చుట్టేసినట్టూ, ఎవరో కప్పి వేడి చేస్తున్నట్టూ అనిపించిందట. ఆమె లేచేసరికి తాను అతనికోసం ఎదురు చూస్తూ చదువుతున్న న్యూస్ పేపర్ ఆమె పాదాలకు చుట్టి ఉందట. అతను చనిపోయిన వార్త వాళ్ళు ఆమెకు చెప్పడానికి వచ్చినప్పుడు ఆమె ఆరాత్రి నిద్రకు తాళలేనప్పుడే నేలకు జారిపోయిన పత్రిక ఆమె పాదాల చుట్టూ కప్పబడి ఉంది.
“ఆమెను పూడ్చిపెట్టిన పెట్టె బద్దలయి తెరుచుకున్నట్టుంది. చెక్క కిర్రు మనే చప్పుడు వస్తూంది.”
“అవును నాకూ వినపడుతుంది.”

ఆరాత్రి ఆమెకు మళ్లీ కలలు వచ్చాయి. ఎందుకంత గాఢంగా అన్ని విషయాలనూ గుర్తుంచుకోవడం? అతని చావు మాత్రమే కాక ఎప్పటిదో మృదువయిన సంగీతం?
“ఫ్లోరెన్సియో చనిపోయాడు సెన్యోరా!”
ఎంత భారీ మనిషి! ఎంత పొడవు! అతని గొంతెంత దృఢంగా ఉండేది!. ఎంతో పొడి అయిన నేలంత పొడిగా. అతని దేహాన్ని సరిగ్గా చూడలేకపోయింది. లేక జ్ఞాపకాల్లోంచి చెరిగిపోయిందా? వాళ్ల మధ్య వానేదో పడుతున్నట్టు. అతనేమన్నాడు? ఫ్లోరెన్సియో? ఏ ఫ్లోరెన్సియో? నావాడా? మరయితే అప్పుడు నేనెందుకు ఏడవలేదు నాకన్నీళ్లలో నన్ను ముంచేసుకుని నా వేదననంతా కడిగేసుకునేట్టు? ఓ దేవుడా! నువు నీ స్వర్గలోకంలో లేవు. అతన్ని కాపాడమని నిన్ను కోరాను. అతన్ని జాగ్రత్తగా చూసుకోమని. నిన్నడిగింది అదే. కానీ నీకు పట్టిందల్లా ఆత్మలు. మరి నాకు కావలసింది అతని శరీరం. నగ్నంగా, ప్రేమతో వేడిగా, కోరికతో కాలిపోతూ, నా వణికే రొమ్ముల్నీ, చేతుల్నీ రాస్తూ. అతని దేహాన్నుంచి నా పారదర్శక దేహం వేలాడుతూ. అతని బలం పట్టి విడుస్తున్న కామాతురమైన నా దేహం. అతని పెదవులు కప్పని నాపెదవులతో ఏం చేయను? నా పేద పెదవులేమవుతాయి?
సుజానా శాన్ హువాన్ తన పక్కలో అటూ ఇటూ దొర్లుతూ ఉంటే పేద్రో పారమొ తలుపు దగ్గరే నుంచుని ఆమెనే చూస్తూ ఈ కొత్త కలని సెకన్లలో కొలుస్తున్నాడు. లాంతరులో నూనె తగ్గి మంట రెపరెపలాడి బలహీన పడుతూ ఉంది. తొందర్లోనే అది ఆరిపోతుంది.
ఈ అంతులేని శిక్షింపజేసే కలలు కాకుండా ఏదన్నా నొప్పితో బాధపడుతూ ఉంటే అతను ఉపశమనానికేమయినా చేసుండేవాడు. సుజానా శాన్ హువాన్ నే చూస్తూ ఆమె ప్రతి కదలికనూ గమనిస్తుంటే పేద్రో పారమొకి కలిగిన ఆలోచనలు అవి. ఆమెను చూడడానికి సాయపడుతున్న ఆ పాలిపోయిన వెలుగు లాగా ఆమె బ్రతుకు కూడా హరించుకుపోతే తనేం చేయాలి?
అతను చప్పుడు కాకుండా తలుపు మూసి బయటికి నడిచాడు. బయట చల్లని గాలి. సుజానా శాన్ హువాన్ రూపాన్ని చల్లటి రాత్రి తుడిచేసింది.
వేకువజామున సుజానాకు మెలకువ వచ్చింది. ఆమెకు చెమట్లు పోస్తున్నాయి. పైనున్న బరువయిన దుప్పట్లను నేల మీదికి విసిరేసి దాని వేడి నుంచి తప్పించుకుంది. ఉదయపు చల్లటి గాలి ఆమె నగ్నదేహాన్ని చల్లపరుస్తూ ఉంది. ఆమె నిట్టూర్చి తిరిగి నిద్రలోకి జారుకుంది.
కొన్నిగంటల తర్వాత ఆమె ఫాదర్ రెంటెరియాకు అట్లాగే కనిపించింది. నగ్నంగా నిద్రపోతూ.

“ఇది విన్నారా డాన్ పేద్రో? టిల్కేట్ ని లేపేశారు”
“రాత్రి గొడవేదో వినపడుతూ ఉంది కనక కాల్పులు జరిగినట్టు తెలుసు. కానీ నాకంతవరకే తెలుసు. ఇది నీకెవరు చెప్పారు గెరార్డో?”
“గాయపడ్డవాళ్ళలో కొంతమంది కోమలా చేరుకున్నారు. నా భార్య వాళ్ళకి కట్లు కట్టడానికి సాయపడింది. వాళ్ళు డమసియోతో ఉన్నట్టూ, చాలా మంది చనిపోయారనీ చెప్పారు. విజీస్తాలమని చెప్పుకునే వాళ్ళెవరితోనో గొడవ జరిగినట్టుంది.”
“ఓరి దేవుడా! ముందుముందు అన్నీ పాడురోజులే రాబోతున్నట్టున్నాయి గెరార్డో! నువ్వేం చేయాలనుకుంటున్నావు?”
“నేను వెళ్ళిపోతున్నా డాన్ పేద్రో! సయులాకి. అక్కడ మళ్ళీ మొదలుపెట్టుకోవడమే.”
“మీ లాయర్లకా అవకాశముంది. మిమ్మల్ని చంపనంతవరకూ మీ సొత్తంతా తీసుకుని ఎక్కడికయినా పోవచ్చు.”
“అట్లా అనుకోకండి డాన్ పేద్రో! మా సమస్యలు మాకున్నాయి. అంతేకాక మీలాంటి వాళ్ళను వదిలిపోవడం కష్టంగానే ఉంటుంది. మీ మర్యాదలు మళ్లీ ఎక్కడ దొరుకుతాయి? మన ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుందనుకుంటే కాస్త మనశ్శాంతి. మీ పేపర్లన్నీ ఎక్కడ వదిలేయమంటారు?”
“వదిలేయద్దు. నీతో పాటు తీసుకు వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడనుంచే నా వ్యవహారాలు చూడడం కుదరదా?”
“నామీద మీరుంచిన నమ్మకానికి చాలా సంతోషంగా ఉంది. నిజంగా. కానీ మీ పనులు చూడడం కుదరదని చెప్పే సాహసం చేస్తున్నాను. కొన్ని అవకతవకలు.. మీకు తప్ప మరొకరికి తెలియకూడని విషయాలున్నాయి. మీ పేపర్లు తప్పుడువాళ్ల చేతుల్లో పడితే వాళ్ళు ఏమయినా చేయొచ్చు. వాటిని మీతో ఉంచుకోవడమే మంచిది.”
“నువు చెప్పింది నిజమే గెరార్డో! వాటిని ఇక్కడే వదిలేయి. వాటిని తగలబెట్టేస్తాను. పేపర్లున్నా లేకపోయినా నా ఆస్తి గురించి నాతో పెట్టుకునేదెవడు?”
“ఎవరూ లేరు డాన్ పేద్రో! నాకా నమ్మకముంది. ఇక నేను వెళతాను.”
“దేవుడు తోడుగా పో గెరార్డో!”
“ఏమన్నారు?”
“దేవుడు నీకు తోడుగా ఉంటాడంటున్నాను.”
గెరార్డో ట్రూహీయో చాలా నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అతను ముసలివాడే కానీ అంత నెమ్మదిగా, ఆగుతూ ఆగుతూ నడవవలసిన అవసరం లేదు. నిజానికి అతనేదన్నా బహుమానం దొరుకుతుందని ఆశించాడు. పైన ఎక్కడున్నాడో డాన్ లూకాస్, అప్పుడతని పనీ, ఇప్పటిదాకా డాన్ పేద్రో పనీ అతనే చూశాడు. డాన్ పేద్రో కొడుకు మిగెల్ పని కూడా. ఏదన్నా గుర్తింపు కోసం ఆశపడ్డాడు. అతను చేసిన సేవలకు బదులుగా కాస్త పెద్ద ఎత్తున. అతని భార్యకు చెప్పాడు వచ్చేముందు “నేను వదిలిపెట్టి పోతున్నానని డాన్ పేద్రోకి చెప్తాను. నాకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటాడని నాకు తెలుసు. ఆయనిచ్చే డబ్బుతో సయులాలో స్థిరపడొచ్చు. ఇక మిగతా జీవితం హాయిగా గడిపేయొచ్చు.”
కానీ ఆడవాళ్ళకి ఎప్పుడూ సందేహాలు ఎందుకు వస్తాయి? అసలేమిటి? వాళ్ళకు పైనుంచి ఏదన్నా సమాచారం అందుతుందా? అతని భార్యకు నమ్మకం లేదు అతనికేదన్నా బహుమానం దక్కుతుందని.
“నీ తల నీళ్ళలో మునగకుండా చూసుకోవడానికి నువు కుక్కలా పనిచేయాలి. అతడి నుంచి నీకేమీ రాదు.”
“ఎందుకట్లా అంటున్నావు?”
“నాకు తెలుసు, అంతే!”
వెనకనుంచి పిలుపు వస్తుందేమోనని ఇంకా వాకిలి వైపు నెమ్మదిగా నడుస్తున్నాడు.
“ఓ గెరార్డో! పరధ్యానంలో బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. నువు చేసినదానికి డబ్బుతో బదులు తీర్చుకోలేను. సరే, ఇది తీసుకో. ఏదో కాస్త కృతజ్ఞతగా.”
కానీ ఆ పిలుపు రాలేదు. ముఖద్వారం నుండి బయటకు వచ్చి రాటకు కట్టిన గుర్రాన్ని విప్పాడు. దానిపై ఎక్కి నెమ్మదిగా కోమలా వైపు బయలు దేరాడు కూతవేటు దూరం దాటిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ. మెదియా లూనా కనుచూపు మేరలనుంచి దాటిపోయాక అనుకున్నాడు “అప్పు అడగడం ఎంత నీచమైన పని?”

“డాన్ పేద్రో. నాకే ఎందుకో బాగాలేక తిరిగి వచ్చేశాను. నీ పనులు చూడ్డం నాకు సంతోషమే.”
అరగంట క్రితమే వదిలిన డాన్ పేద్రో ఆఫీసులో కూచుని ఉన్నాడు అతను మళ్ళీ.
“నాకేమీ అభ్యంతరం లేదు గెరార్డో. అవిగో పేపర్లు. ఇంకా నువు వదిలిపెట్టిన చోటనే ఉన్నాయి.”
“మరి నా ఖర్చులకి.. నా ఫీజ్లో కొంత అడ్వాన్స్ గా.. కొద్దిగా ఎక్కువ ఏమన్నా ఇస్తే.. మీకు పర్వాలేదనిపిస్తే..”
“అయిదొందలు?”
“ఇంకొంచెం.. చాల కొంచెం ఎక్కువ కుదరదా?”
“వెయ్యి సరిపోతుందా?”
“అయిదు వేలు..”
“అయిదు.. ఏమిటీ? అయిదు వేల పేసోలా? నాదగ్గర అంత లేదు. అందరికంటే నీకే ఎక్కువ తెలిసి ఉండాలి నాకున్నదంతా ఇరుక్కుపోయి ఉన్నదని. నేలా, పశువులూ.. నీకు తెలుసా సంగతి. వేయి తీసుకో. అది సరిపోతుందిలే నీకు.”
ట్రూహీయో కూచుని ఆలోచిస్తున్నాడు. ఛాతీమీదికి తల వాల్చి. పేద్రో డబ్బు లెక్కపెడుతున్న వైపు నుంచి పేసోలు బల్లపై ఠంగుమని పడుతున్న చప్పుడు వినపడుతూంది. తన ఫీజు చెల్లించకుండా ఎప్పుడూ దాటవేసే డాన్ లూకాస్ ను గుర్తు తెచ్చుకున్నాడు. మొదట్లో ఏ మచ్చా లేని డాన్ పేద్రోని. అతని కొడుకు మిగెల్ని కూడా. ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు ఆ పిల్లాడు?
కనీసం పదిహేను సార్లు జైలునుంచి బయటకు రప్పించాడు. ఆ మనిషిని చంపిన కేసొకటి. ఏం పేరు అతనిది? రెంటెరియా. అవును, అదే. శవం చేతిలో తుపాకీ ఉంచారు. తర్వాత దాని గురించి నవ్వేసేవాడు కానీ మిగెలో జడుసుకు చచ్చాడు. ఆ వొక్కసారికే డాన్ పేద్రోకి ఎంత ఖర్చయి ఉండేది చట్టప్రకారం వెళ్ళుంటే. ఇంక ఆ బలాత్కారాల సంగతేమిటి? ఎన్ని సార్లు తన జేబులోంచి డబ్బు తీసి ఆ అమ్మాయిల నోరు మూయించలేదు? “మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీకు తెల్లటి బిడ్డ పుట్టబోతున్నాడు కాబట్టి,” వాళ్ళకు నచ్చచెప్పేవాడు.
“ఇదుగో గెరార్డో, జాగ్రత్తగా చూసుకో. డబ్బు చెట్లకేం కాయదు.”
తన ఆలోచనల్లో ఇంకా మునిగి ఉన్న ట్రూహీయో బదులిచ్చాడు “చనిపోయినవాళ్ళు సమాధుల్లోంచి పైకి లేచి రానట్టే.”

తెల్లారడానికి ఇంకా చాలా సమయముంది. దీర్ఘరాత్రి వలన ఉబ్బిన లావాటి నక్షత్రాలతో ఆకాశం నిండి ఉంది. జాబిలి కొంచెం పైకి లేచి కనపడకుండా పోయింది. అది ఎవరూ చూడని, పట్టించుకోని దిక్కుమాలిన జాబిళ్లలో ఒకటి. అక్కడే కొద్దిసేపు వేలాడింది వక్రంగా, వెన్నెలేమీ కురవకుండా. తర్వాత కొండల వెనక దాక్కోవడానికి పోయింది.
దూరాన్నుంచి చీకటి ముసుగులో ఎడ్ల రంకెలు వినిపిస్తున్నాయి.
“ఆ పశువులు ఎప్పుడూ నిద్రపోవు.” డమియాన సిస్నెరోస్ అంది. “అవి ఎప్పుడూ నిద్రపోవు. అవి సైతాను లాగా ఎప్పుడూ ఏ ఆత్మను తన్నుకు పోదామా అని చూస్తూ ఉంటాయి.”
ఆమె అటు గోడవేపుకు తిరిగి పడుకుంది. అప్పుడే ఆమెకి ఎక్కడో తట్టిన చప్పుడు వినపడింది.
ఆమె ఊపిరి బిగబట్టి కళ్ళు తెరిచింది. మళ్ళీ మూడు సార్లు చిన్నగా తట్టిన శబ్దం వినపడింది ఎవరో గోడమీద కొడుతున్నట్టు. ఆమె పక్కనే కాదు, ఎక్కడో దూరంగా, కానీ అదే గోడ మీద.
“దేవుడే కాపాడాలి. అది శాన్ పస్కూల్ అయి ఉండాలి. మూడు సార్లు తట్టి, తనను నమ్మినవాళ్ళల్లో ఎవరికో సమయమాసన్నమయిందని హెచ్చరిస్తున్నాడు.”
కీళ్లనొప్పులవల్ల చాలా రోజులనుంచీ నొవేనా చేయలేదు కనక ఆమె ఆందోళన చెందలేదు. కానీ భయపడింది. భయాన్ని మించి కుతూహలం.
ఆమె మంచం మీనుండి సద్దు చేయకుండా లేచి కిటికీ నుంచి బయటికి తొంగి చూసింది.
పొలాలు నల్లగా ఉన్నాయి. ఆమెకి ఆ చుట్టుపక్కల అంతా క్షుణ్ణంగా తెలుసు కనక చీకట్లో కూడా పేద్రో పారమొ భారీ శరీరం మార్గరిటా కిటికీలోకి దూకడం కనపడింది.
“ఆ డాన్ పేద్రో..” డమియానా అనుకుంది “అమ్మాయిల వెంట పడడం మానడు గదా! నాకర్థం కానిదేమిటంటే అప్పటికేది తోస్తే అది చేయాలని ఎందుకనుకుంటాడన్నది. నాకు ముందే చెప్పి ఉంటే అయ్యగారికి ఆరాత్రికి తను కావాలని మార్గరిటాకి చెప్పేదాన్ని. అతనికి మంచం వదిలి వెళ్ళాల్సిన శ్రమ తప్పేది.”
ఎడ్లు ఇంకా రంకెలు వేస్తుండగానే ఆమె కిటికీ మూసింది. తన మంచంలో పడుకుని దుప్పటి చెవులదాకా కప్పుకుంది. కుర్ర మార్గరిటానిప్పుడు అతను ఏం చేస్తూ ఉంటాడో ఆలోచిస్తూ పడుకుని ఉండి పోయింది.
కాసేపటికి రాత్రి వేడెక్కినట్టనిపించడంతో లేచి నైట్ గౌనును విప్పేయక తప్పింది కాదు.
“డమియానా!” ఆమెకు వినిపించింది.
ఆమె చిన్నపిల్ల అయిపోయింది.
“తలుపు తెరువు డమియానా!”
ఆమె గుండె ఉరఃపంజరంలో చిన్న కప్పపిల్ల లాగా ఎగిరెగిరి పడుతూంది.
“ఎందుకు అయ్యా?”
“తెరువు డమియానా!”
“బాగా నిద్రలో ఉన్నానయ్యా!”
తర్వాత ఆమెకు డాన్ పేద్రో బయట కారిడార్లో అటూ ఇటూ నడుస్తున్న చప్పుడు వినపడింది. బూట్ల మడాలు టక్కు టక్కుమని గట్టిగా శబ్దం చేస్తున్నాయి, అతని కోపాన్ని తెలియజేస్తూ.
మరుసటి రాత్రి అతనికి మళ్ళీ కోపం రాకుండా ఉండేందుకు ఆమె తలుపు వారగా తెరిచి ఉంచింది. అతని పని సులభమయ్యేందుకు నగ్నంగానే పడుకుంది. కానీ పేద్రో పారమొ మళ్ళీ రాలేదు.
ఇప్పుడు ఆమె మెదియా లూనాలో పనివాళ్లందరికీ మేస్త్రీ. ముసలిదయి నలుగురి గౌరవాన్నీ సంపాదించుకుంది. ఈ రాత్రి ఆమె ఇంకా ఆ రాత్రి గురించే ఆలోచిస్తూ ఉంది – పేద్రో పారమొ “తలుపు తెరువు డమియానా!” అంటూ పిలిచిన రాత్రి.
ఈ గడియలో కుర్ర మార్గరిటా ఎంత సంతోషంగా ఉండి ఉంటుందో అనుకుంటూ నిద్రపోయింది.
తర్వాత ఆమెకు ఎవరో తలుపు తట్టడం వినిపించింది. కానీ ఈసారి పెద్ద తలుపు. ఎవరో తుపాకీ మడమతో దాన్ని పగలకొట్టాలని చూస్తున్నట్టు.
రెండో సారి ఆమె కిటికీ తలుపు తెరిచి బయటికి రాత్రిలోకి చూసింది. పురుగులు దొర్లే నేలపై వాన పడ్డాక ఆవిర్లొస్తున్నట్టనిపిస్తున్నా ఆమెకు ఏమీ కనపడలేదు. ఆమెకు ఏదో పైకి తేలి వస్తున్నట్టనిపించింది – చాలామంది మగవాళ్ళ వేడి. ఆమెకు కప్పల బెకబెకలూ, కీచురాళ్ళ చప్పుడూ వినిపించాయి. వానాకాలంలో ఒక సందడి లేని రాత్రి. మళ్ళీ తలుపు బాదుతున్న చప్పుడు వినిపించింది.
ఒక దీపం వెలుతురు గుంపులోని మనుషుల మొహాల మీద పడింది. అంతలోనే అది ఆరిపోయింది.
“ఇవన్నీ నాకవసరం లేని విషయాలు,” అని డమియానా సిస్నెరోస్ కిటికీ మూసుకుంది.

“నిన్ను చితకతన్నారని విన్నాను డమసియో! అట్లా ఎట్లా జరగనిచ్చావు?”
“నీకు తప్పుడు వార్త అందినట్టుంది అయ్యా! నాకేమీ కాలేదు. నామనుషులెవరూ చచ్చిపోలేదు. నాకింద నా వాళ్ళే ఏడువందలమంది ఉన్నారు. ఆపైన వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళు ఇంకొంత మంది. ఏమయిందంటే ఆపాతవాళ్లకు పనేమీ లేక విసుగుపుట్టి బోడిగుళ్ళ వాళ్ళ మీద కాల్పులు మొదలుపెట్టారు. చూడబోతే వాళ్లది పెద్ద సైన్యం. తెలుసుగా, ఆ విజీస్తాలు!”
“ఎక్కడినుంచి వచ్చారు వాళ్ళు?”
“ఉత్తరాన్నుంచి. వచ్చేదారంతా వాళ్ళకు కనపడినదంతా చదును చేసుకుంటూ వస్తున్నారు. మనకి తెలిసినంతవరకూ ఇక్కడిదాకా పంటలన్నీ దోచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు బాగా శక్తివంతులు. అది మాత్రం కాదనలేం.”
“మరి వాళ్లతోటే కలవకపోయావా? మనం గెలిచే పక్షం వైపే ఉండాలని నీకు ముందే చెప్పా గదా!”
“ఆపని ముందే చేశాను.”
“మరి ఇక్కడికెందుకు వచ్చావు?”
“మాకు డబ్బు కావాలయ్యా! మాంసం తప్ప మరేమీ తినక విసుగు పుట్టింది. ఇక అది రుచించడం లేదు. మాకు అరువు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నువు మాకు కిరాణా సరుకులు కొనిపెడతావన్న ఆశతో వచ్చాం. మేం ఎవరినుంచో దొంగిలించదల్చుకోలేదు. ఇంకాస్త దూరం వెళ్ళినట్టయితే అక్కడివాళ్ళనుంచి కాస్త ‘అప్పు‘ తీసుకునే వాళ్ళమేకానీ ఈ చుట్టుపక్కల అంతా చుట్టాలేనయిపోతిరి. వాళ్ళను దోచుకోవడం బాగోదు. మాకు కావలసింది తిండి కొనడానికి డబ్బు, కాసినయినా మిరపకాయలూ, టోర్టియాలూ కొనుక్కోవడానికి.”
“అయితే నాదగ్గరే నీ డిమాండ్లు మొదలుపెట్టావన్న మాట!”
“ఛ! లేదయ్యా. నేను ఈ కుర్రాళ్ల కోసం అడుగుతున్నా. నాకు మాత్రం ఏమీ అక్కర్లేదు.”
“నీ మనుషులకేం కావాలో నువు చూసుకుంటున్నావంటే అది నీ మంచితనమే కానీ నీకేం కావాలో అది ఇంకెవరినన్నా అడుక్కో. నేను నీకు ముందే డబ్బు ఇచ్చాను. నీకిచ్చిన దాంతో సంతోషపడు. నీకేం సలహా ఇవ్వాలని కాదు కానీ, కోంట్లాకి వెళ్ళాలన్న ఆలోచన రాలేదా? మీరు తిరుగుబాటు యుద్ధం ఎందుకు చేస్తున్నారు? మూర్ఖులే అడుక్కు తినేది. ఇంటికిపోయి కోళ్లకి మేత వేసుకోకపోయావా మీ ఆవిడతో కలిసి? వెళ్ళి ఏదో పట్టణం దోచుకోండి. నువు నీ తలమీదికి తెచ్చుకుంటున్నావు, మిగతావాళ్ళు వాళ్ళ పని చేయలేరా? కోంట్లా అంతా ధనవంతులే. వాళ్ళు దాచుకున్నదాంట్లో కొంత తీసుకో. లేకపొతే నువ్వేమన్నా వాళ్ళకి పాలిచ్చే దాదివనుకుంటున్నావా వాళ్ల అవసరాలు కనిపెట్టుకోటానికి? లేదు డమసియో. నువ్వేం సరదాకి తిరగడం లేదని తెలిసేట్టు చేయి. కాస్త బెదిరించు, సెంటావోలు అవే వస్తాయి.”
“నువు చెప్పినట్టే చేస్తానయ్యా. నువు మంచి సలహాలిస్తావనే నా నమ్మకం.”
“సరే, అది చేసి చూపించు.”
ఆ మనుషులు స్వారీ చేస్తూ వెళ్ళిపోతుంటే పేద్రో పారమొ చూస్తూ ఉండిపోయాడు. చీకట్లో కనపడకుండా గుర్రాలు దౌడు తీయడం వినిపిస్తూంది. చెమటా, దుమ్మూ; వణుకుతున్న నేలా. మిణుగురుల కాంతి మళ్ళీ మెరుస్తుంటే అందరూ వెళ్ళిపోయినట్టు అర్థమయింది. అతడొక్కడే మిగిలిపోయాడు, లోపల పుచ్చుతూన్న దృఢమైన వృక్షంలా.
అతనికి సుజానా శాన్ హువాన్ తలపుకొచ్చింది. తనతో అంతకు ముందే పడుకున్న యువతి కూడా. చిన్నగా, భయంగా వణుకుతూన్న దేహమూ, ఛాతీలోంచి ఎగిరి బయటపడుతుందేమో అన్నట్టు దడదడమని కొట్టుకుంటున్న గుండే. “చిన్నారి చిలకా,” అన్నాడు ఆమెతో. ఆమెను వాటేసుకున్నాడు ఆమెను సుజానా సాన్ హువాన్ గా మార్చడానికి ప్రయత్నిస్తూ. “ఈ లోకానికి చెందని స్త్రీ!”

మీ మాటలు

*