ఇస్మాయిల్, టాగోర్: ఇద్దరు సదాబాలకులు!

ismayil painting rainbow

ఇస్మాయిల్ గారు రాసిన రాజకీయ కవితలు చాలా వరకు వ్యంగ్యాత్మకమైనవి. వాటిలో ఎక్కువ భాగం మార్క్సిస్టుల మీద కోపంతో రాసినవే ఉన్నప్పటికీ, ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు వంటి వారిని అపహాస్యం చేస్తూ రాసినవి (ఈవిడ, గాడిద స్వామ్యం) కూడా లేకపోలేదు. వీటికి భిన్నంగా, ఆయన వేరే ఎక్కడా ప్రస్తావించని అంశాలు – ఆకలి, దారిద్ర్యం, మత ఘర్షణలు, హింస – వంటివాటిని రేఖా మాత్రంగా స్పృశించినా, వాటిపట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కొంత ఉద్వేగంతో రాసిన ఒకే ఒక కవిత “బోటులో టాగోరు”. అందువల్ల, ఈ కవిత ప్రత్యేకమైనది, ఆయన కవితల్లో ప్రసిద్ధి పొందినది. టాగూరు గురించి ఆయన, ఆయనను గురించి ఆయన అభిమానులు తరచుగా వాడే “సదా బాలకుడు” అన్న పదప్రయోగం ఈ కవిత లోనిదే.

టాగోరంటే ఇస్మాయిల్ గారి కెంత ఇష్టమో ఆయన టాగోరుపై రాసిన వ్యాసం చదివితే తెలుస్తుంది. టాగూర్ గొప్ప సౌందర్యారాధకుడని, సామాన్య విషయాల్లో సంఘటనల్లో దాగి ఉన్న ఆనందాన్ని, ఉజ్జీవాన్ని తన రచనల్లో ఆవిష్కరించాడని ఆయన అంటారు. టాగోర్ కవిగాకన్నా కథకుడుగానే గొప్పవాడని ఆయన అభిప్రాయం. టాగోర్ 1890 నుంచి పదేళ్ళపాటు తమ కుటుంబ ఎస్టేటు చూసుకొంటూ, షిలైదాలో ఉన్నప్పుడు, అక్కడ పద్మానదిని ఎంతో ప్రేమించాడట. కాళిదాసు పర్వత రాజు ఆస్థాన కవి అయితే, టాగోర్ పద్మా నది కవివల్లభుడట. తనకు ప్రియమైన పద్మానదిలో పడవపై తేలుతూ టాగోర్ అనేక దినాలు గడిపేవాడని, ఆయన చాలా కథలకు బీజాలు అక్కడే పడ్డాయని చెబుతారు. ఆ దృశ్యమే ఈ కవితకు మూలం.

బోటులో టాగోరు విన్న కథల గురించి ప్రశ్నిస్తూ ఈ కవిత వాటిలో కొన్నిటిని ప్రస్తావిస్తుంది. అవి సుభా, హోమ్ కమింగ్, కాబూలీవాలా, కేష్ట్ ఎవే. ఇవన్నీ కరుణ రసాత్మకమైన కథలు, చిన్నపిల్లలు లేదా ప్రారంభ యౌవనంలో ఉన్నవాళ్ళు ప్రధాన పాత్రలుగా ఉన్న కథలు. ముఖ్యంగా హోమ్ కమింగ్ , కాబూలీవాలా కథలు అంతకు ముందే ఇంగ్లీషు పాఠ్యాంశాలుగానో, ఇంట్లో ఉన్న టాగోరు కథల పుస్తకాల్లోనో చదువుకొని ఉండటంవల్ల, ఈ కవిత మొదటిసారి చదివినప్పుడు ఎంతో ఎక్సయిటింగ్ గా అనిపించింది. పిల్లల మనస్తత్వాన్ని టాగోరంత బాగా అర్థం చేసుకొన్న రచయిత వేరొకడు కనిపించడని ఆయన అంటారు. ఈ కవితలో వచ్చే నాలుగు కథలూ అందుకు ప్రతీకగా నిలుస్తాయి. సాధారణంగా కవిత్వంలో సెంటిమెంటును ఇష్టపడని ఇస్మాయిల్ గారు టాగోర్ కథల్లో మాత్రం దానిని చాలా అభిమానించినట్టు కనిపిస్తుంది. ఈ కవితలో మబ్బు బెలూన్లు, బిగిసిన జలచర్మంతో నిగనిగలాడే నదిబాజా వంటి విభిన్నమైన పదచిత్రాలు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఈ కథలతో కవిత పూర్తికాదు. నది గురించిన ప్రస్తావన, తన చిన్నతనం వైపుకి, అప్పట్లో చెరువుల్లో ఈత కొట్టటం వైపుకి మరలుతుంది. నదిపై పడవలో తేలటం, ఈత కొట్టేందుకు బట్టలు విప్పి చెరువులో దూకటం రెండూ జలస్నేహానికి రెండు పార్శ్వాలు. బోటులో టాగోర్ తన తలపోతలో చుట్టూ తను చూసిన అనేకమంది సామాన్య జనుల కష్టసుఖాల్ని కథలుగా ఆవిష్కరిస్తే, చెరువులో ఈతకొట్టే తాము “మాతృగర్భంలోకి మరలిపోచూసే పిల్లల్లాగో, ప్రియురాలి అంతరంగంలోకి లయమవాలనుకునే ప్రేమికుల్లానో“ ఉన్నామనటం ఒక భద్రత కోసం చేసే అన్వేషణను ఆవిష్కరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి కాంట్రాస్టుగా కవిత వెంటనే అభద్రత వైపు మళ్ళుతుంది.

పద్మానది ప్రస్తావనకి కొనసాగింపుగా, పార్టిషన్ టైములో పద్మానదిని పంచుకోవటం, అప్పుడు జరిగిన మత ఘర్షణలు, హింస వంటి వాటిని సూచిస్తూ “ఎన్ని వికృత శబ్దాలు, ఎన్ని హాహాకారాలు, ఎంత భీభత్సం” అని రాస్తారు. అంతేకాదు, ప్రస్తుత పరిస్తితుల్లో కొనసాగుతున్న హింస, దారిద్ర్యం వంటివాటి పట్ల ఆవేదనను సూచిస్తూ పోషకాహార లోపంవల్ల జబ్బుపడిన పిల్లల పొట్టల డోళ్ళ చప్పుళ్ళతో కవిత ముగుస్తుంది.

ఇస్మాయిల్ గారి కవితలలో ఒక కవిత నాలుగు పేజీలు  దాటటం ఇందులోనే చూస్తాం. నిడివిలోనే కాదు, రాయటానికి పట్టిన సమయంలో కూడా దీనికి ప్రత్యేకత ఉంది. ఈ కవిత రూపొందటానికి నవమాసాలూ పట్టింది.(జూన్ 73-మార్చి 74) . బహుశా కొంత వరకు రాసి పక్కనపెట్టి, మళ్ళీ ఎప్పుడో పూర్తిచేసారనుకుంటాను. ఆలోచనా స్రవంతిలో దాని ప్రభావం కొంత వరకు కవితలో కనిపిస్తుంది. అయినప్పటికీ, టాగోర్ కథలు, తన బాల్యం, ప్రస్తుత పరిస్థితుల భీభత్సం ఈ మూడు భాగాలలోనూ , చిన్నపిల్లలు లేదా ప్రారంభ యౌవనంలో ఉన్నవాళ్ళ ప్రస్తావన ఒక ఏక సూత్రంగా సాగిందని చెప్పుకోవచ్చు.

చిలకలు వాలిన చెట్టు వచ్చిన కొత్తలో, ఈ కవితలోని టాగోర్ కథలను గురించిన వాక్యాలే కాకుండా – నది బాజాని మోగించే సదా బాలకుడు టాగోర్, చిరంతనపు లోతుల్లోకి చివాల్న దూకేవాళ్ళం, సరిత్తీర నికుంజాల్లో నిరీక్షించేవి మెరిసే కళ్లు కావు గురితప్పని గుడ్డి తుపాకులు, మోగటం లేదు టాగోర్ ఇవాళ హృదయంగమాలైన బాల్య మృదంగాలు – వంటి వాక్యాలు ఎన్నిసార్లు చదువుకొనే వాడినో లెక్కలేదు. (ఈ కవిత మృత్యు వృక్షం లోదే అయినా, నేను మొదటిసారిగా చదివింది చిలకలు వాలిన చెట్టు మూడు పుస్తకాల సంపుటిగా వచ్చినప్పుడే.) ఇస్మాయిల్ కవిత్వం ఇష్టపడని అభ్యుదయ వాదులైన కొందరు మిత్రులు ఈ కవితను మాత్రం మెచ్చుకొనేవారు. ఒకరిద్దరైతే, ఇస్మాయిల్ జీవితానికి ఈ కవిత ఒక్కటి చాలనేవారు. నేనలా అనుకోనుగాని, ఇస్మాయిల్ గారు రాసిన అనేక చిరస్మరణీయమైన కవితల్లో ఇది తప్పకుండా చేరుతుందని మాత్రం చెప్పగలను. ఈ కవిత చదివితే దాని ద్వారా, ఇస్మాయిల్ గారినే కాకుండా, నోబెల్ ప్రైజు వచ్చిన ఏకైక భారతీయ రచయిత అనే విశిష్ట గౌరవాన్ని శతాబ్దం పైగా పొందుతూ వస్తున్న విశ్వకవి రవీంద్రుణ్ణి కూడా తలుచుకొనే అవకాశము కలుగుతుంది.

 – విన్నకోట రవి శంకర్

vinnakota

(వచ్చే వారం: ప్రసూన రవీంద్రన్ వ్యాసం)

మీ మాటలు

  1. ఇస్మాయిల్ గారి ఈ కవిత మిగిలిన కవితలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అంతేకాక దీనిని అర్ధం చేసుకోవటానికి కొంత నేపథ్యం కూడా అవసరం. మీ వ్యాసం ఆ నేపధ్యాన్ని, ఈ కవిత ప్రత్యేకతను చక్కగా వివరించింది.
    నాకైతే “పద్మని పగలగొట్టి పంచుకున్నప్పుడు”…….. అన్న వాక్యాల సందర్భం ఇప్పుడే తెలుసుకొన్నాను.
    కవితను ఈ క్రింది లింకులో చదువుకొనవచ్చును.
    http://ismailmitramandali.blogspot.in/2012/11/blog-post_390.html

మీ మాటలు

*