ఆరేసిన చేయి

drushya drudshyam

మనకెన్నో పనులు.
నిజానికి చిన్నచిన్న పనులను గమనించం.
బట్టలు ఉతకడం గురించి కూడా ఆలోచించం.
ఇప్పుడు వాషింగ్ మెషీన్ వాడుతున్నాం అనుకుంటాం గానీ, అందునా ఎంతో పని.
ఆరేయడమూ ఒక తప్పనిసరి పనే.

ఉదయం వంటపని అయ్యాక పిల్లాజెల్లా బయటకు వెళ్లాకా మహిళలు చేసే పనులు ఎన్నో చిత్రాలు.
అందులో ఒకటి ఇది. బంగారు అంచుచీర.

కానీ. ఒకటైతే చెప్పాలి ఇక్కడ.
అమ్మ. వదిన, అక్క, భార్య, చెల్లె…బిడ్డ- వాళ్లు ఎవరైనా కానీయండి.
తల్లి వలే పని చేయడం ఒక కలనేత.

ఆఖరికి పనిమనిషి అయినా సరే, ఆమె అమితశ్రద్ధగా పనిచేసే తల్లే.
మనం ధరించే దుస్తులన్నిటా కనిపించని స్వేదం, తడి ఆరిన శ్రమైక గీతికా ఆమే!

ఆమెవి ఉతికి ఆరేసే చేతులే
అవి చలికి వానక ఎండకు వెరవని చేతలు.

చిత్రమేమిటంటే, బట్టలు ఉతకడమూ, వాటిని ఆరేయడమూ మనం చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాము.
కానీ, పెద్దయ్యాక దైనందిన జీవన సమరంలో పడిపోయాక వాటి గురించి ఆలోచించనే చించం.
అందులోని కవిత్వం గురించి గమనించనే గమనించం, జీవన గ్రంథమంతా మనమే అనుకుంటే, దుస్తులను మరచి!

+++

అంగీ గుండీలు దెబ్బతినవు.
లాగు జేబులో ఒక్కోసారి ఐదు రూపాయల కాగితం మడత దొరుకుతుంది.
కానీ, రోజూ దొరకవంటే ఏమిటీ అర్థం?

అమిత శ్రద్ధగా జేబుల్లో చేతులు పెట్టే ఆ తల్లి ఇగురమే అందుకు కారణం.
కానీ అది గమనించం.

బాగా మైల పట్టిన ప్యాంటు ఒక ఉతుకుతో శుభ్రం కాదని తెలుసు.
కానీ, మళ్లీ మళ్లీ నానబెట్టి ఉతకిన విషయమూ గుర్తురాదు.

అన్నిటికన్నా చిత్రం. బట్టలు ఉతకడం, ఉతికిన వాటిని వడివెట్టి పిండటం, అవసరమైతే అటు నువ్వు ఇటు నేనూ నిలబడి వడివెట్టి పిండటం. మళ్లీ మన మానాన మనం.
ఆమె మళ్లీ ఉతుకులో, ఆరేయడంలో నిమగ్నం.

+++

కానీ, తీరుబడి విలువ తెలిసిన వాళ్లకో మాట.
బట్టలు ఉతకడం ఒక జీవకళ.
ఉతికిన బట్టల్ని జాడీయడం..తర్వాత వాటిని దులిపి ఆరేయడమూ చిత్రమే.

అయితే, ఆ దుస్తులను ఆరేయడానికి కూడా కొన్ని చోట్లు ఉంటాయి.
తీగల మీద, దండేలా మీదా ఇంకా చాలాచోట్ల.
అయితే, గాలికి కొట్టుకు పోకుండా క్లిప్పులు పెట్టడం సరే!
కానీ, బంగ్లామీద ఇట్లా ఈ దృశ్యంలో ఆమె చీరను ఆ సందునుంచి వదిలి పైకి తీయడం ఉన్నదే అలా…
ఎండ పొడలో వెచ్చని దృశ్యం ఒకటి గమనించనే గమనించం. కానీ, ప్రతిదీ ఒక చిత్రం.
ఒక తెలివిడి, అమరిక. సుతారమైన శైలి. మహిళల జీవన మాలికా సంపుటిలో దాగిన అనురాగ దొంతర.
మన దృష్టిలో పడని నెమలీక.
దృశ్యాదృశ్యం.

+++

ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టుకోవడం ఒక చిత్రమే.
అయితే, అసలు సంగతి అది కాదు. తల్లి.
అవును. మనం ఒంటిమీద ధరించే దుస్తులన్నీఇక్కడ మీరు కూర్చున్న చోట మీతో ఉన్నాయిగానీ అవన్నీ అక్కడ తడిసాయి. ఆరాయి. బలంగా వడితిప్పబడినాయి. ఒక్క ఉదుటున దులుపబడి తీగల మీద నిశ్చలంగా ఆరవేయబడినాయి. అవి గాలి మాటుకు రెపరెపలు పోయినా పోయాయి. నీడలోనూ అవి సేద తీరే ఉంటాయి.

ఇక ఇంట్లోని మనుషుల్లా లేదా ఒక పుస్తకంలోని కవితల్లా అవన్నీ ఒకదాంతో ఒకటి రహస్యంగా అనుభూతులు పంచుకునే ఉంటాయి. ప్యాంటు, షర్టు, చీర. రవిక…ఏమైనా కావచ్చు

అవన్నీ వయోభేధాల జీవన వలువలు. విలువలు.+++ఒక్కమాటలో కుటుంబ సభ్యులందరికీ చెందిన దుస్తులన్నీఒకరి చేతిలో పిండి వారి చేతిలో ఆరేయబడినవే అని తెలిస్తే, అవే మన ఒంటిపై నిలిచినవీ అని గనుక గమనిస్తే, ఆఫీసుకు వచ్చేముందు దండెం మీదికి చూపు వాలవలసిందే.  వీధుల్లోకి వచ్చాక బంగ్లాపైకి చూడవలసిందే.

తల్లులు కనిపిస్తూనే ఉంటారు.
అపుడు మన ఒంటిపై స్పృహ కలిగి, ‘ఓహో’ అనుకుంటే మన మనసుకు నిజంగా శాంతి.

ముఖ్యంగా ఈ చలికాలంలో ఒకమాట చెప్పాలి. మన దుస్తులన్నీనూ వెచ్చగా ఉన్నయి అనుకుంటే…
బహుశా పైన ఒక సుదీర్ఘ కవితలాగా తల్లి ఆ చీరను ఆరేస్తున్నదే…ఆమె స్వేదంతో మరింత గాఢంగా మారి ఉండటం వల్లని?  ఏమో! అవి ఈ చలికాలాన వెచ్చగా అందుకే మారి ఉన్నాయి కాబోలు అనిపిస్తోంది.
వాటిని చిత్రంలో పటం కట్టలేకే ఈ ‘దృశ్యాదృశ్యం’ అనీ చెప్పబుద్ధవుతున్నది.

~ కందుకూరి రమేష్ బాబు

మీ మాటలు

  1. బాగుంది రమేష్ బాబు

  2. shanti prabodha says:

    ఆఖరికి పనిమనిషి అయినా సరే, ఆమె అమితశ్రద్ధగా పనిచేసే తల్లే.
    మనం ధరించే దుస్తులన్నిటా కనిపించని స్వేదం, తడి ఆరిన శ్రమైక గీతికా ఆమే .. చాలా
    బాగుంది కందుకూరి రమేష్ బాబు గారు

    • kandu kuriramesh babu says:

      బాగుంది …
      చాలా బాగుంది…
      ఎంత మంచి పదాలు. పాదాలు. నచ్చి చెప్పడం లో ఎంత బావుంటుంది.
      ఆ ఫోటో తీసిన రోజే రాసాను ఆర్టికల్. కాని, ఈ ఫీలింగ్ …తడి ఆరిన శ్రమైక గీతికా ఆమే…అన్న ఫీలింగ్ ఎంత బొమ్మ తీసినా అక్షారాల్లో చెప్పితే గాని త్రుప్తి లేకుండే. ..థాంక్స్ సుజన గారు, శాంతి గారు.

మీ మాటలు

*