మూడు నవలలు, ముగ్గురు స్త్రీల పోరాటం!

మహిళల మనస్తత్వాలను, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎంతో చాకచక్యంగా తన రచనల్లో చిత్రించిన చక్కని రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారు. ఇటీవల ఆమె మరణించడం ఎంతో విచారకరం. ఆమె రాసిన మూడు రచనలపై నాకు తోచిన అభిప్రాయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.

గోమతి (నవల):

అమ్మానాన్నల అపురూపంగా చూసుకునే గారాలపట్టి గోమతి. ఆకుసంపెంగ తోటల్లో, పెరటి జామచెట్టు నీడల్లో ఆడుతూ పాడుతూ పెరిగిన అమ్మాయి తను.

ఊహ తెలిసినప్పటినుండీ పొరుగింటి కుర్రాడు గోవిందుతోనూ, అటుపై బావ గోపాలంతోనూ అల్లరిచిల్లరిగా, నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా గడిచిన చిన్నతనం గోమతి సొంతం.

అటు గోవిందుకి, ఇటు గోపాలానికి ఆరాధన తానై ఎవరి ప్రేమను ఎలా అర్థం చేసుకొవాలో తెలియక ఎంతో మానసిక సంఘర్షణకు గురై చివరకు గోవిందుకి భార్యవుతుంది. అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా. అత్తవారి ఆస్థి మొత్తం కరిగి రోడ్డున పడాల్సి వస్తుంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా భర్తకు అంగవైకల్యం సంప్రాప్తిస్తుంది. అలాంటి నేపథ్యంలో తానే కుటుంబానికి అండగా నిలబడి పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడుతూ జీవిత సమరం సాగిస్తుంది గోమతి.

అనుకోకుండా ఆమె జీవితంలోకి బావ గోపాలం పునరాగమనం, అతని సాన్నిధ్యంలో ఆమె సాంత్వన పొందడం, తప్పు చేస్తునానన్న అపరాధభావంతో బాధ పడడం, గోపాలంతో భార్య చనువుతో పాటుగా అంగవైకల్యంతో గోవిందులో కలిగే ఆత్మన్యూనత, ఇష్టమైన మరదలికి తన ఇష్టాన్ని తెలియచేయలేని తన అశక్తతతో గోపాలం చెందిన వ్యథ, తిరిగి ఆమె కనిపించినప్పుడు అతను పొందిన ఆనందం… ఒకటా రెండా… అత్యంత సహజంగా ఈ కథలో జరిగే సంఘటనల మధ్యలో కథలోని ఈ పాత్రలు పడిన మానసిక క్షోభను కానీ, శారీరక శ్రమను కానీ అత్యంత సహజంగా, ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు రచయిత్రి విశాలాక్షి.

ముఖ్యంగా గోమతి పాత్రను విశాలాక్షి గారు మలచిన తీరు అత్యద్భుతం. ఆద్యంతం గోమతి పదే యాతనలను తమ యాతనగా పాఠకులు అనుభూతి చెందుతారు. మనసనేది ఎంత దిటవు కలదో అత్యంత సున్నితమైనది. సంఘటనలను బట్టే ఈ రెండు స్వభావాలూ బయటపడతాయి. గోమతి విషయంలో జరిగే ఈ మానసిక పరిణామాలను అత్యంత సహజంగా చిత్రించారు రచయిత్రి. అంతే కాదు- స్త్రీకి ఉద్యోగమనేది ఎంత ఆవశ్యకమో, ఉద్యోగపర్వంలో ఆమె ఎలాంటి రకరకాల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా చాలా బాగా తెలియచేశారు విశాలాక్షి గారు.

గోమతి నవల పూర్తి చేసినా ఆమె మాత్రం మన మనసులను వెంటాడటం మానదు. అదీ ఈ నవల ప్రత్యేకత!

untitled

***

మనస్వి (కథ) :

పరమేశం, కాంతం అల్లారుముద్దుగా చూసుకుంటున్న పాప పుట్టినరోజును ఆనందంగా జరుపుకుంటున్న రోజే రంగస్వామి అనే ఓ వృద్ధుని రూపంలో వారికి ఎదురవుతుందో గండం. ఏడాది క్రితం ఓ తిరునాళ్ళలో జరిగిన అగ్నిప్రమాదానంతరం తనకు దొరికిన పాపను తెచ్చుకున్న పాపను నా మనవరాలేమోనని వెదుక్కుంటూ వచ్చాను అని రంగస్వామి చెప్పినప్పుడు పరమేశం గుండెలో రాయి పడుతుంది.

అంతవరకూ అపురూపంగా చూసుకుంటూ, పిల్లలు లేని తమ ఇంట్లో మహాలక్ష్మి వెలసిల్లిందని ముచ్చటగా తాము పెంచుకుంటున్న ఆ పాప ఎక్కడ దూరమైపోతుందో, రంగస్వామి గుర్తు పట్టి తీసుకుపోతాడేమో అని పరమేశం పడిన మానసిక సంఘర్షణ కానీ రంగస్వామి, పాప ఒకరినొకరు చూసుకున్నప్పుడు జరిగే సన్నివేశాలను కానీ కళ్ళకు కట్టినట్టుగా రచయిత్రి ఈ కథలో చిత్రించిన తీరు నిజంగా అద్భుతంగా ఉంటాయి. తిరునాళ్ళలో జరిగిన అగ్నిప్రమాదం గురించి కూడా ఎంతో బాగా దృశ్యీకరిస్తారు రచయిత్రి.

విశేషం ఏమిటంటే కథల్లో కానీ నవలల్లో కానీ ఇన్ని వైవిధ్యాలు, మానసిక సంఘర్షణలు, వర్ణనలు ఉన్నా అవి పదాడంబరాలతో పాఠకులను శ్రమ పెట్టవు. తేలికైన పదాలతో, చక్కని మాటతీరుతో ప్రతి పదాన్నీ వదలకుండా చదివింపచేసేలా ఆసక్తికరంగా చదువరులను చదివింపచేస్తాయి. అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్న స్త్రీ జీవితాలను కానీ, అనేకానేక సామాజిక సమస్యలను కానీ తన కలం ద్వారా యధాతథంగా చిందించి పాఠకులను ఆలోచింపచేస్తాయి. మనసులను రంజింపచేస్తాయి. మంచి రచనల ప్రధానలక్ష్యం అదే కదా!

***

గ్రహణం విడిచింది (నవల) :

ఓ అందమైన అమ్మాయి, తనను చక్కగా చూసుకునే ఆమె భర్త! హాయిగా ఆనందంగా గడిపేందుకు అంతకంటే కావలసినదేముంది?! కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. అనుకోకుండా ఆ అందమైన అమ్మాయి భారతి భర్త మాధవ్ ప్రమాదంలో మరణించడంతో అప్పటివరకూ సుఖమయంగా సాగిన ఆమె జీవనం ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనవుతుంది.

భర్త పనిచేసిన సంస్థనుండి రావలసిన పెద్దమొత్తం అతని మరణానంతరం భారతికి అందుతుంది. అంతే! అక్కడినుండి భారతికి ప్రతిచోటా మరో కొత్త లోకం కనిపిస్తూ ఉంటుంది.

ఆత్మీయంగా చూసుకున్న అన్నావదినల్లోనూ, అత్తయ్యా మావయ్యల్లోనూ, ఆప్తుడిగా స్నేహితుడైన జగదీష్ లోనూ, చివరికి వీళ్ళందరినీ కాదనుకుని నమ్మి ఆమె వెళ్ళీన బాబాజీ లోనూ కూడా ఇదివరకు లేని ధనవ్యామోహాన్ని చూస్తుంది భారతి. తన దగ్గర డబ్బు లేనప్పుడు ఉన్న ఆత్మీయత స్థానంలో ఇప్పుడు డబ్బు వలన వచ్చిన తెచ్చిపెట్టుకున్న ఆప్యాయతలనే వారు ప్రదర్శిస్తున్నట్టుగా ఆమెకు తోస్తుంది. అనుకోకుండా ఆమెకు ఎదురైన సంఘటనలు, వ్యక్తుల ప్రవర్తనలు కూడా ఆమె అభిప్రాయానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి.

వ్యక్తిలో జరిగే ఓ మానసిక సంఘర్షణను, నిత్యం ఆమెలో జరిగే ఆలోచనాధోరణులను, మానవ బలహీనతలను సమర్థవంతంగా భారతి పాత్ర ద్వారా తెలియజేస్తారు విశాలాక్షి గారు. అంతే కాదు… దశాబ్దాల క్రితమే భర్తను కోల్ఫోయిన స్త్రీలు మరో వ్యక్తితో కొత్తజీవితాన్ని కోరుకోవడం తప్పేమీ కాదని ఎంతో నేర్పుగా భారతి పాత్ర ద్వారా సమర్థవంతంగా చెప్తారు రచయిత్రి.

డబ్బు అనేది ఎవరికైనా అత్యంత ఆవశ్యకమైన వస్తువే. అది అందుబాటులో ఉన్న మనుషులతో డబ్బు కోసం చుట్టూ ఉన్న మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, ఆ డబ్బు తమకు కూడా చెందాలని ఎంతగా తాపత్రయపడతారో కూడా అత్యంత సహజంగా ఈ పుస్తకంలో చిత్రిస్తారు రచయిత్రి.

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ భారతి మనసూ మన మనసూ మమేకమైపోతుంది. తనను విడిగా చూడటం మనకు తెలీకుండానే మరచిపోయి అడుగడుగునా ఆమెను సమర్థిస్తూనే ఉంటాం.

ఒక అమ్మాయికి వ్యక్తిగతంగా జరిగిన అనుభవాలను చక్కని కథగా మలిచి, ఆమె జీవితం తిరిగి సంతోషమయం కావాలని పాఠకులు కూడా కోరుకునేలా చేసి “గ్రహణం విడిచింది” అనే శీర్షికను కథకు, కథలో సందర్భానికి అన్వయిస్తూ రచయిత్రి నవలను ముగించిన తీరు హృదయాలను ఆకట్టుకుంటుంది.

గుండెను తడిమేసి దానిని తడి చేసే కథలు రాయగలిగే నేర్పూ విశాలాక్షిగారిదే అని నిరూపిస్తుంది “మనస్వి” కథ!

 -రాజేష్ యాళ్ల

rajesh

మీ మాటలు

*