మరల యవ్వనానికి…

10801844_1547986905415644_141749359838664061_n

painting: Mamatha Vegunta

 

పరవశంతో
నిలువెల్లా విరబూసిన
మునుపటి పడుచుదనపు మహదానందం
ఒక్కసారి నువ్వు నాకు తిరిగి ప్రసాదించు

కాలం
ముంచుకొచ్చిన తుఫానుగాలి
ఆసాంతంగా ఊడ్చుకొనిపోతే పోనీ

కొంజివురుల్నీ పచ్చనాకుల్నీ
అరవిరి మొగ్గల్నీ నవనవ కుసుమాల్నీ
అన్నీ మరల మరల చిగురువేయించు
చేవగల నిండు గుండెలోనుంచి
గుత్తులుగా పుష్పవర్షం కురిపించు

మునిమాపుల్ని లెక్కపెడుతో
అంటిపెట్టుకుని వున్నది
పక్షిరుతాల్లేని ఖాళీగూడు
శిశిరావృత నగ్నదేహాన్ని
ఉత్తిచేతులతో మోయలేదు
ఏటెల్లకాలం చెట్టు

కింద ధరిత్రీమాత
మీద ఆకాశదేవత
ఎవరి తరమూ కాదు మరి పునర్నవం

ఆదివనిత నువ్వు మహిమాన్విత నువ్వు
అత్యనురాగం అంతర్భందనం నువ్వు
ఒక్క నువ్వే
నీ రామచిలుక వన్నె వలువలో
ఇచ్ఛానుసారం ఓ తంతువుని తెంచి
విసురు బహుదూరపు కీకారణ్యం నుంచి
ఇటువేపే
ఈ మోడుమీదికి సరాసరి రివ్వున
నా తనివితీరా చుట్టబెట్టు
ఆ మోసులెత్తే చైత్రపర్వపు ఆచ్ఛాదన

-నామాడి శ్రీధర్‌

namadi sridhar

మీ మాటలు

 1. oh beautiful poem

  శ్రీధర్ కవిత్వ శైలి అనితరసాద్యం, అద్భుతం

 2. కోడూరి విజయకుమార్ says:

  శ్రీధర్ ….

  మీ కవిత్వం చదవడం, ఒక అపురూప అనుభవం నాకు ప్రతిసారీ !
  అంతర్జాలం పుణ్యమా అని మీ కొత్త కవిత్వాన్ని చదువుకోవడం బాగుంది !

 3. సాయి కిరణ్ says:

  పదాల్లో అందం , భావం సమతూకం గా వేసి రాయడం నిజంగా చాలా బాగుంది . మళ్ళీ మళ్ళీ చదివించి మనసుని నింపే కవిత సర్

 4. badugu bhaskar jogesh says:

  Telugu kavitvanni marala yava nani ki Mallinchina sundara bhashadhariki namassulu to. …

మీ మాటలు

*