పెద్రో పారమొ-11

pedro1-1
కోమల లోయలోని పొలాల మీద వాన పడుతూంది. కుంభవృష్టి కురిసే ఈ ప్రాంతాల్లో అరుదుగా పడే పలచటి వాన. అది ఆదవారం. ఆపంగో నుండి ఇండియన్స్ వాళ్ళ సీమ చేమంతి జపమాలలతోటీ, మరువం, దవనం కట్టలతోటీ దిగబడ్డారు. కలప అంతా తడిగా ఉండడం చేత పైన్, వోక్ కట్టెలు లేకుండానే వచ్చారు.
వాన నిలకడగా పడుతూంది. చిన్న గుంటల్లో నిల్చిన నీటి మీద సొట్టలు పడుతున్నాయి.
నాగటి చాళ్ళనుండి నీరు కాలవలుగా మారి మొలకలెత్తుతున్న లేత మొక్కజొన్న వైపు పారుతున్నాయి. మగాళ్ళెవరూ సంతకి రాలేదు. వాళ్లంతా పొలాల్లో పారే నీటికి గండ్లు కొడుతూ దారి మళ్ళించి లేతపంటను ముంచెత్తకుండా చూస్తున్నారు. వాళ్ళు గుంపులుగా కదులుతూ ఆ వానలో వరదలెత్తిన పొలాల్లో దారి చేసుకుంటూ మెత్తబడ్డ మట్టిని పారలతో తెగకొడుతూ, మొలకలను చేతితో కదతొక్కుతూ అవి బలంగా పెరిగేందుకు దోహదం చేస్తున్నారు.
ఇండియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇది తమకు మంచిరోజు కాదు అనుకున్నారు. అందుకే వాళ్ళు తడిసిన గబానేల, చెత్త టోపీల కింద వణుకుతున్నారు. చలితో కాదు, భయంతో. వాళ్ళు సన్నగా పడుతున్న వాన వంకా, పైన ఇంకా నిండుగా కనిపిస్తున్న మబ్బులవంకా తేరిపార చూస్తున్నారు.
ఎవరూ రావడం లేదు. ఊరంతా నిర్మానుష్యంగా అగపడుతూంది. ఒకావిడ ఒక గుడ్డ పీలికా, పంచదార పొట్లం, ఉంటే జొన్నగంజి వార్చడానికి చిల్లుల గిన్నే కావాలని అడుగుతూంది. సమయం గడుస్తున్న కొద్దీ గబానేలు బరువెక్కుతున్నాయి తడికి. ఇండియన్స్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, చతుర్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. సీమ చేమంతి ఆకులు వాన తడికి మెరుస్తున్నాయి. “కాస్త కిత్తనార సారా తెచ్చి ఉంటే బాగుండేది కానీ కిత్తనార చెట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి,” అనుకుంటూ ఉన్నారు.జస్టినా డయజ్ గొడుగు వేసుకుని మెదియా లూనా నుండి తిన్నగా ఉన్న దారిలో వేగంగా పారుతున్న నీటి కాలవలను తప్పించుకుంటూ వస్తూంది. చర్చి ప్రధాన ద్వారం దాటుతూ గుండెల మీదుగా చేత్తో శిలువ గుర్తు వేసుకుంది. ఆర్చీల కింది నుంఛి ప్లాజా లోకి వచ్చింది. ఇండియన్స్ అంతా ఆమెను చూడ్డానికి అటువైపు తిరిగారు. అందరి కళ్ళూ తనమీదే ఉన్నట్టూ, అందరూ తనను గుచ్చి గుచ్చి చూస్తున్నట్టూ అనిపించిందామెకి. ఆకులూ అలములూ పరిచిపెట్టుకున్న చోట్లలో మొదటిదాని దగ్గర ఆమె ఆగింది. పది సెంటవోల దవనం కొనుక్కుని వెనుతిరిగింది. ఇండియన్స్ కళ్ళన్నీ ఇంకా ఆమె వెన్నంటే ఉన్నాయి.
“ఈ కాలంలో అన్నీ ప్రియంగానే ఉంటాయి,” అనుకుంది మెదియాలూనా వెళుతూ దారిలో. “ఈ కాస్త దవనం పది సెంటవోలు! వాసన చూడ్డానికి కూడా చాలదు.”
పొద్దుపోతుండగా ఇండియన్స్ వాళ్లు తెచ్చుకున్న దినుసులన్నీ ఎత్తేసుకున్నారు. బరువుగా ఉన్న మూటల్ని భుజాన వేసుకుని వానలో నడిచారు. చర్చి దగ్గర ఆగి కన్య మేరీని ప్రార్థించి, ఒక మరువం కట్ట నైవేద్యంగా పెట్టారు. అపాంగో వైపు తమ ఇంటి దారి పట్టారు. “ఇంకో రోజు,” అనుకున్నారు. చతుర్లాడుకుంటూ నవ్వుతూ దారి వెంట నడిచారు.
జస్టినా డయజ్ సుజానా శాన్ హువాన్ గదిలోకి వెళ్ళి దవనాన్ని చిన్న అలమరలో పెట్టింది. పరదాలు కిటికీని పూర్తిగా మూసేయడంతో చీకట్లో ఆమెకు నీడలు మాత్రమే కనిపించాయి. కనపడని వాటిని ఉరామరిగా ఊహిస్తూంది. సుజానా శాన్ హువాన్ నిద్రపోతున్నట్లుంది అనుకుంది. ఆమె ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటే బాగుండుననుకునేది. ఇప్పుడు నిద్ర పోతుంది కనక జస్టినాకి తృప్తిగా ఉంది. కానీ ఆమెకి ఆ చీకటి గదిలో ఒక దూరపు మూలనుంచి నిట్టూర్పు వినవచ్చింది.
“జస్టినా!” ఎవరో పిలిచారు.
ఆమె చుట్టూ తిరిగి చూసింది. ఎవరూ కనపడలేదు కానీ భుజమ్మీద చేయీ, చెవి దగ్గర ఊపిరీ తగిలాయి. ఒక గొంతు రహస్యం చెపుతున్నట్టు అంది “వెళ్ళి పో జస్టినా, నీ సామానంతా సర్దుకుని పో. ఇక నువ్వు మాకక్కర లేదు.”
“ఆమెకి నా అవసరం ఉంది,” నిటారుగా నిలబడుతూ అంది. “ఆమెకి జబ్బు చేసింది. ఆమెకి నా అవసరం ఉంది.”
“ఇకపై అవసరం లేదు జస్టినా! నేనిక్కడే ఉండి ఆమెను చూసుకుంటాను.”
“నువ్వేనా బార్ట్లోం?” అడిగింది కానీ జవాబుకోసం ఆగలేదు. పొలాలనుంచి తిరిగి వచ్చే ఆడా మగా చెవుల పడేట్టు ఒక్క అరుపు అరిచింది. అది విన్న వాళ్ళు “ఇదేదో అరుపులా ఉంది కానీ మనిషి అరుపులా మాత్రం లేదు,” అనుకున్నారు.
వానకి చప్పుళ్ళనీ సన్నగిల్లుతున్నాయి. మిగతా సందడంతా సన్నగిల్లినప్పడు అది చల్లటి చినుకుల్ని విసిరికొడుతూ, జీవన సూత్రాన్ని నేయడం వినిపిస్తూంది.
“ఏమయింది జస్టినా? ఎందుకంతగా అరిచావు?” సుజాన శాన్ హువాన్ అడిగింది.
“నేనేం అరవలేదు సుజానా! నువు కలగన్నట్టున్నావు.”
“నాకు కలలు రావని చెప్పానుగా! నీకేం పట్టదు. ఒక రవ్వ కన్ను మూతపడింది. పిల్లిని రాత్రి బయట వదిలివేయలేదు. అది నన్ను రాత్రంతా నిద్ర పోనివ్వలేదు.”
“అది నాతో పడుకుంది, నా కాళ్ల మధ్య. అది తడిస్తే చూడలేక నా మంచం మీదే ఉండనిచ్చాను. కానీ అది గొడవేం చేయలేదు.”
“లేదు, గొడవేం చేయలేదు! రాత్రంతా సర్కస్ పిల్లి లాగా నా కాళ్ల నుంచి తలమీదికి దూకుతూ ఉంది ఆకలేసినట్టు మెల్లగా మ్యావ్ మ్యావ్ అంటూ.”
“దానికి తిండి బాగానే పెట్టాను. అది రాత్రంతా నా పక్క వదల్లేదు. మళ్ళీ ఏవో అబద్ధాల కలలు కంటున్నావు సుజానా!”
“అది రాత్రంతా దూకుతూ నన్ను జడిపిస్తూనే ఉందని చెపుతుంటే వినవేం? నీ పిల్లంటే నీకు ముద్దేమో కానీ నేను పడుకున్నప్పుడు నా దగ్గరికి రానీయకు.”
“ఊరికే ఊహించుకుంటున్నావు సుజానా. అంతే. పేద్రో పారమొ వచ్చాక ఇక నీతో నా వల్ల కాదని చెప్పేస్తా. వెళ్ళిపోతానని చెప్తా. పనికి పెట్టుకునే మంచి వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. అందరూ నీలా తిక్కగా ఉండరు, ఇట్లా ఏడిపించి నవ్వుకోరు. రేపు నేను వెళ్ళిపోతాను. నా పిల్లిని తీసుకుని పోతా, నువ్వు సుఖంగా ఉండు.”
“నువ్వు పోవు పాపిష్ఠి జస్టినా! నువ్వెక్కడికీ పోలేవు. నీకు నాలా ప్రేమించేవారు ఎక్కడా దొరకరు.”
“అవును, నేను పోను సుజానా. నేను పోను. నిన్ను చూసుకుంటానని నీకు తెలుసు. నేను ఏం చేయనని నువు తిట్టినా నేనెప్పుడూ నిన్ను చూసుకుంటాను.”
సుజానా పుట్టిన రోజునుంచీ ఆమే సాకింది. ఆమెను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమెకు నడవడం నేర్పింది. ఎప్పటికీ గుర్తుండి పోయే ఆ మొదటి అడుగు వేయడం. ఆమె పెదవులూ, కళ్ళూ పంచదార చిలకల్లా తీపెక్కడం చూసింది. “పీచు మిటాయి బులుగు, పసుపూ బులుగూ, పచ్చా బులుగూ, అదీ ఇదీ కలుపు,” బొద్దుగా ఉన్న ఆమె కాళ్ళను మునిపళ్లతో కొరికేది. పాలు రాని రొమ్ముని బొమ్మలా ఆమెకందించి ఆనందపరిచేది. “ఆడుకో దీనితో,” సుజానాతో చెప్పేది. “నీ చిన్న బొమ్మతో నువ్వాడుకో,” ఆమె ముక్కలవుతుందా అనేట్టు వాటేసుకునేది.
బయట అరటి ఆకులమీద వాన పడుతూంది. నీరు కింద మడుగుల్లో పడి మరుగుతున్న చప్పుడు వస్తూంది.
పక్క దుప్పట్లు చల్లగా, చెమ్మగా ఉన్నాయి. పగలూ రేయీ, పగలూ రేయీ పనిచేసి అలసిపోయినట్టు తూముల్లో జల జలమంటూ నురగలు తేలుతున్నాయి. ప్రళయ కాల ధ్వనులతో వాన కుంభవృష్టిగా పడుతూనే ఉంది కాలవలు కడుతూ.

అర్ధరాత్రయింది. బయట వాన చప్పుడు అన్ని శబ్దాలనూ మింగేస్తూంది.
సుజానా శాన్ హువాన్ పెందలకడనే నిద్ర లేచింది. నెమ్మదిగా లేచి కూచుని మంచం దిగింది. మళ్ళీ ఆమెకు కాళ్ళు బరువెక్కినట్టనిపించింది. ఒళ్ళంతా కూడా బరువుగా ఉన్నట్టూ, అది తలకెక్కుతున్నట్టూ అనిపించింది.
“ఎవరది? నువ్వేనా బార్ట్లోం?”
ఎవరో వస్తున్నట్టో, పోతున్నట్టో తలుపు కిర్రుమనడం విన్నాననుకుంది. మళ్ళీ చల్లటి వాన, ఆగాగి ఆరటి మొక్క్ల మీదినుంచి జారిపడుతూ, దాని పొంగులోనే మరుగుతూ.
ఆమె మళ్ళీ పడుకుని పొద్దున ఎండ చెమ్మనీటితో పూసలు కట్టిన ఎర్రటి ఇటుకల మీదపడిందాకా లేవలేదు.
“జస్టినా!” ఆమె పిలిచింది.
భుజాల మీద శాలువా కప్పుకుంటూ ఆమె ప్రత్యక్షమయింది తలుపు పక్కనే ఉన్నట్టు.
“ఏం కావాలి సుజానా!”
“పిల్లి. పిల్లి మళ్ళీ ఇక్కడికి వచ్చింది.”
“అయ్యో నా సుజానా!”
సుజానా రొమ్ముల మీద తల ఆనించి కౌగిలించుకుంది. సుజానా తలపైకెత్తి అడిగింది “ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నువ్వు నన్నెంత బాగా చూసుకుంటున్నావో పేద్రో పారమొకి చెప్తాను. నీ పిల్లి నన్నెట్లా జడిపిస్తుందో అతనికి చెప్పనులే! ఏడవకు జస్టినా!”
“మీ నాన్న చనిపోయాడమ్మా! మొన్న రాత్రే చనిపోయాడు. మనం చేయవలసింది ఏమీ లేదని ఇవాళే వచ్చి చెప్పారు. అక్కడే పూడ్చేశారట. ఇక్కడి దాకా తీసుకురావడం దూరాభారమని. నువ్వొంటరిదానవయ్యావమ్మా, సుజానా!”
“అయితే అది నాన్న అన్నమాట.” సుజానా నవ్వింది. “నాకు సెలవని చెప్పటానికి వచ్చాడు,” ఆమె మళ్ళీ నవ్వింది.
చాలా ఏళ్ళ క్రితం ఆమె చిన్న పాపగా ఉన్నప్పుడు అతను ఒకరోజు ఆమెతో అన్నాడు “కిందికి దిగు సుజానా! వచ్చి నీకేం కనిపించిందో చెప్పు!”
ఆమె నడుముకు కట్టుకున్న తాడు నొక్కుకుపోతున్నా వేలాడుతూంది. చేతులు దూసుకుపోతున్నా వదిలి పెట్టడం లేదు. బయటి ప్రపంచాన్నీ ఆమెనీ కలిపి ఉంచే బంధం ఒక్క ఆ తాడే.
“నాకేం కనపడడం లేదు నాన్నా!”
“సరిగా చూడు సుజానా! ఏమన్నా కనిపిస్తుందేమో చూడు,” లాంతరు వెలుగు ఆమె మీద పడేట్టు చేశాడు.
“నాకేం కనపడడం లేదు నాన్నా!”
“ఇంకొంచెం కిందికి దింపుతాను. నేల తగలగానే చెప్పు.”
ఏవో చెక్కల మధ్య సన్నటి సందు నుండి లోపలికి పోయింది. బంకమట్టితో కప్పబడి, పుచ్చి పాడయిన చెక్కల మీద నడిచింది.
“నెమ్మదిగా పో సుజానా. నీకు నేను చెప్పింది కనిపిస్తుంది.”
ఆమె చీకట్లో అటూ ఇటూ ఊగుతూ, దేనికో కొట్టుకుంటూ కిందికి, ఇంకా కిందకి వెళ్ళింది కాళ్ళు గాల్లో తేలుతుంటే.
“కిందికి సుజానా. ఇంకొంచెం కిందికి. ఏమన్నా కనిపిస్తుందేమో చూసి చెప్పు.”
కాళ్ల కింద నేల తగిలినప్పుడు ఆమె భయంతో అక్కడే నిలబడిపోయింది. దీపపు కాంతి ఆమె మీదే తిరిగి ఆమె పక్కనే కేంద్రీకృతం అయింది. పైనుంచి అరుపు విని వణికింది.
“అది నాకివ్వు సుజానా!”
ఆ పుర్రెను చేతుల్లోకి తీసుకుంది కానీ వెలుతురు పూర్తిగా దాని మీద పడేసరికి వదిలేసింది.
“ఇది చచ్చిపోయన వాడి పుర్రె,” అంది.
“దాని పక్కనే ఇంకేదో ఉంటుంది చూడు. ఏం కనిపించినా నాకివ్వు.”
అస్తిపంజరం ఎముకలుగా విడివడి ఉంది. దవడ ఎముక పంచదారలాగా పక్కకి పడిపోయింది. బొటనవేలు దాకా ఒక్కో ముక్కా కీలు తర్వాత కీలుగా అతనికి అందించింది. అన్నిటి కంటే ముందు ఆమె చేతుల్లోనే పొడయిన గుండ్రటి పుర్రె.
“బాగా చూడు సుజానా! డబ్బు కోసం. గుండ్రటి బంగారు నాణేలు. అంతా చూడు సుజానా!”
తరవాత ఆమెకి ఏమీ గుర్తు లేదు కొన్ని రోజుల తర్వాత మంచుగడ్డలోకి అడుగుపెట్టిందాకా. ఆమె తండ్రి చూపుల్లోని మంచుగడ్డ.
అందుకే ఆమె నవ్వుతూందిప్పుడు.
“అది నువ్వేనని నాకు తెలుసు బార్ట్లోం!”
ఆమె రొమ్ముల మీద తలపెట్టి ఏడుస్తున్న జస్టినా పైకి లేచి చూసింది ఆమె ఎందుకు నవ్వుతుందా అనీ, ఆ నవ్వు అట్టహాసంగా ఎందుకు మారిందా అనీ.
బయట ఇంకా వాన పడుతూంది. ఇండియన్స్ వెళ్ళిపోయారు. అది సోమవారం. కోమల లోయ వానలో మునుగుతూ ఉంది.

రోజు తర్వాత రోజు గాలులు విసిరి కొడుతున్నాయి. వానలు తీసుకు వచ్చిన గాలులు. వాన పోయినా గాలి ఉండిపోయింది. పొలాల్లో లేత ఆకులు ఇప్పుడు ఎండిపోయి చాళ్ళలో పరిచినట్టు పడి ఉన్నాయి గాలికి ఎగిరిపోకుండా. పగటిపూట గాలులు ఐవీ తీగలను కదిలిస్తూ, కప్పుపై పెంకుల్ని దడదడమనిపిస్తూ కొంత భరించగలిగేలా ఉన్నా రాత్రయ్యేప్పటికి ఆగకుండా ఒకటే రొద పెడుతూన్నాయి. ఆకాశంలో పందిరిలా కమ్ముకున్న మబ్బులు నిశ్శబ్దంగా కదిలిపోతున్నాయి నేలను రాసుకుపోయేంత కిందగా.
సుజానా శాన్ హువాన్ మూసి ఉన్న కిటికీని గాలి విసిరి కొట్టడం వింటూంది. చేతులు తలకింద పట్టుకుని ఆలోచిస్తూ పడుకుని రాత్రి చప్పుళ్ళు వింది. గాలి అసహనంగా ఉండుండి రాత్రిని వేధిస్తూంది. అకస్మాత్తుగా ఆగిపోతుంది.
ఎవరో తలుపు తెరిచారు. గాలి విసురుకి దీపం ఆరిపోయింది. ఆమె చీకటినే చూస్తూంది ఆలోచించడం ఆపేసి. మరుక్షణం అడ్డదిడ్డంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు వినపడింది. మూసిన కనురెప్పలమీద దీపపు కాంతి పడడం తెలుస్తూంది.
ఆమె కళ్ళు తెరవలేదు. వెంట్రుకలు మొహం మీద చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఆమె పై పెదవి మీద చెమట చుక్కల్ని దీపం వేడెక్కిస్తూంది.
ఆమె అడిగింది “నువ్వేనా ఫాదర్!”
“అవునమ్మా, నేను నీ తండ్రిని.”
సగం తెరిచిన కళ్ళతో చూసింది. పైకప్పు మీద నీడలాంటి ఆకారం ఆమె మొహం మీద పడుతున్నట్టూ, దాన్ని ఆమె జుట్టు మూసేస్తున్నట్టూ ఉంది. దాని తల ఆమె మొహం మీదికి వచ్చినట్టుంది. కనురెప్పల వెంట్రుకల్లోంచి బూజరగా ఉన్న ఒక ఆకారం రూపుదాల్చింది. దాని గుండె స్థానంలో ఒక దీపం వెలుగుతూంది. చిన్న గుండె దీపంలా రెపరెపమంటూ కొట్టుకుంటూంది. “నీగుండె నొప్పితో చనిపోతూ ఉంది,” ఆమె అనుకుంది. “నాకు తెలుసు నువ్వు ఫ్లోరెన్సియో చనిపోయాడని చెప్పడానికి వచ్చావని. కానీ నాకు ఆ విషయం ముందే తెలుసు. ఇక దేని గురించీ విచారించకు. నాగురించి ఆందోళన పడకు. నా దిగులు భద్రంగా దాచి ఉంచాను. నీ గుండె జారిపోనీకు.”
మంచం దిగి ఫాదర్ రెంటెరియా వైపుకు ఈడ్చుకుంటూ వచ్చింది.
“నన్ను ఓదార్చనీ.” అన్నాడు కొవ్వొత్తి వెలుగుని తన చేతితో కాపాడుతూ. “నా తీరని దుఖం తో నిన్ను ఓదార్చనీ!”
ఆమె అతని వద్దకు వచ్చి కొవ్వొత్తి జ్వాల చుట్టూ తన చేతుల్ని అడ్డుపెట్టి, దానివైపు తన ముఖం వంచడం ఫాదర్ రెంటెరియా చూస్తూ ఉండిపోయాడు. కాలుతున్న మాంసం వాసన రావడం తో కొవ్వొత్తిని ఒక్క ఊపున పక్కకి లాగి ఆర్పేశాడు.
చీకట్లో సుజానా మళ్ళీ పరుగెత్తింది తన దుప్పటి కింద దాక్కోవడానికి.
“నిన్ను ఓదార్చడానికి వచ్చానమ్మా!”
“అయితే నువ్వెళ్ళవచ్చు ఫాదర్!” ఆమె చెప్పింది. “మళ్ళీ రావద్దు. నాకు నీ అవసరం లేదు.”
వెనుతిరిగిపోతున్న అడుగుల చప్పుడు వినిపించింది. ఎప్పటిలా చలినీ, భయాన్నీ కలగజేస్తూ.
“చచ్చిపోయినవాడివి, నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు?’
ఫాథర్ రెంటెరియా తలుపు మూసి రాత్రి గాలిలోకి అడుగు పెట్టాడు.
గాలి వీస్తూనే ఉంది.

టర్తముడో అని అందరూ పిలిచే అతను మెదియా లూనా వచ్చి పేద్రో పారమొ గురించి అడిగాడు.
“అతన్నెందుకు కలవాలనుకుంటున్నావు?”
“మ..మాట్లాడదామని..”
“ఇక్కడ లేడు.”
“వ..వచ్చాక చెప్పు ఆయనకి. డ..డాన్ ఫుల్గోర్ గురించి.”
“నేను వెళ్ళి చూస్తాను. కాసేపు ఆగాల్సి ఉంటుంది.”
“అ..అర్జెంటని చెప్పు.”
“చెప్తాలే!”
టర్తముడో గుర్రం దిగకుండానే ఎదురుచూశాడు. కొద్దిసేపయ్యాక అతనెప్పుడూ చూడని పేద్రో పారమొ వచ్చి అడిగాడు “ఏం పని నీకు?”
“నే.నేను అయ్యతోటే మాట్లాడాలి.”
“నేనే అయ్యను. నీకేం కావాలి?”
“ఏ..ఏమిటంటే డాన్ ఫుల్గోర్ సెడానో ని చ..చంపేశారు. నె..నేను అతనితోనే ఉన్నాను. ని..నీళ్ళు రావడం లేదేమిటా అని చు..చూడ్డానికి కాలవ పైకి వెళ్ళాము. వె..వెళుతుంటే కొంతమంది గుర్రాల మీద మాకెదురుగా వచ్చారు. వ..వాళ్లల్లో ఒకడు ‘వాడు నాకు తెలుసు, మె..మెదియా లూనాలో మేస్త్రీ’ అని అరిచాడు. వ..వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. డ..డాన్ ఫుల్గోర్ ని గుర్రం ది..దిగమని చెప్పారు. వ..వాళ్ళు తిరుగుబాటుదారులమని చెప్పుకున్నారు. వ..వాళ్లకి మీ భూములు కావాలంట. ‘పొ..పో!’ అని డాన్ ఫుల్గోర్ని అన్నారు ‘పో, పోయి మీ అయ్యగారితో చెప్పు మె..మేం వస్తున్నామని.’ బ్..భయపడిపోయి బయలుదేరాడు. ల..లావు కదా, మరీ వేగంగా కాదు కానీ పరుగెత్తాడు. అ..అతను పరుగెడుతుంటే వాళ్ళు కాల్చారు. ఒ..ఒక కాలు గాల్లో, ఒక కాలు నేలమీద ఉండగానే చ..చచ్చిపోయాడు.
“నె..నేను ఒక్క అడుగు కూడా క..కదల్లేదు. ర..రాత్రంతా అక్కడే ఉండి ఏం జరిగిందో చె..చెప్పడానికి వచ్చాను.”
“మరి ఇంకా దేనికోసం ఆగావు? నీ దారిన పో. వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వచ్చి కలవాలన్నా ఇక్కడే ఉంటానని వాళ్ళకు చెప్పు. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను. ముందు కొసగ్రేషన్ రాంచ్ మీదుగా వెళ్ళు. నీకు టిల్కేట్ తెలుసా? అక్కడ అతనుంటాడు. అతన్నొచ్చి నన్ను కలవమని చెప్పు. తర్వాత వాళ్ళకు చెప్పు ఎంత తొందరగా వస్తారా అని ఎదురు చూస్తున్నానని. ఏ రకం తిరుగిబాటుదారులు వాళ్ళు?”
“న..నాకు తెలియదు. ఆ పేరే చెప్పుకున్నారు.”
“ఆ టిల్కేట్ ని ఇక్కడ ఉన్నట్టు రమ్మను.”
“ఆ..అట్లాగే అయ్యా!”
పేద్రో పారమొ తన ఆఫీసు గది తలుపులు మూశాడు. తను ముసలివాడయినట్టూ, అలసిపోయినట్టూ అనిపించిందతనికి. ఫుల్గోర్ గురించి ఎక్కువ దిగులుపడలేదు. “అతనీ లోకం కంటే పై లోకానికే చెందినవాడు.” ఫుల్గోర్ చేయగలిగిందల్లా చేశాడు. ఇంకెవరికంటేనూ ఎక్కువగా కాకపోయినా ఉపయోగపడ్డాడు. “కానీ ఆ దొంగలంజకొడుకులకి కొండచిలువలాంటి టిల్కేట్ వంటి వాళ్ళు ఎదురుపడి ఉండరు,” అనుకున్నాడు.
అతని ఆలోచనలు ఎప్పుడూ తన గదిలో నిద్రపోతూనో, నిద్ర నటిస్తూనో ఉండే సుజానా శాన్ హువాన్ వైపు మళ్ళాయి. అతను ముందు రాత్రంతా అమె గదిలో గోడ కానుకుని నిలుచుని పల్చటి కొవ్వొత్తి కాంతిలో ఆమెనే గమనిస్తూ గడిపాడు. చెమటతో తడిసిన మొహం, దుప్పటిని అటూ ఇటూ కదిలిస్తూ, దిండు పీలికలయ్యేట్టు పీకుతూన్న చేతులూ.
ఆమెను తనతో కాపురానికి తీసుకువచ్చినప్పటినుంచీ ప్రతి రాత్రీ అంతే. రాత్రంతా ఆమె అంతు లేని కలతతో బాధపడుతూ ఉండడం చూస్తూ గడపడమే. ఇట్లా ఎన్నాళ్ళు సాగుతుందని తనను తనే ప్రశ్నించుకున్నాడు.
చాలా రోజులు ఇట్లా ఉండదని ఆశించాడు. ఏదీ ఎల్లకాలమూ ఉండబోదు. ఏ జ్ఞాపకమూ ఎంత గాఢమైనదయినా మాసిపోకుండా ఉండదు.
ఆమెను అంతగా లోలోపల చీలుస్తూ వేధించేదేమిటో, నిద్రపట్టక అటూ ఇటూ దొర్లేట్టు చేస్తున్నదేమిటో తనకు తెలిస్తే బాగుండును.
ఆమె తనకు తెలుసుననుకున్నాడు. తెలియదని తెలిసినప్పటికీ, తను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తి అని తెలియడం చాలదా? ఇంకా – ఇది అన్నిటికంటే ముఖ్యమైనది – ఆమె వలన మిగతా జ్ఞాపకాలన్నీ చెరిపేసుకుని వెలిగే రూపుతో ఈ భూమిని వదిలిపోతాడు.
కానీ సుజానా శాన్ హువాన్ ఏ లోకంలో బతుకుతూంది? పేద్రో పారమొకి ఎప్పటికీ తెలియని విషయాల్లో అది ఒకటి.

“వెచ్చటి ఇసుక వొంటికి తగులుతూ హాయిగా ఉంది. నా కళ్ళు మూతపడీ, చేతులు బార్లా సాచీ, కాళ్ళు ఎడంగా సముద్రపుగాలికి తెరుచుకునీ ఉన్నాయి. నా ముందు దిగంతాలదాకా వ్యాపించిన సముద్రముంది కెరటాలతో నా పాదాలని కడిగి వాటిపై నురగలు వదులుతూ..”
“ఇప్పుడు మాట్లాడుతూంది ఆమే, హువాన్ ప్రెసియాడో. ఆమె ఏమంటూ ఉందో నాకు చెప్పడం మర్చిపోకు.”
“.. అది పొద్దున్నే. సముద్రం లేస్తూ పడుతూ ఉంది. దాని నురగ నుండి జారుకుని పచ్చటి నిశ్శబ్ద కెరటాలుగా పరుగెడుతూంది.
“’నేనెప్పుడూ నగ్నంగానే సముద్రంలో ఈదుతాను,’ అని అతనితో చెప్పాను. అతను కూడా ఆ మొదటి రోజు నాతో పాటు నగ్నంగానే దిగాడు. వెనక్కి తిరిగి నడిచి వస్తూ మెరుస్తూన్నాడు. సముద్రపు కాకులెక్కడా కనపడలేదు. ‘కత్తి ముక్కు ‘ పిట్టలని అందరూ పిలిచే పిట్టలు మాత్రం గురక పెడుతున్నట్టు గుర్రుగుర్రు మంటున్నాయి. అవి కూడా పొద్దెక్కేపాటికి మాయమయ్యాయి. నేను తోడు ఉన్నప్పటికీ అతనికి వొంటరిగా ఉన్నట్టనిపించింది.
“’నువు ఆ పిట్టల్లో ఒకదానివయితే ఎంతో అంతే,’ రాత్రి అతను అన్నాడు. ‘రాత్రి పూట మనమిద్దరమూ ఒక దుప్పటికింద ఒకే దిండు వేసుకుని పడుకున్నప్పుడే నిన్ను బాగా ఇష్టపడతాను.’
“అతను వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడూ తిరిగి వెళుతుండేదాన్ని. సముద్రం నా చీలమండల్ని కడిగి వెనక్కి పోతుంది, నా మోకాళ్ళను కడుగుతుంది, నా తొడలను కూడా. తన మెత్తటి చేయిని నా నడుం చుట్టూ వేసి, నా రొమ్ముల చుట్టూ తిరిగి, నా గొంతును పెనవేసుకుని, భుజాల్ని అదుముతుంది. నేను అప్పుడు దాంట్లోకి మునిగి పోయాను, నా పూర్తి శరీరంతో. దాని తాడన బలానికి నన్ను నేను అర్పించుకుని, ఏమీ దాచుకోకుండా దాని హస్తగతమౌతాను.”
“’నాకు సముద్రంలో ఈదడం ఇష్టం,’ అతనికి చెప్పాను.
“కానీ అతనికి అర్థం కాలేదు.
“ఆ మరుసటి రోజు నేను మళ్ళీ సముద్రంలో ఉన్నాను నన్ను నేను శుద్ధి చేసుకుంటూ. నన్ను ఆ కెరటాలకు అర్పించుకుంటూ.”

మీ మాటలు

*