అదనపు విలువపై అధికారం నిర్ధారించే ‘తీర్పు’

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

 

తీర్పు వొక రాజకీయ కథ. అదొక పాఠం కూడా . శ్రామిక వర్గ దృక్పథం ఆ కథకి ఆయువుపట్టు.

రచయిత తాను నమ్మిన భావజాలాన్ని గానీ, తన ప్రాపంచిక దృక్పథాన్ని గానీ సాహిత్యంలో చెప్పడం వల్ల కళాత్మక విలువలు దెబ్బతింటాయని వొకప్పుడు కేవల అనుభూతి వాదులూ, ఆ తర్వాత శుద్ధ రూపవాదులూ , యిటీవల వామపక్ష ప్రగతిశీల దృక్పథాన్ని వ్యతిరేకించడమే ఫ్యాషన్ గా మార్చుకొన్న కొంతమంది పోస్ట్ మాడర్నిస్టులూ సణిగే సణుగుళ్ళూ  కూసే కూతలూ రాసే కొక్కిరాయి రాతలూ పస లేనివని నిర్ద్వంద్వంగా తిరస్కరించడానికి నిండైన వుదాహరణ 64 లో కాళీపట్నం రామారావు మాష్టారు రాసిన ‘తీర్పు’ కథ . నేనీ మాటలు యింత నిక్కచ్చిగా చెప్పడానికి బలమైన కారణాలే వున్నాయి. ‘తీర్పు’ కథలో కారా ప్రతిపాదించదలచుకొన్న సారం రూపానికి హాని చెయ్యలేదు. వస్తు నిర్వహణకి శిల్పం యెలా దోహదం చేస్తుందో లోతుగా తెలిసిన రచయితగా మాష్టారీ కథలో దర్శనమిస్తారు. వస్తువుకి విధేయమైన శిల్పం మాత్రమే పాఠకుణ్ణి యెటూ మెదలనివ్వక కట్టి పడేస్తుంది. వస్తు ప్రధానమైన యీ కథలో దృష్టి యెంతసేపూ సారం మీదే వుండేలా చేయడానికి కథా నిర్మాణ విషయంలో రచయిత తీసుకొన్న శ్రద్ధ ప్రతి పదంలోనూ  గోచరిస్తుంది.

పెట్టుబడులు – వనరులు – వుత్పత్తి సాధనాలు – శ్రమ – వుత్పత్తి ఫలాల గురించి , వాటి అదుపు గురించి మార్క్సిజం చెప్పిన సూత్రాలను అర్థం చేసుకోడానికి ‘తీర్పు’ కథ వొక పాఠంలా నాకెంతో తోడ్పడింది. తరగతి గదిలో భాషాధ్యాపకుడిగా సామాజిక శాస్త్రాంశాల్ని అన్వయిస్తూ సాహిత్యాన్ని బోధించే స్వేచ్ఛ వుండడం వల్ల ‘ తీర్పు’ కథని యెన్నో సందర్భాల్లో పిల్లలకి చదివి వినిపించాను, చేతిలో కథ లేనప్పుడు మౌఖికంగా చెప్పాను. ప్రతిసారీ కథలోని సారం మీద చర్చలు జరిగేవి. సుందర రామయ్య రెండో కొడుకు ఇచ్చిన తీర్పుకే అంతిమంగా ఆమోదం లభించేది. మాష్టారి తీర్పు కథని తొలిసారి నేనెప్పుడు చదివానో గుర్తులేదు కానీ – కథలోని ‘ రెండోవాడు’ నన్ను జీవితం పొడవునా ఆవహించిన హీరో అయ్యాడు. అతని నిర్ణయాత్మక ధోరణి , తర్కబద్ధమైన వాదనా పటిమ , చూపులో చురుకుదనం , మాటలో నైశిత్యం, ముక్కుసూటిదనం , హేతుదృష్టి , అభిప్రాయ వ్యక్తీకరణలో నిక్కచ్చిదనం, ఆశయసాధన పట్ల సడలని పట్టుదల , ఆధిపత్య నిరసన , తిరుగు బాటు తత్త్వం వంటి అనేకానేక గుణాలు నాకాదర్శమయ్యాయి.

మానవ శ్రమే సమస్త సంపదల సృష్టికి కారణమైనప్పుడు దానిమీద సర్వ హక్కులూ – అనుభవించడం, పరిరక్షించడం, పంచడం యేవైనా కావొచ్చు – అవి శ్రమ చేసినవారికే చెందుతాయన్న మార్క్సిజం మౌలిక సూత్రాన్ని అతి సరళంగా కళాత్మకంగా ఆవిష్కరించిన ‘తీర్పు’ కథ వొక విధంగా అన్యాపదేశ కథ.  అన్యాపదేశ కథల్లో అంతరార్థం తెలిసీ తెలియనట్టుగా దాగుడుమూతలాడుతూ మంచుపొర కింది పువ్వులా గోచరం కావడం వొక టెక్నిక్. అయితే వొక్కోసారి రచయిత చెప్పదల్చుకొన్న అంతరార్థం పాఠకుడికి అందదు. అలా అందక పోయినా రచయిత ప్రతిభ కారణంగా ఆ లోటు కనపడదు. పాత్రలూ సన్నివేశాలూ సంభాషణలూ సంఘటనలూ అన్నీ కలిసి వొక కథగా హాయిగా చదువుకోడానికి యెటువంటి  యిబ్బందీ కల్గదు. అంతరార్థం ద్యోతకం కాపోయినా అది కథగా మనగల్గుతుంది – యిది మరో టెక్నిక్. ‘తీర్పు’ కథలో అర్థం నిగూఢం  కాదు. అలా అని పూర్తిగా బహిరంగం కాదు. చదివిన ప్రతిసారీ పదాలపైనా పాత్రలపైనా  కొత్త కాంతి ప్రసరిస్తుంది. పదాల మధ్య, వాక్యాల మధ్య , నిశ్శబ్దంలోనూ దాగివున్న లోతుని ఆనందించగలం. పాత్రలు ప్రతీకలుగా గాక నమూనాలుగా కళ్ళముందు నిలుస్తాయి. జీవిత సత్యాల్ని బోధపరుస్తాయి. ఒక యింట్లో దేశం, వొక కుటుంబంలో సమాజం , అందులోని భిన్న వ్యవస్థలూ ఆవిష్కారమౌతాయి. ఆ యా సన్నివేశాల్లో పాత్రల మాటలూ చేతలూ ఆలోచనా సరళీ నడవడికా అందుకు దోహదం చేస్తాయి. వాటిని విశ్లేషించుకొనే  ముందు స్థూలంగా వొకసారి కథలోకెళ్దాం :

సుందర రామయ్యకి నలుగురు మగపిల్లలు. కడగొట్టుది ఆడపిల్ల. పెద్దవాళ్ళు ముగ్గురూ హైస్కూలుకు పోతున్నారు. రెండోవాడికి బళ్ళో అట్టలు చేయడం నేర్పేరు. అలాంటివి బళ్ళో చేసి అమ్మేరు. ఒక్కొక్కటి ముప్ఫై నయా పైసలకమ్మేరు. పెద్దవాడు అర్థరూపాయి ఖర్చుతో అరడజను చేయవచ్చని కనిపెట్టేడు. బజారులో ఆ అట్టలే ఒక్కొక్కటి ఆరణాలని చెపితే వాళ్ళ అమ్మ అర్థ రూపాయి యిచ్చింది. ఉన్నవాళ్ళు ఐదుగురే కాబట్టి అయిదు అట్టలే చేసుకుందామన్నారు. మిగిలిన డబ్బు – ఒక అట్టమీద అధికంగా పెడితే అది అందమయిన కాలికో అట్ట అయింది.

తాను పెద్దవాడు కాబట్టి, తనది పెద్ద క్లాసు కాబట్టి, ఆ అందమైన అట్ట తాను తీసుకుంటానన్నాడు పెద్దవాడు. అలా వల్ల కాదు నేను తీసుకుంటానన్నాడు రెండోవాడు – తల్లి మొదట పెద్దవాడికే యిచ్చేయమంది. రెండోవాడు వాదిస్తే వాడికే ఇచ్చేయబోయింది. తగువు తెగకపోవడంవల్ల తండ్రి దగ్గరకు వచ్చింది.

ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది. కుటుంబం దానికదే వొక యూనిట్ అయినప్పటికీ  సమాజం లోని అన్ని దృగంశాలూ అక్కడా వుంటాయి. కుటుంబంలో అందరూ సమానమేగానీ కొందరు ఎక్కువ సమానం. దానికి కారణాలు సవాలక్ష. పాతుకుపోయిన భూస్వామ్య విలువలు, అయాచితంగా ప్రవహిస్తూ వచ్చే పితృస్వామ్య భావజాలం, ప్రశ్నించరాని సంప్రదాయాలూ ఆచారాలూ,  జెండర్ వివక్ష, వ్యక్తుల బలాలు – బలహీనతలు, ప్రత్యేక ప్రేమాభిమానాలూ, నిర్వచించలేని వుద్వేగాలూ యిటువంటివన్నీ అక్కడ సంబంధాల్నిశాసిస్తాయి. నిర్ణయాల్ని నిర్దేశిస్తాయి.

కుటుంబ పెద్దగా సర్వాధికారాలూ సొంతం చేసుకొన్న సుందర రామయ్య న్యాయమూర్తి స్థానంలో కూర్చొని సమస్యని తన పెద్దరికంతో సులువుగా పరిష్కరించొచ్చు అనుకొన్నాడు. అయితే అతను ప్రజాస్వామ్య పద్ధతిని యెంచుకొన్నాడు. అసమానతల వ్యవస్థలో ప్రజాస్వామిక సంప్రదాయం యేమేరకు సరైన న్యాయం చేయగల్గుతుందో అతనికి తెలియదు. నిజానికతనికి యీ తగువు అంతగా నచ్చలేదు. అతను వర్తమానంలో యెంతగా జీవించాలనుకొంటాడో అంతగా వెనకటి కాలాన్ని ప్రేమిస్తాడు.

‘తన పిల్లలు త్రేతాయుగం నాటి శ్రీరామచంద్ర సోదరులను తలపిస్తూ, ఒక్కటిగా ఉండాలని అతని అభిమతం.’

ఎంత ప్రజాస్వామికంగా వుందామనుకొన్నా సుందరరామయ్య రక్తంలో దాగున్న ఫ్యూడల్ విలువల అవశేషాలు అతన్ని యిబ్బంది పెడ్తూ వుంటాయి. పెద్దకొడుకు తన ఔరసుడన్నభావన అతనిలో బలీయంగానే వున్నట్లుంది. వాడికి తన తండ్రి పేరే పెట్టుకొన్నాడు. వాడి పట్ల ప్రత్యేకంగా పక్షపాతం చూపించినట్లు కనపడకూడదని ప్రయత్నపూర్వకంగా ప్రజాస్వామిక కండువాని సర్దుకొంటూ వుంటాడు.

పెద్దవాడు – తెల్లగా నాజూగ్గా స్టయిలుగా వుంటాడు. కళ్ళల్లో కొంత తెలివి కూడా కనపడుతుంది. పెద్దకొడుక్కే వారసత్వపు హక్కులు వుంటాయన్నసంప్రదాయం వాడికి తెలిసినట్టే కనపడుతుంది. అందువల్ల పెద్ద అట్ట తనకే  దక్కాలని వాడి అభిమతం. తమ్ముడి ప్రతిఘటనతో వాడి అభిమానం దెబ్బతింది. దాన్ని దాచుకోడానికి బేలగా ప్రయత్నిస్తూ వున్నాడు. కానీ తండ్రి ప్రేమ తనవైపే మొగ్గుతుందని గట్టి నమ్మకం. తండ్రి తీర్పు తనవైపేనని వాడికి  భరోసా .

రెండోవాడు కాస్త బండగా వుంటాడు. వాడి మూసి వుంచిన పెదవుల్లో పట్టుదలా, తెరచి ఉంచిన కళ్ళల్లో నిబ్బరం కనిపిస్తాయి. చూసేవాళ్ళకి, వాడితో కొంచెం జాగ్రత్తగా వుండడం మంచిదనిపిస్తుంది. వాడి గురించి తండ్రికి ముందే కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి.

‘వాడు ప్రతిదానికీ యిట్టే సీరియస్ అయిపోయే రకమని సుందర రామయ్య అంతకుముందే వాడిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొన్నాడు.’

నిజానికి న్యాయమూర్తికి యిటువంటి పూర్వ నిశ్చయాలు – ప్రిజుడీస్ వుండకూడదు. కానీ వాడిని కన్నతండ్రిగా అలా అభిప్రాయపడే హక్కు కూడా అతనికి సహజంగానే వుంటుంది. ఈ ద్వైధీభావం, సంఘర్షణా కథ పొడవునా అతనిలో కనిపిస్తూనే వుంటాయి. ప్రజాస్వామిక విలువలు వొక వైపు, భూస్వామ్య భావజాలం మరొకవైపు అతను మధ్యలో వేలాడుతూ వుంటాడు. అయితే తనలోని యీ వైరుధ్యాన్ని కనపడనివ్వని గాంభీర్యం కూడా అతను ప్రదర్శిస్తాడు. మార్క్సిస్ట్ పరిభాషలో – జార్గాన్ అనుకోకుంటే – అతణ్ణి సెమీ ఫ్యూడల్ అనొచ్చు.

అందరికీ సమన్యాయం ప్రసాదించిన రాజ్యాంగం వంటిది తల్లి. అర్థ రూపాయి పెట్టుబడి పెట్టిన కారణంగా పరిష్కారాన్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చుగానీ ఆమె స్వేచ్ఛకీ పరిమితులున్నందువల్ల తగువుని వున్నత న్యాయపీఠానికి తీసుకువచ్చింది.  ఆమె నిర్ణయం చెయ్యలేక పోడానికి ఆడబిడ్డ – సుందరరామయ్య అక్క – కూడా కొంతవరకు కారణం కావొచ్చు.

సుందర రామయ్య అక్క పాత్రని రచయిత రాజ్యాంగేతర శక్తికి నమూనాగా తీర్చిదిద్దారు. అది మత ధార్మిక శక్తి కావొచ్చు;  ఆధునిక న్యాయ గ్రంధాల్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చే కాలం చెల్లిన స్మృతులు కావొచ్చు.  చాలా సందర్భాల్లో యీ శక్తులు న్యాయవ్యవస్థని శాసిస్తాయి. అనూచానంగా వస్తున్న సంప్రదాయాల్నీ రీతీ రివాజుల్నీ ధర్మం పేర్న న్యాయంగా చెలామణీ చేయించాలని కంకణం కట్టుకొని ప్రయత్నిస్తాయి. అందుకే –

‘చిన్నప్పుడు తమ పుట్టింట్లో వారాలబ్బాయే యివ్వాళ తను హాజరయిన కోర్టులో జడ్జిగా కనిపించినట్టు ఆ అప్పగారు తమ్ముడి వంక ధీమాగా చూస్తోంది.’

విచారణ ప్రారంభమయ్యేసరికి  – దాదాపు అనగనగా కథలా మొదలైన కథ నాటకంగా రూపొందుతుంది. వాదాలూ ప్రతివాదాలూ సంభాషణలూ ఆంగిక సాత్త్వికాల్తో నిండిన పాత్రల హావభావాల్తో పాఠకుడి కళ్ళముందు వొక కోర్టు దృశ్యం సాక్షాత్కారమౌతుంది. ఇది శిల్పానికి సంబంధించిన అంశం. ఈ కథలో శిల్ప చర్చ అంత ప్రధానం కాదు. వస్తు నిర్వహణ ముందు అది గౌణమైపోయింది. వస్తువుకి శిల్పంతో  స్వచ్ఛందంగా వూడిగం చేయించడం కారా కథల్లో విశిష్టత. ‘ఈ తగువులింక నే తీర్చలేను’ అన్న వుత్కంఠభరితమైన వాచికంతో కథ యెత్తుగడ దగ్గరే  ఆ చాకిరీ మొదలైంది.  మళ్ళీ కథలోకెళ్తే …

నాల్గో పిల్లడు – తానందరికంటే చిన్నవాడు కాబట్టి యెంచుకొనే అవకాశం తనకివ్వాలంటాడు. ఇది బలహీన వర్గాల రిజర్వేషన్ విధానంలా వున్నప్పటికీ నిజానికి యింకా చిన్నది ఆడపిల్ల వుంది – రిజర్వేషన్ అమలు కావాలంటే  – అట్ట ఆ పిల్లకు చెందాలి. అయితే ఆ పిల్లకి తన హక్కులు వినియోగించుకొనే / సాధించుకొనే తెలివీ చొరవా యింకా యేర్పడలేదు.

మూడోవాడి దృక్పథం, ఆచరణా యిందుకు భిన్నం. అట్టల తయారీలో వాడి శ్రమ కూడా కొంత వుంది. ‘అవసరం’ దృష్ట్యా పెద్ద అట్ట తనకివ్వమంటాడు. లేదంటే అన్నివిధాలా శ్రమ చేసి అట్టలు సృష్టించినవాడు రెండవవాడే కాబట్టి వాడికివ్వడమే న్యాయమంటాడు. ప్రజాసంఘాల వాళ్ళు న్యాయానికి వత్తాసు పల్కినట్టు రెండోవాడి తరపున వకాల్తా తీసుకొన్నాడు. అట్టల ఐడియా పెద్దవాడిదే అయినప్పటికీ ‘ఒట్టి ఐడియా’లకు అట్టలు పుట్టవన్న భౌతికోత్పత్తి రహస్యాన్ని  వెల్లడించాడు. వనరులూ పెట్టుబడులూ యెవరికైనా సమభావంతోనే రాజ్యం సమకూర్చాలనే రాజ్యాంగ నైతికతని కూడా గుర్తు చేసాడు. రెండోవాడికి యింతకు ముందే తల్లి యిచ్చిన నైతిక బలం వుంది. ఇప్పుడు తమ్ముడి న్యాయబద్ధమైన తోడ్పాటు లభించింది. నిజానికి వాడికి అన్న పెద్ద ప్రతిద్వంద్వి కూడా కాదు. ఇక తన శ్రమఫలం మీద అధికారాన్ని స్థాపించుకోవాలంటే రెండు అడ్డంకుల్ని అధిగమించాలి. ఒకటి న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న తండ్రి – రెండు తండ్రి  నోటినుంచి తీర్పు వచ్చేలోపే దాన్ని ప్రభావితం చేసే మేనత్త.

తండ్రి మొఖానికి తగిలించుకొన్న  ప్రజాస్వామ్యంతోనే అతనిలో దాగివున్న ఫ్యూడల్ విలువలకి గండికొట్టాలి,  మొత్తం న్యాయప్రక్రియ పైనే ధాష్టీకం చేయగల మేనత్త యేకరువు పెట్టే ధర్మపురాండాలని కట్టడి చేయాలి. లేకపొతే తనకు న్యాయం దక్కదని రెండోవాడు గ్రహించాడు. ఇంటికి పెద్దవాడూ తండ్రి తర్వాత తండ్రంతటి వాడూ లేదా తండ్రికి తల కొరివి పెట్టేవాడూ కాబట్టి తీర్పు పెద్దవాడికి అనుకూలంగా మారకుండా జాగ్రత్తపడ్డాడు.

‘ఇంటికి పెద్దవాడు కదా – ఎప్పటికైనా – మీ తరువాత ….’ అన్న అసంపూర్ణ వాక్యంతో తండ్రి ముందు కాళ్ళకి బంధం వేశాడు. పెద్ద కొడుకు వైపు తీర్పునిస్తే అది పక్షపాతంతో కూడినదన్న అపవాదునెదుర్కొవాల్సి వస్తుంది కాబట్టి సుందర రామయ్యకి తన  ‘ధర్మ నిబద్ధత’ని నిరూపించుకోక తప్పని పరిస్థితి కల్పించిందీ వాక్యం. న్యాయ ప్రక్రియపై రెండోవాడి తొలి పట్టు యిది.

ఇప్పటిదాకా సుందర రామయ్య యెదుర్కొన్నది బాహిరమైన సంఘర్షణే. ఇక యిప్పుడు అంతరంగ మథనం ప్రారంభమైంది. అతని హృదంతరాళాల్లో గూడు కట్టుకొని వున్న ఫ్యూడల్ నీతి వొళ్ళు విరుచుకొంది. రెండోవాడికి అందమైన అట్ట దొరకుండా చేయడానికి దారులు వెతుకుతున్నట్టు ప్రవర్తిస్తాడు.

మేనత్త  ‘లోకాచారాలూ, సబవులూ’ మాట్లాడడంతో  – తల్లి మౌనంగా వుండలేకపోయింది. ‘పెద్దవాడి వంతు వాటా వేయడం – చిన్నవాళ్ళు ఎత్తుకోవడం రివాజు’ అని నోరు విప్పింది. మేనత్తకి కౌంటర్ యిచ్చేటప్పుడు రెండోవాడి గొంతులో ధ్వనించిన వెటకారం, కరకుదనం,  న్యాయమూర్తి పట్ల చూపే వొక విధమైన అవిధేయత సుందరరామయ్యకి విసుగు పుట్టించాయి. వాడి ధిక్కారం నెగ్గకూడదని అతను నిర్ణయించుకొన్నట్టు చూపుల్లో మాటల విరుపుల్లో తెలుస్తూ వుంటుంది. వాడి దేహ భాషా, వచో వైఖరీ, ప్రవృత్తీ అతనికి భయం కల్గించాయేమో కూడా. సంభాషణల్లో వినిపించే కాకువూ పాత్రల స్పందనల్లో రచయిత చెక్కిన సున్నితమైన భాషాశిల్పం ఆయా సందర్భాల్లో వ్యక్తుల మనస్తత్వాన్ని కళ్ళకు కట్టడానికి అమోఘంగా వుపయోగపడ్డాయి.

భార్య చెప్పినట్టు  నాలుగో వాడికిద్దామని సుందర రామయ్య  ప్రతిపాదించాడు. ఆడపిల్లకి – అందరికన్నా చిన్నదైనా – యీ పంపకంలో వాటా గురించి అతను ఆలోచించడు.

‘ఆడపిల్ల కదా అని ఆడపిల్లకిచ్చేయడం ఆడదాని వ్యవహారమనిపించింది సుందరరామయ్యకి.’ అతనిలోని ఫ్యూడల్ మనస్తత్వానికి యిక్కడికొచ్చేసరికి దాపరికాలక్కరలేకపోయాయి.

అప్పటికే నాల్గోవాడు సాదా అట్టకి సర్దుకొన్నాడని రెండోవాడు చెప్పినప్పుడు –

‘చదరంగం ఆడే ఆసామి ‘ఆటకట్టు’ ఎత్తువేశాకా చూసే చూపు వాడి కళ్ళల్లో కనిపించింది’  సుందర రామయ్యకి.

ఇది న్యాయాన్ని తనవైపు  తిప్పుకొనే క్రమంలో రెండోవాడి మలి విజయం. తాననుకొన్న తీర్పు యివ్వలేకపోతున్నందుకు న్యాయమూర్తికి ‘క్రమంగా చిరాకు ప్రారంభమైంది.’

సుందర రామయ్యలో వున్న సమస్త వైరుధ్యాలూ మూకుమ్మడిగా అతని మీద దాడిచేశాయి.

పెట్టుబడి తనదే కాబట్టి – సంపదనంతా జాతీయం చేసయినా తన ఆధిపత్యం నిలుపుకోవచ్చన్న వూహ కూడా అతనికి వస్తుంది. ‘అట్టలెవరివీ కావని దాచేస్తే’ అనుకొంటాడు. ‘లాటరీ వేస్తే?’ అతనిలో యెక్కడో మిగిలివున్న బలహీనమైన ప్రజాస్వామ్యవాది ఆలోచన. క్యాలికో అట్ట కన్నా మంచి అట్ట తను స్వయంగా చేసి పెద్దవాడికిస్తే  – అని వుద్వేగంతో నిండిన అతని గుండె చప్పుడు చేస్తుంది. ఒక అట్ట వేరుగా చేసినందుకు కోపం వస్తుంది. రెండోవాడు ‘అన్నీ ఒకలాటివే చేసుకుందామ’ని చెప్పినా పెద్దవాడే ప్రత్యేకమైన అట్ట ప్రతిపాదన తెచ్చాడని విన్నాకా అతనికి సమస్య మరింత జటిలమైంది. మొదట్నుంచీ  రెండోవాడే న్యాయమార్గం లో వున్నాడని తేలడంతో దిక్కు తోచలేదు. అలా అని తీర్పు వాడి వైపు చెప్పడానికి కూడా మనసొప్పలేదు. ‘ఎటుపోయినా ఓటమి ఎదురవడం చిరాకుని పెంచుతుంది’. అతని మౌనంతో కోర్టు హాల్లో ‘ఆర్డర్’ దెబ్బతింది.

ఆ బలహీన క్షణాల్ని ఆసరా చేసుకొని గ్రంథాలయాలమీదా ఆర్ట్ మ్యూజియంల మీదా దాడిచేసే మనువాద సాంస్కృతిక సైన్యంలా మేనత్త రెచ్చిపోయింది. ‘చిన్నంతరం – పెద్దంతరం’ గురించి మాట్లాడింది. ఇవ్వాళ అన్నని కాదన్నవాడు రేపు తండ్రిని కాదంటాడని రెచ్చగొట్టింది. పొరుక్కి ఉపకారమంటే పొయ్యార్పుకునే రకమని శీలహననం చేసింది. పరోపకార గుణం గురించి నీతి సూత్రాలు యేకరువు పెట్టింది. న్యాయం కోరేవాణ్ణి నేరస్తుడిగా తీర్మానించింది. వాడు జన్మలో బాగుపడడనీ పుట్టగతులుండవనీ భయపెట్టింది. పాపం చేస్తే పాపం; పుణ్యం చేస్తే పుణ్యం తప్ప యింకేదీ వెంటరాదని సిద్ధాంతీకరించింది.

ఇప్పుడు రెండోవాడు సమస్త కార్మిక వర్గానికీ ప్రాతినిధ్యం వహిస్తూ తీర్పు యివ్వబోతున్నాడు. మేనత్త వూదరగొడుతోన్న అశాస్త్రీయ భావజాలాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాల్సిన సందర్భం వచ్చింది.

‘ – ఒక్క అట్టలు తప్ప’ అని ఆమె మాటలకి ముక్తాయింపు పలికాడు.  యుగాలుగా సంకెళ్ళుగా మారిన విశ్వాసాలను తెంచుకొన్న సవ్వడి ఆ మాటల్లో వొక విలక్షణతతో వినిపిస్తుంది.

తమ హక్కుల్ని స్థిరీకరించుకోవాలన్నా సాధించుకోవాలన్నా తరాలుగా పాతుకుపోయిన అభౌతిక భావజాలాన్ని కూకటివేళ్ళతో పెళ్ళగించాలి – అప్పుడు మాత్రమే కార్మికవర్గ నియంతృత్వాన్ని స్థాపించుకోగల అంతిమ తీర్పుని యివ్వగలం – అన్న చైతన్యం, వుద్బోధ రెండోవాడు పల్కిన మాటల్లో అక్కడందరితోబాటు పాఠకుల చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి.

న్యాయ పోరాటంలో విజయం సాధించాలంటే పితృస్వామ్యం చుట్టూ పాత బూజుపట్టిన  సంప్రదాయాల చుట్టూ అల్లుకొన్న సమస్త సాంఘిక – సాంస్కృతిక కట్టుబాట్లని తెంచుకోక తప్పదు.  రాజ్యం, దాని పరిరక్షకులూ సరైన న్యాయం చేయలేరని నిర్ధారణ అయ్యాకా లేదా తీర్పు యేకపక్షంగా అధర్మబద్ధంగా వెలువడవచ్చని అనుమానించాకా బాధితులు తమకేం కావాలో తామే నిర్ణయించుకొని దాన్ని అమలు చేసే అధికారాన్ని సొంతం చేసుకోక తప్పదు.

తన శ్రమ ఫలంపై అధికారాన్ని  స్వయంగానే ప్రకటించడానికి సిద్ధమయ్యాడు రెండోవాడు. తానే తీర్పరి అయ్యాడు.

మొత్తం అయిదు అట్టల్లో రెండు సాదా అట్టలు – వొక్కో దానికీ  పావలా లెక్కన ధర కట్టి – పెట్టుబడి పెట్టినందుకు యిచ్చేశాడు. మిగతా మూడు అట్టలూ పెట్టుబడి పోగా – అదనపు విలువ ( కార్మికుడి శ్రమే యీ విలువకి మూలం – అది  లాభం పేరుతో పెట్టుబడిదారుల పెట్టెల్లోకి చేరుతోంది). దాని న్యాయబద్ధమైన పంపిణీని కూడా తానే నిర్ణయించాడు. ఐడియా యిచ్చినందుకు (బౌద్ధిక శ్రమకి) పెద్దవాడికి పావలా అట్ట వాటా , పనిలో సాయం చేసినందుకు మూడోవాడికి మరో పావలా అట్ట వాటా ప్రతిఫలంగా ( అది ఎక్కువేనని చెబుతూనే) యిచ్చేశాడు. క్యాలికో అట్ట తనకిష్టమైంది కాబట్టి తానుంచుకొన్నాడు. ఇది  తిరుగులేని అంతిమ తీర్పు.

కార్మిక వర్గ నియంతృత్వంలో వుండే  సమత్వ భావననీ, ప్రజాస్వామిక లక్షణాన్నీ , వుత్పత్తి సంబంధాల్లో పరిఢవిల్లే మానవీయతనీ , సమ న్యాయాన్నీ, శ్రమఫలం పై దాని సామాజిక పంపకంపై శ్రామికులకు లభించే సాధికారికతనీ రెండోవాడి తిరుగుబాటు ద్వారా ప్రతిపాదిస్తూనే రచయిత కథ ముగింపుని తెరచి వుంచారు.

రెండోవాడి ‘అఘాయిత్యాన్ని’ సుందరరామయ్య యెలా స్వీకరించాడన్నది ప్రశ్న. తరతరాల సంప్రదాయాలు , విలువలు వాటిద్వారా సంక్రమించిన అధికారాలు, సౌకర్యాలు , పెద్దరికం తల్లకిందులయ్యాకా ‘ఎర్రగా చాలా ఎర్రగా జేవురించిన  ముఖం’ యెటువంటి ప్రతిక్రియకి పూనుకొంటుందో కాలం నిర్ణయిస్తుంది. ఈ తీర్పునిచ్చిన రెండోవాడే శ్రీకాకుళం కొండల్లో పుట్టిన నిప్పందుకొని సత్యంవైపు నిలబడి వుంటాడు. వాడి గురించిన సుందర రామయ్య భయాలు ఆ విధంగా నిజమయ్యాయి. ఈ కథ పుట్టిన మరో పుష్కరానికి  42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫ్యాక్టరీల నిర్వహణలో కార్మికులకి భాగస్వామ్యం కల్పించే చట్టం రూపొందింది. దానిద్వారా నిర్వహణలో కార్మికుడు అభిప్రాయ వ్యక్తీకరణకి పరిమితమై అధికారానికి యెప్పటికీ దూరంగానే వుండిపోయాడు.

కథ 2011 ఆవిష్కరణ సభ. డిసెంబర్ 2, 2012న. విజయనగరంలో. వరసగా ఎడమ నుంచి... చెలం , సంపాదకుడు నవీన్ , సభకి అధ్యక్షుడు అప్పల్నాయుడు , పుస్తకం ఆవిష్కర్త శ్రీపతి.  కారా మాష్టారి పక్కన ఎ . కె. ప్రభాకర్

కథ 2011 ఆవిష్కరణ సభ. డిసెంబర్ 2, 2012న. విజయనగరంలో. వరసగా ఎడమ నుంచి… చెలం , సంపాదకుడు నవీన్ , సభకి అధ్యక్షుడు అప్పల్నాయుడు , పుస్తకం ఆవిష్కర్త శ్రీపతి. కారా మాష్టారి పక్కన ఎ . కె. ప్రభాకర్

50 యేళ్ళ తర్వాత యివ్వాళ సుందర రామయ్యలు ప్రజాస్వామ్యపు ముసుగుల్ని సైతం వదిలేశారు. ఫ్యూడల్ విలువలకే సాంస్కృతిక జాతీయవాదం టాగ్ తగిలించి చెలామణి చేస్తున్నారు.  చట్టాలకీ న్యాయాలకీ అతీతంగా యెటువంటి విచారణలకీ తావులేకుండా దేశ విదేశ ధనికస్వాములకు దాస్యం చేస్తూ ప్రకృతి వనరులతో సహా సమస్త సంపదని స్వయంగా స్వాహా చేస్తూ ఆశ్రితులకి అడ్డగోలుగా పందేరం చేస్తూ నిర్లజ్జగా స్వైరవిహారం చేస్తున్నారు. కాదంటే – దుడ్డుకర్రనుపయోగించి రెండోవాడి మూడోవాడి నోళ్ళు మూయిస్తున్నారు. నిజానికి కార్పోరేట్ కల్చర్ లో యివాళ తాను చేస్తున్న  వుత్పత్తి తుది రూపం కూడా రెండోవాడికి తెలీదు. శ్రమ పరాయీకరణ పరాకాష్టకి చేరుకొన్న దశలో శ్రమఫలం పై అధికారం గురించి ఆలోచించే స్థితిలో లేడు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకొన్న హక్కులకి వాడు దూరమయ్యాడు. తల్లి పాపం అమాయిక – ఆమె యెప్పుడూ మౌన ప్రేక్షక స్థానంలోనే వుంది. మేనత్తలు సుందర రామయ్యల తెలివికీ తెంపరితనానికీ మురిసిపోతున్నారు. అందువల్ల ‘తీర్పు’ కథ 64 లో అందించిన  చైతన్యాన్ని యివ్వాళ కొత్త తరం అందిపుచ్చుకోవాల్సిన అవసరం మరింత యెక్కువగా వుంది.

1948 – 55 మధ్య చేసిన రచనల తర్వాత , దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత 64 లో వెలువడ్డ  తీర్పు దాదాపు అదే కాలంలో రాసిన యజ్ఞానికి కృత్యాద్యవస్థలానో డ్రెస్ రిహార్సల్ లానో డ్రై రన్ లానో వుంటుంది. శ్రీరాములు నాయుడికి సుందరరామయ్య చిన్న మోడల్ లా వుంటాడు. శిల్ప పరంగా తీర్పులో నాటకీయతే యజ్ఞంలో  విశ్వరూపం ధరించి పెద్ద రంగస్థలం మీదికెక్కింది. సుందర రామయ్య యింట్లో వెలసిన కోర్టు హాలే యజ్ఞంలో న్యాయమంటపమైంది. రెండుచోట్లా అది కూలుతున్న దృశ్యమే. అయితే తీర్పు సింగిల్ పాయింట్ కథ. యజ్ఞం బహుముఖీన కథ.

తీర్పు న్యాయబద్ధం కానప్పుడు కుహనా అభివృద్ధిపై ఫ్యూడల్ ఆధిపత్యంపై  నిరసనగా బానిస బతుకు మీద తిరుగుబాటుగా సీతారాముడు కన్న కొడుకుని చంపుకొన్నాడు. సీతారాముణ్ణి అటువంటి వున్మాద స్థాయికి నడిపించిన పరిస్థితుల్ని యజ్ఞం కథలో విస్తృతంగానే వర్ణించినప్పటికీ – దాని బీజాలు తీర్పు కథలోనే వున్నాయి. సమస్య పరిష్కారానికి ‘అట్టలన్నీ చించేస్తే పీడా పోతుంద’ని భార్య అనొచ్చన్న వూహ వొకానొక దశలో సుందర రామయ్యకి కల్గుతుంది. ఆ వూహే సీతారాముడిలో ధ్వంస రచనాత్మకమైన నిరసన రూపం ధరించిందేమో!

సీతారాముడికి తనకేం కావాలో తెల్సు; కానీ సాధించుకొనే దారి లేదు. తన కొడుకు కంబారిగా వుండకూడదంటే తాను తీర్పరి స్థానంలోకి రావాలని సీతారాముడికి తెలుసో లేదో గానీ తీర్పులో సుందర రామయ్య రెండో కొడుక్కి మాత్రం స్పష్టంగా తెలుసు. వాడికి మొదట్నుంచీ తనకేం కావాలో తెల్సు. దాన్ని సాధించుకోడానికి వున్న ఆటంకాలేవో తెల్సు. వాటినెలా అధిగమించాలో వాద ప్రతివాదాల క్రమంలో నేర్చుకొన్నాడు. న్యాయాన్నో చట్టాన్నో తన చేతుల్లోకి తీసుకొంటేగానీ సరైన తీర్పు లభించదనే యెరుక పొందాడు. ఉత్పత్తిలో న్యాయబద్ధమైన భాగస్వామ్యం కోరుకోవడం దగ్గర మొదలైన అతని పోరాటం సమ న్యాయం కోసం మొత్తం వ్యవస్థ పైనే తిరుగుబాటుగా పరిణమించింది. కార్మికవర్గ నియంతృత్వ స్థాపన దిశగా ప్రయాణించింది. అప్పుడు  వుత్పత్తి ఫలాలమీదే కాదు – పెట్టుబడులు, వనరులు, వుత్పత్తి సాధనాలమీద కూడా శ్రామికుడికే సర్వాధికారాలూ దక్కుతాయి. ఇదంతా వొక గతి తార్కిక క్రమం.  విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ. ఆ సంఘర్షణ క్రమాన్ని, శుద్ధ సిద్ధాంతాన్నీ కథగా మలచిన కారా మాష్టారి నేర్పు అద్వితీయం. పైకి సరళంగా కనిపించే యీ తీర్పూ నేర్పూ రెండూ నిజానికి యెంతో సంక్లిష్టమైనవి. తన తీర్పుని అమలు పరచడానికి కథ చివర్లో రెండోవాడు పడిన యాతన వంటి యాతనే కేవల సిద్ధాంతాన్ని కళాత్మకంగా జీవితానికి అన్వయించడంలో  రచయిత కూడా అనుభవించి వుండొచ్చు. అయితే కథ పూర్తయ్యేసరికి సంక్లిష్టత విడిపోయి పాఠకుడికి చేరువై రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరింది. ప్రయోజనోద్దిష్టమైన సాహిత్యానికి వొక పాఠంలా కథ రూపొందింది.

కారా 64 తర్వాత రాసిన కథల్లో ప్రతిపాదించిన సామాజిక – ఆర్ధిక – రాజకీయ దృక్పథానికి సైద్ధాంతిక భూమికనేర్పరచిన కథ ‘తీర్పు’. మాష్టారి సృజనాత్మక రచనా మార్గంలో పెద్ద మలుపు. తర్వాతి తరానికి ఆయన అందించిన ముందుచూపు.

 [తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన ఎ.కె. ప్రభాకర్ ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు , నిషేధ గీతాలు , జాంబ పురాణం , రెండు దశాబ్దాలు కథ , బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది , నోబెల్ కవిత్వం , తొవ్వ ముచ్చట్లు  జూలూరి గౌరి శంకర్ గారి యుద్దవచనం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పుస్తకం ఇటీవలే వచ్చింది. అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జనవిముక్తికి దారి తీయాలని ప్రభాకర్ కోరుకుంటున్నారు.  ]

 

 వచ్చే వారం: అప్రజ్ఞాతం కధ గురించి ముళ్ళపూడి సుబ్బారావు 

 

తీర్పు  కథ:

 

మీ మాటలు

 1. appalnaidu says:

  ప్రభాకర గారూ చాలా గొప్పగా విశ్లేసించారు.నేను ,కారా తో కబుర్లులో ఇదే కథలోని అట్టల శబ్దానీ,బరువునీ చెప్తూ ఆరంభించాను,ఇందుకే…యగ్యం లో సీతారాముడు తీర్పు నాటికే మాస్టారిలో జనించాడు,ఈ విషయాన్నే మాస్టారిమీద వచ్చిన సావనీర్ లో రాసాను.మీరూ ఈ విశ్లేషణ చేయడం నా ఆలోచనకు బలం ఇచినట్టు అన్పించి ఆనందంగా ఉంది..హాట్స్ ఆఫ్ ప్రభాకర్జీ…..

  r

  • ఎ.కె.ప్రభాకర్ says:

   అప్పల్నాయుడు గారూ,
   నేనా పాయింట్ మాష్టారి మీద అభియోగంలా వుంటుందేమోఅని భయపడుతూనే రాశాను. కానీ వొక విమర్శకుడిగా రాయకుండా వుండలేకపోయాను.మీరు ముందే గ్రహించి కాగితం మీద పెట్టారు కాబట్టి కథ చివర్లో ప్రస్తావించినట్టు ‘ఆ పాపమేదో మీరే మూటకట్టుకొన్నారు’.
   కథా విశ్లేషణ మీకు నచ్చినందుకు థాంక్స్.
   అభిమానంతో,
   ప్రభాకర్.

 2. రాఘవ says:

  అద్భుతమైన విశ్లేషణ చేశారు ప్రభాకర్ గారూ! తన విద్యార్ధులు పీడన లేని సమాజాన్ని కోరుకునే వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలనుకునే ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గది లో ఈ కధ ను చెప్పాలి. ఈ విశ్లేషణ జరపాలి..నిజంగా చాలా చాలా కదిలించారు మీరు!

 3. amarendra dasari says:

  మీ వ్యాసం చదివాక అనిపించింది : తెలుగు టీచర్ అయిఉంటే యెంత బావున్దేదీ అని !!

 4. N Venugopal says:

  వ్యాసం చిక్కగా లోతుగా చాల బాగుంది ప్రభాకర్….కొన్ని మిరుమిట్లు గొలిపే విశ్లేషణలున్నాయి. కృతజ్ఞతలు. రాయగలిగీ రాయవలసినవి ఉండీ రాయకుండా ఉండిపోతున్న, లేదా తక్కువ రాస్తున్న మీరు ఇలా ఇంకా చాల రాయాలి…

 5. విశ్లేషణ చాలా బాగుంది అనటం కూడా ఈ విశ్లేషనను చిన్న పుచ్చి నట్ల ఔతుంది!
  అగ్గి పుల్ల సగ్గుబిల్ల కాదేది కవితా అనహర్‌ హం అన్నట్లు మాస్టారు గారు ఒక సాదారణ పిల్లల కధలో మార్క్సిజాన్ని ఇమిడ్చి చెప్పటం మహాద్బుతం! దాని మీద మీరు వేసిన టార్చి.. కాదు కాదు లేజర్‌ కిరణాలు మరి అద్బుతం! ప్రభాకార్‌ గారు.

 6. ఆ అట్టని అందరూ పంచుకోవటం కదా అసలు సిసలు కమ్యూనిజం. ‘అది నాదే’ అని చెప్పుకోటానికి అందరూ ఎవరి శక్తికొద్దీ వారు వాదాలు చేసుకుపోయారు. ఆఖరికి అందర్లోకీ నోరున్నోడు దాన్ని ఎగరేసుకుపోయాడు. దీనికి మార్క్సిజం అనీ మరోటనీ పేరెందుకు? ఇది ఫక్తు అరాచకవాదం. ఈ కథ అంత గోప్పదేం కాదు. దీనికి ఈ స్థాయి విశ్లేషణ అవసరమూ లేదు.

  • //ఇది ఫక్తు అరాచకవాదం//
   మీ సందేహాం న్యాయ మైనదే. మీకు అరాచక వాధంగా కనిపిస్తున్నది కార్మిక వర్గ నియతృత్వం, మీరు చెప్పే కమ్యునిజం తరవాత దశది. ఆకమ్యునిజానికి పునాదులు పడ్డాయన్నమాట.

 7. తిరుపాలు గారూ ! చక్కగా చెప్పారు.అందరూ పంచుకునే కమ్యూనిజం ఏ నోరూ లేవకుండానే ఎలా వచ్చేస్తుంది …?

మీ మాటలు

*