పోస్టు చెయ్యలేని ప్రేమలేఖ!

నీ కోసం కాదు గానీ నీ గురించే రాస్తున్నాను

నువ్వు కథనుకునైనా చదువుతావో లేదో తెలీదు . ఇది కథ కాదు మన జీవితమని నేను చెప్పినా , ఇందులో నీ పాత్రని నువ్వు పోల్చుకోగలవా .. మనసు గర్భ గుడి లో ప్రతిష్ఠించుకుని  కొన్ని వసంతాలుగా నేను పూజిస్తున్న నీ రూపాన్ని నువ్వు గుర్తుపట్ట గలవా .. ఒకవేళ గుర్తుపట్టినా వరాలిచ్చే శక్తి నీకు ఉండి ఉండదు ఇప్పుడు .

మరి ఎందుకిదంతా రాయడమని నన్ను నేను ప్రశ్నించుకుంటే నా హృదయాంతరాల్లోంచి వచ్చిన జవాబు ఒక్కటే . ఒకప్పుడు నీ కరుణా కటాక్ష వీక్షణాల్ని వరమడిగి ఓడిపోయిన నేను ఒట్టి పుష్పమై వడిలి పోలేదనీ , వట వృక్షమంత ప్రేమని నాలో నేను నాటుకున్నాననీ  ప్రపంచానికి తెలియజెప్పి మోడువారిన హృదయాల్లో ప్రేమ పైన నమ్మకాన్ని చిరుగింప చేయాలనే ఈ ప్రయత్నం .
మెటీరియలిస్ట్ లకి ఇదంతా పిచ్చిలా అనిపిస్తుందేమో మరి. నా ఈ భావాలకి సరిపోయే పదం పిచ్చి అయితే ప్రేమ పేరుని పిచ్చిగా మార్చేస్తే సరి .
ఈ ఇరవై ఏళ్ళూ  ఇరవై నాలుగ్గంటలూ  నీ గురించిన  ఆలోచనల సుడిగుండం లో పడి  సుళ్ళు తిరుగుతూ కదలనైనా కదలకుండా  తీరం కోసం వెతుకుతున్నానని చెప్పను .  ఎందుకంటే  ఈ క్షణంలో తినకపోతే చచ్చి పోతావని  బెదిరించి భయపెట్టే ఆకలి కూడా పట్టించుకునే వాళ్ళు లేకపోతే  కాస్సేపు నోరు మూసుకున్నట్టు, నీరసించి నిన్ను మరిచిన క్షణాలు కొన్నున్నాయ్.  ఆ తేలికపాటి  ఒంటరితనం కంటే నీ తలపులతో బరువెక్కే ఏకాంతమే బాగుంటుంది నాకు.
అవునూ …కథ లో ఇంత కవిత్వాన్ని గుమ్మరిస్తున్నానని  చిరాకు పడకు .  ఇన్నేళ్ళ నా మనస్సంఘర్షణ మామూలు మాటల్లో చెప్పడమెలాగో  నాకు తెలీడం లేదు  . సరేలే …. కనురెప్పల గడప దాటి కలల ప్రపంచం లోంచి కాంతి లోకం లోకి వచ్చి పడిన కంటిపాప లా ఈ పిచ్చి ఊహల మాటల్లోంచి  అసలు కథ లోకి వస్తాను .
నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా మీ ఇంటి అరుగు మీద కూర్చుని రెండు జడలు చేతుల్తో పట్టుకుని చెరో పక్కకీ లాగుతూ ఆ చిట్టి ముఖాన్ని ఉయ్యాలలూపుతున్నావు.  ఆ మాయలో పడిన నా మనసు మాత్రం ఇప్పటికీ ఊగుతూనే ఉంది  ఆగకుండా…. భూమి చుట్టూ తిరిగే చందమామ లా నిన్ను చూడాలని ఎన్ని సార్లు మీ వీధి లో చక్కర్లు కొట్టానో సైకిల్ మీద .
చిత్రరచన: శివాజీ

చిత్రరచన: శివాజీ

బ్రహ్మ ముహూర్త సమయం అని ఇంట్లో సాకులు చెప్పి  పూర్తిగా తెల్లవారకుండానే టైప్ ఇన్స్టిట్యుట్ కి బయలుదేరేవాడిని నువ్వొస్తావని తెలిసి . ఎనిమిది నిమిషాల్లోనే పద్నాలుగు కోట్ల కిలోమీటర్లు వడివడిగా ప్రయాణించి  పుడమి చెక్కిళ్ళ ని ముద్దాడాలని తపన పడే  ఉషా కిరణాల కన్నా నా తలపులకే  ఎక్కువ తొందరగా  ఉండేది.
టైప్ మాస్టార్ని బ్రతిమాలి నీ పక్కనే ఉన్న మిషన్ నాకివ్వడానికి ఒప్పించి నీ పక్కన కూర్చున్న క్షణం నాకింకేమీ అక్కర్లేదనిపించింది. మాటి మాటికీ నిన్ను చేరిపోతున్న నా చూపుల్ని మిషన్ మీటల మీదికి మళ్ళించడానికి ఎంత కష్ట పడేవాడినో !.  ఎలాగోలా కళ్ళకి నచ్చ చెప్పినా మనసెక్కడ మాట వింటుంది ! చేతి వేళ్ళకి అదేశాలివ్వకుండా అలిగి కూర్చునేది . తప్పనిసరై దాని పని దాన్ని చేసుకోమని వదిలేసేవాడిని .
అప్పటికే ఎందరో స్త్రీ మూర్తుల సౌందర్యాన్ని మరెందరో మహానుభావుల భావుకత్వపు అక్షరాల కళ్ళద్దాల్లోంచి  చూసి అచ్చెరువొందాను.  కానీ ఇంతటి నిర్మలమైన అందాన్ని ఇలా కళ్ళెదురు గా చూడటం ఎంతటి సరి కొత్త అనుభవమో నాకు
ఎన్నేళ్లుంటాయి నీకప్పుడు , పట్టుమని పదహారైనా ఉంటాయా ? ఎంతటి ముగ్ధత్వం!!!
పోత పోసినట్టు పసితనం, ఆ పసితనపు పరదాలతో దోబూచులాడుతున్న చిలిపి పరువం …. సాయం సంధ్య సమయాన సూర్య చంద్రులు ఒకేసారి కనిపించి నీలాకాశానికి అంతులేని ఆకర్షణ అందించినట్టు !!!!
అత్తపత్తి ఆకుని సైతం మించిపోయి, ముట్టుకోకుండానే ముడుచుకుపోయే నీ సౌకుమార్యపు సోయగం వర్ణించడం ఎవరి తరం !! అతి చిన్న శబ్దానికి కూడా అదిరి బెదిరి పరుగులు తీసే చిన్ని చిన్ని లేడి పిల్లల్లా చంచలంగా ఉండే నల్లని నీ కనుపాపలు నన్నసలు  తల తిప్పుకోనిచ్చేవా!
పరికిణీ వోణీ లో నిన్ను చూసినప్పుడు నాలో చెలరేగే భావ సంఘర్షణ అతి పురాతన ప్రకృతి రహస్యం !! తొలి ప్రేమ లోని గాఢత , తొలి వలపు అందించే తన్మయత్వం తొలి తొలి సారిగా తొలకరి చినుకు లా నన్ను తాకిన వేళ, పులకరించిన మనసులో విరబూసిన  ఆనందపు కుసుమాలెన్నో !! వాటి తో పాటు పుట్టి , విరహమై వేదనై తియ్యని గాయాలు సృష్టించిన ఎదురు చూపుల ముళ్ళెన్నో!!
నా ఆరాధనాపుష్పాలు  నీ నయనచరణాల ని తాకేసరికి ఒక ఋతువు కాల గర్భంలో కలిసిపోలేదూ ?  ఎందుకు చదవలేక పోయావు నీ కోసం తెరిచి పెట్టి పట్టుకున్న నా మనసు పుస్తకాన్ని ? చిన్నతనం  వల్లనా ? అవును  అందుకేనేమో, నిండుగా పరవళ్ళు తొక్కే  నా ప్రేమ ప్రవాహాన్ని , వయసు ప్రభావాన పరుగులు పెట్టే వర్షాకాలపు పిల్ల కాలువ పొంగులా భావించి పక్కకి నెట్టావు
ఎంత గా నీ చెంతకి చేరాలని నేను తపన పడితే అంతగా నాకు అందకుండా దూరంగా తప్పుకుపోయావు . కళ్ళతో పలకరించినా , పెదవులతో పలుకులు చిందినా భయంతో  చిగురుటాకులా వణికిపోయావు. నీకు రక్షణగా , జీవితాంతం తోడుగా నీడగా నిలవాలని తపన పడుతున్న నాకు నీ భయం ఎంతటి తీవ్రమైన వేదనని కలిగించేదో తెలుసా , ఎలా నీకు చెప్పాలి…  నేను కాటేసే కాలనాగుని కాదని, కలకాలం నిన్ను కనురెప్పలా కాచుకునే అవకాశం కోసం అనుక్షణం నిరీక్షిస్తున్నానని !!
అందుకే పెళ్లి చేసుకుంటానని స్నేహితుడితో రాయబారం పంపాను. సనాతన సాంప్రదాయపు కోటలో యువరాణి లా పెరిగిన నీకు అలా చెబితేనే అర్ధమవుతుందనే నా అంచనాని తప్పుదోవ పట్టిస్తూ నీకెప్పుడో పెళ్లి కుదిరిపోయిందని నువ్వు పంపిన సమాధానంలో నీ  అపరిపక్వమైన గడుసుదనం నాకు భలే నవ్వు తెప్పించింది .
ముందుకు వచ్చే కొద్దీ  వేగంగా వెనక్కి పరిగెడుతున్న నిన్ను మరింత కష్ట పెట్టడం ఇష్టం లేక, నువ్వు నువ్వు గా నన్నిష్టపడే రోజు కోసం సహనం గా ఎదురు చూస్తున్న నన్ను విధి తన బలీయమైన హస్తాలతో ఒక్క చరుపు చరిచింది .
మీ నాన్నగారికి ట్రాన్స్ ఫరై నువ్వు మరో ఊరు వెళ్ళిపోతున్నావన్న విషయం తెలిసిన రోజు నాకు దుఃఖం అంటే ఏమిటో తొలిసారి అనుభవం లోకి వచ్చింది . గుండెల్ని మెలిపెడుతూ , గొంతు లో సెగలు పుట్టిస్తూ , కంటిపాపల్ని కన్నీటి లో ముంచేస్తూ , కాళ్ళలో సన్నని వణుకు పుట్టిస్తూ … అసలేమిటి ఈ లక్షణాలు  … విఫల ప్రేమ కి ముందస్తు సూచనలా … నా జీవితంలో అంతమైపోతున్న ప్రమోదాన్ని హెచ్చరించే  ప్రమాద ఘంటికలా … నువ్వు కనిపించని లోకాన్ని అసలు ఎలా ఊహించుకోను
తెగించి అడిగే తెగువ లేక  నిస్సహాయం గా  కొమ్మల మధ్య చిక్కుకుపోయిన గాలి పటమై, చిరుగాలిలా వెళ్ళిపోతున్న నిన్ను చూస్తుండి పోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయాను .
నువ్వు నాతో ఉన్న రోజుల్ని తలుచున్నంత అందంగా నువ్వు లేని రోజుల్ని వర్ణించలేను . అప్పటి ఆవేదన … అప్పటిదేమిటిలే ఇప్పటికీ ఉన్నదే….
పైపై ఉధృతి తగ్గి లోపల్లోపలికి విస్తరించుకు పోయింది అంతే . ఆ వేదనంతా  పదాల్లో పలికించాలనుకుంటే   కొండంత సముద్రాన్ని కుండలో నింపి చూపించినట్టే
 నీతో పాటుగా నన్నొదిలిపోయిన  సంతోషాన్ని తిరిగి సంపాదించుకోవాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు . నువ్వేం చెప్పావో మరి నీ స్నేహితురాళ్ళకి …. నన్ను చూస్తేనే కొండచిలువ ని చూసిన కుందేళ్ళ లా బెదిరి పారిపోయేవారు. ఇక నీ ఎడ్రెస్సేం అడగాలి!! వేరే దారి లేక నువ్వెళ్ళిన  ఊరికి  నీ కొత్త కాలేజీ అడ్రెస్ కి  నేను వ్రాసిన ఉత్తరం గుర్తుండే ఉంటుంది నీకు . ఎందుకంటే నేను వ్రాసింది పెన్ను తో కాదు నా హృదయం తో … .  తప్పక అది నిన్ను అంతో ఇంతో కదిలించే ఉంటుంది. నేను అల్లర చిల్లర అబ్బాయిని కాదని నీకు తెలియజెప్పే ఉంటుంది .
నువ్వు పక్కనుంటే, నిలబడటానికి నాలుగడుగుల స్థలం చాలని రవీంద్రుడి కవిత్వం కాగితం మీద పరిచాను . నీ మీద కూడా ఓ కవిత రాసాను కదూ!  నీకు నచ్చిందో లేదో మరి…..  లేకపోతే నవ్వుకున్నావో…..   నీలం రంగు వోణీ లో నిన్ను చూసినప్పుడు నా మనసు మనసులోఉండదన్న నిజం కూడా చెప్పేసాను . చాలా కోప్పడి పోయి ఉంటావు . నీ అందం కంటే అమాయకత్వమే నాకెక్కువ నచ్చిందనీ అనేసాను . నువ్వు నవ్వినా చందమామ నవ్వినా ఒకటే  అన్నాను … వెన్నెలకేసి ఎంత సేపు చూసినా విసుగు రాదనీ , మరి పగలే కాసే వెన్నెల మరింత బాగుంటుందనీ చెప్పి మళ్ళీ కోపం తెప్పించానో , ఎంతో కొంత ఆనందపరిచానో తెలీదు  . ఎన్ని పేజీలు  రాసినా ఇంకా ఏదో చెప్పలేదనే అనిపించింది నాకప్పుడు . నీ అంతట నువ్వు సమాధానం ఇవ్వడానికి మొహమాట పడతావేమో అని రిటర్న్ కవర్ కూడా జత చేసాను .
నా బంగారు కలలన్నీ భద్రం గా మూట గట్టి దానికి పదాల రెక్కలు తొడిగి నీ పాదాల చెంత వాలమని పంపించాను . నువ్వేం చేసావు ….  అవే పదాల్ని అక్షరాలు గా సంధించి నీ తిరస్కార బాణాల్ని ఎంత సూటిగా నా గుండెల్లో దింపావో ….. నేను నిన్ను తప్పు పట్టను.
మనకి నచ్చిన వాళ్లకి మనమూ నచ్చాలని నియమం ఏమీ లేదు గా . కానీ ఏమన్నావు ? నా వల్ల నువ్వు భయం తో చచ్చి పోతున్నానన్నావు . ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీ పరువు పోతుందన్నావు .
 నన్ను కాదన్నావన్న వేదన కంటే నిన్ను ఇబ్బంది పెట్టానన్న బాధే మొదట్లో ఎక్కువ గా ఉండేది . తర్వాత్తర్వాత నువ్వు నాకెప్పటికీ దక్కవన్న నిజం నెమ్మదిగా తెలిసొచ్చింది . నాకిక నేను కూడా మిగలలేదని అర్ధమయింది . జీవితం అంధకార బంధురమైపోయింది  .
అప్పుడప్పుడు చందమామ  చిందించే వెన్నెల దరహాసం  , చిన్న గాలిపాటు తో పలకరించే పువ్వుల పరిమళం , ఎప్పుడైనా  కోయిల తీసే తియ్యని కూనిరాగం…  నా పక్కన నువ్వున్న అనుభూతినిస్తాయి . వాటితో పాటు ఎన్నెన్నో జ్ఞాపకాలు నాతో పాటే , నాలోనే నిక్షిప్తమై ఎప్పటికీ ఉంటాయనుకో .
నీ ఆలోచనల్లో నిలువెల్లా మునిగి ఉన్ననన్ను నాకు చూపించలేక ఈ ప్రపంచమనే అద్దం తెగ తికమక పడిపోతుంది . పాపం దానికేం తెలుసు తన తప్పు ఏమీ లేదని … ఈ కథలాంటి, memoir లాంటి  ఉత్తరం రాయడానికి అదొక్కటే కారణం కాదు సుమా …. నా గుండెకి పడిన చిల్లు లోంచి లోపలికి చేరే  వేదనని కొంత ఇలా తోడి పోస్తేనే కదా .. మళ్ళీ మరి కొన్ని జ్ఞాపకాలు లోపలికి చేరేది!  అందుకే ఈ చిన్న ప్రయత్నం ఇలా…….
                     -నువ్విది చూడాలనో చూడకూడదనో … నాలోపల నాకేమనిపిస్తోందో నాకే తెలియని నేను
-సాయికిరణ్

మీ మాటలు

 1. డియర్ సాయికిరణ్ గారు,

  మీరు రాసిన ఈ ఉత్తరం చాల అద్బుతం గా వుంది. కొద్ది సేపు మెదడు పనిచేయలేదు .చాల గొప్పగా వుంది ,మీ వర్ణన లేదా మీ మనసు బాధ ….గొప్ప అనుభూతి కలిగింది .ప్రేమ ఎంత మధురం …అనే సాంగ్ న మైండ్ లో కి వోచి వెళ్ళింది…లైఫ్ విల్ నాట్ స్టాప్ కాదా…………. అబినందనలతో …వెంకటేష్

 2. నిశీధి says:

  బాగుంది సాయిగారు మీరు అన్నట్టు నిజంగా Memoir నిజంగానే .

 3. తిలక్ బొమ్మరాజు says:

  సాయికిరణ్ గారు మీరు రాసిన ఈ భావాలు చాలా చాలా బాగున్నాయి,నిన్ను మర్చిపోలేను అని చెప్పలేక ,ఎన్నెన్నో జ్ఞాపకాలు నాతో పాటే , నాలోనే నిక్షిప్తమై ఎప్పటికీ ఉంటాయనుకో … ఇలా చెప్పడం రాయడంలో మీకున్న ఇష్టతను,అనుభవాన్ని తెలియజేస్తున్నాయి.మీకు మీ కవిత్వానికి కూడా అభిమానినే నేను.loved

 4. సాయి కిరణ్ says:

  వెంకటేష్ గారికి , నిశీధి గారికి తిలక్ గారికి నా ధన్యవాదాలు . ఇంకా చదివిన అందరికీ కూడా . అలాగే మంచి చిత్రాన్ని రచించిన శివాజీ గారికి నా కృతఙ్ఞతలు

మీ మాటలు

*