పెద్రో పారమొ-10

pedro1-1

చాలాకాలం క్రిందట మా అమ్మ చనిపోయిన మంచం మీదే పడుకున్నాను. అదే పరుపు పైన, మమ్మల్ని నిద్రపుచ్చేముందు మాపై కప్పే ఉన్ని దుప్పటి కింద. ఆమె పక్కనే పడుకుని ఉన్నాను, ఆమె బుజ్జాయిని. తన చేతుల మధ్య నాకోసం ఏర్పరచిన ప్రత్యేకమైన చోటులో.

ఆమె నెమ్మదిగా ఊపిరి తీసే లయ నాకు తెలుస్తూందనుకుంటాను. ఆ అదురుపాటూ, నిట్టూర్పులూ నన్ను నిద్రపుచ్చుతూ.. ఆమె చావు బాధ నాకు తెలుస్తుందనుకుంటాను… కానీ అది నిజం కాదు.

ఆ రోజుల్ని తల్చుకుని నా వొంటరితనాన్ని మర్చిపోవాలనుకుంటూ నేనిక్కడ వెల్లికిలా పడుకుని ఉన్నాను. నేనిక్కడ కొద్ది కాలమే కాదు కదా ఉండేది! నేను మా అమ్మ పక్కలో కూడా కాదు ఉంది, చనిపోయినవాళ్లను ఖననం చేసే నల్లపెట్టె లాంటి పెట్టెలో. నేను చనిపోయాను కనుక.

నేనెక్కడున్నదీ తెలుస్తూంది. కానీ నేనింకా ఆలోచించగలను.

పండుతున్న నిమ్మకాయలని తలుచుకున్నాను. నిర్లక్ష్యానికి గురయి ఎండిపోకముందే ఫెర్న్ మొక్కల కాడల్ని విరగ్గొట్టే ఫిబ్రవరి గాలి తలపుకు వచ్చింది. వరండాని తమ పరిమళంతో నింపిన పండు నిమ్మకాయలు.

ఫిబ్రవరి ఉదయాల్లో కొండల మీద నుంఛి గాలి కిందికి వీస్తుంది. లోయలోకి తోసే వేడి గాలి కోసం ఎదురుచూస్తూ మబ్బులు అక్కడ గుమికూడాయి. ఆకాశం నీలంగా ఉంది. నేల మీదుగా ఊడ్చుకుంటూ దుమ్ము రేపుతూ నారింజ కొమ్మల్ని విసిరి కొడుతూన్న సుడిగాలులపై కాంతి ఆటలాడుతూంది.

పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి. గాలికి కొట్టుకు వచ్చిన ఆకులను పొడిచి మళ్లీ కిచకిచమంటున్నాయి. ముళ్ళకంపల్లో ఈకలను జార విడుచుకుని సీతాకోకచిలకల్ని తరిమి మళ్ళీ కిచకిచమంటూన్నాయి. అది ఆ రుతువు.

గాలితో, పిచ్చుకలతో, నీలి కాంతితో నిండిన ఫిబ్రవరి. నాకు గుర్తుంది. అప్పుడే మా అమ్మ చనిపోయింది.

నేను ఏడ్చి ఉండాలి. నేను నెత్తురోడేట్టు నాచేతులు పిండుకుని ఉండాలి. అట్లాగే చేయాలని నువ్వనుకుని ఉంటావు. కానీ నిజానికి అది ఆహ్లాదకరమైన ఉదయం కాదా? తెరిచిన తలుపులోంచి పిల్లగాలి వీస్తుంది ఐవీ నులి తీగలను విదిలిస్తూ. నా కాళ్ల మధ్య వెంట్రుకలు పెరగడం మొదలెట్టాయి, నా రొమ్ముల్ని తాకిన నా చేతులు వేడిగా వణికాయి. పిచ్చుకలు అడుకుంటున్నాయి. కొండవాలున గోధుమ పంట గాలికి ఊగుతూంది. మల్లెల మధ్య ఆడుకునే గాలిని ఆమె ఎప్పటికీ చూడలేదనీ, ఉజ్వలమైన సూర్యకాంతిని చూడకుండా ఆమె కళ్ళు మూసుకున్నాయనీ నాకు దిగులు. కానీ నేనెందుకు ఏడవడం?

నీకు గుర్తుందా జస్టినా? చూడటానికి వచ్చిన వాళ్ళు వాళ్ల వంతు వచ్చేవరకూ కూచోవడానికి నడవాలో వరసగా కుర్చీలు వేశావు. అవన్నీ ఖాళీగా ఉన్నాయి. కొవ్వొత్తుల మధ్య మా అమ్మ వొంటరిగా పడుకుని ఉంది. పాలిపోయిన మొహం, మృత్యు శీతలానికి గడ్డకట్టిన ఊదా పెదవుల మధ్యనుంచి కనీకనపడకుండా తెల్లని దంతాలు. కనురెప్పల వెంట్రుకలు నిశ్చలంగా ఉన్నాయి. ఆమె గుండె నిశ్చలంగా ఉంది. నువ్వూ నేనూ ఆమె వినని ప్రార్థనలు ఎడతెగకుండా చేస్తున్నాము. ఆ రాత్రి గాలి రొదలో అవి నీకూ నాకూ కూడా వినపడలేదు. అమ్మ నల్లటి డ్రస్ ను నువు ఇస్త్రీ చేశావు. రొమ్ముల మీద అడ్డంగా ఉంచినప్పుడు తన చేతులు వయసులో ఉన్నట్టుగా కనిపించాలని కాలర్ కీ, చేతుల పట్టెలకీ బాగా గంజి పెట్టావు. అవే రొమ్ములు, నాకు పాలిచ్చినవీ, నా ఊయలయినవీ, నన్ను లాలిస్తూ నిద్ర పుచ్చినప్పడు కొట్టుకులాడినవీ.

ఆమెను చూడటానికి ఎవరూ రాలేదు. నువు వాకిలి దాకా వెళ్ళావు.

“నువు వెళ్లు,” నేను చెప్పాను. “నాకు మనుషులు పొగమంచులోంచి కనిపిస్తున్నారు. వాళ్ళను పొమ్మని చెప్పు. వాళ్ళు గ్రెగోరియన్ ప్రార్థనల కోసం డబ్బుల కోసం వచ్చారా? ఆమె డబ్బులేమీ వదిలిపెట్టి పోలేదు. ఆ సంగతి వాళ్ళకు చెప్పు జస్టినా? వాళ్ళు ఆ ప్రార్థనలు చేయకపోతే అమ్మ పాప విమోచన లోకం లోనే ఉండి పోతుందా? తీర్పు చెప్పటానికి వాళ్ళెవరు జస్టినా? నాకు పిచ్చనుకుంటున్నావా? అనుకో..”

మనం అమ్మను ఖననం చేయడానికి వెళ్ళినదాకా నువు వేసిన కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. తమకు తెలియని శవాన్ని మోస్తూ చెమటలు కక్కుతూ మన బాధ తెలియని కూలి వాళ్ళు వెంట వచ్చారు. తడి ఇసుకను సమాధిలోకి ఎత్తివేసి , తమ పనికి తగిన వోపికతో శవపేటికను నెమ్మదిగా లోపలికి దించారు. అంత శ్రమ తరవాత పిల్లగాలి సేదతీరుస్తూంది. వాళ్ల కళ్ళు ఉదాసీనంగా, ఏమీ పట్టనట్టు ఉన్నాయి. “ఇంత అవుతుంది,” అని చెప్పారు. బజార్లో ఏదో కొంటున్నట్టు నువు వాళ్ళకు డబ్బు ఇచ్చావు. కన్నీటితో తడిసి మెలికలు తిప్పీ తిప్పీ ఉన్న జేబురుమాలు ఒక కొస ఊడదీసి అందులోచి తీసి.

వాళ్ళు వెళ్ళిపోయాక, అమ్మ తలవైపు మోకాళ్ళ మీద కూచుని నేలను ముద్దాడావు. “పద జస్టినా. ఆమె ఇక్కడ లేదు. ఇక్కడ శవం తప్ప మరేదీ లేదు,” అని ఉండక పోతే నువు ఆమె వైపుకు తవ్వుతూ పోయేదానివే.

 

నువ్వేనా మాట్లాడుతూంది డొరోతియా?”

“నేనా? కాసేపు నిద్రపోయాను. ఇంకా భయపడుతున్నావా?”

“ఎవరో మాట్లాడడం వినిపించింది. ఆడ గొంతు. నువ్వేననుకున్నాను.”

“ఆడ గొంతా? నేననుకున్నావా? తనలోతాను మాట్లాడుకునే ఆమె అయి ఉంటుంది. ఆ పెద్ద సమాధిలో ఉండే ఆమె. డోన సుసానీత. మనకు దగ్గరలోనే పూడ్చారు. చెమ్మ తగిలినట్టుంది, నిద్రలో కదులుతూంది.”

“ఎవరామె?”

“పేద్రో పారమొ చివరి భార్య. ఆమె పిచ్చిదని కొందరంటారు. కాదని కొందరంటారు. నిజమేమిటంటే ఆమె బతికి ఉన్నప్పుడు కూడా తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేది.”

“చనిపోయి చాలారోజులయి ఉండాలి.”

“అవును. చాలా రోజులయింది. ఏమిటి, ఆమె అంటూన్నదేమిటి?”

“ఏదో వాళ్ళ అమ్మ గురించి.”

“వాళ్ల అమ్మ లేదే!”

“ఏమో, వాళ్ల అమ్మ గురించే మాట్లాడుతూంది.”

“హుఁ. .. ఆమె వచ్చినప్పుడు మాత్రం తనతో వాళ్ల అమ్మ లేదు. ఆగాగు. గుర్తొచ్చింది. వాళ్ల అమ్మ ఇక్కడే పుట్టింది, పెరిగేప్పుడు మాయమయిపోయారు. అవును. అంతే. వాళ్ల అమ్మ క్షయ వ్యాధితో చనిపోయింది. ఆమె వో వింత మనిషి. ఎప్పుడూ జబ్బుతో ఉండేది. ఎవరింటికీ వెళ్ళేది కాదు.”

“అదే ఆమె చెపుతుంది. వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు చూడటానికి ఎవరూ రాలేదని.”

“ఏమిటి ఆమె ఉద్దేశం? ఆమె గడపలోకి ఎవరూఅడుగు పెట్టలేదంటే ఆశ్చర్యం లేదు. ఆమె జబ్బు తమకెక్కడ అంటుకుంటుందో అని భయం. ఆ ఇండియన్ ఆమెకేమన్నా తెలుసేమో!”

“దాని గురించీ మాట్లాడుతుందామె.”

“ఈసారి మాటలు వినిపించినప్పుడు నాకు చెప్పు. ఆమె ఏమి చెపుతుందో నాకూ వినాలని ఉంది.”

“వింటున్నావా? ఏదో చెప్పబోతున్నట్టుంది. గుసగుసలు వినిపిస్తున్నాయి.”

“ఉహు, అది ఆమె కాదు. అది ఇంకా దూరంగా, వేరే దిక్కులో. ఆ గొంతు మగది కూడా. చాలా రోజులుగా శవాలుగా ఉన్న వాళ్ళేం చేస్తారంటే కాస్త చెమ్మ చేరేసరికి కదలడం మొదలెడతారు. లేస్తారు.”

“స్వర్గం ఉదారమైనది. దేవుడు నాతో ఉన్నాడా రాత్రి. లేకపోతే ఏమయి ఉండేదో ఎవరికి తెలుసు? ఎందుకంటే నేనొచ్చేసరికే రాత్రయి పోయింది..”

“నీకిప్పుడు బాగా వినిపిస్తుందా?”

“ఊఁ”

“..నా వొంటి నిండా నెత్తురు. లేవడానికి ప్రయత్నించినపుడు నా చేతులు రాళ్ల మధ్య నెత్తుటి చిదపల్లో జారిపోతున్నాయి. అది నా నెత్తురే. బకెట్ల కొద్దీ నెత్తురు. కానీ నేను చనిపోలేదు. ఆ సంగతి నాకు తెలుసు. పేద్రో నన్ను చంపాలనుకోలేదన్నది నాకు తెలుసు. కాస్త భయపెట్టాలనుకున్నాడు. రెండేళ్ల క్రితం ఆ రోజు నేను విల్మాయో లో ఉన్నానేమో కనుక్కుందామనుకున్నాడు. శాన్ క్రిస్తోబాల్ రోజు. పెళ్ళి దగ్గర. ఏ పెళ్ళి? ఏ శాన్ క్రిస్తోబాల్? నా నెత్తుటిలో నేను జారిపడుతూ అతన్ని అదే అడిగాను: ‘ఏ పెళ్ళి డాన్ పేద్రో? లేదు, లేదు డాన్ పేద్రో! నేనక్కడ లేను. ఆ చుట్టుపక్కల ఉన్నానేమో, అదీ కాకతాళీయంగా…’ అతను నిజంగా నన్ను చంపాలనుకోలేదు. నన్ను కుంటివాడిగా వదిలేశాడు – నీకు కనిపిస్తూనే ఉందిగా – బాధపడవలసినదేమిటంటే నా చేయి కూడా పనికిరాకుండా పోయింది. కానీ అతను నన్ను చంపలేదు. అప్పటి నుంచి అంతా నాకు వెర్రి చూపు పడిందంటున్నారు. ఆ భయానికి. కానీ అది నన్ను మగాణ్ణి చేసింది. స్వర్గం ఉదారమయింది. ఆ విషయంలో అనుమానపడకు.”

“ఎవరతను?”

“నాకేం తెలుసు? డజన్ల మందిలో ఒకడు. తన తండ్రిని ఎవరో చంపాక పేద్రో పారమొ ఎంతో మందిని ఊచకోత కోశాడు. దాదాపుగా ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్లనందరినీ చంపేశాడు. డాన్ లూకాస్ కన్యాదానం చేయవలసి ఉంది. నిజానికి అతను ప్రమాదవశాత్తూ చనిపోయాడు. అసలు ఆ పెళ్ళికొడుకు మీద ఎవరికో పగ ఉంది. డాన్ లూకాస్ కి తగిలిన బులెట్ ఎవరు కాల్చిందో తెలియలేదు కనక పేద్రో పారమొ అందరినీ తుడిచిపెట్టేశాడు. అది విల్మయో కొండమీద జరిగింది. అప్పుడేవో ఇళ్ళుండేవి గానీ ఇప్పుడు వాటి ఆనవాలు కూడా దొరకదు… విను, ఇప్పుడు ఆమెలా ఉంది మాట్లాడేది. నీవి పడుచు చెవులు. నువు విను. విని నాకు చెప్పు ఏమంటుందో.”

“నాకేం అర్థం కావడం లేదు. ఆమె మాట్లాడుతున్నట్టు లేదు, మూలుగుతూంది.”

“ఏమని మూలుగుతుంది?”

“నాకేం తెలుసు?”

” దేనిగురించో అయి ఉంటుంది. సరిగా విను. ఊరికే మూలగడానికే ఎవరూ మూలగరు.”

“ఆమె మూలుగుతూ ఉంది. ఊరికే మూలుగుతుంది. పేద్రో పారమొ ఏమన్నా కష్టపెట్టాడేమో ఆమెని!”

“ఆ మాట నమ్మకు. అతడామెని ప్రేమించాడు. ఆమెని ప్రేమించినట్టు అతనింకెవరినీ ప్రేమించలేదని నేను చెప్పగలను. ఆమెను అతని దగ్గరికి తీసుకు వచ్చేసరికే ఆమె బాధలో ఉంది – పిచ్చేనేమో! ఆమెను ఎంతగా ప్రేమించాడంటే ఆమె పోయాక రోజుల తరబడి కుర్చీలో కూలబడి ఆమెను స్మశానానికి తీసుకువెళ్ళిన దారి వైపే చూస్తూ ఉండే వాడు. దేనిపట్లా ఆసక్తి చూపేవాడు కాదు. పొలాలు బీడుపెట్టాడు. పొలం పనిముట్లన్నీ నాశనం చేయించాడు. అతను ఇట్లా చేస్తున్నది డస్సిపోవడం వల్ల అని కొంతమందీ, నిస్పృహ వల్ల అని కొంతమందీ అన్నారు. పనివాళ్లనంతా తరిమేసి ఆ దారి వంకే చూస్తూ కూచునేవాడన్నది మాత్రం నిజం.

“ఆ రోజునుంచీ పొలాలను పట్టించుకున్న నాధుడు లేడు. వదిలేశాడు. ఆ నేలని అట్లా చూస్తుంటే బాధగా ఉండేది. అట్లా వదిలేయగానే మహమ్మారి చుట్టుముట్టింది. చుట్టుపక్కల మైళ్ళకొద్దీ జనాలకి కష్టకాలం దాపురించింది. మగవాళ్ళు అన్నీ సర్దుకుని పనుల కోసం బతుకుతెరువు వెతుక్కుంటూ పోయారు. ఆరోజుల్లో కోమలాలో సెలవు తీసుకుంటూ చెప్పే మాటలు తప్ప మరేవీ వినిపించేవి కావన్న సంగతి నాకు గుర్తుంది. ఒక్కొక్కరినీ వాళ్ల దారివెంట పంపుతున్నప్పుడల్లా ఒక పండగలాగా ఉండేది. వాళ్లంతా మళ్ళీ తిరిగి వద్దామనే ఉద్దేశంతోటే పోయారు. వాళ్ళ సామాన్లమీదా, కుటుంబాలమీదా ఒక కన్నేసి ఉంచమని చెప్పేవారు. తర్వాత కొంతమంది సామాన్లు వదిలేసి కుటుంబాలను మాత్రం పిలిపించుకున్నారు. ఆపైన మా గురించీ, ఊరి గురించీ, వాళ్ల సామాన్ల గురించి కూడా మర్చిపోయారు. వెళ్లడానికి ఏ చోటూ లేక నేను ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది పేద్రో పారమొ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉండిపోయారు. తను పోయాక తన పొలమూ, ఆస్తులూ వాళ్లకు వదిలేస్తానని మాట ఇచ్చాడు. ఆ ఆశతోటి వాళ్ళు బతుకుతున్నారు. ఏళ్ళు గడిచాయి కానీ అతను బతికే ఉన్నాడు, మెదియా లూనా పొలాల మీదకి చూస్తూ ఉన్న దిష్టిబొమ్మ లాగా.

“అతను చనిపోబోయే కొదిరోజుల ముందే క్రిస్టెరోస్ యుద్ధం వచ్చింది. అతని దగ్గర ఉన్న కొద్ది మంది పనివాళ్లూ సైన్యంలో చేరారు. అప్పుడే నేనూ నిజంగా ఆకలితో నకనకలాడటం మొదలయింది. ఏదీ మునుపటిలా ఇక ఉండలేదు.

“అంతా డాన్ పేద్రో చేసుకున్నదే, తన ఆత్మక్షోభ వలన. కేవలం తన భార్య సుసానీత చనిపోవడం వల్ల. ఇప్పుడు చెప్పు అతను ఆమేని ప్రేమించాడో లేదో?”

 

ఫుల్గోర్ సెడనో చెప్పాడతనికి.

“దొరా! ఊళ్ళోకి తిరిగి ఎవరొచ్చారో తెలుసా?”

“ఎవరు?”

“బార్ట్లోం శాన్ హువాన్!”

“ఎందుకు?”

“నాకూ అదే అనిపించింది. తిరిగి ఎందుకొచ్చాడో?”

“కనుక్కోలేదా?”

“లేదు, ముందు మీకు చెప్పాలనుకున్నాను. ఇంటి గురించేమీ వాకబు చేయలేదు. శరాసరి మీ పాత ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లేదో మీరతనికి అద్దెకిచ్చినట్టు గుర్రం దిగి సూట్ కేసులు లోపలికి మోసుకుపోయాడు. ముందువెనకలాడుతున్నట్టు కనబడ లేదు. ”

“దాని గురించి నువ్వేం చేస్తునావు ఫుల్గోర్? ఏమవుతుందో ఎందుకు కనుక్కోలేదు? అందుకు కాదా నీకు జీతమిస్తుంది?”

“ఈ విషయం తెలిసేసరికి నాకు బుర్ర తిరిగిపోయింది. కనుక్కోవాలంటే రేపు ఎలాగోలా కనుక్కుంటాను.”

“రేపటి సంగతి మర్చిపో! ఆ శాన్ హువాన్ సంగతి నేను చూస్తాను. ఇద్దరూ వచ్చారా?”

“అవును, అతనూ, అతని భార్యా. నీకెట్లా తెలుసు?”

“అతని కూతురు కాదా?”

“ఆమెతో ఉన్న తీరును చూస్తే భార్యలాగే ఉంది.”

“ఇంటికి పోయి పడుకో ఫుల్గోర్!”

“తమ దయ!”

 

నువు తిరిగివస్తావని ముప్పయ్యేళ్ళు ఎదురుచూశాను సుజానా. నాకన్నీ కావాలనుకున్నాను. ఏ ఒక్క భాగమో కాదు, పొందడానికి ఏదయితే ఉందో అదంతా. ఇక కోరుకోవడానికి ఏమీ మిగలనట్టుగా. నాకు తన అవసరం ఉందనీ, వచ్చి మనతో ఉండమనీ మీ నాన్నతో ఎన్నోసార్లు చెప్పాను. మాయ కూడా చేశాను.

నా పనులు చూస్తూ ఉండమన్నాను. అదికాకపోతే ఇంకా ఏదయినా, నిన్ను మళ్ళీ చూసేందుకు వీలుగా. అంతా విని ఏమన్నాడు? “బదుల్లేదు.” నేను పంపిన రాయబారి ఎప్పుడూ చెప్పే మాటే అది. “డాన్ బార్ట్లోం మీ ఉత్తరాలన్నీ చేతికి ఇవ్వగానే చింపేస్తాడు.” కానీ ఆ కుర్రాడి ద్వారా నీకు పెళ్ళయిన సంగతి తెలుసుకున్నాను. కొద్దికాలంలోనే నువు విధవవయ్యావనీ, తిరిగి మీ నాన్నతో ఉండటానికి వెళ్ళిపోయావనీ తెలిసింది.

తర్వాత నిశ్శబ్దం.

ఆ రాయబారి వెళ్ళేవాడు, వచ్చేవాడు. ప్రతిసారీ అదే చెప్పేవాడు ” నాకు వాళ్ళెక్కడా కనపడలేదు డాన్ పేద్రో! మస్కోట వదిలిపెట్టి పోయారనుకుంటున్నారంతా. కొంతమంది ఒకవేపు వెళ్ళారంటే, ఇంకొంతమంది వేరేవైపు వెళ్లారంటున్నారు.”

వాడికి చెప్పాను “ఖర్చులకు వెనుకాడకు. వాళ్ళెక్కడున్నారో కనుక్కో. నేల ఏమీ మింగేయలేదుగా వాళ్ళను!”

ఒక రోజు వచ్చి చెప్పాడు.

“డాన్ బార్ట్లోం శాన్ హువాన్ ఎక్కడ దాక్కునే చోట్లున్నాయో ఆ కొండలన్నీ వెదికాను. చివరికి ఎక్కడో చాలా దూరంగా ఆ ఆండ్రోమెదా గనుల దగ్గర ఒక చెక్క ఇంట్లో దాక్కుని ఉన్నట్టు కనిపెట్టాను.”

వింతగాలులు వీస్తున్నాయప్పుడు. సాయుధ తిరుగుబాటు వార్తలు వినవస్తున్నాయి. పుకార్లు వింటున్నాము. నీ తండ్రినే వెనక్కి ఇక్కడికి తరిమి కొట్టే గాలులవి. తనకోసం కాదనీ, నీ క్షేమంకోసమేననీ ఉత్తరం రాశాడు. నిన్ను తిరిగి నాగరికతలోకి తీసుకు రావాలనుకున్నాడు.

స్వర్గం విడివడి దారి ఇస్తుందనిపించింది. పరుగెత్తుకువచ్చి నిన్ను కలవాలనుకున్నాను. నిన్ను సంతోషంలో ముంచెత్తాలని. ఆ ఆనందం పట్టలేక ఏడ్చేయాలని. ఏడ్చాను సుజానా, ఎట్టకేలకి నువు తిరిగి వచ్చావని తెలిసి.

 

కొన్ని ఊళ్ళకు దురదృష్టపు వాసన ఉంటుంది. అన్నిటిలా పాతగా ఉండే ఆ నిలవ ఉండి మగ్గిపోయిన పలచటి గాలిని ఒక్కసారి పీల్చినా నీకు తెలిసిపోతుంది. అలాంటి ఊళ్ళలో ఇది ఒకటి సుజానా!

“మేము ఇంతకుముందు ఉన్నచోట కనీసం పుట్టడం చూసి ఆనందించేవాళ్లం – ఆ మబ్బులూ, పిట్టలూ, నాచూ. నీకు గుర్తుందా? ఇక్కడ నేలనుంచి పైకి ఉబుకుతున్నట్టుండే ఆ పులిసిపోయిన పసుప్పచ్చ వాసన తప్ప ఇంకేమీ లేదు. ఈ ఊరు శాపగ్రస్త. దురదృష్టంలో మునిగి ఊపిరాడనిదీ ఊరు.

“మనం తిరిగి రావాలన్నది అతని కోరిక. మనకీ ఇల్లు ఇచ్చాడు. మనకు కావలసిందంతా సమకూర్చాడు. కానీ అతనికి మనమేం కృతజ్ఞులంగా ఉండక్కర్లేదు. ఇది మనకు వరమేమీ కాదు. మనకు ఇక్కడ మోక్షమేమీ దొరకదు. నాకు తెలుస్తూంది.

“పేద్రో పారమొకేం కావాలో నీకు తెలుసా? ఇదంతా మనకు ఊరికే ఇస్తున్నాడని నేనేం అనుకోవడం లేదు. ఈ బాకీ తీర్చాలి కనక అతనికోసం చెమటోడ్చి పని చేయడానికి సిద్ధమే. ఆండ్రోమెడాఅ గనుల గురించి వివరాలన్నీ ఇచ్చి దానిమీద సరిగా పనిచేస్తే లాభం కళ్ల చూడవచ్చని వొప్పించాను. అతనేమన్నాడో తెలుసా? ‘నీ గని మీద నాకేం ఆసక్తి లేదు బార్ట్లోం శాన్ హువాన్! నీనుంచి నాకు కావలసింది ఒక్క నీ కూతురే! నువు సాధించినవాటిలో అత్యున్నతమైనది ఆమే!’

“అతనికి నువ్వంటే ప్రేమ సుజానా! మీరిద్దరూ చిన్నప్పుడు ఆడుకునేవారని చెప్పాడు. అతనికి నువ్వు తెలుసట. వయసులో ఉన్నప్పుడు మీరు నదిలో కలిసి ఈతలు కొట్టేవారట. నాకు తెలియదా సంగతి. నాకు తెలిస్తే అప్పుడే నిన్ను చితకబాదే వాడిని.”

“తప్పకుండా తన్ని ఉండే వాడివే!”

“సరిగానే విన్నానా? ‘తప్పకుండా తన్ని ఉండే వాడివే,’ అనా?”

“సరిగ్గానే విన్నావు.”

“అయితే వాడి పక్కలో పడుకోటానికి సిద్ధమేననా!”

“అవును బార్ట్లోం.”

“వాడికి పెళ్ళయిందనీ, లెక్కలేనంత మంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయనీ తెలియదా?”

“తెలుసు బార్ట్లోం.”

“ముందు ఆ బార్ట్లోం అనడం ఆపు. నేను నీ కన్న తండ్రిని.”

బార్ట్లోం శాన్ హువాన్ ఒక చనిపోయిన గని పనివాడు. సుజానా శన్ హువాన్ ఆండ్రొమెదా గనుల్లో చనిపోయిన ఒక గని పనివాడి కూతురు. అతనికి స్పష్టంగా కనిపించింది. “చావడానికి అక్కడికి వెళ్ళాలి,” అనుకున్నాడు. తర్వాత చెప్పాడు-

“నువ్వు విధవవే అయినా ఇంకా నీ భర్తతోటే బతుకుతున్నావని చెప్పానతనికి. కనీసం అట్లా ప్రవర్తిస్తున్నావని. అతన్ని ఎట్లా అన్నా నిరుత్సాహపర్చాలని చూశాను కానీ నేను అట్లా మాట్లాడినప్పుడల్లా అతని చూపు పదునెక్కేది. నీ పేరు చెప్పగానే కళ్ళు మూసుకునేవాడు. అతను ఒక నిఖార్సయిన నికృష్టుడన్న విషయంలో నాకే సందేహమూ లేదు. పేద్రో పారమొ అంటే అంతే.”

“మరి నేనెవరిని?”

“నా కూతురువి. నాదానివి. బార్ట్లోం శాన్ హువాన్ కూతురివి. ”

సుజానా శాన్ హువాన్ మనసులో ఏవో ఊహలు రూపు కట్టుకోసాగాయి. ముందు నెమ్మదిగా, మళ్ళీ వెనక్కి తగ్గి, తర్వాత ఒక్కసారిగా దూకేసరికి ఆమె “అది నిజం కాదు. అది నిజం కాదు,” అని మాత్రమే అనగలిగింది.

“ఈ లోకం మనల్ని అన్నివైపులనుంచీ వొత్తిడి పెడుతుంది. మన బూడిదని నేలంతా చిమ్ముతుంది. మన నెత్తుటితో నేలను తడపాలని చూస్తుంది. మనమేం చేశాము! మన ఆత్మలెందుకిలా కుళ్ళిపోయాయి? మనకు కనీసం దైవకటాక్షమయినా దక్కుతుందని మీ అమ్మ ఎప్పుడూ అనేది. కానీ నువు కాదంటున్నావు సుజానా. నేను తండ్రిని కాదని ఎందుకంటున్నావు? నీకేమయినా పిచ్చా?”

“నీకు తెలియదా?”

“నీకు పిచ్చా?”

“నాకు పిచ్చే బార్ట్లోం! నీకు తెలియదా?”

 

నీకు తెలుసుగా ఫుల్గోర్! ఈ భూమి మీద అందరికంటే అందగత్తె ఆమే. ఆమెను ఎప్పటికీ పోగొట్టుకున్నాననే నమ్మాను. మళ్ళీ ఆమెను పోగొట్టుకోలేను. అర్థమవుతుందా ఫుల్గోర్? వాళ్ళ నాన్నను పోయి ఆ గనుల్లోనే వెతుక్కోమని చెప్పు. అక్కడ… ఎవరూ అడుగుపెట్టని ఆ ప్రాంతంలో ఒక ముసలాడు మాయం కావడం పెద్ద కష్టం కాదనే అనుకుంటున్నాను. నువ్వేమంటావు ఫుల్గోర్?”

“కావచ్చు.”

“అట్లా కావడం మనకవసరం. ఆమెకు కుటుంబమేమీ మిగలకూడదు. అవసరంలో ఉన్న వాళ్ళ బాగోగులను చూడడం మన పని. నువ్వు దానికి వొప్పుకోవా ఫుల్గోర్?”

“అదంత కష్టంగా ఏమీ కనిపించడం లేదు.”

“మరి ఆలస్యమెందుకు ఫుల్గోర్? ఆ పని మీద ఉండు.”

“ఆమెకి తెలిస్తే?”

“ఎవరు చెపుతారు? చెప్పు. ఇది తెలిసింది నీకూ నాకూ. మనిద్దరిలో ఆమెకి ఎవరు చెప్తారు?”

“ఎవరూ చెప్పరనుకుంటున్నా.”

“ఈ అనుకోవడాలు వదిలేయి. అది మర్చిపో, అంతా సరిగ్గా జరుగుతుంది. ఆండ్రొమెదా దగ్గర ఎంత పని చేయాలో గుర్తు చేసుకో. ఆ ముసలాడిని ఆపని మీద పంపు. తన ఇష్టం వచ్చినట్టు పోయి రమ్మను. కానీ తన కూతుర్ని అక్కడికి తీసుకు వెళ్ళే ఆలోచన రానీయకు. ఆమె సంగతి మనం చూసుకుందాం. అతని పని గనిలో. కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇల్లు ఉంది. ఆ సంగతి చెప్పు అతనికి.”

“మీరు పనులు చేసే పద్ధతి చూసే ముచ్చటేస్తుందని మళ్ళీ చెప్పాలనిపిస్తూంది దొరా! మీలో వెనకటి హుషారు తిరిగి వచ్చినట్టుంది.”

మీ మాటలు

*