ఆత్మ ఘోష, ఋతు ఘోష కలిసి…ప్రవాస కవిత్వం

imagesX3953B67

ఇండియాలో కవిమిత్రులతో మాట్లాడుతున్నప్పుడు వారిలో కొందరు తరచుగా ఒక కంప్లయింటు చేస్తుంటారు – నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఎలా రాసావో, ఇప్పుడూ అలాగే రాస్తున్నావని. అదివిన్నప్పుడు, నాలో నేను అనుకుంటాను – అలా రాయగలిగితే మంచిదే కదా అని. అక్కడొక సాహిత్య వాతావరణం ఉంటుంది. మిత్రులతో వాద ప్రతివాదాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా, నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో వైవిధ్యం, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల్ని గమనించటం వంటివి జరుగుతాయి. రాసేది అంతర్ముఖీనమైన కవిత్వమే అయినా, ఇవన్నీ సాహితీ సృజనకి దోహదం చేస్తాయి. నానృషిః కురుతే కావ్యం అంటారుగాని, ఒకవిధంగా చూస్తే మానవ సంపర్కం లేని స్థితప్రజ్ఞుడైన మనిషి కంటే, తక్షణ సంఘటనలకు స్పందించి, తేలిగ్గా చలించిపోయే non ఋషులే కవిత్వం రాయటానికి ఉత్సాహం చూపిస్తారేమో అనిపిస్తుంది. మాతృదేశానికి, మాతృభాషకు దూరంగా ఉంటూ, చిన్నచిన్న సాంస్కృతిక ద్వీపాలలో నివసిస్తూ కూడా, కవిత్వ దీపంలో చమురు ఇంకిపోకుండా అదే స్థాయిలో రచన చెయ్యటం సాధించగలిగితే, ప్రవాస కవులలో అది ప్రశంసించ వలసిన గుణంగానే చెప్పుకోవాలి.

రెండో విషయం ఏమిటంటే, కవిత్వం సార్వజనీనమైన, సర్వకాలాలకూ వర్తించే సత్యాల గురించి అన్వేషిస్తుంది. బయటి ప్రపంచం చూడటం వల్ల, ఇటువంటి సత్యాలు మరింతగా మనకు అనుభవంలోకి వస్తాయి. “అవే ఆత్మలు ధరించిన రంగురంగుల శరీరాలు” అన్నట్టు, ఎక్కడికి వెళ్ళినా మనుషుల స్వభావం, వారి ఆశలు, నిరాశలు, ఆలోచనలు, విజయాలు, వైఫల్యాలు వంటివాటిలో పెద్దగా భేదం ఉండదని అర్థమవుతుంది. అందువల్ల, మానవ సంబంధాల గురించి, జీవితంలో అనివార్యంగా ఎదురయ్యే అనుభవాలు – జననం, మృత్యువు, వయస్సుతో వచ్చే మార్పులు, ఆశ, నిరాశ, ఎడబాటు – వంటివాటి ఆధారంగా రాసే కవిత్వం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. అయితే, కవి తన దృక్పథం ద్వారా వాటిని తనదైన ప్రత్యేకతతో చిత్రిస్తాడు. ప్రాంతం మారినంత మాత్రాన అటువంటి దృక్పథం సరికొత్తగా ఏర్పడటమో, పూర్తిగా మారిపోవటమో జరగదు. కాకపొతే, ఒకచోట పరిస్థితుల గురించి విన్నప్పటికంటే, అక్కడ ఉన్నప్పుడు, ఆ జీవితంలో భాగంగా నివసించి నప్పుడు, మన దృష్టిలో స్పష్టత ఏర్పడుతుంది. అంతకు ముందు అపోహలేమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. చాలామంది తెలుగు కవుల్లాగా అక్కడున్నప్పుడు అమెరికా వ్యతిరేక కవిత్వం రాసివుంటే, బహుశా ఇక్కడకు వచ్చి నివసించాక, సగటు ఆమెరికన్లో ఉండే స్నేహభావం, హాస్యప్రియత్వం, సహాయంచేసే గుణం వంటివి చూసాక, అటువంటి తీవ్రమైన కవిత్వం ఇక్కడ రాయకపోవచ్చు. ఒకవేళ అటువంటిది జరగకపోయినా, ఇక్కడి బ్రహ్మాండమైన ప్రకృతి శోభకి పరవశం కలిగి, దేశమంటే మనుషులేకాదు, మట్టి కూడా అనే అవగాహన కలగవచ్చు.

మరొక విషయం ఏమిటంటే, కవిత్వం కవి ఊహాశక్తి మీద, అతని లోచూపు మీద ఆధారపడి ఉంటుంది. అతని సృష్టి అతని సొంతం. కథకుడిలాగా, తన ఊహలకి రక్తమాంసాలు ఇవ్వవలసిన అవసరం కవికిలేదు. అంటే, కవిత్వానికి వాస్తవంతో పనిలేదని కాదు నా ఉద్దేశం. వాస్తవాన్ని కవి చూసే దృష్టి, దానిని ఆవిష్కరించే పధ్ధతి ప్రత్యేకంగా ఉంటాయి. కథలో ఒక వాతావరణం ఉంటుంది కాబట్టి, ఇక్కడి ఊరి పేర్లు వాడటం, పాత్రలకు ఇక్కడి పేర్లు పెట్టటం వంటివాటి ద్వారా, అమెరికన్ కథ అనే భావన కలిగించవచ్చు. కవిత్వానికి అటువంటి వాతావరణ కల్పన ప్రధానం కాదు కాబట్టి, ఎక్కడ రాసిన కవిత్వమైనా ఒకలాగే అనిపించవచ్చు.

ఈ ప్రశ్న అడిగేవారి ఉద్దేశం మరొకటి కూడా కావచ్చు. వారనుకొనే కొన్ని స్టీరియోటైపు అంశాల గురించి రాయాలని వారు ఆశించవచ్చు. వారి జీవన విధానం ఎలా ఉన్నా సరే, అమెరికా తెలుగు కవులు అక్కడి నల్లవారి గురించో, పేదరికం గురించో, గ్లోబలైజేషన్ గురించో, లేదా యుద్ధ వ్యతిరేకత గురించో రాయాలన్నది వారి అభిప్రాయం కావచ్చు. ఇవేవీ కనపడని కవిత్వం వైవిధ్యంలేని, అప్రధానమైన కవిత్వమని వారు భావించవచ్చు. నియోగి అనేకమంది సాహితీ వేత్తలతో చేసిన ఇంటర్వ్యూలు ఇటీవల చదివాను. అందులో ఒక ఇంటర్వ్యూలో నగ్నముని కవిత్వాన్ని నాలుగు రకాలుగా విభజించారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్య కవిత్వమని ఆయన చెప్పే రాజకీయ కవిత్వం ప్రథమ శ్రేణికి, సామాజిక కవిత్వం ద్వితీయ శ్రేణికి, ఇజాల గురించి రాసే కవిత్వం తృతీయ శ్రేణికి చెందుతాయి. ఇకపోతే ప్రకృతి గురించి, ‘చెట్లు పుట్టల’ గురించి, మానవ సంబంధాల గురించి రాసేది సాధారణ కవిత్వమని (అంటే బహుశా అన్నిటికంటే తక్కువ స్థాయి అని ఆయన ఉద్దేశంగా నాకనిపించింది) ప్రమాద రహితం కాబట్టి ఎక్కువమంది అలా రాస్తారని తీర్మానించారు. మనం మహాకవులనుకొనేవారి ఆలోచనా పరిధే ఇంత తక్కువగా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రవాస కవిత్వంలో ప్రత్యేకతలు లేవా అంటే , తప్పక ఉంటాయి. ఇక్కడికి మాత్రమే చెందిన అనుభవాల గురించి రాసిన సందర్భాలు, ట్రాన్స్ ప్లాంట్ కావటంవల్ల మూలం నుంచి వేరయిన వేదనను ఆవిష్కరించే కవితలు కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

“నేనొక చెట్టునిట

నన్ను నేనే పెళ్లగించుకొని

ఖండాంతరవాసి నైతిని

మొలకెత్తి తలయెత్తి చిగురించి పుష్పించుటకై

సారమిచ్చిన భారత భూమిక

పరభూమి నా కనవరతం

….. తల్లక్రిందులయిన నాకు

ఊర్థ్వమూల మథశ్శాఖః”

అని పెమ్మరాజు వేణుగోపాలరావు గారు రాసారు. అనేక సంవత్సరాల తరువాత నారాయణస్వామి, తన ఊరి నుంచి గుర్తుగా తెచ్చుకున్న మొక్కను గురించి చెబుతూ, అటువంటి పోలికనే వాడి ఆ విషయాన్ని ఆవిష్కరించాడు :

“మా ఊరి మొక్కను

ఎక్కడ నాటాలో తెలియక

నాలోనే

తలకిందులుగా

నాటుకున్నా

తలలోంచి బయటకు పెరిగిన

వేళ్ళు

భూమినీ ఆకాశాన్నీ

వొక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నయి.”

ఇక్కడికి వచ్చే తరాలు మారినా, తల్లక్రిందులయిన భావన మాత్రం మారలేదని వీటివల్ల తెలుస్తుంది. ఇదే విషాద భావాన్ని వైదేహీ శశిధర్ ఇటీవలి పుస్తకంలోని “మల్లె అంటు” అన్న కవితలో చాలా సున్నితంగా చెప్పారు. అందులో మొదట మల్లె అంటు సొగసుని వర్ణించిన తరువాత, చివర –

“తెగిన తల్లివేరు స్పర్స చల్లగా తగినట్లు తోచిందేమో

ఎంతో దూరాన తాను వదిలేసిన తన వెచ్చని కుదురును

పచ్చని బాల్యాన్ని తలచుకుని చిన్నబోయిన మల్లె అంటు

చెమ్మగిల్లిన పూరేకులను దిగులుగా రాలుస్తుంది”

ఈ వియోగ భావం ఒకొక్కసారి అపరాధ భావంగా కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అఫ్సర్ కవిత “డెజావూ” లో

“ఏ అన్నాలవేళో

మిమ్మల్నందరినీ విడిచేసి వచ్చాను

అది మధ్యాహ్నమో, రాత్రో గుర్తులేదిప్పుడు

….. ఏ అన్నాలవేళోమరి

పొలిమేరలు దాటి, సముద్రాలు దాటి

అనేక జనావాసాల తడిపొడి నేలలు దాటి వచ్చాను

గుర్తున్నానా?”

అన్నప్పుడు ఈ అపరాధ భావమే వినిపిస్తుంది. కొన్ని కవితలలో ఈ వియోగ బాధ ఎంతవరకు వెళుతుందంటే, మరణానంతరం కూడా అది తీరదేమో అన్నంతగా వ్యక్తమవుతుంది. మొత్తం మీద, మాతృదేశ ప్రభావం ప్రవాస కవిత్వం మీద పడిన అతి పొడవైన నీడగా మనం చెప్పుకోవచ్చు.

దీనికి భిన్నంగా ఇక్కడి నేలను, ప్రకృతి వైభవాన్ని, పరిసరాల్ని ప్రేమించి, స్తుతించిన కవిత్వం ఆహ్లాదకరమైన పదచిత్రాల వెలుగులు నిండి ఆనందం కలిగిస్తుంది. ఇక్కడి ప్రదేశాలనే కాదు, అంతకంటే ఎంతో సుందరమైన ఋతువుల్ని, ఋతుసంధ్యలని దాదాపు అందరు ప్రవాస కవులు పొగిడారు. వీటిలో కూడా, ఇండియాలో మనకంతగా అనుభవంలోకి రాని ఫాల్, మంచుతో కూడిన వింటర్ – ఇవి రెండూ కవుల్ని ఎక్కువగా ఆకర్షించాయి. మంచు కురిసిన రాత్రిలో చంద్ర – కురుస్తున్న మంచు, గాలి పాపలు ఊదుకొంటూ పోతున్న పక్షి రెక్కల్లా ఉందని చెప్పినా, నా కవితలో ఒకచోట – ఉదయానికి మిగిలిపోయిన మంచు రాత్రి మరచి వెళ్ళిన వెన్నెలలా ఉందని చెప్పినా, ఫ్రోజన్ లేక్ కింద లేత కొబ్బరి నీరులా తేటగా నిలిచే హృదయ సౌకుమార్యం గురించి వైదేహి చెప్పినా, యదుకుల భూషణ్ శిశిర చిత్రాల్లో రాలిన ఆకులు రోడ్డు మీద చిన్న పిల్లల్లా పరుగిడతాయని చెప్పినా – అన్ని చోట్లా ఋతు సౌందర్యంపట్ల స్వచ్చమైన ప్రతిస్పందనే మనకు కనిపిస్తుంది. నిజానికి ఇక్కడి వివిధ కవులు ఋతువుల గురించి రాసిన పద్యాలన్నీ కలిపి ఒక సంకలనంగా రూపొందిస్తే చాలా బాగుంటుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇక్కడి కవుల ఘోష రెండు రకాలు – ఒకటి ఆత్మ ఘోష మరొకటి ఋతు ఘోష.

ఇంతకు ముందు చెప్పినలాంటి సామాజిక అంశాలతో కూడిన కవితలు అఫ్సర్ “ఊరి చివర” సంకలనంలో దొరుకుతాయి. “మెట్రోబస్ వెనకాల ఒక కితకితల నల్ల సముద్రమేదో అలలలలుగా తుళ్ళిపడుతుంది” అంటూ ఒక నల్ల అమ్మాయిని గురిచి రాసిన కవిత, యుద్ధ వ్యతిరేక కవితలు రాసిన ఇద్దరు మిత్రుల నుద్దేశించి రాసిన యుద్ధ వ్యతిరేక కవిత, హార్వర్డు యూనివర్సిటీలో ఒక ఆఫ్రికన్ ప్రొఫెసర్ మీద జరిగిన దాడికి నిరసనగా రాసిన కవిత వంటివి అనేకం ఇందులో ఉన్నాయి. నాకు బాగా నచ్చిన కవిత ఒక విద్యార్థితో అతని ఊరికి వెళ్ళిన అనుభవాన్ని వర్ణించే Take Me Home, Country Roads అనే కవిత. ఈ కవితల్లో ఇక్కడి నది పేరు, వీధుల పేర్లు, మనుషుల పేర్లు వంటివి వాడటం వలన వీటికొక స్థానికత ఏర్పడుతుంది. అప్సర్ కధకుడు కూడా కావటం వల్ల బహుశా ఇలా చెయ్యగాలిగాడనుకుంటాను. ఆ మధ్య నారాయణస్వామి కూడా క్షవరం చేసే నల్ల అమ్మాయి గురించి ఒక కవిత రాసాడు. ఆ అమ్మాయి లోతైన తడిమెరిసే కళ్ళను బట్టి ఆమెకున్న కష్టాల్ని ఊహించటం ఈ కవితలో ప్రదానాంశం.

రేస్ అన్నది అమెరికన్ సమాజంలో ఎప్పటికీ ముగిసిపోని సబ్జక్టు. మనలో ఎవరైనా ఎదుర్కొన్న వివక్ష గురించో, పైన చెప్పిన పద్యాలలో లాగా ఇక్కడి మైనారిటీల మీద కవికి కలిగిన సానుభూతి గురించో కాకుండా, మనవాళ్ళే కనబరిచే వివక్ష గురించి రాసిన పద్యాలు కొంత ప్రత్యేకమైనవి. మాచిరాజు సావిత్రి కవిత “నలుపు – తెలుపు” ఆటువంటి ఒక ఉదాహరణ. ఈ కవిత నల్లవారి పట్ల మనవాళ్ళుకున్న వివక్షను వివరిస్తూ, నల్లనయ్యని కొలిచేవాళ్ళే క్రమక్రమంగా ఆ దేవుణ్ణి నీలంగా మార్చిటం గురించి, మనం తెల్లవాళ్ళ మీద పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నా తెల్లదనం మీద మనకు తగ్గని మోజు గురించి, మనని మనం తెల్లవాళ్ళకి దగ్గరగా ఊహిచుకొనే బలహీనత గురించి ప్రశ్నిస్తుంది. నేను రాసిన ఈ క్రింది కవిత ఇదే భావాన్ని వ్యగ్యంగా చిత్రిస్తుంది.

చల్లని మధ్యాహ్నం వేళ

down town లో నడక

అంతగా జనసంచారం లేని వీధి.

ఎదురుగా నడుచుకొంటూ ఒక నల్లవాడు

కళ్ళు కలిపి పలకరింపుగా నవ్వాడు

తల దించుకుని వడివడిగా అడుగులు వేసాను.

కొంచెం దూరం పోయి కుదుటపడ్డాక

అటువేపు నుంచే ఒక తెల్లవాడు

కళ్ళు కలిపి పలకరింపుగా నవ్వాను

తల తిప్పుకొని వడివడిగా అడుగులు వేసాడు.

చాలా మంది ప్రవాస కవుల కవిత్వంలో బాల్యం, చిన్నప్పటి ఊరు మొదలైన వాటి గురించిన జ్ఞాపకాలే ఎక్కువగా కనిపిస్తాయి. మనసుని మనం స్వేచ్చాజీవిగా భావిస్తాము గాని, అది బాల్య యౌవనాలనే గొలుసుకి కట్టబడి, ఆ గొలుసు అనుమతించిన పరిమితికి లోబడి మాత్రమే సంచరిస్తుందని నాకనిపిస్తుంది. చాలామంది కవుల ఫార్మటివ్ ఇయర్సు అక్కడే గడిచాయి కాబట్టి అప్పటి జీవితం వారి కవిత్వంలో ప్రతి బింబించటంలో తప్పు లేదు. కాని, ఇప్పుడు సమాచార విప్లవం ప్రభావం వల్ల ప్రస్తుతాన్ని కూడా మానసికంగా అక్కడే గడిపే అవకాశం కలుగుతోంది. ఉండే నేల అమెరికాదే అయినా, ఆకాశం మాత్రం ఆంద్ర దేశంలో ఎక్కడో ఉంటుంది. ఒకచోట నివసించేవారి సాధక బాధకాలు చుట్టపు చూపుగా వెళ్లేవారికి అర్థం కావు. మీడియా ద్వారా లభించే దృశ్యం ఎప్పుడూ పాక్షికమే. అందువల్ల, అక్కడి హెడ్ లైన్లు చూసి, ఇక్కడి నుంచి కవిత్వం రాయటం అర్థంలేని పనిగా తోస్తుంది. అక్కడివాళ్లు విజిటర్లుగా వచ్చో, వినికిడి ద్వారా తెలుసుకొనో అమెరికన్ జీవితం గురించి కవిత్వం రాస్తే ఎంత అసంపూర్ణంగా ఉంటుందో, ఇది కూడా అంతే అసంపూర్ణంగా ఉంటుంది.

సావనీర్ల కోసమో, సంకలనాల కోసమో సరదాగా కవిత్వం రాసేవాళ్ళ రచనల్లో ఇక్కడి తెలుగువాళ్ళ జీవితాన్ని, లేదా మొత్తంగా అమెరికన్ జీవన విధానాన్ని విమర్శించే కవితలే ఎక్కువగా ఉంటాయి. పాలన రాసిన క్రింది పాటలాంటిది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది వంగూరి ఫౌండేషన్ వాళ్ళు ప్రచురించిన అమెరికా తెలుగు కవిత మొదటి సంకలనంలో చేర్చబడింది :

“చికాకెత్తి పోయినాదే ఈ చికాగో బతుకూ

చికాకుల మెల్తానే సెల్లీ సిల్లచ్చీ ….

దుంపల ఏయింపులూ, కొంపల సూపింపులూ,

తలుపుల తెరిపింపులూ దుకానాల్ల మురిపింపులూ,

పగటేసాల పెయింటింగులూ, పిజ్జాల యీటింగులూ

అనుబవించేసినానే!

రుచి చూసేసినానే సెల్లీ సిల్లచ్చీ ….”

అయితే, విమర్శగానో, వెక్కిరింతగానో కాకుండా, ఈ నేల మీద మమకారంతో, ఏ విలువల ఆధారంగా ఈ దేశం నిర్మించబడిందో ఆ విలువల మీద గౌరవంతో, నిజమైన అమెరికన్ డ్రీమ్ కోసం జీవించటానికి మరొక తరం పడుతుంది. ఆ తరం వారు దీనినే మాతృదేశంగా భావిస్తారు కాబట్టి వారికది సాధ్యమవుతుంది. వారిలో కొద్దిమందిలోనైనా కవిత్వ కాంక్ష మిగిలి, ఎవరైనా కవిత్వం రాస్తే, అది ఇంగ్లీషైనా, మన అదృష్టవశాత్తు తెలుగైనా, అందులో విభిన్నమైన ప్రవాస కవిత్వం చూడగాలుగుతామేమో!

చివరిగా నేను చెప్పే విషయం ఏమిటంటే, కవి తన ప్రత్యేక దృష్టిని, కవిత్వం మీద తనకున్న నిజాయితీని, కవిత్వం ద్వారా తను చెయ్యాలనుకున్న సత్యాన్వేషణని వదులుకోనంత కాలం, ఆ కవి ఎక్కడున్నా మంచి కవిత్వం రాయగలుగుతాడు. ఆ అవకాశం ప్రవాస కవులకి తగినంతగా ఉంది. ప్రవాసం వల్ల ఏర్పడిన వియోగభారం బాధిస్తుంది గాని, అదే సమయంలో దానివల్ల కొన్ని వత్తిడులు, ప్రభావాలు దరిచేరకుండా కవిత్వం రాసుకో గలిగే వెసులుబాటు కూడా కలుగుతుంది. దీనిని సద్వినియోగ పరుచుకొని, ప్రవాస కవులు తమ ప్రత్యేకతను కాపాడుకొంటారని, విలువైన, సాంద్రమైన కవిత్వాన్ని పెంపొందదించటంలో తమ వంతు పాత్రను పోషిస్తారని ఆశిస్తాను.

 -విన్నకోట రవిశంకర్

64681_101182536614807_2154683_n

 

 

 

 

 

 

మీ మాటలు

  1. మీ వ్యాసం ప్రవాస కవిత్వాన్ని పరిమళింప చేసింది.మహా కవులు కూడా మాములూ మనుషులేగా.వారి అభిప్రాయాలు వారిలోనే వారితోనే వుంచుకోనివ్వండి.మట్టి మనిషి ఈ రెండింటిని మరిచిపోనిది ఏ దైనా మంచి కవిత్వమే.

మీ మాటలు

*