పొద్దుటి పూట పిల్లలు

పొద్దున్నే
తల్లి వొడిలోంచి పిల్లలు మొలకెత్తుతారు
చీకటి
వెలుతురు చాలు పోస్తున్నట్టు
నాలుక నూగాయలోంచి
మాటల విత్తనాలు రాలుతాయి
తెల్లారుజాము, తల్లి వొడి
పసివాళ్లకు
ఆకాశమంత మాటలను నేర్పుతాయి
మాటలు
నదీపాయల మీద మంచుతుంపరలు రాలుతున్నట్టు
తెల్లని పావురాల్లాంటివవి –
ఎక్కడో కొండల్లో
గుప్పుమని కొండపూలు వికసించినట్టు
రెక్కలు విప్పుకున్న
తాజా మాటల పూలు అవి –
వెలుతురు గర్భకుటీరంలాంటి
తెల్లారిజామునే
పిల్లలు
మంత్రమేసినట్టు
మాటలుగా మారిపోతారు
తల్లి వెచ్చని పొత్తిళ్లకు అంటుకుని
నిద్రించి..
మళ్లీ కొత్తగా సరికొత్తగా ఉదయం ఉదయించినట్టు –
అంతా మాటలే
మాటల వనమే –

మాటలను,
స్వచ్ఛమైన తేనెలాంటి మాటలను
ఏరుకోవాలంటే

ఉదయాల్లోకి
పిల్లలున్న యిల్లల్లోకి వెళ్లాలి
పిల్లలున్న యిల్లు
మాటలు ప్రవహించే జీవనది

పొద్దున్నల్లంట –
పిల్లలే కాదు
తల్లులూ మొలకెత్తుతారు
క్షణక్షణానికీ
జీవించడాన్ని మరచిపోతున్న
పెద్దోళ్లంతా పలవలు పలవలగా
మొలకెత్తుతారు
నిన్నటి జీవనవిషాదాన్నంతా కడిగేసే
మాటల అమృతాన్ని
దోసిలి నిండుగా తీసుకుని
హృదయం నిండుగా
నింపుకుంటారు

-బాలసుధాకర్ మౌళి

బాలసుధాకర్ మౌళి

మీ మాటలు

 1. ఉదయాల్లోకి
  పిల్లలున్న యిల్లల్లోకి వెళ్లాలి
  పిల్లలున్న యిల్లు
  మాటలు ప్రవహించే జీవనది
  ……………………………………..చప్పట్లు …చప్పట్లు

 2. ఉదయాల్లోకి
  పిల్లలున్న యిల్లల్లోకి వెళ్లాలి
  పిల్లలున్న యిల్లు
  మాటలు ప్రవహించే జీవనది

 3. తల్లులూ మొలకెత్తుతారు ఆ పాదం చాల బాగుంది. నిజంగా పిల్లలున్న ఇల్లును అద్భుతంగా వర్ణించారు.

 4. గుడ్ పొయెమ్

మీ మాటలు

*