మూడవ దారే శరణ్యమా?

karalogo

నిర్వహణ: రమా సుందరి బత్తుల

కథాకాలానికి డెభై అయిదేళ్ళున్న సుభద్రమ్మకి ఆమె భర్త రామభద్రయ్యతో అరవై ఏళ్ళ సాహచర్యం. పథ్నాలుగేళ్ళ ప్రాయంలో అతనింట్లో మెట్టి అతని కోపపు కేకలకు తడబడి గుమ్మాలకు కొట్టుకుని పడబోయి అత్తగారి ఆదరణతో నిలదొక్కుకుని, ఆవిడ ప్రేమలోనూ భర్త కనుసన్నలలోనూ మెలిగి వాళ్ళ అభిప్రాయాలే తనవిగా చేసుకుని ఏడుగురు బిడ్డల్ని కని పెంచింది. ఆ అరవై ఏళ్ళలోనూ ఎవరింట్లో నైనా చుట్టపు చూపుగానో పని గడుపుగోడానికో కొద్ది రోజులు మాత్రమే వుండేది కానీ, శాశ్వత నివాసం ఆ పల్లెలోనే. తను మెట్టిన ఇంట్లోనే. అటువంటి సుభద్రమ్మకు ఆమె భర్త పోయిన పదిహేను రోజులకే తను ఎక్కడుండాలనే ప్రశ్న ఎదురైంది. ఎక్కడుంటే ఆమెకు సౌకర్యం, ఎక్కడుంటే ఆమెకు కాస్త ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ అని కాక ఆమె ఎక్కడుండడం ధర్మం అనే చర్చ వచ్చింది. ఎక్కడుండడం అని కూడా కాక ఎవరి దగ్గర వుండడం అని.

“ఇన్నాళ్ళూ నాన్నగారి బాధ్యత నీ మీదుంది. ఆయన ఇల్లు విడిచి రానన్నారు. ఏమీ చెయ్యలేక ఊరుకున్నాను. ఇప్పుడు నువ్వు నాదగ్గరుండడం ధర్మం” అన్నాడు పెద్దకొడుకు. “తమ్ముడిని కూడా అడగాలి కదా!” అందావిడ అప్పుడు. ఆడపిల్లలు పెళ్ళి చేసుకుని అత్తవారిళ్ళకు పోగా, తక్కిన కొడుకులు ఉద్యోగాల కోసం వేరే ఊళ్ళలో ఉండగా మూడో కొడుకు మాత్రం వున్న వూళ్ళోనే పొలం చూసుకుంటూ వుండిపోయాడు. వుంటే తనిప్పుడు మూడో కొడుకు దగ్గర వుండాలి. లేదా పెద్ద కొడుకుతో వుండాలి. ఒక చోటు ఎంచుకుని వెళ్ళి తరువాత ఇంకోచోటుకి వెడితే బాగుంటుందా? గౌరవంగా వుంటుందా?

ఆమె భర్త రామభద్రయ్యకు కాశీ యాత్ర చెయ్యాలనే సంకల్పం ఆయన జీవితంలో నెరవేరలేదు. మూడుసార్లు బయలుదేరి ఏదో ఒక అడ్డంకితో ఆగిపోయాడు. నాలుగోసారి ఆవిడే అడ్డం కొట్టింది. ఎందుకంటే తాము కాశీ వెళ్ళడం భగవంతుడికి ఇష్టం లేదనీ ఈసారి కూడా ఏదో అడ్దంకి వస్తుంది కనుక అసలు బయలుదేరవద్దనీ… ఆపైన వయసు మీదపడిన రామభద్రయ్య తనంతట తనే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆయన పోయాక ఆయన అస్థికలనైనా గంగలో నిమజ్జనం చెయ్యాలని ఆయన పిల్లలు నిర్ణయించారు. ఆమె కూడా వెళ్ళాలని అర్థించారు. ఆయన పక్కన లేకుండా ఈ విధంగా వెళ్లవలసి రావడం ఆమెకి కష్టంగానే వున్నది. కాశీవచ్చాక కూడా ఆమె మనసు స్థిమితంగా లేదు. అనంతమైన రైలు ప్రయాణం చేసి వచ్చిందిక్కడికి. తను తిరిగి ఇంటికి వెడుతుందా? భగవంతుడి సంకల్పం ఎట్లా వుందో?

ఈ ఆలోచన ఆమెకి ఇప్పుడు వచ్చింది కాదు. రామభద్రయ్య మంచాన పడ్డప్పుడు పిల్లల ప్రవర్తనల్లో ఆమె కనిపెట్టిన మార్పు ఇటువంటి ఆలోచనకు బీజం వేసింది. ఆయనను వాళ్ళు గౌరవించాల్సినంతగా గౌరవించడం లేదనిపించింది. చెయ్యీ కాలూ సరిగా వున్నంతవరకూ వుండే గౌరవం తరువాత వుండదు. అందుకే ఆయన పోయాక ఇంక తను బ్రతకవద్దు అనుకుంది. ఊళ్ళో ఎన్ని నూతులు లేవు కనుక అనుకుంది. కానీ ఆయన పోయాక ఆ పన్నెండు రోజుల్లో పిల్లలు ఆమె మీద చూపించిన ప్రేమాదరాలు మళ్ళీ ఆమెని ఆ ఆలోచనను కాస్త దూరం పెట్టేలా చేశాయి కానీ కాశీ లో అట్లా కాదు. మళ్ళీ అవే ఆలోచనలొస్తున్నాయి. అచ్చమైన సంప్రదాయ మధ్య తరగతి గ్రామీణ కుటుంబంలో పుట్టి, ప్రేమా గౌరవమూ అంటే భయభక్తులేననే నమ్మకంతో జీవించిన సుభద్రమ్మకి, తను తన అత్తగారి పట్ల చూపించిన భయభక్తులు తన కోడళ్ళు తనపట్ల చూపడం లేదని దుగ్ధ. వాళ్ల పద్ధతులు ఆమెకి నచ్చవు. తనకీ తన అత్తగారికీ మధ్య వున్న సామీప్యం తన కోడళ్ళకు తనతో లేదని అసంతృప్తి. రామభద్రయ్య జీవించి వుండగా అతనిపట్ల అందరూ గౌరవం చూపించాలని ఆరాటపడి అట్లా అందరి వెంట పడేది ఆవిడ. ఆయన మంచాన పడ్దాక చూపేవారు చూపేవాళ్ళు. లేనివాళ్ళు లేదు. అంతవరకూ తండ్రి కనుసన్నలలో నడిచిన మూడవ కొడుకు కూడా ఆయన్ని అడక్కుండానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇదంతా గమనించింది ఆవిడ.

కాశీలో పెద్దకొడుకు ఆమెతో అనేక విషయాలు మాట్లాడాడు. తన కుటుంబం సంగతి, తన కొడుకూ కోడళ్ల సంగతి. తన భార్య సంగతి. ఒక కుటుంబంలో భిన్నాభిప్రాయాలుంటాయని వినడం సుభద్రమ్మకి ఇదే మొదలు. తన కొడుక్కీ కోడలికీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఏమిటో ఆమెకి అర్థంకాదు. ఏదో ఆపద ముంచుకొస్తున్నట్లు ఆమె గుండెలు దడదడలాడాయి.

కొడుకు చాలా చెప్పాడు. కొడుకు గొంతుతో రచయిత చెప్పిన మాటలు ఇవి.

ఇటువంటి ఘర్షణలు ….. నాయకత్వం యాజమాన్యం, పెద్దరికం వంటివి ఏర్పరుచుకున్నాక .. తరం మారి కొత్త తరం తలెత్తినప్పుడల్లా – వస్తూనేవున్నాయి. పెద్దరికం కోసం, నాయకత్వం కోసం పడుచుదనం పెద్దతరాన్ని సవాలు చేస్తూనే వుంది……. అనాదిగా జరుగుతున్న ఈ తరాల సంఘర్షణ గురించి, అందులో మనిషి పడే హింస గురించీ సుదర్శనం (పెద్ద కొడుకు) ముందే కొంత విన్నాడు. తన చుట్టూ సాగుతున్న ఘర్షణని గుర్తించడానికి, దాని పోకడ అర్థం చేసుకోడానికీ. ఆ వినికిడి కొంత ఉపయోగించింది….పోకడ అర్థం అయింది కానీ నివారణోపాయమే అర్థం కాలేదు. అట్టే ఆలోచిస్తే ఇది తప్పనిసరే కాదు, అనవసరమేమో కూడా! అధికారాలకీ అదిచ్చే సౌకర్యాలకీ అలవాటుపడ్ద ముందు తరం తనకు తానుగా వాటిని వొదులుకోలేదు. ఆ తరంలో లుప్తమైపోతున్న ఉత్సాహం, సామర్థ్యం తమలో ఉరకలు వేస్తుంటే కళ్ళాలు తమ చేతిలోకి తీసుకోడానికి కొత్త తరం ఉద్రేక పడక తప్పదు. ఈ విధంగా ప్రగతి కోసం ఘర్షణ అనివార్యం. ఇవ్వన్నీ తల్లికీ, భార్యకీ అర్థమయేలా చెప్పాడతను. అందుచేత రెండేళ్ళల్లో రిటైరవబోయే అతను తల్లితో పల్లెటూరిలో ఉండడానికి నిర్ణయం   తీసుకున్నాడు. డబ్బు ఖర్చుపెట్టడం విషయంలోనూ, సంపాదించడం విషయంలోనూ తరానికీ తరానికీ భిన్నమైన అభిప్రాయాలుంటాయి. ఆ విషయాన్ని పూర్తిగా ఆమోదించలేని అతని భార్య శకుంతల, డబ్బు దూబరా చేసే కోడలికి సంసారం అప్పజెప్పి అతనితో రాలేనంటుంది. అందుగురించి ఇద్దరూ వాదించుకుంటారు. కొడుకు చెప్పింది అర్థంచేసుకోడానికి ప్రయత్నించింది సుభద్రమ్మ. పదే పదే ఆమె ముందు రామభద్రయ్య మూర్తి ప్రత్యక్షం అవుతోంది. తనముందు మూడు దారులున్నాయి. ఒకటి పెద్దకొడుకుతో వెళ్ళి వుండడం. అక్కడ వాళ్ళింట్లో ఎవర్నీ పూర్తిగా ఎరగదు. వాళ్లల్లో వాళ్లకే అభిప్రాయ భేదాలున్నాయి. రెండవది మూడో కొడుకు దగ్గరుండడం. మొదట్నించీ తను ఆ కుటుంబంలో భాగం, ఆ ఊళ్ళోనూ భాగం. కానీ ఎవరిని కాదని ఎవరితో వుంటే ముందుముందు ఏ చిక్కుల్లో పడుతుందో తెలియదు. ఒకసారి మూసుకున్న తలుపులు మరొకసారి తడితే తెరుచుకుంటాయా? ఎటూ తేల్చుకోలేకపోయింది. ఆమెకి అన్నిటికీ పరిష్కారంగా మూడో దారివుంది. కానీ అది గౌరవంగా బ్రతుకుతున్న పిల్లల్నిఏ చిక్కుల్లో పడేస్తుందో అనే భయం ఎటూ తోచని స్థితి. ఇక అంతా సర్వేశ్వరుడిదే భారం అనుకుంది.

అస్థి నిమజ్జనం సమయంలో ఆమెకి మళ్ళీ రామభద్రయ్య మూర్తి కనిపించింది. నడివయస్సులో వుండే రామభద్రయ్య మూర్తి. చెంగులు ముడి వేసుకుని చెయ్యవలసిన సరిగంగ స్నానం ఇలా అస్థికలతో చెయ్యవలసి వచ్చింది అనుకుంది. అస్థి నిమజ్జనం తరువాత మూడు సార్లు గంగలో మునగమన్నారు. ఆమె సూర్యభగవానునికి నమస్కారం చేసి చివరిగా మరో మునక వేసింది. ఆ మునక తరువాత పెద్దగా అలలు లేచాయి. మునిగిన ఆమె లేవలేదు. మనుషులొచ్చి బయటికి తీశారు. ఎక్కువ నీళ్ళు తాగలేదు కనుక బ్రతికింది. మూడోదారి మూసుకుపోయినట్లే. మరి సుభద్రమ్మ ఇప్పుడెక్కడెక్కడుండాలి? అరవై ఏళ్ళు అలవాటుపడిన ఇల్లు ఆమె స్వంతం కాదా? కొడుకు తప్ప కోడలూ ఆమె పిల్లలతో ఏ మాత్రం సామీప్యం లేని ఇంట్లోనా? నేనిక్కడే వుంటాను ఎక్కడికీ రాను అని రామభద్రయ్యలా ఆమె అనలేక పోతోంది, ఎందుకు? స్త్రీ కావడం వల్లనా? ఇట్లా ఎన్నో ఆలోచనలు వస్తాయి పాఠకులకు.

ఆర్జనాశక్తీ ఉత్సాహం తగ్గిపోయాక హుందాగా పెత్తనాన్ని బదలాయించే బాధ్యత ఎరిగిన సుదర్శనం కథా? మొదటినించీ భయభక్తులతో మెలిగి చివరికి ఎక్కడుండాలో తేల్చుకోలేని సుభద్రమ్మ కథా? అధికారం కోసం రాజకీయాలలో జరిగే రక్తపాతం లాగే కుటుంబాలలో కొనసాగే మౌన హింస కథా? అన్నిటినీ స్పృశించిన ఈ కథ చాలా పెద్దది. తరాల అంతరాలు, గ్రామీణ జీవనం, స్త్రీల అధీనత. అందులోనే తోటి స్త్రీలపై ఆధిక్యం కోసం ఆరాటం. సంప్రదాయ క్రతువుల వర్ణనా అన్నీ కలిసి ఒక గ్రామీణ అగ్రకుల మధ్యతరగతి జీవితాన్నీ, అందులో స్త్రీల నిస్సహాయతనూ బాగా పట్టుకుని వ్రాసిన కథ. చాలాకాలం విరామం తరువాత మేస్టారు వ్రాసిన పెద్ద కథ.

-పి. సత్యవతి

image

పి. సత్యవతిగారు సాహిత్య లోకానికి నలభై ఏళ్ళనుండి చిరపరిచితులు. సత్యవతి కధలు, ఇల్లలుకగానే, మంత్ర నగరి, మెలుకువ అనే నాలుగు కధల పుస్తకాలను ప్రచురించారు. మొదటి, రెండవ తరాల ఫెమినిష్టుల గురించి రాసిన  ‘రాగం – భూపాలం’ అనే వ్యాస సంపుటి సత్యవతిగారి కలం నుండే వచ్చింది. ‘మా నాన్న బాలయ్య’, ‘ఇస్మత్ చుగ్తాయ్ కధలు’ ‘ఒక హిజ్రా ఆత్మ కధ’ లాంటి మంచి పుస్తకాలను ఆంగ్లం నుండి అనువాదం చేసి తెలుగు పాఠకులకు అందించారు. సమకాలీన సాహిత్యాన్ని నిత్యం చదువుతూ తన ఆలోచనలను, రాతలను సజీవంగా నిలుపుకొంటున్న సత్యవతిగారు నేటి యువ సాహితీకారులకు ఎందరికో ఇష్టులు.

వెంకటకృష్ణ  “వీరుడూ – మహా వీరుడు” కధను గురించిన  పరిచయం

 

 

‘సంకల్పం” కథ ఇక్కడ:

మీ మాటలు

  1. సత్యవతిగారు నా అభిమాన రచయిత్రి.ఆమెని ఎన్నడూ చూడలేదు.కా.రా.మాస్టారికధ వీరి పరిచయం లో ఎప్పటిలాగే మరింత ఆసక్తికరంగా వెంటనే చదవాలనిపించేలా వున్నది.మీ పత్రిక ద్వారా ఆమెని చూడగలిగినందుకు,మంచి కధ గురించి ఆమె మాటల్లో తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా వున్నది.

  2. N Venugopal says:

    సత్యవతి గారూ,

    బాగుంది. కాని మీ నుంచి మరి కొంత ఆశించాను.

    ‘సంకల్పం’ కేవలం కుటుంబ జీవితంలోని హింస గురించిన కథ మాత్రమే కాదని, తరాల అంతరాల ఘర్షణ గురించి, ఈ కథ ప్రచురణ నాటికి మాస్టారికి సన్నిహితమైన రాజకీయాలలో సాగుతున్న అంతర్గత అంతరాల ఘర్షణకు ప్రతీకాత్మకమని అప్పట్లో ఎవరో అనడమో, రాయడమో జరిగింది. మాస్టారు కూడ ఆ వ్యాఖ్యానాన్ని మౌనంగా (ఎప్పట్లాగే!) ఆమోధించినట్టున్నారు… మొత్తానికి ఈ చెప్పిన కథ కన్న చెప్పని కథ మించినదేమోనని….

  3. అజీవితం ధికార కాంక్ష ,రాజకీయమైన చోట కుటుంబాలలో మౌన యుద్దాలేమిటి మారణ హోమాలు జరుగుతాయి. సమాజ లో ఆది పత్య భావానికి కుటుంబమే కదా పుట్టినిల్లు? మా అబి మాన రచయిత్రి గారి విశ్లషణ చాలా బాగుంది.

మీ మాటలు

*