సముద్రానికి కోపం వచ్చింది!

 varavara.psd-1

సముద్రానికి కోపం వచ్చింది. నేను చాల ఇష్టపడే సముద్రానికి. నను ప్రేమించిన సముద్రానికి.

సముద్రానికి కోపం వచ్చింది. నీళ్లను ఆక్రమించినవాళ్ల మీద. తీరాన్ని దోచుకున్నవాళ్ల మీద. ఇసుక తోడుతున్నవాళ్ల మీద. చెట్లు కొట్టేసే మనుషుల మీద కోపం వచ్చి చెట్లన్నీ ఊడ్చేసింది. గాలికి తలుపులు మూసుకునే వాళ్ల తలుపులు విరగదన్నింది. మనుషుల్ని పెద్ద మనసుతో క్షమించి ఆస్తుల్ని ధ్వంసం చేసింది.

సముద్రానికి కోపం వచ్చింది. నేను నిష్కారణంగా నవయవ్వనం నుంచి ప్రేమిస్తున్న సముద్రానికి. నేను తనలో ప్రకృతినీ, మనిషినీ పోల్చుకుని ప్రేమించిన సముద్రానికి.

నేనింకా ఎం.ఎ. లో, తాను బి.ఎ. లో ఉండగా నేనూ నా ప్రాణస్నేహితుడు పిచ్చిరెడ్డీ జీవితంలో ముగ్గుర్ని చూడాలనుకున్నాం – చలం, శ్రీశ్రీ, సముద్రం. మా పిచ్చి భరించలేని స్నేహ బృందం మూడూ కలిసొచ్చేలా 1961లో మమ్మల్ని అరుణాచలం పంపించారు. అప్పుడు మొదటిసారి మద్రాసు సముద్రాన్ని చూసాం. శ్రీశ్రీని ఆయన ఇంట్లో చూసాం. చలాన్ని రమణస్థాన్ లో.

సముద్రాన్ని దాని సార్థక అర్థంలో శ్రీశ్రీ అరవై ఏళ్ల సభలో 1970లో విశాఖలో చూసాను. ఇంక అప్పటినుంచీ విశాఖ సముద్రం నన్ను ఆవహించింది. సీసాండ్స్, సిరిపురం క్వార్టర్స్, ఏరాడ కొండ, భీమ్లీ, విజయనగరం, శ్రీకాకుళం దాకా బీచ్ రోడు. హెమింగ్వే ‘ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ ని తలపించే చలసాని ప్రసాద్ నలభై నిమిషాలు ఈదిన లాసన్ బే పాయింట్ భయం గొలిపే సుడిగుండం దరి. విరిగిపడుతున్న కెరటాల మధ్యన రాళ్లపై కూర్చొని ‘సముద్రం’ చదువుతూ దృశ్యీకరించుకోవాలని తీర్చుకున్న కోరిక.

సముద్రం ఒక భావన నుంచి నాలో అక్షరాకృతి దాల్చడం 1981లో ప్రారంభమైంది. కలకత్తా నుంచి వచ్చి విశాఖలో దిగి సీసాండ్స్ లో కృష్టక్కతో చెప్పి ఒక్కణ్నే సముద్రం దగ్గరికి వెళ్లి మధ్యాహ్నం దాకా కూర్చున్నాను.

నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ

నా రక్తం ప్రతిధ్వనిస్తున్న సముద్ర నిశ్వాసాన్నీ

నా ఊపిర్లు ప్రతిస్పందిస్తున్న సముద్ర విశ్వాసాన్నీ విను.

విచిత్రంగా రెండవసారి ఉస్మానియా రీసర్చ్ స్కాలర్స్ హాస్టల్ లో గుడిహాళం రఘునాథం రూంలో సముద్రం నన్ను ఆవహించింది. మా మేనల్లుడు కొండన్న (రామగోపాల్), ఇంకా కొందరు విద్యార్థులు కలిసి అర్ధరాత్రి గడిచాక తార్నాకకు వెళ్లి ఎప్పటివలెనే చాయ్ తాగి వస్తున్నాం. ఎబివిపి వాళ్లు చూపింది నన్నయితే, నా వెనుక బ్యాచ్ లో వస్తున్న రీసర్చ్ స్కాలర్ రామకృష్ణపై కత్తితో దాడి చేసారు దుండగులు. అది మాకు హాస్టల్ కు చేరాకగానీ తెలియలేదు. ఆ రాత్రంతా సంచలనం. హల్ చల్. నేను రఘునాథం రూంలో పడుకున్నాను. పడుకోలేదు.

గదిలో కూర్చొని సముద్రాన్ని రాయబోతే

కాళ్ల కింద నీళ్లు

సముద్రపు మంటలాగ కళ్లల్లో నీళ్లు

ప్రజాసముద్రపు బాధల్లాగ.

‘శ్రీకాకుళాన్ని నెమరేసే కరీంనగర్ లాగ’ అని వాచ్యం అయిపోయావు అన్నాడు ఆ తర్వాత కాలంలో శివసాగర్. అది సముద్రం 2 ‘అగాథ సముద్రం’.

1982 ఆగస్టు నాటికి సముద్రం నన్ను మనిషయి ఆవహించింది.

‘సముద్రం నా వ్యసనమైంది.

సముద్రం నా గాయం, నా అవ్యక్త గేయం’ అయింది.

కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో పులి అంజయ్య నాయకత్వంలో రాడికల్స్ కూ ఎబివిపికీ ఘర్షణలు. బయట నర్సంపేట, నల్లబెల్లిల నుంచి హనుమకొండ కుమార్ పెల్లి దాకా జన్ను చిన్నాలు స్ఫూర్తి కేంద్రంగా రాడికల్స్ కూ సిపిఎం వగైరా రాడికల్ వ్యతిరేక శక్తులకూ ఘర్షణల మధ్య నా కాలేజికి రాకపోకలు మాత్రమే కాదు, ఇంట్లో ఉండడం కూడ ఉద్రిక్తంగా మారిన రోజుల్లో రాసిన కవిత ‘సముద్రం నా తీరం.’

‘నేను సముద్రంలోనే ఉన్నాను’ కాని ‘నేనింకా సముద్రాన్ని కాలేకపోతున్నాను.’

భూమిహారులు నన్ను సముద్రంలో పోల్చుకున్నారు

యుద్ధం నేను ఏ పక్షమో తేల్చుకుంది

సముద్రం ఆటుపోట్లలోని

అలను నేను కలను నేను కలతను నేను

గొప్పశాంతి కోసం మహా సంక్షోభంలో

స్వేచ్ఛను కోల్పోయిన సముద్రాన్ని నేను

సముద్రం స్వేచ్ఛలో సత్యమైన స్వేచ్ఛలో

స్వేచ్ఛను వెతుక్కుంటున్న నీటి చుక్కను నేను (సముద్రం -5)

మళ్లీ అటువంటి మానసిక స్థితిలోనే ఇవ్వాళ నన్ను ‘సముద్రం’ ఆవహించింది.

1977లో దివిసీమలో ఉప్పెన వస్తే డాక్టర్ రామనాథం నాయకత్వంలో మేం వెళ్లాం. ఆయనతోపాటు వెళ్లిన మనుషుల, పశువుల డాక్టర్లు నెలరోజులపాటు అక్కడ శిబిరాలు నిర్వహించారు. ఆ వివరమైన రిపోర్ట్ ‘సృజన’ ప్రచురించింది.

అప్పటికి ప్రభుత్వానికి ‘కల్లోలిత ప్రాంతాలు’ ప్రకటించడం, ఎన్ కౌంటర్లు చేయడం, ఎమర్జెన్సీ పెట్టడం తెలిసినంతగా ఉప్పెనకూ తుపానుకూ మధ్య ఉండే తేడా ఏమిటో తెలియదు. అందువల్ల వేలాదిమంది మరణించారు. కాని మత్స్యకారులు సాహసోపేతంగా ఉప్పెనతో పోరాడి వందలాది మందిని బతికించారు. ప్రజలు పోరాడి హక్కులు సాధించుకున్నారు.

ఇప్పటి ప్రభుత్వాలు ఎన్ కౌంటర్ల నుంచి కోవర్టు హత్యల దాకా తెలివిమీరాయి. అప్రకటిత ఎమర్జెన్సీ అచిరకాలం అమలు చేయడం నేర్చుకున్నాయి. సముద్రంలో తాము సృష్టించిన సంక్షోభానికి ‘హుదూద్’ అని పేరు పెట్టి పక్షిమీదికి తోసేయడం నేర్చుకున్నాయి. మనుషుల్ని అప్రమత్తుల్ని చేసి కాపాడిన పొగడ్తలు తెచ్చుకున్నాయి.

అప్పుడూ ఇప్పుడూ మనుషులు, సామాన్య మానవులు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో పరస్పర స్నేహ సహకారాలతో తమను తాము సంరక్షించుకుంటున్నారు.

ఏమున్నది సముద్రం

నీళ్లూ ఉప్పూ ఉప్పెనా తప్ప

ఏమున్నది జీవితం

చీమూ నెత్తురూ పోరాటం తప్ప.

– వరవరరావు

మీ మాటలు

  1. c.kaseem says:

    నా బాల్యంలో సముద్రాన్ని పుస్తకాల్లో చదవడమే కాని చూసింది లేదు .నేను మొదటిసారి సముద్రాన్ని,kvr ను కావలి విరసం సభల్లో చూశాను .అంతకు ముందు మీ సముద్రాన్ని చదివాను . అంటే నా మొదటి సముద్రం మీదే.

మీ మాటలు

*