వేళ్ళ గులాబీలు

 15-tilak
కొత్తగా ఒక చితి
చేతి వేళ్ళ మీద నుండి తెగిపడుతూ గోర్ల శవాలు భూమి నిండా
నువ్వో నేనో తొక్కుతాం వాటి నీడలనో
పదునుగా కనిపించే తలల తనువులనో
ఇన్నాళ్ళు అందంగా పెరిగి
నీ నుండి ఒక్కసారే అలా విడివడడం కొత్తేమి కాదు వాటికి
ఆకులను పువ్వులను తాకుతూ ఇన్నాళ్ళు నీలో నుండి
తడియారని ఒక పచ్చిక ముఖాలకు పులుముకుంటూ ఉండని రోజులను నదుల్లో గదుల్లో దాచుకోవడం కూడా అలవాటే
చీము నెత్తురుతో సహవాసం చాన్నాళ్ళ కిందదే
స్పర్శ తెలియని అనుభూతి
అలంకారమో
మరోటో
గీసిన గీతలు ఒకచోట మొదలయి ఎక్కడికో తప్పిపోవడం గమనించనేలేదు నువ్వు
వాటి ఆనవాళ్ళను ఇక్కడే ఎక్కడో పారేసుకున్నావు
సరిగ్గా వెతుకు మరోక్షణం
నీ ఆలోచనలను విస్తరింపజెయ్యి
గులాబీ రెమ్మలు కొన్ని
వర్షంలో పూర్తిగా తడిసిపోయాక స్పృశించుకోవడం ఎంత బాగుంటుంది
అవింకా మన మధ్య ఆరని మరీచికలేగా ఎప్పుడూ
అద్దుతూ
ఈదుతున్న పరాన్న జీవులేగా ఇప్పటికీ వేలు వేలు చివరనా.
                                                  -తిలక్ బొమ్మరాజు

మీ మాటలు

  1. సాయి కిరణ్ says:

    వేళ్ళకి పూసిన గులాబీల గురించి ఎంత బాగా చెప్పారో
    స్పర్శ తెలియని అనుభూతి అలంకారం !
    ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో !

  2. నిశీధి says:

    స్పర్శ తెలియని అనుభూతులు ఎన్నో మీ పదాలు చదవగానే మనసుని తట్టి వెళ్తాయి . kudos .

మీ మాటలు

*