ఫ్లారెన్స్ టు పీసా!

 image1

నాకు ఎప్పటినించో ఫ్లారెన్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ వున్న చారిత్రాత్మక ప్రదేశాలని చూడాలని కోరికగా వుండేది. ఎందుకంటే, ఆ ప్రదేశం ‘రెనెసాన్’ ఉద్యమం పుట్టిన ప్రదేశం. ‘రెనెసాన్’ కాలంలో వెలిగిపోయిన చిత్రకళా వైభవం, శిల్పకళా సౌందర్యం మనమిక్కడ ఇంకా చూడవచ్చు. రొమ్ నగరంలోలా కాకుండా, ఇక్కడ వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు.

ఫ్లారెన్స్ దగ్గరే వున్న పీసా కూడా చూస్తే, ఒకే దెబ్బకు రెండు పిట్టలనుకుని, రైల్లో ఫ్లారెన్స్ వెళ్ళాం. ముందుగానే అక్కడ ఏమేం చూడాలో తెలుసుకున్నాం కనుక, వెళ్ళగానే ఇక రంగంలోకి దిగాం.

ముందుగా ఫ్లారెన్స్ చరిత్ర కొంచెం తెలుసుకుందాం.

ఫ్లారెన్స్ క్రీస్తు పూర్వం 80వ శతాబ్దంలోనే ఫ్లుయంషియా అనే పేరుతో రోమన్ సామ్రాజ్యంలో ఒక ప్రాంతంగా వుండేది. దరిమిలా అది ఫ్లొరెంషియాగా పేరుపడింది. అదే ఈనాటి ఫ్లారెన్స్.

ఫ్లారెన్స్ 14-16 శతాబ్దాలలో, ఇటాలియన్ రెనసాన్ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించింది. సాంస్కృతిక పరంగానే కాకుండా, రాజకీయ, ఆర్ధికపరంగా కూడా ఫ్లారెన్స్ ఎంతో ప్రముఖంగా వున్నది. మతపరంగా సరేసరి!

ఆ రోజుల్లోనే ఫ్లారెన్స్ ప్రాంతం, యూరప్లోని ఎన్నో దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. బ్రిటిష్ సామ్రాజ్యం వారి ‘వంద సంవత్సరాల యుద్ధానికి’ కూడా పెట్టుబడి పెట్టింది.

ఈ దేశ చరిత్ర గురించి ఇంకా ఎక్కువగా వ్రాయటం లేదు. శ్రీశ్రీ అన్నట్టు ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, పర పీడన పరాయణత్వం..’ అని. కాకపొతే ముఖ్యమైన కొంత ఉపోద్ఘాతం, తరువాత ఈనాడు అక్కడ మనం చూడగలిగే కళాత్మక విశేషాలు మాత్రం చెబుతాను.

ఫ్లారెన్స్ ఇటలీలోని టస్కనీ ప్రాంతానికి రాజధాని. టస్కనీ ప్రాంతంలో వున్న ఫ్లారెన్స్ రాష్ట్రానికి కూడా ఇదే రాజధాని. 102 కిలోమీటర్ల (40 చదరపు మైళ్ళ) వైశాల్యం. సముద్ర మట్టానికి 50 మీటర్ల (160 అడుగుల) ఎత్తున వుంది. ఇక్కడ జనాభా మూడున్నర లక్షల పైన. ఫ్లారెన్స్ మెట్రో ప్రాంతం కూడా కలుపుకుంటే ఒకటిన్నర మిలియన్లు. అంటే 15 లక్షలు. ప్రపంచం నలుమూలలనించీ ఇక్కడికి సంవత్సారానికి 18 లక్షల నించీ, 20 లక్షల మంది దాకా యాత్రీకులు వస్తారుట. దీన్ని ప్రపంచంలోనే ఎంతో అందమైన నగరాల్లో ఒకటి అని ‘ఫోర్బ్స్’ పత్రిక కీర్తించింది.

ఆ సన్నపాటి సందుల్లో, ఇటూ అటూ ఎత్తుగా వున్న భవనాలూ, వాటిలోనించీ బయటికి రాగానే, పెద్ద పెద్ద రోడ్లూ, ఫౌంటెన్లూ, మధ్యే మధ్యే ఎంతో అందమైన శిల్పాలూ.. చాల శుభ్రంగా వుండే చక్కటి నగరం ఫ్లారెన్స్.

ఇక్కడ చూడదగ్గ విశేషాలలో, మొట్టమొదటిది “ఎకాడమియా”.

మాకు అక్కడవున్న క్యూలో నిలబడి లోపలికి వెళ్ళటానికి రెండు గంటలు పట్టింది. కానీ లోపలికి వెళ్ళాక అంతసేపు వేచి వుండటం మంచిదే అనిపించింది. మైకలాంజెలో చెక్కిన అందమైన శిల్పాలు ఎన్నో వున్నాయి అక్కడ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పం “డేవిడ్” ఇక్కడే వుంది. చేతి వేళ్ళల్లో, కాళ్ళల్లో నరాలు కూడా కనిపిస్తాయి. ఎన్నో చిన్నచిన్న వివరాలని కూడా మైకలాంజెలో ఎంతో కళాత్మకంగా జాగ్రత్తగా చెక్కిన శిల్పం ‘డేవిడ్’.

ఇంకా ఎన్నో చక్కటి శిల్పాలు చూడాలంటే వెళ్లవలసిన ప్రదేశం ‘ది గల్లేరియా డిగ్లి ఉఫ్ఫిజి’. అక్కడ చాల ప్రఖ్యాతిగాంచిన బాటిచెల్లి, డవించి, రాఫయేల్, మైకలాంజెలో మొదలైన వారి శిల్పాలు ఎన్నో వున్నాయి. అన్నీ తెల్లటి పాలరాతిలో చెక్కినవే!

‘పొంటె శాంట ట్రినిట’ బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఎంతో పురాతనమైన బ్రిడ్జ్. ‘బార్తలోమియో అమ్మనాటి’ అనే ఆయన కట్టిన అందమైన బ్రిడ్జ్. రెండవ ప్రపంచ యుద్ధంలో పాడయిపోయినా, దాన్ని మళ్ళీ ఏమీ మార్పులు చేయకుండా బాగుచేసారు.

image2

ఫౌంటెన్ ఆఫ్ నెప్ట్యూన్ ఎంతో బాగుంటుంది. 1565వ సంవత్సరంలో ప్రముఖ శిల్పి ‘బార్తలోమియో అమ్మనాటి’ చెక్కిన అందమైన శిల్పాలతో నిర్మించిన నీటి ఫౌంటెన్.

 

image3

ఇంకా ఇక్కడ చూడవలసినవి, నేషనల్ మ్యూసియం ఆఫ్ బార్గెల్లో. లోపలా బయటా కూడా ఇక్కడ ఎంతో అందంగా వుంటుంది, ఆ కట్టడాలు, శిల్పాలు. ఇక్కడే నా కేరికేచర్ బొమ్మ కూడా ఒకటి గీయించుకున్నాను.

తర్వాత ‘మెర్కాటో నోవో’ అంటే కొత్త బజారు. మైకలాంజెలో స్క్వేర్. పియాజా డెల్లా సిగ్నోరియా. ఇది ఎంతో పేరు పొందిన ప్రదేశం. ఎన్నో శిల్పాల మధ్య, చుట్టూ పెద్ద పెద్ద భవనాలతో, షాపులతో, హోటళ్ళతో, ఎంతోమంది యాత్రీకులు సందడి చేసే ప్రదేశం. శాంటా మారియా డెల్ కార్మిన్ చర్చితో సహా ఎన్నో కాథలిక్ చర్చిలు. మీకు ఎంత సమయముంటే అన్ని చర్చిలు వున్నాయిక్కడ!

పీసా అనే వూరు ఇక్కడికి దగ్గరే. రైలులో వెడితే ఒక గంట ప్రయాణం. ఒకరోజు పొద్దున్నే వెళ్లి, సాయంత్రానికి తిరిగి రావచ్చు.

పీసా టస్కనీ ప్రావిన్స్ లోనే, ఆర్నో నది పక్కనే వుంది. 88 వేల మంది జనాభాకి, ఇరవై పైన చర్చిలు వున్నాయిట ఇక్కడ!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్ గలీలియో పుట్టి, పెరిగింది ఇక్కడే.

అంతేకాదు. మనందరికీ పరిచయమైన ‘లీనింగ్ టవర్’ కూడా ఇక్కడే వుంది! దాన్ని నా భాషలో ‘వంకర టింకర శిఖరం’ అంటాను.

చాలామంది, కావాలని ఇలా వంకరగా కట్టింది ఈ శిఖరం అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

క్రీస్తు శకం 1173లో మొదలు పెట్టి, 1372లో ఈ టవర్ కట్టటం పూర్తి చేసారు. అంటే దీన్ని కట్టటానికి రెండు వందల ఏళ్లు పట్టిందన్నమాట. ఈ శిఖరం ఎత్తు క్రింది వేపు 55.86 మీటర్లు (183.27 అడుగులు). పై వేపు 56.67 మీటర్లు (185.93 అడుగులు). పదహారు వేల టన్నుల బరువు. ఎనిమిది అంతస్తుల కట్టడం. మొత్తం 296 మెట్లు వున్నాయి. ఇది ఒకప్పుడు 5.5 డిగ్రీలు వంగి వుండేది. కానీ ఇప్పుడు 3.9 డిగ్రీలు వంగి వుంటుంది.

ఈ శిఖరం కట్టేటప్పుడు నిలువుగానే కడదామనుకున్నారుట. కానీ కడుతున్నప్పుడు నేల మరీ మెత్తగా వుండటం వల్ల, పునాది సరిగ్గా లేక, ఒక పక్కకి వంగటం మొదలుపెట్టింది. అలా వంగటం మొదలు పెట్టిన టవర్ పూర్తి ఆయే సమయానికి, కొంచెం ఎక్కువగానే వంగింది. కానీ దాని గురుత్వ కేంద్రం (Center of Gravity), భూమి మీద ఆ టవర్ వ్యాసం పరిధిలోనే (within the base diameter) వుండటంతో, అది కూలిపోకుండా నిలబడింది. అప్పుడు ఇంజనీర్లు, దానికి అలాగే నిలవటానికి ఇంకా బలం ఇచ్చేటట్టు మార్పులు చేసి, దాని కాళ్ళ మీద దాన్ని నిలుపగలిగారు. అలా మొదలైన లీనింగ్ టవర్, ఎన్నో లక్షలమంది యాత్రీకులని ఆకర్షిస్తున్నది. అదీ కథ.

image4

మీకు స్టీవ్ రీవ్స్ నటించిన పాత ‘సూపర్ మాన్’ సినిమా గుర్తుందా? దాంట్లో ఒక చక్కటి హాస్య సన్నివేశం వుంది. పీసా టవర్ పక్కనే ఒకతను చిన్న చిన్న పింగాణీవి, వంగిన టవర్లు అమ్ముతుంటాడు. ఆకాశంలో ఎగురుతూ వెడుతున్న సూపర్ మాన్, వంగిపోయిన టవర్ని చూసి దిగి వస్తాడు. అది పడిపోతున్నదనుకుని, నిఠారుగా నిలబెట్టి వెళ్ళిపోతాడు. అది చూసి షాపు అతను, ఏం చేయాలో తెలియక, షాపులోని పింగాణీ టవర్లు అన్నిటినీ విసిరి పగలగొట్టేస్తాడు. మళ్ళీ నిఠారుగా నిలుచున్న టవర్లు తయారు చేయించి, అమ్మకం మొదలు పెట్టబోతుంటాడు. తన తప్పు గ్రహించిన, సూపర్ మాన్ తిరిగి వచ్చి, టవర్ని ముందు ఎలా వంగి వుందో అలాగే వంచి, ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. షాపు అతనికి మళ్ళీ ఏం చేయాలో తెలీక, తన పింగాణీ టవర్లని కోపంతో విసిరేసి పగలకొడతాడు. ఎంతో హాస్యభరితంగా చిత్రించిన సంఘటన. అది గుర్తుకి వచ్చింది ఆ టవర్ పక్కనే గడ్డిలో పడుకుని, విశ్రాంతి తీసుకుంటుంటే!

image5

ఆ టవర్ మీదే ఒక బొమ్మ చూస్తే, ఉత్సాహం వచ్చి పై ఫోటో తీశాను. మానవ పరిణామ సిద్దాంతం ప్రకారం (Theory of Evolution), మనం కోతులలోనించీ వచ్చాం. దాన్నే చక్కగా పీసా టవర్ మీద చెక్కారు. ఇద్దరు కోతి మనుష్యులు, పూర్తిగా రూపాంతరం చెందకముందు, తోకలతో కూర్చున్న శిల్పం. అది నాకు బాగా నచ్చింది.

– సత్యం మందపాటి

 

 

మీ మాటలు

*