మాష్టారి కథ – అదొక యజ్ఞం, ఒక జీవధార, ఒక ఆశీర్వచనం

With Kara mastaru

2006 సంవత్సరం.

రాయకుండా ఉండలేనంతగా ఏదైనా ఇతివృత్తం మనసుని ఆక్రమించి ఉంటే తప్ప, సాహితీ వ్యాసంగం పట్ల అంతగా శ్రద్ధ పెట్టని రోజులవి. ఒకరోజు కారా మాస్టారి నించి వచ్చిన ఫోన్ నాలో ఎంతో మార్పు తెచ్చింది. అప్పటికే  ఒక గేయ సంపుటీ ‘ఆలంబన’ కథాసంపుటి వెలువరించి ఉన్నా, నాలో రచన పట్ల అనురక్తి అంతగా ఉండేది కాదు. కౌముది  జాల పత్రికలో బహుమతి పొంది, రచనలో ప్రచురితమైన నా కథ ‘ఆసరా'(http://www.siliconandhra.org/monthly/2005/oct05/index.html) చదివి మాష్టారు చేసిన ఫోన్ అది. అప్పటికి కారా మాష్టారి కథలు కూడా  నేను చదివి ఉండలేదు.

ఫోనెత్తి హలో అనగానే, “నా పేరు కాళీపట్నం రామారావు అంటారమ్మా, నేను శ్రీకాకుళం లో ఉంటాను” అంటూ పరిచయం చేసుకున్నారు మాష్టారు!

ఒక సంచిక మొత్తం ఆయనకే అంకితం చేస్తూ, రచన పత్రిక వెలువరించిన వ్యాస పరంపరని ఆ నెలలోనే, అంతకు ముందే చదివి ఉండడంతో “నమస్కారం మాష్టారు” అన్నాను సంభ్రమంగా.

ఎంతో  వాత్సల్యంగా పలకరించి,  ‘ఆసరా’  కథని మెచ్చుకుని, నా కుటుంబం గురించీ, నేపధ్యం గురించీ అడుగుతూ చాలాసేపు మాట్లాడారు. అంతటితో ఆగిపోకుండా మళ్ళీ మర్నాడు ఫోన్ చేసి ” అమ్మా! నీ కథ నన్ను వెంటాడుతోందమ్మా” అని, ఒక మంచి రచయిత్రి నిలదొక్కుకోవాలంటే  అవసరమయ్యే  సహకారం గురించి నా భర్తతో మాట్లాడాలని ఉందని చెప్పినపుడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా  ఇంతా కాదు. అన్నట్లుగానే  ఒక రచయితకి ఎదురయ్యే సవాళ్ళ గురించీ, సహచరుల నించి అందవలసిన సహకారం గురించీ నా భర్తతో ఆయన చెబుతుంటే వింతగా విభ్రాంతిగా అనిపించింది.

ఆ తర్వాత ఆయన రచనల  సంగ్రహం కొని చదివాను. యజ్ఞం, మహదాశీర్వచనం, జీవధార ఒకటేమిటి మాష్టారు రాసిన ఏ కథ చదివినా, అందులో ఒక జీవధార తోణికిస లాడుతూ  కనిపించింది, తెలుగు కథ కొక ఆశీర్వచనం వినిపించింది, కథా రచననొక యజ్ఞంగా భావించిన మాష్టారి నిబద్ధత గోచరించింది.

 

తర్వాత కొన్నాళ్ళకి ఆయన హైదరాబాద్ రావడం, నాతో  మాట్లాడడం కోసం మా ఇంటికి రావడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. అప్పుడు  నన్నుగేయ రచన, చిత్రలేఖనం వదిలిపెట్టి, కథ మీద శ్రద్ధ పెట్టమని సూచించారు. ఆ సంఘటన గురించి నేను రాసిన వ్యాసం, న్యూజెర్సీ లోని తెలుగు జ్యోతి వారి సావెనీర్ లో ‘కథ కోసం కారా మాష్టారు’ పేర ప్రచురితమైంది (http://www.tfas.net/prema/web/kathakosam_varanasi.pdf). ఆ వ్యాసంలో రాసిన విషయాలే మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం సరికాదు కనుక అవి వదిలేస్తున్నాను. తర్వాత ఆయన నించి రెండు మూడు లేఖలు అందాయి. కొన్నిసార్లు ఫోన్లో కూడా మాట్లాడేవారు. నన్నే కాక ఇంకా ఎందరో కొత్త కథకులని  మాష్టారిలా ప్రోత్సహించారని విన్నాను.

 

ఆయన సృష్టించిన సాహిత్యం, ఆయనలో నాకు కనిపించిన వ్యక్తిత్వం .. దేనివల్ల నేనెక్కువ ప్రభావితమయ్యానో చెప్పడం కష్టం. తన జీవితాన్ని ఈ ఉద్యమానికి అంకితం చేసిన మాష్టారి మాటలు, తెలుగు కథ సర్వతోముఖంగా వికసించడం కోసం ఆయన పడుతున్న ప్రయాస, నా మీద చూపిన ప్రభావం లోతైనది. ఆయన కలగన్న లాంటి సాహిత్యాన్ని సృష్టించడంలో నేను సఫలం కాలేకపోవచ్చుగాని ఆయన తాపత్రయం నన్నెంతగానో  కదిలించింది.

 

తర్వాత కొన్నాళ్ళకి భాగ్యనగరంలో, త్యాగరాయ గాన సభలో, వంగూరి చిట్టెన్ రాజు గారి అధ్వర్యంలో తెలుగు మహాసభలు మూడు రోజులపాటు జరిగాయి, ఒక పెళ్ళిలాగా, పండగ లాగా.  ఎందరో రచయితలూ, కళాకారులూ అందులో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో, అంటే మాష్టారు మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత,  కొన్ని కవితలూ, పాటలూ రాశాను గాని చెప్పుకోదగ్గ కథలేమీ రాయలేదు  నేను.

 

సభ మొదలవబోతుండగా హాలులో కూర్చుని ఉన్న నా దగ్గరకి ఎవరో ఒక అభిమాని వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మరికొద్దిసేపటికి కారా మాష్టారు అటుగా వచ్చారు. నేను ఉత్సాహంగా ఆయన దగ్గరకి వెళ్లేసరికి చాలామంది ఆయన చుట్టూ మూగి ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. ఒక పుస్తకంలో తన సంతకం చేస్తూ, అదే పేజీలో పైనున్న ఆటోగ్రాఫ్ చూసి, ” ఈ పిల్ల నీ కెక్కడ దొరికింది? కథల మీద దృష్టి పెట్టవమ్మా అంటే వినకుండా అన్నిట్లోనూ వేలు పెడుతుంది ? ” అని విసుక్కుంటున్నారు. ఆ మాటలు ఎవరి నుద్దేశించి అన్నారా అని చూస్తే, ఆ పుస్తకం అంతకు ముందు నా ఆటోగ్రాఫ్ తీసుకున్నావిడది.

 

” మాష్టారూ ఇక్కడే ఉన్నా” అన్నా. “ఏమిటమ్మానువ్వు? ఒక ప్రక్రియలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే దానిమీదే దృష్టి పెట్టాలి. మిగిలినవన్నీ వదిలి కథ మీద శ్రద్ధ పెట్టమని చెప్పాను కదా” అన్నారు. ఆయనలో ఒక ఉద్యమకారుడి తాపత్రయం, లక్ష్య శుద్ధి కనిపించి చకితురాలినయ్యాను. నేరం చేసినట్టు ఒక గిల్ట్ ఫీలింగ్ నన్నావహించింది.

 

ఆ తర్వాత నాలో కథ పట్ల కొంత శ్రద్ధ పెరిగింది. కౌముది, ఆంధ్రభూమి కథల పోటీలలో రెండు కథలకి  ప్రధమ బహుమతి లభించింది . మాష్టారు గుర్తొచ్చారు కానీ ఫోన్ చేయలేదు. ” నీ రచనలొ శైలి ఉంది , వేగం ఉంది , సామాజిక స్పృహ ఉంది , ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కనక నువ్వు బాగా రాయాలి , రాసిలో కాదు వాసిలో. ఇలా అన్నానని నువ్వేది రాసినా నాకు పంపి ‘మాష్టారూ నా కథ ఎలా ఉంది’ అని అడగకు. అది మంచి కథ అయితే నా దగ్గరకి అదే వస్తుంది ” అన్న ఆయన మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉండి పోయాను.

 

మళ్ళీ కొన్నాళ్ళకి త్యాగరాయ గాన సభలో ఒక కార్యక్రమానికి ఆయన వచ్చారు. పొత్తూరి విజయలక్ష్మి నన్నెవరికో పరిచయం చేస్తూ ‘కారా మాష్టారు మెచ్చిన రచయిత్రి’ అంటుంటే ఆ పక్కనే మాష్టారు ఉండడంతో నేను మొహమాట పడిపోయి , ‘కారా మాష్టారు మెచ్చిన ఒక కథ రాసిన రచయిత్రి’అని సరి చేశాను. ఆయన మనసారా నవ్వుతూ ‘నేను కూడా ఒక్క యజ్ఞమే రాశాను తల్లీ’ అన్నారు.

 

కిందటి సంవత్సరం నవ్యలో నా కథ  ‘పుష్య విలాసం’ (http://vanalakshmi.blogspot.in/search?updated-min=2013-01-01T00:00:00%2B05:30&updated-max=2014-01-01T00:00:00%2B05:30&max-results=13)  వచ్చిన వెంటనే మాష్టారి నించి ఫోన్ వచ్చింది  “కథ బాగుందమ్మా కానీ ..” అంటూ. బాగుందన్న మాటకి ఆనందిస్తూ  ‘కానీ..’ విషయంలో ఆత్రుతగా చెవి ఒగ్గితే, ” పేరు misleading గా ఉందమ్మా. వైద్య లక్ష్మి  అని పెట్టి ఉంటే బావుండేది” అన్నారు. ” కథ మొదలవుతూనె మొదటి మూడు నాలుగు వాక్యాలలో పాఠకుడు  కథ లోకి లాగబడాలి. ఈ కథలో ఎత్తుగడ వాక్యాలలో ఉన్న పుష్యమాస వర్ణన వల్ల అలా జరగకుండా పోయింది” అన్నారు. తన రచనా సంగ్రహం లో ఉన్న కథా రచన గురించిన వ్యాసావళిని, ప్రత్యేకించి కథలో వర్ణనలకి సంబంధించిన వ్యాసాన్ని చదవమని చెప్పారు. ఆయన ఆరోగ్యం గురించి విచారిస్తే ఒక కన్ను మాత్రమే పని చేస్తోందనీ, అయినా రోజుకి కనీసం ఎనిమిది గంటలైనా సాహిత్యం చదవకుండా ఉండలేననీ చెప్పారు. హుద్ హుద్ తుఫాను తర్వాత ఫోన్ చేసి  కుశలం అడిగితే, ప్రస్తుతం శ్రీకాకుళం వచ్చేశాననీ, తుఫాను ప్రభావం విశాఖపట్నంలో ఉన్నంతగా ఇక్కడ లేదనీ చెప్పారు.

 

కారా మాష్టారు విలక్షణమైన వ్యక్తి. ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్ళకైనా ఆయన గొప్ప కథకులు గానే కాక, అపూర్వమైన కథా ప్రేమికునిగా గోచరిస్తారు. ఒక మంచికథ ప్రచురితమయిందంటే చాలు ఆ రచయిత గురించి తెలుసుకుని, వీలయితే స్వయంగా కలుసుకునో , లేదా ఫోను ద్వారానో ఆకథలోని మంచినంతా హృదయపూర్వకంగా మెచ్చుకుని, ఇంకా ఎన్నో మంచి మంచి రచనలు రాసేవిధంగా ఆ రచయితని ప్రోత్సహిస్తారు. ఆయన ఎంత మృదుభాషణులో అంతే నిక్కచ్చిమనిషీ, నిగర్వీ కూడా. ఎంతసేపూ ఇంకా ఇంకా మంచి కథలు రావాలనీ, అవన్నీ ఇతర భాషల్లోకి అనువదించబడాలనీ, ఇంకా కొత్త కొత్త కథకులు పుట్టాలనీ, వాళ్ళ రచనలు ఇంకా ఇంకా మెరుగులు దిద్దుకోవాలనీ ఆయన ఆశ. తన సమస్తమూ కథానిలయానికే సమర్పించి, తెలుగులో వచ్చిన ప్రతి కథా అందులో పదిలమవాలని ఆకాంక్షించే మాష్టారికి  కథ పట్ల ఎంత మమకారమో ! తొంభయ్యవ పడిలో కూడా తన ఫోన్ లో, ఏ రచయితదైనా  మిస్డ్ కాల్ కనిపిస్తే,  చిన్నా పెద్దా అని చూడకుండా, తిరిగి ఫోను చేసి మాట్లాడే మాష్టారి సంస్కారం గురించి వేరే చెప్పేదేముంది ?

 

కారా మాష్టారి తొంభయ్యవ పుట్టినరోజు సందర్భంగా సారంగ జాల పత్రిక వారు ఆయన మీద ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తున్నారనీ, మాష్టారి తో నాకున్న స్వల్ప పరిచయాన్ని పురస్కరించుకుని ఒకటి  రెండు పేజీల వ్యాసాన్ని అందించమనీ  రమాసుందరి గారు అడిగినపుడు ఇంత చక్కని ఆలోచన చేసిన సారంగ పత్రికకి మనసులో జోహార్లు చెప్పుకున్నా. మామూలుగా అయితే బతికి ఉన్న వ్యక్తుల విలువ మనకి సరిగా అర్ధం కాదు. ఎంత మహానుభావుడైనా సరే మనం గుర్తించం. అందులో ఆ వ్యక్తికి పేరు ప్రఖ్యాతులమీద వ్యామోహం లేకపోతే, తనంత తానుగా అందుకోసం ప్రయత్నించే లక్షణం లేకపోతే ఇంకెవరికీ ఆ సంగతి పట్టదు.

 

కారా మాష్టారు మనకిచ్చినదంతా తెలుగు వారికే సొంతమైన వారసత్వ సంపద. ఆ సంపదని  పరిరక్షించే మహత్కార్యంలొ ‘నేను సైతం’ అంటూ ముందుకొచ్చిన సారంగకి అనేక అభినందనలు.

పుట్టినరోజు పండగే అందరికీ. తను పుట్టింది ఎందుకో తెలిసిన కొందరిలొ ఒకరైన మాష్టారికి పూర్ణాయుష్షు, ఆరోగ్యం లభించాలని కోరుతూ శుభాకాంక్షలు  తెలియజేసుకుంటున్నాను.

 

  • vnl 1వారణాసి నాగలక్ష్మి

 

మీ మాటలు

  1. నారాయణ గరిమెళ్ళ says:

    నాగలక్ష్మి గారు, మీ ఆసరా కధ గురించి కారా మాష్టారు మాట్లాడారని విన్నాక ఆ కధ చదివి మొదటి సారిగా మీ గురించి అప్పుడు తెలుసుకున్నాను.

    బహుముఖ ప్రజ్ఞ ఉన్నవారికి ఒకే రంగం పట్ల అంకితమై ఉండమంటే కొంచెం కట్టడి చేసినట్టు అనిపిస్తుంది. “కధలు మాత్రమే వ్రాయండి, కవిత్వం మాత్రమే వ్రాయండి” అని ఎవరైనా చెబితే ఒక పట్టాన ఒప్పుకుని ఫాలో అవ్వడం అంత సులభమైన విషయం కాదని అనుభవపూర్వకంగా నాకూ అనిపిస్తుంది.

    రావి శాస్త్రి గారి గురించి వినడమే తప్ప, చూడ లేకపోయిన నాకు మాష్టారి ని చూడటం, అతనితో మాట్లాడటం ఇప్పుడు మీరు, మిగిలిన వారు వ్రాసిన అనుభవ వ్యాసాలు చదవడం చాలా సంతోషంగా ఉంది.

    మాష్టారు నా రెండొ కధ ‘తప్పు ‘ చదివి మీకు కధలు వ్రాయగల నైపుణ్యం బాగా ఉంది. కొనసాగించండి అని సలహా ఇచ్చారు. కధానిలయం ప్రారంభ సభకు వెళ్ళి అక్కడ అతిరధమహారధుల లాంటి అనేక మంది తెలుగు రచయితలను ముఖ్యంగా ఇప్పుడు లేని వారు ( పులికంటి కృష్ణా రెడ్డి గారు, వల్లంపాటి వెంకట సుబ్బయ గారు) ని అప్పుడు కలిసి చూసి మాట్లాడటం, వల్లంపాటి వెంకట సుబ్బయ గారి ప్రసంగం వినడం నా అదృష్టం.

    నారాయణ గరిమెళ్ళ

  2. M J Thatipamala says:

    కారా గారితో పరిచయ బాగ్యం నాకు ఇప్పటివరకు లభించలేదు. మీ అనుభవాలను పంచుకున్నందుకు కృతజ్ఞతలు!

మీ మాటలు

*