కారా మాస్టారు – కొన్ని జ్ఞాపకాలు

T Krishna Bai

తెల్ల మల్లు కట్టు పంచె, అర చేతుల చొక్కాతో సైకిల్ మీద సాయంకాలాలు పిల్లలకి పాఠాలు చెప్పేందుకు వెళ్ళే కారా మాస్టారిని 1960లలో విశాఖ ఎల్లమ్మతోటలో ఎరుగని వారుండరు. సెయింట్ ఆంథోని హైస్కూల్లో లెక్కల పాఠాలు చెప్పి, సాయంత్రాలు ప్రైవేట్లు చెప్పేవారు. జీవిక కోసం రేయింబవళ్ళు అంత కష్ట పడుతూ కుటుంబ భారాన్ని మోస్తూ కూడా సాహిత్యానికి అంత సమయం ఎలా కేటాయించేవారో ఆశ్చర్యం!

 

శ్రీకాకుళం జిల్లా మురపాకలో పుట్టిన కాళీపట్నం రామారావు గారు భీమిలిలో టీచర్ ట్రైనింగ్ తీసుకుని, విశాఖలో లెక్కల మాస్టారుగా పనిచేశారు. క్రమంగా విశాఖ రచయితల సంఘం సభ్యుడిగా, రచయితగా ప్రసిద్ధి పొందారు. అప్పట్లో ‘చిత్ర గుప్త’లో ‘కార్డు కథలు’ పేరుతో చిన్న కథలు రాసేవారు. తోటి టీచర్ మసూనా ఆయనకి సాహిత్యరీత్యా కూడా మిత్రుడే.

రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు కారాని చాలా గౌరవించేవారు. ఆయన, ఐ. వి. సాంబశివరావు, ఎన్నెస్ ప్రకాశరావులు మాస్టారికి మార్క్సిజాన్ని పరిచయం చేశారు. కారా కిళ్ళీ ప్రియుడైన మాస్టారి గురించి ఎన్నెస్ లాంటి మిత్రులు చాలా ఛలోక్తులు విసిరేవారు. “ఆయన్ని ఏదయినా సందేహం అడిగితే వీధి చివరికి వెళ్లి నోట్లోని ఊట ఊసి తిరిగొచ్చి జవాబు చెప్తారు. ఈలోగా ఆయనకి ఆలోచించుకునే వ్యవధి వుంటుంది “, అంటూ ఎగతాళి పట్టించేవారు. విప్లవం రేపే వస్తుందంటే ప్రముఖులు ఎలా స్పందిస్తారనే ఊహల్లో కూడా, మాస్టారయితే, “ఆగండి , మరో నాలుగు ట్యూషన్లు చెప్పుకొచ్చేస్తాను” అంటారని విసుర్లు!

 

రామారావుగారి అర్ధాంగి సీతమ్మగారు చాలా సౌమ్యురాలు, ఓర్పుమంతురాలు. మాస్టారు చిరాకుపడితే కూడా ఆమె తొణికేవారు కాదు. ఆమె పిల్లల్ని కసురుకోవడం ఎన్నడూ చూడలేదు. ఆమె పోయాక పిల్లలు మాస్టారికి చేదోడువాదోడుగా వుంటూ ఆయన బాగోగులు చూసుకుంటున్నారు. ముఖ్యంగా సుబ్బారావు రచయితగా, ప్రసాద్ లెక్కల మాస్టారుగా ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు.

 

కారా కథలని 1970కి ముందు, వెనకలుగా విభజించ వచ్చు. ఎందుకంటే, అప్పట్లో దేశాన్ని కుదిపేస్తున్న నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట ప్రభావానికి లోనుగాని మేధావులు, పీడిత ప్రజల పక్షపాతులు ’70 లలో లేరనే చెప్పాలి. మాస్టారు కూడా ఆ ప్రభావానికి అతీతులు కారు. అందుకే ఆయన ’70 తరువాత రాసిన కథల్లో వర్గ విశ్లేషణ పూసల్లో దారంలా కనిపిస్తూనే వుంటుంది.

 

యాభై , అరవై దశకాల్లో అయన రాసిన కథల్లో లోతయిన జీవితాన్ని పరిచయం చేశారు. ఆయన పెరిగిన వాతావరణానికి, ఆ కథల వాతావరణానికి పోలిక లేదనిపిస్తుంది. అట్టడుగు వర్గాల జీవితాన్ని అంత సునిశితంగా ఎలా పరిశిలించారా అని అబ్బురమనిపిస్తుంది. ఆ జీవిత విశ్లేషణకి మార్క్సిజం తోడయ్యాక ఆయన దృష్టి కోణం విస్తరించింది. అప్పుడు వెలువడిన కథలు ఉన్నత శిఖరాలని చేరుకున్నాయి.

 

అగ్రవర్ణంలో పుట్టినా దళిత జీవిత మూలాన్ని కారా అంత చక్కగా ఎలా చిత్రించగలిగారా అని ఆశ్చర్యం వేస్తుంది. ‘రాగమయి’ లాంటి కథల్లో  అచ్చం మధ్యతరగతిని చూపిస్తే, ‘చావు’ కథలో దళిత జీవితాల్లోని దైన్యాన్ని చూపించారు. ముసలమ్మ దహనానికి కట్టెలు లేని పరిస్థితిని వివరిస్తూనే, ఆ కట్టెలు నిలవున్న చోటినించి వాటిని తెచ్చుకునే సాహసాన్ని కూడా ప్రదర్శింపచేశారు.

 

1964 లో రాసిన ‘యజ్ఞం ‘ కథ అర్ధం కావాలంటే తన ‘అప్రజ్ఞాతం ‘ చదవాలంటారు కారా. దాదాపు నలభై సంవత్సరాల కాలగమనం లో, స్వాతంత్ర్యానికి ముందు వెనుక, గ్రామాల్లో వచ్చిన మార్పుల్ని  ఎంతో గాడంగా  విశ్లేషించారు. కానీ ముగింపు మాత్రం  కార్మికవర్గ దృష్టి నించి కాక మధ్యతరగతి దృక్పధం నించి రాశారని మార్క్సిస్టులు విమర్శించారు.

ఆర్ధిక శాస్త్రం మూల వస్తువుగా ‘తీర్పు’ కథ వుంటుంది. ‘కుట్ర’ కథ నిజానికి ఒక డాక్యుమెంట్. కుట్ర అనదగ్గదేదైనా జరిగితే రాజ్యాంగం రాసిన కాడే జరిగుండాల. పంచవర్ష ప్రణాళికలు ఏసిన్నాడు డెఫినెట్ గా జరిగింది”, అంటూ చాలా వివరంగా కుట్రని బయట పెట్టారు మాస్టారు. ఈ కథ 1972 విరసం ప్రత్యేక సంచిక ‘నిజం’లో వచ్చింది. ఆయన కథలు అర్థం చేసుకోవాలంటే అలవోకగా చదవడం కాదు. ఒకటికి నాలుగు సార్లు చదవాలి. అంత నిగూఢంగా, గాఢంగా రాస్తారాయన. ‘కుట్ర’ అయితే పదిసార్లు చదవాలి తాపీగా – రాజకీయపరంగా , సైద్ధాంతికంగా అద్భుతంగా చిత్రించారు పరిస్థితుల్ని.

 

చిన్న కథ నించి పెద్ద కథ వరకు సునాయాసంగా రాయగల కారా, ఆయన చెప్పదలుచు కున్న విషయం కోసం, వివరించవలసిన జీవితం కోసం, విశ్లేషించవలసిన ప్రపంచం కోసం  పెద్ద కథనే ఎంచుకున్నారు. కానీ ఏ ప్రక్రియకైనా దాని ప్రత్యేకతలు ఉంటాయని ఆయన నమ్ముతారు.

‘బారెడు పొద్దెక్కింది’ అని రాయాలంటే, ఆ వేళకి ఎండ ఎక్కడి దాకా వస్తుందో అడుగులు వేసుకుని కొలిచే మాస్టారి పద ప్రయోగాలు కూడా అబ్బుర పరుస్తాయి.

“పువ్వప్పుడే మిడిసిపడితే పిందప్పుడే రాలిపోతాదని సామెత ”

“పొద్దల్లా అమ్మేది ముత్తువైతే , పొద్దోయి అమ్మేది పొందుం ”

“ఒళ్లెరబెట్టి ఆణ్ణి తెచ్చుకోడమయితే నా సేత కాదు”

“వరి కంప మీద పట్టు కోక తీసినా దక్కదు, తియ్యకున్నా దక్కదు” వంటి పదాల్లో   పల్లెల సువాసన గుబాళిస్తుంది.

 

‘హింస’ కథ చిన్నదే కానీ చిత్రణ అమోఘం. అక్క స్నానం చేస్తుంటే చూసిన చెల్లి, “అప్ప వీపు, భుజాలు కూడా తెల్లగా వున్నాయి. కోవటి బామ్మర్లలా రైకలేస్తాది కావాల!” అనుకుంది. ఉత్తరాంధ్ర శ్రామిక స్త్రీలు రైకలేసుకోరు. ఆ చెల్లి కథ చివరలో చూపించే ఆవేశం మనకి అర్ధం కావాలంటే ఆమె స్థానంలో మనముండాలి, ఆమె గుండె మనకుండాలి అంటారు మాస్టారు.

 

 

మాండలికం మీద వాదోపవాదాలు జరుగుతున్న కాలంలో మాస్టారు ఎన్నో విలువైన ప్రతిపాదనలు చేశారు. ఆయనకి భాష మీద వున్న పట్టు గొప్పది. కొత్త రచయితలకి ఆ కిటుకులు నేర్పేవారు. ‘బండోడు’ అనే మాటని రాసి పలకమనేవారు ‘బండివాడు’, ‘బండవాడు’ అనే రెండు అర్థాలు మౌఖికంగా మాత్రమే ఎలా స్ఫురిస్తాయో వివరించేవారు. అలానే సమకాలీన ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసి వస్తువు, శిల్ప వైవిధ్యాలను చూడమనేవారు. దాని కొనసాగింపుగానే ‘నేటి కథ’ పేరుతో కొత్త కథకులని ప్రోత్సహించారు.

 

ఒకసారి మాస్టారు సంక్రాంతి మిత్రుల సమావేశానికి కృష్ణా జిల్లా వచ్చి దివి తాలూకా పర్యటించారు. దళితుల జీవితాలు అన్నిచోట్లా ఒకేలా, ఊరి బయట నికృష్టంగా ఉన్నాయని వాపోయారు.

ఆయనకి జీవితం పట్ల ప్రేమ , ఆశ, ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా జీవించగలననే ధీమా, పరిస్థితుల్ని సానుకూలంగా మలచుకోగాలననే తపన. అందుకే – “బజ్జీలు అమ్ముకునయినా బతికేస్తాను” అనేవారు.

 

ప్రజలు, ప్రజా పోరాటాల పట్ల ఆయన నిబద్ధత ఆయన కార్యాచరణలో తెలుస్తుంది. విశాఖ రచయితల సంఘం నించి విప్లవ రచయితల సంఘం వరకు ఆయన చేసిన ప్రయాణంలో కూడా ఆయన ఎదుగుదల కనిపిస్తుంది. వ్యక్తిగత కారణాల వల్ల  1975లో విరసానికి రాజీనామా చేసినా, సంస్థ అంగీకరించక పోవడం వల్ల ’80 ల దాకా ఆయన విరసం సభ్యులే ! ఆ తరువాత కూడా కారా గారు, రావి శాస్త్రి గారూ కూడా విరసం నిర్మాణంలో లేక పోయినా, విరసం తోనే ఉన్నామని బహిరంగంగా ప్రకటించారు. ప్రజల పక్షానే నిలిచారు.

 

తెలుగు కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కారాగారి వైపు, ‘కథా నిలయం’ వైపు చూడాల్సిందే.  కొత్త తరాలకి ఊపిర్లు పోసి ప్రోత్సహించే మాస్టారు ఇంకా ఎంతోమంది కథకులకి బాసటగా నిలిచి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టి చేయాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

 

—  కృష్ణా బాయి 

    25-10-2014

 

 

 

 

మీ మాటలు

  1. Soma Sekhara Rao Markonda says:

    తెలుగు కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కారాగారి వైపు, ‘కథా నిలయం’ వైపు చూడాల్సిందే. కొత్త తరాలకి ఊపిర్లు పోసి ప్రోత్సహించే మాస్టారు ఇంకా ఎంతోమంది కథకులకి బాసటగా నిలిచి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టి చేయాలని…….

మీ మాటలు

*