ఎనిమిదో కధ

dasari1‘యజ్ఞం’ కధ రాసి ఏభై ఏళ్ళయింది. అచ్చు పడి నలభై ఎనిమిది. అచ్చు పడ్డప్పట్నించీ ఈ కధ మీద చర్చ జరుగుతూనే ఉంది. వందలాది పుటలు నిండాయి. ఇంకా నిండుతున్నాయి. అందులో కొన్ని పుస్తకరూపంలోనూ వచ్చాయి. వ్యాసాలే కాకుండా ‘యజ్ఞం తర్వాత ..” అంటూ కధలు వచ్చాయి. అడపాదడపా ఆయా వ్యాసాలు చదివాను. చర్చలు విన్నాను. ఆ కధ గురించి తాత్విక స్థాయిలో చేసిన విశ్లేషణాలూ కొన్ని చదివాను. కొన్నికొన్ని వ్యాసాలు ఆ కధ చెప్పని ‘గొప్ప తాత్విక విషయాలు’ కూడా ఎత్తిచూపాయి. ఆయా వ్యాసాలు కూడా చదివాను.

… యజ్ఞం గురించి రాయాలనుకొన్నపుడు ఆయా వ్యాసాలూ, ఆ పుస్తకం, ఓ సారి చదువుదామనిపించింది. కానీ నా స్పందనలు చెప్పడానికి అవి చదవడం అవరోధమవుతుందేమోననిపించింది. విరమించాను.

నిజానికి ఇది విమర్శా వ్యాసం కాదు. విశ్లేషణ కూడా గాదు. గత నలభై ఏళ్ళుగా ఎన్నెన్నో సార్లు ఆ కధను చదివి ఇష్టపడిన నేపధ్యంలో దానిని అందరికీ – ముఖ్యంగా ఈ తరం పాఠకులూ రచయితలకు – నా దృక్కోణంలోంచి పరిచయం చెయ్యాలనిపించింది. అప్పటి వారికి మరోసారి కధను గుర్తు చేస్తే బాగుంటుందనిపించింది.

……

శ్రీకాకుళానికి చేరువలో, సముద్రానికి దగ్గరలో ఉన్న ఊరు ‘సుందర’ పాలెం. తాటి తోపులు, కొబ్బరి చెట్లు, పచ్చని చేలు, నిండు చెరువులు – సుందరమైన ఊరే అది. హైస్కూలు, కరెంటాఫీసు, పోస్టాఫీసు, ఆసుపత్రి, పక్కారోడ్డు, ప్రపంచజ్ఞానం ఉన్న ఊరి వాళ్ళూ- వీటన్నిటితో ‘ఆ కోస్తా ప్రాంతంలో పలువురు అనాధల మధ్య సనాధలా వెలుగుతున్న’నాలుగు వందల ఇళ్ళున్న గ్రామమది. కధా కాలం 1963 నాటికి అన్ని ఇతర గ్రామాలూ అనాధలుగా ఉండి పోతే ఈ ఒక్కటీ సనాధగా ఎలా రూపొందిందీ? దేవుడేవన్నా దిగి వచ్చి మంత్రం వేశాడా?

దేవుడక్కర్లేదు. ఒఖ్ఖ మనిషి చాలు. ఆ మనిషి శ్రీరాములు నాయుడు. కొట్టొచ్చే రూపు, చెరుగని చిరునవ్వు, పట్నం చదువు, సమాజ సేవ కోసం మధ్యలో వదిలి పెట్టటం … ఎం.పీ, ఎమ్మెల్యే అవగలిగి ఉండీ గ్రామ శ్రేయస్సు కోసం ఆ పదవుల కోసం వెంటాడనితనం. అటు శ్రీరామ చెంద్రుని ‘న్యాయ నిరతి’నీ, ఇటు గాంధీ మహాత్ముని ‘నాయకత్వ శైలి’ నీ పుణికి పుచ్చుకున్న మనిషి శ్రీరాములు నాయుడు.

..దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలోనే ఊళ్ళోకి అడుగు పెట్టాడు నాయుడు. నిస్తేజంగా అనైక్యంగా ఉన్న ఊళ్ళో కదలిక తెచ్చాడు. ముందు అవమానాలకూ హేళనకు గురయ్యాడు. మెల్లిగా అందరి విశ్వాసం పొంద గలిగాడు. ముందుగా హైస్కూల్, ఆ తర్వాత చకచకా అనేకానేక అభివృద్ధి కార్యక్రమాలు – పదిహేను సంవత్సరాలలో ఊరు సనాధగా ఎదిగింది. ప్రభుత్వ వర్గాల ముద్దు బిడ్డ అయింది. ఊరి తగవులు గుడి మంటపం దాటి వెళ్ళారాదన్న కట్టుబాటుకు ఏకతాటిన ఊరిని నిలిపిన ‘న్యాయకోవిదుడు’ శ్రీరాములు నాయుడు.

…..

ఇంతకూ ఈ యజ్ఞం కధ ఏమిటీ?

మామూలే. ఓ చిన్న అప్పుల తగవు. తీసుకోడం, తీర్చలేక పోవడం, తగాదా, అది ఏళ్ళ తరబడి నలగడం, పంచాయితీ, ఆ తగవు తీర్చే పని శ్రీరాములు నాయుడి మీద పడటం…

అప్పు పడ్డ అప్పల్రావుడు ఊరి మాలల్లో పెద్ద. బంధు బలగం ఉన్నవాడు. పంచాయితీ హరిజన మెంబరు. “మాటకు నిలబడే మనిషి” అన్న ఖ్యాతి ఉన్న వాడు. అప్పు ఇచ్చిన గోపన్న ఓ చితికిపోయిన షావుకారు. సాత్వికుడు. చిన్నకారు వ్యాపారిగా మొదలెట్టి, పంటల వ్యాపారిగా ఎదిగి, వ్యాపారంలో నష్టాలు సొంతవాళ్ళ దగా వల్ల చితికిన మనిషి.

బాకీ మొత్తం రెండు వేలు – వడ్డితో రెండువేల అయిదు వందలు. అసలు మూడేళ్ళ క్రితమే పంచాయితీకి ఎక్కవలసిన కేసు. శ్రీరాములునాయుడు మధ్యస్థంతో సరి పెట్టాడు. తనకున్న పొలమంతా అమ్మితేగానీ బాకీ తీరదు గాబట్టి మరో మూడేళ్ళు గడువు అడిగాడు అప్పల్రావుడు. ఇతర పెద్దల్నీ, గోపన్ననూ ఒప్పించి ఆ గడువు ఇప్పించాడు శ్రీరాములు నాయుడు. అది రేపటితో ముగుస్తుంది.

అంతిమ నిర్ణయం వెలువరించవలసిన సమయం వచ్చేసింది.

*****

గుడి మంటపంలో పంచాయితీ. ఊరు ఊరంతా పోగు పడింది.

“నేను చితికి పోయాను. మీరు ఎంత ఇప్పిస్తే అదే మహా ప్రసాదమనుకొంటాను”. అంటాడు గోపన్న . అప్పల్రావుడు ఉలకడు. పలకడు.. అందరి సహనాలు అడుగంటే వేళ నోరు విప్పుతాడు. “మాకున్నమడిసెక్క అమ్మించేసయినా అప్పు తీరుమానం సేయాలని సబవోరికి ఉన్నట్టుంది. అదే నాయవయితే సెప్పండి. నెత్తి నెట్టుకొంటాను.” అంటాడు. “అయితే ఇది అప్పుగాదంటావా? తీర్చమనడం న్యాయంగాదంటావా” అని పెద్దలు రెట్టిస్తే – “అవునో గాదో మీరే ఆలోసించి సెప్పాల” అంటాడు!!

శ్రీరాములు నాయుడు కాసేపు ఆలోచించి “పెద్ద మనసుతో “ “రావుడూ, తగవు తీరుస్తున్నాను. ఈ నాటి నుండి నువ్వు గోపన్నగారికి నయాపైసా బాకీ లేవు. గోపన్నగారూ – ఎల్లుండి రండి. చెల్లు బెడతాను” అంటాడు.

ఇంకేం … తగవు తీరినట్టేగదా… శ్రీరామచంద్రుడంత ఉదాత్తంగానూ, గాంధీ మహాత్ముడంత న్యాయంగానూ నాయుడుగారు తీర్పు చెప్పారు గదా. కధ సుఖాంతమే గదా.

.. మరి విషయం ఇంకా ముందుకు నడిచి ఒక హింసతోనూ హత్య తోనూ, ఒక కట్టుబాటు చెల్లా చెదరవడంతోనూ, ఒక వ్యవస్థ బీటలు వారడంతోనూ ఎందుకు ముగిసినట్టూ!!

……

అసలు కధ అప్పుడే మొదలయింది గాబట్టి.

కధను శ్రీరాములు నాయుడు భుజాల మీంచి దించి అప్పల్రావుడు నడిపించాడు గాబట్టి. చివరికి అది అప్పల్రావుడి కొడుకు చేతుల్లో కత్తిగా మారి ‘ఒక తల – ఒక చిన్న దేహం’ గా మిగిలింది గాబట్టి.

శ్రీరాములు నాయుడు తీర్పు వెనుక అలకా ఆగ్రహం ఉన్నాయని ఎత్తి చూపి అందుకు కారణం చెప్పమని నిలదీస్తాడు అప్పల్రావుడు. అంతే గాకుండా నువ్వు కవుకు దెబ్బలు కొడుతున్నావంటాడు. చాప కింద నీరులా ముంచే మనిషివంటాడు. నా వేలితో నా కన్నే పొడుస్తున్నావంటాడు. “నువ్వు చెప్పిన తీరుపు నాయవయినదేనా? అసలు నాది అప్పేనా?” అని నిలదీస్తాడు.

అప్పటిదాకా శ్రీరాములు నాయుడిని అంత మాటలు అన్నవారు లేరు!

అరుదైన ఉద్రేకానికి గురి అయిన శ్రీరాములు నాయుడు “ఇది అప్పే! అప్పే!!అప్పే!!” అని ముమ్మారు ప్రకటిస్తాడు. “అసలు ఇది అప్పుగాదని ఎవరైనా ఎలా అంటారో నాకు బోధ పడటం లేదు” అంటాడు.

అప్పల్రావుడి మడి సెక్క అమ్మి అప్పు తీర్చడానికి రంగం సిద్ధమవుతుంది.

“శ్రీరావులు బాబూ నిజం నీకూ తెలిసుండదు. ఇది నాయవైన అప్పుగాదని ఎందుకన్నానో ఆ కధంతా తవరికి సెప్పి అమ్మకం కాయితాల మీద ఏలి ముద్ర పెడతాను” అంటాడు అప్పల్రావుడు.

ఏభై ఏళ్ళ నాడు తను ఆరు ఎకరాలకూ సిన్న కొంపకూ వారసుడవడం, ఊళ్ళో అందరికీ అంతో ఇంతో సెక్క ముక్కా, సరిపడా తిండి గింజలూ కట్టుకోడానికి గోచి ముక్కా ఉండటం, వాళ్ళ పిచ్చి కుంచాల వర్తక ధర్మాలకు మోసపోయినా రైతులు షావుకార్లకు మదుపు పెట్టే స్థితిలో ఉండటం…

మెల్లిగా పొగాకూ వేరుశెనగలాంటి వ్యాపారప్పంటలు రావటం, మగ్గాలు మూత పెట్టిన సాలెవాళ్ళు పంటల వ్యాపారంలో దిగి షావుకార్లవడం, వాళ్ళు కింద నుంచి పైకి లేవగా రైతులు కిందకి దిగజారడం..

వ్యాపారప్పంటల్లో కలిసి వేలు పెట్టిన తానూ గోపన్న అయిదేళ్ళ పాటు కలసికట్టుగా పైకి లేవడం.. తర్వాత గోపన్న పైకీ తాను కిందకీ చేరడం, తొమ్మిది ఎకరాలయిన తన ఆరెకరాల పొలం చివరికి రెండుంచిల్లరకు తగ్గి పోవడం, మాలలూ గొల్లలేగాకుండా కొందరు కొందరు కాపులూ ఈ సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరవడం …

.. అప్పులమాయ తెలిసీ రైతులు చేజేతులా అందులో చిక్కుకోవడం, చివరికి అప్పునిచ్చిన షావుకార్లూ మునిగిపోవడం, ఊళ్ళో వర్తకుల్ని బయట వర్తకులూ, వాళ్ళను ఇంకా పెద్ద వర్తకులూ ముంచేయడం, ఇదంతా “నరుడు తెచ్చిన ముప్పా; నారాయుడు బెడుతున్న సిక్కా” అన్న మీమాంస.

ఇవన్నీ చెప్పాక పదిహేనేళ్ళనాడు శ్రీరాములు నాయుడు ఊళ్ళోకి అడుగు పెట్టినపుడు తామంతా సంబరపడటం, హైస్కూలూ రోడ్డూ లాంటివి పేదోళ్ళకు కొంత కాలం పనులు కల్పించినా కొత్త పనులు లేక చతికిల పడటం, రోడ్డు వల్ల బళ్ళ వాళ్ళూ , కరెంటు వల్ల ఏతాల వాళ్ళు , మిల్లుల వల్ల దంపుడు వాళ్ళూ జీవనోపాధి కోల్పోవడం, ఊరు బాగుకోసం విరాళాలూ, భూవులూ ఇచ్చిన కామందులు బాగు పడగా – శ్రమ దానం చేసిన బీదా బిక్కి మరింత చిక్కి పోవడం చెబుతాడు. శ్రీరాములు నాయుడు పుణ్యమా అని ఒకప్పుడు దివాల తీసిన షావుకార్ల బిడ్డలంతా ఇపుడు ఎలా పుంజుకొంటున్నారో చెబుతాడు. శ్రీరాములు నాయుడు మొదలెట్టిన యజ్ఞం అందర్నీ ఎలా పాపంలోకి దింపిందో చెబుతాడు. గతరాత్రి తన కొడుకు సీతారావుడు “బూవి అమ్మితే నిన్ను నరికి నన్ను నేను నరుక్కు సస్తాను” అనడం గురించి చెబుతాడు. ఇంటెల్లపాది రెయ్యింబవళ్ళు కష్టపడినా తమకు గంజి మెతుకులు దొరక్క పోగా రుణాల ఊబిలో దిగబడటమూ – అటు ఏవీ లేనోళ్ళు ఏడాది తిరిగే లోగా కావందులవడమూ చెప్పి “ఎవరి సొమ్ము ఎవరు పడేసుకోడం వల్ల గొప్పోళ్లయిపోతున్నారో, ఎవరికెందువల్ల కూడు బుట్టకుండా పోతుందో ఆ ఇవరం మీరే చెప్పండి” అని అడుగుతాడు.

..అడిగి, శ్రీరాములుకేసి చూసి, క్షణ కాలం ఆశపడతాడు. తనది అడియాస అని తేలగా వేలిముద్ర వేస్తాడు. సీతారావుడు పరుగు పరుగున పేటకేసి వెళతాడు. అక్కడేదో జరగబోతుందని శ్రీరాములు నాయుడు గ్రహిస్తాడు. చిరునవ్వు స్థానంలో చీకట్లు కమ్ము కొంటాయి. గజగజ గజగజ వణుకు. ఆ ధీరోదాత్తుడిలో ఈ మార్పుచూసి జనంలో భయం…

.. తిరిగొచ్చిన సీతారావుడి భుజాన ఉన్న గోనె సంచిలో ఓ తల – చిన్న దేహం.. సీతారావుడి కొడుకుది. నోరు విప్పిన సీతారావుడు జనం మెప్పు కోరే అప్పల్రావుడ్నీ, తనను ఏలే దొరలు మునసబు కరణాలని గ్రహించలేని ‘ఎర్రిపీరు’ శ్రీరాములునాయుడినీ ఎండగట్టి – మునసబుకో సవాలు విసురుతాడు: మంటపం తెరిచిన రోజున ఊళ్ళో తగాదా ఊర్లోనే తీరుమానం గావాలని నువ్వు అన్నావట … ఇపుడు చెప్పు అచ్చురిపోర్టు కోస్తావా, నా కూనీ మాఫ్ చేస్తావా…

ఈ ప్రశ్నకూ ఇలాంటి లక్షలాది ప్రశ్నలకూ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వ్యవస్థ సమాధానం చెప్పదు. చెప్పలేదు.

“ధర్మ పన్నాలెంతవరకూ? … అంతా నువ్ చెప్పినట్టు వినే వరకూ …. “ అన్నవ్యాఖ్యతో “యజ్ఞం” ముగుస్తుంది.

…..

సూటిగా సాగిన కధ. ఏ మాత్రమూ క్లిష్టత లేని భాష. ‘మన ఊర్లోనే జరిగినట్లు ఉందే’ అనిపించే సహజమైన కధా మండప వేదిక . రక్తమాంసాలున్న పాత్రలు.

.. వస్తువు? భగవంతుడికి కూడా ఒక పట్టాన అర్ధం కానంత అతి క్లిష్టమయినది!!

చదివేవాళ్ళను ఉద్దేశ్య పూర్వకంగా ‘తప్పుదారి’ పట్టించి, రామరాజ్యపు సౌరభాలను చవి చూపించి, మాహాత్ముడు కలలుగన్న మరో ప్రపంచపు పొలిమేరలకు చేర్చి, ఓ తాడూ బొంగరం లేని ఊరు ఒకే ఒక్క వ్యక్తి పూనికలో ఆదర్శ గ్రామంగా ఎలా ఎదగగలదో చూపించి .. నిరూపించి…

..ఊహల ఉయ్యాలల్లో ఒళ్ళు మరచిపోతున్న పాఠకులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసి, వారి గుండెల మీద వేల సమ్మెట పోట్లు పెట్టి, రెండు తరాలు గడిచి పోయినా ఆ పోట్లు ఇంకా సలుపుతూ ఉండేలా చెయ్యడం ఎవరికన్నసాధ్యమా?

సాధ్యమేనని చెపుతుంది “యజ్ఞం”.

చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించి, పరిణామాల్ని పరిశీలించి, విపరీత లక్షణాలను గ్రహించి; ఆ గ్రహింపు ఏదో చైతన్యాన్ని మేలుకొలిపినపుడు, ఒక సంవేదనకు మూలమయిన ఒక ఆవేదనకు ప్రేరణ అయినపుడు, తన పరిశీలనకు సామాజిక ఆర్ధిక అవగాహన జోడించినపుడు, సమస్యల మూలాలను రాగద్వేష రహితంగా శోధించినపుడు, ఆయా పరిశీలనలనూ శోధనలనూ వాస్తవానికి దగ్గరగా నిజ జీవిత సంఘటనల సాయంతో అక్షర రూపంలో అరుదైన సృజనతో చిత్రించినపుడు ‘యజ్ఞం’ లాంటి కధలు పుడతాయి. సమాజపు చేతన మీద సమ్మెట పోట్లవుతాయి.

ఈ అప్రయత్న ప్రయత్నం ఆరు సారా కధల్లో కనిపిస్తుంది. ‘స్మైల్’ రాసిన ఖాళీ సీసాల్లో కనిపిస్తుంది. మరో రకంగా పద్మరాజుగారి ‘గాలివాన’, బుచ్చిబాబు ‘నన్ను గురించి కధ రాయావూ’ ల్లో కనిపిస్తుంది. కానీ ‘యజ్ఞం’కు ఓ చారిత్రక ప్రాముఖ్యత ఉంది.

“ఒకప్పుడు తెలుగు కధ వ్యక్తుల అంతరంగ జీవనాన్ని కేంద్రంగా చేసుకొని సాగింది. ఇపుడు వ్యవస్థాగత జీవన చిత్రణ ముఖ్య పాత్ర వహిస్తోంది. వ్యక్తి – సమాజం – వ్యవస్థల మధ్య ఉన్న పరస్పర సంబంధాల చిత్రణ జరుగుతోంది. బహుశ యజ్ఞం కధ అందుకు నాంది పలికిందనుకొంటాను. అందుకే ఆ కధకు ఒక ఉనికి వచ్చింది. దోపిడీ నిజరూపాన్ని బలంగా సాహిత్యపు ఎజండాలోకి తీసుకు వచ్చిన కధ యజ్ఞం” అన్నారు కాళీపట్నం 1997 నాటి ఒక ఇంటర్వ్యూలో. నిజానికి తెలుగు కధా చరిత్రను యజ్ఞంకు ముందు, యజ్ఞం తరవాత అని వర్గీకరించుకోవచ్చు.

…..

ఏభై ఏళ్ళు దాటినా ఒక రచన ఇంకా ఎంతో రెలవెంట్ గా ఉందంటే అది సంతోషించ దగిన విషయమా – ఆందోళన పడవలసిన విషయమా?

కొడవటిగంటి గారితో నేను పరిపూర్ణంగా అంగీకరిస్తాను. అది ఆందోళనదాయకం.

కానీ ఏభై ఏమిటి వందల సంవత్సరాలు గడిచినా వేమనలు ఇంకా మనకు దిశానిర్దేశకులే! అంచేత ఆందోళన కాస్తంత పక్కన పెట్టి యజ్ఞం ఎత్తి చూపిన అనేకానేక విషయాలను పరిశీలించి, అధ్యయనం చేసి, చర్చించి మనం కాస్త ముందుకు వెళ్ళవలసిన అవసరమూ అవకాశమూ లేవూ?

పుష్కలంగా ఉన్నాయి.

ఏది అభివృద్ధి? ఏది సమాజ సౌభాగ్యం? ఏది సమర్ధ నాయకత్వం? ఏది గుడిబండలాంటి మన గతం? ఏది బహుజన హితం? ఏది న్యాయసమ్మతమైనా నైతికంగా దివాళాకోరుతనం? ఏయే ప్రమాదాలను మనం దాటుకొని వచ్చాం? ఏయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి? ఎవరు తమకే తెలియని మేకవన్నెపులులు? ఎవరు తమకే తెలియని అమాయక బలిపశువులు ….

ఇలాంటి ప్రశ్నలు – మనం సుందరపాలెంలో ఉన్నా, రాబోయే రాజధానిలో ఉన్నా – గ్రహించగల అడగగల శక్తి మనకు కావాలి. ఈ విషయంలో ఇప్పటికీ దిశానిర్దేశం చెయ్యగల దార్శనికత ఉన్న రచన యజ్ఞం. విరుచుకు పడబోతున్న ప్రపంచీకరణ గురించి 1964లోనే ‘యజ్ఞం’ ప్రమాద ఘంటికలు మోగించినా ఇంకా మనం ఆ విషయంలో ఏనుగును వర్ణించే నలుగురు అంధుల్లా లేమూ?! రావి శాస్త్రి నుంచి, కాళీ పట్నం నుంచీ మనం గ్రహించి చర్చించవలసిన విషయాలు ఎన్నో లేవూ?

……

ఈ సంధర్భంగా ‘యజ్ఞం’ కధ గురించి ఒకటి రెండు విషయాలు చెప్పుకోవాలి. కధలో వ్యవస్థ చేసే పన్నాగాలనూ, దుర్మార్గాలనూ అప్పల్రావుడితో ఎంతో స్పష్టంగా సూటిగా చెప్పిస్తారు రచయిత. ఆ తర్వాత సీతారావుడితో ఆ వ్యవస్థను తిరుగులేని విధంగా సవాలు చేయిస్తారు.

కొమ్ములుదిరిగిన ఆర్ధికవేత్తలకూ, సామాజిక సంవేదన ఉన్నఅభ్యుదయాన్ని మనసారా కాంక్షించే మేధావులకూ అంతుచిక్కని వ్యవస్థాగత పద్మవ్యూహ దుర్మార్గాలు కధలో అప్పల్రావుడూ, సీతారావుడూ అరటిపండు వలచి చేతిలో పెట్టినంత సులభంగా, సమర్ధంగా ఎలా విప్పి చెప్పగలిగారు?! నిజమే ఒక జీవితకాలం ఆలోచనాశీలతతో గడిపిన కొంతమందిలో సహజ పరిజ్ఞానం – నేటివ్ విజ్డమ్ – పుష్కలంగా ఉండే మాట నిజమే. కానీ ఆ పరిజ్ఞానం సునిశిత పరిశీలన వరకూ పనికొస్తుందే గానీ సూక్ష్మ అవగాహనకూ విషయ నిర్ధారణా సీమకూ చేరుకోలేదు. మరి అంత క్లిష్టమయిన వ్యవస్థాగత విషయాలు రాత్రికి రాత్రి అప్పల్రావుడు ఎలా గ్రహించగలిగాడూ?! (నా మట్టుకు నాకు నిజం నిన్న రేత్తిరి దాకా తెలియలేదు…) అతని ఆ అవగాహనకు దోహదం చేసిన సీతారావుడికి, చుట్టం ఎర్రయ్యకూ మాత్రం అంత విచక్షణ ఎలా సమకూరిందీ? ఈ వ్యాసం కోసం కధను పదే పదే చదివినపుడు ఈ సందేహం నాకు పదేపదే కలిగింది. మళ్ళీ నిదానంగా ఆలోచిస్తే ఈ కధాపరిధిలో, ఈ కధా నేపధ్యంలో విషయాన్ని అలా అప్పల్రావుడితో చెప్పించడం కన్నా మరో మార్గం లేదనీ నాకు అనిపించింది.

అలాగే కధ చిట్టచివర సీతారాముడు – దాదాపు హఠాత్తుగా – శ్రీరాములు నాయుడిని ‘ఏలేది’ కరణమూ, మునసుబూ అన్న సంగతి స్ఫుటంగా ఎత్తి చూపుతాడు. వాళ్ళను ప్రభుత్వానికీ, రాజ్యానికీ, వ్యవస్థకూ ప్రతీకలుగా తీసుకొని రచయిత ఆ మాట చెప్పించాడన్న మాట నిజమే కానీ.. కధలో వాళ్ళిద్దరూ ‘ఏలే’ ప్రక్రియను సూచనా మాత్రంగానైనా చిత్రించకుండా ఒక్కసారిగా ఆ మాట చెప్పించడం వెలితిగా అనిపిస్తుంది. ఆ కరణం మునసబుల పాత్రలు దాదాపు మౌన పాత్రలు… ఇంకొంచం శ్రద్ధగా వాళ్ళ పాత్రలనూ, ఆ నిర్ధారణనూ చిత్రించి ప్రతిపాదించి ఉండవలసింది.

సుందరపాలెం ‘ అభివృద్ధి’ చెందిన క్రమాన్ని కధలో చెప్పినపుడూ, ఆయా అభివృద్ధి కార్యక్రమాల విష పరిణామాలను ఎత్తి చూపినపుడూ – అసలు ఈ కధ యావత్తూ అభివృద్ధిని నిరసిస్తోందా- అన్న అనుమానం కలిగింది నాకు. ( రోడ్లు వచ్చి బళ్ళ వాళ్ళు, కరెంట్ వచ్చి ….) . నిజమే – సమాజంలో ఒక్కో మార్పు సంభవించినపుడు ఒక బృందం, ఒక్కోసారి ఒక తరం యావత్తు తమ జీవనోపాధినే గాకుండా జీవన విధానాన్ని సైతం (వే ఆఫ్ లైఫ్) కోల్పోయి ఒడ్డున పడ్డ చేపలవడం ఒక చారిత్రక వాస్తవమే. కానీ అలాగే రైళ్ళూ రోడ్లూ కార్లూ విమానాలు కరెంటూ రైసుమిల్లులూ – చారిత్రక అవసరాలు. సామాజిక వాస్తవాలు. ఆ మార్పుల వల్ల అనేక మంది నిరాధారులుగా మిగిలే ప్రమాదాన్ని ముందే గ్రహించి వాళ్ళ వాళ్ళ జీవితాలను వీలయినంత సరళంగా, బాధారహితంగా చేయగల ముందస్తు ప్రణాళికలను రూపొందించి అమలు పరచడం దార్శనికత ఉన్న ప్రభుత్వాలు చేయవలసిన పని. కానీ చాలా సార్లు ప్రభుత్వాలు ఈ పని చెయ్యవు. అంత మాత్రం చేత యావత్తు అభ్యుదయాన్నే శంకించడం నిరసించడం సమంజసమా?!

……

సీతారావుడు తన కొడుకును తెగ నరకడం విషయంలో ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది. జరుగుతోంది. అందులోకి నేను వెళ్ళను. నాకు అంత శక్తి లేదు. కానీ ఒక్క మాట – ఆ సంఘటనను చిత్రించడంలో రచయిత ప్రాధమిక ఉద్దేశ్యం ఏమయినా అది వ్యవస్థ కాలరు దొరక బుచ్చుకొని నిలదీయడానికి బలంగా ఉపయోగపడింది. (రిపోర్టా – మాఫీనా?) జవాబు ఇవ్వలేని సవాలును సంధించడానికి గొప్పగా ఉపయోగపడింది. అదే ప్రశ్నను మనకు మనమూ వేసుకొని సమాధానం చెప్పవలసిన నిరంతర అవసరాన్ని కల్పించింది.

శ్రీరాములునాయుడూ, అప్పల్రాయుడూ, సీతారావుడూ, గోపన్న, మునసబు, కరణం, గుడిమంటపం, హైస్కూల్, రోడ్డు – ఇవి అసలు స్థలాలూ పాత్రలూ కావు, ప్రతీకలు – అన్నఆలోచన ఒకటి ఉంది. ఆయా ప్రతీకలను గుర్తించి వివరించి కధలోని తాత్వికతను, గోప్యతను విశదీకరించి యజ్ఞాన్ని ఇంకా ఉన్నతీకరించవచ్చు. నేను ఆ హనుమంతుడ్ని గజం బద్దతో కొలిచే పని పెట్టుకోను. నిజానికి మనం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదని నేను అనుకొంటాను. కధను ఉన్నది ఉన్నట్టుగా మన ఆలోచనల్లో, అనుభవాల్లో, సంస్కారంలో, విజ్ఞానంలో ఒక భాగం చేసుకోగలిగితే మనల్ని మనం ఎంతో ఉన్నతీకరించుకో గలుగుతాం!

……

చట్టం, న్యాయం, ధర్మం, నీతి అన్న అంశాల మూలాలలోకి వెళ్ళి ప్రశ్నించిన రచన ‘యజ్ఞం’. ఎంతో సంక్లిష్టమయిన వ్యవస్థ స్వరూపాన్ని సామాన్య పాఠకులకు కూడా అర్ధమయ్యేలా విప్పి చెప్పిన కధ ఇది. ఆ చెప్పటం కూడా ‘వేదిక’ మీది భాషణ ధోరణిలో గాకుండా ‘ మనకు తెలిసిన దానిని పది మందితో పంచుకోవడం’ అన్న ధోరణి లో సాగడం వల్ల విషయం పాఠకుల మేధస్సులకే గాకుండా మనస్సులకు సైతం సూటిగా చేరగల సౌలభ్యం సాధించింది ఈ కధ.

ప్రపంచంలో ఏడే ఏడు కధలున్నాయనీ, మిగిలిన ఏడు మిలియన్ల కధలూ – రామాయణ మహాభారతాలూ, ఇవియడ్ ఒడెస్సీలతో సహా – ఆ ఏడు కధల ప్రతిరూపాలేనని ఒక సర్వజన ఆమోదముద్ర ఉన్న సాహితీ భావన బాగా ప్రచారంలో ఉంది. అది నిజమే అయిన పక్షంలో ఆ ఏడింటికీ తప్పక జోడించవలసిన ఎనిమిదో కధ – యజ్ఞం.

                                                                                                        దాసరి అమరేంద్ర

మీ మాటలు

  1. Where can I read this story? Is it available online?

  2. చాలా బాగుంది అమరేంద్ర గారూ….”యజ్ఞం” యొక్క స్థానం చరిత్రలో స్థిరం అయిన వైనం చక్కగా వివరించారు.

    ” కానీ అలాగే రైళ్ళూ రోడ్లూ కార్లూ విమానాలు కరెంటూ రైసుమిల్లులూ – చారిత్రక అవసరాలు. సామాజిక వాస్తవాలు.” అది పాక్షిక సత్యమేమో అని నా అనుమానం, ఏయే సౌకర్యాలు కల్పిస్తే, ఊరి బయటి వర్తకులు, ఊరి లోని వర్తకులనూ,ఇరు పక్షాలూ కలిసి రైతులను దోచుకోడానికి వీలు కలుగుతుందో, అవే అభివృద్ధి ముసుగులో ఆ ఊరిలోకి వచ్చాయి. భూమి మీద కర్షకులు సృష్టించే సంపదనూ, వారి భూమి మీది అధిక్యతనూ – చేజిక్కించుకోవడం ఒక పధకం ప్రకారం జరుపుతున్నవారి చేతిలో పనిముట్టు గా శ్రీరాములు నాయుడు కనబడతాడు. అతను జరిపిన గ్రామాభివృద్ధి వారి పధకం లో భాగమైన అవసరం తప్ప, inevitable ఐన సామాజిక వాస్తవం అని ఖండితం గా చెప్పలేం.

    శాస్త్రీయ విజ్ఞానం అందించే సౌలభ్యాలు absolute అని అనలేం. అవి రావడం ఊరిలో వారికి మంచి జీవితాన్నిచ్చేవి అనే ఊహాగానం చేసే సావకాశం ఉన్నట్టైతే, ఉమ్మడి వ్యవసాయం జరిగి, రైతులే వారి పంట ను మిల్లుల్లో వేసుకుని, ధాన్యాన్నిఅమ్ముకునే లాభాల్లో కూడా భాగస్వామ్యం పొందే పరిస్థితుల్లో కూడా ఈ రోడ్లూ, మిల్లులూ వంటి అభివృద్ధిని మనం పొందవచ్చు.కాస్తంత ఆలస్యం కావచ్చు…అంతే!

    “మార్పుల వల్ల అనేక మంది నిరాధారులుగా మిగిలే ప్రమాదాన్ని ముందే గ్రహించి వాళ్ళ వాళ్ళ జీవితాలను వీలయినంత సరళంగా, బాధారహితంగా చేయగల ముందస్తు ప్రణాళికలను రూపొందించి అమలు పరచడం దార్శనికత ఉన్న ప్రభుత్వాలు చేయవలసిన పని.” అనే సర్దుబాటుని నేను అంగీకరించలేక పోతున్నాను….

  3. కళ్యాణి గారూ మీ వ్యాఖ్యను లేటుగా చూసాను..ఇవి కలసి మాట్లాడుకోవలసిన విషయాలు..హోప్ we wiil do that సూన్

  4. THIRUPALU says:

    //విరుచుకు పడబోతున్న ప్రపంచీకరణ గురించి 1964లోనే ‘యజ్ఞం’ ప్రమాద ఘంటికలు మోగించినా ఇంకా మనం ఆ విషయంలో ఏనుగును వర్ణించే నలుగురు అంధుల్లా లేమూ?! రావి శాస్త్రి నుంచి, కాళీ పట్నం నుంచీ మనం గ్రహించి చర్చించవలసిన విషయాలు ఎన్నో లేవూ?//
    దార్శనికత ప్రసాదిస్తున్న ఈ కధలు చదివే పాఠకులే తక్కువై పోయారు ( అదీ ప్రపంచీకరణ లో భాగంగా) ఎంత దూరదృస్టి ! ఈ దూర దృశ్టిని కనుగొని ముందుకు సాగడమ లో మనమే వెనక బడి ఉన్నాం. అద్బుతం !

  5. S.Radhakrishnamoorthy says:

    ఎక్కడా ఆగవలసిన అవసరం లేకుండా చదివించిన విశ్లేషణ. నేనూ కారా కథలపై ఒకప్పుడు రాశాను. నా ‘కారాకథాకథనశిల్పము’ అన్న వ్యాసం 1972 లోనో 73 లోనో,రాసిన మూడునాలుగేళ్ళతరువాత, ‘భారతి’ లో వచ్చింది. ఒక మిత్రుడు ఆ టైటిల్ చూసి ‘ఇది విశ్వనాథ మీద వ్యాసమా, మాస్టారుగారిపైనా ?’అని చమత్కరించాడు. ఇప్పుడు రాస్తే ఆవ్యాసం అలా రాయనేమో? ఇక ప్రస్తుతం. సాహిత్యానికి, ప్రయోజనం ఉందా? ఉందని లేదని వాదనలు చాలాకాలంగా ఉన్నవే. కళ కళకోసమే అని కొందరు, కాదని చాలామన్ది అంటారు.సాహిత్యం సమస్యలకు పరిష్కారాలు చెబుతుందా? సమస్యల స్వరూపాలు అన్ని కాలాలలో ఒకటిగా ఉండవు. సార్వకాలిక పరిష్కారాలూ ఉండవు ఉంటే రామాయణ తరువాత కావ్యాల అవసరమే ఉండదు. ఇక ప్రతీకలతో కథను ‘ఉన్నతీకరించడమ్’ గురించి. మునగచెట్టు ఎక్కించడమ్ కాదు. ప్రతీకలు చూడడం అనివార్యం. ‘యజ్ఞం’ లోని పంచాయతి దృశ్యమ్లో మహాభారతంలోని జూదం సన్నివేశం కనిపిస్తే తప్పా? అప్పల్రాముడు అతడి మనుషులు పైగుడ్డలు వలిచేసిన పాండవుల వరుసలా కనిపిస్తారు. ఏడు కథల్లో ఇమిడిన కథ గొప్ప కథ కాకపోదు. మీది తప్పక చదవవలసిన వ్యాసమే. అభినందనలు.

మీ మాటలు

*