విలువల గురించిన సంవాదం – కారా ‘స్నేహం’ కత

karalogo

నిర్వహణ : రమాసుందరి బత్తుల

కారా మాస్టారి ‘స్నేహం’ కత చదవగానే మనుషుల మధ్య ఉండే సంబంధాలు, మ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన ఆలోచనలు నన్ను అలుముకున్నాయి. ఒక
మనిషి తనను నమ్మి సహాయార్ధిగా వచ్చినపుడు ఎవరైనా అతని పట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తారు?  తమ మధ్య అప్పటికే ఉన్న స్నేహాన్ని ఎలా వ్యాఖ్యానించుకుంటారు? వీటన్నింటి వెనుక ఉన్న విలువల చట్రం మనుషులను ఎలాంటి అనుభూతులకూ, అనుభవాలకూ గురి చేస్తుందీ అన్న ఆలోచనలు నన్ను నిలువనీయలేదు. ఈ ఆలోచనల వలయం నన్ను భావజాలానికి సంబంధించిన విషయాలలోనికి పడదోసింది.

భావజాలం ఎలా ఉనికిలోనికి వస్తుంది? దాని ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది? మానవ సంబంధాలను అది ఎలా ప్రభావితం చేస్తుందీ అన్నవి ఆసక్తికరమైనప్రశ్నలు. పరస్పర వైరధ్యాలు, విభిన్నత కలిగిన సమాజాలలో అనేక భావజాలాలు ఒకే సమయంలో ఉనికిలో ఉండడమే కాకుండా పరస్పరం పోటీ పడడం కూడా మనం చూస్తూ ఉంటాం. భావజాలం ఉనికిలోకి రావడానికీ, అది మిగిలిన వాటి కన్నా  ప్రబలంగా  మారడానికీ మనిషి అవసరాలే ప్రాతిపదిక.  తన అవసరాలకు ఆటంకంగా మారిన పాత    ఆలోచనలను, విధానాలను అడ్డు తొలగించుకోవడానికి మనిషి సంకోచించడు. నిరంతరమూ  మారుతూ ఉండే మనిషి అవసరాల మాదిరిగానే భావజాల ఉనికి, వాటి ప్రభావాలూ  సాపేక్షికాలు. సమాజంలోని వివిధ వర్గాల, అస్తిత్వాల ప్రయోజనాలు పరస్పరం సంఘర్షిస్తూ ఉన్నప్పుడు, వాటి ఘర్షణ భావజాలాల నడుమ ఘర్షణగా వ్యక్తమవుతూ  ఉంటుంది. వీటిని మనం విలువలు, విశ్వాసాలు, సంబంధాలు, విధానాల తాలూకు  ప్రశ్నలుగా, సంవాదాలుగా చూస్తుంటాం. ఇలాంటి ఒక సంవాదమే కారా ‘స్నేహం’.

అరవై తొమ్మిదుల్లో రాసిన ఈ కత, విషయరీత్యా చాలా చిన్నదే అయినప్పటికీ, ఈ  కాలపు తన ఇతర కతల్లాగానే అనేక అంశాలను పాఠకుల ముందుకు తెస్తుంది. ఈ కతను
పై నుంచి చూసినపుడు, నమ్మి వచ్చిన స్నేహితుడిని మోసం చేసిన కతగా  కనపడుతుంది. స్నేహానికి ఉన్న పాత అర్థాన్ని చెరిపేసి, ఒక కొత్త అర్థాన్ని  ప్రతిపాదిస్తున్న కతగా కనిపిస్తుంది. అయితే ఇది వీటికి మాత్రమే పరిమితమైన  కత కాదు. వీటిని కేంద్రంగా చేసుకొని మరింత లోతుల్లోకి తరచి చూసిన కత.

స్నేహానికి విలువనియ్యాలనీ, ఆపన్నుడై వచ్చిన సహాయార్ధికి తప్పనిసరిగా,  శ్రమకోర్చి అయినా సహాయం చేసి పెట్టాలనే విలువకు, జీవితం వైకుంఠపాళీ  కాబట్టీ – తన విలాసాలకు, తన అవసరాలకూ, తను మరింత ‘పైకెగబాకడా’నికీ వచ్చిన  అవకాశాన్ని ఏమాత్రమూ వెనకాడకూడదూ  అనే విలువకూ నడుమ జరిగే ఘర్షణను దాని  రక్త మాంసాలతో సహా అనుభవంలోకి తెచ్చే కత . ఈ ఘర్షణలో మనుషులలో ఏర్పడే  సంవేదనలను సెస్మోగ్రాఫుపై లెక్కించి చూపిన కత. కొత్త విలువలూ, కొత్త  విశ్వాసాలూ- పాత విలువలనీ, పాత విశ్వాసాలనూ ధ్వంసించి, ఆసాంతమూ  ముప్పిరిగొని తమ ఉనికికి మనుషుల చేతననే పతాకగా ఎగరేస్తూ తమను తాము  వ్యక్తం చేసుకొనే కత .

ఈ కతను చదవడం మొదలు పెట్టగానే పాఠకుడికి అర్థం అయ్యే  అంశాలు డాక్టరు  వేణుగోపాలరావు ఆతృత, అవసరం. రాజారావుతో అతనికి గల స్నేహం. వీటికి గల నేపథ్యం, ప్రాతిపదిక అతని చిన్ననాటి  స్నేహితుడు శివయ్య వచ్చాక గానీ  పాఠకుడి అవగాహనలోకి రావు. వేణుగోపాలరావు ఎదిగి వచ్చిన సమాజం ఎలాంటిది?

ఇప్పడు తను ఉన్న పరిస్థితులకూ, గతానికీ ఉన్న తేడా ఏమిటీ? తనను చదివించి, పిల్లనిచ్చిన మామతో, కట్టుకున్న భార్యతో అతని సంబంధాలు ఎలాంటివన్న విషయాలు ఒక్కొక్కటిగా వాళ్ళ సంభాషణలో బయటికి వస్తాయి. శివయ్యకూ, వేణూగోపాలరావుకూ ఉన్న స్నేహం గురించి కూడా అప్పుడే తెలుస్తుంది. అయితే వీటన్నింటికీ రచయిత ఉద్దేశించిన అర్థం, కత చివరలో వేణుగోపాలరావు  స్నేహానికీ, మానవ సంబంధాలకూ ఇచ్చిన వ్యాఖ్యానం ద్వారా గానీ  మన  అనుభవంలోకి రావు. ఆసాంతం చివరకు వచ్చాక రచయిత ఏం చెపుతున్నాడో మన మనసులో ఒక్కొక్కటిగా స్ఫురిస్తున్నపుడు, వాటిని రూఢీ చేసుకునేందుకు తిరిగి మళ్ళీ కథనంలో దొర్లిన అనేక సంగతులలోకీ, వివరాలలోకీ మనం ప్రయాణిస్తాం. ఇలాంటి శిల్పసంవిధానంతో  వేణుగోపాలరావునూ, శివయ్యనూ, రాజారాంనూ  అర్థం  చేసుకుంటాం.

వేణుగోపాలరావును మోసగాడని, స్నేహధర్మం పాటించని వ్యక్తని చెప్పడానికి  నిజానికి కతలో ఇన్ని విషయాలను చొప్పించనవసరం లేదు. అసలు రాజారావు పాత్రే  అవసరం లేదు. మరి రాజారావు పాత్రకున్న ప్రాముఖ్యత ఏమిటి?

వేణుగోపాలరావు గతానికి శివయ్య ఎలానో అతని వర్తమానానికి రాజారావు సంకేతం. మారిన తన అభిరుచులకూ, స్నేహాలకూ, సంబంధాలకూ అతను కొండ గుర్తు. అతను దళారీ
మాత్రమే కాదు. వేణుగోపాలరావులో ఇంకా మిగిలి ఉన్న గతకాలపు వాసనలకూ,  ఎగబాకడమొక్కటే పరమావధిగా ఉన్న వర్తమాన ఆకాంక్షలకూ మధ్య జరిగే  బలహీనమైన
ఊగిసలాటకు అతను వేదిక. శివయ్య తన కొడుకు ఉద్యోగం సిఫారసు కోసం  వేణుగోపాలరావును ప్రాదేయపడినప్పుడు ఒక దశలో డబ్బు ప్రసక్తి లేకుండానే పని  చేయిద్దామా అన్నట్టూ ఊగిసలాడతాడు గానీ,  రాజారావు అతనిని తొందరగానే  వాస్తవంలోకి తేలగొడతాడు. ఇలాంటి ఊగిసలాటను పాఠకుడు సరిగ్గా అంచనా వేసుకోవడానికి రాజారావు సున్నితపు త్రాసులా పనికొస్తాడు. గతానికి   సంబంధించిన పనికి రాని ‘చెత్త’ నుండి బయటపడడానికి ఉత్ప్రేరకంగా కూడా పని  చేస్తాడు. రాజారావు ‘స్నేహం’ లేకుండా వేణుగోపాలరావు, వేణుగోపాలరావు కాడు.  అలాగని  రాజారావుకు పూర్తిగా డబ్బు మీదనే నమ్మకమా? డబ్బు లేకుండా పని  జరగకూడదని అంటాడా?  అంటే అలా  ఎన్నటికీ అతడు అనడు. అప్పుడప్పుడూ కాస్త  నిజం కలిపితే గానీ అబద్దానికి విలువుండదు అన్నట్టుగా, అప్పుడప్పుడూ కాస్త  మెరిట్‍కు కూడా చోటు దొరుకుతే గానీ మిగిలిన వాటికి ఢోకా ఉండదు అని నమ్మే  మనిషి తను. వ్యవస్థ ఆయువుపట్టు తెలిసిన వాడు కనుకనే మెరిట్‌కూ స్థానం  దొరకక పోదని ఆయన మనకు భరోసా ఇస్తాడు.

వేణుగోపాలరావులో కలిగిన  ఊగిసలాట శివయ్యకు అర్థం అవుతుంది కానీ,  దానిలోని ప్రయోజకత్వం పట్ల ఆయనకు నమ్మకం ఏర్పడదు. ఇంకా, డబ్బులు లేకుండా  నడిపే వ్యవహారంలో అసలుకే మోసం వస్తుందేమోననే భయం కూడా కలుగుతుంది. దీనికి  వ్యతిరేక దిశలో రాజారావు పట్ల అతనిలో నమ్మకం స్థిరపడుతుంది. ఇది క్షణ కాలం పాటు మనలో విస్మయం కలిగిస్తుంది. కానీ, కాసులు రాలకుండా ఉద్యోగం  రాదన్న సంగతి సమాజంలో స్థిరపడిపోయిన విశ్వాసంగా మనలో స్ఫురించినపుడు  దీనికున్న ప్రాసంగికత మనకు ఎరుకలోనికి వస్తుంది.

చివరకు, ఈ మొత్తం సంబంధాలనూ మీనాక్షీదేవి సమక్షంలో సైద్ధాంతీకరిస్తూ,  శివయ్య అవసరం కొద్దీ వచ్చిన మనిషనీ, కాబట్టి అతని నుంచీ ఇంకా డబ్బు వసూలు  చేయొచ్చుఅని వేణుగోపాలరావు అన్నప్పుడు వెంటనే  అతనిపై మనకు ధర్మాగ్రహం  కలుగుతుంది. కానీ లోకంలో స్నేహమే లేదంటే విస్మయపడే ఆమె ముందర అతని  ప్రసంగం వొట్టి వాచాలతేననీ మనం త్వరలోనే పసిగడతాం. పదే పదే దేనినైనా  సమర్ధించాల్సి రావడం .. అది బలంగా నాటుకోకపోవడం వల్లనే అన్న అవగాహనతో  వేణుగోపాలరావు ఇంకా రాజారావులా రాటుదేలలేదని రూఢీ చేసుకుంటాం. ఇంకా తరచి  చూసినపుడు వేణుగోపాలరావు ఎంత అసందర్భ ప్రలాపో కూడా మనకు ఇట్టే  బోధపడుతుంది. మీనాక్షీదేవి గారి సమక్షంలో ‘విష్ణుమూర్తిలాగా పవళించి’,  లోకంలో స్నేహమనేదే లేదని ఉవాచించడం, ప్రతీదీ అవసరాల కోసం చేసుకున్న  ఏర్పాటే అనడం వల్ల ఆ మాట మీనాక్షీ దేవికి కూడా తగులుతుందని, అది ఆమెను  నొప్పించి తీరుతుందన్న జ్ఞానం అతనిలో లేకపోయింది. అదే ఉన్నట్లయితే అతను  బహు నమ్మకంగా రాజారావు శివయ్యను లోబరుచుకున్నట్టుగా మాటాడి ఉండేవాడు.
ఇక్కడ కూడా వేణుగోపాలరావు తన అనుభవరాహిత్యాన్నే బయటపెట్టుకున్నాడు.  అయితే ఈ మాటలకు మీనాక్షీదేవిలో కలిగిన ప్రతిస్పందన కతాగమనాన్ని పూర్తిగా  మార్చి, కతను ఇంకొక తలంలోనికి ప్రవేశపెడుతుంది. అప్పటి వరకూ మధ్యతరగతిలో  ఉండే నమ్మకాలూ, విశ్వాసాలూ, పైకెగబాకాలనుకునే వెంపర్లాటలూ, వాళ్ళలోని  ఊగిసలాటలూ చెబుతూవచ్చిన కత, మీనాక్షీదేవి ప్రతిస్పందనతో తిరిగి  విశ్వాసాలకూ, స్నేహాలకూ లోకంలో విలువ ఉండితీరుతుందన్న మరో తలంలోనికి  ప్రవేశిస్తుంది. ఇది ఇప్పటి వరకూ కత నడచిన తలానికి, పూర్తి వ్యతిరేక  దిశలోని మరో తలం. విలువల గురించిన సంవాదంలో మానవీయమయిన ‘థీరీ’.  అందువల్లనే, మూడు రూపాయల కోసం గొంతులు కోయగల వాళ్ళున్న లోకంలో, మూడు వందల  కోసం  డాక్టరుగారు ఇట్టాంటి ‘థీరీ’ లేవదీసుంటారు లెమ్మని ఆమె చప్పున  గ్రహించగలుగుతుంది.

సామాజిక గమనంలో వ్యక్తులు ఒక దశ నుండీ ఇంకో దశకు మారుతున్నప్పుడు, పాత  స్నేహాల స్థానంలో కొత్త స్నేహాలు చోటు చేసుకుంటున్నప్పుడు, పాత సంబంధాలను  వదులుకొని కొత్త సంబంధాలను స్థిరపరుచుకుంటున్నప్పుడు వాటి సవ్యతను  సమర్దించుకోవడానికి, వ్యాఖ్యానిచడానికీ ఒక కొత్త భావజాలం అవసరం. ఇట్టాంటి  అవసరాన్ని సందర్భసహితంగా, మానవ సంవేదనలతో సహా పట్టుకున్న కత ‘స్నేహం’.  ఇది విలువల గురించిన సంవాదాన్ని ముందుకు తెస్తున్నది.

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

–అవ్వారి నాగరాజు

(ఎ.నాగరాజుగారు ప్రకాశం జిల్లాలో టీచరుగా పనిచేస్తున్నారు. ఈయన రాసిన కవితలు, వ్యాసాలు అరుణతారలోనూ, ఒకటీ అరా ఆంధ్రజ్యోతిలోనూ వచ్చాయి. తొలినాటి రచయితలలో శ్రీపాద అంటే ఇష్టపడతారు. మానవ భావోద్వేగాలను,  అందులోని ఘర్షణను ప్రతిభావంతంగా చిత్రీకరించిన అల్లం రాజయ్య, రఘోత్తం  రచనలు అంటే చాలా ఇష్టమట. దళితవాదంతో సహా, అన్ని అస్తిత్వ వాదాలూ  పరిమితులకు లోనయ్యాయని నాగరాజుగారు అభిప్రాయపడుతున్నారు. స్త్రీవాద  రచనలను చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తున్న పి.సత్యవతిగారి కథలను  మెచ్చుకున్నారు. నాగరాజుగారి బ్లాగ్ minnalpoetry.blogspot.com)

 

 

( వచ్చే వారం  ” సంకల్పం” కథ గురించి  పి. సత్యవతి గారు పరిచయం చేస్తారు)

మీ మాటలు

  1. రాఘవ says:

    ‘మనుషుల చేతన నే పతాకగా ఎగరేస్తూ…’ -చాలా బాగా చెప్పారు నాగరాజు గారూ!

  2. //మూడు రూపాయల కోసం గొంతులు కోయగల వాళ్ళున్న లోకం// ఇది. అవును , మానవ సంబందాలన్నీ ఆర్ధిక సంబందలే అనే ఒక గొప్ప సిద్దంతాన్ని పండు వలిచి చేతిలో పెట్టినట్లు నిరూపించిన కధ ” స్నేహాం ”. ఈ ఆర్ధిక సంబందాల నగ్నత్వానికి, స్నేహమనీ ,విలువలనీ, రక్త సంబదాలని, మానవీయ సంబందాలని అనేక ముసుగులు కప్పుకొని అందమైనా ఉహాల లో జీవించక పోతే మానసిక రుగ్మతలకు లోనైపోతారేమో మనుషులు.

    నాగరాజు గారి సమీక్ష బాగుంది. తమకు ఉన్న బలహీనతలకు ఏదో రకమైన నైతిక సమర్దన లేక పోతే మనిషి సచ్చి వూరుకుంటాడెమో! దాన్నే భావ జాలంగా చలా మనీ చేసుకొస్తున్నాడు మానవుడు. చాలా బాగా చెప్పారు.

మీ మాటలు

*