కొమురం భీం – గతమూ వర్తమానమూ

పోరాట ప్రతీక కొమరం భీమ్

పోరాట ప్రతీక కొమరం భీమ్

 

ఆదివాసుల వర్తమానంలో “నాగరికుల” గతం అక్షరాలా కళ్లకు కడుతుందని సామాజికశాస్త్రాల పరిశోధకులు, ముఖ్యంగా చరిత్రకారులు, మానుష శాస్త్రవేత్తలు ఎందరో అన్నారు. క్షేత్ర పరిశోధనల ద్వారా నిరూపించారు. ఆదివాసేతర సమూహాలను “నాగరికులు” అనడం సరైనదా కాదా అనే చర్చలోకి ఇక్కడ పోవడంలేదు గాని అసలు ఆదివాసులకు ఒక వర్తమానం ఉందా, వారింకా ఎడతెగని గతంలోనే ఉన్నారా అని చర్చించవలసి ఉంది. కొమురం భీం చరిత్ర ద్వారా ఆదివాసుల వర్తమానాన్నీ, గతాన్నీ చూస్తే వాటి మధ్య అభేదం కనిపిస్తున్నది.

ఆదివాసుల వర్తమానమూ గతమూ ఒక్కటిలాగే ఉండడం, దశాబ్దాలూ శతాబ్దాలూ గడిచినా ఆదివాసి జీవితాలలో, సమస్యలలో, వ్యక్తీకరణలలో, పోరాటాలలో, ఆదివాసులపట్ల మైదానవాసుల, రాజ్యాంగయంత్రాల వైఖరిలో ఏకసూత్రత ఉండడం ఆశ్చర్యాన్నీ విచారాన్నీ కలిగిస్తున్నది. ఆదివాసుల పట్ల మన వైఖరిలో ఒక అంశం నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్లనే ఆదివాసుల చరిత్ర చాలవరకు విస్మరణకూ, నమోదైన చోట్ల కూడ అస్పష్టతలకూ పొరపాట్లకూ గురయింది. మామూలుగానే మనకు చరిత్ర స్పృహ, చరిత్రను నమోదు చేయాలనే ఆలోచన చాల తక్కువ. అది అసలు మనకు చరిత్రే లేదని వలసవాదులు అనేందుకు, ఇతరులు నమ్మేందుకు దారితీసిందని మనకు తెలుసు. మన ఆలోచనాపరిధిలోనే లేని ఆదివాసుల చరిత్ర గురించి పట్టించుకోవడానికి మనకు తీరిక, ఓపిక ఉంటాయా?

చరిత్ర అధ్యాపకులు వకుళాభరణం రామకృష్ణ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర అని బహు సంపుటాల బృహత్తర గ్రంథం ఒకటి కొన్ని సంవత్సరాలుగా తయారవుతున్నది. ఆ గ్రంథం కోసం ఇరవయో శతాబ్ది చరిత్ర మీద గతంలో కొన్ని అధ్యాయాలు రాసి ఉన్నాను. ఆ నమ్మకంతోనే ఆయన ఇప్పుడు తయారీలో ఉన్న సంపుటానికి ‘హైదరాబాద్ సంస్థానంలో ఆదివాసి తిరుగుబాట్లు’ అనే అంశం మీద ఒక అధ్యాయం రాసి ఇమ్మని అడిగారు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మల నుంచి రాంజీ గోండు మీదుగా కొమురం భీం దాకా తెలంగాణలో ఆదివాసుల తిరుగుబాట్ల గురించి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాను గనుక ఇదెంత పని అనుకుని ఒప్పుకున్నాను. కాని దిగినాక గాని తెలుసుకోవలసినది చాల ఉందని తెలియలేదు. ‘జ్ఞానం అంటే మన అజ్ఞానం గురించి మనకు క్రమానుగతంగా తెలిసిరావడమే’ అని విల్ డ్యురాంట్ అన్నమాట ఎప్పుడో ముప్పై ఏళ్ల కింద చదువుకుని ఎన్నోసార్లు వాడాను గాని తెలుగు సమాజంలోని ఆదివాసుల చరిత్ర గురించి తెలుగు సమాజ జ్ఞానం ఇంత అజ్ఞానంతో నిండి ఉన్నదని ఈ వ్యాసం రాసే క్రమంలోనే అర్థమయింది. పగిడిద్దరాజు తిరుగుబాటు నుంచి కొమురం భీం తిరుగుబాటు దాకా (అంతకు ముందూ ఆ తర్వాతా జరిగిన తిరుగుబాట్లను పక్కన పెట్టినప్పటికీ) ఏడు శతాబ్దాలలో తప్పకుండా ఎన్నెన్నో తిరుగుబాట్లు జరిగి ఉంటాయి. కాని పద్దెనిమిదో శతాబ్దం దాకా నమోదైనవే లేవు. ఆ తర్వాత బ్రిటిష్ పాలనలోని మద్రాసు ప్రెసిడెన్సీ లోని ఏజెన్సీ ప్రాంతాలలో రంప తిరుగుబాట్లు, ద్వారబంధాల చంద్రయ్య, అల్లూరి సీతారామరాజు, వీర గున్నమ్మ వంటి నాలుగైదు, హైదరాబాద్ రాజ్యంలో రాంజీ గోండు, కొమురం భీం మినహా చరిత్రకెక్కినవి లేవు. వాటిలోనూ కొన్ని పరిణామాల గురించీ, ఘటనల గురించీ నాలుగైదు వాక్యాలలో తేల్చివేయడమో, పాదసూచికలో చెప్పడమో జరిగింది గాని సవివరమైన నివేదికలు లేవు. కాస్త వివరమైన నివేదికలు ఉండి, విస్తృతమైన ప్రచారం జరిగిన సందర్భాలలో కూడ అస్పష్టతలు, అన్వయం కుదరని సంగతులు, పొరపాట్లు ఎన్నో ఉన్నాయి. కొమురం భీం ఉదంతమే పెద్ద ఉదాహరణ.

**

కొమురం భీం నాయకత్వం వహించిన, వేలాది మంది గోండులూ, కోలాములూ, ఇతర తెగలూ పాల్గొన్న, కనీసం మూడు సంవత్సరాలు నడిచిన పోరాటం 1940లో అణచివేతకు గురైంది. అది అంత ప్రభావశీలమైన తిరుగుబాటు అయినప్పటికీ ఆదివాసుల సామూహిక జ్ఞాపకంలో తప్ప భీం మరెక్కడా లేకుండాపోయాడు. ఈ ప్రాంత సామాజిక చరిత్రలో భాగం కాకుండా పోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే భీం విస్మృత గతంగా మారిపోయాడు. ఆ గతాన్ని తవ్వితీసినదీ, వర్తమానంతో సంభాషింప జేసినదీ, భీంను పునరుజ్జీవింపజేసినదీ విప్లవోద్యమం.

జగిత్యాల, సిరిసిల్ల రైతాంగ పోరాటాలు కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలుగా విస్తరించిన కాలంలో, 1978-79ల్లో విప్లవోద్యమం ఆదిలాబాద్ జిల్లా అడవులలోకి ప్రవేశించింది. ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం నిర్మాణమై అది 1981 ఏప్రిల్ 20న ఉట్నూరు సమీపంలోని ఇంద్రవెల్లి గ్రామంలో మహాసభ జరపాలని తలపెట్టింది. ఆ సభకోసం చుట్టూ 60 గ్రామాల నుంచి వస్తున్న ఆదివాసులను అడ్డగించి, లాఠీచార్జిలు, అరెస్టులు చేసి, చివరికి తుపాకి కాల్పులు జరిపి ఆదివాసుల చైతన్యాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఇంద్రవెల్లి కాల్పుల్లో కనీసం 60 మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షుల, సమకాలిక ఆధారాలు చెపుతుండగా, 13 మంది మాత్రమే చనిపోయారనే అధికారిక “చరిత్ర” ఇప్పటికీ రాజ్యం చేస్తున్నది. ఆ సందర్భంలో అప్పటికే గిరిజన రైతుకూలీ సంఘంలో సమీకృతమవుతున్న ఆదివాసులు కొమురం భీంను తలచుకున్నారు. ఆ తలపోత కాల్పుల తర్వాత మరింత పెరిగింది. ఆదివాసులు వర్తమాన పోరాటాన్ని గత పోరాటంతో కలిపి చూసుకున్నారు. వర్తమాన దమనకాండను గత దమనకాండతో సమానమైనదిగా పోల్చి చూసుకున్నారు. ఈ వర్తమానం వల్ల గతం మళ్లీ ఒకసారి నవనవోన్మేష జ్ఞాపకమయింది.

ఆ సమయానికి ఆ ప్రాంతంలో విప్లవోద్యమ కార్యకర్తగా పనిచేస్తుండిన సాహు, అప్పటి విప్లవోద్యమ నాయకత్వం ఆ మౌఖిక చరిత్ర శకలాలను జాగ్రత్తగా సేకరించి, అల్లం రాజయ్యతో పంచుకున్నారు. ఇద్దరు రచయితలూ ఆ విషయం మీద అభినివేశం ఉన్న అనేకమంది మిత్రులతో కలిసి లోతైన పరిశోధన సాగించారు. కొమురం భీంను చంపి, ఆ పోరాటాన్ని అణచివేసిన తర్వాత నిజాం ప్రభుత్వం ప్రఖ్యాత మానుషశాస్త్రవేత్త క్రిస్టొఫ్ వాన్ ఫ్యూరర్ హేమెండార్ఫ్ తో చేయించిన పరిశోధనా నివేదికతో సహా లభ్యమవుతున్న లిఖిత ఆధారాలను సేకరించుకున్నారు. అలా ఎంతో కాలం శ్రమించి 1983లో కొమురం భీం అనే అద్భుతమైన చారిత్రక నవల రాశారు. ఆ నవలే కొమురం భీంను తెలుగు సమాజంలోకి మళ్లీ సజీవంగా తీసుకొచ్చింది.

ఇవాళ్టికీ అరకొర వనరులే దొరుకుతున్నాయనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటే, ముప్పై మూడు సంవత్సరాల కింద దొరికిన వనరుల మీద ఆధారపడి, కొంత విశ్వసనీయ కాల్పనికతకు కూడ అవకాశం ఇచ్చి సాహు, అల్లం రాజయ్య చేసిన ఆ కృషి మహాద్భుత ప్రయత్నమనే చెప్పాలి. వారు అప్పటికి సంప్రదించిన పదకొండు అధికారిక పత్రాల జాబితా కూడ ముందుమాటలో ఇచ్చారు. అప్పటికి ఇంకా భీంతో పాటు కలిసి పనిచేసినవారు, పోరాటంలో పాల్గొన్నవారు, భీంను చూసినవారు, భీం కుటుంబసభ్యులు కొందరైనా సజీవంగా ఉన్నారు గనుక రచయితలు వారందరినీ కలిసి మౌఖిక చరిత్ర వివరాలు సేకరించారు. అందువల్ల భీం రూపం గురించి, భావోద్వేగాల గురించి, పరిశీలనా శక్తి గురించి, నాయకత్వ లక్షణాల గురించి, వేలాది గోండులను ఆకర్షించిన సమ్మోహక శక్తి గురించి నవలలో చిత్రించిన విషయాలు చాలవరకు నిజమే అయి ఉండాలి.

అయితే భీం చివరి పోరాటం ఎప్పుడు జరిగిందనే దాని మీద, భీంను నిజాం పోలీసులు కాల్చి చంపిన తేదీ మీద వాళ్లు కొంత పొరపాటు పడ్డట్టున్నారు. “డర్ నా మత్ సత్తార్ సాబ్…. తారీఖ్ భూల్ గయా! ఆజ్ పెహలీ హై… సెప్టెంబర్…. బుధవారం … సంవత్సరం కూడా చెప్పనా 1940” అన్నాడు కెప్టెన్ – అనే సంభాషణ ద్వారా భీంను కాల్చి చంపిన తేదీ 1940 సెప్టెంబర్ 1 అని వాళ్లు రాశారు. భీం ఒరిగిపోయిన చోట స్మారకచిహ్నంగా అప్పుడే గోండులు పాతుకున్న ఒక రాయి మీద 1.9.1940 అని చెక్కి ఉండడం దీనికి కారణం కావచ్చు. అయితే కొమురం భీం నవల మీద సృజనలో వివరమైన సమీక్షా వ్యాసం రాసిన సి వి సుబ్బారావు, 1940 సెప్టెంబర్ 1 నవలలో రాసినట్టుగా బుధవారం కాదనీ, ఆదివారం అనీ సవరించారు. (1983లో వచ్చిన పిబిసి ప్రచురణ, ఆ తర్వాత వచ్చిన విరసం ప్రచురణ – 1993, ఆదివాసి ప్రచురణలు – 2004, 2010 కూడ ఈ బుధవారం అనే మాటను అలాగే కొనసాగించాయి. పర్ స్పెక్టివ్స్ ప్రచురణ 2013లో సంభాషణలోనే బుధవారం బదులు ఆదివారం అని మార్చారు).

సాహు, అల్లం రాజయ్యల నవల తర్వాత కొమురం భీం మీద, గోడుల జీవన పోరాటాల మీద రెండు మూడు నవలలు, కొన్ని కథలు, ఒక సినిమా, అసంఖ్యాక వ్యాసాలు వెలువడి కొమురం భీం గురించి, ఆయన నడిపిన పోరాటం గురించి ఎన్నో వివరాలను ప్రజల దృష్టికి తెచ్చాయి. కొమురం భీం మరణానంతరం నాలుగు దశాబ్దాల తర్వాత ఉజ్వల స్మృతిగా జీవించడం ప్రారంభించాడు.

**

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమక్రమంలోనూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతా కొమురం భీం ఒక విగ్రహంగా, ప్రతీకగా కూడ మారిపోయాడు. ఆయన పేరు తలవని వాళ్లు దాదాపు లేరు. ఆయన భావాలతో, ఆయన పోరాటంతో ఎంతమాత్రమూ సంబంధం లేనివారి నుంచి, ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్న వాళ్ల దాకా అందరూ ఆయనను ఏదో ఒక సందర్భంలో తలచుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణ వీర యోధులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందనే వాదనకు చిహ్నంగా కొమురం భీం ముందుకొచ్చాడు. పాఠ్యపుస్తకాలలో, హుసేన్ సాగర్ టాంక్ బండ్ మీద విగ్రహాలలో కొమురం భీం ఎందుకు లేడనే ప్రశ్న వచ్చింది. పాఠ్యపుస్తకాలలో ఏదో ఒకస్థాయిలో భీం పాఠంగా కూడ మారాడు. విశాలమైన ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలనే ఆకాంక్షకు, తూర్పు జిల్లాకు కొమురం భీం పేరు పెట్టాలనే కోరిక తోడయింది. చివరికి అక్టోబర్ 8న కొమురం భీం వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరిపింది. స్వయంగా ముఖ్యమంత్రి జోడెన్ ఘాట్ వెళ్లి అక్కడ కొమురం భీం స్మారక ఉద్యానవనానికి శంకుస్థాపన చేసివచ్చారు.

కొమురం భీం నవల తవ్వితీసిన సెప్టెంబర్ 1 స్థానంలో ఈ అక్టోబర్ 8 ఎక్కడినుంచి వచ్చినట్టు? వాస్తవంగా కొమురం భీం వర్ధంతి అక్టోబర్ 8 కాదు. బాబేఝరీలో స్మారక శిల మీద 1.9.1940 అని రాసి ఉందని ఇదివరకే చూశాం. ఆ రోజు ఆశ్వయుజ పౌర్ణమి అని భీం సమకాలికుల జ్ఞాపకం ఆధారంగా, జానపద గాథల ఆధారంగా ఆదివాసులు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి రోజున భీం వర్ధంతి జరుపుకునేవారు. ఈ సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి అక్టోబర్ 8న వచ్చింది గనుక రాష్ట్ర ప్రభుత్వం ఆరోజునే వర్ధంతి జరిపింది.

కాని ఇక్కడ మరొక చిక్కు ఉంది. 1940లో, విక్రమ సంవత్సర ఆశ్వయుజ పౌర్ణమి సెప్టెంబర్ 1న కాదు, అక్టోబర్ 16న వచ్చింది. పోనీ ముందరి నెలలో, భాద్రపద పౌర్ణమి అనుకుందామా అంటే అది సెప్టెంబర్ 16న వచ్చింది. అలా ఇప్పటికి ఉన్న రెండు తేదీలు – స్మారకశిల మీద ఉన్న సెప్టెంబర్ 1 అనే ఇంగ్లిష్ తేదీ, గోండుల జ్ఞాపకంలో ఉన్న ఆశ్వయుజ పౌర్ణమి అనే తెలుగు తిథి – ఒకదానికొకటి సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో నిజాం పోలీసులతో పోరులో కొమురం భీం ఒరిగిపోయిన తేదీ గురించి సమకాలీన ఆధారాలు దొరుకుతాయా అని గోలకొండ పత్రిక, ఆంధ్రపత్రిక పాత సంచికల అన్వేషణ ప్రారంభించాను. ఆ అన్వేషణలో కొమురం భీంను కాల్చిచంపిన తేదీ సెప్టెంబర్ 10 అని కచ్చితంగా తెలియడంతో పాటు, మరికొన్ని ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలు కూడ బైటపడ్డాయి.

ఆంధ్రపత్రిక 1940 సెప్టెంబర్ 16 న ‘పోలీసులనెదిరించిన 500 గోడుల మూకపై తుపాకి కాల్పులు’ అనే శీర్షికతో, ‘హైదరాబాదులో 10 చంపబడిరి 13 గాయపడిరి’, ‘నేరస్థుల అరెస్టును నిరోధించినందుకు పర్యవసానము” అనే ఉపశీర్షికలతో ఒక వార్త వచ్చింది. “హైదరాబాదు (దక్కను), సెప్టెంబర్ 15” అనే డేట్ లైన్ తో వచ్చిన ఈ వార్తలో, “ఆసిఫాబాద్ సమీపమున సెప్టెంబర్ 10వ తేదీన బాభ్జారి ప్రాంతమున 500 మంది గోండులమూక తుపాకులు యితర ఆయుధములతో పోలీసులను ఎదిరించినందుకు పోలీసువారా మూకపై తుపాకులు ప్రేల్చవలసి వచ్చెననియు కాల్పులవల్ల 10 మంది గోండులు చంపబడి మరి 13గురు గాయపడిరనియు యిక్కడ అందిన వార్తలు దెలుపుచున్నవి….” అనే మొదటి పేరాతో నాలుగు పేరాల వార్త ప్రకటించింది. “(అ.ప్రె.)” (బహుశా అసోసియేటెడ్ ప్రెస్) అని చివరన ఉన్న ఈ వార్త మూడో పేరాలో కూడ పోలీసులు అడవిలోకి వెళ్లిన తేదీ సెప్టెంబర్ 10 అని మరొకసారి రాశారు.

ఇక గోలకొండ పత్రిక 1940 సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు వరుసగా ప్రతి సంచికలోనూ ప్రచురించిన వార్తలు, వ్యాఖ్యలు చాల ఆసక్తికరమైనవి, వివరంగా చదవవలసినవి. మొదట సెప్టెంబర్ 16న అచ్చువేసిన వార్త శీర్షిక “200 గోండులు అధికారులను ఎదిరించుట”. దాని ప్రకారం “ఆసిఫాబాదులోని బాబ్ ఝరీ అనే గ్రామంలో గుట్టలు కలవు. అచ్చట 200 గోండులు ఆయుధపాణులై 4 ఆబాన్ నాడు పోలీసు మొహతమీమును, తాలూక్దారును, 100 పోలీసు దళాన్ని ఎదిరించినారని జనులు అనుకొనుచున్నారు. కొన్ని దినాలకు ముందు ఈ గ్రామంలో గోండులు అడవిశాఖ నౌకర్లపై పడి కొట్టియుండిరి. పోలీసులు ఆ సందర్భములో కొందరిని పట్టుకొనిరి. కొందరిని జమానతుపై వదలిరి. కాని మరల వారిని పిలిపించగా వచ్చుటలేదని తిరుగబడిరి. 200 గోండులు గుట్టపైకెక్కి పోలీసులనెదిరించిరి. 4 ఆబాన్ నాడు పోలీసు మొహతెమీమున్ను తాలూక్దారున్ను 100 మంది పోలీసు జవానులతో ఆ గ్రామం వెళ్లిరి. వారిని కూడా గోండులు బెదిరించిరి (అ.న్యూ.)”

ఆ తర్వాతి సంచిక (సెప్టెంబర్ 19)లో ‘గోండులపై పోలీసులు కాల్చుట’ అనే శీర్షికతో, ’10 మంది చచ్చిరి, 13 మందికి గాయాలు’ అనే ఉపశీర్షికతో “ఆసిఫాబాదు, ఆబాన్ 11” డేట్ లైన్ తో కాల్పుల వార్త వచ్చింది. దాంట్లో కూడ స్పష్టంగానే “10 సెప్టెంబరు నాడు అవ్వల్ తాలూక్దారు కొందరి పోలీసులను వెంటబెట్టుకొని వారిని (గోండులను) పట్టుకొనబోయెను. కాని 300 గోండులవరకు వారినెదిరించిరి. తాలూక్దారు వారికి చాలావరకు బుద్ధిచెప్పినా వారు వినలేదు. పైగా అందొకడు తుపాకితో కాల్చెనట. అదృష్టవశాత్తు అదెవ్వరికిని తగులలేదట. మరల రెండవమారు గోండులు తుపాకీ కాల్చిరి. దానిమూలాన ఒక పోలీసు జవానుకు దెబ్బతగిలెను. అటుపై పోలీసువారు తమ తుపాకీలను గోండులపై కాల్చిరి. ఆ దెబ్బలతో 10 మంది గోండులు చచ్చిరి. 13 మందికి గాయములు తగిలెను. 31 మంది పట్టుకొనబడిరి. తక్కినవారు పారిపోయిరి” అని ఉంది.

నేను ఈ అన్వేషణ సాగించి నా వ్యాసం పూర్తి చేసిన వారం తర్వాత చరిత్ర పరిశోధకుడు భంగ్యా భూక్యా కూడ అప్పటి అత్యున్నత పోలీసు అధికారి ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రతి సంపాదించి దాని ప్రకారం కాల్పులు జరిగిన తేదీ సెప్టెంబర్ 10 అని తేల్చారని, అది భాద్రపద శుద్ధ నవమి అని కనుక పౌర్ణమిని వర్ధంతిగా గుర్తించడం మానేయాలని అన్నారని పత్రికలలో వచ్చింది.

ఈ కాల్పుల వార్త తెలిసిన వెంటనే ఆంధ్ర మహాసభ, హైదరాబాదు సంస్థాన హిందూ ప్రజామండలి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ల పక్షాన కనీసం మూడు నిజనిర్ధారణ కమిటీలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. బహుశా ఆంధ్ర మహాసభ పక్షాన వెళ్లిన బద్దం ఎల్లారెడ్డి గోలకొండపత్రిక 23.9.1940 సంచికలో ‘బాబెఝరీ గోండులపై కాల్పులు’ అనే పెద్ద వ్యాసం రాశారు (దురదృష్టవశాత్తూ ఇప్పుడు ప్రెస్ అకాడమీ అర్కైవ్ లో లభ్యమవుతున్న గోలకొండ పత్రిక డిజిటైజ్డ్ ప్రతిలో ఈ వ్యాసం అచ్చయిన పేజీ సగానికి చిరిగిపోయి ఉంది). “సర్కారి లెక్క ప్రకారము 10 మంది ఆ స్థలములోనే మరణించినారు. గాయపడ్డ పదముగ్గురు ఆసిఫాబాద దవాఖానాకు కొనితేబడగా వారిలో 4గురు ఇటీవల మరణించినారు. ఝండాగూడ గ్రామములో మరి ఇద్దరు గాయపడినవారు చచ్చినారని 11 ఆబాన్ నాడు పంచునామా చేయబడినది. ఇట్లు మొత్తం 16గురు చచ్చినారని సర్కారువారి లెక్క. ఇక ఇక్కడి ప్రజల అంచనా 100 మందికిపైగా ఆచోటనే చచ్చినారని” అని, ఈ ఘర్షణ పూర్వాపరాలతో సహా ఎల్లారెడ్డి గారు రాశారు. అదే సంచికలో గోలకొండ పత్రిక సంపాదకీయమూ రాసింది, ప్రభుత్వ ప్రకటన పూర్తి పాఠమూ అచ్చువేసింది.

ఆసిఫాబాద్ లో శ్రీనివాసాచారి, లక్ష్మణ్ అనే వకీళ్లుఈ ఘటనను విచారించడానికి కమిషన్ వేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన వార్త గోలకొండ పత్రిక 26 సెప్టెంబర్ సంచికలో వచ్చింది.

సెప్టెంబర్ 30 సంచికలో ‘గోండుల గోడు – బాబెఝరీ కాల్పుల గురించి కొన్ని సవరణలు’ అంటూ మళ్లీ ఎల్లారెడ్డి గారు అదనపు వివరాలు రాశారు. “ఆ రోజే కాల్పులు జరిగినప్పుడు బాబెఝరీలో 127 మంది చచ్చినారని రూఢిగా ఒక పోలీసు పటేలు వల్ల తెలియుచున్నది. వీరందరిని పోలీసు అక్కడనే దహనం చేసి గురుతు లేకుండా చేసిరని కూడ తెలియుచున్నది. ఆస్పత్రిలో 4గురు మరణించినారు. మండ్రుమాడలో నొక గాయపడినవాడు మరణించినాడు. గోండు ఝండా గూడలో నిద్దరు గాయపడినవారు మరణించినారు. వీరిద్దరి పంచునామా కూడ అయినదని తెలియుచున్నది. గడలపల్లిలో ఇద్దరు గాయపడ్డవారు మరణించినారని పోలీసు పటేలు రిపోర్టు. చిద్రకుంటలో ఇద్దరు మరణించినారని పోలీసుపటేలు రిపోర్టు. మొత్తం ఇప్పటికి 138 మంది చచ్చినారని తెలియుచున్నది” అని రాశారు. (బద్దం ఎల్లారెడ్డి గారి పర్యటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని ‘శతజయంతి సంస్మరణ సంచిక’ లో ప్రచురించిన పోలీసు రికార్డ్స్ తెలియజేస్తాయి.)

అక్టోబర్ 7 సంచిక రెండు నిజనిర్ధారణ సంఘాల గురించి వార్త ప్రకటించింది. అక్టోబర్ 14 సంచిక న్యాయవిచారణ జరిపించమని కోరుతూ ఆంధ్రమహాసభ చేసిన తీర్మానాన్ని ప్రకటించింది.

అక్టోబర్ 17 సంచికలో ‘గోండుల గోడు – క్రొత్తగా తెలిసిన సంగతులు’ శీర్షికతోనూ, అక్టోబర్ 21 సంచికలో ‘గోండుల గోడు’ శీర్షికతోనూ జి ఎస్ గుప్త చాల వివరమైన నివేదికలు రాశారు. ఎన్నో గ్రామాలు, గోండు గూడాలు తిరిగి సేకరించిన సమాచారంతో ఆయన రాసిన ఈ నివేదికలు చాల విలువైనవి, తప్పనిసరిగా చదవవలసినవి.

**

“ఆసిఫాబాదు జిల్లాలో గోండులపై పోలీసువారు తుపాకులను కాల్చినందుకు 10 మంది చచ్చిరని తెలుపబడి యుండెను. అటుపై ప్రభుత్వము వారీ కింది విధముగా ప్రకటించుచున్నారు:

పోలీసు మంత్రియున్ను, పోలీసు నాజమున్ను ఆసిఫాబాదుకు పోయి విచారం చేసి వచ్చుటచే తెలిసినదేమనగా ఇంతవరకు 10గురు గోండులు చనిపోయినారు.

5 ఏండ్ల క్రిందట ఒక గోండు ఈ రాష్ట్రములోనికి వచ్చి ఆసిఫాబాదుకు 12 మైళ్ల దూరములో ఒక అడవిలో పీఠము వేసినాడు. అచ్చట వాడు దొంగతనంగా వ్యవసాయం సాగించినాడు. క్రమంగా 300 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడు. కొందరు శిష్యులు కూడ జతకూడినారు. అడవిశాఖవారు ఆ వ్యవసాయాన్ని ఆపివేయ ప్రయత్నించినారు. కాని వాడు వినలేదు. 2 నెలల క్రిందట కొందరు అడవిశాఖవారు వానిని నిరోధించుటకు వెళ్లగా అందులో ఇద్దరికి దెబ్బలు తగిలెను. ఈ మనిషిని పట్టేది కష్టమని మొహతమీమ్ స్వయంగా వెళ్లి వానినిన్నీ మరివాని వద్దనుండే ఆరు మందిని పట్టుకుని వారు పట్టుకున్న ఆయుధాలను క్రింద పెట్టించి జమానతుపై అచటనే విడిచివేసెను. ఇక్కడికంతా తృప్తికరముగా పరిష్కారమయినదని జిల్లా అధికారులు నివేదించుకొనిరి. విచారణ దినమునాడు కోర్టుకు గోండులు రాకపోయిరి. అందుపై వారంటు పంపబడెను. దానిని వారిపై ప్రయోగించుట కష్టసాధ్యమయ్యెను. ప్రయోగింపుచో జవానులను చంపుదుమన్నారు. ఈ గోండు మరీ బిర్రబిగిసి తాను గోండు రాజాననిన్నీ తనకు 5 జాగీరులిచ్చి అడవి సుంకాలన్నీ వదులుకోవలెననిన్నీ తాలూక్దారుకు పోలీసు అధికారికి చిట్టీలు వ్రాసినాడు. తనవారిపై ప్రభావంజేసినాడు. తనకు మంత్రశక్తి కలదన్నాడు. తుపాకి గుండ్లు తమపై పారవన్నాడు. ఆ మార్గంగా పోవు విమానాన్ని చేయి విసిరి క్రింద పడగొడ్తాను చూడుమన్నాడు. ఇట్టి ముచ్చట్ల చేత వాని అనుయాయి వర్గం 1000 మంది వరకు పెరిగిందని వదంతి. ఇక శ్రుతి మించనీయగూడదని తాలూక్దారు 100 పోలీసులను తుపాకులతో లాఠీలతో తీసుకుని వెళ్లినాడు. జిల్లా పోలీసు అధికారిని, జిల్లా అటవీశాఖ అధికారిని జిల్లా డాక్టరును వెంటబెట్టుకున్నాడు. గాయాలకు చికిత్స చేసే మందు డబ్బాలను కూడ పట్టించుకున్నాడు. ఇంకా ఇద్దరు రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకున్నాడు. గోండులుండే గుట్ట వద్దకు 4 ఆబాన్ నాడు వెళ్లి డేరా వేసినాడు. ఆ గ్రామం పటేలుద్వారా గోండులకు రాయబారాలంపినారు. కాని గోండులు పటేలును మళ్లీ వస్తే చంపివేస్తామని చెప్పంపినారు. మరునాడు గోండులు నగారాలు మోగించినారు. 6 ఆబాన్ నాడు పోలీసువారు 800 అడుగులయెత్తు గుట్టను భద్రముగా ఎక్కినారు. అచట 500 గోండులు ఆయుధాలతోనుండినారు. 4 గంటల కాలం తాలూక్దారు వారికి బుద్ధిరావలెనని చాలా ప్రయత్నం చేసినాడు. కాని లాభము లేకపోయింది. వారు ఆయుధాలను విసర్జించమన్నారు. పైగా మీరు వెళ్లుతారా లేక అందరినీ నరికి వేస్తుమా అని బెదిరించినారు. తుదకు మాటల కాలము పోయినది, వారు కూతలు పెట్టుచూ 80 గజాలు వెనుకకు తగ్గినారు. అనేక గోండులు ఆవేశముతో ఊగుటకు మొదలుపెట్టినారు. ఇక ప్రమాదమే అని తాలూక్దారు గాలిలో రెండుమారులు బెదిరించేదానికి కాల్పించినాడు. దానివల్ల లాభం లేకపోయినప్పుడు గుండ్లను కాల్పించినాడు. గోండు నాయకుడు పోలీసు వారికి 10 గజాల దూరంలో చచ్చి కిందపడినాడు. వాని పక్కనే వాని చుట్టమొకడు చచ్చిపడినాడు. మరి 8 మంది అప్పుడే చచ్చిపడినారు. 13 మందికి గుండుదెబ్బలు తగిలెను. మిగతావారు అడవులలోనికి పారిపోయినారు. గ్రామములోని కొందరు గోండులు తుపాకులతోనుండగా అరెస్టు చేయబడినారు. డాక్టరు గాయాలు పొందినవారికి వెంటనే కట్లు కట్టినాడు. మరునాడు తాలూక్దారుగారున్నూ వారి సిబ్బందియున్నూ పరివారమునూ ఆసిఫాబాదుకు గాయాలు పొందినవారిని, పట్టుకున్న గోండువారిని తీసుకొనివెళ్లిరి. విచారణలు జరుగుచున్నవి.”

ఇది బాబేఝరీ కాల్పుల తర్వాత నిజాం ప్రభుత్వ పోలీసు శాఖ విడుదల చేసిన పత్రికాప్రకటన పూర్తిపాఠం. ప్రజా ఆకాంక్షల గురించి, ఉద్యమాల గురించి, ప్రజానాయకుల గురించి, పోలీసులకూ ప్రజలకూ మధ్య ఘర్షణల గురించి ఏడు దశాబ్దాల తర్వాత కూడ ఇదే పద్ధతి, ఇదే రకమైన వివరణ ఉంటాయి. ఈ ప్రకటన చదివితే అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదని తేలుతుంది. రాజ్యం, రాజ్యపు అంగాలు, ముఖ్యంగా పోలీసులు మాట్లాడే భాష ఒకటే అని తేలుతుంది. గతవర్తమానాల కలనేత మరీ ఇంత చిక్కగా, గాఢంగా ఉండడం, వర్తమానం మీద గతం నీడ వదలకపోవడం, గతమేదో వర్తమానమేదో పోల్చుకోలేని స్థితి ఉండడం మన సామాజిక అవ్యవస్థకు, స్తబ్దతకు, ప్రతిష్టంభనకు, నిశ్చలతకు చిహ్నం కాదా?

 • ఎన్ వేణుగోపాల్
 • venugopalraon@yahoo.com

మీ మాటలు

 1. chakrapani ananda says:

  అద్భుతమైన వ్యాసం. చాలా పరిశోధనతో కూడిన విశ్లేషణ. వేణుగోపాల్ గారికి ధన్యవాదములు.

 2. kalluri bhaskaram says:

  వేణుగోపాల్ గారూ…
  “ఆదివాసుల వర్తమానమూ గతమూ ఒక్కటిలాగే ఉండడం, దశాబ్దాలూ శతాబ్దాలూ గడిచినా ఆదివాసి జీవితాలలో, సమస్యలలో, వ్యక్తీకరణలలో, పోరాటాలలో, ఆదివాసులపట్ల మైదానవాసుల, రాజ్యాంగయంత్రాల వైఖరిలో ఏకసూత్రత ఉండడం ఆశ్చర్యాన్నీ విచారాన్నీ కలిగిస్తున్నది.” …అని మీరన్నది నిజం. కొమరం భీం ను కాల్చి చంపిన తేదీని నిర్ధారించడానికి మీరు చేసిన కృషి అభినందనీయం. మీ వ్యాసంలో మరికొన్ని విలువైన పరిశీలనలు కూడా ఉన్నాయి. ఒకటి రిపోర్టింగ్ కు సంబంధించినది. గోండులను కాల్చి చంపిన ఘటనకు సంబంధించిన వార్తల రచనలో ఆబ్జెక్టివిటీకి బదులు సబ్జెక్టివిటీ కనిపించింది. దీన్ని మీరు కూడా స్పృశించారు చివరిలో. గోండు నాయకుడు తన దగ్గర మహిమలు ఉన్నాయని చెప్పిన సందర్భం నాకు వెంటనే మహాభారతంలో అంగారపర్ణుడు అర్జునుడి దగ్గర గొప్పలు చెప్పుకోవడం చివరికి అతని చేతిలో ఓడిపోవడం గుర్తొచ్చింది. అంటే అప్పటినుంచి ఇప్పటివరకు ఒక క్రమం ఉంది చూడండి…
  నాకు ఒకటే విచిత్రం అనిపించింది. భీం పై అంత పరిశోధన చేసి దానిని చరిత్రగా ప్రకటించకుండా నవలగా రాయడం. చరిత్రపై కన్నా కల్పనపై మనకు మొదటి నుంచీ ఉన్న మోజు దాని వెనుక పనిచేసిందా? మనకు చరిత్రపై ఖాతరు లేదన్న సంగతిని ఇది కూడా వెల్లడిస్తోండా? ఇది కేవలం ఆబ్జెక్టివ్ ప్రశ్న తప్ప వారి కృషిని చిన్నబుచ్చడానికి కాదు. అభినందనలు.

 3. buchireddy gangula says:

  మన ఊళ్ళో –మన రాజ్యం అని ప్రకటిస్తూ — బీం అడవి కడుపు న విత్తనం అయ్యాడు –
  విత్తనం చని పోతూ పంటను వాగ్దానం చేసింది –మన కాలం లో మన కాళ్ళ ముందు కొమురం బీం ఆకారం చూస్తూ చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తు కేదుగు తున్నది–ఇంద్రవల్లి సంఘటన లేకపోతే కొమురం భీమ నవల లేదు *******
  ————————————————-వర వర రావు గారి ముందు మాట –అల్లం రాజయ్య గారి కొమురం భీ ము పుస్తకాని కి —-పుస్తకం ఒక ఎత్తు — ముందు మాట ఒక ఎత్తు –చాల గొప్పగా ఉంది
  — యీ వేణు గారి ఆర్టికల్ ఒక పయిస మాత్రమే –(penny–only-)
  చదవండి — సాహు — అల్లం రాజయ్య గారి నవల **** కొమురం భీము ******
  excellent–novel—
  భీము –గారి —
  సాయుధ పోరాటం
  తిరుగుబాటు
  ప్రజా యుద్ధం
  అది వాసుల జీవితాలు
  అగ్రవర్ణ పాలక వర్గాల stick–and-carrot- విధానం అన్ని నవల లో
  రాజయ్య గారు పొందు పరిచారు —
  ————————————————————————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 4. Lalitha P says:

  చాలా బాగుంది మీ వ్యాసం. పోలీస్ ల రిపోర్టింగ్ మాత్రమేనా, ప్రధాన స్రవంతి వార్తా పత్రికల్లో కూడా ఇప్పటికీ నక్సల్- “infested ” ప్రాంతాలు లాంటి మాటలు పరమ అనాగరికంగా రాసేస్తుంటారు పేరున్న నాగరీక జర్నలిస్టులు కూడా. ఈ భాష ఎప్పటికైనా మారుతుందా!

 5. Allam Rajaiah says:

  వేణు బాగుంది వ్యాసం ఒక కాపి అన్ని పంపహలవు మరో ముద్రణలో సరి చూసి సవరణ చేద్దాము అనేక కారణాలతో నవల రాయలనుకున్నాము

Leave a Reply to Allam Rajaiah Cancel reply

*