అమెరికా తెలుగు కథ తొలి అడుగు వివాహ బంధాలు

imagesX3953B67

కథ అన్నాక దానికి ఏదో ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుకి ఓ నేపథ్యం ఉంటుంది. అమెరికా తెలుగు కథకి యాభయ్యేళ్ళు నిండాయని వంగూరి ఫౌడేషన్ వారు జరుపుతున్న స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ అమెరికా తెలుగు కథల్లో ఏ విషయాల మీద రాశారు అని పరిశీలిస్తే తరచూ కనబడిన సబ్జక్టు వివాహ బంధం. అమెరికా నేల మీద రాయబడిన మొదటి కథ (“పుట్టిల్లు” – చెరుకూరి రమాదేవి గారి రచన) కూడా వివాహ బంధం ఇతివృత్తంతోనే ఉండడం యాదృఛ్ఛికం కాదు. భారతీయులకి, అందునా తెలుగువారికి పెళ్ళీ, తద్వారా ఏర్పడే కుటుంబమూ జీవితంలో, మనుగడలో అతి ముఖ్యమైన అంశాలు. దానికి తోడు తొలి రోజుల్లో ఎక్కువగా కథలు రాసినది స్త్రీలు. అందుచేత ఈ కథల్లో వివాహ బంధాల చిత్రణ ముఖ్య వస్తువుగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.

తొలి తరం కథల్లో ఎక్కువగా ఈ మహిళా రచయితలు తమ అనుభవాలనే కథలుగా మలిచారు అనిపిస్తుంది. ఒక మధ్య తరగతి తెలుగమ్మాయి పెళ్ళి చేసుకుని భర్త వెనకాల అమెరికా రావడం. ఆమె పెద్ద చదువులు చదివి ఉండక పోవచ్చు, ఒక వేళ చదివి ఉన్నా ఈ అమెరికా పరిజ్ఞానం అంతగా ఉండక పోవచ్చును. అంచేత వచ్చిన కొత్తల్లో కొంచెం బిక్కుబిక్కుమంటూ ఉన్నా నెమ్మది మీద ఏదో ఒక విద్య నేర్వడం, సంపాదన పరులు కావడం, పిల్లల పెంపకం, దానిలో ఉండే పరీక్షలు, మాతృదేశంలో తమవారిని మిస్సవడం – ఇలాంటివన్నీ దినుసులుగా వీళ్ళు కథలు రాశారు. ఈ కథల్లో భర్త ఒక్కో సారి అస్సలు ఇంటి విషయాల్ని పట్టించుకోని బుద్ధావతారం లాగానూ, అప్పుడప్పుడూ భార్య కష్టాలని ఇబ్బందుల్ని పట్టించుకుని, కొంచెం ఇంటి పనిలో సాయం చేస్తూ భార్యని ప్రోత్సహించే స్నేహితుడిలానూ కనిపిస్తుంటాడు, కానీ ఈ కథలు ప్రధానంగా స్త్రీ పాత్రల ఆత్మకథనాలు, వారి ఆశయాలకూ భయాలకూ ప్రతిబింబాలు. అమెరికా ఇల్లాలు (కమల చిమ్మట), అమెరికా ఇల్లాలి ముచ్చట్లు (శ్యామల దశిక) వీటికి మంచి ఉదాహరణలు.

కొన్నేళ్ళు గడిచాక మన కథల ఫోకస్ పిల్లల పెళ్ళిళ్ల మీదికి తిరిగింది. అమెరికాలో పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యడం అంటే ముచ్చటగా మూడు ప్రత్యామ్నాయాలు కనబడుతున్నాయి. 1) తమలాగా ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగువారో భారతీయ సంతతివారో, 2) మాతృదేశం నుండి వెదికి పెళ్ళి చెయ్యడం, 3) భారతీయేతరులు. చివరి రెండిటిలో దేనిని ఎంచుకున్నా దానిలో మేలూ కీడూ రెండూ ఉన్నాయని మనవారు గుర్తించారు. ఈ బాగోగుల తులనాత్మక పరిశీలన, చర్చ మనకి చాలా కథల్లో కనిపిస్తాయి. ఈ కథలు శిల్పపరంగా గొప్ప ఆసక్తికరం కాక పోవచ్చునుగానీ ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న సామాజిక ధోరణులకు ఇవి అద్దం పడుతున్నాయి. తద్వారా ఒక సోషల్ డాక్యుమెంటరీగా ఈ కథలు ముఖ్యమైనవి.

మేడ్ ఇన్ అమెరికా (సత్యం మందపాటి), పెళ్ళి చేసుకుంటే చూడు (శేషుశర్మ పూడిపెద్ది), అబ్బాయి పెళ్ళి (రాధిక నోరి), ఇ – అ పెళ్ళి (సాయిలక్ష్మి కాళ్ళకూరి) కథలలో పెళ్ళి చేసుకోవలసిన పాత్రల ప్రమేయం నేరుగా లేకుండా, తలిదండ్రుల తరంలో జరుగుతున్న చర్చలాగా ఈ పెళ్ళి సమస్యయొక్క వివిధ రూపాలని ఆవిష్కరించారు. బయటి వారిని (తమ కుల, భాష, ప్రాంత, జాతికి చెందని వారిని) పెళ్ళి చేసుకోవడం అనుకోగానే, తల్లిదండ్రుల తరంలో – నా సాంప్రదాయమో, నా భాషో, నా సంస్కృతో .. అనే ఆక్రోశం పెద్దగా వినిపిస్తుంది. ఒక చోట పెళ్ళి కావలసిన అబ్బాయి తల్లితో అంటాడు – నువ్వు మాత్రం నీ భాషా సంస్కృతులని ఏ మాత్రం పాటిస్తున్నావని వాటిని నా మీద రుద్దటానికి చూస్తున్నావు – అని! ఇది ఆలోచించవలసిన ఆరోపణే!

ఈ వరుసలో కాగల కార్యం (రాధిక నోరి) కథ భలే ఆసక్తికరంగా ఉన్నది. ఇందులో పెళ్ళి కొడుకు ఒక తెల్లమ్మాయిని ఇష్టపడి, ఆమెకి తన కుటుంబం పరిచయం కావాలని ఒక వారం రోజుల పాటు ఆమెతో సహా తలిదండ్రుల ఇంట్లో ఉంటాడు. ఆ వారం రోజుల్లో ఆ తెల్లమ్మాయి ఈ పెళ్ళి తనకు అచ్చిరాదని గ్రహించి (మృదువుగానే) తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది. కథ ముగిసే సమయానికి అబ్బాయికి వేరే హీరోయిను ఎవరూ దొరకదు గానీ తల్లిదండ్రులు మాత్రం కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకున్నట్టే చిత్రించారు. ఈ కథలో తెల్లమ్మాయి లారా పాత్రని నిర్వచించిన తీరు ఆసక్తి కరంగా ఉన్నది. పెళ్ళికాని టీనేజ్ తల్లికి పుట్టిన లారా, తల్లిదండ్రుల ప్రేమ లేక అమ్మమ్మ దగ్గర పెరిగింది. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కొంత చదువుకుని ఒక మాదిరి ఉద్యోగం చేస్తోంది. ఆ పిల్లకు తన క్రిస్టియన్ మతం పైనా పెద్దగా శ్రద్ధ లేదు. ఉద్యోగం పట్ల కానీ కెరీర్ పట్ల కానీ ఒక ఉత్సాహం, ఏంబిషన్ లేవు. హీరో పట్ల కూడా ఏదో కొంత ఆకర్షణ తప్ప గాఢమైన ప్రేమ లేదు – అని హీరో తల్లి గమనిస్తుంది. మొత్తానికి ఆ పిల్ల – ఈ పెళ్ళి చేసుకుంటే సుఖం సంగతి పక్కన పెట్టి, ఈ అత్తారి కుటుంబంలో ఇమడ్డం లేని కష్టాన్ని తెచ్చుకోవడం అవుతుందన్న ఆలోచనతో – హీరోతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది. కేవలమూ వ్యక్తిగత స్థాయిలో చూస్తే ఆ తల్లిదండ్రుల స్థానంలో నేను ఉంటే నేనూ బహుశా వాళ్ళు ప్రవర్తించినట్టే, వాళ్ళు ఆలోచించినట్టే చేసి ఉండేవాణ్ణి. అభ్యుదయ ప్రగతి శీల ఆలోచనలను గురించి కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు, తనదాకా వస్తే కానీ తెలియదు కదా!

అంచేత, పాఠకులకి హీరో తల్లిదండ్రుల ప్రవర్తన చాలా రీజనబుల్ గా ఉన్నట్టే తోస్తుంది. ఒక వేళ లారా ఈ కథలో చిత్రించినట్లు కాకుండా, స్థిరమైన ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రుల సంతానమై ఉండుంటే, తన కెరీర్ పట్ల ఏంబిషన్తో ఉండుంటే అప్పుడీ కథ ఎలా ఉండేదో అని ఒక ఆసక్తికరమైన ఆలోచన. హీరో తన ఆశయాలకు తగినట్టు పెద్ద చదువులు చదవలేదనీ, డాక్టరు కాలేదనీ హీరో తండ్రి బాధ పడతాడు. దానికి తగినట్టు చివరికి హీరో ఇక ప్రేమా దోమా అన్నీ మరిచిపోయి లా కాలేజీలకి అప్లై చేస్తానని ప్రకటించడంతో కథ సుఖాంత మవుతుంది. వివాహానికి సంబంధించిన విషయాలతోబాటు సక్సెస్ అంటే ఫలాని చదువులు చదవాలి అనే ఉద్దేశం మనకి కనిపిస్తున్నది. కథలో పాత్రల ప్రవర్తన ఆయా పాత్రలకి వ్యక్తిగతం అనుకోవడం బాగానే ఉంటుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో – ముఖ్యంగా స్వ-పర భేదాల్ని చిత్రించే కథల్లో – ఈ పాత్రలు నిజజీవితాలకి, ఆశయాలకి, ఆలోచనలకి ప్రతీకలు అవుతుంటాయి.

భారత్ నించి అమ్మాయినో అబ్బాయినో వెతికి తెచ్చి పెళ్ళి చెయ్యడం ఇంకో ప్రత్యామ్నాయం. ఈ విషయం మీద కూడా కొన్ని కథలు వచ్చాయి. వీటిల్లో అబ్బాయి పెళ్ళికీ అమ్మాయి పెళ్ళికీ ఉన్న తేడా ఒకటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వధువు అమెరికా అమ్మాయి ఐతే, ఇండియానించి తెచ్చిన వరుడితో సర్దుబాటు అవడం కష్టం – ఆమె అలవరుచుకున్న స్వతంత్ర భావాలకీ, అతని పురుషాధిపత్య భావాలకీ పొసగదు అనేది ఇక్కడ సాధారణంగా చిత్రించబడిన ఆరోపణ – అంచేత ఇలాంటి పెళ్ళిళ్ళు ఎక్కువగా పెటాకులే అవుతున్నాయి. అమెరికా వరుడికి ఇండియానించి వధువుని తెచ్చుకుంటే మాత్రం పరవాలేదు – ఎందుకంటే, ఆ వచ్చే అమ్మాయి అమెరికా జీవితం కోసం తప్పకుండా సర్దుకుపోతుంది – ఈ ఆలోచనా ధోరణి కథల్లోనే కాదు, నేను నిజజీవితంలో చూసిన అనేక సందర్భాల్లోనూ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. పరిస్థితి ఏదయినా అమ్మాయే సర్దుకు పోవాలి అనేది ఇందులో అంతర్లీనంగా, అవాచ్యంగా మనకి అందే సందేశం. దేశాన్ని విడిచి వచ్చామే కానీ మనం వదులుకోవాలనుకున్నా కొన్నికొన్ని భావాలు మనలని అంత తేలిగ్గా వొదిలిపెట్టవేమో!

అమెరికాలోనే సంబంధాలు వెతుక్కోవడంలో – భారతీయులు, శ్వేతజాతీయులు కాకుండా ఇతర జాతులనుండి భాగస్వామిని వెతుక్కోవడం ఉంది. కానీ భారతీయులు ఈ దిశగా దృష్టి సారించినట్టు లేదు. మన కథల్లో కూడా ఇటువంటి ప్రస్తావన ఎక్కడా కనబడలేదు కానీ ఆరి సీతారామయ్యగారు దూరపు కొండలు అని ఒక మంచి కథ రాశారు. అందులో అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ సంతతి పిల్, అందులోనూ ఆలయపూజారి గారి అమ్మాయి, కెన్యా నుండి వలసవచ్చిన పిల్లాణ్ణి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ కథలో కూడా అసలు వధూవరులు మనకి కనబడరు – కథ మొత్తం అటు కెన్యా తల్లిదండ్రుల దృక్కోణం నించీ, ఇటు తెలుగు తల్లిదండ్రుల కోణం నించీ చెబుతూ – ఆ వూరికి ఈ వూరెంత దూరమో, ఈ వూరికి ఆ వూరూ అంతే దూరం అనే సత్యాన్ని సమర్ధవంతంగా ఆవిష్కరించారు. ఈ ఒక్క కథే కాదు, మారుతున్న సామాజిక నేఫథ్యంలో, అమెరికా ప్రవాసంలో వైవాహిక జీవితంలో అతి సాధారణంగా తలెత్తే అసమానతలని తన కథల్లో ప్రతిభావంతంగా చిత్రించారు సీతారామయ్యగారు.

వివాహం విఛ్ఛిన్నం కావటం కూడా మన కథల్లో తరచు కనిపిస్తున్న కథాంశం. భర్తకు వేరే స్త్రీ (సాధారణంగా వయసులో చిన్నదైన శ్వేత జాతి వనిత) పట్ల ఏర్పడిన మోజు విడాకులకు దారి తీసినట్లుగా చాలా కథలలో చిత్రించబడింది. ఉద్యోగంలో పై అంతస్తులకు చేరడం, లేదా స్వంత వ్యాపారంలో అపారంగా గడించడం ఆ మగవారికి ఈ ధైర్యాన్ని ఇచ్చినట్లుగా కూడా చిత్రించబడింది. ఐతే, ఈ సబ్జక్టుని డీల్ చేసిన కథల్లోనూ కొన్ని విలక్షణమైన కథలున్నాయి. నిడదవోలు మాలతి గారి నిజానికీ ఫెమినిజానికీ మధ్య అనే కథలో భర్త అభ్యుదయ భావాలు కలిగినవాడిగా తనను తాను భావించుకుంటూ ఉంటాడు. ఆదర్శాల ముసుగులో ఇతర స్త్రీలతో ప్రేమకలాపాలు సాగిస్తూ, భార్యను మోసం చేస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నాడనే నిజం భార్య అతన్ని నిలదీసేదాకా గ్రహింపుకు రాదు. కాపురం చక్కబెట్టుకోవాలనే తాపత్రయం వేరు, ఒక స్త్రీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం వేరు. ఆ తేడా స్పష్టంగా చూపించారు మాలతిగారు ఈ కథలో. మరొక కథలో (రచయిత, కథ పేరు రిఫరెన్సు అందుబాటులో లేదు) ఇరవయ్యేళ్ళుగా అమెరికాలో ప్రవాసం ఉండిపోయిన భార్య భారత్ లో జరుగుతున్న ఎన్నో పెళ్ళిళ్ళు మిస్సై పోతున్నానని బాధపడుతూ ఉంటుంది. ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతాను, విడాకులివ్వు అనడిగిన భర్తతో – ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మన ఊరి గుళ్ళోనే పెళ్ళి చేసుకోండి. కనీసం ఓ పెళ్ళి చూసిన ఆనందమైనా నాకు దక్కుతుంది – అంటుందామె. ఇది కూడా తనకి చేతనైన విధంగా ఆమె తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడమే!

ప్రమీల సూర్యదేవర రాసిన తోడునీడా అనే కథలో విడాకులు, తదనంతరం ఆ మహిళ సమాజంలో ఎదుర్కొనే వివక్ష, ఇంకా మళ్ళి పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఎదురయ్యే సమస్యలను చిత్రించే ప్రయత్నం చేశారు. ఈ కథలో వర్ణించిన సన్నివేశాలు ఎంతో సహజంగా ఉన్నా, కథా నిర్మాణంలో రచయిత్రి తగిన శ్రద్ధ చూపక కొంత అయోమయంగా తాయారయింది. సోమసుధేష్ణ రాసిన చైతన్యం అనే కథ కూడా విలక్షణమైనది. ఈ కథని నేను పది పన్నెండేళ్ల క్రితం మొదటి సారి చదివాను. శ్వేతవనిత మోజులో భర్త విడాకులు తీసుకుని వెళ్ళిపోతే ఆ స్త్రీ నిలదొక్కుకుని, అవసరమైన చదువు నేర్చుకుని మంచి ఉద్యోగమూ, ఇల్లూ సమకూర్చుకుని హాయిగా బతుకుతున్న సమయంలో ఒంటరి అయిన ఆ మాజీ భర్త మళ్ళీ ఆమెకి దగ్గరవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. పెద్దవారైన కూతుళ్ళిద్దరూ కూడా ఆయనకి సాయం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. స్త్రీ పురుష సంబంధంలా వొద్దుకానీ ఒక స్నేహితుడిగా నీతో స్నేహం చెయ్యడానికి నాకు అభ్యంతరం లేదు – అని ఆ స్త్రీ అన్నట్లు చిత్రించిన ఈ కథని మొదటి సారి పది పన్నెండేళ్ళ కిందట చదివినప్పుడు నాకు ఆ స్త్రీ పాత్ర మీద పిచ్చి కోపం వచ్చింది. కథ చివర్లో ఆమె అలా అనడం ఒక బలహీనతగా నాకు అప్పట్లో అనిపించింది. కానీ రచయిత్రి ఆ స్త్రీమూర్తిని ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో, మానసిక స్థైర్యంతో తీర్చి దిద్దారని తోచింది ఇప్పుడు మళ్ళీ చదివితే. మొత్తానికి విడాకుల అనంతర జీవితంలోని సంక్లిష్టతని పలుచన చెయ్యకుండా రాసిన ఒక మంచి కథ ఇది.

యువతీయువకులు తమంత తాము జీవితభాగస్వాములను వెతుక్కునే ప్రయత్నాలను గురించి రెండు తమాషా కథలు నా దృష్టిలో పడ్డాయి. విప్లవ్ రాసిన ఎంగేజిమెంట్ అనే కథలో అమెరికాలో పుట్టిపెరిగిన జంట తొలిచూపులో నచ్చారులే అనుకుని, ప్రధానం జరుపుకుని, దూరాభారపు సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి కొంత ప్రయత్నం చేసి ఇహ లాభం లేదని చేతులెత్తేయడం కనిపిస్తుంది. దీనికి జవాబుగా రాశారేమో అన్నట్టు నోరి రాధిక రాసిన తోడు అనే కథలో భారత్ నించి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్న జంట, ముందు స్నేహితులుగా ఉండి, పెళ్ళి గురించి రకరకాల అపోహలతో భయపడుతూనే ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనే నిశ్చయానికి వచ్చి పెళ్ళి చేసుకోవడం చూపారు. రెండు కథలలోనూ పాత్ర చిత్రణ సహజంగా ఉన్నా, అమెరికా జంట పైపై విషయాలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్టు చిత్రించడం ఒక ప్రతీకయేమో అనే అనుమానం రాకమానదు, అందులోనూ ఈ రెండు కథలనూ పక్కపక్కన పెట్టి చూస్తే.

అలాగని అన్నీ సమస్యలూ బాధలే కాదు, చక్కని వైవాహిక జీవితాలను చిత్రించిన కథలు కూడా చాలా ఉన్నాయి. చంద్ర కన్నెగంటి రాసిన సత్యం అనే కథలోనూ, లలిత జొన్నాళ్ రాసిన అభ్యాగతుడు కథలోనూ అన్యోన్యమైన దాంపత్యం కనిపిస్తుంది. వివాహం కాక ఇంకేవో విషయాల గురించి రాసిన కథల్లో నేపథ్యంగా హృద్యమైన దాంపత్య జీవన చిత్రణలు మనకు కనిపిస్తాయి. చిన్నపిల్లల్లాగా కీచులాడుకోవడం, అలకలు, బతిమాలడాలు, సర్దుకుపోవటాలు, ఒకరినొకరు అర్ధం చేసుకుని, అవతలి వాళ్ళకి ఏదైనా సమస్య మీద పడినప్పుడు ఆసరాగా ఓదార్పుగా ఉండడం – ఈ వెరైటీలన్నీ మనకి ఈ కథల్లో కనిపిస్తున్నాయి, నిజజీవితంలో లాగే.

చివరిగా అసలు వివాహ వ్యవస్థనే ప్రశ్నించిన ధీర వనిత నందిని కథని గురించి చెప్పుకోవాలి. భారత్ లో సాంప్రదాయక కుటుంబంలో పుట్టి పెరిగినా, చిన్నప్పటినించీ చదువే ధ్యేయంగా, అటుపైన తన పనే ఆరాధ్య దైవంగా పెరిగిన నందిని ఎప్పుడూ ప్రేమ గురించీ పెళ్ళి గురించీ పట్టించుకోలేదు. ఉద్యోగం కోసం అమెరికావచ్చి స్థిర పడటం ఆమెకి అంతకు మునుపులేని ఒక స్వేఛ్ఛని ఇచ్చింది. ఆమె వ్యక్తిత్వం స్థిరపడిన కొద్దీ ఆమెకు పెళ్ళి పట్ల విముఖత దృఢమవుతుంది. అలాగని ఆమె ఫెమినిస్టు సిద్ధాంతాలను గుప్పించదు. అన్ని విషయాల్లోనూ చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. కథ ముగింపు అంత కన్విన్సింగ్ గా అనిపించదు గానీ, ఒక మధ్య తరగతి ఆధునిక యువతి పెళ్ళిని గురించి ఎదుర్కునే సందిగ్ధాల సంక్లిష్టతని నందిని పాత్ర ద్వారా అద్భుతంగా ఆవిష్కరించాడు మిత్రుడు అక్కిరాజు భట్టిప్రోలు.

అమెరికా జీవితం వల్ల వివాహ బంధం మీద విచిత్రమైన వత్తిళ్ళు వస్తున్నాయన్నది నిజం. ఈ వత్తిళ్ళ ప్రభావాలను అమెరికా తెలుగు కథకులు బాగానే పట్టుకున్నారు. ఐతే ఈ సమస్యలను అర్ధం చేసుకుని విశ్లేషించే ప్రయత్నంలోనే కొన్ని సంచిత భావజాల ప్రభావాలు మనలను వదిలి పెట్టడం లేదు. పక్కనున్న సమాజాన్ని గురించి లోతైన అవగాహన కంటే స్టీరియోటైప్ లతో కూడిన అపోహలే మన కథనాలను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అలాగే కథలు రాసేది సాధారణంగా తొలితరం వలసవారు కాబట్టి మలితరం పాత్రల చిత్రణ కూడా అపోహల నీడలో మసకబారుతున్నాయి. జీవితంలోని సహజ సంక్లిష్టతలను పలుచన చెయ్యకుండా కొన్ని మంచి కథలు వచ్చాయి. ఏదేమైనా ఈ కథలు ఒక రెండు తరాల వలస ప్రజల ఆశలను ఆశయాలనూ అక్షరబద్ధం చేసిన సోషల్ డాక్యుమెంటరీలు.

 -ఎస్. నారాయణస్వామి

 nasy

మీ మాటలు

 1. వంగూరి చిట్టెన్ రాజు says:

  చాలా బావుంది….కానీ ఏదో కొంచెం వెలితిగా ఉన్నట్టు అనిపించింది, అది ఖచ్చితంగా ప్రసంగానికి కేటాయించిన సమయ పరిమితి కారణం అయిఉండాలి. ఎక్కడా డైస్పోరా అనే మాట వాడకపోడం ఆసక్తికరం.

 2. మణి వడ్లమాని says:

  నారయణస్వామి గారు మీ విశ్లేషణ చాల బావుంది.

 3. kalluri bhaskaram says:

  నారాయణస్వామిగారూ…కథలను మీరు సోషల్ డాక్యుమెంటరీలు అనడం, కొంతవరకు ఆ కోణంలో విశ్లేషించడం నన్ను ప్రత్యేకించి ఆకర్షించింది, అభినందనలు,

 4. స్వామిగారూ, మీ విశ్లేషణ బాగుంది. ఫలానా తెలుగబ్బాయితో ఫలానా దేశపు తెల్లమ్మాయి పెళ్లి అని తరచుగా ఇక్కడి న్యూస్‌ చానెళ్లలో చూస్తూ ఉంటాం. ఇద్దరూ అక్కడే స్థిరపడిన వారైనప్పటికీ ఇక్కడ ‘ఘనంగా’ పెళ్లి చేసుకోవడం కూడా చూస్తూ ఉంటాం. తెలుగబ్బాయి-తెల్లమ్మాయి కాంబినేషన్‌ కనిపించినట్టుగా తెలుగమ్మాయి-తెల్లబ్బాయి కాంబినేషన్‌ కనిపించదు. ఇది ఒక ధోరణిగా ఉందా, లేదా! ఉంటే దాని వెనుక పనిచేసే కారణాలపై చర్చించిన కథలు, వ్యాసాలేమైనా ఉన్నాయా!

 5. S. Narayanaswamy says:

  కల్లూరి భాస్కరం గారు, రామ్మోహన్ గారు – ధన్యవాదాలు.
  రామ్మోహాన్ గారు, మీరు ప్రస్తావించిన పెళ్ళిళ్ళు బహుశా తొలితరం వలసదారు పెళ్ళిళ్ళు. అలాంటప్పుడు తెలుగబ్బాయి తెల్లమ్మాయిని చేసుకోవడం, అదీనూ ఇండియా వచ్చి చేసుకోవడం అదొక హవా నడిచింది. బహుశా ఇప్పుడు కూడా కొంత నడుస్తోంది. తొలితరం వలస తెలుగు అమ్మాయిలు వేరేజాతి మగవారిని చేసుకోవడం చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పిల్ల పెళ్ళి కంట్రోలు తాళ్ళు బహుశా ఇంకా ఆ పిల్ల తల్లిదండ్రుల చేతిలోనే ఉంటాయి. ఈ పాయింట్ నే అక్కిరాజు తన కథ నందిని లో బాగా చిత్రించారు.
  రెండో తరం పెళ్ళిళ్ళకి వస్తే, తెలుగు సంతతి అమ్మాయిలు తెల్ల అబ్బాయిలను పెళ్ళి చేసుకోవడం చాలా కామన్. ఏదేమైనా, ఈ జాత్యంతర వివాహాలు జరగడం చాలానే జరిగాయి కానీ ఆ అనుభవాలు కథల్లోకి వచ్చింది చాలా చాలా తక్కువ. ఇదే కాదు, అనేక విషయాలలో అమెరికా తెలుగు కథలు నిజజీవిత అనుభవాల నుండి చాలా వెనకబడి ఉన్నాయి.
  ఒక ట్రెండ్ గా మనం దీన్ని గమనిస్తే, ప్రస్తుత దశకంలో పెళ్ళీడుకొచ్చిన రెండో తరం వారి సంఖ్య బాగా పెరిగింది. అందుకని ఆడా మగా కూడా భారతీయ సంతతి వారినే చేసుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అని నేను అనుకుంటున్నాను. ముందటి దశకంలోనూ, అంతకు మునుపు తొంభైలలోనూ తరుణ వయస్కుల సమూహం చాలా చిన్నగా ఉండేది – ఛాయిస్ తక్కువ.

 6. S. Narayanaswamy says:

  చిట్టెన్ రాజుగారు, సమయ పరిమితి కారణం కాదండి. వేదిక మీద నేను చెప్పాలనుకున్నవన్నీ నాకున్న సమయంలో తృప్తిగానే చెప్పాను. ఐతే మాట్లాడ్డం కోసం నమూనాగా రాసుకున్న నోట్సు ఇక్కడ విపులంగా వ్యాసంగా రాసేటప్పటికి కొంత మారింది. మాట్లాడేటప్పుడు ఆశువుగా వచ్చే రెఠోరిక్ కూడా లోపించింది. బహుశా మీరు ఫీలయినది అది కావచ్చు.

 7. Syamala Kallury says:

  నేనీ్మధ్య ప్రతిలిపి అెనే ఒక వెబ్ మాగజేన్ లో పరెక్ట్ మాచ్ అనే కథ రాశాను. పెళ్ళిళ్ళ మార్కెట్ లో ఇండియాలో ఈ మధ్య వస్తున్న మార్పుల గురించి. మీ విశ్లేషణ బాగుంది. I wish I had read it before .

 8. వేరే జాతులని పెళ్ళి చెసుకునే భారతియులు 10% మందిట. తొలి తరం భారతీయ స్త్రీలు తెల్లవారిని చేసుకోకపోవడం వెనక కారణం, తలితండ్రులు కారు. వేరే సంస్కృతిలో ఎలా ఇమడగలం అనే సందిగ్ధం ముఖ్యమైన కారణం. పని చేసే చోటుని బట్టీ భారతీయులకి ఇతర జాతివాళ్ళతో సంబంధాలు తక్కువనే చెప్పాలి. నా అనుభవంలో(నేను తెల్లజాతి వాణ్ణి పెళ్ళి చేసుకుంటున్నను కాబట్టి) కుటుంబసంబంధాలు, ఆహారపు అలవాట్లు, పెద్ద సమస్యలు. అవి అధిగమించగలమా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.

మీ మాటలు

*