ఏది రాయాలి? ఏది వదిలెయ్యాలి?

myspace

ఏది రాయాలి? ఏది వదిలెయ్యాలి? రాయగలమని చెప్పి తోచినవన్నీ రాసేయ్యాలా? సహజమైన ఫ్లో రాకపోయినా ఏదన్నా అనుకుంటే కృతకంగానైనా ఏదో ఒకటి రాసేయ్యాలా? ఇలాటి సందేహాలు ఎన్నో వస్తాయి రచయితలకు. వేధిస్తుంటాయి అనుక్షణం. కథావస్తువులు, పాత్రలు, సంభాషణలు వెంటాడుతూనే వుంటాయి.

రచయితలకి గీటురాయి ఏంటి? ఏది కొలమానం? నావరకు నాకు గురూగారు రావిశాస్త్రి గారు చాలా చక్కటి మాట చెప్పారు — ఏది రాసినా ఏ మంచికి అపకారం జరుగుతుందో, ఏ చెడుకు ఉపకారం జరుగుతుందో చూసుకొమ్మని. ఇది ఆయన రాసిన ‘రావిశాస్త్రీయం’లో వున్నది. ఆయన్ని ఒకటి రెండుసార్లు కలుసుకున్నా ఎక్కువ మాట్లాడే అవకాశం కలగలేదు.

కానీ కాళీపట్నం రామారావు మాస్టారుతో ఎన్నోసార్లు ఎంతో సేపు మాట్లాడే అవకాశం కలిగింది. రచయితలకు ఆయన సూచించిన స్కేలు ఇంకా చిన్నగా, సూటిగా వుంది. లేదా, రావిశాస్త్రిగారు చెప్పినదానికి దోహదం చేస్తుంది.

“నువ్వు సత్యానికి, ఇంకా ప్రజలకు జవాబుదారీ అని గుర్తుపెట్టుకోవాలి,” అని.

ఇప్పుడు కారా మాస్టారి గురించి ఎందుకు అంటే, ఆయనకు 90 ఏళ్ళు నిండిన సందర్భం. ఆయన గురించి అందరూ మాట్లాడుకునే ఓ సందర్భం. ఇంకో సందర్భం కూడా వుంది అది చివర్లో చెప్తాను.

సరిగ్గా ఏ కథావస్తువు గురించో గుర్తులేదు గాని, ఏదో వస్తువు గురించి ఆయన సలహా తీసుకుందామని ప్రస్తావించాను. ఫలానా సందర్భం గురించి, ఫలానా విధంగా చెప్దామని అనుకుంటున్నానని వివరిస్తున్నాను. కాసేపు నిశ్శబ్దంగా వుండిపోయారు, కళ్లుమూసుకుని. అది ఆయన స్వభావం, ఎవరైనా . నిమ్మళంగా ఆలోచించడానికి కావచ్చు.

“నువ్వు ఎలా చెప్పదలుచుకున్నావో చెప్పకు. కానీ, ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. ఏదో సత్యాన్ని అనుకుని దాన్ని నిజం చెయ్యడానికి కథ రాయకు. సమాజాన్ని గమనించు. జీవితాన్ని చదువు. నీకు ఎక్కడైనా నువ్వకున్నసత్యం రూఢి అయిందనిపించిందనుకో కథ రాయి. అంతేకాని నువ్వు నమ్మిన భావజాలాన్ని ఎలాగైనా సపోర్టు చెయ్యాలని మాత్రం రాయకు,” అన్నారు.

“నువ్వు సత్యానికి, ఇంకా ప్రజలకు జవాబుదారీవి అని గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మిన భావజాలాన్ని వదిలిపెట్టకు. నువ్వు గమనించిన విషయం రాస్తే నీకు ఇబ్బంది అనుకుంటే రాయడం మానేయి. ఒక కథ ఆగిపోతుంది. అంతే. కానీ, నువ్వు రూఢి చేయలేని సత్యాన్ని సత్యంగా మార్చి చెప్పకు,” అన్నారు.

ఇవే కాదు కాని, ఈ అర్ధం వచ్చే మాటలు అన్నారు. సత్యంపట్ల, ప్రజలపట్ల జవాబుదారీగా వుండటం అన్న మాట నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే అది కేవలం నా రచనలకే కాదు, నా వృత్తికి కూడా ఎంతో ఉపయోగపడ్డది ఎన్నో సార్లు.

ఒక ఉదాహరణ చెప్తాను. బేగంపేట ఎయిర్ పోర్ట్ శంషాబాద్ కి మారే ప్రక్రియను చాలా దగ్గరగా కవర్ చేశాను. ఉద్యోగుల నిరసనలూ, కొత్త ఎయిర్ పోర్టు యాజమానుల పధకాలూ, ఉపయోగాలూ, అనార్ధాలూ ఎన్నో వార్తలు రాశాను. కానీ, సెర్వీసులు కొత్త ఎయిర్ పోర్తుకి మారిన రోజు ఓ హ్యూమన్ ఇంటరెస్ట్ వార్త రాద్దామనుకున్నాను. మా వాళ్ళని ఎలర్ట్ కూడా చేశాను. స్టోరీ పెగ్ లిస్ట్ లో పెట్టాను.

కానీ పాత ఎయిర్ పోర్టు చుట్టుపక్కల వున్న పిల్లలూ, పెద్దలూ విమానాల్ని ఎలా మిస్ అవుతున్నారో తెలుసుకు రాద్దామని. ప్రధాన వార్తల పని అవగొట్టుకుని అక్కడ ఇళ్లకు వెళ్ళేను కదా, అక్కడ తెలుసుకున్న విషయాల్ని చూసి దిమ్మ తిరిగిపోయింది. పిల్లలూ, పెద్దలూ ఎవరూ అక్కడి విమానాల్ని మిస్ కాలేదు. సరికదా అందరూ, చాలా అనందంగా వుండడం చూశాను. ఇక ఈ జన్మకి ఈ నరకంనుంచి విముక్తి కలగదేమోనని పెద్దవాళ్లూ, హాయిగా పొద్దున్నపూట నిద్రపోతున్నామని చిన్నవాళ్లూ ముక్తకంఠంతో చెప్పేరు. ఇది నేను ముందు ప్రోపోజ్ చేసిన వార్తకి పూర్తిగా భిన్నంగా వుంది. కానీ, వాస్తవం ఇంకోలా వుంటే చూస్తూ చూస్తూ అబధ్ధం ఎలా రాస్తాం?

***

కారా మాస్టార్ని ఇప్పుడు నేను తలుచుకోడానికి రెండో కారణం – కథల పట్ల ఆయనకున్న ప్రేమ, ఆపేక్ష. కథే ఆయన ఊపిరి. కథ కాకుండా ఇంకేదైనా ఆయన మాట్లాడడంగాని, వినడంగాని నేను ఎపుడూ చూడలేదు. దాదాపు డెబ్బై ఏళ్లపాటు కథే జీవితంగా, కథ మాత్రమే జీవితంగా బతకడం సామాన్యమైన విషయం కాదు.

మొన్నీ మధ్య ఫోన్లో మాట్లాడుతూ, “విశాలాంధ్ర వాళ్ళు వేసిన ఉత్తరాంధ్ర కథల పుస్తకంలో నీ కథ వుంది. ఈసారి కనిపించినపుడు దాని నేపధ్యం చెప్పాలి,” అన్నారు. నాకైతే ఆ పుస్తకం వచ్చినట్టు కూడా తెలీదు. ఇంత వయసులో కూడా కొత్తగా వస్తున్న పుస్తకాలని సంపాదించడం, చదవడం నాకైతే ఎంత ఆశ్చర్యo, సిగ్గూ వేసాయో. అప్పటికప్పుడు ‘నవోదయా’కి వెళ్ళి (విశాలాంధ్ర షాపులు ఆడిట్ కోసమని మూసేశారు కొన్ని రోజులు) చూశాను కదా, 1028 పేజీలున్న పుస్తకంలో 110 కథలున్నాయి!

అంతే కాదు, ‘దిద్దుబాటు’ కంటే ముందు వచ్చిన 87 కథల గురించీ, రాబోయే ఆ సంకలనం గురించీ, దానికి తాను సజెస్ట్ చేసిన ‘దిద్దుబాట’ అనే టైటిల్ గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడారు.

ఏదో హాబీలాగానో, ఖాళీ వున్నపుడు ఎవరికో ఏదో ఫేవర్ చేస్తున్నట్టు రాయడమో చేసే నాలాటి కొందరికి కారా మాస్టారు గారి దగ్గర ఎంతో నేర్చుకోవాలి. అది ఒక జీవనవిధానం కాకుండా వుంటే, రాయడం అనేది ఓ passion ఎలా అవుతుందీ?

  • -కూర్మనాథ్

మీ మాటలు

  1. అది ఒక జీవనవిధానం కాకుండా వుంటే, రాయడం అనేది ఓ passion ఎలా అవుతుందీ?
    “వదవగలుగుతున్నారా?” అని అడిగాను
    “చదవకపోతే ఎలా?”అని వారి ప్రశ్న.
    కాబట్టి రచయిత అన్నవాడు చదువుతునే ఉండాలి.
    కా రా అందుకే చదువుతూ ఉంటారు.

    80′ లలో అనుకుంటాను, విశాఖనుంచి అర్నాధ్ కథలు మద్రాసుకి తీసుకొచ్చి నాకిచ్చి “మంచి కధలు చదవండి,” అని ఇచ్చారు. అది చదవడం మీద ప్రేమ అంటే!

  2. kurmanath says:

    అవును, అనిల్ గారూ. కాలక్షేపం కోసం చదివే చదువు చదువే కాదు. రాసే రాత రాతే కాదు.

  3. ఏది రాసినా ఏ మంచికి అపకారం జరుగుతుందో, ఏ చెడుకు ఉపకారం జరుగుతుందో చూసుకొమ్మని,. ఆలోచించుకోవాల్సిన విషయాలు, ఒక్క అక్షరాన్నైనా రాసే ముందు,.. ధన్యవాదాలు సర్,.

  4. “నువ్వు ఎలా చెప్పదలుచుకున్నావో చెప్పకు. కానీ, ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. ఏదో సత్యాన్ని అనుకుని దాన్ని నిజం చెయ్యడానికి కథ రాయకు. సమాజాన్ని గమనించు. జీవితాన్ని చదువు. నీకు ఎక్కడైనా నువ్వకున్నసత్యం రూఢి అయిందనిపించిందనుకో కథ రాయి. అంతేకాని నువ్వు నమ్మిన భావజాలాన్ని ఎలాగైనా సపోర్టు చెయ్యాలని మాత్రం రాయకు”.. ఎంత గొప్ప పాఠం!
    చాలా సంతోషం డియర్ కూర్మనాధ్ గారు.. చక్కటి చుక్కానిని చూపించారు..
    ఈ ఆనిమిత్యాన్ని మాకందించిన అఫ్సర్ గారికీ ధన్యవాదాలు.

  5. buchireddy gangula says:

    సర్
    పరిచయం సూపర్ గా ఉంది ——– excellent–quotations–సర్
    ——————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  6. Dr Ch Subrahmanyam says:

    కూర్మనాథ్ గారు చాల ధన్యవాదాలు.

    మీ పై వ్యాసం చదివేక మనస్సుకి ప్రసాంతత వచ్చింది.

    కలాం గారి మీద ఒక వ్యాసంతో కలిగిన చికాకు పూర్తిగా పోయి మనస్సు చల్లబడింది.

Leave a Reply to Panthangi Rambabu Cancel reply

*