పెద్రో పారమొ-6

pedro1-1

“ఆమెని అడిగాను, ఒప్పుకుంది. ప్రీస్ట్ అరవై పీసోలు అడిగాడు ముందస్తు పెళ్ళి ప్రకటనలగురించి పట్టించుకోకుండా ఉండేందుకు. వీలయినంత తొందర్లోనే ఇస్తానని చెప్పాను. దైవ పీఠాన్ని బాగు చేయడానికి కావాలన్నాడు. అతని భోజనాల బల్ల కూడా చివరిదశలో ఉందట. కొత్త బల్ల పంపిస్తానని చెప్పాను. నువెప్పుడూ ప్రార్థనకు రావన్నాడు. నువ్వొస్తావని చెప్పాను. మీనాయనమ్మ పోయనప్పట్నుంచీ దశకం చేయలేదన్నాడు. దానిసంగతి వదిలేయమన్నాను. చివరికి ఒప్పుకున్నాడు”
“డలోరిస్ నుంచి అడ్వాన్స్ ఏమన్నా అడగలేదా?”
“లేదయ్య అంత ధైర్యం చేయలేకపోయాను. నిజంగా. ఆమె సంతోషాన్ని చూసి అట్లాంటి పని ఏదీ చేయాలనిపించలేదు.”
“మరీ పసిపిల్లాడిలా ఉన్నావు!”
పసిపిల్లాడని అన్నాడా? నన్ను, యాభై ఏళ్ళ నన్ను పట్టుకుని? అతన్ని చూస్తే ముక్కుపచ్చలారలేదు, నేను కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నాను. “ఆమె సంతోషాన్ని చెడగొట్టదలచలేదు.”
“ఎంతయినా నువ్వింకా పిల్లాడివే!”
“నువ్వేమంటే అదేనయ్యా!”
“వచ్చే వారం ఆ ఆల్డ్రెట్ దగ్గరికి వెళ్ళు. అతని కంచెలు సరి చూసుకోమను. మన మెదియా లూనా లోపలికి జరిపాడని చెప్పు.”
“కొలతలన్నీ పొరపాటు లేకుండా బాగానే కొలిచాడు. ఆ సంగతి నేను కచ్చితంగా చెప్పగలను”
“సరే, పొరపాటు చేశాడని చెప్పు. లెక్కల్లో తేడా వచ్చిందను. అవసరమయితే ఆ కంచెలు పీకేయించు.”
“మరి చట్టం?”
“ఏం చట్టం ఫుల్గోర్? ఇకనుంచీ మనమే చట్టం. మెదియా లూనాలో పనిచేసే వాళ్లలో ఎవరన్నా గట్టివాళ్ళున్నారా?”
“ఒకరిద్దరున్నారు.”
“ఆల్డ్రెట్ సంగతి చూడ్డానికి వాళ్లను పంపు. నువ్వొక ఫిర్యాదు రాయి అతను మన నేలను ఆక్రమించుకున్నాడనో లేకపోతే నీ ఇష్టమొచ్చిందేదో. లూకాస్ పారమొ చనిపోయాడని అతనికి గుర్తు చేయి. ఇకనుంచీ వ్యవహారమేదో నాతోనే తేల్చుకోవాలని చెప్పు.”
ఇంకా నీలంగా ఉన్న ఆకాశంలో కొద్ది మబ్బులే ఉన్నాయి. పైనెక్కడో గాలి రేగుతున్నట్లుంది కానీ కింద నిశ్చలంగానూ, వేడిగానూ ఉంది.

అతను మళ్లీ కొరడా పిడితో తట్టాడు. తీయాలని పేద్రో పారమొకి అనిపించిందాకా వేరెవరూ తలుపు తీయరని తెలిసినా తనొచ్చినట్లు తెలియజేయడానికి. తలుపు పైన ఉన్న రెండు ముడులుగా చుట్టిన అలంకారాల్ని చూసి ఆ నల్ల రిబ్బన్లు బావున్నాయనుకున్నాడు, ఒకదానికొకటి.
అప్పుడే తలుపు తెరుచుకుంది. అడుగు లోపలికి పెట్టాడు.
“రా ఫుల్గోర్! ఆ టోర్బియో ఆల్డ్రెట్ సంగతి ముగిసినట్లేనా?”
“ఆ పని అయిపోయిందయ్యా!”
“ఇంక ఫ్రెగోసస్ విషయమొకటి ఉంది. ప్రస్తుతానికి అది వదిలేద్దాం. నా హనీమూన్ తో తీరికే దొరకడం లేదు.”

“ఈ పట్టణమంతా ప్రతిధ్వనులతో నిండిపోయింది. అవి ఈ గోడల వెనకో, కిందపరిచిన బండరాళ్ల కిందో ఇరుక్కుపోయినట్టు ఉన్నాయి. నువ్వు నడుస్తున్నప్పుడు ఎవరో నీవెనకే ఉన్నట్టూ, నీ అడుగులో అడుగు వేస్తున్నట్టూ ఉంటుంది. మర్మర ధ్వనులు వినిపిస్తాయి. ఇంకా జనాలు నవ్వుతున్నట్టు. అలసిపోయినట్టుగా వినిపించే నవ్వులు. యేళ్ళు అరగదీసిన గొంతులు. అలాంటి శబ్దాలు. కానీ ఆ శబ్దాలన్నీ మాయమయే రోజు వస్తుందనుకుంటాను”
పట్టణం గుండా మేం నడుస్తున్నప్పుడు నాతో డమియాన సిస్నెరోస్ చెప్తూ వస్తున్నదదీ.

“ఒకప్పుడు రాత్రి తరవాత రాత్రి జాతర జరుగుతున్న శబ్దాలు వినిపించేవి. మెదియాలూనా దాకా స్పష్టంగా వినగలిగేదాన్ని. ఆ గోలంతా ఏమిటో చూద్దామని ఇక్కడిదాకా వస్తే నాకు కనిపించేదేమిటంటే ఇప్పుడు మనం చూస్తున్నదే. ఏమీ లేదు. ఎవరూ లేరు. ఇప్పటిలాగే ఖాళీగా ఉన్న వీధులు.
“తర్వాత ఏమీ వినిపించేది కాదు. నీకు తెలుసుగా సంబరాలు చేసుకునీ చేసుకునీ అలసిపోతాం. అందుకే అది ముగిసినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు.
“అవును,” డమియానా సిస్నెరోస్ మళ్లీ అంది “ఈ పట్టణమంతా ప్రతిధ్వనులతో నిండిపోయింది. నాకిప్పుడు భయం వేయదు. కుక్కల అరుపులు వినిపిస్తాయి, వాటినలా అరవనిస్తాను. బాగా గాలిగా ఉన్న రోజుల్లో చెట్లనుంచి రాలిన ఆకులు కొట్టుకుని వస్తాయి. ఇక్కడ చెట్లు లేవన్న విషయం ఎవరికయినా కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఉండి ఉండాలి. లేకపోతే ఆకులెక్కడ్నుంచి వస్తాయి?
“అన్నిటికంటే పాడుసంగతి ఏమిటంటే ఎవరో మాట్లాడుతున్నట్టు వినపడతాయి. ఆ గొంతులు ఏ సందుల్లోంచో వస్తున్నట్లు వినపడుతుంది. కానీ ఆ గొంతులు ఎవరివో చెప్పగలిగేంత స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడు దారిలో దినం చేయడం కనిపించింది. దైవ ప్రార్థన చేద్దామని ఆగాను. నేను ప్రార్థిస్తుండగా ఒకామె మిగతా జనాన్నుండి విడివడి నావైపు వచ్చి ‘డమియానా నాకోసం ప్రార్థించు డమియానా!’ అంది.
“ఆమె మొహాన ముసుగు జారి ఆమె మొహం కనపడగానే గుర్తు పట్టాను. ఆమె నా అక్క సిక్స్టినా.
“’నువ్వేం చేస్తున్నావిక్కడ?’ ఆమెనడిగాను.
“అప్పుడామె పరుగెత్తుకుని వెళ్ళి మిగతావాళ్ల వెనక దాక్కుంది.
“నీకు తెలియదేమో, మా అక్క సిక్స్టినా నాకు పన్నెండేళ్ళప్పుడే చనిపోయింది. అందరికంటే పెద్దది. మేము పదహారుమందిమి. నువ్వే లెక్క చూసుకో ఇప్పటికి ఆమె చనిపోయి ఎన్నాళ్లయిందో!. ఇంకా ఈలోకంలోనే తిరుగుతూంది. కాబట్టి నీకు కొత్త ప్రతిధ్వనులు వినపడితే ఏం భయపడకు హువాన్ ప్రెసియాడో!”
“నేను వస్తున్నట్టు నీకు మా అమ్మేనా చెప్పింది?” నేను అడిగాను.
“కాదు. ఇంతకీ మీ అమ్మకి ఏమయింది?”
“ఆమె చనిపోయింది” బదులిచ్చాను.
“చనిపోయిందా? ఎలా?”
“ఏమో నాకు తెలియదు. బహుశా దిగులేమో! ఎప్పుడూ నిట్టూర్పులు విడుస్తూ ఉండేది.”
“అయ్యో! ప్రతి నిట్టూర్పుతోటీ నీ జీవితంలో ఒక్కో బొట్టూ జారిపోతూ ఉంటుంది. అయితే చనిపోయిందన్నమాట!”
“అవును. నీకు తెలుసనుకున్నాను.”
“నాకెట్లా తెలుస్తుంది? ఆమె కబురందక కొన్నేళ్ళయింది.”
“మరి నీకు నా సంగతెలా తెలుసు?”
డమియానా బదులీయలేదు.
“నువు బతికే ఉన్నావా డమియానా? చెప్పు డమియానా?”
అకస్మాత్తుగా ఆ ఖాళీ వీధుల్లో నేను ఒంటరిగా నిలబడి ఉన్నాను. కప్పులు లేని ఇళ్ల కిటికీల్లోంచి ఎత్తుగా పెరిగిన కలుపు మొక్కలు కనిపిస్తున్నాయి. దాచలేని కప్పు కింద పొడవుతున్న ఇటుక గోడలు.
“డమియానా!” పిలిచాను. ‘డమియానా సిస్నెరోస్!”
ప్రతిధ్వని బదులిచ్చింది “…ఆనా….నెరోస్…ఆన..నెరోస్”

కుక్కలు అరవడం వినిపించింది. నేనే వాటిని లేపినట్టు. ఒకతను వీధి దాటటం చూశాను.
“ఓయ్, నిన్నే” పిలిచాను.
“ఓయ్, నిన్నే” నా గొంతే వెనక్కి వచ్చింది.
పక్క మలుపులోనే మాట్లాడుకుంటున్నట్టు ఇద్దరు ఆడవాళ్ళ మాటలు వినవచ్చాయి.
“చూడు ఇటు ఎవరొస్తున్నారో! అది ఫిలోటియొ అరేచిగా కాదూ?”
“అవును అతనే. అతన్ని గమనించనట్టు నటించు.”
“అంతకంటే మేలు, ఇక్కడినుంచి పోదాం పద! అతను మనవెంట పడితే మనలో ఒకరినుంచి ఏదో ఆశిస్తున్నట్టు. మనలో ఎవరి వెనక పడుతున్నానుకుంటున్నావు?”
“నీ వెనకే అయ్యుండాలి.”
“కాదు, నా లెక్కప్రకారం నీ వెనకే.”
“మనం పారిపోవలసిన పని లేదు. అతనా మలుపు దగ్గరే ఆగిపోయాడు.”
“అయితే మన ఇద్దరిలో ఎవరమూ కాదన్నమాట. చూశావా!”
“కానీ అయి ఉంటే? అప్పుడేమిటి?”
“లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు.”
“కాకపోవడమే మంచిదయింది. డాన్ పేద్రోకి అమ్మాయిలని ఏర్పాటు చేసేది అతనే అంటారంతా. మనం తప్పించుకున్నాము.”
“అవునా? ఆ ముసలాడితో శొంటి నాకు లేకపోవడమే మేలు.”
“మనం ఇక వెళ్ళడం మంచిది.”
“అవును. ఇంటికి పోదాం.”

రాత్రి. అర్థరాత్రి దాటి చాలాసేపయింది. ఇక ఆ గొంతులు:
“ఈ ఏడు మొక్కజొన్న పంట బాగా పండితే నీ అప్పు తీరుస్తాననే చెప్తున్నాను.అది చేతికి అందిరాకపోతే నువు కొనాళ్ళు ఆగవలసిందే!”
“నేనేమీ బలవంతపెట్టడం లేదు. ఎంత ఓపిక పట్టానో నీకు తెలుసు. కానీ అది నీ పొలం కాదు. నీది కాని పొలంలో పని చేస్తున్నావు. మరి నా అప్పు తీర్చడానికి డబ్బెక్కడి నుంచొస్తుంది?”
“అది నా పొలం కాదన్నదెవరు?”
“పేద్రో పారమోకి అమ్మావని విన్నాను.”
“నేను అతని దరిదాపులకి కూడా పోలేదు. అదింకా నా పొలమే.”
“అని నువ్వంటున్నావు. జనాలంతా అది అతనిదంటున్నారు.”
“ఏదీ ఆ మాట నాతో అనమను.”
“చూడు గెలీలియో! మనలో మాట, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత కాదన్నా నా చెల్లి భర్తవి. ఆమెను నువ్వు బాగా చూసుకోవడంలేదని ఎవరూ అనగా నేను వినలేదు. కానీ ఆ పొలం నువ్వు అమ్మలేదని మాత్రం నాకు చెప్పబోకు.”
“ఎందుకు చెప్పను? అది నేను ఎవరికీ అమ్మలేదు.”
“అది పేద్రో పారమోకి చెందుతుంది. ఆ అర్థం వచ్చేటట్లే నాతో అన్నాడు. డాన్ ఫుల్గోర్ వచ్చి నిన్ను కలవలేదా?”
“లేదు.”
“అయితే రేపు తప్పకుండా ఇక్కడికి వస్తాడు. రేపు కాకపోతే త్వరలోనే ఒక రోజెప్పుడో!”
“అయితే మా ఇద్దరిలో ఒకడికి చావు రాసి పెట్టి ఉంది. అతని ఆటలు నా దగ్గర సాగవు.”
“వదిలేసి ప్రశాంతంగా ఉండు బావా! ఎందుకయినా మంచిది.”
“నేనెక్కడికీ పోను, చూస్తూండు. నాగురించి కంగారు పడకు. మా అమ్మ డక్కామొక్కీలు తినిపించే పెంచింది గట్టివాడిగా.”
“సర్లే, రేపు చూద్దాం. ఫెలిసిటాస్ కి రాత్రి భోజనానికి రానని చెప్పు.తర్వాత ‘అతను చనిపోయే ముందు రాత్రి నేను అతనితోనే ఉన్నాను’ అని చెప్పుకునే బాధ తప్పుతుంది.”
“చివరి క్షణంలో మనసు మార్చుకుంటే రా, నీకోసం అట్టేపెడతాం.”
దూరమవుతున్న అడుగుల చప్పుడు కాలి బూట్ల ముళ్లచక్రాల గలగలల్లో కలిసిపోతూ ఉంది.

“రేపు పొద్దున్నే వేకువజామున నాతో వస్తున్నావు చోనా. జట్టునంతా సిద్ధం చేశాను.”
“మరి మానాన్న తట్టుకోలేక చచ్చిపోతే ఏం చెయ్యాలి? ఈ వయసులో.. నామూలాన ఆయనకి ఏమయినా అయితే నేను భరించలేను. ఆయన బాగోగులు చూడవలసినదానిని నేనొక్కదాన్నే కదా? ఇంకెవరున్నారు? ఆయన్నించి లాక్కెళ్ళడానికి ఎందుకంత తొందర నీకు? కొన్నాళ్ళు ఆగు. ఎన్నాళ్ళో బతకడు.”
“పోయిన ఏడూ అదే చెప్పావు. అవకాశం తీసుకోవడం లేదని ఎత్తిపొడిచావు. అప్పుడేమో ఈ పనులన్నిటితో విసిగిపోయి ఉన్నానన్నావు. కంచరగాడిదల్ని కట్టి సిద్ధం చేశాను. నువ్వు నాతో వస్తున్నావా లేదా?”
“నన్ను ఆలోచించుకోనివ్వు.”
“చోనా! నేను నిన్నెంత కోరుకుంటున్నానో నీకు తెలుసు. ఇంక ఆగలేను చోనా! ఏది ఏమయినా నువ్వు నాతో రావలసిందే!”
“నేను ఆలోచించుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆయన చనిపోయేదాకా మనం ఆగాలి. ఎన్నాళ్ళో పట్టదు. అప్పుడు నేను నీతో వస్తాను. మనం లేచిపోవలసిన అవసరం ఉండదు.”
“అది కూడా చెప్పావు సంవత్సరం క్రితం.”
“అయితే?”
“చోనా, నేను కంచరగాడిదలు బాడిగకి తీసుకోవలసి వచ్చింది. అవి తయారుగా ఉన్నాయి. నీకోసమే ఎదురుచూస్తున్నాయి. ఆయన బతుకు ఆయన్ని బతకనివ్వు. నువు అందగత్తెవి. వయసులో ఉన్నావు. ఏ ముసలమ్మో వచ్చి ఆయన్ని చూసుకుంటుంది. దయగల తల్లులు లోకంలో చాలామందే ఉన్నారు”
“నావల్ల కాదు.”
“అవుతుంది.”
“కాదు. అది నన్నెంత బాధిస్తుందో నీకు తెలుసు. ఆయన నా కన్నతండ్రి.”
“ఇక నేను చెప్పేదేం లేదు. నేను హూలియానా దగ్గరికి పోతున్నాను. తనకి నేనంటే తగని పిచ్చి.”
“సరే. నువు పోవద్దని నేను చెప్పను.”
“అయితే రేపు నా మొహం చూడవా?”
“లేదు. నిన్నెప్పటికీ చూడాలనుకోవడం లేదు.”

శబ్దాలు. గొంతులు. గొణుగుళ్ళు. దూరపు పాట:
లేసు అంచుల రుమాలిచ్చిపోయావా ప్రియతమా
నాకన్నీళ్ళు తుడుకునేందుకు
ఉచ్ఛస్వరాలు. ఆడవాళ్లెవరో పాడుతున్నట్టు.

బళ్ళు కిరకిరలాడుతూ పోవడం చూశాను. నెమ్మదిగా కదులుతున్న ఎడ్లు. చక్రాల కింద నలుగుతున్న రాళ్ళు. నిద్రకి తూగున్నట్టున్న మగాళ్ళు.
… ప్రతి ఉదయమూ ఆ పట్టణం దాటిపోయే బళ్ళ మూలాన వణుకుతుంది. అవి ఉప్పూ, మొక్కజొన్న కండెలూ,పశువుల దాణా వేసుకుని ఎక్కడెక్కడినుంచో వస్తాయి. కిటికీలు దడదడలాడి లోపలి జనాలు లేచేదాకా చక్రాలు కిర్రుమని మూలుగుతుంటాయి. ఆవం తెరిచే సమయం కనక అప్పుడే కాల్చిన రొట్టె వాసన చూడగలవు. హటాత్తుగా ఉరుముతుంది. వాన, వసంతకాలం వచ్చిందేమో! ఆ ఆకస్మికాలకి నువ్వు తొందరలోనే అలవాటు పడతావు కొడుకా!”
వీధుల్లోని నిశ్శబ్డాన్ని చిలుకుతూ ఖాళీ బళ్ళు. రాత్రి చీకటి దారుల్లో కలిసిపోతూ. ఇంకా నీడలు. నీడల ప్రతిధ్వని.
వెళ్ళిపోదామనుకున్నాను. నేను వచ్చినదారి కొండల పైదాకా పోల్చుకోగలుగుతున్నాను. అది కొండల నల్లదనంలో తెరుచుకున్న గాయంలా కనిపిస్తుంది.
అప్పుడెవరో నాభుజాన్ని తాకారు.
“నువ్విక్కడ ఏం చేస్తున్నావు?”
“నేను ..” ఎవరిని చూడడానికొచ్చానో ఆ పేరు చెప్పబోయి ఆగిపోయాను. “ నేను మా నాన్నను చూడటానికి వచ్చాను.”
“లోపలికి రారాదూ?”
“లోపలికి వెళ్ళాను. సగం కప్పు ఇంట్లోకే కూలిపోయి ఉంది. నేలమీదే కప్పు. మిగతా సగంలో అతనూ, ఆమే.
“మీరు చనిపోయారా?”
ఆమె నవ్వింది. అతను తీక్షణంగా చూస్తున్నాడు.
“బాగా తాగినట్టుంది.” అతనన్నాడు.
“భయపడ్డాడులే!” ఆమె అంది.
ఒక నూనె పొయ్యి ఉంది. ఎర్ర మంచం, ఈమె దుస్తులు పడేసిన మోటు కుర్చీ. పుట్టినప్పుడున్నంత నగ్నంగా ఉంది ఆమె. అతను కూడా.
“ఎవరో మా తలుపుకి తలకొట్టుకుంటూ మూలుగుతున్న చప్పుడు వినవచ్చింది. తీసి చూస్తే నువ్వు. ఏమయింది నీకు?”
“చాలా జరిగాయి. నాకయితే నిద్రపోవాలనే కోరిక తప్ప మరేం లేదు.”
“ఆ నిద్రే పోతూ ఉన్నాం.”
“అయితే పడుకుందాం పదండి!”

మీ మాటలు

*