ఎలా వున్నావ్!

Rekha

మొదటిసారి నువ్వడుగుతావు చూడు

“ఎలా వున్నావ్? ” అని

అప్పుడు చూసుకుంటాను నన్ను నేనొక్కసారి

చాలా కాలం నుంచీ కాలానికి వదిలేసిన నన్ను నేను

అప్పుడు చూసుకుంటాను ,

నీకు ఒక సరైన సమాధానం చెప్పడానికి

అప్పుడు చూసుకుంటాను నా బాగోగులు

“బాగున్నాను “అని నీకు బదులు ఇవ్వడానికి

“ఏవీ నీ కొత్త వాక్యాలు , పట్టుకురా ” అని అడుగుతావు చూడు

అప్పుడు చూస్తాను ఒత్తైన దుమ్ములో ఒత్తిగిలి రంగు మారి

అంచులు చిరిగిన నా పేద కాగితపు పూవుల్ని

వాటి మీద ఆశగా చూస్తూ మెరుస్తూన్న

కొన్ని పురాతన భావాక్షరాలని

అయినా సరే ఎలా నీ చేతిలో పెట్టేది , ఎలాగో

అతి కష్టం మీద ఓ దొంగ నవ్వు వెనకగా దాచేస్తాను

నీ నుంచి రాబోయే మరో ప్రశ్న తెలుస్తోంది

ఎక్కడున్నాయి నా రంగులు, నా కుంచెలు? అని

లోలోనే వెదుక్కుంటాను , తవ్వుకోలేక

తల వంచుకొని నిలబడతాను

వెల్లవెలసిన నా ముఖం చూసి మౌనంగా వుండిపోతావు

మరేదైనా దీనికి సమానమైన శిక్ష ఉంటే బాగుండునేమో కదా !!

ఆ మూలగా తీగలు తెగిన వీణ ,

బీడువారిన పెరడు కూడా నీ కంట పడతాయేమో అని

ఎంత కుచించుకు పోతానని !

నిజమే !

నీవీ వాకిలికొచ్చి విచారించ బట్టి తడుముకున్నాను కానీ ,

నన్ను భూమి మీదకు పంపుతూ నీవు అమర్చిన సహజ కవచ కుండలాలన్నీ

బ్రతుకు పందెంలో ఎప్పుడో తాకట్టు పెట్టేశాను !

మా తండ్రివి కాదూ

ఈ ప్రాణం ఉండగానే మరొక్క అవకాశం ఇవ్వవూ

మిగిలిన సమయంలోనైనా ఆ తాకట్లు కాస్తా విడిపించుకొనేందుకు !!

-రేఖా జ్యోతి

మీ మాటలు

 1. మైథిలి అబ్బరాజు says:

  ” ఆ తాకట్లు కాస్తా విడిపించుకొనేందుకు !! ”….:(

  సుతిమెత్తని తనానికి కాలం చెల్లిపోలేదు , ఈ కాలానికి రేఖాజ్యోతి ఉన్నారు .

 2. S. Narayanaswamy says:

  “ఈ ప్రాణం ఉండగానే మరొక్క అవకాశం ఇవ్వవూ”
  నిజం. రేప్పొద్దున కళ్ళు తెరిచి నిద్ర లేచాము అంటేనే ఆ అవకాశం ఇచ్చినట్టే!
  చాలా బావుంది.

 3. buchireddy gangula says:

  జ్యోతి గారు
  ఎంత గొప్పగా రాశారు — madam—-
  సూపర్ గా ఉంది
  ————————————————–
  బుచ్చి రెడ్డి gangula

 4. మైథిలి మామ్ చెప్పినట్లు “సుతిమెత్తని తనానికి కాలం చెల్లిపోలేదు , ఈ కాలానికి రేఖాజ్యోతి ఉన్నారు .”

 5. Jayashree Naidu says:

  కవితని ఎన్ని సార్లు చదివినా మరో సారి చదివిస్తున్నారు
  సింప్లీ స్వీట్ అండ్ సెన్సిటివ్ …

 6. ఎలా వున్నావ్? అనే ప్రశ్నే మనల్ని జవాబుగా సిద్ధం చేస్తుంది!!నిజం.మంచికవిత.

 7. సూపర్ రేఖ గారు! కవిత ప్రారంభం అయితే కదిపేసింది.

 8. నిశీధి says:

  బాగుంది

 9. నీవీ వాకిలికొచ్చి విచారించ బట్టి తడుముకున్నాను కానీ…

  ఈ లైన్ వరకూ ఒక భగ్న ప్రేమికుడో/ప్రేమికురాలో చెప్తున్నట్టుగా అనుకున్నా… అందుకనే తర్వాతి లైన్స్ నాకు మొదటిసారి చదివినప్పుడు నచ్చలేదు… కానీ తర్వాత మళ్ళీ మొత్త కవిత చదివితే, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది… పిచ్చ పిచ్చ గా నచ్చేసింది…

  ఇలాంటి కవితలు అనుకొని రాయలేరు, అనుకొన్నా రాయలేరు…

 10. శర్మ says:

  వావ్!!

 11. రేఖాజ్యోతి గారూ,
  మీ కవిత ఎత్తుబడినుండి ముగింపు దాకా చాలా చక్కగా సాగింది. మీరు చాలా నేర్పుగా ఒక్కొక్క వస్తువునీ దీపావళి పటాకీలలా వెలిగిస్తూ వచ్చారు. మూసపోసిన కవితలు చదివీ చదివీ పాఠకులకి కూడా పద్యం పూర్తిగా చదవకుండానే మూసపోసిన ఆలోచనలు వస్తాయనుకుంటాను. నేనూ అటువంటి పొరపడ్డ పాఠకులలో ఒకడిని. “మా తండ్రివి కాదూ!” అని చదవగానే ఒక్క సారి కవిత ఎన్ని వేలరెట్లు ఎత్తుకి ఎదిగిపోయిందో తెలిసింది. అప్పుడు తీగలు తెగిపోయిన వీణా, పాడుబడ్డ పెరడూ అంతకు ముందు కలిగించిన భావానికంటే ఎక్కువ ఆర్ద్రత కలిగించేయి.
  హృదయపూర్వక అభినందనలు.

 12. I just reread it, Rekha garu, wonderful poem. Many thanks.

 13. కవితలు ఆన్ని బాగున్నవి ఆక్కడక్కడ పలుచని ఆబియక్తి పంటి కింది రాయే లాగా కనపడు thunnavi

మీ మాటలు

*