‘ఎగిరే పావురమా!’ – 16

egire-pavuramaa16-banner

నేను కళ్ళు తుడుచుకొని బాబాయి వంక సూటిగా చూసాను…

‘చూడు రాంబాబాయి’ అన్నట్టు అతని చేతిని వేళ్ళతో తట్టాను..

కమలమ్మని, గోవిందుని చూపిస్తూ – ‘మూడేళ్లగా వీళ్ళతో కలిసున్నానని, బాగానే ఉన్నానని’ సైగ చేసాను….

జేమ్స్ ని చూపించాను…’అతని వద్ద క్యాంటీన్ లో ‘వంటా-వార్పు’ చేస్తున్నానని’ చెప్పాను…

‘ఆ కొలువు చేయబట్టే, నా కాలి చికిత్స జరిగిందని, ఇంకా నాలుగే వారాల్లో చికిత్స కూడా పూర్తవుతుందని’ తెలియజెప్పాను.

నేనిప్పుడు చాలా మెరుగ్గా కదలగలుగుతున్నానని చెప్పాను…

 

తాత ఉత్తరం తీసుకొని గుండెలకి హత్తుకున్నాను. తాత మీద ప్రేమ, బెంగా ఉన్నాయని తెలియజేశాను….

ఆయన రాసిందంతా నేను అర్ధం చేసుకున్నానని తాతకి చెప్పమన్నాను.

నా చదువు కూడా కొనసాగిస్తున్నానని,   నేను అన్నీ ఆలోచించి   మళ్ళీ ఉత్తరం రాస్తానని తెలియజేయమన్నాను. తాతని, పిన్నిని అడిగానని చెప్పమన్నాను.

 

ఆఖరికి, చేతులు జోడించి, ఇక బయలుదేరమన్నాను…

రాంబాబాయి కూడా నాతోపాటే ఏడ్చేశాడు…

నాచేతులు తన చేతుల్లో పట్టుకుని, “సుఖంగా ఉండు గాయత్రి. నీవన్నవన్నీ తాతకి చెబుతాలే,” అని వెనుతిరిగాడు..

బాబాయిని సాగనంపడానికి, గోవిందు వెంట నడిచాడు.

కన్నీళ్ళతో   మసకబారిన   చూపుతో వెళ్లిపోతున్న ఆయన్ని చూస్తుండిపోయాను……..

**

కిచెన్లో – పొయ్యిల మీద గుండిగలో కుర్మాకూర కలుపుతున్నాను. వెనుక నుండి జేమ్స్ గొంతు వినవచ్చింది….

కాసేపటికి నా పక్కకొచ్చాడు.

“నీలో మునుపు లేని ఉషారు, ముఖంలో ఓ వెలుగు కనబడుతున్నాయి గాయత్రీ. పోయిన వారం నీ కాలు వైద్యం ముగిసిందని, డాక్టరమ్మ మన జలజ మేడంకి సమాచారం ఇచ్చారు… ఇకపోతే, రేపటిరోజున మళ్ళీ ఒక్కసారి వెళతావంటగా! చికిత్స కొనసాగింపు కాగితాలమీద నీ సంతకాలు కావాలన్నారంట,”… అన్నాడు.

 

తల వంచుకొని పనిచేసుకుంటూ వింటున్నాను….

మరో నిముషానికి నా ముందుకి వచ్చి నిలుచున్నాడు.

 

“గోవిందుతో నీ పెళ్ళికి సరిగ్గా పది రోజుల టైం ఉంది. చాపెల్ బుక్ చేయించింది కమలమ్మ. మిగతా ఏర్పాట్లు నేనే చెయ్యాలి. నీ వాలకం నాకు అర్ధం అవడంలేదు,” క్షణమాగాడు.

“నేను రెండురోజులు మా ఊరికి పోయొస్తా. వచ్చాక మళ్ళీ కనబడతా. ఈ రెండు రోజుల్లో సరయిన నిర్ణయం చేసుకొని నాకు మంచి వార్త చెప్పాలి నువ్వు. లేదంటే నువ్వు, గోవిందు కష్టపడాల్సి వస్తది,” అంటూ నా భుజాన చేత్తో నొక్కాడు.

వాడి చేయి విదిలించి వెనక్కి తిరిగేప్పటికి పక్క వాకిట్లోంచి గోవిందు లోనికొచ్చాడు.

 

అదాట్టుగా అతను ఎదురుపడ్డంతో, ఒక్కక్షణం జేమ్స్ తత్తరపడ్డాడు.

వెంటనే తేరుకొని, “ఏమిరా గోవిందు, నేను రెండు రోజులు ఊరికి పొతున్నా. రేపు కమలమ్మని తోడిచ్చి గాయత్రిని ఆసుపత్రికి పంపించు.   చిన్న పనే అక్కడ. ఏవో సంతకాలు చేయాలంట.. ఈడ నేను లేనప్పుడు అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకో,” అని ఆర్డర్ వేసి వెళ్లాడు తలతిక్క జేమ్స్.

**

“అక్కా, ఇయ్యాల మార్కెట్ నుండి సామాను దింపాక, గాయత్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నాడు జేమ్స్. వాడు ఊళ్ళో లేడుగా! ఏవో కొన్ని ఎగస్ట్రా పనులు సెప్పాడులే.   ఆసుపత్రికి పోడం చికిత్సకి కాదంట! ఆడేదో కాగితాల పైన సంతకాల పనుందంట. మేమెళ్ళి తొరగానే వస్తాములే,” అని కమలమ్మతో అంటూ, పొద్దున్నే   రోజూ కంటే ముందే ఇంటినుండి బయలుదేరాడు గోవిందు.

**

డాక్టరమ్మని కలిసి, కాగితాలు సంతకాలు చేసిచ్చాను. ఓ కట్ట కాగితాలు ‘మదర్ తెరెసా’ జలజ గారికిమ్మని నాకందించిందామె.

ఇప్పుడు నా కదలిక మునుపెన్నడూ లేనంత సులువుగానే ఉందని చెప్పాను….

క్రచస్ వాడుతునే ఉండమంది.

ఆమె కాడ శలవు తీసుకొని బయటికి వస్తున్న నాకు ఎదురొచ్చాడు గోవిందు.

“కాసేపు గుడికెళ్ళి కూకుందాము రా,” అంటూ అటుగా తీసుకెళ్ళాడు.

**

గుడిలోకి వెళ్ళగానే, “ముందు మొహాన బొట్టెట్టుకో. ఇయ్యాల నుండి నువ్వు బొట్టు తీసే పనే లేదు,” అన్నాడు గోవిందు.

తలెత్తి నవ్వి ఊర్కున్నాను.

దేవుడి కాడ దణ్ణమెట్టుకుని,  దేవుని కుంకుమెట్టుకొని, ఎదురుగా కాస్త ఎడంగా ఉన్న మెట్ల మీద కూచున్నాము.

గోవిందు వెళ్ళి, తినడానికి పులిహోర ప్రసాదం తెచ్చాడు.

 

“గాయత్రీ, ఈడ ఇయ్యాల బెల్లం పాయసం కూడా ఉంది తెలుసా,” అంటూ మళ్ళీ వెళ్ళి రెండు దొన్నెల్లో పాయసం కూడా తెచ్చాడు.

తిని నీళ్ళు తాగాము.

ఎడంగా కూచున్న గోవిందు, లేచి వచ్చి పక్కన కూచున్నాడు.

“నీతో మాట్లాడాలి గాయత్రీ,” అన్నాడు….

 

‘ఏంటో చెప్పమన్నాను’ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి…

నాకు ఈ పెళ్ళీ వద్దు, ఇక్కడి జీవనం వద్దు, నా తాత కాడికి వెళ్లిపోతానని నా మనస్సు పడుతున్న ఆవేదన కన్నీళ్ళగా మారింది……..

 

“ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి కావాలో నాకు తెలుసు… కళ్ళు తుడుచుకో,” అని ఆగాడు.

“…చూడు… నీకు ఎంతో అన్యాయం జరిగిపోయింది గాయత్రి… పాపం మీ తాత, పిన్ని, బాబాయి ఎంత కష్టపడ్డారో!… ఏమైనా కమలమ్మ సేసింది పెద్ద తప్పు.. నేను కూడా ఏం సేయలేను. నాదీ తప్పే… ఇక ఆ గుంటనక్క జేమ్స్ ఇషయం కూడా నాకెరకే…

నీ కష్టం, ఇబ్బంది అన్నీ తెలుసు…నాక్కూడా ఈ పెళ్ళీ గిళ్ళీ ఏమీ వద్దు… ఈడనే ఉంటే, ఆ జేమ్స్ గాడు నిన్ను బతకనివ్వడు,” క్షణమాగి సూటిగా నా వంక చూసాడు.

“ఇప్పుడైతే ఊళ్లోనే లేడు. అందుకని,” చెప్పడం ఆపాడు నేనేమంటానోనని..

 

నా కళ్ళకి గోవిందు దేవుడిలా కనబడ్డాడు. ఆగని కన్నీళ్ళే గోవిందుకి   నేను చెప్పగల కృతజ్ఞతలు.

 

“నీ పుస్తకాలు, బట్టలు కూరల సంచీలో పెట్టి తెచ్చాను…

ఆసుపత్రి కాంపౌండులో వాన్ పెట్టి, ఆటోలో రైల్వే స్టేషన్ కెళదాము. గంటలో పాలెంకి రైలుంది. నేను టికెట్లు తీసే పెట్టాను. మీ ఊళ్ళో దిగాక నిన్ను మీ కొట్టాం దారి పట్టించే వరకు నేను తోడుంటాను,” అన్నాడు గోవిందు….

egire-pavurama14

**

అరపూట ప్రయాణమయ్యాక పాలెం చేరాము…..

“మీ తాత కొట్టాంలో ఉంటాడా? లేక గుడిలోనా ?” అంటూ కొట్టాం వైపే మళ్ళించాడు ఆటోరిక్షాని గోవిందు.

పది నిముషాల్లో కొట్టాంకి కాస్త పక్కగా ఆగింది ఆటో.   దిగి గోవిందు వైపు చూసాను. ఏమనాలో తోచలేదు. “ఇక లోనికెళ్ళు,” అంటూ నా బ్యాగు ఆటో డ్రైవర్ భుజాన వేసాడు.

 

కదిలి వెళ్ళి కొట్టాం వాకిట్లో ఆగాను. లోన అలికిడిగానే ఉంది…బ్యాగు లోపల పెట్టి ఆటోడ్రైవర్ వెళ్ళిపోయాడు.

కొద్ది క్షణాలాగి కొట్టాంలో అడుగు పెట్టాను.

**

లోన పదిమంది వరకు జనం ఉన్నారు. చుట్టూ చూస్తే ఎక్కడా తాత జాడ లేదు. ఓ వైపుగా పిన్ని, బాబాయి అటుగా తిరిగి చాప మీద కూచుని, కళ్ళు మూసి చేతులు జోడించి ఉన్నారు. వారికి కాస్త వెనుకగా రాములు కూడా కూచునుంది. సాతానయ్య మంత్రాలు చదువుతున్నాడు. నాకు గుండె జారినట్టయింది. నా కట్టెకాలు సాయంతో మరో నాలుగడుగులు ముందుకేశాను.

అప్పుడు కనబడింది. నేల మీద ముగ్గు మధ్యగా పరచిన బియ్యం మీద తాత పటం పెట్టుంది. పటానికి పూల మాల వేసుంది. పటం ముందు దీపం వెలిగించుంది.

పిన్ని, బాబాయి చేతులు జోడించింది తాత చిత్రపటం ముందని అర్ధమయింది.

గుండెలు పగిలేలా ఆక్రోశించింది నా ప్రాణం. “తాతా ! నీ కోసమే నేనొచ్చాను,

నువ్వు రమ్మన్నావని నేనొచ్చాను,” అని గుండెల్లోంచి బిగ్గరగా కేకపెట్టాను.

నా కేకకి నా గుండెలవిసిపోయాయి. నేలమీద కుప్పలా కూలిపోయాను.

నా ఆసరా కర్రలు కూడా నన్నాదుకోలేక పోయాయి.

కింద పడ్డ నా కర్రల చప్పుడుకి పిన్ని, బాబాయి వెనుతిరిగి చూశారు.

పరుగున నా వద్దకు వచ్చింది పిన్ని…

**

నా కోసం, నా రాక కోసం పరితపించిన తాత, నెల రోజులుగా ఆహారమే తీసుకోలేదంట. ఆరునెల్లగా తాత కంటి చూపుతో పాటు ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందంట. తీవ్ర ఆమ్లత వల్ల కడుపు నొప్పితో బాధపడ్డాడంట. ఆఖరి వారం రోజుల పాటు ఏ మందులకీ ఆగని వాంతులతో చాలా నీరసించి చనిపోయాడంట తాత.­­

 

రాత్రింబగళ్ళు బాధతో, దుఃఖంతో గడిపేస్తున్నాను… రాములు, పిన్ని పక్కనే ఉండి ఓదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

**

తాత చనిపోయి పన్నెండు రోజులయింది. ఇవాళ తాత తద్దినాలు. నిద్రపట్టక, తెల్లారుజామునే లేచి మంచం మీద కూచుండి పోయాను. పదమూడో రోజు కొట్టాంలోనే శాంతిభోజనాలు పెడుతున్నారు పిన్ని, బాబాయి వాళ్ళు.

చంద్రం పిన్ని నా కాడికి వచ్చి, నా మంచానికి ఎదురుగా ఉన్న చెక్క బీరువా నుండి చీర, గాజులు తీసి కట్టుకోమని మంచం మీదెట్టింది.

తలెత్తి పిన్ని వంక చూసాను. పక్కన కూర్చుని నా భుజాల చుట్టూ చేయి వేసింది.

ఇద్దరం దుఃఖాన్ని ఆపుకోలేకపోయాము.

 

పిన్నే ముందు తేరుకుంది.

“తాత నీ పద్దెనిమిదో పుట్టినరోజుకని ఈ చీర కొని ఉంచాడురా, గాయత్రి.

అంతే కాదు. గత మూడేళ్ళగా నీ పుట్టిన రోజుకని చీరలు, గాజులు కొనిపెడుతూనే ఉన్నాడు.

అందుకే తాత ఆత్మశాంతికి ఇయ్యాళ ఇది కట్టుకొని ఈ గాజులేసుకో,” అంది పిన్ని.

 

నాలుగేళ్ళగా నా పుట్టినరోజుకంటూ చీర, సారె కొని ఉంచిన తాత నాపై ఎంత ఆపేక్ష పెంచుకున్నాడో అర్ధమయి కుమిలిపోయాను.

తాత పెద్దదినం అయ్యేంత వరకు, ఓ ప్రాణమున్న శిలలా భారంగా గడిపాను. తాత పట్ల నేను వ్యవహరించిన తీరుకి నాలో గూడుకట్టుకున్న పశ్చాత్తాపం వెల్లువైంది.

**

రాములు నన్ను కనిపెట్టుకొని ఉంటుంది.   వంట చేసి, నాకు చెప్పి పొద్దున్నే గుడికి వెళుతుంది. సాయంత్రం చీకటయ్యాక ప్రసాదాలు తీసుకొనొస్తుంది.

నాకు రోజంతా తోచకుండా అయిపొయింది… బయట కొట్టాం చుట్టూ, రెండు మూడు సార్లు తిరిగొస్తున్నాను…..

 

గత మూడేళ్ళగా, కొట్టాం కూడా మరమత్తులు చేయించి, వీలుగా ఉండేలా కొద్ది మార్పులు చేయుంచాడు, తాతని తెలుస్తూనే ఉంది.

తడికలు తీసి చెక్కలు, పెట్టించాడు.

గదిలో చెక్క బీరువా, పక్కనే నిలువాటి అద్దంతో సహా పెట్టించాడు.

పొయ్యి కాడ స్థలం, ఎనకాతల స్నానాల గది కూడా మెరుగయ్యాయి.

కొట్టాం చుట్టూ రాళ్ళతో అరగోడ కట్టించి చిన్న గేటు, గొళ్ళెం కూడా పెట్టించాడు.

 

అరుగు మీద కూచుని, రాములు తెచ్చిన సనక్కాయలు వోలుస్తుండగా వొచ్చింది చంద్రం పిన్ని.

పొయ్యుకాడ నుండి చాటలో బియ్యం తెచ్చుకుని, ఎదురుగా కూచుంది.

“మెల్లగా నీ దుఃఖాన్ని మరిచిపోవాలి. నీ వెంట బోలెడన్ని పుస్తకాలున్నాయిగా! చదవడం మొదలెట్టు… బాబాయికి చెప్పి ఇంకా పుస్తకాలు తెచ్చుకునే దారి చూద్దాం. సరేనా?” అంది.

అలాగేనని తలూపాను…

 

“అసలు ముఖ్యమైన సంగతి ఒకటుందిరా గాయత్రీ. మీ తాత గురించే. ఈ మూడేళ్ళు, ఆ మాత్రమన్నా ఉన్నాడంటే, ఆ పూజారయ్య చలవేరా. సత్యమన్న పట్ల జాలితో, అతని ఆరోగ్యం పట్ల శ్రద్ధతో, గుడిలోనే నీడ పట్టున పూజాసామగ్రి అమ్మకాలికి కూర్చోబెట్టి, అందుగ్గాను గుడి నుండి జీతం ఏర్పాటు చేసాడాయన.

పింఛను కూడా కలిపితే మెరుగ్గానే బతికాడు తాత. తన తదనంతరం ఆ పింఛను నీకు అందేలా రాసి ఏర్పాటు చేశాడు. కొట్టాంలో ఈ మరమత్తులు కూడా చేయించాడు,” అంది పిన్ని.

 

“అప్పట్లో రాంబాబాయితో నువ్వు వెనక్కి వచ్చేసి ఈడ సుఖంగా ఉంటావని ఆశపడ్డాడు సత్యమన్న. కానీ, నువ్వు రాకపోయేప్పటికి కృంగిపోయాడు పాపం. తన బాధ పైకి తెలీనివ్వలేదు.

“నా చిట్టితల్లి తప్పక తిరిగి వస్తది. తిరిగొచ్చాక మాత్రం, దాని బాధలు పోగొట్టి, దాని ఆశలు తీర్చాలి.

మీరంతా కూడా దాన్ని ఎప్పటిలా ప్రేమగా చూసుకోవాలి,” అని మాకు మంచి చెప్పాడు కూడా. నిన్నొక్క మాట అననివ్వడుగా నీ తాత,” అంటూ కంటతడి పెట్టింది పిన్ని.

**

(ఇంకా ఉంది)

 

మీ మాటలు

*