అమెరికా తెలుగు కథ ఎటు పోతోంది?

(ఈ వారం హ్యూస్టన్ లో అమెరికా తెలుగు కథ యాభయ్యేళ్ళ వార్షికోత్సవం సందర్భంగా)

 

నాస్టాల్జియా, నాస్టాల్జియా, ఇంకాస్త నాస్టాల్జియా: వేలూరి

10735719_10152397663077060_729409723_nఅమెరికా తెలుగు కథ అంటే, అమెరికాలో నివసిస్తున్న చాలా మంది తెలుగు వాళ్ళు రాస్తున్న కథలు అని అర్థం చేసుకుంటే, అమెరికా తెలుగు కథ, అటు తూరుపు దిక్కుకేసి, అంటే, అట్లాంటిక్ సముద్రం ఆంజనేయుడిలా లంఘించి, హుటా హుటీన ఆంధ్ర దేశం కేసి పోతూఉన్నది;   అక్కడ అచ్చయితే చాలన్న దుగ్ధతో!

అదేవిధంగా, ఆంధ్ర దేశంలోనే ఉంటూ, అమెరికాలో తెలుగువాళ్ళ జీవనం గురించి కథలు రాస్తున్న చాలా మంది కథకుల కథలు బొంబాయిలో బోయింగు ఎక్కి  సరాసరి అమెరికా లో ఇ-పత్రికలకి చేరుతున్నాయి. కాదు కాదు. పొరపాటు. ఈ మెయిల్‌ ఎక్కి ఈ పత్రికల్లోకి చొరబడుతున్నాయి; ఇక్కడి వాళ్ళని ఉద్ధరిద్దామన్న మోజుతో!

అయితే, అమెరికాలో  చాలాకాలంనుంచీ “ స్థిరపడ్డ” అమెరికా తెలుగు వాళ్ళు – అంటే ఇక్కడే బడికెళ్ళి, ఉద్యోగంకోసం నానాయాతనాపడి నలభై గంటల పని జీవితంతో అలవాటు పడినవాళ్ళల్లో కథలు రాసే వాళ్ళు—కొద్దిమందీ– తమతమ నిజానుభవాలు,  అక్షరరూపంలో పెట్టటం మానుకున్నట్టుగా కనిపిస్తూన్నది. బహుశా అందుకు కారణం:   వాటి ప్రచురణకి ఆంధ్రాలో అవకాశం సున్న; అమెరికాలో  అరసున్న.

ఎందుకంటే, అక్కడ ప్రచురించబడాలంటే — వేడి వేడి సాంఘిక “సమస్య” వెతికి పట్టుకోవాలి. సదరు సమస్యని, ‘అపార్థం,’  లేకండా సాధించాలి; కనీసం సందేశం అన్నా ఇవ్వాలి. సమాకాలీన కథకుడిగా  ఒక ప్రత్యేకమయిన రంగుని ప్రోత్సహించాలి.  కథలకి అంతకన్నా విశిష్టమయిన  రంగు లేబిల్‌ తగిలించాలి. అమెరికాని, అమెరికా జీవనాన్ని, వీలుదొరికినచోటల్లా  అమెరికా “సామ్రాజ్యవాదాన్నీ” చెడా మడా ఖండిస్తూ రాయాలి. అది చేతకాకపోతే, కనీసం హేళన అయినా  చెయ్యాలి. ఇక్కడి జీవనాన్ని నికృష్టంగా చిత్రించగలగాలి. వాస్తవం చెప్పడానికి వెనుకాడని నిజాయితీ ఉన్న కథకులు,  అటువంటి దుస్థితికి దిగజారలేరు అని నా ఉద్దేశం.

పోతే, అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు – వీరిలో చాలమంది ఇంకా అమెరికా లో “సందర్శకులు” గానే ప్రవర్తిస్తారు. ఇక్కడి, కట్టు, ఇక్కడి బట్ట, ఇక్కడి ఆట, ఇక్కడి పాటా – వీటిగురించి ఏమీతెలియదు. తెలుసుకోవాలనే కుతూహలంకూడా లేదనిపిస్తుంది. ఇంకా ఒక కాలు, మూడువంతులు మనసూ, ఆంధ్రాలోనే! చూడటానికి, ఇక్కడ డబ్బుకోసమే గాని, ఇక్కడి వాతావరణంలో ఇముడుదామని వచ్చినట్టు కనపడరు. వీళ్ళు రాసే కథలు, తెలుగు సినిమా కోసం రాస్తున్న కథల్లా వుంటాయి. కొన్ని కథలు, తెలుగు సినిమాలు చూసి రాస్తున్నారా అన్నట్టు ఉంటాయి.

ముంగండలో కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, రెండు గేదెల పాడి, ఒక లేగదూడ, ఎంతో ప్రశాంతమయిన వాతావరణం, పైరగాలి, కాలవగట్టు, పడవల పాటలు – ఏదో పోగొట్టుకున్న బెంగ — నాస్టాల్జియా, నాస్టాల్జియా, ఇంకాస్త నాస్టాల్జియా! ఇవీ, ఇతివృత్తాలు. ఇటువంటి కథలు తెలుగునాట వాస్తవజీవితం  చిత్రించే  తెలుగు కథలు కావు. అమెరికా ఎడ్రెస్‌తో  అమెరికావాడు ఊహించి రాసినంతమాత్రాన , అమెరికా తెలుగు కథలు అసలే కాదు. నిజంచెపితే నిష్టూరం!

అయితే, అడపా తడపా, చెయ్యితిరిగిన కొద్దిమంది కథకులనుంచి చక్కని డయాస్పోరా కథలు, సహారాలో వానచినుకుల్లా అప్పుడప్పుడు అకస్మాత్తుగా వస్తున్నాయి. కానీ అవి నాస్టాల్జియా# noise# లో వినపడటల్లేదు; కనపడటల్లేదు. అదృశ్యమయిపోతున్నాయి.

ఎప్పుడో, ఎక్కడనుంచో, అమెరికా తెలుగు కథకి కూడా ఒక #Edward O’ Brien# లేదా ఒక # Martha Foley#   తప్పకండా  వస్తారని ఆశిద్దాం.

 

అమెరికా  జీవితాన్ని కథలలో ఇమిడ్చి రాయలేదేమో: వేమూరి

imagesXLM15PV1అమెరికా కథ ఎటు పోతోంది? ఈ ప్రశ్నకి నిర్దిష్టంగా “కథ ఈ దిశలో పోతోంది” అని సమాధానం చెప్పడం కష్టం. ఒకటి మాత్రం నిజం. ఏభై ఏళ్ల క్రితం తెలుగులో రాయగలిగేవారే కనిపించేవారు కాదు. రాసేవాళ్లు ఉన్నా వాటిని ప్రచురించడానికి ఇండియాలో తప్ప ఇక్కడ మాధ్యమాలు ఉండేవి కాదు. ఇండియా పంపడంలో ఉన్న ఇబ్బందులు నేను ఇక్కడ వల్లెవేయనక్కర లేదు.

ఇప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు వారిలో కథలు రాసేవాల్లు – మంచి కథలు రాసేవాళ్లు – చాలమంది కనిపిస్తున్నారు. అమెరికా కథలని ప్రచురించి ప్రోత్సహించిన వారిలో ప్రథములు వంగూరి సంస్థ, వారి కథా సంకలనాలు, తరువాత కిడాంబి రఘునాథ్ స్థాపించిన తెలుగు జ్యోతి అని చెప్పుకోవాలి. తరువాత కంప్యూటర్లు, అంతర్జాలం వాడుకలోకి వచ్చి కథలు ప్రచురించడానికి కొత్త వెసులుబాట్లు కల్పించేయి.  దీనితో ఇక్కడనుండి కథలు రాసేవారి సంఖ్య పెరిగింది.

అమెరికాలో ప్రస్తుతం కథలు రాస్తూన్నవాళ్లల్లో ఉన్నత స్థాయిలో రాస్తూన్నవాళ్లు కనీసం 5-10 మంది ఉంటారని నా  అంచనా. వీరు రాసే కథలలో అమెరికా జీవితం వల్ల ప్రభావితమైన కథలు కొన్ని ఉన్నాయి. కాని అమెరికా వారికి మనకి మధ్య జరిగే సంకర్షణలని ఎత్తి చూపే కథలు తక్కువనిపిస్తుంది. కిప్లింగ్ బ్రిటిష్ వాడైనా ఆయన రాసిన కథలలో ఆయన కళ్లకి భారతదేశం, భారతీయ సంస్కృతి ఎలా కనిపించేయో అవి రాసేరు. ఇంతమంది అమెరికా వచ్చేము కాని కిప్లింగ్ ఇండియా కథలులా మనం అమెరికా వాతావరణాన్ని, జీవితాన్ని కథలలో ఇమిడ్చి రాయలేదేమో అని అనిపిస్తుంది. ప్రయత్నాలు జరగడం జరిగేయి కాని అవి పతాక స్థాయిని చేరుకోలేదు.

“ఈ వ్యక్తి అమెరికా వేళ్లి అక్కడ నివసింఛి ఉండకపోతే ఈ కథ రాయగలిగి ఉండేవాడు కాదు” అనిపించుకోదగ్గ కథలు ఉన్నాయా? ఏమో. ఉన్నాయేమో. పాఠకులే నిర్ణయించి చెప్పాలి.

 

చాలా దూరం వచ్చాం: కిరణ్ ప్రభ

kiran prabhaఅమెరికా తెలుగు కథ ఎటుపోతోంది? గత రెండు దశాబ్దాలుగా ‘అమెరికా తెలుగు కథ ‘ అనే ప్రత్యేక విభాగాన్ని సృష్టించ గలిగిన అమెరిక తెలుగు రచయితల్ని అభినందించి తీరాలి.అమెరికా తెలుగు రచయితలు కేవలం ఇంటర్నెట్ పత్రికలు, బ్లాగుల్లోనే కాక ఆంధ్రదేశంలోని ప్రింట్ పత్రికల్లోనూ, అక్కడ ప్రచురితమౌతున్న కథా సంకలనాల్లోనూ ప్రముఖంగా కనిపించడం అమెరికా తెలుగు రచయితల సత్తాని తెలియచేస్తుంది. ‘మీరు అమెరికాలో ఉంటూ కూడా ఇంకా ఇక్కడి పరిస్థితుల గురించి ఎందుకు వ్రాస్తారూ, అమెరికా గురించి వ్రాయండీ.. ‘ అనే వ్యాఖ్యలు ఆంధ్రదేశం నుంచి అప్పుడప్పుడూ వినవస్తుంటాయి

కానీ అమెరికా తెలుగు కథా రచయితలు మాతృదేశం గురించి వ్రాయడంలో ఖచ్చితంగా ఔచిత్యం ఉందని అనుకుంటాను. అమెరిక తెలుగు రచయితలూ ఒకప్పుడు తెలుగు నేలమీద నివసించిన వారేకాబట్టి వారి కథల్లో ఇంకా కుటుంబ సంబంధాలు, సొంతవూరి మట్టి వాసనలు కనిపించడంలో తప్పూలేదు, ఆశ్చర్యమూ లేదు. అమెరికాలోని ప్రవాస భారతీయుల సమస్యలు, పెరుగుతున్న పిల్లల సమస్యలు, సాంస్కృతిక వ్యత్యాసాలు, అమెరికన్లతో స్నేహాలు, వారి జీవన శైలులకీ, ప్రవాస భారతీయుల జీవన శైలులకీ గల వ్యత్యాసాలూ కూడా అమెరికన్ తెలుగు కథల్లో బాగానే ప్రతిబింబిస్తున్నాయి.

ప్రపంచాన్ని మౌస్ క్లిక్ దూరంలోకి మార్చిన అంతర్జాలం వల్ల అమెరికన్ తెలుగు రచయితలూ, ఆంధ్రదేశంలోని తెలుగు రచయితలతో భావాలు పంచుకోవడం, కలిసి పనిచేయడం లాంటి సుహృద్భావ వాతావరణం పెంపొందడం కూడా హర్షణీయమైన పరిణామం. ఫేస్ బుక్ లోని కథలకి సంబంధించిన గ్రూపులు ఇందుకు చక్కటి ఉదాహరణ. వ్రాసేవి ఎప్పటికప్పుడు ప్రచురించుకునే సౌకర్యం ఉన్న బ్లాగుల వల్ల కూడా ఔత్సాహిక రచయితల సంఖ్య పెరుగుతోంది. వారికి సలహాలిచ్చేందుకు అనుభవజ్నులు ముందు కి రావడం కూడా మెచ్చుకోదగ్గ విషయం. వాదాలూ, వివాదాలూ, కాపీలూ, ఏది మంచి ఏది చెడు అనే చర్చలూ.. ఇలాంటివి ఎప్పుడూ ఉండేవే. ‘మంచి ‘ కోణంలో చూస్తే అమెరిక్ తెలుగు కథ చాలా దూరం ప్రయాణించింది, ఇంకా ప్రయాణించగలిగే జవసత్త్వాలని పోగుచేసుకుంటోంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ముప్ఫై ఐదేళ్లుగా  చూస్తున్న కథ: సత్యం మందపాటి

satyam mandapati ‘ముప్ఫై ఐదేళ్లుగా నేను చూస్తున్న అమెరికా తెలుగు కథ’ అని మకుటం పెట్టానుగానీ, అంతకు ముందు కూడా, అంటే మేం అమెరికాలో నివాసం ఏర్పరుచుకోక ముందు, అప్పటికే నేను ఎన్నో పత్రికలలో కథలు వ్రాస్తున్నందు వల్ల, అన్ని తెలుగు పత్రికల్లోనూ కథలు విడిచిపెట్టకుండా చదువుతూనే వుండేవాడిని. అమెరికా డయోస్పోరా తెలుగు సాహిత్యం ఏ పత్రికలోనూ చదివినట్టు గుర్తు లేదు. ఇక్కడా, అక్కడా ఒకటి రెండు కథలు వచ్చినా అవి అమెరికాలోని తెలుగువారి జీవిత సరళిని సరిగ్గా చూపించే కథలు కావు. బారిష్టర్ పార్వతీశం లాటి పుస్తకాలు వచ్చినా, అవి కేవలం హాస్యం కోసం తెలుగు రచయితలు తెలుగు దేశంలోనే వుంది వ్రాసిన కాల్పనిక కథలు. ఇంగ్లాండ్, అమెరికాలాటి దేశాల జీవిత అనుభవాలను చూపించినవి కాదు.

నేను అమెరికాకి వచ్చిన తర్వాత, కొంచెం పెద్ద నగరాల్లో చిన్న చిన్న వ్రాత పత్రికలూ, జెరాక్స్ కాపీ పత్రికలూ కనపడ్డాయి. కానీ అవి కూడా ఎక్కువగా సరదాగా వ్రాసే కథలు, కవితలు లేదా పండగలకి వేసుకునే చిన్న నాటికలే కానీ, అమెరికాలో తెలుగు వారి జీవితాల మీద, సమస్యల మీద వ్రాసిన కథలు ఎక్కువగా కనపడలేదు. 1980ల చివరలోనూ, 1990ల మొదట్లోనూ అలాటి కథలు వివిధ పత్రికలలో కనపడటం ప్రారంభించాయి. అప్పుడే నా అమెరికా బేతాళుడి కథలు రచన మాస పత్రికలో సీరియల్ లాగా వచ్చి, పుస్తకరూపం దాల్చింది. ఇదే అమెరికా డయాస్పోరా తెలుగు సాహిత్యం మీద, ఒకే ఒక రచయిత వ్రాసిన మొట్టమొదటి పుస్తకం అని నేను అనుకుంటున్నాను. వంగూరి ఫౌండేషన్ వారి అమెరికా తెలుగు కథానికల సంకలనాలు కూడా అప్పుడే మొదలయాయి. తర్వాత ఎన్నో కథలు, పుస్తకాలు రావటం ప్రారంభించాయి.

ఇక వస్తుపరంగా చూస్తే, నిజంగా సంతోషం వేస్తుంది. ఎంతోమంది అమెరికాలో నివసిస్తున్న తెలుగు రచయతలు ఉత్సాహంగా ముందుకి వచ్చి, అమెరికాలో తెలుగువారి జీవితాలను స్పష్టంగా చూపే చాల కథలు, నవలలు వ్రాస్తున్నారు. ఇండియానించి కొత్తగా వచ్చేవారి అనుభవాలు, ఇండియా వెళ్లి వారం రోజుల్లో పెళ్లి చేసుకున్న వారి కష్టాలూ, సుఖాలూ, సంభాషణా చాతుర్య సమస్యలూ, ఉద్యోగాలు రావటం, పోవటం, పిల్లల పెంపకం, చదువులు, రెండో తరం పిల్లల జీవితాలు, అమెరికాలో పెళ్ళిళ్ళు, ఇలా.. ఎన్నో విషయాల మీద కథలు వ్రాస్తున్నారు. తెలుగు డయోస్పోరా సాహిత్యానికి ఒక నిజమైన అర్ధాన్ని చూపించే కథలు రావటం ముదావహం. ఎన్నో వెబ్ పత్రికలూ, ఏటేటా జరిగే సాంస్కృతిక తిరునాళ్ళ సూవనీర్లు, వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది కథల పోటీలు, వారి ప్రచురణలు వీటిని బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఇండియాలో వివిధ పత్రికలు కూడా ఎన్నారై కథలు ఎక్కువగా ప్రచురిస్తూ, భారతదేశంలో మన సాహిత్యాన్ని చదివించటం నిజంగా మనం గర్వించదగ్గ గొప్ప విషయం.

ఆనందం, ఆందోళన రెండూ వున్నాయి :నారాయణస్వామి

nasyఅమెరికా తెలుగు కథ ఎటుపోతోంది అని ప్రశ్నించుకుంటే కొన్ని మెచ్చుకోవలసిన పోకడలతో బాటు కొన్ని ఆందోళన కలిగించే పోకడలు కూడా కనిపిస్తున్నాయి నాకైతే.

అమెరికా నించి నడుస్తున్న జాల పత్రికలు అరడజను పైనే ఉన్నాయి. రకరకాల మంచి సాహిత్యానికీ, చర్చలకీ ఇవి నెలవులుగా ఉంటున్నాయి. ఇది సంతోషించవలసిన విషయం. కానీ ఏ ఒక్కటీ కూడా అమెరికా తెలుగు కథకీ, అమెరికా తెలుగు రచనలకీ పెద్ద పీట వేసిన ధోరణి నాకైతే కనబళ్ళేదు. మొత్తంగా దానికే అంకితం కానక్కర్లేదు గానీ కనీసం ఒక సంచిక దీనికి కేటాయించవచ్చు. మన సాహిత్యాన్ని మనమే, మన పత్రికలే పట్టించుకోకపోతే భారత్ నుండి వెలువడే పత్రికలు పట్టించుకుంటాయి అనుకోవడం భ్రమ.

కథా రచయితల్లో ఎన్నో కొత్త పేర్లు కనిపిస్తున్నాయి. కొందరు రచయితలు చాలాకాలంగా అమెరికాలో ఉంటూ ఉన్నా ఈ మధ్యనే రచనా వ్యాసంగం మొదలు పెట్టిన వారు కాగా, కొందరు యువతీ యువకులు, ఈ మధ్యనే అమెరికాకి వలస వచ్చినవారు ఉత్సాహంగా రచనలు చేస్తున్నారు. ఇది కూడా సంతోషించ వలసిన పరిణామం.తెలుగు వారు ఇక్కడికి వలస వచ్చి, తాము ఎక్కడ సెటిలయితే అక్కడ ఒక మినీ తెలుగు వాతావరణాన్ని (తెలుగు రెస్టారెంట్లు, సినిమాలు, ఇతర వినోదాలు) ఏర్పాటు చేసుకుంటున్నట్టే, ఈ కొత్త రచయితలు ఎక్కువగా భారత్ జీవిత ఇతివృత్తాలనే ఎక్కువగా రాస్తున్నారు. ఇది ఆలోచించవలసిన విషయం. క్రమం తప్పకుండ రాస్తూ ఉన్న కొద్ది మంది సీనియర్ రచయితలు మాత్రం అమెరికా జీవితంలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు.

పదిహేను ఇరవయ్యేళ్ళ కిందట విరివిగా రాస్తుండిన రచయితల పేర్లు ఈ మధ్యన ఎక్కడా కనబడ్డం లేదు. సోమ సుధేష్ణ, రాధిక నోరి, మాచిరాజు సావిత్రి మొదలైన వారు తొలితరం ఎదుర్కున్న సందిగ్ధ పరిస్థితులను గురించీ, పడిన సంఘర్షణల గురించీ ఆలోచింపచేసే కథలు రాశారు. వీరెవరూ ఇప్పుడు రాస్తున్న దాఖలాలు లేవు. రెండవ, మూడవ తరాలను చూసిన అనుభవాలతో వీరి దృక్పథాలు పండుతున్న స్థాయిలో మరి ఏ కారణంగా రాయటంలేదో తెలియదు. పత్రికలు, ప్రచురణ సంస్థలు వీరిని ప్రోత్సహించి వీరితో మళ్ళీ కొత్త కథలు రాయించాలి. లేకపోతే, పండిన వారి అనుభవాలను, ఒక తరం కథలను మనం పూర్తిగా కోల్పోతాం.

ప్రతీ కథా డయాస్పోరా కాదు:సాయి బ్రహ్మానందం గొర్తి

678_10151452027784197_1581019673_nఅమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ వచ్చిన ఈ ఏభయ్యేళ్ళలో ప్రస్తుతం ఇంతవరకూ సుమారు 200 పైచిలుకు కథలొచ్చాయి. అందులో సింహభాగం 1995 తరువాత వచ్చినవే! మొదట్లో సావనీర్లకే పరిమితమయినా అమెరికా కథ తెలుగు సాహిత్యపు ఏరులో డయాస్పోరా పాయగా నిలదొక్కుకుంది. ఇంటర్నెట్ వచ్చి అచ్చు రేఖల్ని చెరిపేయడంతో తెలుగు కథ కొత్త సరిహద్దులు నిర్వచించుకుంది. కొత్త కథకుల్ని సృష్టించుకుంది. కాకపోతే డయాస్పోరా కథ చెప్పుకో తగ్గ రీతిలో ఎదగలేదు. చాలామంది అమెరికా కథకులకి ఏది డయాస్పోరా కథ, ఏది కాదు అన్న దాంట్లో ఇంకా సందేహాలున్నాయి. దీనిక్కారణం అమెరికా తెలుగు కథమీద సమీక్షలూ, విమర్శలూ తగినంతా లేవు.

అమెరికా నుండి రాసిన ప్రతీ కథా డయాస్పోరా కథే అన్నట్లు చెలామణీ అవుతోంది. డయాస్పోరా కథల్ని సమీక్షించడానికి సరైన నేపథ్యమూ, అర్హతా ఉన్నది ఇక్కడి కథకులకే! ఈ దిశగా అమెరికా తెలుగు కథకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఇక్కడి కథల్ని లోతైన అధ్యయం చెయ్యాలి కూడా. అలాగే ఇక్కడి కథకులు కూడా ఇక్కడి జీవితన్నీ లోతుగా పరిశీలించి కథలు రాయాలి. మిగతా డయాస్పోరా కమ్యూనిటీలతో, అంటే చైనీస్, వియత్నమీస్, స్పానిష్ వాళ్ళతో, చూస్తే ఇండియన్ డయాస్పోరా అంతగా అభివృద్ధి చెందలేదు. భారత దేశపు దక్షిణాది భాషలు తీసుకుంటే ఉన్నంతలో తెలుగులోనే అమెరికా నేపథ్యంలో ఎక్కువ కథలొచ్చాయి. అవన్నీ నూటికి నూరు శాతం డయాస్పోరా కథలు కాకపోవచ్చు. అయినా ఇక్కడి జీవితానికీ, సమస్యలకీ, సంఘర్షణకీ ఒక కథారూపం ఇవ్వడం ముదావహం.

అమెరికా కథా సాహిత్యం కేవలం సావనీర్లకే పరిమితం కాకుండా తనకంటూ ఒక వేదిక నిర్మించుకోవాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. వంగూరి ఫౌండేషన్ వారు ఏభయ్యేళ్ళ అమెరికా తెలుగు కథ మీద సదస్సు నిర్వహించడం తొలి అడుగు. వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది. అమెరికా తెలుగు కథకి ప్రస్తుత కథకులు సరికొత్త వన్నెలు తీసుకొస్తారన్న నమ్మకాన్ని నిజం చేస్తారని ఆశిద్దాం.

 

 

మీ మాటలు

 1. 1 – “అమెరికా ఎడ్రెస్‌తో అమెరికావాడు ఊహించి రాసినంతమాత్రాన , అమెరికా తెలుగు కథలు అసలే కాదు.” వేలూరు
  2 – “కాని కిప్లింగ్ ఇండియా కథలులా మనం అమెరికా వాతావరణాన్ని, జీవితాన్ని కథలలో ఇమిడ్చి రాయలేదేమో అని అనిపిస్తుంది.” వేమూరి
  ౩ – “అమెరికాలోని ప్రవాస భారతీయుల సమస్యలు, పెరుగుతున్న పిల్లల సమస్యలు, సాంస్కృతిక వ్యత్యాసాలు, అమెరికన్లతో స్నేహాలు, వారి జీవన శైలులకీ, ప్రవాస భారతీయుల జీవన శైలులకీ గల వ్యత్యాసాలూ కూడా అమెరికన్ తెలుగు కథల్లో బాగానే ప్రతిబింబిస్తున్నాయి.” కిరణ్ ప్రభ
  4 – “ఎన్నో వెబ్ పత్రికలూ, ఏటేటా జరిగే సాంస్కృతిక తిరునాళ్ళ సూవనీర్లు, వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది కథల పోటీలు, వారి ప్రచురణలు వీటిని బాగా ప్రోత్సహిస్తున్నాయి” సత్యం మందపాటి
  5 – “మన సాహిత్యాన్ని మనమే, మన పత్రికలే పట్టించుకోకపోతే భారత్ నుండి వెలువడే పత్రికలు పట్టించుకుంటాయి అనుకోవడం భ్రమ.” నారాయణ స్వామి
  6 – “అమెరికా కథా సాహిత్యం కేవలం సావనీర్లకే పరిమితం కాకుండా తనకంటూ ఒక వేదిక నిర్మించుకోవాల్సిన తరుణం ఆసన్నమయ్యింది” సాయి బ్రహ్మానందం గొర్తి

  అమెరికా తెలుగు కథ ఎటు పోతోంది?
  అమెరిక కథ – అమెరికన్‌లు అనుకునేటట్తు – it has arrived అని నా ఉద్దేశం. ఖచ్చితంగా అమెరికా తెలుగు కథ విభజనకు పూర్వం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని వదిలి ప్రయాణిస్తోంది. అది బొంబాయిలో బోయింగు ఎక్కడం లేదు. మద్రాసులోను ఎక్కడం లేదు. షంషాబాద్ వచ్చేసింది. రేపో ఎల్లుండో విశాఖో, విజయవాడోలోనే ఎక్కేస్తుంది.

  అమెరికా తెలుగు కథ టూ సెంట్స్ తెలుగు కథ అయిపోతున్నది. అది ఇంకా పదహారణాల తెలుగు కథ కాదు. చీరలు, జాకెట్లు లేవు. పంచెలు, ఉత్తరీయాలు లేవు. అస్థిత్వాలున్నవి. వాటికి నేపధ్యాలున్నవి. ఆ కథలు కూడ త్వరలో చదువుకోవచ్చు.

  నొస్టాల్జియా దాటి తెలుగు కథ అమెరికా ఒడ్డుకి చేరుకుంది. ఇక పరుగెత్తడమే మిగిలిందనుకుంటున్నాను.

  • Kosuri Uma Bharathi says:

   అనిల్ గారు, మీ విశ్లేషణ బాగుంది…
   రాసిన వారి వ్యాసాలతో సహా …

  • Satyam Mandapati says:

   అనిల్: మీ విశ్లేషణ బాగుంది. చాల బాగా చెప్పారు.
   మన తెలుగువాళ్ళల్లో కొంతమంది మన అమెరికా తెలుగు కథలని ప్రోత్సహించటానికి బదులు, రాళ్ళు రువ్వటం ఎక్కువయింది. అలాటి వాళ్ళకి మిత్రులు చిట్టెన్ రాజుగారు “స్వయం ప్రకటిత సాహితీ పెత్తందార్లు” (ఎస్పీఎస్పీలు) అని ఎంతో చక్కటి పేరు కూడా పెట్టారు. పైన నారాయణ స్వామిగారు చెప్పినట్టు, “మన సాహిత్యాన్ని మనమే, మన పత్రికలే పట్టించుకోకపోతే భారత్ నుండి వెలువడే పత్రికలు పట్టించుకుంటాయి అనుకోవడం భ్రమ” ఆయన వ్రాసిన దానికి నేను మన సంవత్సరీకాలు చేసుకునే తిరునాళ్ళ సంఘాలను కూడా కలుపుతాను. వాళ్ళు ఇండియాలోని రాజకీయ నాయకులని ఇక్కడికి పిలిచి గౌరవించే దానిలో, కనీసం పదో వంతు, అమెరికా రచయితలని, రచనలని ప్రోత్సహిస్తే బాగుంటుంది.. ఏది ఏమైనా, నేను వ్రాసినట్టు అమెరికా తెలుగు కథ, ఇక్కడ అమెరికాలోనూ, అక్కడ భారతదేశంలోనూ ఉత్తమ స్థాయి కథలతో ఎంతో ముందుకి పోయింది. దానికి అమెరికా తెలుగు రచయితలను, రచయిత్రులను మనసారా అభినందిస్తున్నాను. దీనికి ఎస్పీఎస్పీల, తి.సంఘాల సహకారం ఏమాత్రం లేదు సుమా!

   • Kosuri Uma says:

    It is sad.. Satyam garu… There were hardly any people for Book releases in TANA …. but you have movie songs there….and there they are and leave immediately after some exciting fast paced everyday songs… at least the organizers should make the book releases the center of at least Sahitya segments that happen in seminar rooms…… after people leave we have the books release.. there is not even a record of it… for the authors to keep.. even the VDO guys wrap up and leave….
    these days movies and songs have come to even the seminar halls and Sahitya Vedikalu – after taking up the prime stages and prime times….
    Its a shame that such things just keep going and going and going….
    it takes one’s lifetime to change anything at all or more ….

 2. Veluri Venkateswara Rao says:

  “ అమెరికా ఎడ్రెస్ తో అమెరికావాడు ఊహించి రాసినంతమాత్రాన , అమెరికా తెలుగు కథలు అసలే కాదు. “ –వేలూరి
  అని అనిల్ గారు కోట్ చేసారు.
  ఇక్కడ అమెరికావాడు అంటే, అమెరికాలో నివసిస్తున్న తెలుగు వాడు అని నా భావం. నేను మొదట్లోనే రెండురకాల అమెరికా తెలుగు వాళ్ళ ప్రస్థావన చేసాను కాబట్టి తిరిగి, “ అమెరికాలో నివసిస్తున్న తెలుగు వాడు” అని వివరించనక్కర లేదనుకున్నాను.
  అర్థం స్పష్టంగా ఉండే వాక్యం రాయలేకపోవటం నాపొరపాటు. — వేవేరా

  • వేలూరి వారికి క్షమాపణలతో – ఒక్క మాట.
   మీ ఉద్దేశం పూర్తిగా నాకు అర్థం అయ్యిందండి. మీ అభిప్రాయాలన్ని చదివిన తరువాతే పాఠకులు ఈ వ్యాఖ్యలు చదువుతారన్న ఉద్దేశం తో నేను మీ అభిప్రాయం లో ఆ ఒక్క వాక్యమే ఉటంకించాను. నా వాఖ్యలో భావం కూడా అదే..
   అమెరికాలో నివసిస్తున్న తెలుగువాడు అనే!

   మీరన్నట్టే ” అమెరికా తెలుగు కథకి కూడా ఒక #Edward O’ Brien# లేదా ఒక # Martha Foley# తప్పకండా వస్తారని ఆశిద్దాం. “.
   తప్పకుండా వస్తారండి! కాస్త వెనకా ముందు అయినా వస్తారు. రావాలనే నా కోరిక కూడా!

 3. Sivakumara Sarma says:

  అమెరికాలోని తెలుగు రచయితలు ఎదుర్కొనే మొదటి ఇబ్బంది – పరిమితమయిన పాఠకుల సంఖ్య. “తెలుగు నాడి” అచ్చు పత్రిక చందాదారుల సంఖ్యనిబట్టీ అమెరికాలో వుండే తెలుగు వాళ్ల సంఖ్యని లెక్కెయ్యడం సాధ్యం కాదు – వాళ్ళల్లో ఏదో ఒక 1-2% మాత్రం పాఠకులు ఉంటారు అనుకుంటే తప్పితే. భారత దేశంలోని అచ్చు పత్రికల వెంట వెంపర్లాడ్డానికి ఇది మొదటి కారణం. ఎందుకంటే, ఈనాడుకూడా, ఇంటర్నెట్ వల్ల చాలా తెలుగు పత్రికలు అందుబాటులోవున్నా కూడా చదవని వాళ్ల సంఖ్యకంటే తెలుగునాట ఏదో ఒక అచ్చు పత్రికకి వున్నపాఠకులు ఎక్కువే ననేది స్వాభిప్రాయం.
  ఇక, రెండవది – అమెరికాలోని జీవన విధానాన్ని గూర్చి రాయచ్చుగా అనేది – ఇది కిప్లింగ్ గానీ బారిష్టర్ బార్వతీశంగానీ ఎదుర్కోనని సమస్య – అమెరికా గూర్చి తెలుగువాళ్ళకి విశ్వనాథ్ గారూ, జంధ్యాల గారూ కలిసి, “పాశ్చాత్య ప్రభంజనానికి రెపరెపలాడుతున్న భారతీయ సంస్కృతి” అన్న శంకరశాస్త్రి నోటినుండీ తెలిపించిన వాక్యం ఇప్పటికి దాదాపు నలభయ్యేళ్ల వయసుని నిలుపుకుంది. బికినీలు వేసుకునే, విశృంఖలమయిన సెక్స్ సంఘంలో ప్రబలిపోయిందనిపించేలా చూపించే హాలీవుడ్ సినిమాలూ, వాటిని చూసి అమెరికాలో విలువలేమీ మిగల్లేదని గుండెలు బాదుకుంటూ కనిపించిన ప్రతీ పత్రికకీ ఉత్తరాలు రాసి పారేసే సంఘ కాపరులూ, వాలెంటైన్స్ డే నాడుకుర్ర వనితలని మాత్రం పబ్బులనుండి పట్టుకుని బయటకీడ్చుకొచ్చే కొన్ని మత / రాజకీయ శక్తులూ – వీటన్నిటి మధ్యలో అమెరికాలోని తెలుగువాళ్ల జీవన విధానంగూర్చి ఇండియాలోని తెలుగువాళ్ళకి ఎంత ఆసక్తి వుంటుందంటారు? ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఆ రాశ్ట్రాల్లోంచి ప్రతీ ఇంటినుంచీ ఒకళ్ళు అమెరికాలో వుండనే వున్నారాయే! ఇలాగ, కథ తెలిసిపోయిన తరువాత సినిమా చూడమంటే ఎలా చూస్తారు?
  మూడవది – ఇండియా గడప దాటకుండానే అమెరికా జీవన విదానంమీద రాసేసిన రచయిత(త్రు)లు తెలుగువాళ్ళకి ప్రత్యేకం. ఒకాయన, అమెరికా ట్రిప్పునించీ ఇంటికి చేరిన తరువాత, అమెరికాలోని తెలుగువాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో గుండెలు బాదుకుంటూ రాసేసారు – ఓ పదేళ్ల క్రితం. (దీనికి ఆయన లెవెల్ కి దిగి జవాబివ్వనూ వచ్చు, నవ్వేసి వదిలెయ్యనూ వచ్చు. తెలుగు రచయితలు ఆ రెండవపనే చేశారు.) “డాలర్ల కోసం పరుగులు తీసే” లాంటి వాక్యాలని ఇలాంటి రచయితల రచనల్లో చూడవచ్చు. వాళ్ల రచనలని ఇష్టపడే పాఠకులూ తెలుగునాట వున్నారు. పైగా, వాళ్లు తప్పు రాశారని తరువాత చెప్పబోయినా, ‘అచ్చులో తప్పెందుకు రాస్తారు?’ అని ప్రశ్నించకుండా నమ్మే జీవనానికి అలవాటుపడిపోయాం.
  నాలుగవది – నాస్టాల్జియా గూర్చి – ముంగండలో కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, రెండు గేదెల పాడి, ఒక లేగదూడ … కథలు తెలుగునాట వాస్తవజీవితం చిత్రించే తెలుగు కథలు కావు” అన్న వేలూరి వారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను. కనీసం అంతర్జాల పత్రికల్లో సంపాదకులు ఈ విషయాలని తమవద్దకు ప్రచురణకి వచ్చిన కథల రచయితలతో చర్చించవచ్చు. అయితే, సంపాదకుల బాధలు అర్థంచేసుకోవడమూ తేలికే. నా మిత్రుడన్నాడు – పత్రికలు అన్నీ గొప్ప కథలని మాత్రమే ప్రచురించాలి అన్న నిబంధన పెట్టుకుంటే అవి చాలా త్వరలోనే మూసెయ్యాల్సొస్తుంది అని.
  అయిదవది, పైన అభిప్రాయాల్లో పేర్కొననిది – “కథాంశాలు” – తెలుగునాట ప్రచురితమయ్యే పత్రికల్లో, శృంగారం నిషేధం – ఒక్క పత్రికలో తప్పితే. అంతర్జాల పత్రికల్లోనూ అలాగే కన్పిస్తోంది. అది బ్లాంకెట్ నిబంధనో, లేక కథనిబట్టీ ఆ సంపాదకులు తీసుకునే నిర్ణయమో వివరిస్తే బాగుంటుంది.

  • S. Narayanaswamy says:

   శివకుమార్ గారు నిజంగా ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందులు చెప్పారు. రాసే కథ పది మంది చదివి బాగుందని (బాలేదన్నా సరే – ఏదో ఒకటి) అనాలని రాస్తాము కానీ పెట్టెలో పెట్టుకోడానికి కాదు కదా!

 4. Krishna Rao Maddipati says:

  అమెరికాలో తెలుగు వారి సగటు జీవితం చూసే్త ఇక్కడి వారు వా్రసే కథలెందుకిలా ఉంటాయో తెలుసు్తందనుకుంటాను.

  పని రోజు: కూలికెళి్ళ రావడం, పిల్లల సూ్కలు పనులో వేరే పనులో చూడడం, తిండి తింటూ తెలుగు సినిమా చూడడం, తెలుగు సే్నహితులతో ఫోనులో కబురు్ల చెప్పుకోవడం, నిద్రకుపక్రమించడం.
  శుక్రవారం, శనివారం సాయంతా్రలు: తెలుగు సే్నహితుల ఇళ్ళలోనో, బయటో పారీ్టలు (పుటి్టన రోజులు, పండుగలు, అమా్మనాన్నలు ఇండియానుండి వచి్చన లేక వెళే్ళ సందరా్భలు, మామూలు పారీ్టలు, ఏవీ లేకపోతే పేకాట పారీ్టలు)
  శనాదివారాల పగలు్ల: పిల్లలి్న సి్వమి్మంగ్, Kumon, కూచిపూడి, భరతనాట్యం వగైరా కా్లసులు, గడి్డ కోతలు, వారానికి సరిపడే వంటలు, తెలుగు అసోసియేషన్ల పికి్నకు్కలు, ఇతా్యదులకు సరి.

  ఆపైన తెలుగు చదవడమంటే, కేవలం ఇంటరె్నట్ వారా్త పతి్రకల పఠనం (అదీ చాల వరకు ఆఫీసులో) మాత్రమే.

  ఇవనీ్న పోగా ఇంకా ఏమైనా సమయం మిగిలితే ఇంకొక చౌకబారు తెలుగు సినిమా …

  ఇక తెలుగు కథ చదవడానికి మిగిలిన వాళ్ళను వే్రల్ల మీద లెకె్కటొ్టచు్చ. చదివిన వారెవరైనా రచయితను మెచు్చకోవాలేగానీ పొరపాటున విమరి్శంచారో … వాళ్ళకు అహంకారం, చదవడం తెలియదు, పో్రత్సహించడం చేతకాదు, అసలు వాళే్ళం రాశారు, … వగైరా దీవెనలు సరేసరి. అలాగని వచి్చన మంచి రచనను చదివే వారు కూడా బహు కొది్దమందే ననుకుంటాను.

  ఇంకొక మాట. ఏ చెటూ్ట లేని చోట ఆముదం మొక్క మహా వృక్షమైపోయినా, రాసే వాళు్ళ తకు్కవున్నంత మాతా్రన అమెరికాలో రచయితలందరూ గొప్ప రచయితలు కాదు సరికదా, చాలామంది ఒక మాదిరి రచయితలు కూడా కాదు. అడ్రసు చూపించి డయాసో్పరా రచయితనన్నటే్ట! కథలను (లేదా ఏ రచననైనా సరే) రివూ్య చేసే్త ఆ రివూ్యని జాగ్రత్త పరిశీలించి రచనలో్ల సవరణలు చేసుకోవడానికి ఇష్టపడే రచయితలెందరునా్నరు? ఆ సంసా్కరం మనకు అబ్బకపోతే, ఎప్పటికీ మన తోకలు బెతు్తడే!

  • Krishna Rao Maddipati:
   కథలను (లేదా ఏ రచననైనా సరే) రివూ్య చేసే్త ఆ రివూ్యని జాగ్రత్త పరిశీలించి రచనలో్ల సవరణలు చేసుకోవడానికి ఇష్టపడే రచయితలెందరునా్నరు? ఆ సంసా్కరం మనకు అబ్బకపోతే, ఎప్పటికీ మన తోకలు బెతు్తడే!

   చక్కని మాట.
   అసహనం ఎక్కువై పోయింది. ఒక్కసారి అచ్చులోనో జాలపత్రికలో పేరు చూసుకోగానే ఆకాశం వేపే చూపు.

   • Sivakumara Sarma says:

    సత్యంగారు పైన “మన తెలుగువాళ్ళల్లో కొంతమంది మన అమెరికా తెలుగు కథలని ప్రోత్సహించటానికి బదులు, రాళ్ళు రువ్వటం ఎక్కువయింది.” అని అభిప్రాయాన్ని వెలిబుచ్చిన తరువాత ఈ రెండు వ్యాఖ్యలూ చదివి బుర్ర గోక్కోవాల్సొచ్చింది!
    అమెరికాలోనే కాదు, ఇండియాలోనే వుంటూ కూడా ఏ కొద్దిమందో తప్ప (యండమూరి, మల్లాది, యద్దనపూడి, మాలతీ చందూర్, …) పేరు పక్కన “రచయిత” అని తగిలించుకోలేక పోవడానికి కారణం ఏవో పోటీల్లో బహుమతులు పొందితే తప్ప ఆ రచనలు వాళ్లకి డబ్బుని చేకూర్చలేక పోవడం. (“సినీ రైటర్” అని పేరు తగిలించుకునేవాళ్ల గూర్చి కాదు నేను చెప్పేది.) పైగా, “రచయిత” అని ఏ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీకూడా కాదు! అంతర్జాల పత్రికల్లో రచనలు ప్రచురింపబడ్డా రచయితకి మిగిలేది చదివిన ఏ కొద్దిమంది చేతో గుర్తింపు మాత్రమే. అదే అమెరికన్ మాగజీన్స్ అయితే పదానికి ఇంత చొప్పున ప్రచురణకి తీసుకున్న ప్రతీ కథకి పారితోషికాన్నిస్తారు.
    ఇకపోతే, రంజీ ట్రోఫీ ఆడిన వాణ్ణి కూడా, ఇండియన్ టీమ్లో లేనంత మాత్రాన “వీడో క్రికెట్ ప్లేయర్ట!” అని గేలిచెయ్యరు. N.B.A. లో ఆడే వాళ్లెవరినీ – ఆఖరికి ఎప్పుడూ బెంచీమీద కూర్చునేవాణ్ణి అయినా సరే, వీడో మైకేల్ జోర్డాన్ కాదనీ, ఓ Lebron James కాదనీ, వాడికసలు బాస్కెట్ బాల్ ఆడడమే రాదనీ తక్కువ చెయ్యరు – వాడికిచ్చే జీతం వాడికిస్తారు. ఏదో అమెరికాలో వుంటూ భాషమీద గుబులుపుట్టి కానీండి, చేతి దురదతో కానీండి రాద్దామనుకున్నవాళ్లు ఏదో రాస్తున్నారు. నచ్చినవాళ్లు వేసుకుంటున్నారు. వాటికి పాఠకులుంటే ఆ రచయితల అదృష్టం. పాపం, వీళ్ళకి “సంస్కారం” అనీ, “తోక బెత్తెడు” అనీ, “ఆకాశం వేపే చూపు” అనీ దీవెనలు ఎందుకండీ? అవ్వి అస్సలు నప్పవు కదా!

 5. నిశీధి says:

  ఈ మధ్య కాలంలో చాలా నిశితంగా దాదాపు ప్రతి కోణం సృజించిన ఆర్టికల్ ఇది . ఒక సమయం ఉండేది , ఎక్కడ ఎపుడు అవకాశం దొరికినా అసలు వదిలిపెట్టకుండా ఎన్ అర్ ఐ పేరు ఉన్న ప్రతి అక్షరం వెతుక్కొని మరీ చదివాము , ముఖ్యంగా రచన లాంటి మాగజైన్స్ ఒక స్టేజ్ లో పూర్తిగా అమెరికా రచయితల భక్తీ చాటుకున్న కాలం అది . అతి ఎపుడు వెగటు గానే ఉంటుంది అని తరవాత తరవాత మూస లో వచ్చిన కథలు చదివాక వచ్చిన విరక్తిలో ఇపుడు ఏదయినా మంచి రచన ఉంది అంటే కుడా అసలు చదవటం అంటే దడుపు జ్వరాలు . నేను , నా పరివారం స్తాయి దాటి సోషల్ అవేర్నెస్ చూపిన రచనలు ఒక 5% అయినా ఉన్నాయా అని డౌట్ . అలా సడెన్ గా చదవటం ఎందుకు మానేసాం చదవటం అన్న ప్రశ్న కి సమాధానాలు ఈ ఆర్టికల్ లో దొరికినట్లు గా
  ఉంది . క్యుడోస్ .

 6. buchireddy gangula says:

  చారాన కోడి కి బారాన మసాలా ——లాగుంది *** కథ ఎటు పోతుంది ???
  అమెరికా లో ఉన్నదే కొద్ది మంది రచయితలు — రా వి శాస్త్రి — బుచ్చి బాబు —- కొడవటిగంటి —-శ్రీ శ్రీ — తిలక్ లు లేరు —
  వీళ్ళు సామాన్య పాటకుల తో మాట్లాడారు —వాళ్ళ కు వాళ్ళే పోగాడుకుంటూ — కామెంట్స్
  చేసుకుంటూ —
  అమెరికా అయినా అమలాపురం అయినా — అదే తిరు — అదే పోకడలు —
  గొప్ప గొప్ప రచయితలు అ రోజుల్లో వాళ్ళ జీవిత చరిత్రలు రాసుకోలేదు — కాని నేటి రచయితలు — అలా కాదు –గుర్తింపు కోసం —అవార్డ్స్ ల కోసం — ఆరాటం — రాజకీయం —
  sp- స్ప్ లు అని — యెన్నెఅయినా రాయవచ్చు — donations– సేకరించే ప్రజ్ఞ ఉంటే — ఎన్ని సదస్సులు అయినా చేయవచ్చు — తెలుగు సదస్సుల కు — తెలుగు సంగాల జాతరలో — తెలుగు సాహితి మీటింగ్స్ కు వచ్చే వాళ్ళు 20— 50- 80– 100 ఉంటె ఎక్కువ –
  అ మీటింగ్ లో కూడా మంత్రి గారితో — సిని నటి తో — శాలువలు kappadaalu– కప్పించుకో డా లు —
  శివకుమార్ గారు — కొంత మంది కవులు వాళ్ళ పేరు ముందు ** కవి ** అని పెట్టు కున్న వాళ్ళు కూడా లేకపోలేదు
  కాంగ్రెస్ పాలనా లో తన పత్రిక కు — govt-ads–వచ్చేది — యిపుడు తెలంగాణా పాలనా లో — అ ads– లేకపోవడం తో —govt- ను దుయ్య బెడుతూ — వ్యాసాలూ — కామెంట్స్ —
  (అ పత్రిక లో — మొత్తం అంతా — govt– ను —నిందిస్తూ — articles—)
  నిజాలు రాస్తే — సెన్సార్ లు ???– మిత్రుల కామెంట్స్ ల లో చాలావరకు నిజాలు లేకపోలేదు —
  జవాబు యివ్వగలను

  ———–బుచ్చి రెడ్డి గంగుల

మీ మాటలు

*