మరో మొనాలిసా

Mamata K.
న్యూయర్క్ జిలుగుల 
నీడల్లో ఓ పక్కకి ఒదిగి 
నెలలు నిండిన పొట్ట నిమురుకుంటూ 
ఒక మెక్సికన్ యువతి.
ఆమె చేతిలో
వడలి పోతున్న ఎర్రగులాబీ 
బొకేలనుంచి తేలివచ్చింది
దశాబ్దకాలపు గ్నాపకం.
ప్రపంచానికి ఆవలి తట్టున, ఇలాంటివే 
మసిబారిన కాంక్రీటు దుమ్మల మధ్య
ఒక చేతిలో చిట్టి చెల్లాయిని
మరో చేతిలో 
తాను మోయలేనన్ని మల్లెమాలలతో
నా కారులోకి ఆశగా చూస్తూ
ఏడెనిమిదేళ్ళ పాప.
తన దగ్గరనుంచి 
ఒక్క పువ్వూ 
తెచ్చుకోలేకపోయిన
ఊగిసలాట  మరుగున నా స్వార్థం
ఇదిగో ఇప్పుడిలా నా రీర్ వ్యూ మిర్రర్లో
నిరాశ దు:ఖాన్ని దాచేసి
నిర్వికారమైన చిరునవ్వు నావైపు విసిరి
ఎన్నటికీ మాయని గాయాన్నింకొకదాన్ని 
నా గుండెలో రేపి
రోడ్డు మలుపులో మాయమయ్యింది.

మీ మాటలు

  1. c.v.suresh says:

    వాహ్ ! మమత జీ! మీ కవితలో మానవీయ కోణ౦ హృద్య౦గా ఉ౦ది.. ! ఎ౦త చిన్న వస్తువు.. ఆ అద్భుతమైన ఎత్తుగడ..! బహుశా నగర౦లోని అనేక జ౦క్షన్ లలో పూలో.. గాలిపటాలో…అమ్ముతూ చిన్న అమ్మాయిలు తరచూ కనిపిస్తారు. ఆ వస్తువులు ఎలాగైన అమ్మి ఆ పూట కడుపు ని౦పు కోవాలనే వారి బలమైన కా౦క్షను …..దైన్య౦గా …ఆర్ద్రతగా….వారి చూపుల్లోకి మార్చి….ఖరీదైన కార్ల అద్దాల్లో౦చి మనవైపు విసురుతు౦టే….. చూడని కళ్ళెన్నో.. చూసి చూడనట్లు నటి౦చే కళ్ళెన్నో…. కరిగే హృదయాలెన్నో…గు౦డెలు పగులగొట్టుకొనే మానావతా దృక్పధాలెన్నో……! !
    ఆకు పచ్చటి లైటు ఆ చితికిపోయిన బ్రతుకుల్లో ఓ శాశ్వత శత్రువే….!!!

    మమత జి!!! “ఇదిగో ఇప్పుడిలా నా రీర్ వ్యూ మిర్రర్లో
    నిరాశ దు:ఖాన్ని దాచేసి
    నిర్వికారమైన చిరునవ్వు నావైపు విసిరి
    ఎన్నటికీ మాయని గాయాన్నింకొకదాన్ని
    నా గుండెలో రేపి
    రోడ్డు మలుపులో మాయమయ్యింది.”………………! కన్నీళ్ళను ని౦పారు….!!!

  2. S. Narayanaswamy says:

    చాలా బావుంది.

  3. తడివున్న హృదయంలోనే జ్ఞాపకాల మొలకలు తలలత్తేది.కవిత్వంకూడా!!

Leave a Reply to c.v.suresh Cancel reply

*