మనుషుల్ని చంపేస్తారు, మరి భూమిని?!

varavara.psd-1

అజంతా చెట్లు కూలుతున్న దృశ్యాన్ని చూసాడు.

తాత్వికార్థంలో ప్రాణికోటి ప్రాణవాయుహరణమే చూసినట్లు. మనుషులు కూలుతున్న దృశ్యాన్నీ చూసినట్లే.

తెలుగు సమాజం, ముఖ్యంగా తెలంగాణ, వ్యవస్థాపరంగానూ రాజ్యపరంగానూ పోరాడుతున్న ప్రజలను, వాళ్లకు అండగా పోరాడుతున్న ప్రజాసేవకులను పందొమ్మిది వందల నలభైల కాలం నుంచే ఎంతమందిని కోల్పోయిందో. నా బాల్యంలో అటువంటి విషాదాలనూ చూసాను. మూడు వైపులా వాగులతో పరివృతమైన మా ఊళ్లో బరసనగడ్డ రోడ్డు మీద దిరిసెన పూలు, బొడ్డుమల్లె పూలు రాలిన అందమైన దృశ్యాలూ చూసాను.

ఇంక నక్సల్బరీ కాలం నుంచి చైతన్యం వలన కూలుతున్న మనుషులందరూ ఎక్కడో నా రెక్కల్లో డొక్కల్లో మసలుకున్న వాళ్లేననే మానసికతయే నన్ను ఆవరించింది. ఎనభైల ఆరంభం అమరుల జ్ఞాపకాలను కూడ నిర్దాక్షిణ్యంగా తుడిచే వ్యవస్థ క్రూరత్వంతో మొదలైంది.

కరీంనగర్ జిల్లా హుజూరాబాదు తాలూకా గూడూరు అనే గ్రామంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నిర్మించిన ఒక నవయువకుడు గోపగాని రవి చేతిలో బాంబు పేలి మరణించాడు. గ్రామస్తులు ఆయన కోసం ఆ ఊళ్లో కట్టుకున్న స్థూపాన్ని పోలీసులు కూల్చిన పద్ధతి నన్ను కలచివేసింది. స్థూపానికి అవసరమైన మట్టి, ఇటుకలు, రాళ్లు, సున్నం ఎవరు సమకూరిస్తే వాళ్లనే అవి తొలగించమని, ఎవరెవరు ఆ నిర్మాణంలో పాల్గొన్నారో వాళ్లనే అది కూల్చమని పోలీసులు ప్రజల్ని కూడేసి నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారు. ఇంక అప్పటినుంచీ అదొక నిర్బంధ పద్ధతి అయిపోయింది. అమరులైన విప్లవకారుల కోసం స్థూపాలు నిర్మించుకోవడం ప్రజల రాజకీయ, సాంస్కృతిక, నైతిక, సంఘటిత శక్తికి ఎట్లా ఒక సంకేతమైందో, ఆ స్థూపాలను కూల్చివేయడం రాజ్యానికట్లా ఆ అమరుల జ్ఞాపకాలను తుడిచేసే హింసా విధానమైంది.

1999 డిసెంబర్ 1న ఇది పరాకాష్ఠకు చేరుకున్నది. ఆరోజు నల్లా ఆదిరెడ్డి (శ్యాం), ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి (మహేశ్), శీలం నరేశ్ (మురళి) లను బెంగళూరులో అరెస్టు చేసి, కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవులకు తీసుకవచ్చి, లక్ష్మీరాజం అనే పశులకాపరితో కలిపి డిసెంబర్ 2న చంపేసి, ‘ఎన్ కౌంటర్’ అని ప్రకటించారు. ముగ్గురి మృతదేహాలను పెద్దపెల్లి ఆసుపత్రిలో పెట్టి రాష్ట్రవ్యాప్తంగా జనం తరలివస్తుంటే క్షణాల మీద పోలీసు వ్యాన్ లోనే శీలం నరేశ్ మృతదేహాన్ని జగిత్యాలకు తరలించి, జగిత్యాలను పోలీసు చక్రబంధంలో పెట్టి, తండ్రిని బెదరించి దహనక్రియలు చేయించారు. సంతోష్ రెడ్డి తల్లి అనసూయమ్మ హైకోర్టులో సవాల్ చేయడం వల్ల ఆయన మృతదేహాన్ని రీ పోస్ట్ మార్టమ్ కొరకు రామగుండం సింగరేణి కాలరీస్ ఆసుపత్రికి తరలించారు. నల్లా ఆదిరెడ్డి మృతదేహాన్ని మాత్రం అతని సోదరుడు కరీంనగర్ జిల్లా కొత్తగట్టుకు తెచ్చుకోగలిగాడు.

అక్కడికి వెళ్లకుండా ఎం ఎల్ పార్టీల నాయకులందరినీ, విరసం విమలను, నన్ను జమ్మికుంట పోలీసు స్టేషన్ లో నిర్బంధించారు. కొత్తగట్టు ఊరిని, ఆ ఊరికి హనుమకొండ, కరీంనగర్ ల నుంచి ఉండే మార్గాలను గ్రేహౌండ్స్ తో నింపేసారు. అయినా జనం పలు మార్గాలనుంచి చీమల దండువలె కదలి రాసాగింది. మమ్మల్ని కొత్తగట్టుకు వెళ్లగూడదనే ఉద్దేశంతో నలగొండ జిల్లా సరిహద్దుల్లో వదిలేస్తే ఆలేరులో బండ్రు నరసింహులు ఇంట్లో తలదాచుకున్నాం. ఆ అమ్మ నర్సమ్మ మా అందరికీ అర్ధరాత్రి వండి పెట్టింది. మర్నాడు ఉదయమే రాజమార్గం తప్పించి నన్ను, నా సహచరి హేమలతను కొత్తగట్టుకు తీసుకవెళ్లిన నా వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ క్లాస్ మేట్ సి రాజిరెడ్డిని తలచుకోవాలి. అలా శ్యాం అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఆ కక్షనంతా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో 1990 వరకు జిల్లాలో అమరులైన 93 మంది విప్లవకారుల స్మృతిలో నిర్మించుకున్న 93 అడుగుల ఎత్తైన స్థూపాన్ని నేలమట్టం చేసి తీర్చుకున్నారు పోలీసులు. ఇప్పటికీ అక్కడ నేల మీద గడ్డిలో ఆ ఎత్తైన స్థూపం మీంచి నేలమీద కూలిన సుత్తీకొడవలి లోహ చిహ్నం పడి ఉంది.

1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతుల సమస్యపై అంతర్జాతీయ సదస్సుకు వచ్చిన సుప్రసిద్ధ కెన్యా రచయిత గూగీ వా థియాంగో ప్రత్యేకించి హుస్నాబాదుకు వెళ్లి ఈ స్థూపాన్ని చూసాడు. అందుకే ఆయనకీ విషయం రాసాను. అప్పుడాయన నాకు ఎంతో ఆశ్వాసాన్నిచ్చే మాటలు రాసాడు – మనుషుల్ని కూల్చేసినా, వాళ్ల స్మృతిలో నిర్మించిన స్థూపాలను కూల్చేసినా, మీకు మళ్లీ మనుషులు పోరాటంలోకి వస్తున్నారు. అమరులవుతున్న వాళ్ల చేతుల్లోంచి పోరాట జెండా అందుకుంటున్నారు. మీరు పోరాటంలోనే వాళ్ల స్మృతులను నిలుపుకుంటున్నారు. కాని మాకు 1952-62 మౌమౌ విప్లవోద్యమం ఒక స్మృతి – నాస్టాల్జియా మాత్రమే, అన్నాడు.

‘భూమికి భయపడి’ కవిత గిరాయిపల్లి విద్యార్థి అమరులు, జన్ను చిన్నాలు స్థూపాలు వరంగల్ జిల్లా పైడిపల్లిలో కూల్చేసిన వార్త, ఇంద్రవెల్లి స్థూపాన్ని కూల్చేసిన వార్త జైల్లో విన్నపుడు రాసింది. ఆ కవిత కిందనే ఆ వివరణ ఉంది.

మనుషుల్ని కూల్చేస్తారు. స్మృతుల్ని చెరిపేస్తారు. స్మృతిలో వెలిగించిన దీపాల్ని మలిపేస్తారు. కాని మనుషులకి, వాళ్ల పోరాటాలకి, జ్ఞాపకాలకి భూమిక అయిన ఈ భూమిని ఏం చేయగలరు – అన్నదే వ్యవస్థను, రాజ్యాన్ని మనుషులు నిలదేసే సవాల్.

ఈ కవితను హిందీలోకి అనువదించినపుడు ‘వాళ్లు కలాలకు భయపడ్డారు’ అని నేను రాసిన చరణాన్ని ఇంకా పదను పెడుతూ సుప్రసిద్ధ హిందీ సాహిత్య విమర్శకుడు మేనేజర్ పాండే ‘వహ్ కలమ్ కె నూర్ సె (కలం మొనతో) డర్ గయా’ అని మార్చాడు. ఇదే శీర్షికతో హిందీలో ఈ కవితపై ఒక వ్యాసం రాసాడు.

‘సంకెల సవ్వడి’ పాటకు శ్రుతి కావడం గురించి మొదట ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసాడు. సికిందరాబాద్ కుట్రకేసులో జైలు నుంచి మమ్మల్ని కోర్టుకు తీసుకవెళ్లేప్పుడు చెరబండరాజు పాటలకు మా సంకెలలు వాద్యసాధనాలు కావడం ఇది రాస్తున్నప్పుడు నేను వినగలుగుతున్నాను. ఆ దృశ్యాలను ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు చూడగలుగుతున్నాను.

-వరవరరావు

మీ మాటలు

*