కాలాన్ని సిరాగా మార్చిన కవి

gournayudu

గంటేడ గౌరునాయుడి మాస్టారిని సాహిత్య లోకానికి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పటికే తన కథలతో కవితలతో మనందరికీ సుపరిచితులే. ఇటీవల ఆగస్టు 8న తన అరవై వసంతాలు నిండిన సందర్బాన్ని పురస్కరించుకొని ’ఎగిరిపోతున్న పిట్టలకోసం’ అనే కొత్త కవితా సంకలనాన్ని తీసుకువచ్చారు.

 

ఉత్తరాంధ్ర లేదా కళింగాంధ్రగా పిలువబడే ఈ ప్రాంతంలో గత నాలుగు దశాబ్ధాలుగా జరుగుతున్న విధ్వంసం అది సామాజికంగా ఒక్కో పొరను కప్పేస్తూ కమ్మేస్తున్న వైనాన్ని అలాగే వ్యక్తిగతంగా మనిషితనానికి దూరమవుతు రక రకాల ప్రభావాలకు ప్రలోభాలకు లోనవుతు తమ ఉనికినే కోల్పోతున్న సంక్షుభిత సందర్భాన్ని తన కథలలోను కవితలలోను ఆవిష్కరిస్తారు మాస్టారు. ఈ కవితా సంకలనంలోని కవితలు 2011 నుండి మొన్నటి వరకు వున్న కాలానికి వేలాడుతున్న చినిగిన చొక్కాలాంటి బతుకు వెతలు. మాస్టారి శైలి జీవితంలోని అన్ని పార్శ్వాలను తన నుడికారంతో స్థానిక మాండలికానికి దగ్గరగా సామెతలతో కలగలిపి చెబుతూ ఒక ధిక్కార స్వరాన్ని ఎలుగెత్తి మనముందు ఆవిష్కరిస్తుంది.

 

చాలా మంది ఇటీవల వామపక్షానికి దగ్గరగా వున్న మేధావులు రచయితలు కూడా అభివృద్ధి అంటే విధ్వంసం కాకుండా ఎలా జరుగుతుంది? అని ప్రశ్నిస్తూ చెరబండరాజు అన్నట్టు నీ ఖాకి నిక్కరు మార్చినారురో ఓ పోలీసన్న, నీ బతుకు మారలేదురో ఓ పోలీసన్న అన్నట్టుగా పొట్ట చేతబట్టుకొని నాలుగు గిన్నెలు ముంతలు ఓ సిమెంటు బస్తాలో మూటగట్టి మా వూరినుండి వెళ్ళే బొకారో ఎక్స్ ప్రెస్ ఎక్కి చైన్నైకి, విజయవాడ పాసెంజరెక్కి ఆ చుట్టుపక్కలకి, నాగావళీ ఎక్స్ ప్రెస్ ఎక్కి హైదరాబాద్ కి పల్లెలనుండి వలస పోతున్న వారిని చూసి ఆహా రైతు కూలీ జనం కార్మిక వర్గంగా రూపాంతరం చెంది వీళ్ళంతా కార్మిక వర్గ విప్లవాన్ని తీసుకు వచ్చేస్తారు, పెట్టుబడి పల్లెలన్నింటిని కబలిస్తూ పట్టణాలలో కలిపి మెట్రో పాలిటన్ సిటీలుగా స్మార్ట్ సిటీలుగా మారిపోతున్నాయి యింక వ్యవసాయం చేయాల్సినది పెట్టుబడిదారులే అని చెప్పకనే చెప్తున్నారు. ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లలో కాంప్లెక్సులలో ఉద్యోగాలు కావాలా? అన్న ప్రకటనలతో ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి జనం వలస బాట పడ్తున్నారు అని ప్రకటిస్తున్నారు. ఇది ఒక పార్శ్వం మాత్రమె.

కానీ ఈ జీవన విధ్వంసం వెనక ఈ ప్రాంతంలో అమలు జరుగుతున్న విద్వంసకర అభివృద్ధి నమూనాలు కారణంగా ఇక్కడి జనం తమ విరిగిన రెక్కలతో నెత్తురోడుతున్న భుజాలతో ఎక్కడెక్కడికో ఎగురుకుంటూ కాంక్రీట్ స్లేబుల కింద నలిగిపోతున్న తమ జీవితాలను, అనారోగ్యకర పరిస్థితులలో బతుకుతు ఆ వచ్చిన అరకొర కూలీని దాచుకొని పండగలకు పబ్బాలకు పల్లెలకు వస్తూ తామంత సంతోషంగ వున్నామని మురిపిస్తూ తిరిగి తిరిగి మరల మురికి కూపాలకు పునరంకితమవుతున్నారు. ఈ జీవన నరకయాతనను, చిధ్రమవుతున్న మానవ సంబంధాలను మాస్టారు ఈ కవితలలో మనకు చూపిస్తారు. ఈ బలవంతపు వలసలు, ఇగిరిపోతున్న పచ్చదనం, సెల్ ఫోన్ రింగులతో మూగబోతున్న పల్లె పాటలు, ఏ ఆసరా లేక కునారిల్లుతున్న ముసలి బతుకులు, మేపుకు దూరమై కబేళా బాట పట్టిన పశుసంపద ఈ చిద్రమైన తీరును మాస్టారు చెబుతారు. ఇది కొంతమందికి అభివృద్ధికి వ్యతిరేకంగా అవసరంలేని వలపోతగా కనబడడం విషాదం. కవికి కాలాన్ని సిరాగా మార్చడమే కర్తవ్యం కదా? అది మాస్టారిలో మనం పరికించవచ్చు.

 

ఇంక మాస్టారి కవిత్వంలో ప్రతీకల వెల్లువ వుంటుంది. ఉదాహరణకు

 

ప్రతి ఉదయపు నడకా ఒక మధుర గీతమే కవితలో

 

అదృశ్య హస్తాలేవో దోసిళ్ళతో ఆకాశంలోంచి

వొంపుతున్న పుప్పొడి ధూళిని తమ చిట్టి రెక్కలతో పిట్టలు

కొమ్మల మీదా రెమ్మల మీదా ఆకుపచ్చ మెరకల మీదా

గరిక పరకల మీదా వెదజల్లుతున్నప్పుడు,

 

చీకటిని అడిగి బొగ్గును

వేకువను అడిగి సుద్దను తెచ్చి ఉషస్సు

తన నలుపు తెలుపుల బొమ్మ గీస్తున్నప్పుడు

హృదయలయకి శ్రుతి కలుపుతూ ఆలపిస్తాను

నా చరణయుగళ గమన గీతం… అంటారు

 

మాట్లాడుకోవాలిప్పుడు కవితలో

 

చీలికల సంగతి మరచి

చేతులు కలుపుకోవాలి,

ఏటిదారానికి కూర్చిన పూసలు కదా మన ఊళ్ళు

పూసా పూసా చెప్పుకునే ఊసులు కదా

మన ఇల్లూ వాకిళ్ళు

కరిగిపోతుంది తీరం

తెగిపోతుంది దారం

ఇప్పుడే.. యీ క్షణమే

మాట్లాడుకోవాలి..

 

ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల దుఖాన్ని ఇలా చెప్తారు

 

అనుకున్నదే, ఏదో ఒకనాటికి యీ తల్లకిందులు తప్పదని

నోరూ వాయీ లేనోళ్ళం

తీరూ తెన్నూ తెలీనోళ్ళం

ఎవలకేటి కాదనీసినాం? ఎవలి మాట కొట్టేసాం?

ఏలినవోరిదయ, మీరేతంతే మామదే అన్నాం

పేగులు తెగిపోతంటే పెదివిప్ప్పి ఒకమాటన్లేదు

బతుకు బుగ్గైపోతుంటే బితుకు బితుకుమని కూకున్నాం

మా నేల మాది కాదనీసినా మూగోల్నాగ మూల జేరిపోనాం…

 

అయ్యలారా!

అన్నం పొట్లాలు అందించిందాక ఆయువుండాలగదా

ఎలీకాప్టరొచ్చిందాక హంసెగిరిపోకుంట ఆగాల గదా

మరపడవలు తెప్పించేవరకి గురుకు జారిపోకుండ వుంతే గదా? అంటూ

 

కట్టండి నాయనా కట్టండి

మాము కప్పులడిపోయిన ఇసక దిబ్బల మీద

కట్టండి ప్రాజెక్టులు… అంటారు.

 

పెట్టుబడిదారీ మనస్తత్వాన్ని యిలా చెప్తారు మాస్టారు

 

యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది

మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తుంటాడు,

ఒక మారణ హోమం రగులుతూనే వుంటుంది

మరో మృత్యు యాగానికి ముహూర్తం నిర్ణయిస్తాడు.

 

మరణ మృదంగ నాదాలను మధుర సంగీతంగా

వినిపించగల మహా విధ్వాంసుడు వాడు

విద్యుద్ఘాతాలను బహుమతులుగా పంచగల

విద్వత్తు వాడిది……. అంటారు

 

అలాగే తెలంగాణా ఆకాంక్షను సమర్థిస్తూ

 

దుర్భరమే కావొచ్చు గాక ఎడబాటు

అదొక భవిష్యత్ పునస్సమాగమ సంతోష గీతిక,

వేదనా భరితమే కావొచ్చుగాక వేర్పాటు

అదొక మానవ మహోద్గమన సూచిక… అంటారు.

 

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగాక ఇంక రైతు చేసుకునే ఉగాది పండగ ఏముంటుంది అంటూ

 

గాదులు

ఇళ్ళముందునుంచి ఎగిరిపోయాక

ఉగాదులు ఒట్టి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి,

నాగలి

పురావస్తు ప్రదర్శనశాలలోకి పయనమైపోయాక

నాగేటి చాలొక చెదిరిన స్వప్నమైపోయింది….

లోహమహిషం ముందు నేను మోకరిల్లినపుడే

కొత్తామసకి కాలం చెల్లిపోయిందంటారు…

 

ఈ సంకలనంలో సద్దాం హుస్సేన్ ఉరిని టీవీలో చూస్తూ చలించి రాసిన ఈ కవిత

 

ఆకాశమంత నోటితో భూగోళం

నిరసన గీతం ఆలపిస్తుంటే

ఆత్మగౌరవ నినాదానికి అమావాస్య ముసుగువేసి

అహం నిస్సిగ్గుగా నవ్వింది.

ఆచ్చాదన లేని స్వేచ్చా విహంగం

ఉరితాడును ముచ్చటగా ముద్దాడింది

 

డాలర్ ఎగరేస్తున్న తుపాకీ మొనగాడి దగ్గర

భూగోళాన్ని వేలాడదీసే ఉరితాడు ఉందంటారా… అని ప్రశ్నిస్తారు.

 

గోర్కీ స్మృతిలో, భగత్ సింగ్ స్మృతిలో రాసిన కవితలతో పాటుగా తమ ఇంట్లో వొంగిన ఇంద్రధనస్సు మనవరాలిపైనా రాసిన కవితలతో పాటుగా ఉద్యమంలో అసువులు బాసిన వారిపట్ల సానుభూతితో రాసిన కవితలు ఇలా మనల్ని కదిలించి ఆలోచింప చేసే పద చిత్రాలతో నిండైన కవిత్వాన్ని మనకందించారు గౌర్నాయుడు మాస్టారు. తప్పక చదివి కదలాల్సిన కవిత్వం. ఇది స్నేహకళా సాహితి, పార్వతీపురం వారి ప్రచురణ. ప్రతులకు

 

గంటేడ కిరణ్ కుమార్

S.N.P. Colony,

Near Ramalayam, Belagam,

Parvathipuram – 535 501.

 

వెల: రూ.70/- లు.

  – కేక్యూబ్ వర్మ

 varma

 

 

మీ మాటలు

  1. మంచి పరిచయం సర్.,

  2. rajsram.t says:

    వర్మ గారు నదిని దానం చేశాకా చదివాకా నేను గౌరునాయుడిగారి కవిత్వాభిమానినయ్యాను. ఎగిరి పోతున్న పిట్టల కోసం పై మీ విశ్లేషణ చాల బాగుంది.వలస పోతున్న కూలీల కుటుంబాల వ్యధ ఎందరూ రాసినా తీరదేమో.కవులవి కనీసం వూరడింపు మాటలే కాదు భుజం తట్టే ధైర్యపు వచనాలు

మీ మాటలు

*