కష్టజీవి ఆత్మాభిమానం… ‘ఆదివారం’!

 

karalogo
నిర్వహణ: రమా సుందరి బత్తుల

పని చేసేవారికి కాకుండా ఆ పనిని చేయించేవారికీ, చేయించుకునేవారికి గౌరవాలు దొరికే సమాజం మనది. అందుకే శ్రామికులకు పనిచేసే అవకాశం కల్పించి వారిని పోషిస్తున్నామని ధనికులు భావిస్తుంటారు. వారి జీవితాలు తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడివున్నాయనే అభిప్రాయంతో ఉంటారు.

కానీ నిజానికి ఎవరు ఎవరిపై ఆధారపడివున్నారు?

పని మనిషి పొద్దున్నే వచ్చి ఇల్లు ఊడ్చి, అంట్ల గిన్నెలు తోమకపోతే గృహ వాతావరణం గందరగోళంగా తయారై, ఇంటిల్లపాది సుఖశాంతులకూ ముప్పు వచ్చే సందర్భాలు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇళ్ళలో సాధారణం. కానీ అంత చాకిరీ చేసేవారికి ప్రతిఫలంగా కొద్ది మొత్తం ఇవ్వటానికే కొందరు బాధపడిపోతుంటారు.

ఆ శ్రామికులపై సానుభూతి చూపటం అటుంచి … వాళ్ళ ఆశపోతుతనం, షోకులూ, ఫ్యాషన్ల గురించి వ్యంగ్యంగా విసుర్లూ, జోకులూ, కార్టూన్లూ చలామణిలోకి వచ్చాయి. ఈ ధోరణి చివరకు సాహిత్యంలో కూడా ప్రవేశించింది. ‘జీతం పెంచాలా? ఇంకా నయం- ఆస్తి రాసివ్వమని అడగలేదు’ అని ఆశ్చర్యాలుపడుతూ పనిమనుషుల దాష్టీకాలకు గురయ్యే మధ్యతరగతి గృహిణుల కష్టాలపై జాలి కురిపిస్తూ కథలు కూడా వచ్చేశాయి. వీటిని రాసినవారు శ్రామికులపై సానుభూతి లేనివారని తెలుస్తూనేవుంటుంది.

కానీ వీటికి భిన్నంగా… యాబై సంవత్సరాల క్రితమే కాళీపట్నం రామారావు రాసిన ‘ఆదివారం’కథ ఓ కష్టజీవి ఆత్మాభిమానాన్నీ, స్థైర్యాన్నీ కళాత్మకంగా చిత్రీకరించింది. శ్రామిక పక్షపాతంతో రాసి పాఠకులను ఒప్పించేలా కథను తీర్చిదిద్దారు రచయిత.

డబ్బున్న ఓ ఇంటి కోడలి కోణంలో ఈ కథ నడుస్తుంది. ‘మా యింట్లో పనిమనిషి లేనిదే పూట గడవదని ఏనాడో తేలిపోయింది’ అంటుందామె. (ఇది ఇప్పుడు మనం చాలా ఇళ్ళలో గమనిస్తున్న నిత్యసత్యం.) ఆమె అత్త లౌక్యురాలైన అరవై ఏళ్ల వయసున్న పెద్దావిడ.

ఆ ఇంట్లో పని మనిషి అంకాలు. ఈమె భయపెడితే జడుసుకోదు. కలియపడదామంటే తిరగబడుతుంది. డబ్బాశకూ లొంగిరాదు. మనసులో విషయం దాచి మసిపూసి మారేడుకాయ చెయ్యడంలో తమకన్నా రెండాకులు ఎక్కువ చదివిందనీ, ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగలదనీ కోడలి అభిప్రాయం.

ఈ కొరకరాని కొయ్య అంకాలు వారానికో రోజు సెలవు కావాలని అడిగితే అత్త పేచీ పెట్టుకుంటుంది. వేరే పనిమనిషిని పెట్టుకోవాలని మూడు రోజులు ఎన్నిపాట్లు పడినా ఫలితం ఉండదు. గర్వభంగమై బింకం సడలిపోతుంది. కానీ ఏదోరకంగా తన పైచేయి ఉండాలని ఆదివారం కాకుండా మరే రోజునైనా సెలవు తీసుకొమ్మని అంకాలును ప్రాధేయపడుతుంది.

బలిష్ఠమైన మనిషి నిస్సహాయంగా బక్క వ్యక్తిని ఒప్పించటానికి ప్రయత్నిస్తుంటే ఆ అరుదైన దృశ్యం ఎవరికైనా సంతోషం కలగజేస్తుంది. ఇక్కడ అత్త మనస్ఫూర్తిగా కాకుండా ఎత్తుగడతోనే పని మనిషిని బతిమిలాడినా ఆ ఆక్రోశం వీనులవిందుగానే ఉంటుంది.

‘అంట్లు తోముతూ కూర్చుంటే నాకు నగుబాట్లుగా ఉంటుంది. ఆదివారం నాడు మాత్రం నా చుట్టాలు పక్కాలు మధ్య నా పరువు నిలబెట్టు.’ అని ప్రాధేయపడినప్పుడు- ‘దాసీ ముండన్నేనట- యీ యమ్మ పరువు నిలబెట్టాలట!’ అని ఆ పరువు డొల్లతనాన్ని అంకాలు బట్టబయలు చేస్తుంది.

అత్త తన పంతం నెగ్గించుకున్నానని తృప్తిపడటంతో కథ ముగుస్తుంది.

* * *

అంకాలు పాత్ర చిత్రణ గొప్పగా ఉంటుంది.   తనకు డబ్బు ఎక్కువ వస్తుందనేది కూడా పట్టించుకోకుండా తోటి పనిమనిషి సూరమ్మకు జరిగిన అన్యాయం గురించి ఆమె నిలదీస్తుంది.

‘నిజంగా కాయకష్టం చేసుకునే వాళ్ళ కష్టాలు యీ గవన్నెంటు కెప్పుడు పట్టాయి; మాకు వాళ్ళూ వీళ్ళూ రూలు పెట్టేదేవిటి; మేవే పడతాం రూల్సు’అనే ధీమా!

‘అదేటి కలకటేరా గవినేరా- నాలాగే పన్జేసుకునే కూలిముండ. దాన్తో సెప్పుకుంటే ఏటౌతాది?’ అంటూ వ్యంగ్యం!

‘అందరి పన్లూ ఆ ఒక్క గంటలోనే సేసీడానికి మాకేం పచ్చేతులూ, పది కాళ్ళూ ఉంటాయేటమ్మా? ఉన్నా అందరిళ్ళల్లోనూ ఒక్కపాలే పన్జేసీడానికి మావేం దేవతవా?’అంటూ ఎత్తిపొడుపు!

‘నిన్నూ నిన్నూ అడుక్కోడానికీ, నీ కాళ్ళూ నీ కాళ్ళూ పట్టుకు పిసకరించడానికీ నాకేం పట్టిందమ్మా. నానేం అవిటిదాన్నా, సెవిటిదాన్నా? … కష్టపడతాను.’ అని తిరుగులేని ఆత్మాభిమానం! .

కష్టజీవులకు ఇలాంటి ఆత్మాభిమానం అవసరమనీ; మోసపోయే అమాయకత్వం కాకుండా దీటుగా ఎదుర్కొనే తెలివితేటలు ఉండాలనీ రచయిత ఈ కథ ద్వారా సూచించినట్టు అర్థం చేసుకోవచ్చు.

* * *

kaaraa

కాళీపట్నం రామారావు రచనల గురించి చర్చించుకునేటపుడు పెద్దగా ప్రస్తావనకు రాని కథ ‘ఆదివారం’. మిగిలిన కథలకు అమితంగా ప్రాచుర్యం వచ్చేయటం ఇందుకో కారణం కావొచ్చు. ఇది 1968 జూన్ 7న మొదటిసారి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది

ఈ కథ వెనకున్న ఓ విశేషం ఏమిటంటే… కా.రా. తాను రాసిన నాలుగు సంవత్సరాలకు గానీ దీన్ని పత్రికకు పంపలేదు. అంటే ‘యజ్ఞం’ కంటే ముందే ఈ కథ రాశారన్నమాట!

 

‘తీర్పు (1.3.1964) రాసి నాకు కథ రాయడం వచ్చిందనుకున్నాను. ఇల్లు (1.4. 1964) రాసి పాత వాసనలు వదలేదని బాధపడ్డాను. ఆదివారం సరిగానే వచ్చినా పత్రికకు పంపకుండా నాలుగేళ్ళు దాచిపెట్టేను. యజ్ఞం (1.1. 1966 ) రాసేక నామీద నాకు నమ్మకం కుదిరింది. ’ అని కా.రా. 1986లో ‘నేను నా రచన’ అనే వ్యాసంలో రాశారు.

సహజసిద్ధమైన సంభాషణలు ‘ఆదివారం’ కథను ఆసక్తికరంగా మలిచాయి. ముఖ్యంగా మాండలిక, నుడికార ప్రయోగాలతో కథ పరిపూర్ణంగా, విశ్వసనీయంగా తయారైన భావన కలుగుతుంది..

– ‘అశిరమ్మంత గొంతు పెట్టుకొని ఆకాశమంత ఎత్తు లేచిపోయింది.’

– ‘అద్దముంది, ముఖముంది. అంతకు మించి నేనొక్కపొల్లు మాటన్లేదు.’

– ‘మౌన ముద్ర వహిస్తే కుదరదు. అనువులనో మినువులనో అనాలి.’

– ‘వీళ్ళ కట్టులో సగం కట్టుంటే మనం ఏనాడో బాగుపడుదుం’

అంకాలు, అత్తల పాత్రలను నిర్వహించిన తీరు, వారి మాట తీరులో రచయిత చూపిన వైవిధ్యం ఆకట్టుకుంటాయి.

శీర్షిక పేరు ‘ఆదివారం’ బాగా సరిపోయింది. సంఘర్షణ మొదలవటం- కొనసాగటం, రాజీ పడటం; పంతం నెగ్గించుకోవటం- ఇవన్నీ ఈ రోజు గురించే! ఈ కథలో అన్నీ స్త్రీ పాత్రలే ఉండటం ఒక విశేషం!

 – వేణు

 

ch venu

 

 

వేణుగారు పాతికేళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. సంగీతం, సాహిత్యం, చిత్ర లేఖనం ఈయన అభిమాన విషయాలు. ‘వేణువు’ పేరుతో వీరి బ్లాగ్ నెటిజన్స్ లో చాలా మందికి సుపరిచితమే. ఈనాడు, తెలుగువెలుగు, వాకిలి, పుస్తకం.నెట్ లలో వేణుగారి సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు వచ్చాయి. సాహిత్యాభిమాని అయిన వేణుగారికి రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబరావు అభిమాన రచయితలు.

 వచ్చే వారం “జీవధార” కధ గురించి వై. కరుణాకర్ పరిచయం 

కథ లింక్:

https://www.scribd.com/doc/242719892/%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-%E0%B0%95%E0%B0%A7

మీ మాటలు

 1. వేణు గారూ…అభినందనలు మీకు…చాలా శ్రద్ధ గా రాశారు…

 2. Thirupalu says:

  కథ పరిచయ ఉపోద్గాతం మొదలుపెట్టిన తీరే చాలా బాగుందండి.
  //ఆ శ్రామికులపై సానుభూతి చూపటం అటుంచి … వాళ్ళ ఆశపోతుతనం, షోకులూ, ఫ్యాషన్ల గురించి వ్యంగ్యంగా విసుర్లూ, జోకులూ, కార్టూన్లూ చలామణిలోకి వచ్చాయి. ఈ ధోరణి చివరకు సాహిత్యంలో కూడా ప్రవేశించింది. ‘జీతం పెంచాలా? ఇంకా నయం- ఆస్తి రాసివ్వమని అడగలేదు’ అని ఆశ్చర్యాలుపడుతూ పనిమనుషుల దాష్టీకాలకు గురయ్యే మధ్యతరగతి గృహిణుల కష్టాలపై జాలి కురిపిస్తూ కథలు కూడా వచ్చేశాయి. వీటిని రాసినవారు శ్రామికులపై సానుభూతి లేనివారని తెలుస్తూనేవుంటుంది.//
  ఈ కథను ఇంకో రచయిత పరిచయం చేస్తే ఇంత బాగా రాదేమో! అనిపిస్తుంది.

 3. amarendra dasari says:

  వెరీ గుడ్ గోయింగ్ ! కీప్ ఇత్ అప్ సారంగా అండ్ రామా సుందరి గారు

 4. amarendra dasari says:

  ఈ వ్యాసాలతో పాటు ఆ యా కథలు కూడా లింక్ పెడితే బావుంటుంది..

 5. amarendra dasari says:

  ఇప్పుడే రమా సుందరి గారు లింక్ లు ఇస్తున్న విషయం చెప్పారు ..సంతోషం

 6. వేణు గారూ, చాలా బాగా రాశారు. రంగనాయకమ్మగారు మీ అభిమాన రచయిత్రి కదా మరి…. ఆమె రాసినంత బాగా రాశారు. అభినందనలు…. ఇలా మరిన్ని రాయాలని కోరుకుంటూ…

 7. HARITHA DEVI says:

  వేణు గారు
  ఎంత విపులంగా పరిచయం చేసారు. కథ ఎంత బాగుందో మీ పరిచయం కుడా అంత బాగా వుంది.

 8. Lalitha P says:

  రాసిన నాలుగేళ్ళకు కానీ “ఆదివారం” కథను కా.రా. ప్రచురణకు పంపలేదనే ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. వర్గ సంఘర్షణను మైక్రో లెవెల్ లో ఇంత బాగా చూపించే కథను పరిచయం చేస్తూ మళ్ళీ గుర్తుచేసి చదివించినందుకు కృతజ్ఞతలు.

  “వీళ్ళ కట్టులో సగం కట్టుంటే మనం ఏనాడో బాగుపడుదుము” అనే అత్త మాటల్లో పైకెదిగిపోతున్న మధ్యతరగతి వర్గ స్పృహ మహా గొప్పగా బైటికొస్తుంది. అలాగే పనిమనుషులకు ‘కట్టు’ లేకపోతే బతుకే కష్టం. అందువల్లే ఇంటి పనిమనిషిని మాన్పింఛి మరో పనిమనిషిని పెట్టుకోవటం మధ్యతరగతి ఆడవాళ్ళకు కూడా చాలాకష్టం. అలాగే మధ్యతరగతి వాళ్ళకుండే ‘కట్టు’ కూడా తక్కువదేమీ కాదు. విలువ కట్టలేని ఆ పనికి కాస్త ఎక్కువ డబ్బులిచ్చే అమ్మని మిగతా వాళ్ళు ‘మీరు ఎక్కువ డబ్బులు అలవాటు చేస్తే ఈ పనిమనుషులు మా ఇళ్ళకు తక్కువ డబ్బులకు రారు. మేము అంతంత ఇచ్చుకోలేము’ అని నిలదీస్తారు. ఇదో అర్ధ సత్యం.

  ఈ విషయం మీద వచ్చిన మధ్యతరగతి మొరటు కథల సంగతి అలా ఉంచితే, ‘పని’ కి సంబంధించిన పెనుగులాట పూర్తి నలుపు తెలుపుల్లో ఉండే వ్యవహారం కూడా కాదు. ‘ఆదివారం’ కథలో, ఒకే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళలోనే ఒళ్ళు వంచేవాళ్ళూ, వంచనివాళ్ళ వివరాన్నీ మనకి చెప్తారు కా.రా. అసలు ఇంటిపనే చెయ్యని మగవాళ్ళను “మెడకీ నడ్డికీ ఆ గుడ్డలేవో(aprons ) కట్టించి” తీసుకురాగలిగితే అందరం పనులు పంచుకుందామంటుంది అత్త. ఏ స్లోగన్లూ లేకుండా సహజంగానూ వంటింటి కథలానూ నడిపిస్తూనే అందరికీ నచ్చేలా, కథనుంచి ఎవరికి కావలసినదాన్ని వాళ్ళు తీసుకునేలా రాయగలగటం కా.రా., చా.సో. ల వంటి ఆనాటి మేటి రచయితల ప్రత్యేకత. ఈ విషయం మీద ఎన్నో సునిశితమైన కథలు రావాల్సి ఉండగా నుడికారం పదును దేరిన ఒక్క కా.రా. కథ మాత్రమే వజ్రంలా మెరుస్తుంది. తరువాత రంగనాయకమ్మ కూడా తనదైన శైలిలో రాశారు.

 9. Jagadeeshwar Reddy Gorusu says:

  వేణూ … చూసి చూసి భలే కథ ఎన్నుకున్నావబ్బా ! నాక్కూడా చాలా ఇష్టమయిన కథ. కొండని అడ్డం లో చూపించావు సుమీ! ఉత్తరాంధ్ర బ్రాహ్మణ భాషని అత్తలో, బడుగువర్గం మాటతీరు అంకమ్మ లో కారా గారు కమ్మగా వినిపించారు. ఇలాంటివి ఎన్ని కథలు చదివితే మటుకు పనిమనుషుల పట్ల ఉన్న అభిప్రాయం మారుతున్దంటావు? 50 ఏళ్ళ క్రితం రాసిన ఈ కథకీ … ఇప్పటికీ (పని చేయించుకునే ) మనుషుల్లో ఏ వల్లకాడు మార్పూ రాలేదు మరి !
  అన్నం మెతుకులతో ఎండిపోయిన గిన్నెలను , నమిలేసిన ఎముకలు ఊసిన పళ్ళాలు … పనిమనుషులకు వేయడం ఎరుగుదును. కరివేపాకు , ఎండు మిరపకాయలు, చెత్త చెదారం సరేసరి ! నీళ్ళు చిలకరించాలన్న ఇంగితం కూడా ఉండదబ్బాయ్ ! మంచి విశ్లేషణ చేసినందుకు అభినందనలు.
  (ఇల్లాంటి కథ పాలువాయి భానుమతి గారు రాస్తే నవ్వుకుంటాం . అదే కారా గారు రాస్తే ఆలోచిస్తాం – ఔనా? )

 10. నిశీధి says:

  Excellent story , and a very good introduction

 11. S. Narayanaswamy says:

  వెల్ డన్.

 12. “కారా మాస్టారు కథల్ని మనం విశ్లేషించడం ఏమిటి. చోద్యం కాకపోతే” అనుకునేవాళ్లున్నారు. కానీ కారాగారి కథలతో పరిచయం ఉన్న నేటి పాఠకులు, నేటి రచయితలు ఎంతమంది? వారికోసమైనా ‘ఆదివారం’ను వేణు విశ్లేషించడం సరైన పనే. నేటి తరం రచయితలంతా కారాగారి సాహిత్యాన్ని చదవడం కాదు, అధ్యయనం చేయాలి. కథ అంటే ఏమిటో తెలుసుకోవాలి.

 13. స్పందించిన అందరికీ కృతజ్ఞతలు.

  @ జగదీశ్వర్ రెడ్డి గొరుసు : ‘ఆదివారం’ కథను ఎంచుకోవటం అనుకోకుండానే జరిగింది. ఇదే కథను భానుమతి రాస్తే వేరే రకంగా స్పందిస్తాం, నిజంగానే! పైగా ఈ ఇద్దరు రచయితల కథన ధోరణి, దృక్పథాల్లో తేడా కూడా ఉంటుందిగా?

  @ లలిత: ఈ story appreciationలో పాఠకులకు తోడ్పడేలా మంచి వ్యాఖ్య రాశారు.

  @ రాధ మండువ, హరితాదేవి, అమరేందర్ దాసరి, రాఘవ, తిరుపాలు, నిశీధి, ఎస్.నారాయణ స్వామి, బుద్ధి యజ్ఞమూర్తి : థాంక్యూ.

 14. చాలా బాగుంది వేణు గారూ….”మోసపోయే అమాయకత్వం కాకుండా దీటుగా ఎదుర్కొనే తెలివితేటలు ఉండాలనీ రచయిత ఈ కథ ద్వారా సూచించినట్టు అర్థం చేసుకోవచ్చు.” అనే మీ అభిప్రాయాన్ని సోదాహరణంగా వివరించారు..

 15. manjari lakshmi says:

  వేణు గారి పరిచయం బాగుంది. ఈ పరిచయాన్ని చదవకుండా ఎలా తప్పుకుపోయానో గుర్తు రావటం లేదు. ఇప్పుడు కల్యాణి గారి వల్ల చదవగలిగాను. దీని మీద రంగనాయకమ్మ గారు రాసిన కథను లలిత గారు ఈ సందర్భంగా గుర్తు చెయ్యటం బాగుంది. మొగవాళ్ళు పనిలోకి దిగాలి అనే విషయం అందులో బాగా చూపించారు రంగనాయకమ్మగారు.

మీ మాటలు

*