‘ఎగిరే పావురమా!’ – 15

egire-pavuramaa15-banner

ఇప్పుడిప్పుడే నా కొత్త కాలితో నడవగలుగుతున్నాను. రోజూ కాళ్ళకి వ్యాయామం చేస్తూ, ఇదివరకటి కంటే బాగానే కదులుతున్నాను. ఇంకా కనీసం నెలరోజుల వైద్యం మిగిలి ఉంది. కాలు సెప్టిక్ అవకుండా ఇంకా మందులు, వారం వారం ఎక్సరేలు అవుతున్నాయి.

 

మునుపటిలా గోవిందు టెంపోలో కాకుండా, కొత్తకాలి ఆసరాతో, క్రచస్ సహాయంతో, క్యాంటీన్ కి నడిచి వెళ్ళి వస్తున్నాను. నెమ్మదిగా కుంటుతూనే అయినా, కనీసం ఇట్లాగైనా   కదలగలగడం కొత్త శక్తిని, తృప్తిని కలిగించింది.

ఈ రోజుకి ఆపరేషనయ్యి సరీగ్గా ఐదో వారం. కొత్తకాలు వచ్చి మూడో వారం.

మళ్ళీ నెలకి, చర్చ్ లో గోవిందుతో నా పెళ్ళి ఏర్పాట్లు చేసింది కమలమ్మ.

 

రెండు రోజులకోసారి జేమ్స్ వచ్చి నా నిర్ణయం ఏమిటని అడిగి వెళుతున్నాడు. పది రోజుల టైం ఇచ్చాడు వాడు.

వాడు చెప్పిన మూడు దారుల్లో – నాకు మంచిది, శ్రేయస్కరమైనది తాతతో జీవితమే. నేను ఆయనకి చేసిన అన్యాయం, ఆయన మనస్సుని గాయపరిచిన తప్పిదం సరిదిద్దుకునే అవకాశం కావాలి.

కాని, అసలెలా అది సాధ్యమౌనో తెలీడం లేదు.

నాకీ జన్మకి పెళ్ళిగాని, మరొకరి సాంగత్యం గానీ అవసరం లేదు… నాచిన్నప్పటి జీవితం నాకు చాలు…అనిపిస్తుంది…

 

తాతకి నేను రాసిన ఉత్తరానికి జవాబుగా – రాంబాబాయి నాకోసం వచ్చాడని తెలిసిన రోజే, నా మనస్సు పశ్చాత్తాప సందేశంతో, ‘శాంతి పావురంలా’ తాత వద్దకి వెళ్ళిపోయింది.

దానికి మినహా నేనేమి చేయగలను? నా జీవితాన్ని, తప్పుల్ని ఎలా సరిదిద్దుకోగలను? అని నిత్యం మదనపడుతున్నాను. ఏదో ఒక మూల నుండి సహాయం దొరకాలి…

గాయత్రీ అమ్మవారిని నమ్ముకోమని పంతులుగారు అన్నది గుర్తే…..ఆ అమ్మవారినే మననం చేసుకుని ప్రార్ధించుకుంటాను. అలాగే ఆదివారాలు ‘మదర్ తెరెసా’ చర్చికెళ్ళి, ఆ ప్రభువు కాడ నా గోడు చెప్పుకుంటాను…నాకు ధైర్యాన్నిమ్మని ప్రార్దిస్తాను…

 

రాంబాబాయి ఎప్పుడొస్తాడాని ఎదురు చూస్తున్నాను.

రాంబాబాయిని కూడా తిట్టి గోలచేసే కమలమ్మ వైఖరిని ఎలా ఎదుర్కోవాలి? పోనీ ఆమెకి మంచిగా చెప్పి ‘నా దారిన నేను పోతానని నచ్చచెప్పగలనా? ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు.

కాలం నత్త నడకలు నడుస్తుంది…

**

పనయ్యాక సాయంత్రం ఏడు గంటల సమయంలో వాకిట్లో అడుగుపెట్టగానే… ఎదురుగా కనిపించాడు…రాంబాబాయి. వాకిలెదురుగా రేకు కుర్చీలో కూర్చుని ఉన్నాడు…

ఇది ..నిజమా? భ్రమ పడుతున్నానా? అనిపించింది ఓ క్షణం…

లేచి నా వైపు వచ్చాడు బాబాయ్…

ఉద్వేగాన్ని ఆపుకోలేక పోయాను..

ఆయన కూడా కళ్ళు తుడుచుకున్నాడు…

“ఎదిగిపోయావు గాయత్రీ… ఎలా ఉన్నావు? రా కూచో,” అంటూ నాకు దారిస్తూ, పక్కకి జరిగాడు.

 

లోపల, కమలమ్మ, గోవిందు, జేమ్స్ ఉన్నారు. పంచాయతీ పద్దతిలో బాబాయి ఎదురుగా కూర్చుని నాకోసమే చూస్తున్నరులా ఉంది.

 

లోనికొచ్చి, మంచినీళ్ళు తాగిన   కాసేపటికి, వెళ్ళి స్థిమితంగా బాబాయి పక్కన కూచున్నాను.

దాదాపు రెండు నెలల క్రితం నేను తాతకి రాసిన ఉత్తరం గురించి మాట్లాడాడు బాబాయి.

ఆ విషయంగా – కమలమ్మ, జేమ్స్ నుండి, నేను   విన్న విషయాలే మళ్ళీ చెప్పాడు. స్వార్జితమైన తాత పొలం, ఇంటి కొట్టాంల పైన ఆయనకి తప్ప, ఇతర వ్యక్తులకి ఎటువంటి హక్కు ఉండదని చెప్పి, క్షణమాగి, నా వంక చూశాడు రాంబాబాయి…

egire-pavuramaa-15

“చూడు గాయత్రి, ఇలా నలుగురిలో పంచాయతి పెట్టుకునే అవసరమేముంది చెప్పు. నీకు ఆయన తాత. నీ కోసమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకునున్నాడు. నీ మంచి కోరే ఏదైనా చేసాడు. చేస్తాడు కూడా. కాబట్టి నీవిప్పుడు చేరవలసింది సత్యమయ్య కాడికే.. అలోచించి ఏ సంగతీ చెప్పు… నా వెంట వచ్చెయ్యి,” అన్నాడు బాబాయ్…

 

“ఇదిగో రాంబాబు…ఏంది నీ మాటలు? మేము ఎంత కష్టపడితే, ఈ మూడేళ్ళు బతుకెళ్ళదీసింది నీ గాయత్రి? వైద్యం సేయించి బాగుసేసినంక, పిట్టలాగా ఎగరేసుకుపోదామని సూస్తుండావా?

ఆ పిల్లకి భరోసా ఇచ్చి, ఆ పొలం-కొట్టాం దానికి కట్టబెట్టి, నిలబడి పెళ్ళి సేయండ్రి. పెళ్ళి కుదిరిపోయింది గాయత్రికి.   వచ్చే నెలలో ఈడనే పెళ్ళి. మర్యాదేమన్నా తెలుసా మీకు?

ఈడనుండి తీసుకెళ్ళతానంటావ్? మళ్ళీ ఆ అమ్మాయిని గుడి మెట్ల మీద అడక్కతినిపిస్తారా? దాని ఆదాయం కోసమేగా ఆ తాత పన్నాగం,” అరిచి వెనక్కి పడినంత పనిచేసింది కమలమ్మ.

 

“అక్క, ఏందే నీ అరుపులు? నెమ్మదిగా ఉండు. పిచ్చి వాగుడు నువ్వూ…మరోమాట మాట్టాడితే ఊర్కోను,” ఆమెని గదమాయించాడు గోవిందు.

వాళ్ళ మాటలతో చెవులు తూట్లు పడుతున్నాయి…

గదిలో కాసేపు….నిశ్శబ్దంగా అయింది..

“చూడు రాంబాబు, …అందరి మాటలు విను. ఆలోచించు…ఏది ఏమైనా గాయత్రికి ఇంకా నెలరోజుల వైద్యం ఉంది.. ఇంతా చేసాక, అది సరిగ్గా పూర్తయ్యేలా చూడ్డం కూడా అవసరం…

ఇప్పుడు గాయత్రి మేజర్.   పెళ్ళి విషయంతో పాటు మరే విషయమైనా ఆమె ఇష్టానుసారమే జరుగుతుంది. ఆమెకి సమయం ఇవ్వండి. తెలివిగా నిర్ణయం తీసుకోనివ్వండి,”…అంటూ ఆగాడు…జేమ్స్.

కాసేపు ఎవ్వరూ ఏమీ అనలేదు…

బాబాయే నోరు విప్పాడు. నావంక సూటిగా చూసాడు.

 

“సరే, గాయత్రి, నిన్ను దేనికీ బలవంత పెట్టద్దని, ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోవద్దని, సత్యమయ్య నాకు మరీ మరీ చెప్పి పంపాడు.

నిన్నల్లరి పెట్టడం ఇష్టంలేకే అప్పట్లో, పోలీస్ రిపోర్ట్ కూడా వద్దన్నాడు,” అంటూ క్షణమాగి, తన జేబు నుండి ఓ కవర్ తీసి నాకిచ్చాడు.

 

“ఉమమ్మ చేత రాయించిన ఈ ఉత్తరం నీకివ్వమన్నాడు తాత…. నా ఎదురుగా చదువుకో… నీవు చదివాకే నేను వెళతాను…ఆ కింద ఉమమ్మ ఫోన్ నంబర్ ఉంది. నా నంబర్ ఉంది. గుడి పంతులుగారి నంబర్ కూడా ఉంది. నీకోసం రాములు, ఉమమ్మ, మీ పిన్ని కూడా ఎదురు చూస్తున్నారు మరి…,” అని ముగించాడు….

 

అదురుతున్న గుండెలతో ఉత్తరం చదవసాగాను.

 

ప్రియమైన గాయత్రీ,

ఇంతకాలానికి నీ నుండి వచ్చిన ఉత్తరం నాకు పట్టలేని ఆనందాన్నిచ్చింది తల్లీ. నీ కాలుకి చికిత్స జరుగుతున్నందుకు కూడా సంతోషం తల్లీ…

మూడేళ్లగా నీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఆరోగ్యం చెడి ఆశ సన్నగిల్లింది. చూపు ఆనడం లేదు. నిన్ను చూడలేని కంటిచూపు అవసరం లేదులేమ్మా.  

మొదటిసారి నిన్ను చూసింది మాత్రం పెనుతుఫానులో కాలవగట్టున చలికి వణుకుతున్న పసిబిడ్డగా. ఆ రూపం నా కళ్ళల్లో మెదులుతూనే ఉంటాది…

గాలిలో కొట్టుకుంటున్న నీ బుజ్జి చేతులని కాసింత దూరాన్నించి చూడగలిగాను. దగ్గరగా వచ్చి చూస్తే – కక్కటిల్లి నువ్వు ఏడుస్తున్నా, బయటకి వినబడని రోదనే. నిన్ను కదలనివ్వని నలిగి నెత్తురోడుతున్న నీ పాదాలు, కాళ్ళు చూసి, బాధతో తట్టుకోలేకపోయానమ్మా..

 

అరవై ఏళ్ళ ఏకాకినైన నాకు అనాధగా దొరికావు. కళ్ళల్లో దీపాలెట్టుకుని పెంచాను. నీ జీవితంలో పువ్వులు పూయించాలనే, నీ ముఖాన నవ్వులు చిందించాలనే పూజారయ్యని ఆశ్రయించాను. ఆరోగ్యం బాగోక బతుకుతెరువు లేని నాకు, కోవెల్లో కొలువిప్పించి ఆదుకున్నాడాయన.

నువ్వు నాకు దొరికిన రోజే నీ పుట్టిన రోజుగా, నన్ను నీ శ్రేయోభిలాషిగా తాలుకాఫీసులో నమోదు చేయించాడు పూజారయ్య. ‘గాయత్రి’ అని నామకరణం చేసి, కోవెల్లో ఓ స్థానమిచ్చి, నీకు ఓ గౌరవమైన జీవనం కల్పించింది కూడా పూజారయ్యే.

 

నిన్ను చదివించాలని ఆశపడ్డాను. చెప్పుడు మాటలు నమ్మి నన్ను వదిలి వెళ్ళిపోయావు. దగాకోర్ల నుండి నిన్ను కాపాడలేక పోయానే అని కుమిలిపోతుండాను.

 

ఇకపోతే, నీ అవిటితనం నయమయ్యే అవకాశం ఉందని నా నమ్మకం. నీది పసితనంలో అఘాతం వల్ల ఏర్పడ్డ అవిటితనం అని నా గట్టి నమ్మకం. జరగవలసిన నీ వైద్యం కోసం, నీ సొమ్ము కూడా పక్కకెట్టే ఉంచానమ్మా.

అంతేగానీ నువ్వనుకున్నట్టు నీ అవిటితనం మీద యాపారం చేసి బతకాలని కాదు – అని నీకు తెలియ జెప్పాలనే నా తాపత్రయం. పనిచేయలేని పరిస్థితిలో కూడా ఫించను మొదలయ్యాక గాని ఆటో నడపడం మానలేదు. నీ తాత మీద నీకున్న అనుమానం దూరం చెయ్యాలనే ఈ గోడు చెప్పడం.

 

 

ఇప్పటికైనా పాలెంకి తిరిగొచ్చి నేను ఆశ పడుతున్నట్టుగా అందరి మధ్య గౌరవంగా బతుకుతావని ఆశిస్తాను.

నాదైన పొలం-కొట్టాం, అనుభవించే హక్కు పూర్తిగా నీదే తల్లీ.

నీకు కొదవలేకండా ఉండేలా, చేతనైనంతలో   కొన్ని ఏర్పాట్లు చేసాను గాయత్రీ. చదువుకున్నదానివి కనుక నీకు అన్నీ అర్ధమవుతాయి.

నువ్వు అవస్థలు పడవద్దు. అలోచించి తిరిగి వచ్చేయి తల్లీ.

నిన్ను ఈ కళ్ళతో చూసుకునే అదృష్టం నాకు ఉందో లేదో మరి.   ఆ అమ్మవారి కనికరం నీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను…

ప్రేమతో,

తాత….(తాత మాటలు రాసింది ఉమమ్మ)

కళ్ళ నుండి తెగబడే నీళ్ళని ఆపుకుంటూ తాత రాసిన ఉత్తరం చదవడం ముగించాను. ఇలాటి దేవుడినా అనుమానించి, అవమానించి పారిపోయాను?

నేనేదో అన్యాయమైపోయానని, తాత నన్ను అవిటిని చేసి, నా సంపాదన తింటున్నాడని అపోహతో మానసికంగా బాధపడ్డ నాది మూగవేదనా?

లేక అనాధనైన నన్ను దగ్గరికి తీసి, గొప్పగా పెంచి ఓ గౌరవమైన జీవితాన్ని ఇవ్వాలనుకుని నా వల్ల మనక్షోభ అనుభవించిన తాతది మూగవేదనా?

నా మేలు తప్ప వేరే ఆలోచనే లేకుండా గత పద్దెనిమిదేళ్ళగా నా ధ్యాసతోనే జీవించి నా మూలంగా ఈ వయస్సులో కూడా వేదన అనుభవించడంలేదా?

ఎన్నో ప్రశ్నలు నన్ను చుట్టేశాయి. ఉత్తరం చదివేసాక కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ అలా ఉండిపోయాను…

 

అంత వరకు ఎట్లాగో ఓపిగ్గా ఉన్న కమలమ్మ మళ్ళీ నోరెత్తింది.

“సుఖంగా ఉన్న పిల్లని అడ్డమైన ఉత్తరాలతో, మాటలతో ఎంత కష్టపెడతారయ్యా? ఇగ బయలుదేరండి. కాలు బాగయి పిల్లకి పెళ్ళి కూడా అవబోతుందని సెప్పండి… దాని డబ్బు, ఆస్థి ఇస్తామని సత్యమయ్యని కబురెట్టి పెళ్ళికి రమ్మను…,” అంటూ నావంక చూసింది..

“మీ బాబాయేగా, సెప్పు గాయత్రీ,” అంది…

(ఇంకా ఉంది)

 

మీ మాటలు

*